కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

రాబిన్‌సన్‌ క్రూసో దీవిలో ఇవ్వబడుతూన్న సహాయం

రాబిన్‌సన్‌ క్రూసో దీవిలో ఇవ్వబడుతూన్న సహాయం

రాబిన్‌సన్‌ క్రూసో దీవిలో ఇవ్వబడుతూన్న సహాయం

పసిఫిక్‌ మహాసముద్రంలో, ఉన్న మూడు దీవుల సముదాయంలో రాబిన్‌సన్‌ క్రూసో ఒకటి. ఈ మూడు దీవులను కలిపి హ్వాన్‌ ఫెర్నాండస్‌ అని అంటారు. అది చిలీ సముద్ర తీరానికి దాదాపు 640 కిలోమీటర్ల దూరంలో ఉంది. 93 చదరపు కిలోమీటర్ల వైశాల్యమున్న ఆ దీవికి, 18వ శతాబ్దపు ప్రసిద్ధిగాంచిన నవల పేరు ఇవ్వబడింది. * ఆ నవల పేరు రాబిన్‌సన్‌ క్రూసో. ఆ నవలని ఆంగ్ల రచయితయైన డాన్యెల్‌ డిఫో వ్రాశారు. ఆ నవల ముఖ్యంగా, ఆ దీవిపై దాదాపు నాలుగు సంవత్సరాలు ఒంటరిగా జీవించిన అలెగ్జాండర్‌ సెల్కర్క్‌ అనే స్కోట్‌లాండ్‌ దేశస్థుడు చేసిన సాహస కృత్యాల ఆధారంగా వ్రాయబడినట్లు స్పష్టమౌతుంది.

ఆ దీవి మీద ఉన్న కొయ్య బోర్డు మీద వ్రాయబడిన మాటల్లో కొంత భాగం ఇలా ఉంది: “స్కోట్‌లాండ్‌ నావికుడైన అలెగ్జాండర్‌ సెల్కర్క్‌, ఒంటరి జీవితం (ఆ దీవి) నుండి బయటపడేందుకు తనకు సహాయపడే రెస్క్యూ బోట్‌ కోసం కనుచూపు మేరకు సముద్రాన్ని నాలుగేండ్ల పాటు ప్రతిరోజూ ఆరాటంగా చూసింది ఈ ప్రాంతం నుండే.” చివరికి, సెల్కర్క్‌ అక్కడి నుండి బయటపడేందుకు సహాయం దొరికింది. ఆయనను ఆయన దేశానికి తీసుకువెళ్ళారు. తనదైన చిన్న పరదైసులో (ఆ దీవిలో) జీవించిన తర్వాత, తన స్వదేశంలో జీవించడం ఆయనకెంత మాత్రమూ సంతృప్తికరంగా అనిపించలేదు. “నా ప్రియమైన దీవీ ! నేను నిన్ను వదిలి రాకుండా ఉంటే ఎంత బాగుండు!” అని ఆయన తర్వాత అన్నట్లు నివేదించబడుతోంది.

ఒకప్పుడు సెల్కర్క్‌కు తెలిసిన పరదైసును పోలిన దీవి కొంత కాలం గడిచిన తర్వాత, శిక్షా కాలనీగా ఉపయోగించబడింది. క్యాథలిక్‌ చర్చికి వ్యతిరేకంగా, “విశ్వాస సంబంధ నేరాలను” చేసినవారిని అక్కడ ఉంచేవారు. నిజంగా ఎంత మార్పు ! అయితే, నేడు, ఈ దీవిలో నివసిస్తున్నవాళ్ళు, ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లోనివాళ్ళు ఎరుగని శాంతియుతమైన ప్రశాంతమైన వాతావరణాన్ని అనుభవిస్తున్నారు. అనేక దీవుల్లోలాగే ఇక్కడి జీవన శైలి కూడా చీకూ చింతా లేనిదే కనుక, అక్కడ ఉన్న ఎవరితోనైనా సంభాషణను ప్రారంభించడం చాలా సులభం.

రాబిన్‌సన్‌ క్రూసోలో నివాసుల మొత్తం సంఖ్య అయిదు వందలు. కానీ సంవత్సరంలో ఎక్కువ భాగం దాదాపు నాలుగు వందల మంది మాత్రమే ఈ దీవిలో నివసిస్తారు. అందుకు ఒక కారణమేమిటంటే, పిల్లల చదువు కోసం, తల్లులూ పిల్లలూ చిలీలోని ప్రధాన భూభాగంలో నివసిస్తారు. వాళ్ళు తమ దీవికి తిరిగి వచ్చి తమ కుటుంబ సభ్యులతో పాటు గడిపేది స్కూల్‌కి సెలవులు ఇచ్చిన నెలల్లో మాత్రమే.

రాబిన్‌సన్‌ క్రూసో చుట్టుప్రక్కల ప్రాంతాలు నందనవనంలా ఎంతో మనోహరంగా ఉన్నప్పటికీ, ఆ దీవిలోని కొందరు నివాసులు తమకు ఆధ్యాత్మిక లేమి ఉన్నట్లు భావిస్తారు. వాళ్ళు తమ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. తమకు ఆధ్యాత్మిక సహాయం అవసరమున్నట్లు మరి కొందరు భావిస్తారు.

ఆధ్యాత్మిక సహాయం

ఆధ్యాత్మికంగా సహాయపడే పని 1979 లో అక్కడ ప్రారంభమైంది. చిలీలోని సాంటియాగోలో యెహోవాసాక్షులతో బైబిలును అధ్యయనం చేస్తున్న ఒక స్త్రీ ఈ దీవికి తరలి వచ్చి, తాను నేర్చుకున్న విషయాలను ఇతరులతో పంచుకోనారంభించింది. కొంత కాలం తర్వాత, ఉద్యోగరీత్యా ఆ దీవిని సందర్శించిన ఒక సంఘ పెద్ద, అక్కడ ఆ స్త్రీ సహాయంతో ఆధ్యాత్మికంగా అభివృద్ధిని సాధిస్తున్న బైబిలు విద్యార్థుల చిన్న గుంపు ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. ఆ పెద్ద, మూడు నెలల తర్వాత ఆ దీవిని తిరిగి సందర్శించినప్పుడు, ఒంటరిగా ఉన్న బైబిలు ఉపాధ్యాయురాలూ, ఆమె విద్యార్థినులిద్దరూ బాప్తిస్మానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకు ఆయన బాప్తిస్మమిచ్చాడు. క్రొత్తగా బాప్తిస్మం తీసుకున్న ఈ క్రైస్తవులలో ఒకరు తర్వాత పెళ్ళి చేసుకున్నారు. ఆధ్యాత్మిక సహాయం అవసరమున్న ఇతరులను కనుగొనే పనిలో ఆమె తన భర్తతో పాటు కొనసాగారు. ఒక చిన్న రాజ్యమందిరాన్ని నిర్మించడంలో ఆమె భర్త నేతృత్వం వహించారు. ఆ దీవిలోని ఆ చిన్న గుంపు ఆ రాజ్యమందిరంలోనే ఇప్పటికీ కూటాలను జరుపుకుంటోంది. కొంత కాలం తర్వాత, కొన్ని ఆర్థిక కారణాల మూలంగా, ఆ దంపతులు రాబిన్‌సన్‌ క్రూసోను వదిలిపెట్టి, మధ్య చిలీలోని ఒక సంఘానికి తరలివెళ్ళారు, యెహోవాకు సేవ చేయడంలో అక్కడ చురుగ్గా కొనసాగుతున్నారు.

ఆ దీవిలోని ఇతరులు అబద్ధ మతం నుండి బయటికి వచ్చేందుకు సహాయాన్ని పొందడం మొదలుపెట్టడంతో ఆ చిన్న గుంపు నెమ్మదిగా పెరగనారంభించింది. అయినప్పటికీ, పిల్లలు తమ హైస్కూల్‌ చదువు కోసం, చిలీ ప్రధాన భూభాగానికి తరలి వెళ్ళడం తప్పనిసరి కనుక, వాళ్ళు అలా వెళ్ళినప్పుడు ఆ గుంపులో బాప్తిస్మం తీసుకున్న ఇద్దరు సహోదరీలూ, ఒక చిన్న అమ్మాయీ మాత్రమే ఉంటారు. బడి సెలవుల కాలంలో, కొందరు తల్లులు ఆ దీవికి తిరిగి వచ్చినప్పుడు ఆ గుంపు పెరుగుతుంది. సంవత్సరమంతా ఒంటరిగా ఉండే ఆ ముగ్గురికి వాళ్ళ రాక నూతన ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈ సహోదరీలు ఎంతో శ్రద్ధగా పరిచర్య చేయడం వల్ల, రాబిన్‌సన్‌ క్రూసో నివాసులకు యెహోవాసాక్షులు బాగా తెలుసు. నిజమే, ఆ దీవిలోని కొందరు వాళ్ళ పనిని వ్యతిరేకిస్తూ, రాజ్య సువార్తను నిరాకరించమని ఇతరులను కూడా ఒత్తిడి చేస్తున్నారు. వాళ్ళు అలా చేస్తున్నప్పటికీ, నిష్కపటమైన హృదయాల్లో నాటబడిన బైబిలు సత్యపు విత్తనాలు మొలకెత్తడం మాత్రం జరుగుతూనే ఉంది.

ఆధ్యాత్మిక సహాయం పొందినవారిని మరింత బలపరచడం

ప్రయాణ పైవిచారణకర్త ఈ దీవిని సంవత్సరానికి ఒకసారి సందర్శిస్తూ ఉంటారు. సుదూరాన ఉన్న దీవిలో ఉన్న వ్రేళ్ళమీద లెక్కబెట్టగలిగినంత మంది సాక్షులను సందర్శిస్తే ఎలా ఉంటుంది? ఒక ప్రాంతీయ పైవిచారణకర్త, రాబిన్‌సన్‌ క్రూసోను మొదటిసారి సందర్శించినప్పటి తన అనుభవాన్ని గురించి ఏమని చెప్పారో చూద్దాం.

“అక్కడికి వెళ్ళాలన్న నా కల అలా నిజమైంది. మేము సాంటియాగోలో ఉన్న సెరీయోస్‌ ఏర్‌పోర్ట్‌కు వెళ్ళేందుకు వాల్‌పారైసో నుండి ఉదయం 7 గంటలకు బయలుదేరాం. ఏడుగురు ప్రయాణికుల చిన్న విమానాన్ని ఎక్కాము. రెండు గంటల 45 నిమిషాలు ప్రయాణం చేసి అక్కడికి చేరుకున్నప్పుడు, దూరాన ఒక పర్వత శిఖరం మేఘాల కన్నా ఎత్తుగా నిలబడి ఉండడం చూశాం. మేము దగ్గరికి వస్తున్న కొలది, ఆ దీవి—సముద్ర మధ్య భాగంలో ఎంతో ఆకర్షణీయమైన పర్వత సముదాయం—కనిపించనారంభించింది. అది సముద్రంలో చిక్కుకుపోయిన ఒక పడవలాగా నీటిలో తేలుతున్నట్లుగా కనిపించింది.

“మేము అక్కడ దిగిన తర్వాత, ఒక పడవలో ఆ గ్రామానికి వెళ్ళాం. అక్కడక్కడ సముద్రం నుండి పైకి వచ్చిన బండల సముదాయమే తర్వాత చిన్న దీవుల్లాగా రూపొందుతాయి. వాటి మీద హ్వాన్‌ ఫెర్నాండస్‌ ఫర్‌ సీల్‌లు విశ్రాంతి తీసుకుంటాయి. ఫర్‌ సీల్‌లు అంతరించిపోతున్నాయి కనుక వాటికి ప్రత్యేక సంరక్షణనిస్తున్నారు. మేము పడవలో వెళ్తుండగా పడవ ప్రక్కన అకస్మాత్తుగా ఏదో పైకి వచ్చి అంతలోనే, తిరిగి సముద్రంలోకి వెళ్ళిపోయింది. అది ఫ్లైయింగ్‌ ఫిష్‌ (ఒక రకం చేప). మడుచుకుని ఉన్న దాని వాజాలు రెక్కల్లా ఉంటాయి. అది కీటకాలను వేటాడుతూ నీటిపైకి ఎగరడంలో ఆనందిస్తున్నట్లు కనిపించింది. నిజమే కొన్నిసార్లు, అది ఇతర కీటకాలను వేటాడే ప్రయత్నంలో ఇతర జీవుల నోట పడుతుంది. అది ఎగురుతున్నప్పుడు, దాన్ని భక్షించే జీవుల అవధానం దాని మీద పడుతుంది. అది తిరిగి సముద్రంలోకి దిగేటప్పుడు దాన్ని మ్రింగేందుకు అవి సిద్ధంగా ఉంటాయి.

“చివరికి, మేము సాన్‌ హ్వాన్‌ బావ్‌టీస్టా (సెయింట్‌ జాన్‌ ద బాప్టిస్ట్‌) అనే గ్రామానికి చేరుకున్నాం. రేవు దగ్గర కొందరు నిలబడి ఉన్నారు. వాళ్ళలో కొందరు తమను సందర్శించేవారి కోసం నిలబడితే, మరి కొందరు ఈ వేళలో ఎవరు వస్తున్నారో చూద్దామనే జిజ్ఞాసతో నిలబడి ఉన్నారు. అక్కడ కనిపించిన మనోహరమైన దృశ్యానికి మేమెంతో ముగ్ధులమయ్యాం. ఎగుడుదిగుడుగా ఉండి ఠీవిగా నిలబడివున్న ఎల్‌ యూన్‌కే (ద అన్విల్‌) పర్వత శిఖరం ముదురు పచ్చ రంగు తివాచీతో కప్పబడినట్లుంది. దాని వెనక, ఆకాశం నిర్మలంగా నీలిరంగులో ఉంది. తెల్లని మేఘాలు దానికి బార్డర్‌లాగా కనిపించాయి.

“ఓడ రేవు మీద, మన క్రైస్తవ సహోదరీలూ వాళ్ళ పిల్లలూ మా కోసం ఎదురు చూస్తూ నిలబడి ఉండడాన్ని మేము వెంటనే చూశాం. అవి సెలవు రోజులు కనుక, ఆ గుంపు మామూలు కన్నా పెద్దగా ఉంది. ఒకళ్ళనొకళ్ళం ఆప్యాయంగా పలకరించుకున్న తర్వాత, ఆకర్షణీయమైన క్యాబిన్‌కి అంటే, ఆ వారానికి మా కోసం తయారు చేసిన విడిదికి మమ్మల్ని తీసుకువెళ్ళారు.

“అది నిజంగా చాలా విశిష్టమైన వారం. ఆ వారం చాలా త్వరగా గడిచిపోతోందని గ్రహించాం. మేము మా సమయాన్ని సద్వినియోగం చేసుకోవలసిన అవసరం ఉంది. ఆ రోజే, మధ్యాహ్నం భోజనాలైన తర్వాత, మేము ఒక బైబిలు విద్యార్థిని దగ్గరికి వెళ్ళాం. ఆమె త్వరలోనే మన ఆధ్యాత్మిక సహోదరీగా, దేవుని ఆధ్యాత్మిక పరదైసులో భాగంగా కానుంది. ఆనందంతో ఆమె ముఖం వెలిగిపోతోంది, కాస్త భయం కూడా ఆ ముఖంలో కనిపిస్తుంది. బాప్తిస్మం తీసుకోవాలని ఎంతో కాలంగా ఆమె ఎదురు చూస్తోంది, ఆ లక్ష్యం త్వరలోనే నిజం కాబోతోంది. ఆమె సువార్త ప్రచారకురాలిగా యోగ్యురాలయ్యేందుకు అవసరమైన సమాచారాన్ని మేము ఆమెతోపాటు పరిశీలించాము. ఆ మరుసటి రోజే, ఆమె మొదటిసారిగా ప్రకటన పనిలో పాల్గొంది. మూడవ రోజు, బాప్తిస్మం తీసుకునేందుకు ఆవశ్యకమైనవాటిని గురించి ఆమెతో చర్చించడం మొదలుపెట్టాం. ఆ వారంలోనే ఆమె బాప్తిస్మం పొందింది.

“ఆ వారంలో జరిగిన కూటాలకు మంచి మద్దతు లభించింది. మొత్తం 14 మంది హాజరయ్యారు. ప్రతి రోజూ, క్షేత్ర సేవకూ, పునర్దర్శనాలకూ, బైబిలు అధ్యయనాలకూ, కాపరి సందర్శనాలు చేయడానికీ ఏర్పాట్లు చేయబడ్డాయి. సంవత్సరమంతా తమంతట తామే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని జరుపుకునే ఆ సహోదరీలకు ఎంతటి ప్రోత్సహమది!” అని ఆ ప్రాంతీయ పైవిచారణకర్త అన్నారు.

సత్యానికి స్పందించడం ఆ దీవిలోని మగవాళ్ళకు చాలా కష్టంగా ఉంది. బహుశా, దీనికి కారణం తమ పనుల్లో తాము ఎంతో శ్రమపడవలసి రావడమే కావచ్చు. వాళ్ళ ముఖ్య వృత్తి పీతలను పట్టుకోవడం. దానికి ఎంతో అంకిత భావంతో పనిచేయవలసి ఉంటుంది. అనేకులు ప్రతికూలంగా స్పందించడానికి సాక్షుల మీద అకారణంగా ఉన్న చెడ్డ అభిప్రాయమే మరొక కారణం. అయినప్పటికీ, ఈ దీవిలోని మరెక్కువ మంది స్త్రీలూ పురుషులూ భవిష్యత్తులో అనుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాం.

ఇప్పటి వరకు, ఆ దీవిలో పది మంది సత్యాన్ని గురించి, యెహోవా దేవుని ఉద్దేశాల గురించీ తెలుసుకుని ఆధ్యాత్మిక సహాయాన్ని పొందారు. వారిలో కొందరు, అనేక కారణాల వల్ల ఆ దీవి నుండి మరో చోటికి వెళ్ళిపోయారు. ఆ దీవిలోనే ఉన్నా, లేకపోయినా, అలెగ్జాండర్‌ సెల్కర్క్‌ పొందిన సహాయాని కన్నా వాళ్ళు పొందిన ఆధ్యాత్మిక సహాయం ఎంతో మేలైనదని నిరూపించబడింది. ఇప్పుడు వాళ్ళెక్కడ నివసించినా ఆధ్యాత్మిక పరదైసును అనుభవిస్తున్నారు. ఆ దీవిలోనే ఇప్పటికీ నివసిస్తున్న సహోదరీలూ, వాళ్ళ పిల్లలూ పరదైసులాంటి పరిసరాలను అనుభవిస్తున్నారు. అయితే అంత కన్నా ఎక్కువగా, భూమ్యంతా కూడా అన్ని విధాల్లోను నిజమైన పరదైసుగా మారే సమయంలో జీవించే నిరీక్షణ వాళ్ళకుంది.

ఆధ్యాత్మిక సహాయ కార్యక్రమం కొనసాగుతోంది

భౌగోళికంగా చెప్పాలంటే, రాబిన్‌సన్‌ క్రూసోలో ఉన్న యెహోవాసాక్షుల ఈ చిన్న గుంపు మిగతా ఆధ్యాత్మిక సహోదర సహోదరీలకు చాలా దూరంగా నివసిస్తోంది. అయినప్పటికీ, స్కాట్‌లాండ్‌ దేశస్థుడైన సెల్కర్క్‌లాగ, ఉపేక్షించబడినట్లు వాళ్ళు భావించరు. వాళ్ళకు వాచ్‌టవర్‌ సొసైటీవారి చిలీ బ్రాంచ్‌ నుండి ఎడతెగక దైవపరిపాలనా సాహిత్యమూ ఎడతెగక అందుతున్నాయి కనుక, సంవత్సరానికి మూడు సార్లు అసెంబ్లీల కన్‌వెన్షన్‌ల వీడియోలూ అందుతున్నాయి కాబట్టి వాళ్ళు యెహోవా సంస్థతో సన్నిహిత సంబంధాన్ని అనుభవిస్తున్నారు. ‘లోకమందున్న సహోదరుల’ సహవాసంలో వాళ్ళు చురుకుగా పాలు పంచుకోవడంలో కొనసాగుతున్నారు.—1 పేతురు 5:9.

[అధస్సూచి]

^ పేరా 1 ఆ దీవికున్న ఆధికారిక పేరు మాస్‌ ఆ టైరా.

[9వ పేజీలోని మ్యాపులు/చిత్రం]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

చిలీ

సాంటియాగో

రాబిన్‌సన్‌ క్రూసో దీవి

సాన్‌ హ్వాన్‌ బావ్‌టీస్టా

ఎల్‌ యూన్‌కే

పసిఫిక్‌ మహా సముద్రం

సాంటా క్లారా దీవి

[చిత్రం]

ఈ మహా సముద్రపు మధ్య భాగంలో ఈ దీవి ముగ్ధమనోహరమైన పర్వత సముదాయంలా కనపిస్తుంది.

[చిత్రసౌజన్యం]

చిలీ మ్యాప్‌: Mountain High Maps® Copyright © 1997 Digital Wisdom, Inc.

[8, 9వ పేజీలోని చిత్రం]

ఎగుడుదిగుడుగా ఉండి ఠీవిగా కనిపిస్తున్న ఎల్‌ యూన్‌కే (ద అన్విల్‌) పర్వతం

[9వ పేజీలోని చిత్రం]

సాన్‌ హ్వాన్‌ బావ్‌టీస్టా (సెయింట్‌ జాన్‌ దబాప్టిస్ట్‌) అనే గ్రామం

[9వ పేజీలోని చిత్రం]

చిన్న దీవులు, హ్వాన్‌ ఫెర్నాండస్‌ ఫర్‌ సీల్‌లకు సీ లయన్‌లకు విశ్రాంతి స్థలాలు

[10వ పేజీలోని చిత్రం]

మేము చిలీలోని సాంటియాగో నుండి చిన్న విమానంలో వచ్చాము

[10వ పేజీలోని చిత్రం]

రాబిన్‌సన్‌ క్రూసో దీవి యొక్క ఎగుడుదిగుడుగా ఉన్న తీర ప్రాంతం

[10వ పేజీలోని చిత్రం]

ఈ దీవిలోని ఒక చిన్న రాజ్యమందిరం