కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

క్రైస్తవ కాపరులారా, ‘మీ హృదయాలను విశాలపర్చుకోండి’!

క్రైస్తవ కాపరులారా, ‘మీ హృదయాలను విశాలపర్చుకోండి’!

క్రైస్తవ కాపరులారా, ‘మీ హృదయాలను విశాలపర్చుకోండి’!

“యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు.” దావీదు తన దేవునిపై తనకున్న సంపూర్ణ నమ్మకాన్ని ఆ మాటల్లో వ్యక్తం చేశాడు. ఆధ్యాత్మిక భావంలో, యెహోవా ఆయన్ను “పచ్చికగల చోట్ల”కు “శాంతికరమైన జలములయొద్ద”కు నడిపించాడు, ఆయన్ను “నీతిమార్గములలో” ప్రవేశపెట్టాడు. వ్యతిరేకులు దావీదును చుట్టుముట్టినప్పుడు ఆయన మద్దతును ప్రోత్సాహాన్నీ పొందాడు గనుకనే ఆయన, “ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడైయుందువు” అని యెహోవాతో చెప్పగలిగాడు. అటువంటి మహోన్నతమైన కాపరి తనకు ఉన్నందునే, దావీదు “చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసెదను” అని నిశ్చయంగా చెప్పాడు.—కీర్తన 23:1-6.

దేవుని ఏకైక కుమారుడు కూడా యెహోవా యొక్క ప్రేమపూర్వకమైన కాపుదలను అనుభవపూర్వకంగా చవిచూశాడు, అందుకనే తాను భూమ్మీద ఉన్నప్పుడు తన శిష్యులతో వ్యవహరించిన విధానంలో తాను పొందిన ఆ కాపుదలను పరిపూర్ణంగా ప్రతిబింబించాడు. ఆ కారణం మూలంగానే లేఖనాలు ఆయన్ను “మంచి కాపరి” అని, “గొప్ప కాపరి” అని, “ప్రధాన కాపరి” అని పిలుస్తున్నాయి.—యోహాను 10:11; హెబ్రీయులు 13:20; 1 పేతురు 5:2-4.

యెహోవా, యేసుక్రీస్తు, తమను ప్రేమించే వారందరికీ కాపుదలను అందజేస్తునే ఉంటారు. వారి కాపుదలలో కొంతభాగాన్ని, సంఘంలో వారు ఏర్పాటు చేసిన ఉపకాపరుల ద్వారా మనం అనుభవిస్తుంటాము. పౌలు, “దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి” అని అన్నప్పుడు ఆయన అటువంటి ఉపకాపరులనే సంబోధిస్తున్నాడు.—అపొస్తలుల కార్యములు 20:28.

యెహోవా, క్రీస్తుయేసు, ఉంచిన మాదిరికి అనుగుణ్యంగా మందను కాయటం సులభమైన పనికాదు, అయితే అది మునుపెన్నటికన్నా ఇప్పుడు మరి ప్రాముఖ్యం. కేవలం గత మూడు సంవత్సరాల్లో బాప్తిస్మం పొందిన దాదాపు పది లక్షలమంది సాక్షులను గురించి ఒక్కసారి ఆలోచించండి ! ఎన్నో సంవత్సరాలపాటు క్రైస్తవ కార్యకలాపాల్లో పాల్గొన్నవారికి ఉండే ఆధ్యాత్మిక నేపథ్యం అటువంటి క్రొత్తవారికి ఉండదు. చిన్నపిల్లలు లేదా యౌవనస్థులు అయిన సాక్షుల గురించి కూడా ఒక్కసారి ఆలోచించండి. వారికి కూడా తమ తల్లిదండ్రుల నుండి మాత్రమే కాక సంఘంలోని ఉపకాపరుల నుండి కూడా శ్రద్ధ అవసరమౌతుంది.

నిజానికి చెప్పాలంటే, ప్రతి క్రైస్తవుడు అన్ని వైపుల నుండి ఒత్తిడికి గురౌతాడు. తోటివారి నుండి వచ్చే ఒత్తిడి వీటిలో ఒకటి మాత్రమే. ఈ లోకం తనను తాను సంతృప్తిపర్చుకోవటానికి విశృంఖలంగా ప్రవర్తిస్తుంది. దాని బలమైన ఆకర్షణను క్రైస్తవులైన ప్రతి ఒక్కరూ తట్టుకోవాలి. తమ సందేశానికి ప్రజలు అంతగా ప్రతిస్పందించకపోవడంతో కొన్ని దేశాల్లోని రాజ్య ప్రచారకులు నిరుత్సాహానికి గురౌతుండవచ్చు. ఇంకా, అనేకమంది ప్రచారకులకు గంభీరమైన ఆరోగ్య సమస్యలున్నాయి. కొంతమంది ప్రచారకులకున్న ఆర్థిక సమస్యలు, రాజ్యాన్ని మొదట వెదకాలన్న వారి ఉత్సాహంపై నీళ్ళు గుమ్మరిస్తుంటాయి. నిజం చెప్పాలంటే, సత్యంలో ఎంతోకాలంగా ఉన్నవారితోసహా మనందరికీ ప్రేమపూర్వకమైన కాపరుల సహాయం అవసరము, అందుకు మనం అర్హులము.

సరియైన ప్రేరణ

“మీ హృదయములను విశాలపరచుకొనుడి” అని మొదటి శతాబ్దపు క్రైస్తవులకు ఉద్బోధించబడింది. (2 కొరింథీయులు 6:11-13) తమ కాపరి విధులను నిర్వర్తించడంలో క్రైస్తవ పెద్దలు ఈ సలహాను పాటించడం ఎంతో మంచిది. వారలా ఎలా చేయగలరు? అంతేగాక, భవిష్యత్తులో కాపరులుగా కానున్న అనేకమంది పరిచర్యా సేవకుల సంగతి ఏమిటి?

క్రైస్తవ పెద్దలు మందకు ఆశీర్వాదంగా ఉండాలంటే, వారికి అది తమ విద్యుక్తధర్మమన్న భావన ఉండడమే సరిపోదు. వారికిలా సలహా ఇవ్వబడింది: “బలిమిచేత కాక దేవుని చిత్తప్రకారము ఇష్టపూర్వకముగాను, దుర్లాభాపేక్షతో కాక సిద్ధమనస్సుతోను, మీ మధ్యనున్న దేవుని మందను పైవిచారణచేయుచు దానిని కాయుడి.” (ఇటాలిక్కులు మావి.) (1 పేతురు 5:2) దీన్నిబట్టి చూస్తే, మందను ప్రభావవంతంగా కాయటానికి ఇతరులకు సేవ చేయాలన్న ఇష్టత, సిద్ధమనస్సు అవసరమని స్పష్టమౌతుంది. (యోహాను 21:15-17) అందుకు గొఱ్ఱెల అవసరాల్ని గుర్తించి, వాటికి వెంటనే ప్రతిస్పందించడం అవసరం అని దానర్థం. అంటే, ఇతరులతో వ్యవహరించేటప్పుడు దేవుని ఆత్మ ఫలాలని పిలువబడే చక్కని క్రైస్తవ లక్షణాలను ప్రదర్శించడమే.—గలతీయులు 5:22, 23.

కాపరిపనిలో సహోదరులను కొన్నిసార్లు వారి ఇండ్లవద్ద సందర్శించడం కూడా ఇమిడివుంది. * కానీ, ‘తమ హృదయాలను విశాలపర్చుకునే’ కాపరులు తమను తాము వ్యయపర్చుకుంటారు. అంటే, అప్పుడప్పుడు కాపరి సందర్శనాలు చేయటానికి మాత్రమే తమను తాము పరిమితం చేసుకోరు. వారు మందలోని ప్రతి ఒక్కరిని కాయటానికిగల ప్రతి అవకాశాన్నీ ఉపయోగించుకుంటారు.

కాపరులయ్యేందుకు ఇతరులకు శిక్షణ

‘అధ్యక్షపదవిని ఆశించే’ ఏ సహోదరుడైనా ‘దొడ్డపనిని అపేక్షిస్తున్నట్లే,’ ఇందుకు వయస్సుతో నిమిత్తం లేదు. (1 తిమోతి 3:1) అనేకమంది పరిచర్యా సేవకులు అదనపు ఆధిక్యతల కోసం ముందుకు రావడం ద్వారా తమ ఇష్టతను కనపర్చారు. అందుకని, ఇష్టపూర్వకంగా ముందుకు వచ్చే ఈ సహోదరులు ‘అధ్యక్షపదవిని’ చేరుకోవడానికి పెద్దలు ఆనందంగా సహాయం చేస్తారు. మంచి కాపరులుగా తయారయ్యేందుకు వారికి శిక్షణ ఇవ్వడమే ఆ సహాయం.

క్రైస్తవ సంఘం యెహోవా యొక్క ఉన్నతమైన ప్రమాణాలకు అంటిపెట్టుకుని ఉండడం మూలంగా, యెహెజ్కేలు 34:2-6 లో చెప్పబడిన అబద్ధ కాపరుల వల్ల అది బలహీనం కాలేదు. వారు యెహోవా దృష్టిలో హేయులు, ఆయన దృష్టిలో ఈ హీనస్థితి వారికి తగినదే. వారు మందను మేపడానికి బదులు తమ కడుపులు నింపుకున్నారు. వారు బలహీనమైనవారిని బలపరచలేదు, రోగముగలవారిని స్వస్థపరచలేదు, గాయపడినవారికి కట్టుకట్టలేదు, లేదా తోలివేసినవారిని అంటే దారితప్పినవారిని వారు దారికి తీసుకొనిరాలేదు. కాపరుల్లాకాక వారు తోడేళ్ళలా ప్రవర్తిస్తూ గొఱ్ఱెలపై ఆధిపత్యం వహించి వారిని అణగద్రొక్కారు. నిరాదరణకు గురైన గొఱ్ఱెలు, దారీతెన్నూ లేక, చేరదీసేవారెవరూ కనబడక చెదిరిపోయాయి.—యిర్మీయా 23:1, 2; నహూము 3:18; మత్తయి 9:36.

విశ్వాసఘాతకులైన ఆ కాపరులకు భిన్నంగా, క్రైస్తవ కాపరులు యెహోవా మాదిరిని అనుకరిస్తారు. వారు గొఱ్ఱెలను “పచ్చికగల చోట్ల”కు, “శాంతికరమైన జలములయొద్ద”కు నడిపిస్తారు. యెహోవా వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవటానికీ, దాన్ని తమ జీవితాల్లో వ్యక్తిగతంగా అన్వయించుకోవటానికీ వారికి సహాయం చేస్తూ వారిని “నీతిమార్గములలో” ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తారు. క్రైస్తవ కాపరులు “బోధింపతగిన”వారు గనుక దీన్ని చాలా ప్రభావవంతంగా చేయగలరు.—1 తిమోతి 3:2, 3.

పెద్దలు బోధించేది ఎక్కువగా సంఘ కూటాలు జరుగుతున్న సమయంలో ప్లాట్‌ఫారమ్‌ మీదినుండే. అయితే, వారు వ్యక్తిగతంగా కూడా బోధిస్తారు. కొందరు ఒక్కొక్క వ్యక్తికి బోధించడంలో నిపుణులైతే, మరికొందరు ప్రసంగాలు ఇస్తూ బోధించడంలో నిపుణులుగా ఉంటారన్నది నిజమే. కానీ ఎవరికైనా ఒక రకమైన బోధలో కాస్త సామర్థ్యం కొరవడితే ఆయన బోధకునిగా అనర్హుడు అయిపోడు. పెద్దలు తమకు సాధ్యమైన అన్ని విధాల్లోనూ బోధిస్తారు, కాపరిపని వాటిలో ఒకటి. కాపరిపనిలో కొంతభాగం సంస్థీకృతంగా జరుగుతుంది, ఉదాహరణకు పట్టిక ప్రకారం కాపరి సందర్శనాలు చేయడం. కానీ, కాపరిపనిలో చాలామట్టుకు సంస్థీకృతంగా జరిగే కాపరి సందర్శనాల రూపంలో కాక అనియతంగా జరుగుతుంది, ఇది కూడా ఎంతో ప్రయోజనకరం.

అన్ని సమయాల్లోను కాపరులు బోధకులు

ఒక వైద్యుడు తన పనిని నిర్వర్తించాలంటే ఆయనకు జ్ఞానము, అనుభవము కావాల్సివుంటుంది. కానీ ఆయన దయను, కనికరాన్ని, చింతను, మనఃపూర్వకమైన ఆసక్తిని కనబరిస్తే ఆయన దగ్గరకు వచ్చే రోగులు ఇంకా ఆనందిస్తారు. ఈ లక్షణాలు ఆయన వ్యక్తిత్వంలో భాగమైవుండాలి. అలాగే, ఒక వ్యక్తి మంచి బోధకునిగా కాపరిగా ఉండాలంటే అటువంటి లక్షణాలు ఆ వ్యక్తి వ్యక్తిత్వంలో భాగమైపోవాలి, ఆయన దైనందిన జీవితంలో ఆయనతో కలగలిసిపోవాలి. నిజమైన బోధకుడు ఎవరికైనా ఎప్పుడు అవసరమైనా ఉపదేశించటానికి సిద్ధంగా ఉంటాడు. “సమయోచితమైన మాట యెంత మనోహరము !” అని సామెతలు 15:23 అంటుంది. అది ప్లాట్‌ఫారమ్‌ నుంచి అయినా, ఇంటింటి పరిచర్యలో ప్రకటిస్తున్నా, లేదా రాజ్యమందిరంలోనో టెలిఫోనులోనో ఎవరితోనైనా సంభాషిస్తున్నా ఆయన నోటి నుండి వచ్చేవి “సమయోచితమైన” మాటలుగా ఉండాలి. అలాగే, ఒక మంచి కాపరి, కేవలం కాపరి సందర్శనాలు చేస్తున్నప్పుడు మాత్రమే గాక అన్ని సమయాల్లోను చక్కని ప్రేమపూర్వకమైన లక్షణాలను ప్రదర్శించటానికి కృషిచేస్తాడు. ‘తన హృదయాన్ని విశాలపర్చుకుని’ ఉన్నాడు గనుక ఆయన గొఱ్ఱెల్ని కాయటానికి ఎదురయ్యే ప్రతి అవకాశాన్నీ ఉపయోగించుకుంటాడు, వారికి సరైన సమయంలో కావాల్సిన శ్రద్ధను కనపరుస్తాడు. గొఱ్ఱెల దృష్టిలో ఆయన్ను ప్రేమపాత్రునిగా చేసేది ఇదే.—మార్కు 10:43.

ఇప్పుడు పెద్దగా ఉన్న వోల్ఫ్‌గాంగ్‌, ఒకప్పుడు తన కుటుంబాన్ని సందర్శించటానికి ఒక పరిచర్యా సేవకుడూ ఆయన భార్యా రావటాన్ని గుర్తుచేసుకుంటున్నాడు. ఆయనిలా అంటున్నాడు: “మా పిల్లలపై అంత అవధానం కనపర్చటంతో వారెంతో ఉత్తేజాన్ని పొందారు. ఆ సమయమంతా వారెంతో ఆనందాన్ననుభవించారు. వారిప్పటికీ ఆ సందర్భాన్ని గురించి మాట్లాడుకుంటారు.” అవును, తాను శ్రద్ధ కలిగివున్నానని ఈ పరిచర్యా సేవకుడు చూపించాడు; ఆయన ‘తన హృదయాన్ని విశాలపర్చుకున్నాడు.’

‘హృదయాన్ని విశాలపర్చుకునేందుకు’ మరో అవకాశం ఏమిటంటే, వ్యాధిగ్రస్తుల్ని సందర్శించటమే. వారికి ప్రోత్సాహంగా ఉండే చిన్న మాటనైనా వారికి చేరవేయడం, లేదా ఫోనులో వారితో మాట్లాడటం—అసలు, మీరు వారిపట్ల శ్రద్ధవహిస్తున్నారని తెలియజేసే ఏ చిన్న పనైనా చేయటం ద్వారా మీరు మీ హృదయాలను విశాలపర్చుకోవచ్చు. అవసరమైనప్పుడు సహాయాన్ని అందించండి. మాట్లాడాలని వారికి ఉన్నప్పుడు అవధానమిచ్చి వినండి. వారితో అనుకూలంగా మాట్లాడండి, స్థానిక సంఘంలోను వేరే ప్రాంతాల్లోను జరిగిన దైవపరిపాలనా కార్యకలాపాల్లోని ఉత్తేజాన్నిచ్చే అంశాలను వారితో చర్చించండి. యెహోవాను ప్రేమించేవారికి లభించే అద్భుతమైన భవిష్యత్తుపై దృష్టి కేంద్రీకరించటానికి వారికి సహాయం చేయండి.—2 కొరింథీయులు 4:16-18.

కాపరి సందర్శనాలకు తోడు . . .

కాపరిపని యొక్క ఉద్దేశాన్ని మనస్సులో పెట్టుకుంటే, సహోదరుల ఇండ్లలో వారిని సంస్థీకృతంగా సందర్శించడం ప్రాముఖ్యమైనప్పటికీ, అది అసలు పనిలో కొంత భాగం మాత్రమే అని అర్థమౌతుంది. ఒక ప్రేమపూర్వకమైన కాపరి అన్ని పరిస్థితుల్లోను, అన్ని సమయాల్లోను సమీపించదగ్గవానిగా ఉంటూ తన ‘హృదయాన్ని విశాలపర్చుకుంటాడు.’ ఆయన తన సహోదరులతో వాత్సల్యపూరితమైన సంబంధాన్ని అభివృద్ధిచేసుకుంటాడు. అలాంటి సంబంధాన్ని అభివృద్ధి చేసుకుంటే, సంక్షోభాల్లో ఉన్నప్పుడు తాము దేనికీ భయపడనవసరం లేదనీ, తమ ప్రేమామయుడైన సహోదరుడు తమపట్ల శ్రద్ధవహిస్తాడనీ సహోదరులు భావిస్తూ క్రైస్తవ కాపరియైన ఆయన చెంతకు వస్తారు.—కీర్తన 23:4.

అవును, క్రైస్తవ కాపరులైన సహోదరులారా ‘మీ హృదయాలను విశాలపర్చుకోండి.’ మీ సహోదరులపట్ల మీకున్న నిష్కపటమైన ప్రేమను ప్రదర్శించండి—మీకు సాధ్యమైన విధాలన్నింటిలోను వారికి ఆధ్యాత్మికంగా ప్రోత్సాహాన్ని అందించండి, సేదదీర్పునివ్వండి, క్షేమాభివృద్ధిని కలుగజేయండి. విశ్వాసంలో దృఢంగా కొనసాగడానికి సహాయం చేయండి. (కొలొస్సయులు 1:23) తమ ‘హృదయాలను విశాలపర్చుకునే’ క్రైస్తవ కాపరులతో ఆశీర్వదించబడిన గొఱ్ఱెలకు ఏమీ కొదువ ఉండదు. దావీదు వలెనే వారు కూడా యెహోవా మందిరములో చిరకాలము నివాసము చేయాలని నిర్ధారణ చేసుకుంటారు. (కీర్తన 23:1, 6) ఒక ప్రేమపూర్వకమైన కాపరికి అంతకన్నా ఇంకేం కావాలి?

[అధస్సూచీలు]

^ పేరా 10 కాపరి సందర్శనాలను చేయడంలో సూచనలకోసం 1993, సెప్టెంబరు 15, కావలికోట సంచికలోని 20-3 పేజీలు, 1996, మార్చి 15, సంచికలోని 24-7 పేజీలు చూడండి.

[30వ పేజీలోని బాక్సు]

క్రైస్తవ కాపరులు

• సిద్ధమనస్సుతోనూ, ఇష్టపూర్వకంగానూ సేవచేస్తారు

• మందకు ఆహారాన్నందించి, శ్రద్ధవహిస్తారు

• కాపరులయ్యేందుకు ముందుకువచ్చే ఇతరులకు సహాయంచేస్తారు

• వ్యాధిగ్రస్తులను సందర్శించి, వారిపట్ల శ్రద్ధవహిస్తారు

• తమ సహోదరులకు ఏ సమయంలోనైనా సరే తమ సహాయాన్ని అందించటానికి సిద్ధంగా ఉంటారు

[31వ పేజీలోని చిత్రం]

క్షేత్ర సేవలోనైనా, కూటాల్లోనైనా, లేదా కలిసి సమయం గడుపుతున్నప్పుడైనా పెద్దలు ఎప్పుడూ కాపరులే