కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు మనశ్శాంతిని ఎక్కడ పొందగలరు?

మీరు మనశ్శాంతిని ఎక్కడ పొందగలరు?

మీరు మనశ్శాంతిని ఎక్కడ పొందగలరు?

మన కాలానికీ, ముందటి శీర్షికలో పేర్కొన్న థోరో కాలానికీ చాలా తేడాలు ఉన్నాయి. ఒక ముఖ్య తేడా ఏమిటంటే, మనశ్శాంతిని పొందే మార్గాల గురించిన సలహాలకు ఆ నాటిలా నేడు లోటేమీ లేదు. నేడు మనశ్శాస్త్రజ్ఞులూ, తమ రచనల ద్వారా సహాయాన్ని అందించే రచయితలూ, వార్తాపత్రికలో కాలమ్‌ వ్రాసేవాళ్ళూ తమ తలంపులను తెలియజేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఇచ్చే సలహాలు స్వల్ప కాలానికి ప్రయోజనకరమే కావచ్చు; కాని దీర్ఘకాల పరిష్కారాలకు అంత కన్నా గొప్ప సహాయం అవసరం. ముందటి శీర్షికలో పేర్కొనబడిన వ్యక్తులు కనుగొన్నది అలాంటి సహాయాన్నే.

ఆంటోన్యూ, మార్కోస్‌, గెర్సన్‌, వానీయా, మార్సెలూ అనే వారు వేర్వేరు నేపథ్యాల నుండి వచ్చారు. వాళ్ళకు వేర్వేరు సమస్యలు ఉండేవి. వాళ్ళలో కనీసం మూడు విషయాలు ఒకేలా ఉన్నాయి. మొదటిది ఏమిటంటే, వారు ఒకప్పుడు ‘నిరీక్షణలేనివారిగా లోకమందు దేవుడు లేనివారిగా ఉన్నారు.’ (ఎఫెసీయులు 2:12) రెండవది ఏమిటంటే, వాళ్ళు మనశ్శాంతి కోసం పరితపించారు. మూడవది ఏమిటంటే, వాళ్ళు ముగ్గురూ యెహోవాసాక్షులతో బైబిలు పఠనం చేసిన తర్వాత మనశ్శాంతిని పొందారు. వాళ్ళు అలా బైబిలును పఠిస్తున్నప్పుడు, దేవుడికి తమపై ఆసక్తి ఉందన్న విషయాన్ని వాళ్ళు గ్రహించారు. నిజంగానే, తన కాలం నాటి ఏథెన్సు వారికి పౌలు చెప్పినట్లు, “ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు.” (అపొస్తలుల కార్యములు 17:27) మనశ్శాంతి కలగాలంటే, దేవుడు మనలో ఎవరికీ దూరంగా ఉండడన్న నమ్మకం కలిగి ఉండడం ముఖ్యం.

ఎందుకింత ఆశాంతి?

లోకంలో శాంతి లేకపోవడానికి, అంటే, మనశ్శాంతి లేకపోవడానికి, ఇద్దరు వ్యక్తుల మధ్య సమాధానం లేకపోవడానికి గల రెండు ప్రాథమిక కారణాలను బైబిలు ఇస్తుంది. ‘తమ మార్గము నేర్పరచుకొనుట నరులవశములో లేదు, మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదు’ అన్న మొదటి కారణాన్ని యిర్మీయా 10:23 వివరిస్తోంది. ఎవరి సహాయమూ తీసుకోకుండా తనను తాను పరిపాలించుకునేందుకు కావలసిన వివేకము గానీ, ముందు చూపు గానీ మానవుడికి లేవు. నిజంగా విలువైన ఏకైక సహాయం యెహోవా నుండే వస్తుంది. దేవుని మార్గదర్శనం కోసం ప్రయత్నించని మానవులు శాశ్వతమైన శాంతిని అనుభవించలేరు. శాంతి లేకపోవడానికి రెండవ కారణం, “లోకమంతయు దుష్టుని యందున్నదని” అపొస్తలుడైన యోహాను వ్రాసిన మాటల్లో కనిపిస్తుంది. (1 యోహాను 5:19) దేవుని మార్గదర్శనాన్ని అనుసరించకుండా శాంతిని పొందాలని చేసే ప్రయత్నాలు, నిజానికి ఉనికిలో ఉన్నా కంటికి కనిపించని మహా శక్తివంతుడైన ‘దుష్టుడైన’ సాతాను చేత ఎల్లప్పుడూ విఫలం చేయబడుతూనే ఉంటాయి.

పైన చెప్పిన రెండు కారణాల వల్ల, అంటే, చాలా మంది ప్రజలు దేవుని మార్గదర్శనం కోసం ప్రయత్నించకపోవడం వల్ల, ఈ లోకంలో సాతాను చాలా చురుకుగా పనిచేస్తున్నందు వల్ల మానవజాతి దీనాతి దీనమైన ఈ పరిస్థితిలో ఉంది. “సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవవేదన పడుచునున్నదని” పౌలు సరిగానే అన్నాడు. (రోమీయులు 8:22) ఆయన మాటలతో ఏకీభవించకుండా ఎవరు ఉండగలరు? సంపన్న దేశాల్లోను పేద దేశాల్లోను ఉన్న కుటుంబ సమస్యలూ, నేరం, అన్యాయం, వ్యక్తిత్వ స్పర్థలు, ఆర్థిక అనిశ్చయత, జాతి సంబంధ వర్గ సంబంధ ద్వేషాలు, అణచివేత, రోగం వంటి మరనేక సమస్యలూ ప్రజలకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి.

మనశ్శాంతిని ఎక్కడ పొందవచ్చు

ఆంటోన్యూ, మార్కోస్‌, గెర్సన్‌, వానీయా, మార్సెలూ దేవుని వాక్యమైన బైబిలును అధ్యయనం చేసినప్పుడు, వాళ్ళు నేర్చుకున్న విషయాలు వాళ్ళ జీవితాల్నే మార్చివేశాయి. లోక పరిస్థితి ఒక రోజు పూర్తిగా మారుతుందన్నదే వాళ్ళు నేర్చుకున్న ఒక విషయం. చివరికి అంతా బాగానే ఉంటుంది అనే అస్పష్టమైన నిరీక్షణ కాదది. నిజమైన సాక్ష్యాధారం గల నమ్మకమది. మానవజాతి విషయమై దేవునికి ఒక ఉద్దేశం ఉంది, మనం ఆయన చిత్తాన్ని చేస్తున్నట్లయితే, ఇప్పుడు కూడా మనమాయన ఉద్దేశం నుండి ప్రయోజనం పొందవచ్చునన్న నమ్మకమది. బైబిలు నుండి తాము నేర్చుకున్న విషయాలను వాళ్ళు ఆచరణలో పెట్టారు. వాళ్ళు అలా చేయడం వల్ల వాళ్ళ పరిస్థితులు మెరుగుపడ్డాయి. వాళ్ళు ఎన్నడూ ఊహించనంత శాంతి సంతోషాలను ఇప్పుడు అనుభవిస్తున్నారు.

మునుపు కార్మిక నాయకుడుగా ఉండిన ఆంటోన్యూ ఇక అసమ్మతి ప్రకటనల్లోగానీ ప్రదర్శనల్లో గానీ పాల్గొనడం లేదు. ఆ విధంగా చేయడం వల్ల వచ్చే మార్పులు చాలా పరిమితమనీ, తాత్కాలికమనీ ఆయనకు ఇప్పుడు తెలుసు. ఆయన, దేవుని రాజ్యాన్ని గురించి తెలుసుకున్నాడు. అది నిజమైన పరలోక ప్రభుత్వమనీ, మానవజాతికి నిజమైన శాంతిని తెస్తుందనీ తెలుసుకున్నాడు. లక్షలాది మంది, ప్రభువు ప్రార్థన (లేక పరలోక ప్రార్థన) చేస్తూ, “నీ రాజ్యము వచ్చుగాక” అని ప్రార్థించేది ఆ రాజ్యం కోసమే.—మత్తయి 6:10.

వివాహ జీవితాన్ని గురించిన అంశంపై బైబిలు ఇచ్చిన వివేకవంతమైన ఉపదేశాన్ని ఆచరణలో పెట్టడం ఎలాగో మునుపు రాజకీయవేత్తగా ఉన్న మార్కోస్‌ తెలుసుకున్నాడు. దాని ఫలితంగా, ఆయన ఇప్పుడు తన భార్యతో కలిసి సంతోషంగా జీవిస్తున్నాడు. దేవుని రాజ్యం, అత్యాశనూ స్వార్థపూరిత లోక వ్యవస్థనూ తీసివేసి మేలైన వ్యవస్థను తీసుకువచ్చే సమయం కోసం ఆయన కూడా ఎదురుచూస్తున్నాడు. పరలోక ప్రార్థనలో, “నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక” అనే మాటల లోతైన అర్థమేమిటో ఆయనకిప్పుడు తెలుసు. (మత్తయి 6:10) దేవుని చిత్తం ఈ భూమి మీద నెరవేరినప్పుడు, మునుపెన్నడూ లేనంతటి ఉన్నత స్థాయిలోని జీవితాన్ని మానవులు అనుభవిస్తారు.

గెర్సన్‌ విషయమేమిటి? ఆయన ఇక మీదట తిరుగుబోతూ కాడూ, దొంగా కాడు. మునుపు వీధుల్లో తిరిగిన ఈ అబ్బాయి ఇప్పుడు మనశ్శాంతిని పొందేందుకు ఇతరులకు సహాయపడే పనిలో తన శక్తినంతా ఉపయోగిస్తున్నాడు. ఈ అనుభవాలు చూపిస్తున్నట్లు, వ్యక్తులు బైబిలు అధ్యయనం చేసి, అది చెప్పేదాన్ని తమ జీవితాల్లో ఆచరణలో పెడితే వాళ్ళ జీవితాలు చాలా మెరుగుపడుతాయి.

సంక్షోభభరితమైన ఈ లోకంలో మనశ్శాంతి

దేవుని చిత్తం నెరవేరడంలో యేసుకు ప్రముఖ పాత్ర ఉంది, ప్రజలు యెహోవాసాక్షులతో బైబిలు పఠనం చేసినప్పుడు ఆయన గురించి ఎంతో నేర్చుకుంటారు. ఆయన జన్మించిన రాత్రి, “సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక” అని అంటూ దేవుని దూతలు దేవునికి స్తుతులు పాడారు. (లూకా 2:14) యేసు పెరిగి పెద్దవాడైనప్పుడు, ప్రజల జీవితాలను మెరుగుపరచడాన్ని గురించి చింతించాడు. ఆయన వాళ్ళ అనుభూతులను అర్థం చేసుకున్నాడు, బాధితులకూ రోగగ్రస్థులకూ మామూలుగా ఎవరూ చూపనటువంటి సానుభూతిని ఆయన చూపించాడు. దేవదూతలు చెప్పిన మాటలకు అనుగుణ్యంగా, సౌమ్యత గలవారికి ఆయన కొంత మేరకు మనశ్శాంతినిచ్చాడు. తన పరిచర్య ముగియబోతుండగా, “శాంతి మీ కనుగ్రహించుచున్నాను; లోకమిచ్చునట్టుగా నేను మీ కనుగ్రహించుటలేదు; మీ హృదయమును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి” అని ఆయన తన శిష్యులకు చెప్పాడు.—యోహాను 14:27.

యేసు మానవసేవాపరాయణుడు మాత్రమే కాదు. ఆయన తనను తాను ఒక కాపరితో పోల్చుకుంటూ, సౌమ్యతగల తన అనుచరులను గొఱ్ఱెలతో పోల్చుతూ, “దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు; గొఱ్ఱెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొఱ్ఱెలకు మంచి కాపరిని; మంచి కాపరి గొఱ్ఱెలకొరకు తన ప్రాణము పెట్టును” అని అన్నాడు. (యోహాను 10:10, 11) అందరి కన్నా అన్నింటి కన్నా ముఖ్యంగా తమకే ప్రాధాన్యతనిచ్చుకునే నేటి అనేక నాయకులకు విరుద్ధంగా ఆయన తన మంద కోసం తన ప్రాణాన్నే బలిగా ఇచ్చాడు.

యేసు చేసిన దాని నుండి మనమెలా ప్రయోజనం పొందగలం? “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను” అనే మాటలు అనేకులకు సుపరిచితమైనవే. (యోహాను 3:16) యేసు మీద ఉన్న విశ్వాసాన్ని ఆచరణలో పెట్టాలంటే, మొదటిగా, ఆయనను గురించిన ఆయన తండ్రియైన యెహోవా దేవుడ్ని గురించిన జ్ఞానాన్ని సంపాదించుకోవడం ఆవశ్యకం. అలా సంపాదించుకునే జ్ఞానం యెహోవా దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండేందుకు సహాయపడుతుంది, ఆ సన్నిహిత సంబంధం, మనం మనశ్శాంతిని పొందేందుకు సహాయపడుతుంది.

“నా గొఱ్ఱెలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్యజీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలోనుండి అపహరింపడు” అని యేసు చెప్పాడు. (యోహాను 10:27, 28) ఎంత ఆప్యాయతతోకూడిన ఓదార్పుకరమైన మాటలవి ! యేసు ఆ మాటలను పలికింది దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితమన్నది నిజమే. కానీ, ఆయన ఆ మాటలను పలికిన సమయంలో వాటికి ఎంత ప్రభావం ఉందో ఇప్పుడూ అంతే ప్రభావం ఉంది. యేసు క్రీస్తు ఇప్పుడూ సజీవంగానే ఉన్నాడనీ, క్రియాశీలంగా ఉన్నాడనీ, దేవుని పరలోక రాజ్యపు రాజుగా పరిపాలిస్తున్నాడనీ మరిచిపోకండి. ఆయన, అనేక సంవత్సరాల క్రితం భూమి మీద జీవించినప్పటిలాగే, ఇప్పుడు కూడా మనశ్శాంతిని కోరుకునే సౌమ్యుల గురించి చింతిస్తున్నాడు. అంతేకాక, ఆయన ఇప్పటికీ తన గొఱ్ఱెలకు కాపరియే. మనమాయనను అనుసరిస్తే, భవిష్యత్తులో శాంతియుతంగా ఉండే పరిస్థితిని చూడగలమన్న గట్టి నిరీక్షణతోకూడిన మనశ్శాంతిని మనం పొందేందుకు ఆయన సహాయం చేస్తాడు. అవును, ఆ శాంతియుతమైన లోకంలో దౌర్జన్యం గానీ, యుద్ధం గానీ, నేరం గానీ ఉండవు.

యేసు ద్వారా యెహోవా మనకు సహాయం చేస్తాడని తెలుసుకుని నమ్మడం ద్వారా నిజమైన ప్రయోజనాలు కలుగుతాయి. అనేక బాధ్యతలతో సతమతమై, దేవుడు తనను మరిచిపోయాడనుకున్న వానీయా విషయం మీకు గుర్తుందా? దేవుడు తనను ఉపేక్షించలేదని ఆ అమ్మాయికి ఇప్పుడు తెలుసు. “దేవుడు ప్రశంసనీయమైన లక్షణాలున్న నిజమైన వ్యక్తి అని తెలుసుకున్నాను. మనకు జీవితాన్ని ఇచ్చేందుకుగాను ఆయన తన కుమారుడ్ని ఈ భూమి మీదకు పంపేలా ఆయన ప్రేమ ఆయనను కదిలించిందన్న విషయాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం” అని ఆమె అంటోంది.

దేవునితో తనకున్న సంబంధం నిజమైనదని మార్సెలూ సాక్ష్యమిస్తున్నాడు. మునుపు అస్తమానం పార్టీలకు వెళ్ళిన ఆ అబ్బాయి, “ఏం చెయ్యాలో యౌవనస్థులకు తరచూ తెలియదు. చివరికి వాళ్ళు తమకు తాము హాని కలిగించుకుంటారు. నాలాగ, కొందరు మత్తుమందులకు బానిసలవుతారు. నాలాగే అనేకులు దేవుడ్ని గురించిన ఆయన కుమారుడ్ని గురించిన సత్యాన్ని గ్రహించడం ద్వారా మరిన్ని ఆశీర్వాదాలను పొందాలని ఆశిస్తున్నాను” అని అంటున్నాడు.

బైబిలును శ్రద్ధగా అధ్యయనం చేయడం ద్వారా, వానీయా, మార్సెలూ దేవుని మీద బలమైన విశ్వాసాన్ని పెంపొందించుకున్నారు, తమ సమస్యలను పరిష్కరించడంలో ఆయన ఇష్టపూర్వకంగా సహాయం చేస్తాడన్న నమ్మకాన్ని పెంచుకున్నారు. వాళ్ళలాగే మనం చేస్తే,—బైబిలును అధ్యయనం చేసి, అది చెబుతున్నది జీవితంలో ఆచరణలో పెడితే—వాళ్ళలాగే మనం కూడా మరింత మనశ్శాంతిని పొందుతాం. “దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును” అని అపొస్తలుడైన పౌలు చెప్పిన ప్రోత్సాహకరమైన మాటలు మన విషయంలో కూడా నిజం కాగలవు.—ఫిలిప్పీయులు 4:6, 7.

నేడు యథార్థమైన శాంతిని పొందడం

యేసు క్రీస్తు, సత్యం కోసం అకలిదప్పులు గల ప్రజలకు భూపరదైసులోని నిత్య జీవితానికి నడిపే మార్గాన్ని చూపిస్తున్నాడు. దేవుడ్ని స్వచ్ఛంగా ఆరాధించేందుకు ఆయన వారికి మార్గదర్శనమిస్తుండగా, “నా జనులు విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానములయందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు” అని బైబిలులో వర్ణించబడినటువంటి శాంతిని వాళ్ళు అనుభవిస్తారు. (యెషయా 32:17) అయితే అది, వాళ్ళు భవిష్యత్తులో అనుభవించనున్న శాంతిలో చిన్న తునక మాత్రమే. “దీనులు భూమిని స్వతంత్రించుకొందురు బహు క్షేమము కలిగి సుఖించెదరు. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు” అని కూడా మనం బైబిలులో చదువుతాము.—కీర్తన 37:11, 29.

అంటే, నేడు మనం మనశ్శాంతిని పొందగలమనేనా? అవును, పొందగలం. అంతేకాదు, సమీప భవిష్యత్తులో, విధేయులైన మానవులను దేవుడు మునుపెన్నడూ లేనంత శాంతితో ఆశీర్వదిస్తాడన్న నిశ్చయతను కలిగి ఉండగలం. అలాంటప్పుడు, ఆయనకున్న సమాధానాన్నీ శాంతినీ మీకూ ఇవ్వమని ప్రార్థనలో ఆయనను ఎందుకు అడగకూడదు? మీకున్న సమస్యల మూలంగా మీకు మనశ్శాంతి లేనట్లయితే, “నా హృదయవేదనలు అతివిస్తారములు ఇక్కట్టులోనుండి నన్ను విడిపింపుము. నా బాధను నా వేదనను కనుగొనుము నా పాపములన్నిటిని క్షమింపుము” అని రాజైన దావీదు ప్రార్థించినట్లు మీరు కూడా ప్రార్థించండి. (కీర్తన 25:17, 18) దేవుడు అలాంటి ప్రార్థనలకు జవాబిస్తాడన్న నిశ్చయతను కలిగి ఉండండి. శాంతికోసం యథార్థ హృదయముతో ప్రయత్నించేవారందరికీ ఆయన ధారాళంగా శాంతిని ఇస్తాడు. “తనకు మొఱ్ఱపెట్టువారి కందరికి తనకు నిజముగా మొఱ్ఱపెట్టువారి కందరికి యెహోవా సమీపముగా ఉన్నాడు. తనయందు భయభక్తులుగలవారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొఱ్ఱ ఆలకించి వారిని రక్షించును” అన్న ప్రేమపూర్వక అభయం మనకు ఇవ్వబడింది.—కీర్తన 145:18, 19.

[5వ పేజీలోని బ్లర్బ్‌]

ఎవరి సహాయమూ తీసుకోకుండా తనను తాను పరిపాలించుకునేందుకు కావలసిన వివేకము గానీ, ముందుచూపు గానీ మానవుడికి లేవు, నిజంగా విలువైన ఏకైక సహాయం దేవుడి నుండి వచ్చేదే.

[6వ పేజీలోని చిత్రం]

దేవుడిని గురించిన యేసు క్రీస్తును గురించిన జ్ఞానం యెహోవాతో సన్నిహితం సంబంధాన్ని కలిగి ఉండేందుకు సహాయపడుతుంది, అది మనం మనశ్శాంతిని పొందేందుకు తోడ్పడుతుంది

[7వ పేజీలోని చిత్రం]

బైబిలు ఉపదేశాన్ని అనుసరించడం ద్వారా శాంతియుతమైన కుటుంబ జీవితాన్ని గడపవచ్చు