కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

రక్తం నుండి తీసిన వైద్య ఉత్పత్తుల్ని యెహోవాసాక్షులు స్వీకరిస్తారా?

ప్రాధమికమైన జవాబు ఏమిటంటే యెహోవాసాక్షులు రక్తాన్ని స్వీకరించరన్నదే. రక్తం విషయంలో ఉన్న దేవుని నియమం, ఈ లోకంలో మారుతున్న అభిప్రాయాలకు తగ్గట్టు మారేది కాదు. అయినా, రక్తాన్ని నాలుగు ప్రాధమిక విభాగాలుగా విభజించి మళ్ళీ వాటినే ఇంకా సూక్ష్మంగా విడగొట్టడం ప్రస్తుతం సాధ్యమౌతుంది గనుక కొన్ని కొత్త వివాదాంశాలు తలెత్తుతుంటాయి. అటువంటివాటిని స్వీకరించవచ్చా లేదా అన్నది నిర్ణయించడంలో ఒక క్రైస్తవుడు/రాలు వైద్యపరమైన ప్రయోజనాలను, ప్రమాదాలను మించి చూడాలి. క్రైస్తవుని ప్రథమ చింత, బైబిలు ఏమి చెబుతుంది, సర్వశక్తుడైన దేవునితో తన సంబంధాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది అన్నవైవుండాలి.

ఇందులో ఇమిడివున్న కీలకమైన విషయాలు సరళమైనవే. ఎందుకో అర్థం చేసుకోవాలంటే, బైబిలులోని, చరిత్రలోని, వైద్యరంగంలోని కొన్ని విషయాల్ని పరిశీలించండి.

రక్తాన్ని ప్రత్యేకంగా దృష్టించాలని యెహోవా దేవుడు మన పూర్వికుడైన నోవహుకు చెప్పాడు. (ఆదికాండము 9:3, 4) అటుతర్వాత, ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన ధర్మశాస్త్రంలో రక్తానికున్న పవిత్రత వ్యక్తం చేయబడింది: “ఇశ్రాయేలీయుల కుటుంబములలోనేమి, మీలో నివసించు పరదేశులలోనేమి, ఒకడు దేని రక్తమునుతినినను రక్తము తినువానికి నేను విముఖుడనై[యుందును].” దేవుని చట్టాన్ని తృణీకరించడం మూలంగా ఒక ఇశ్రాయేలీయుడు ఇతరుల్ని కలుషితపరుస్తాడు గనుక, దేవుడు ఇంకా ఇలా అన్నాడు: “జనులలోనుండి వాని కొట్టివేయుదును.” (లేవీయకాండము 17:10) అటుతర్వాత, యెరూషలేములోని ఒక సమావేశంలో అపొస్తలులూ పెద్దలూ మనం ‘రక్తాన్ని విసర్జించాలి’ అని ఆజ్ఞాపించారు. అలా విసర్జించడం లైంగిత అనైతికత, విగ్రహారాధన వంటివాటినుండి దూరంగా ఉండడమంత ప్రాముఖ్యం.—అపొస్తలుల కార్యములు 15:28, 29.

అప్పట్లో, “విసర్జింపవలెను” అంటే ఏ అర్థాన్నిచ్చేది? క్రైస్తవులు రక్తాన్ని, అది అప్పటికప్పుడు తీసిందైనా లేదా గడ్డకట్టిన తర్వాతిదైనా తీసుకోలేదు; వాళ్ళు రక్తం ఒలికించని జంతువు మాంసాన్ని తినలేదు. అలాగే రక్తం చేర్చిన సాసేజ్‌ల వంటి ఆహారాన్ని తీసుకోవడమన్న ప్రసక్తి కూడా తలెత్తదు. ఈ విధాలుగా రక్తాన్ని లోపలికి తీసుకోవడం దేవుని నియమాన్ని ఉల్లంఘిస్తుంది.—1 సమూయేలు 14:32, 33.

ప్రాచీనకాలాల్లోని అనేకమంది ప్రజలు రక్తాన్ని తీసుకోవడం విషయమై అంత కలతచెంది ఉండరన్నది మనకు (సా.శ. రెండవ, మూడవ శతాబ్దానికి చెందిన) టెర్టూలియన్‌ వ్రాతల్నిబట్టి తెలుస్తుంది. క్రైస్తవులు రక్తాన్ని తీసుకుంటున్నారన్న ఆరోపణకు ప్రతిస్పందిస్తూ టెర్టూలియన్‌, రక్తాన్ని రుచిచూడడం ద్వారా ఒప్పందాల్ని ఖరారు చేసుకునే తెగలను గురించి పేర్కొన్నాడు. “రంగస్థలంపై ప్రదర్శన ఇవ్వబడుతున్నప్పుడు [కొందరు] రక్తదాహంతో నేరస్థుల తాజారక్తాన్ని . . . తమ మూర్ఛరోగ స్వస్థత కోసం తీసుకెళ్ళేవారు.”

అటువంటి చర్యలు (వీటిని కొందరు రోమన్లు ఆరోగ్యం నిమిత్తమే చేసినప్పటికీ) క్రైస్తవుల దృష్టిలో తప్పుగా ఉన్నాయి: “మేము మా సహజ ఆహారంలో చివరికి జంతు రక్తాన్ని కూడా కలపము” అని టెర్టూలియన్‌ వ్రాశాడు. నిజ క్రైస్తవుల యథార్థతను పరీక్షించటానికి రోమన్లు రక్తం కలిసిన ఆహారాన్ని ఉపయోగించారు. టెర్టూలియన్‌ ఇంకా ఇలా అన్నాడు: “ఇప్పుడు, నేను మిమ్మల్ని అడిగేదేమంటే, [క్రైస్తవులు] జంతు రక్తానికే విముఖత చూపిస్తారన్న నమ్మకం మీకే ఉండగా, అదే సమయంలో వారు మానవ రక్తపిపాసులని మీరెలా అనుకోగలుగుతున్నారు?”

నేడు, ఒక వైద్యుడు రక్తం తీసుకోమని చెప్పినప్పుడు సర్వశక్తుడైన దేవుని నియమాలు ఎవరి మనసులోకి వస్తాయి? యెహోవాసాక్షులమైన మన విషయానికి వస్తే, మనం జీవించాలని తప్పకుండా కోరుకుంటాము, అయినా రక్తం విషయంలో యెహోవా నియమానికి విధేయత చూపాలని నిర్ధారణ చేసుకున్నాము. ప్రస్తుత వైద్యరంగం వెలుగులో ఈ మాటలకు అర్థమేమిటి?

రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత పూర్ణ రక్త మార్పిడులు సర్వాసాధారణమౌతుండగా, యెహోవాసాక్షులు అది దేవుని నియమానికి విరుద్ధంగా ఉన్నట్లు దృష్టించారు—మేమిప్పటికీ అలానే నమ్ముతున్నాము. అయినా వైద్యరంగంలో అప్పటికీ ఇప్పటికీ ఎన్నో మార్పులు జరిగాయి. నేడు, రక్తమార్పిడుల్లో పూర్ణ రక్తాన్ని కాక రక్తంలోని ప్రాధమిక విభాగాల మార్పిడి జరుగుతుంది, అవి: (1) ఎర్ర రక్త కణాలు; (2) తెల్ల రక్త కణాలు; (3) ప్లేట్‌లెట్‌లు; (4) ద్రవపదార్థమైన ప్లాస్మా (సెరం). రోగి పరిస్థితిని బట్టి వైద్యులు ఈ నాలుగింటిలో ఏ ఒక్క రకాన్నైనా ఎక్కించమని సూచించవచ్చు. ఇలాంటి పద్ధతి ప్రకారం ఒక యూనిట్‌ రక్తాన్ని అనేకమంది రోగులకు పంచి ఇవ్వవచ్చు. యెహోవాసాక్షులు పూర్ణ రక్తాన్నైనా, లేదా అందులోని నాలుగు ప్రాధమిక విభాగాల్నైనా స్వీకరించడం దేవుని నియమాన్ని ఉల్లంఘించడమౌతుందని భావిస్తారు. గమనార్హమైన విషయం ఏమిటంటే, ఈ బైబిలు ఆధారిత నిర్ణయాన్ని తీసుకోవడం ద్వారా వారు అనేక ప్రమాదాల్ని తప్పించుకున్నారు, ఉదాహరణకు రక్తం ద్వారా సంక్రమించగల హెపటైటిస్‌, ఎయిడ్స్‌ వంటి వ్యాధుల నుండి వారికి కాపుదల లభించింది.

అయితే, రక్తాన్ని ఆ నాలుగు విభాగాలుగా మాత్రమే కాక ఇంకా విభజించడం సాధ్యమౌతోంది గనుక, ప్రాధమిక విభాగాల నుండి విడగొట్టిన సూక్ష్మ విభాగాల విషయంలో కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి. అటువంటి విభాగాలు ఎలా ఉపయోగించబడుతున్నాయి, వాటి విషయంలో నిర్ణయం తీసుకునే ముందు ఒక క్రైస్తవుడు వేటిని పరిగణలోనికి తీసుకోవాలి?

రక్తం చాలా సంశ్లిష్టమైన పదార్థం. చివరికి ప్లాస్మాలోనే—ఇందులో 90 శాతం నీరే ఉన్నప్పటికీ—వందలకొద్దీ హార్మోనులు, అసేంద్రీయ లవణాలు, ఎంజైములు, న్యూట్రియంట్‌లు, అలాగే ఖనిజాలు, షుగర్‌ ఉంటాయి. అంతేగాక ఈ ప్లాస్మా, అల్బుమిన్‌లు, రక్తాన్ని గడ్డకట్టించే పదార్థాలు (క్లాటింగ్‌ ఫ్యాక్టర్‌లు), వ్యాధులకు విరుద్ధంగా పోరాడే యాంటీబాడీలు వంటి ప్రొటీన్లను కూడా తీసుకువెళ్తుంది. ప్లాస్మాలోని ఈ ప్రొటీన్‌లలో చాలా వాటిని సాంకేతిక నిపుణులు వేరుచేయగలరు. ఉదాహరణకు, రక్తం ఊరికే పోయే జబ్బుగల వ్యక్తులైన హీమోఫిలియా రోగగ్రస్తులకు రక్తాన్ని గడ్డకట్టించే పదార్థం (క్లాటింగ్‌ ఫ్యాక్టర్‌ 8) ఇవ్వడం జరిగింది. లేదా, ఎవరైనా కొన్ని వ్యాధులకు లోనైతే, అప్పటికే రోగనిరోధకశక్తి ఉన్నవారి రక్త ప్లాస్మాలోనుండి తీసిన గామా గ్లోబ్యులిన్‌ ఇంజక్షన్‌లను వైద్యులు సూచించవచ్చు. మరితర ప్లాస్మా ప్రొటీన్లు వైద్యరంగంలో ఉపయోగించడం జరుగుతుంది, కానీ పైన పేర్కొన్నవి రక్తంలో ఒక ప్రాధమిక విభాగం అయిన ప్లాస్మాను ఎలా విడగొడతారో చూపించడానికే. *

రక్త ప్లాస్మాలోనే అనేక విభాగాలున్నట్లు, ఇతర ప్రాధమిక విభాగాలను (ఎర్ర, తెల్ల రక్త కణాలు, ప్లేట్‌లెట్‌లను) సైతం సూక్ష్మమైన విభాగాలుగా విడగొట్టడం సాధ్యమౌతోంది. ఉదాహరణకు, కొన్ని వైరల్‌ ఇన్ఫెక్షన్‌లకు, క్యాన్సర్‌లకు చికిత్స చేయటానికి ఉపయోగించే ఇంటర్‌ఫెరాన్‌లను, ఇంటర్‌లూకిన్‌లను తెల్ల రక్త కణాల నుండి వెలికితీయవచ్చు. ప్లేట్‌లెట్‌ల నుండి గాయాన్ని మాన్పే పదార్థాన్ని వెలికితీయవచ్చు. రక్త విభాగాల నుండి (కనీసం ప్రస్తుతం) వెలికి తీసిన మందులు ఇంకా వస్తున్నాయి. అటువంటి చికిత్సలు, ఆయా ప్రాధమిక విభాగాల మార్పిడులు కావు; ఆ చికిత్సల్లో విభాగాలు మాత్రమే ఉంటాయి. తమ వైద్య చికిత్సలో క్రైస్తవులు అటువంటి విభాగాల్ని స్వీకరించాలా? మేము చెప్పలేము. బైబిలు వివరణలన్నింటినీ ఇవ్వడం లేదు, అందుకని క్రైస్తవుడు దేవుని ఎదుట మనస్సాక్షిపూర్వకమైన నిర్ణయం తీసుకోవాలి.

రక్తం నుండి తీసిన దేన్నైనా కొందరు తిరస్కరిస్తారు (చివరికి తాత్కాలిక రోగనిరోధకశక్తినిచ్చే ఉద్దేశంతో ఇచ్చే చిన్న విభాగాలనైనా). ‘రక్తమును విసర్జించండి’ అనే దేవుని ఆజ్ఞను వారు అలాగే అర్థం చేసుకుంటారు. జంతువు నుండి తీసిన రక్తాన్ని ‘భూమిమీద పారబోయాలి’ అని ఇశ్రాయేలీయులకు ఆయనిచ్చిన ధర్మశాస్త్రంలో ఉందని వారు తర్కిస్తారు. (ద్వితీయోపదేశకాండము 12:22-24) దానికీ దీనికి సంబంధం ఏమిటి? ఇది పరిశీలించండి, గామా గ్లోబ్యులిన్‌లను, రక్తాన్ని గడ్డకట్టించే పదార్థాలను, మరితరాల్ని తయారుచేయడానికి, రక్తాన్ని సేకరించి దాన్ని కొన్ని ప్రక్రియలకు లోనుచేయాల్సివుంటుంది. అందుకని కొందరు క్రైస్తవులు, పూర్ణరక్తాన్నీ లేదా దాని నాలుగు ప్రాధమిక విభాగాల్నీ తిరస్కరించినట్లే అలా తయారుచేసిన ఉత్పత్తుల్ని కూడా తిరస్కరిస్తారు. వారి యథార్థమైన మనస్సాక్షిపూర్వకమైన నిర్ణయాన్ని ఇతరులు గౌరవించాలి.

మరితర క్రైస్తవులు వేరే విధంగా నిర్ణయించుకుంటారు. వారు కూడా పూర్ణ రక్తాన్ని, అందులోని విభాగాలైన ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్‌లెట్‌లు, ప్లాస్మాలను కూడా తిరస్కరిస్తారు. అయినా, వారు ఆ నాలుగు ప్రాధమిక విభాగాల నుండి తీసిన భాగాలతో చికిత్స చేయడానికి వైద్యుణ్ని అనుమతిస్తుండవచ్చు. ఇక్కడ కూడా కొన్ని తేడాలు ఉండే అవకాశం ఉంది. ఒక క్రైస్తవుడు గామా గ్లోబ్యులిన్‌లను స్వీకరిస్తుండవచ్చు, కానీ ఆయన ఎర్ర రక్త కణాలనుండి లేదా తెల్ల రక్త కణాల నుండి తీసిన విభాగాలను ఇంజక్షన్‌ రూపంలో తీసుకోవడానికి అంగీకరించకపోవచ్చు. అయితే, అన్నింటినీ పరిగణలోనికి తీసుకుని చూస్తే, తాము రక్తంలోని ప్రాధమిక విభాగాలను స్వీకరించవచ్చునని కొందరు క్రైస్తవులు భావించటానికి ఏమి నడిపిస్తుండవచ్చు?

1990, జూన్‌ 1, కావలికోట (ఆంగ్లం) సంచికలోని “పాఠకుల ప్రశ్నలు” శీర్షికలో, గర్భిణీ స్త్రీ రక్తంలో నుండి ప్లాస్మా ప్రొటీన్లు (రక్తంలోని సూక్ష్మ విభాగాలు) తన కడుపులోని పిండం యొక్క రక్త ప్రవాహంలోకి ప్రవేశిస్తాయి అని పేర్కొంది. ఆ విధంగా ఒక తల్లి తన బిడ్డకు ఇమ్యునోగ్లోబ్యులిన్‌లను అందజేస్తుంది, తద్వారా బిడ్డకు అమూల్యమైన రోగనిరోధక శక్తిని అందిస్తుంది. ఒక పిండం ఎర్ర రక్త కణాలు తమ తమ కాలవ్యవధి వరకు సజీవంగా ఉండి తర్వాత మృతమౌతూ ఉండగా వాటిలోని ప్రాణవాయువును తీసుకెళ్ళే విభాగం మార్పులకు లోనౌతుంది. దానిలో కొంత బిలిరుబిన్‌గా మారుతుంది, ఇది జరాయువు గుండా తల్లిలోకి ప్రవేశించి తర్వాత వ్యర్థపదార్థాలతోపాటు బయటికి పోతుంది. ఇందు మూలంగా, రక్తంలోని ప్రాధమిక విభాగాలు ఇలా సహజంగానే ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తిలోకి ప్రవేశిస్తాయి గనుక, తాము రక్త ప్లాస్మా నుండి లేదా రక్త కణాల నుండి వెలికితీసిన కొన్ని విభాగాలను స్వీకరించవచ్చునని కొందరు క్రైస్తవులు భావిస్తుండవచ్చు.

అభిప్రాయాలూ, మనస్సాక్షిపూర్వకంగా తీసుకునే నిర్ణయాలూ వేర్వేరుగా ఉండవచ్చన్న వాస్తవం, విషయం అంత గంభీరమైనది కాదన్న అర్థాన్నిస్తుందా? లేదు, అది గంభీరమైనదే. అయినా సరళమైన వాస్తవం ఒకటుంది. పైనున్న సమాచారమంతా, యెహోవాసాక్షులు పూర్ణ రక్తాన్ని గాని, దానిలోని ప్రాధమిక విభాగాలను గాని మార్పిడి చేసుకోవటానికి నిరాకరిస్తారని చూపిస్తుంది. క్రైస్తవులు ‘విగ్రహాలకు అర్పించిన వాటిని, రక్తాన్ని, జారత్వాన్ని విసర్జించాలి’ అని బైబిలు నిర్దేశిస్తుంది. (అపొస్తలుల కార్యములు 15:29) అంతేగాక, రక్తంలోని ప్రాధమిక విభాగాలలోని భాగాల విషయానికొస్తే ప్రతి క్రైస్తవుడు జాగ్రత్తగా ధ్యానించి ప్రార్థనాపూర్వకంగా మనస్సాక్షిపూర్వకంగా తనకోసం తాను నిర్ణయించుకోవాలి.

తక్షణ ఉపశమనాన్నిచ్చే ఏ చికిత్సనైనా స్వీకరించటానికి కొందరు ప్రజలు సిద్ధంగా ఉంటారు, చివరికి పలాని చికిత్సలో ప్రమాదాలున్నాయని తెలిసినా వాళ్ళు ముందుకు వెళ్తారు. ఇందుకు ఉదాహరణ రక్తం నుండి తయారుచేసిన ఉత్పత్తులే. నిజమైన క్రైస్తవుడు మరింత విశాలమైన మరింత సమతుల్యతతో కూడిన దృక్కోణాన్ని, కేవలం కంటికి కన్పించే అంశాలు మాత్రమే ఉన్నదానికి మించిన దృక్కోణాన్ని పొందటానికి ప్రయత్నిస్తాడు. యెహోవాసాక్షులు మెరుగైన వైద్య చికిత్సను అందించటానికైన ప్రయత్నాలను మెచ్చుకుంటారు, అదే సమయంలో వారు ఏ చికిత్సయినా అందులోని ప్రమాదాలు/ప్రయోజనాల నిష్పత్తిని తూచిచూస్తారు. అయితే, రక్తం నుండి తీసిన ఉత్పత్తుల విషయానికొచ్చే సరికి వారు, తమ జీవదాతయైన దేవునితో తమకుగల సంబంధాన్నీ ఆయన చెప్తున్నదాన్నీ జాగ్రత్తగా పరిగణనలోకి తీసుకుంటారు.—కీర్తన 36:9.

ఈ క్రింది విధంగా వ్రాసిన కీర్తన గ్రంథకర్తలాంటి నమ్మకాన్ని కలిగివుండడం ఒక క్రైస్తవునికి ఎంత గొప్ప ఆశీర్వాదం: “దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునైయున్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించువారికి ఆయన యే మేలును చేయక మానడు. . . . యెహోవా, నీయందు నమ్మికయుంచువారు ధన్యులు.”—కీర్తన 84:11, 12.

[అధస్సూచీలు]

^ పేరా 12 1978, జూన్‌ 15 (ఆంగ్లం), మరియు 1994, అక్టోబరు 1 కావలికోట సంచికల్లో “పాఠకుల ప్రశ్నలు” చూడండి. మందుల తయారీ చేసే కంపెనీలు రక్తం నుండి తీసుకున్నవి కాని కొన్ని సింథటిక్‌ ఉత్పత్తుల్ని అభివృద్ధిచేశాయి. వీటిని ఒకప్పుడు ఉపయోగించబడిన రక్తంలోని విభాగాల స్థానే ఉపయోగించడానికి వైద్యులు సిఫారసు చేస్తారు.

[30వ పేజీలోని బాక్సు]

వైద్యుడిని అడిగేందుకు కొన్ని ప్రశ్నలు

రక్తం నుండి తీసిన ఉత్పత్తి ఉపయోగించే అవకాశం ఉన్న శస్త్రచికిత్సకు లేదా వైద్యానికి ముందు వైద్యుడ్ని ఇలా ప్రశ్నించండి:

ఇందులో ఇమిడివున్న వైద్య కార్యకర్తలందరికీ, నేనొక యెహోవాసాక్షిగా ఎటువంటి రక్త మార్పిడులు (పూర్ణ రక్తం, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్‌లెట్‌లు, లేదా రక్త ప్లాస్మా) నాకు ఎటువంటి పరిస్థితిలోను ఇవ్వరాదని నేను నిర్దేశిస్తున్నానని తెలుసా?

సిఫారసు చేసిన మందు రక్త ప్లాస్మా, ఎర్ర లేదా తెల్ల రక్త కణాలు, లేక ప్లేట్‌లెట్‌ల నుండి తయారుచేయబడినట్లైతే, వైద్యుడ్ని ఇలా ప్రశ్నించండి:

ఆ మందును రక్తంలోని నాలుగు ప్రాధమిక విభాగాల నుండి తయారు చేయడం జరిగిందా? అలాగైతే, దాని తయారీ గురించి మీరు వివరిస్తారా?

రక్తం నుండి తయారుచేసిన ఈ మందులో ఎంత భాగాన్ని, ఎలా ఉపయోగించడం జరుగుతుంది?

రక్తంలోని ఈ భాగాన్ని నేను స్వీకరించటానికి నా మనస్సాక్షి అనుమతిస్తే ఎటువంటి వైద్యపరమైన ప్రమాదాలు ఉంటాయి?

దీన్ని తిరస్కరించాలని నా మనస్సాక్షి నన్ను ప్రేరేపిస్తే, దీనికి ఇతర చికిత్సలు ఏమి ఉన్నాయి?

ఈ విషయాన్ని ఇంకా పరిశీలించిన పిమ్మట నేను నా నిర్ణయాన్ని గురించి మీకు ఎప్పుడు తెలుపవచ్చు?