కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు చూడలేని దానిని మీరు నమ్ముతారా?

మీరు చూడలేని దానిని మీరు నమ్ముతారా?

మీరు చూడలేని దానిని మీరు నమ్ముతారా?

‘నేను కంటికి కన్పించేదాన్నే నమ్ముతాను’ అని ఎవరైనా అనడం మీరు విన్నారా? అయితే అలాంటి దృక్పథం సరైనదేనా? నిజానికి, మనమందరమూ మనం చూడలేని వాటిని నమ్ముతాము.

ఉదాహరణకు, మీరు పాఠశాలలో అయస్కాంత క్షేత్ర ఉనికిని నిరూపించే ప్రయోగాన్ని చేసే ఉంటారు. ఆ ప్రయోగాన్నిలా చేయవచ్చు: ఒక కాగితం తీసుకుని దాని మీద ఇనుపరజను కాస్త చల్లండి. తర్వాత ఆ కాగితం క్రింద అయస్కాంతాన్ని పెట్టండి. ఆ తర్వాత ఆ కాగితాన్ని కదిలించినప్పుడు ఏదో మాయ జరిగినట్లు, ఆ ఇనుపరజనంతా అయస్కాంత ధ్రువాల దగ్గర జమ అయ్యి, అయస్కాంత క్షేత్ర నమూనాలా ఏర్పడుతుంది. మీరెప్పుడైనా ఈ ప్రయోగం చేసినప్పుడు అయస్కాంత క్షేత్రాన్ని చూడగలిగారా? లేదు, అయితే ఇనుపరజను మీద దాని ప్రభావాన్ని మాత్రం స్పష్టంగా చూడవచ్చు, అదే అయస్కాంత శక్తి ఉందనటానికి కచ్చితమైన నిదర్శనం.

మనం చూడలేని మరెన్నో విషయాలను మనం ఏమాత్రం సందేహించకుండానే నమ్ముతాము. ఒక అందమైన చిత్రాన్ని గానీ, ఒక చక్కని శిల్పాన్ని గానీ చూచినప్పుడు, చిత్రకారుని లేక శిల్పి యొక్క ఉనికిని సందేహించము. మరైతే, జలపాతాన్ని చూసినప్పుడు గానీ, సూర్యాస్తమయాన్ని చూసినప్పుడు గానీ, అత్యంత గొప్ప చిత్రకారుడు లేక శిల్పి అయిన దేవుని ఉనికిని గురించి కనీసం ఆలోచించమా?

కొంతమంది ఎందుకు నమ్మరు?

ఆశ్చర్యం గొలిపే విషయం ఏమిటంటే, చర్చిలో తమకు నేర్పించబడినదాన్ని బట్టీ, చాలా మంది దేవునిపై నమ్మకాన్ని కోల్పోతున్నారు. దేవుడు మండుతున్న నరకంలో దుష్టులను కాలుస్తాడని నేర్పించబడిన ఒక నార్వేజియా దేశస్థుని విషయంలో ఇది నిజమై ఉంది. ఆ వ్యక్తికి ప్రజలను ఆ విధంగా పీడించే దేవుడు ఎలాంటి దేవుడై ఉంటాడు అన్నది అర్థంకాలేదు, అతడు నాస్తికుడిగా మారాడు.

తర్వాత, ఆ వ్యక్తి యెహోవాసాక్షుల సహాయంతో బైబిలు పరిశీలించడానికి ఒప్పుకున్నాడు. దుష్టులు మండుతున్న నరకంలో హింసించబడతారన్న విషయాన్ని బైబిలు బోధించడంలేదని అతను తెలుసుకొని చాలా ఆశ్చర్యపోయాడు. మనం చనిపోతే నిద్రపోతున్నట్లే ఉంటుందని బైబిలు చెప్తుంది. సమాధిలోని వారు బాధ అనుభవించరు, వారికేమీ తెలియదు. (ప్రసంగి 9:5, 10) సరిదిద్దడం అసాధ్యమని దేవుడు ఏ దుష్టుల విషయంలోనైతే తీర్పు తీరుస్తాడో, వారు సమాధిలోనే నిరంతరం ఉండిపోతారని కూడా ఆ వ్యక్తి నేర్చుకున్నాడు. (మత్తయి 12:31, 32) దేవుని నిర్ణాయక సమయంలో మరణించిన మిగిలిన వారు పరదైసు పరిస్థితుల క్రింద నిత్యజీవము పొందే అపేక్షతో తిరిగి పునరుత్థానులౌతారు. (యోహాను 5:28, 29; 17:3) ఈ వివరణ ఆయనకు తర్కబద్ధంగా ఉన్నట్లు అన్పించింది. “దేవుడు ప్రేమాస్వరూపి,” అని బైబిలు తెలియజేసిన విషయంతో ఇది ఏకీభవిస్తుంది. (1 యోహాను 4:8) ఈ యథార్థపరుడైన వ్యక్తి దేవుని వాక్యాన్ని పఠించడం కొనసాగించి, చివరికి బైబిలులోని దేవుణ్నే ప్రేమించడం మొదలుపెట్టాడు.

కృంగుదల కారణంగా, అన్యాయం అధికమవ్వడం కారణంగా చాలామంది ప్రేమగల సృష్టికర్త ఉనికినే సందేహిస్తున్నారు. వారు, “ఈ భూమ్మీద ఇంత అన్యాయం, దుష్టత్వం ఉంటే అక్కడెక్కడో సర్వశక్తిమంతుడైన, ఉదారుడైన దేవుడున్నాడని ఎలా నమ్మగలం?” అని ఆకాశంవైపు చూపిస్తూ ప్రశ్నించిన ఒక స్వీడెన్‌ దేశస్థునితో ఏకీభవిస్తారు. అతని ప్రశ్నకు ఎవరూ సమాధానమివ్వలేకపోవడంతో అతను కూడా నాస్తికుడైపోయాడు. ఆ తర్వాత అతడు యెహోవాసాక్షులతో బైబిలు పఠించడం ప్రారంభించాడు. దేవుడు దుష్టత్వాన్ని ఎందుకు అనుమతిస్తున్నాడు అన్న అతి పురాతన ప్రశ్నకు బైబిలు సంతృప్తికరమైన సమాధానాన్నిస్తుందని అతడు తెలుసుకున్నాడు. *

దుష్టత్వం ఉండటం, దేవుడు ఉనికిలో లేడు అని నిరూపించదు అని ఈ యథార్థపరుడైన వ్యక్తి తెలుసుకున్నాడు. ఉదాహరణకు: ఒక వ్యక్తి మాంసం కోయడానికి కత్తిని తయారుచేశాడనుకుందాం. ఒక వినియోగదారుడు ఆ కత్తిని కొని దాన్ని మాంసం కోయడానికి ఉపయోగించకుండా హత్య చేయడానికి ఉపయోగించాడు. కత్తిని అలా తప్పుగా ఉపయోగించడం, దాన్ని తయారుచేసినవాని ఉనికినే ఖండించదు. అలాగే, ఈ భూమి దాని సంకల్పానికి అనుగుణ్యంగా ఉపయోగించబడటం లేదంటే దానికి సృష్టికర్త లేడు అనే నిర్థారణకు రానవసరంలేదు.

బైబిలు దేవుని కార్యము పరిపూర్ణమని బోధిస్తుంది. “ఆయన చర్యలన్నియు న్యాయములు, ఆయన నిర్దోషియై నమ్ముకొనదగిన దేవుడు.” (ద్వితీయోపదేశకాండము 32:4) దేవుడు మానవులకు మంచివరాలను ఇస్తాడు, కొన్ని వరాలను తప్పుగా ఉపయోగించడం వల్ల అవి అనేకమైన బాధలకు కారణమౌతున్నాయి. (యాకోబు 1:17) ఏదేమైనప్పటికీ దేవుడు ఈ బాధలన్నింటికీ అంతాన్ని తీసుకువస్తాడు. ఆ తర్వాత, “దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, . . . వారు దానిలో నిత్యము నివసించెదరు.”—కీర్తన 37:11, 29.

మొదట పేర్కొన్న ఆ స్వీడెన్‌ వ్యక్తి తోటి మానవుల బాధలను చూసి చలించిపోయాడు. నిజంగా, ఇతరుల పట్ల అతనికున్న చింతే దేవుడు ఉన్నాడని నిరూపిస్తుంది. అదెలా?

చాలామంది ప్రజలు దేవుని పట్ల విశ్వాసముంచనట్లైతే, వారికి ఉన్న ఒకే ఒక్క ప్రత్యామ్నాయం పరిణామ సిద్ధాంతమే. పరిణామ సిద్ధాంతవాదులు “యోగ్యతమముల సార్థకజీవనాన్ని,” అంటే మానవుల్లోను, జంతువుల్లోను తమ జీవ సంరక్షణ కొరకు తమ తమ వర్గాల్లోనే పోటి ఉంటుందనే సిద్ధాంతాన్ని బోధిస్తారు. యోగ్యులు జీవిస్తారు; అయోగ్యులు మరణిస్తారు. అది సహజ ఏర్పాటు అని వారు చెప్తారు. కానీ బలవంతుల మనుగడ కోసం బలహీనులు మరణించడం “సహజం” అయితే, ఆ స్వీడన్‌ దేశస్థునిలా, కొంతమంది బలవంతులైన మానవులు తమ తోటి మానవులు బాధలు పడుతుంటే ఎందుకు చలించిపోతారు?

దేవునిని తెలుసుకోవడం

మనం దేవునిని చూడలేము ఎందుకంటే ఆయనకు మానవ శరీరము లేదు. అయినప్పటికీ దేవుడు తనను గురించి మనం తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు. ఆయన చేసిన కార్యాలను, అంటే సృష్టి యొక్క “వర్ణ చిత్రాలు” “శిల్పాలు” లాంటి ఆయన చేసిన అసాధారణమైన హస్తకృత్యాలను మనం బాగా గమనించడం ద్వారా ఆయనను మనం బాగా తెలుసుకోవటానికిగల ఒక మార్గం. బైబిలులో రోమీయులు 1:20 నందు చెప్తున్నట్లుగా, “[దేవుని] అదృశ్యలక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి.” అవును, వర్ణ చిత్రాలను గురించి గానీ శిల్పాలను గురించి గానీ అధ్యాయనం చేస్తున్నప్పుడు ఆ చిత్రకారుని వ్యక్తిత్వాన్ని గూర్చి అంతర్దృష్టిని పొందవచ్చు, అలాగే దేవుడు చేసిన అద్భుతమైన పనులను గూర్చి అధ్యయనం చేయడం ఆయన వ్యక్తిత్వాన్ని గూర్చి పూర్తిగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది.

అయితే, కేవలం దేవుని సృష్టిని చూస్తూ మాత్రమే జీవితంలోని అనేక ప్రశ్నలకు మనం సమాధానమివ్వలేము. కానీ అలాంటి ప్రశ్నలకు దేవుని వాక్యమైన బైబిలులో వెదకడం ద్వారా సమాధానాన్ని కనుగొనవచ్చు. మొదట పేర్కొన్న ఇద్దరు వ్యక్తులు విశాల హృదయంతో బైబిలును చదవడం ద్వారా దేవుడు ఉన్నాడనీ మనకేం జరుగుతుందన్న విషయంలో ఆయన శ్రద్ధకలిగివున్నాడనీ ముగింపుకు వచ్చారు.

[అధస్సూచి]

^ పేరా 8 దేవుడు దుష్టత్వాన్ని అనుమతిస్తున్నాడు అనడానికి గల కారణాలపై అదనపు సమాచారము కొరకు వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ప్రచురించిన మీ పట్ల శ్రద్ధగల సృష్టికర్త ఉన్నాడా? (ఆంగ్లం) అనే పుస్తకంలో 10వ అధ్యాయాన్ని దయచేసి చూడండి.

[28వ పేజీలోని చిత్రసౌజన్యం]

J. Hester and P. Scowen (AZ State Univ.), NASA