కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఎందుకు క్షమించేవారమై ఉండాలి?

ఎందుకు క్షమించేవారమై ఉండాలి?

ఎందుకు క్షమించేవారమై ఉండాలి?

“సైంటిస్టులు చేస్తున్న పరిశోధనలు, క్షమాగుణం కలిగివుండడం భావోద్రేకపరమైన ఆరోగ్యాన్నీ, బహుశ శారీరక ఆరోగ్యాన్నీ కూడా మెరుగుపరచగలదని చూపిస్తున్నాయి” అని కెనడాలోని ద టొరొంటో స్టార్‌ పత్రిక నివేదిస్తుంది. అయితే, “క్షమాపణ అంటే ఏమిటో అసలు అదెలా పనిచేస్తుందో చాలా తక్కువమందికి తెలుసు” అని అమెరికాలోని స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ కార్ల్‌ థోరెసెన్‌ అంటున్నాడు, ఆయన స్టాన్‌ఫర్డ్‌ ఫర్‌గివ్‌నెస్‌ ప్రాజెక్ట్‌కు అధ్యక్షునిగా ఉన్నాడు.

కానీ, నిజమైన క్షమాగుణం క్రైస్తవత్వంలోని ఒక కీలకమైన అంశంగా పరిగణింపబడుతుంది. “మీపట్ల ఒకరు తప్పుచేశారని గ్రహించినా, మీలో కలిగే ఉక్రోషాన్ని పూర్తిగా తీసివేసుకుని, అలా తప్పుచేసిన వ్యక్తిపట్ల కనికరాన్నీ ప్రేమనూ కనబర్చడం” అని ద టొరొంటో స్టార్‌ పత్రికలోని నివేదిక ఈ గుణాన్ని నిర్వచిస్తుంది. ఈ గుణాన్ని ప్రదర్శించడం అంటే అర్థం, ఒకరి తప్పిదాన్ని చూసీచూడనట్లు ఊరుకోవడం, దాన్ని మన్నించేయడం, మర్చిపోవడం, లేదా అసలు తప్పిదమే జరగలేదని తోసిపుచ్చడం కాదు; అలాగే, మీపట్ల మళ్ళీ తప్పిదం చేసే స్థితిలో మిమ్మల్ని మీరు ఉంచుకోవడమూ కాదు. నిజమైన క్షమాపణకు “కోపాన్నీ, ప్రతికూల భావాల్నీ వదిలిపెట్టడం” కీలకమని ఆ నివేదిక చెబుతుంది.

క్షమించడం మూలంగా శరీరానికి కలిగే ప్రయోజనాల్ని గురించి మరింత అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని పరిశోధకులు అంటున్నారు. అయితే, ఇప్పటికే జరిగిన పరిశోధనా ఫలితాల ప్రకారం “మానసిక ఒత్తిడి, ఎక్కువగా చింతించడం, క్రుంగుదలకు గురికావడం వంటివి తగ్గాయనీ” అంటే మానసిక ప్రయోజనాలు మాత్రం కన్పిస్తున్నాయనీ, వారు నివేదిస్తున్నారు.

క్షమాగుణాన్ని ప్రదర్శించటానికిగల ఒక గొప్ప కారణం, ఎఫెసీయులు 4:32 లో వ్యక్తం చేయబడింది, అక్కడిలా ఉంది: “ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి.” (ఇటాలిక్కులు మావి.) క్షమాగుణం విషయానికొచ్చే సరికి, ఇంకా ఇతర విషయాల్లోలానే, దేవుణ్ని పోలి నడుచుకోవాలని మనకు ఉద్బోధించబడుతుంది.—ఎఫెసీయులు 5:1.

కొన్ని సందర్భాల్లో, తప్పుచేసిన వారిపట్ల కనికరం చూపించటానికి తగినంత ఆధారమున్నా వారిని క్షమించటానికి మనం నిరాకరిస్తే దేవునితో మనకుగల సంబంధమే ప్రమాదంలో పడుతుంది. మనం ఒకరినొకరం క్షమించుకుంటామని యెహోవా ఎదురుచూస్తున్నాడు. మనం అలా క్షమించుకుంటేనే, యెహోవా మనల్ని క్షమించాలని ప్రార్థించగల్గుతాము.—మత్తయి 6:14; మార్కు 11:25; 1 యోహాను 4:11.