మీపై అధికారం ఇవ్వబడిన వారిని సన్మానించండి
మీపై అధికారం ఇవ్వబడిన వారిని సన్మానించండి
“అందరిని సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి.” —1 పేతురు 2:17.
1, 2. నేడు ప్రజలు అధికారాన్ని ఎలా దృష్టిస్తారు? ఎందుకు?
“పెత్తనమంతా పిల్లలదే అయిపోయింది. తల్లిదండ్రులంటే వాళ్లకస్సలు గౌరవం లేదు” అని ఒక తల్లి వాపోయింది. ఒక కారు వెనుక అంటించిన స్టిక్కర్ మీదున్న నినాదం ఇలా ఉంది: “అధికారాన్ని ధిక్కరించండి.” నేడు అంతటా ప్రబలంగా ఉన్న పరిస్థితికి ఈ రెండు విషయాలూ అద్దం పడుతున్నాయన్నది మీకూ తెలుసు. తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, యజమానులను, ప్రభుత్వాధికారులను గౌరవించకపోవటం ప్రస్తుతం ప్రపంచమంతటా సర్వసాధారణమైపోయింది.
2 కొంతమంది భుజాలెగరేసి, ‘మరేం చెయ్యాలి, అధికారంలో ఉన్నవాళ్లు ఎంతమాత్రమూ గౌరవప్రదమైన విధంగా ప్రవర్తించడం లేదు’ అనవచ్చు. నిజమే కొన్నిసార్లు ఆ వాస్తవాన్ని కాదనలేము. దుర్వ్యవహారం చేసే తల్లిదండ్రుల గురించి, అసమర్థులైన ఉపాధ్యాయుల గురించి, దురాశాపరులైన యజమానుల గురించి, భ్రష్టులైన ప్రభుత్వాధికారుల గురించి మనం అనేకానేక వార్తలు వింటూనే ఉంటాము. అయితే, క్రైస్తవ సంఘంలో అధికారం ఇవ్వబడినవారిని చాలామంది క్రైస్తవులు అలా దృష్టించరన్నది సంతోషకరమైన విషయం.—మత్తయి 24:45-47.
3, 4. క్రైస్తవులు అధికారంలో ఉన్నవారిని ఎందుకు గౌరవించాలి?
3 క్రైస్తవులముగా మనం ఈ లోకంలోని అధికారులను గౌరవించడం ఎంతో “ఆవశ్యకము.” క్రైస్తవులు “పై అధికారులకు లోబడియుండ వలెను; ఏలయనగా దేవునివలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు; ఉన్న అధికారములు దేవునివలననే నియమింపబడి యున్నవి” అని అపొస్తలుడైన పౌలు ఉద్బోధించాడు. (రోమీయులు 13:1, 2, 5; 1 పేతురు 2:13-15) కుటుంబంలో అధికారంగల వారికి లోబడి ఉండటానికి కూడా పౌలు తగిన కారణాన్ని చూపాడు: “భార్యలారా, మీ భర్తలకు విధేయులై యుండుడి; ఇది ప్రభువునుబట్టి యుక్తమైయున్నది. పిల్లలారా, అన్నివిషయములలో మీ తలిదండ్రులమాట వినుడి; ఇది ప్రభువునుబట్టి మెచ్చుకొనతగినది.” (కొలొస్సయులు 3:18, 20) సంఘ పెద్దలు మన గౌరవాన్ని పొందటానికి అర్హులు, ఎందుకంటే వాళ్లు ‘దేవుని సంఘమును కాయడానికి పరిశుద్ధాత్మ ద్వారా అధ్యక్షులుగా నియమించబడ్డారు.’ (అపొస్తలుల కార్యములు 20:28) మనం మానవులైన అధికారులను గౌరవించేది యెహోవాపట్ల మనకున్న గౌరవాన్ని బట్టే. కాబట్టి మనం యెహోవా అధికారాన్ని గౌరవించటానికి సహజంగానే మన జీవితాల్లో ఎల్లప్పుడూ మొదటి స్థానాన్నిస్తాము.—అపొస్తలుల కార్యములు 5:29.
4 యెహోవా సర్వోన్నతాధికారాన్ని మనస్సులో ఉంచుకుని, అధికార స్థానంలో ఉన్నవారిని గౌరవించినవారి ఉదాహరణలను, గౌరవించనివారి ఉదాహరణలను కొన్నింటిని మనం పరిశీలిద్దాము.
అగౌరవం అనంగీకారానికి దారితీస్తుంది
5. మీకాలు దావీదు పట్ల ఎలాంటి అమర్యాదకరమైన దృక్పథాన్ని కనపర్చింది, అది దేనికి దారితీసింది?
5 దేవుడిచ్చిన అధికారానికి తగిన గౌరవాన్ని చూపని వారిని యెహోవా ఎలా దృష్టిస్తాడో రాజైన దావీదు చరిత్ర నుండి మనం తెలుసుకోవచ్చు. దావీదు నిబంధన మందసాన్ని యెరూషలేముకు తీసుకువచ్చినప్పుడు, ఆయన భార్య మీకాలు, “యెహోవా సన్నిధిని గంతులు వేయుచు నాట్యమాడుచునున్న దావీదును కనుగొని, తన మనస్సులో అతని హీనపరచెను.” 2 సమూయేలు 6:13-22.
కుటుంబ శిరస్సుగానే గాక దేశాధినేతగా కూడా దావీదుకున్న స్థానాన్ని మీకాలు గుర్తించవలసింది. అయితే, “హీనస్థితి గల పనికత్తెలు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలను విప్పి వేసినట్టుగా ఇశ్రాయేలీయులకు రాజవైన నీవు నేడు బట్టలను తీసివేసియెంత ఘనముగా కనబడితివని” అంటూ ఆమె తన భావాలను వ్యంగ్యంగా వ్యక్తపర్చింది. దీని ఫలితంగా మీకాలు ఎన్నడూ తల్లి కాలేకపోయింది.—6. కోరహు తన అభిషిక్తుల పట్ల చూపిన అగౌరవాన్ని యెహోవా ఎలా దృష్టించాడు?
6 కోరహు, దేవుడు నియమించిన దైవపరిపాలనా నాయకత్వాన్ని గౌరవించని ఘోరమైన ఉదాహరణగా మిగిలాడు. కహతీయునిగా యెహోవా గుడారంలో సేవచేస్తూ ఉండే గొప్ప ఆధిక్యత అతనికుంది ! అయినా, దేవుడు ఇశ్రాయేలీయులపై నియమించిన అభిషిక్త నాయకులైన మోషే, అహరోనులలో అతడు తప్పులెన్నాడు. కోరహు ఇశ్రాయేలీయుల ఇతర ప్రధానులతో కలిసి, “ఈ సర్వసమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే యెహోవా వారి మధ్యనున్నాడు; యెహోవా సంఘముమీద మిమ్మును మీరేల హెచ్చించుకొనుచున్నా”రని మోషే అహరోనులతో పెడసరంగా మాట్లాడాడు. కోరహు అతని మద్దతుదారులు కనపర్చిన వైఖరిని యెహోవా ఎలా దృష్టించాడు? వారు చేసిన పని స్వయంగా తననే అగౌరవపరుస్తున్నట్లుగా యెహోవా దేవుడు భావించాడు. తమ పక్షాన ఉన్నవారందరూ భూమిలో కూరుకుపోవడం కోరహు అతని 250 మంది ప్రధానులు చూశారు, ఆ తర్వాత, యెహోవా నుండి అగ్ని రావడంతో వాళ్లు కూడా నాశనమయ్యారు.—సంఖ్యాకాండము 16:1-3, 28-35.
7. పౌలుకున్న అధికారాన్ని విమర్శించటానికి ‘మిక్కిలి శ్రేష్ఠులైన అపొస్తలులకు’ కారణమేదైనా ఉందా?
7 మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘంలో దైవపరిపాలనా అధికారాన్ని ధిక్కరించినవారున్నారు. కొరింథు సంఘంలోని ‘మిక్కిలి శ్రేష్ఠులైన అపొస్తలులకు’ పౌలుపట్ల గౌరవపూర్వకమైన దృక్పథం ఉండేది కాదు. “అతడు శరీరరూపమునకు బలహీనుడు, అతని ప్రసంగము కొరగానిదని” అంటూ వాళ్లు ఆయనకున్న ప్రసంగించే సామర్థ్యాన్ని విమర్శించారు. (2 కొరింథీయులు 10:10; 11:5) పౌలు అసాధారణమైన ప్రసంగీకుడైనా కాకపోయినా, ఒక అపొస్తలునిగా గౌరవాన్ని పొందడానికి ఆయన అర్హుడు. అయితే పౌలు ప్రసంగం నిజంగానే కొరగానిదా? ఆయన ఎంత ఒప్పించే ప్రసంగీకుడనేదానికి, బైబిలులో వ్రాయబడి ఉన్న ఆయన బహిరంగ ప్రసంగాలే నిదర్శనం. అంతెందుకు, “యూదులలో ఉండు సమస్తమైన . . . వివాదములను విశేషముగా ఎరిగిన” హేరోదు అగ్రిప్ప IIతో పౌలు కేవలం కొంచెంసేపు సంభాషించే సరికే ఆ రాజు, “ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయ జూచుచున్నావే” అనేంత వరకు వచ్చాడు ! (అపొస్తలుల కార్యములు 13:15-43; 17:22-34; 26:1-28) అయినప్పటికీ, కొరింథులోని మిక్కిలి శ్రేష్ఠులైన అపొస్తలులు, ఆయన ప్రసంగం కొరగానిదని నిందించారు ! యెహోవా వారి వైఖరిని ఎలా దృష్టించాడు? ఎఫెసు సంఘంలోని పెద్దలకు వ్రాసిన ఒక సందేశంలో, “అపొస్తలులు కాకయే తాము అపొస్తలులమని చెప్పుకొను”వారి మాటల ప్రకారం కొట్టుకుపోని వారి గురించి యేసుక్రీస్తు అనుకూలంగా మాట్లాడాడు.—ప్రకటన 2:2.
అపరిపూర్ణులైనప్పటికీ గౌరవించడం
8. యెహోవా సౌలుకిచ్చిన అధికారాన్ని తాను గౌరవిస్తున్నట్లు దావీదు ఎలా చూపించాడు?
8 అధికారంలో ఉన్న వ్యక్తులు తమకున్న అధికారాన్ని దుర్వినియోగం చేసినా, వారిని గౌరవించినవారి ఉదాహరణలు బైబిల్లో అనేకం ఉన్నాయి. అలా మాదిరికరంగా ఉన్నవారిలో దావీదు ఒకరు. ఆయన ఎవరి క్రిందనైతే పని చేశాడో ఆ రాజైన సౌలు దావీదు సాధించిన విజయాలను బట్టి అసూయపడి, ఆయనను చంపటానికి ప్రయత్నించాడు. (1 సమూయేలు 18:8-12; 19:9-11; 23:26) అయితే, సౌలును చంపే అవకాశాలు తనకు లభించినప్పటికీ దావీదు ఇలా అన్నాడు: “యెహోవాచేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను!” (1 సమూయేలు 24:3-6; 26:7-13) సౌలుది తప్పని దావీదుకు తెలుసు, కానీ ఆయనకు తీర్పుతీర్చే పనిని ఆయన యెహోవాకే విడిచిపెట్టాడు. (1 సమూయేలు 24:12, 15; 26:22-24) ఆయన సౌలుతోకానీ, సౌలు గురించికానీ నిందాపూర్వకంగా మాట్లాడలేదు.
9. (ఎ) సౌలు తనను వేధిస్తున్నప్పుడు దావీదు ఎలా భావించాడు? (బి) సౌలుపట్ల దావీదుకున్న గౌరవం నిజమైనదని మనమెలా చెప్పవచ్చు?
9 దావీదు తాను దుర్వ్యవహారానికి గురౌతున్నప్పుడు చింతించాడా? “బలాఢ్యులు నా ప్రాణము తీయజూచుచున్నారు” అని దావీదు యెహోవాకు మొరపెట్టుకున్నాడు. (కీర్తన 54:3) “నా దేవా, నా శత్రువులచేతిలోనుండి నన్ను, తప్పింపుము. . . . ఊరకయే బలవంతులు నాపైని పోగుబడియున్నారు. నాయందు ఏ అక్రమమును లేకున్నను వారు పరుగులెత్తి సిద్ధపడుచున్నారు నన్ను కలిసికొనుటకై మేల్కొనుము” అంటూ ఆయన యెహోవా ఎదుట తన హృదయాన్ని కుమ్మరించాడు. (కీర్తన 59:1-4) మీరు కూడా ఎప్పుడైనా అలా భావించారా, అంటే అధికారంలో ఉన్న ఒక వ్యక్తికి మీరు ఏ అపకారం తలపెట్టకపోయినా అతడు మిమ్మల్ని బాధపెడుతూనే ఉన్నట్లు భావించారా? దావీదు ఎన్నడూ సౌలును గౌరవించకుండా ఉండలేదు. సౌలు మరణించినప్పుడు దావీదు సంతోషించే బదులు ఇలా విలపించాడు: “సౌలును యోనాతానును తమ బ్రతుకునందు సరసులు గాను నెనరుగల వారుగాను ఉండిరి. . . . వారు పక్షిరాజులకంటె వడిగలవారు సింహములకంటె బలముగలవారు. ఇశ్రాయేలీయుల కుమార్తెలారా, సౌలును గూర్చి యేడ్వుడి.” (2 సమూయేలు 1:23, 24) సౌలు దావీదుకు అన్యాయం చేసినప్పటికీ, యెహోవా అభిషేకించినవాని పట్ల నిజమైన గౌరవాన్ని చూపించడంలో దావీదు ఎంత చక్కని మాదిరి !
10. పరిపాలక సభకు దేవుడిచ్చిన అధికారాన్ని గౌరవించడంలో పౌలు ఏ చక్కని మాదిరినుంచాడు, అది దేనికి నడిపింది?
10 క్రైస్తవ శకంలో కూడా దేవుడిచ్చిన అధికారాలను గౌరవించినవారి విశేషమైన ఉదాహరణలను మనం కనుగొంటాము. ఉదాహరణకు పౌలును తీసుకోండి. మొదటి శతాబ్దానికి చెందిన క్రైస్తవ సంఘ పరిపాలక సభ తీసుకున్న నిర్ణయాలకు ఆయన గౌరవం చూపించాడు. పౌలు చివరిసారి యెరూషలేముకు వెళ్లినప్పుడు, ధర్మశాస్త్రం పట్ల తనకు ఏ విధమైన వైరీభావం లేదని ఇతరులకు చూపించటానికి తనను తాను శుద్ధి చేసుకోవాలని పరిపాలక సభ ఆయనకు ఉపదేశించింది. పౌలు ఇలా తర్కించి ఉండగలిగేవాడే: ‘నా జీవితం అపాయంలో ఉన్నప్పుడు ఆ సహోదరులు, యెరూషలేము విడిచి వెళ్లమని మునుపు నాకు చెప్పారు. మళ్లీ ఇప్పుడు నాకు ధర్మశాస్త్రం అంటే గౌరవముందని అందరి ఎదుట చూపించమంటున్నారు. ధర్మశాస్త్రాన్ని అనుసరించనవసరం లేదని ఉపదేశిస్తూ నేను ఇప్పటికే గలతీయులకు ఒక ఉత్తరం వ్రాసేశాను. నేను ఆలయానికి వెళితే, ఇతరులు నా చర్యను అపార్థం చేసుకోవచ్చు, సున్నతి పొందిన తరగతితో నేను రాజీపడుతున్నానని అనుకోవచ్చు.’ అయితే పౌలు అలా తర్కించలేదని స్పష్టమౌతుంది. క్రైస్తవ సూత్రాలతో రాజీపడవలసిన అవసరమేమీ లేదు గనుక, మొదటి శతాబ్దపు పరిపాలక సభ ఇచ్చిన ఉపదేశాన్ని గౌరవించి, దాన్ని అమలులోపెట్టాడు. ఆ తర్వతా వెంటనే జరిగిన సంగతి ఏమిటంటే పౌలును ఒక యూదుల మూక నుండి రక్షించవలసి వచ్చింది, తర్వాత ఆయన రెండు సంవత్సరాల పాటు చెరసాలలో ఉన్నాడు. చివరికి దేవుని చిత్తమే నెరవేరింది. పౌలు కైసరయలో ఉన్నతాధికారుల ఎదుట సాక్ష్యమిచ్చాడు, స్వయంగా కైసరు ఎదుట సాక్ష్యమివ్వడానికి ప్రభుత్వ ఖర్చులతో రోముకు తీసుకువెళ్లబడ్డాడు.—అపొస్తలుల కార్యములు 9:26-30; 21:20-26; 23:11; 24:27; గలతీయులు 2:11; 4:9, 10.
మీరు గౌరవిస్తారా?
11. ఈ లోకంలోని అధికారులపట్ల మనం గౌరవాన్ని ఎలా చూపించవచ్చు?
11 అధికారంలో ఉన్న వారిని మీరు తగిన విధంగా గౌరవిస్తారా? “ఎవనియెడల సన్మానముండవలెనో వానియెడల సన్మానమును కలిగియుండి, అందరికిని వారి వారి ఋణములను తీర్చుడి” అని క్రైస్తవులకు ఆజ్ఞాపించబడింది. నిజానికి, “పై అధికారులకు” మనం లోబడి ఉండటమంటే అందులో మనం పన్నులు చెల్లించడం మాత్రమే గాక మనం మన ప్రవర్తన ద్వారా, మాట ద్వారా వారిని గౌరవించడం కూడా ఇమిడి ఉంది. (రోమీయులు 13:1-7) కఠినులైన ప్రభుత్వాధికారులు ఎదురుపడినప్పుడు మనమెలా ప్రతిస్పందిస్తాము? మెక్సికోలోని కీయప్స్ రాష్ట్రంలో ఒక సమాజంలోని అధికారులు యెహోవాసాక్షుల 57 కుటుంబాలకు చెందిన పొలాలను స్వాధీనం చేసుకున్నారు, ఈ క్రైస్తవులు కొన్ని మత సంబంధమైన పండుగల్లో పాల్గొనకపోవడమే దీనికి కారణం. సమస్యను పరిష్కరించటానికి నిర్వహించబడిన సమావేశాల్లో, శుభ్రంగా ఉండి చక్కగా వస్త్రాలు ధరించిన సాక్షులు, ఎంతో మార్యాదపూర్వకంగా, గౌరవప్రదంగా మాట్లాడారు. దాదాపు ఒక సంవత్సరం తర్వాత, వారికి అనుకూలంగా తీర్పు ఇవ్వబడింది. వారి వైఖరి కొంతమంది చూపరుల గౌరవాన్ని ఎంతగా చూరగొన్నదంటే, వాళ్లు తాము కూడా యెహోవాసాక్షులం కావాలని ఇష్టపడ్డారు !
12. అవిశ్వాసియైన భర్తపట్ల “ప్రగాఢమైన గౌరవం” కల్గివుండడం ఎందుకు ప్రాముఖ్యం?
12 కుటుంబంలో దేవుడిచ్చిన అధికారానికి మీరెలా గౌరవం చూపించవచ్చు? బాధల్ని అనుభవిస్తూ యేసు చూపించిన మాదిరి గురించి చర్చించిన తర్వాత, అపొస్తలుడైన పేతురు ఇలా అన్నాడు: “అటువలె స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడియుండుడి; అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే, వారు భయముతో [“ప్రగాఢమైన గౌరవంతో,” NW] కూడిన మీ పవిత్రప్రవర్తన చూచి, వాక్యము లేకుండనే తమ భార్యల నడవడివలన రాబట్టబడవచ్చును.” (1 పేతురు 3:1, 2; ఎఫెసీయులు 5:22-24) పేతురు ఇక్కడ, భార్య “ప్రగాఢమైన గౌరవంతో” తన భర్తకు విధేయురాలై ఉండటం యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పాడు, కొంతమంది భర్తలు అలాంటి గౌరవాన్ని పొందటానికి తగిన విధంగా ఏమీ చేయకపోయినప్పటికీ భార్యలు విధేయులై ఉండాలని ఆయన అన్నాడు. భార్య యొక్క గౌరవంతో కూడిన దృక్పథం అవిశ్వాసియైన తన భర్త హృదయాన్ని చూరగొనేలా చేయవచ్చు.
13. భార్యలు తమ భర్తలను ఎలా గౌరవించవచ్చు?
13 ఈ సందర్భంలోనే, పేతురు మన అవధానాన్ని శారా ఉదాహరణ వైపుకు మళ్లిస్తాడు, ఆమె భర్తయైన అబ్రాహాము విశ్వాసం విషయంలో విశేషమైన మాదిరి. (రోమీయులు 4:16, 17; గలతీయులు 3:6-9; 1 పేతురు 3:6) అవిశ్వాసులైన భర్తలకు వారి భార్యలు ఇచ్చే గౌరవం కన్నా విశ్వాసులైన భర్తలకు వారి భార్యలు ఏమైనా తక్కువ గౌరవాన్నివ్వాలా? ఏదైనా విషయంలో మీరు మీ భర్తతో ఏకీభవించకపోతే అప్పుడేమిటి? ఇక్కడ సాధారణంగా అన్వయించుకోగల కొంత ఉపదేశాన్ని యేసు ఇచ్చాడు: “[అధికారంలో ఉన్న] ఒకడు ఒక మైలు దూరము రమ్మని నిన్ను బలవంతముచేసినయెడల, వానితో కూడ రెండు మైళ్లు వెళ్లుము.” (మత్తయి 5:41) మీరు మీ భర్త ఇష్టానుసారంగా నడుచుకోవటం ద్వారా ఆయనను గౌరవిస్తారా? అది మరీ కష్టమనిపిస్తే, ఆ విషయంలో మీకున్న భావాలను ఆయనతో పంచుకోండి. మీరెలా భావిస్తున్నారనేది ఆయనకు తెలుసని ఊహించుకోకండి. మీరు మీ ఉద్దేశాలను గౌరవపూర్వకమైన విధంగా ఆయనకు తెలియజేయండి. బైబిలు మనకిలా ఉపదేశిస్తుంది: “ప్రతి మనుష్యునికి ఏలాగు ప్రత్యుత్తరమియ్యవలెనో అది మీరు తెలిసికొనుటకై మీ సంభాషణ ఉప్పువేసినట్టు ఎల్లప్పుడు రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనియ్యుడి.”—కొలొస్సయులు 4:6.
14. తల్లిదండ్రులను సన్మానించడంలో ఏమి ఇమిడివుంది?
14 పిల్లలూ మీ విషయమేమిటి? దేవుని వాక్యం ఇలా ఆజ్ఞాపిస్తుంది: “పిల్లలారా, ప్రభువునందు మీ తలిదండ్రులకు విధేయులైయుండుడి; ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమిమీద దీర్ఘాయుష్మంతుడవగుదువు, ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది.” (ఎఫెసీయులు 6:1-3) మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండడం ‘మీ తల్లినీ తండ్రినీ సన్మానించడంతో’ సమానంగా లేఖనం పరిగణిస్తున్నట్లు గమనించండి. ‘సన్మానించడం’ అని అనువదించబడిన గ్రీకు పదం “అమూల్యంగా ఎంచడం” లేక “వెల నిర్ణయించడం” అనే భావాన్ని కల్గివుంది. కాబట్టి విధేయులై ఉండడం అంటే, మీకు నిర్హేతుకమైనవిగా అనిపించే కట్టడలను, తల్లిదండ్రులు విధించిన కట్టడలను సణుగుతూ పాటించడం కాదు. మీరు మీ తల్లిదండ్రులను ఉన్నతంగా ఎంచి, వారిచ్చే నడిపింపుకు విలువనివ్వాలని దేవుడు కోరుతున్నాడు.—సామెతలు 15:5.
15. పిల్లలు తమ తల్లిదండ్రులు ఏదైనా పొరపాటు చేశారని భావించినప్పటికీ, వారిపట్ల ఎలా గౌరవాన్ని కల్గివుండవచ్చు?
సామెతలు 23:22) వాళ్లు మిమ్మల్ని ప్రేమించడం లేదూ? (హెబ్రీయులు 12:7-11) మీరెలా భావిస్తున్నారనేది వినయంగా వివరిస్తూ మీ తల్లిదండ్రులతో గౌరవపూర్వకంగా మాట్లాడండి. వాళ్లు మీకిష్టం లేనివిధంగా ప్రతిస్పందించినప్పటికీ, వారితో అమర్యాదగా మాట్లాడకండి. (సామెతలు 24:29) సౌలు దేవుని ఉపదేశాన్ని అనుసరించటంలో తప్పిపోయినా దావీదు సౌలు పట్ల గౌరవపూర్వకంగానే ఎలా వ్యవహరించాడో గుర్తుంచుకోండి. మీలో కలిగే భావాల్ని మీరు అర్థం చేసుకోవటానికి సహాయం చేయమని యెహోవాను వేడుకోండి. “ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి” అన్నాడు దావీదు. ఎందుకంటే, “దేవుడు మనకు ఆశ్రయము.”—కీర్తన 62:8; విలాపవాక్యములు 3:25-27.
15 మీ తల్లిదండ్రులు వారి పట్ల మీకున్న గౌరవం తగ్గిపోయేలాంటిదేదైనా చేస్తే అప్పుడేమిటి? వారి దృక్కోణం నుండి విషయాన్ని పరిశీలించటానికి ప్రయత్నించండి. వాళ్లు మిమ్మల్ని “కని,” మీకు కావలసినవన్నీ సమకూర్చలేదా? (నడిపింపునిస్తున్నవారిని సన్మానించండి
16. అబద్ధబోధకుల, దేవదూతల మాదిరుల నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?
16 సంఘ పెద్దలు పరిశుద్ధాత్మచే నియమించబడినప్పటికీ, వాళ్లూ అపరిపూర్ణులే, గనుక వాళ్లూ తప్పులు చేస్తారు. (కీర్తన 130:3; ప్రసంగి 7:20; అపొస్తలుల కార్యములు 20:28; యాకోబు 3:2) ఫలితంగా సంఘంలోని కొంతమంది, పెద్దల విషయమై అసంతృప్తి చెందవచ్చు. సంఘంలో ఏదైనా ఒక విషయం సరిగ్గా జరగకపోతే, లేదా కనీసం మనకలా అనిపిస్తే, మనమెలా ప్రతిస్పందించాలి? మొదటి శతాబ్దపు అబద్ధ బోధకులకూ, దేవదూతలకూ మధ్యనున్న వ్యత్యాసాన్ని గమనించండి: “వీరు [అబద్ధ బోధకులు] తెగువగలవారును స్వేచ్ఛాపరులునై మహాత్ములను దూషింప వెరువకయున్నారు. దేవదూతలు వారికంటె మరి అధికమైన బలమును శక్తియుగలవారైనను, ప్రభువు ఎదుట [“యెహోవా పట్ల గౌరవంతో,” NW] వారిని దూషించి వారిమీద నేరము మోప వెరతురు.” (2 పేతురు 2:9-13) అబద్ధ బోధకులు “మహాత్ముల” గురించి అంటే మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘంలో అధికారం ఇవ్వబడిన పెద్దల గురించి దూషణకరంగా మాట్లాడినప్పటికీ, సహోదరుల మధ్య అనైక్యతను కలిగిస్తున్న అబద్ధ బోధకుల గురించి దేవదూతలు దూషణకరంగా మాట్లాడలేదు. మానవుల కన్నా ఉన్నత స్థానంలో ఉండి న్యాయంపట్ల మరెక్కువ ఆసక్తి కల్గివున్న దేవదూతలకు, సంఘంలో ఏమి జరుగుతుందో తెలుసు. అయినప్పటికీ, “యెహోవా పట్ల గౌరవంతో” వాళ్లు తీర్పును దేవునికి విడిచిపెట్టారు.—హెబ్రీయులు 2:6, 7; యూదా 9.
17. పెద్దలు తప్పు చేశారని మీరు భావించేలాంటి సమస్యలతో వ్యవహరించేటప్పుడు ఆ విషయంలో మీ విశ్వాసం ఎలా ఒక పాత్రను నిర్వహిస్తుంది?
17 ఏదైనా జరగాల్సిన విధంగా జరుగకపోయినా, క్రైస్తవ సంఘానికి సజీవ శిరస్సుగా ఉన్న యేసు క్రీస్తునందు మనం విశ్వాసం ఉంచవద్దా? తన ప్రపంచవ్యాప్త సంఘంలో ఏమి జరుగుతోందో ఆయనకు తెలియదా? పరిస్థితిని ఆయన చక్కబరిచే విధానాన్ని మనం గౌరవిస్తూ, విషయాలను సరి చేయడంలో ఆయనకున్న సామర్థ్యాన్ని మనం గుర్తించవద్దా? నిజంగా, ‘మన పొరుగువారికి తీర్పుతీర్చడానికి మనమెవరం?’ (యాకోబు 4:12; 1 కొరింథీయులు 11:3; కొలొస్సయులు 1:18) మీకు చింత కల్గిస్తున్న విషయాల గురించి ప్రార్థనలో యెహోవాకు ఎందుకు తెలియజేయకూడదు?
18, 19. ఒక పెద్ద తప్పు చేశాడని మీరు భావిస్తే మీరేమి చేయవచ్చు?
18 మానవ అపరిపూర్ణత మూలంగా కష్టాలు, సమస్యలు 2 తిమోతి 3:16; హెబ్రీయులు 12:7-11.
తలెత్తవచ్చు. ఎవరైనా ఒక పెద్ద కొన్నిసార్లు తప్పు చేయవచ్చు, అది కొంతమందిని చాలా కలతపర్చవచ్చు. అలాంటి పరిస్థితుల్లో మనం తొందరపాటు చర్యలు తీసుకోవడం పరిస్థితిని చక్కబరచదు. అది సమస్యను మరింత జటిలం చేస్తుందంతే. ఆధ్యాత్మిక వివేచనవున్నవారు, పరిస్థితులను యెహోవా చక్కబరుస్తాడనీ, తనదైన సమయంలో తన స్వంత పంథాలో అవసరమైన క్రమశిక్షణను ఇస్తాడనీ ఎదురుచూస్తారు.—19 ఏదైనా ఒక విషయాన్ని గురించి మీరు మరీ బాధపడుతూ ఉంటే అప్పుడేమిటి? సంఘంలోని ఇతరులతో మాట్లాడే బదులు, సహాయం కోసం గౌరవప్రదమైన విధంగా పెద్దలను ఎందుకు సమీపించకూడదు? విమర్శిస్తూ మాట్లాడకుండా, అది మీమీద ఎలా ప్రభావం చూపించిందో వివరించండి. వారిపట్ల ఎప్పుడూ “సహానుభూతి” కల్గివుండండి, వారితో మీ భావాలను పంచుకునేటప్పుడు గౌరవాన్ని పరస్పరం ఇచ్చిపుచ్చుకోండి. (1 పేతురు 3:8, NW) వ్యంగ్యంగా మాట్లాడకండి, వారి క్రైస్తవ పరిణతియందు నమ్మకముంచండి. వాళ్లు దయాపూర్వకంగా ఏదైనా లేఖనాధార ప్రోత్సాహాన్నిస్తే, మెప్పుదలతో దాన్ని స్వీకరించండి. ఇంకా దిద్దుబాటు చర్యలు తీసుకోవలసిన అవసరముందని మీకనిపిస్తే, పెద్దలు మంచిదీ సరైనదీ అయిన చర్య తీసుకునేలా యెహోవా నడిపింపునిస్తాడని నమ్మకం కల్గివుండండి.—గలతీయులు 6:10; 2 థెస్సలొనీకయులు 3:13.
20. తర్వాతి శీర్షకలో మనం ఏ విషయాన్ని పరిశీలించబోతున్నాము?
20 అధికారంలో ఉన్నవారిని సన్మానించి, గౌరవించటానికి సంబంధించి మనం పరిశీలించవలసిన అంశం మరొకటి ఉంది. అధికారంలో ఉన్నవారు తమకు అప్పగించబడిన వారిని గౌరవించవద్దా? తర్వాతి శీర్షికలో దాన్ని మనం పరిశీలిద్దాము.
మీరెలా సమాధానమిస్తారు?
• అధికారం ఉన్నవారిని సన్మానించటానికి మనకు ఏ మంచి కారణం ఉంది?
• దేవుడిచ్చిన అధికారాన్ని గౌరవించని వారిని యెహోవా, యేసుక్రీస్తు ఎలా దృష్టిస్తారు?
• అధికారం ఉన్నవారిని గౌరవించిన వారి ఏ చక్కని ఉదాహరణలు మనకున్నాయి?
• మనమీద అధికారమున్న వారెవరైనా తప్పుచేశారని మనకనిపిస్తే మనం ఏమి చేయవచ్చు?
[అధ్యయన ప్రశ్నలు]
[అధ్యయన ప్రశ్నలు]
[12వ పేజీలోని చిత్రం]
శారా అబ్రాహాముకున్న అధికారాన్ని ప్రగాఢంగా గౌరవించి, సంతోషంగా ఉంది
[13వ పేజీలోని చిత్రం]
కుటుంబ శిరస్సుగా, రాజుగా దావీదుకున్న అధికారాన్ని మీకాలు గౌరవించలేకపోయింది
[15వ పేజీలోని చిత్రం]
“యెహోవాచేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను !”
[16వ పేజీలోని చిత్రం]
మీకు చింత కల్గిస్తున్న విషయాల గురించి యెహోవాకు ఎందుకు ప్రార్థించకూడదు?