కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“మీరందరు సహోదరులు”

“మీరందరు సహోదరులు”

“మీరందరు సహోదరులు”

“మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరు సహోదరులు.”మత్తయి 23:8.

1. ఏ విషయం మనం పరిశీలించదగినది?

“ఎవరెక్కువ గౌరవం పొందటానికి అర్హులు, ఒక మిషనరీనా లేక బేతేలు కుటుంబ సభ్యుడా?” అని ప్రాచ్య దేశానికి చెందిన ఒక క్రైస్తవ స్త్రీ, ఆస్ట్రేలియా నుండి వచ్చిన ఒక మిషనరీని అమాయకంగా అడిగింది. ఎవరిని ఎక్కువగా గౌరవించాలి, అంటే మరో దేశం నుండి వచ్చిన మిషనరీనా లేదా వాచ్‌ టవర్‌ సొసైటీ బ్రాంచి కార్యాలయంలో స్థానిక పరిచారకునిగా సేవచేస్తున్న వ్యక్తినా అనేది ఆమె తెలుసుకోవాలనుకుంది. వర్గ భేదముల సంస్కృతికి అద్దం పడుతున్న ఆ అమాయకమైన ప్రశ్న విని ఆ మిషనరీ హతాశురాలైంది. అయితే ఎవరు గొప్ప అనే ప్రశ్న, ఎవరికెంత అధికారం ఉంది, ఎవరికెంత పలుకుబడి ఉంది అనేది తెలుసుకోవాలనే కోరిక నుండి ఉద్భవిస్తుంది.

2. మనం మన తోటి ఆరాధకులను ఎలా దృష్టించాలి?

2 ఇలాంటి ఆసక్తి కల్గివుండటమన్నది క్రొత్త విషయమేమీ కాదు. యేసు శిష్యుల మధ్య కూడా ఎవరు గొప్ప అనే వివాదం తరచూ తలెత్తుతూనే ఉండేది. (మత్తయి 20:20-24; మార్కు 9:33-37; లూకా 22:24-27) వాళ్లు కూడా మొదటి శతాబ్దపు యూదా మతానికి చెందిన, వర్గ భేదములున్న సంస్కృతి నుండే వచ్చారు. అలాంటి సమాజాన్ని మనస్సులో ఉంచుకునే, యేసు తన శిష్యులకిలా ఉపదేశించాడు: “మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరు సహోదరులు.” (మత్తయి 23:8) “బోధకుడు” అన్న భావంగల “రబ్బీ” అనే మతసంబంధమైన బిరుదు, “దాన్ని పొందేవారిలో గర్వాన్ని, ఉన్నతులమన్న భావాన్ని పెంపొందింపజేయడమే గాక, దాన్ని పొందనివారిలో అసూయను న్యూనతా భావాన్ని పెంపొందింపజేస్తుంది; దాని మొత్తం స్ఫూర్తి, దృక్పథం ‘క్రీస్తులోవున్న సరళతకు’ పూర్తి విరుద్ధమైనవి” అని బైబిలు పండితుడైన ఆల్బర్ట్‌ బాన్జ్‌ పేర్కొన్నాడు. వాస్తవానికి, క్రైస్తవులు తమ మధ్యనున్న పైవిచారణకర్తలను “ఫలానా పెద్ద” అని సంబోధిస్తూ, “పెద్ద” అనే పదాన్ని ఏదో బిరుదులా ఉపయోగించరు. (యోబు 32:21, 22) మరో వైపున, యెహోవా తన నమ్మకమైన ఆరాధకులను, యేసుక్రీస్తు తన నమ్మకమైన అనుచరులను గౌరవించినట్లుగానే, యేసు ఇచ్చిన ఉపదేశ స్ఫూర్తికి అనుగుణంగా జీవించే పెద్దలు సంఘంలోని ఇతర సభ్యులను గౌరవిస్తారు.

యెహోవా యేసుక్రీస్తుల మాదిరి

3. యెహోవా తన ఆత్మ ప్రాణులను ఎలా గౌరవించాడు?

3 యెహోవా “మహోన్నతు”డైనప్పటికీ, తాను సృష్టించినవారిని తాను చేసే కార్యాల్లో భాగం వహించటానికి అనుమతించటం ద్వారా ఆయన వారిని మొట్టమొదటి నుండీ గౌరవించాడు. (కీర్తన 83:18) యెహోవా మొదటి మానవుడిని సృష్టించినప్పుడు, తన అద్వితీయ కుమారుడైన యేసును ఆ పనిలో “ప్రధాన శిల్పి”గా నియమించాడు. (సామెతలు 8:27-30; ఆదికాండము 1:26) యెహోవా తాను దుష్ట రాజైన ఆహాబును నాశనం చేయటానికి నిశ్చయించుకున్నప్పుడు, ఆ పనిని ఎలా తుదముట్టించాలనే దాని గురించి తమ తమ అభిప్రాయాలను వ్యక్తపర్చమని ఆయన తన పరలోక దూతలను ఆహ్వానించాడు.—1 రాజులు 22:19-23.

4, 5. యెహోవా తన మానవ సృష్టిని ఎలా గౌరవిస్తాడు?

4 యెహోవా విశ్వ సర్వాధిపతిగా పరిపాలిస్తున్నాడు. (ద్వితీయోపదేశకాండము 3:23, 24) ఆయనకు మానవులను సంప్రదించవలసిన అవసరమేమీ లేదు. అయినా, ఒక విధంగా చెప్పాలంటే ఆయన వారిని పరిగణనలోకి తీసుకోవటానికిగానూ తనను తాను తగ్గించుకుంటాడు. కీర్తనల గ్రంథకర్త ఇలా పాడాడు: “ఉన్నతమందు ఆసీనుడైయున్న మన దేవుడైన యెహోవాను పోలియున్నవాడెవడు? ఆయన భూమ్యాకాశములను వంగిచూడ ననుగ్రహించు చున్నాడు. . . . ఆయన నేలనుండి దరిద్రులను లేవనెత్తువాడు.”—కీర్తన 113:5-8.

5 సొదొమ గొమొఱ్ఱాలను నిర్మూలించేముందు, యెహోవా అబ్రాహాము ప్రశ్నలను విని, న్యాయం జరగాలన్న ఆయన చింతను తృప్తిపరిచాడు. (ఆదికాండము 18:23-33) అబ్రాహాము విజ్ఞప్తుల ఫలితమేమై ఉండగలదో యెహోవాకు ముందే తెలిసినప్పటికీ, ఆయన సహనంతో విని, అబ్రాహాము తర్కాన్ని అంగీకరించాడు.

6. హబక్కూకు ఒక ప్రశ్న అడిగినప్పుడు యెహోవా ఆయనను గౌరవించడం వల్ల ఏమి జరిగింది?

6 “నేను మొఱ్ఱపెట్టినను నీవెన్నాళ్లు ఆలకింపకుందువు?” అని అడిగిన హబక్కూకు మాటను కూడా యెహోవా విన్నాడు. ఆ ప్రశ్న తన అధికారాన్ని సవాలు చేస్తున్నట్లు ఆయన భావించాడా? హబక్కూకు వేస్తున్న ప్రశ్నలను ఆయన సముచితమైనవిగా ఎంచాడు, అందుకే ఆ తర్వాత తీర్పు తీర్చడానికి తాను కల్దీయులను రేపాలని సంకల్పించిన విషయాన్ని కూడా తెలియజేశాడు. ‘ప్రవచింపబడిన ఈ తీర్పు తప్పక నెరవేరుతుందని’ ఆయన ప్రవక్తకు హామీ ఇచ్చాడు. (హబక్కూకు 1:1, 2, 5, 6, 13, 14; 2:2, 3) హబక్కూకు వ్యాకులతను గంభీరంగా తీసుకుని దానికి సమాధానమివ్వటం ద్వారా యెహోవా ఆ ప్రవక్తను గౌరవించాడు. ఫలితంగా, వ్యాకులపడుతున్న ఆ ప్రవక్త దేవునియందూ ఆయన అనుగ్రహించే రక్షణయందూ పూర్తి నమ్మకంతో నూతనోత్తేజాన్నీ ఆనందాన్నీ పొందాడు. ఈ ఉదంతం, నేడు యెహోవాయందు మన నమ్మకాన్ని బలపరిచే హబక్కూకు ప్రేరేపిత పుస్తకంలో కనిపిస్తుంది.—హబక్కూకు 3:18, 19.

7. సా.శ. 33 పెంతెకొస్తు నాడు పేతురు వహించిన పాత్ర ఎందుకు విశేషమైనది?

7 ఇతరులను గౌరవించే విషయంలో యేసుక్రీస్తు మరో చక్కని ఉదాహరణ. యేసు తన అపొస్తలులకిలా చెప్పాడు, “మనుష్యులయెదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున్న నా తండ్రియెదుట నేనును ఎరుగనందును.” (మత్తయి 10:33) అయితే ఆయన అప్పగింపబడిన రాత్రి ఆయన శిష్యులందరూ ఆయనను వదిలి వెళ్లిపోయారు, అపొస్తలుడైన పేతురు ఆయనను ఎరుగనని మూడుసార్లు అన్నాడు. (మత్తయి 26:34, 35, 69-75) అయితే యేసు బయటికి కనిపించే విషయాలకే ప్రాధాన్యతనివ్వకుండా పేతురు అంతర్గత భావాలనూ ఆయన చూపించిన నిజమైన పశ్చాత్తాపాన్నీ పరిగణనలోకి తీసుకున్నాడు. (లూకా 22:61, 62) కేవలం 51 రోజుల తర్వాత, పెంతెకొస్తు దినాన 120 మంది శిష్యులకు ప్రాతినిధ్యం వహిస్తూ “రాజ్యముయొక్క” మొదటి ‘తాళపుచెవి’ ఉపయోగించే అవకాశాన్ని పశ్చాత్తప్తుడైన ఈ అపొస్తలునికి ఇవ్వడం ద్వారా యేసుక్రీస్తు ఆయనను గౌరవార్హుణ్ణి చేశాడు. (మత్తయి 16:19; అపొస్తలుల కార్యములు 2:14-40) ‘మనసు తిరిగిన తరువాత తన సహోదరులను స్థిరపరిచే’ అవకాశం పేతురుకు ఇవ్వబడింది.—లూకా 22:31-33.

కుటుంబ సభ్యులను గౌరవించటం

8, 9. ఒక భర్త తన భార్యకు గౌరవాన్ని ఇవ్వడంలో యెహోవా యేసులను ఎలా అనుకరించవచ్చు?

8 దేవుడిచ్చిన అధికారాన్ని ఉపయోగించే విషయంలో భర్తలూ, తల్లిదండ్రులూ యెహోవాను, యేసుక్రీస్తును అనుకరించడం మంచిది. పేతురు ఇలా ఉపదేశించాడు: “అటువలెనే పురుషులారా, . . . యెక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, . . . జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి.” (1 పేతురు 3:7) చెక్కపాత్ర కన్నా ఎంతో పెళుసుగా ఉండే సున్నితమైన పింగాణి పాత్రను చేత్తో పట్టుకోవడాన్ని ఊహించండి. మీరు దాన్ని మరింత జాగ్రత్తగా పట్టుకోరా? ఒక భర్త యెహోవాను అనుకరిస్తూ, తమ కుటుంబ విషయాలపై నిర్ణయం తీసుకునేటప్పుడు తన భార్య అభిప్రాయాలను వినడం ద్వారా అలా వ్యవహరించవచ్చు. అబ్రాహాముతో కారణసహితంగా మాట్లాడటానికి యెహోవా సమయాన్ని వెచ్చించాడని గుర్తు తెచ్చుకోండి. తానూ అపరిపూర్ణుడే గనుక ఒక భర్త విషయాన్నంతటినీ చూడటంలో విఫలం కావచ్చు. కాబట్టి యథార్థంగా ఆమె అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవడం ద్వారా తన భార్యను గౌరవించడం ఆయనకు జ్ఞానయుక్తమైనది కాదా?

9 పురుషాధిక్యత లోతుగా పాతుకుపోయిన దేశాల్లో, ఒక భర్త తన భార్య తన అంతర్గత భావాలను వ్యక్తపర్చడానికి ఎంతో కష్టపడవల్సి ఉంటుందని మనస్సులో ఉంచుకోవాలి. యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు తన భవిష్యద్‌ పెండ్లికుమార్తె తరగతిలో భాగమైన తన శిష్యులతో వ్యవహరించిన విధానాన్ని అనుకరించండి. వారు తమ అవసరాల గురించి చెప్పక ముందే, ఆయన వారి శారీరక ఆధ్యాత్మిక పరిధులను పరిగణనలోకి తీసుకుంటూ, వారిని ఎంతో ప్రేమించాడు. (మార్కు 6:31; యోహాను 16:12, 13; ఎఫెసీయులు 5:28-30) అంతేగాక, మీ కోసం మీ కుటుంబం కోసం మీ భార్య ఏమి చేస్తుందో గమనించండి, మాటల్లోనూ చేతల్లోనూ మీ మెప్పును వ్యక్తం చేయండి. యెహోవా యేసు ఇద్దరూ అర్హులైనవారిని మెచ్చుకున్నారు, ప్రశంసించారు, ఆశీర్వదించారు. (1 రాజులు 3:10-14; యోబు 42:12-15; మార్కు 12:41-44; యోహాను 12:3-8) ప్రాచ్య దేశానికి చెందిన ఒక క్రైస్తవ స్త్రీ తన భర్త యెహోవా సాక్షి అయిన తర్వాత ఇలా అన్నది: “ఇంతకుముందు నా భర్త నాకన్నా మూడు నాలుగు అడుగులు ముందు నడిచేవారు, బరువులేవైనా ఉంటే నేనే మోసేదాన్ని. ఇప్పుడు బ్యాగులు ఆయనే పట్టుకుంటున్నారు, నేను ఇంట్లో చేసే పనులకు ఎంతో మెప్పుదల కనపరుస్తున్నారు !” మీ భార్య తనకు విలువుందని భావించేలా చేయడానికి ఒక్క ప్రశంసాపూర్వకమైన మాట చాలు.—సామెతలు 31:28, 29.

10, 11. తిరుగుబాటుదారులైన ఇశ్రాయేలు జనాంగంతో వ్యవహరించడంలో యెహోవా చూపించిన చక్కని మాదిరి నుండి తల్లిదండ్రులు ఏమి నేర్చుకోవచ్చు?

10 తల్లిదండ్రులు తమ పిల్లలతో వ్యవహరించేటప్పుడు, ముఖ్యంగా వారిని గద్దించవలసి వచ్చినప్పుడు దేవుని మాదిరిని అనుకరించాలి. తమ చెడు నడతలను విడిచిపెట్టమని ‘యెహోవా ఇశ్రాయేలువారిని యూదావారిని హెచ్చరించినప్పటికీ, వారు ముష్కరులయ్యారు.’ (2 రాజులు 17:13-15) చివరికి ఇశ్రాయేలీయులు “నోటి మాటతో . . . ఆయనను ముఖస్తుతి చేసిరి. తమ నాలుకలతో ఆయనయొద్ద బొంకిరి.” తమ పిల్లలు కొన్నిసార్లు అలా ప్రవర్తిస్తారని చాలామంది తల్లిదండ్రులు భావించవచ్చు. ఇశ్రాయేలీయులు “మాటికిమాటికి . . . దేవుని శోధించి” ఆయనను బాధపెట్టి, గాయపరిచారు. అయినా యెహోవా, ‘వాత్సల్యసంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషమును పరిహరించాడు.’—కీర్తన 78:36-41.

11 యెహోవా ఇశ్రాయేలీయులనిలా అభ్యర్థించాడు కూడా: “రండి మన వివాదము తీర్చుకొందము మీ పాపములు రక్తమువలె ఎఱ్ఱనివైనను అవి హిమమువలె తెల్లబడును.” (యెషయా 1:18) యెహోవా తనది తప్పు కాకపోయినా, వచ్చి విషయాలను చక్కబరుచుకోమని తిరుగుబాటుదారులైన జనాంగాన్ని ఆహ్వానించాడు. తల్లిదండ్రులు తమ పిల్లలతో వ్యవహరించేటప్పుడు అనుకరించటానికి ఎంత చక్కని దృక్పథం ! అవసరమైనప్పుడు వారు చెప్పేది విని, వారు ఎందుకు మార్పు చేసుకోవలసి ఉందో వారికి తర్కసహితంగా వివరించడం ద్వారా వారిని గౌరవించండి.

12. (ఎ) మనం మన పిల్లల్ని యెహోవా కన్నా ఎక్కువగా గొప్ప చేయడం ఎందుకు మానుకోవాలి? (బి) మనం మన పిల్లలను గద్దించేటప్పుడు వారి ఆత్మగౌరవాన్ని పరిగణనలోనికి తీసుకోవాలంటే ఏమి అవసరం?

12 అయితే, కొన్నిసార్లు పిల్లలకు గట్టి ఉపదేశం అవసరం. తల్లిదండ్రులు, ‘యెహోవా కంటె ఎక్కువగా తన కుమారులను గొప్ప చేసిన’ ఏలీలా ఉండాలనుకోరు. (1 సమూయేలు 2:29) అయినప్పటికీ, సరిదిద్దడం వెనుకనున్న ప్రేమపూర్వకమైన ఉద్దేశాన్ని యౌవనస్థులు గుర్తించవలసిన అవసరం ఉంది. తమ తల్లిదండ్రులు తమను ప్రేమిస్తున్నారని వారు గ్రహించగలగాలి. పౌలు తల్లిదండ్రులకిలా ఉపదేశిస్తున్నాడు: “మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి.” (ఎఫెసీయులు 6:4) తల్లిదండ్రులకు అధికారం సహజంగానే ఉన్నప్పటికీ, చెప్పబడుతున్న విషయం ఏమిటంటే, తండ్రి తాను హద్దులుమించి కఠినంగా ఉంటూ పిల్లలకు కోపం తెప్పించే బదులు వారి ఆత్మగౌరవాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్నదే. అవును, పిల్లల ఆత్మగౌరవాన్ని పరిగణనలోనికి తీసుకోవటానికి తల్లిదండ్రులు సమయాన్ని వెచ్చించి, కృషి చేయవలసి ఉంటుంది, కాని అలా చేయటం వల్ల వచ్చే ఫలితాలు, చేసిన త్యాగాలకు తగిన విధంగా ఉంటాయి.

13. కుటుంబంలోని పెద్ద వయస్సువారి గురించి బైబిలు ఉద్దేశం ఏమిటి?

13 కుటుంబ సభ్యులను గౌరవించడంలో తమ భార్యాపిల్లలను గౌరవించడంకంటే ఎక్కువే ఇమిడివుంది. “వృద్ధాప్యంలో మీ పిల్లలకు విధేయులై ఉండండి” అని చెప్తుంది ఒక జపాను సామెత. వృద్ధులైన తల్లిదండ్రులు తమకున్న అధికారాన్ని వదులుకుని, ఎదిగిన తమ పిల్లలు చెప్పేదాన్ని వినాలన్నది ఆ సామెత ఉద్దేశం. పిల్లలు మాట్లాడుతున్నప్పుడు వినటం ద్వారా తల్లిదండ్రులు వారిని గౌరవించాలన్నది లేఖనాధారమైనదే అయినప్పటికీ, పిల్లలు తమ కుటుంబంలోని వృద్ధులపట్ల అమర్యాదకరమైన దృక్పథాన్ని కనబర్చకూడదు. సామెతలు 23:22, ఇలా చెప్తుంది, “నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము.” రాజైన సొలొమోను ఈ సామెతకు అనుగుణ్యంగానే జీవించాడు, తన తల్లి ఒక విజ్ఞప్తి చేయటానికి వచ్చినప్పుడు ఆమెను గౌరవించాడు. సొలొమోను వృద్ధురాలైన తన తల్లి బత్షెబ కోసం తన కుడిపార్శ్వమున ఒక సింహాసనం వేయించి, ఆమె చెప్పేది విన్నాడు.—1 రాజులు 2:19, 20.

14. సంఘంలోని పెద్ద వయస్సువారిని మనం ఎలా గౌరవించవచ్చు?

14 విస్తరించిన మన ఆధ్యాత్మిక కుటుంబంలో, సంఘంలోని వృద్ధ సభ్యులను గౌరవించే విషయంలో మనం ‘చొరవ తీసుకోవడానికి’ మంచి స్థితిలో ఉన్నాము. (రోమీయులు 12:10) వాళ్లు మునుపు తాము చేస్తున్నంతగా ఇప్పుడు చేయలేకపోతుండవచ్చు, అది వారిని కలతపరుస్తూ ఉండవచ్చు. (ప్రసంగి 12:1-7) రోగగ్రస్థురాలై మంచంపట్టిన ఒక వృద్ధ అభిషిక్త సాక్షి అలాంటి కలతను ఇలా వ్యక్తపర్చింది: “నేను చనిపోయి పనిని పునఃప్రారంభించే వరకూ ఆగలేను.” అలాంటి వృద్ధులకు, మనం తగిన గుర్తింపును, గౌరవాన్ని ఇవ్వడం ఎంతో సహాయం చేస్తుంది. ఇశ్రాయేలీయులకు ఇలా ఆజ్ఞాపించబడింది: “తల నెరసినవానియెదుట లేచి ముసలివాని ముఖమును ఘనపరచి నీ దేవునికి భయపడవలెను.” (లేవీయకాండము 19:32) కాబట్టి వృద్ధుల పట్ల శ్రద్ధ చూపించడంలో భాగంగా, వారు తాము అవసరమైనవారమనీ, తాము మెచ్చుకోబడుతున్నామనీ భావించేలా చేయండి. ‘లేవడంలో,’ సంవత్సరాల క్రితం తాము ఏమి సాధించామనేది వాళ్లు చెబుతుండగా కూర్చుని వినడం కూడా ఇమిడివుంది. అది వృద్ధులను ఘనపర్చి, మన స్వంత ఆధ్యాత్మిక జీవితాన్ని సుసంపన్నం చేయగలదు.

“ఘనతవిషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి”

15. సంఘ సభ్యులను గౌరవించటానికి పెద్దలు ఏమి చేయవచ్చు?

15 సంఘ పెద్దలు తమ ఎదుట మంచి మాదిరిని ఉంచినప్పుడు సంఘ సభ్యులు ప్రవర్ధమానం చెందుతారు. (1 పేతురు 5:2, 3) చిన్నవయస్సువారు, కుటుంబ శిరస్సులు, ఒంటరి తల్లులు, గృహిణులు, పెద్దవయస్సువారు ఏవైనా సమస్యలను ఎదుర్కుంటున్నా లేకపోయినా వారిని కలవటానికి, శ్రద్ధగల పెద్దలు తమకు ఎన్నో పనులున్నప్పటికీ చొరవతీసుకుంటారు. సంఘ సభ్యులు ఏమైనా చెప్పదలుచుకుంటే పెద్దలు దాన్ని విని, వారు చేస్తున్నదాన్ని బట్టి వారిని మెచ్చుకుంటారు. ఒక సహోదరుడుగానీ ఒక సహోదరిగానీ చేసినదాని గురించి మెచ్చుకోలుగా వ్యాఖ్యానించే పెద్ద, తన భూ సృష్టిప్రాణులను మెచ్చుకునే యెహోవాను అనుకరిస్తున్నట్లే.

16. సంఘంలోని ఇతరులతోపాటు పెద్దలు గౌరవాన్ని పొందటానికి అర్హులని మనం వారిని ఎందుకు దృష్టించాలి?

16 “సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగముగల వారై, ఘనతవిషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి” అని పౌలు ఇచ్చిన ఉపదేశాన్ని అన్వయించుకోవడంలో పెద్దలు యెహోవాను అనుకరిస్తూ చక్కని మాదిరిని ఉంచుతారు. (రోమీయులు 12:10) వర్గ భేదములు సర్వసాధారణమైయున్న దేశాల్లో నివసిస్తున్న పెద్దలకు ఇది కష్టం కావచ్చు. ఉదాహరణకు, ఒక ప్రాచ్య దేశంలో “సహోదరుడు” అనే పదం కోసం రెండు పదాలున్నాయి, ఒకటి గౌరవ సూచకమైనది, మరొకటి సాధారణంగా ఉపయోగించేది. ఇటీవలి కాలం వరకూ సంఘ సభ్యులు పెద్దలను, పెద్దవయస్సు వారిని సంబోధించటానికి ఈ గౌరవ సూచకమైన పదాన్ని ఉపయోగిస్తూ, ఇతరుల కోసం సాధారణమైన పదాన్ని ఉపయోగించేవారు. అయితే, వారు అన్ని సమయాల్లోనూ సాధారణ పదాన్ని ఉపయోగించాలని ప్రోత్సహించటం జరిగింది, ఎందుకంటే యేసు తన అనుచరులకిలా చెప్పాడు: “మీరందరు సహోదరులు.” (మత్తయి 23:8) ఇతర దేశాల్లో ఈ తేడా అంత ప్రస్ఫుటంగా కనిపించకపోయినప్పటికీ, వర్గ భేదములను చూపించే మానవ దృక్పథాన్ని గురించి మనమందరం జాగ్రత్తగా ఉండాలి.—యాకోబు 2:4.

17. (ఎ) పెద్దలు సమీపించదగిన వారిగా ఎందుకుండాలి? (బి) సంఘసభ్యులతో వ్యవహరించడంలో పెద్దలు యెహోవాను ఏ యే విధాలుగా అనుకరించవచ్చు?

17 నిజమే, కొంతమంది పెద్దలను “రెట్టింపు సన్మానమునకు” పాత్రులుగా ఎంచాలని పౌలు ప్రోత్సహించినప్పటికీ, వాళ్లూ సహోదరులే. (1 తిమోతి 5:17) మనం విశ్వసర్వోన్నతాధిపతి యొక్క “కృపాసనమునొద్దకు” “ధైర్యముతో” చేరగల్గుతుంటే, యెహోవాను అనుకరించవలసిన పెద్దలను సమీపించగలుగవద్దా? (హెబ్రీయులు 4:16; ఎఫెసీయులు 5:1) ఉపదేశం పొందటానికి, లేక సూచనలు చేయటానికి ఇతరులు తన వద్దకు ఎంత తరచుగా వస్తారనే విషయాన్ని పరిశీలించుకోవడం ద్వారా పైవిచారణకర్తలు తాము ఎంత మేరకు సమీపించదగిన వారిగా ఉన్నామనేది తూచిచూసుకోవాలి. తన పథకాల్లో భాగం వహించేందుకు యెహోవా ఇతరులకు అవకాశమిచ్చే విధానం నుండి పాఠం నేర్చుకోండి. బాధ్యతలను అప్పగించడం ద్వారా ఆయన ఇతరుల ఆత్మగౌరవానికి విలువనిస్తాడు. మరో సాక్షి ఇచ్చిన సలహాలు అంత ఆచరణాత్మకమైనవిగా అనిపించకపోయినప్పటికీ, వాళ్లు చూపించిన శ్రద్ధను పెద్దలు మెచ్చుకోవాలి. అబ్రాహాము వేసిన ప్రశ్నలను, హబక్కూకు పెట్టిన వేదనభరితమైన ఆక్రందనలను యెహోవా ఎలా పరిగణించాడో గుర్తుంచుకోండి.

18. సహాయం అవసరమైన వారిని సరిచేయడంలో పెద్దలు యెహోవాను ఎలా అనుకరించగలరు?

18 కొంతమంది తోటి క్రైస్తవులను దారికి తీసుకొని రావలసిన అవసరం ఉంటుంది. (గలతీయులు 6:1) అయినప్పటికీ, వాళ్లు యెహోవా దృష్టిలో విలువైనవారే, వారి ఆత్మగౌరవాన్ని పరిగణనలోనికి తీసుకోవలసిన అవసరం ఉంది. ఒక సాక్షి ఇలా అన్నాడు: “సలహా ఇచ్చే వ్యక్తి నా ఆత్మగౌరవానికి విలువనిస్తే, నేను ఆయనను మళ్లీ సమీపించటానికి వెనుకాడను.” తమ ఆత్మగౌరవానికి విలువనిచ్చినప్పుడు చాలామంది ప్రజలు తమకు ఇవ్వబడే సలహాకు చక్కగా ప్రతిస్పందిస్తారు. దానికి కాస్త ఎక్కవ సమయం పట్టవచ్చు, కానీ తప్పు చర్య తీసుకున్నవారు చెప్పేది వినడం, వారికి అవసరమైన సలహాను వారు సులభంగా స్వీకరించేలా చేస్తుంది. ఇశ్రాయేలీయుల పట్ల తనకున్న అభిమానాన్ని బట్టి యెహోవా వారితో మళ్లీ మళ్లీ ఎలా తర్కించాడన్న విషయాన్ని మనస్సులో ఉంచుకోండి. (2 దినవృత్తాంతములు 36:15; తీతు 3:1-2) సహాయం అవసరమైన వారికి సహానుభూతితోనూ, సానుభూతితోనూ ఉపదేశం ఇవ్వడం హృదయాన్ని కదిలిస్తుంది.—సామెతలు 17:17; ఫిలిప్పీయులు 2:2, 3; 1 పేతురు 3:8.

19. క్రైస్తవులకున్నటువంటి నమ్మకాలు లేని ప్రజలను మనం ఎలా దృష్టించాలి?

19 భవిష్యత్తులో మన ఆధ్యాత్మిక సహోదరులు కాగల వారిని కూడా మనం గౌరవించాలి. అలాంటి వారు ఇప్పుడు మన సందేశాన్ని అంగీకరించడంలో కాస్త మందకొడిగా ఉండవచ్చు, అయినప్పటికీ మనం వారితో సహనంగా ఉండాలి, మానవులుగా వారికున్న ఆత్మగౌరవాన్ని గుర్తించాలి. యెహోవా ‘ఎవరూ నశింపవలెనని యిచ్ఛయంపక, అందరూ మారుమనస్సు పొందాలని కోరుకుంటున్నాడు.’ (2 పేతురు 3:9) మనం కూడా యెహోవాలాంటి దృక్పథాన్ని కల్గివుండవద్దా? మనం ఎప్పుడూ పొరుగువారిపట్ల ప్రేమ కల్గివుంటే, మనం వారికి సాక్ష్యం ఇవ్వటానికి మార్గం సుగమమౌతుంది. అయితే ఆధ్యాత్మికంగా ప్రమాదకరం కాగల విధమైన సహవాసాల నుండి మనం దూరంగా ఉంటాము. (1 కొరింథీయులు 15:33) అయినప్పటికీ, మనలాంటి నమ్మకాలను కల్గిలేని వారిని చిన్నచూపు చూడకుండా మనం వారిపట్ల “దయ” చూపిస్తాము.—అపొస్తలుల కార్యములు 27:3.

20. యెహోవా, యేసుక్రీస్తుల మాదిరి మనం ఏమి చేయడానికి మనల్ని పురికొల్పాలి?

20 అవును, యెహోవా యేసుక్రీస్తు మనలో ప్రతి ఒక్కరినీ గౌరవానికి తగినవారిగా పరిగణిస్తారు. వాళ్లెలా ప్రవర్తిస్తారో మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకుని, ఒకరినొకరు గౌరవించుకోవడంలో వారిలాగే చొరవతీసుకుందాము. అంతేగాక “మీరందరు సహోదరులు” అని మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాటలను మనం ఎల్లప్పుడూ మనస్సులో ఉంచుకుందాము.—మత్తయి 23:8.

మీరెలా సమాధానమిస్తారు?

• తోటి ఆరాధకులను మీరెలా దృష్టించాలి?

• యెహోవా యేసుల మాదిరి ఇతరులను గౌరవించటానికి మిమ్మల్నెలా పురికొల్పుతుంది?

• భర్తలూ తల్లిదండ్రులూ ఇతరులను ఎలా గౌరవించవచ్చు?

• తోటి క్రైస్తవులను తమ సహోదరులుగా దృష్టించడం ఏ యే విధాలుగా ప్రవర్తించటానికి పెద్దలను పురికొల్పుతుంది?

[అధ్యయన ప్రశ్నలు]

[అధ్యయన ప్రశ్నలు]

[18వ పేజీలోని చిత్రం]

మీ భార్యను మెప్పుదలతో కూడిన మాటలతో ఘనపర్చండి

[18వ పేజీలోని చిత్రం]

మీ పిల్లలు చెప్పేది వినడం ద్వారా వారి ఆత్మగౌరవానికి విలువనివ్వండి

[18వ పేజీలోని చిత్రం]

సంఘసభ్యుల ఆత్మగౌరవానికి విలువనివ్వండి