కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు మనశ్శాంతిని పొందగలరా?

మీరు మనశ్శాంతిని పొందగలరా?

మీరు మనశ్శాంతిని పొందగలరా?

“చాలా మంది ప్రజలు నెమ్మదిలేక నిరాశగా జీవితాన్ని గడుపుతున్నారు” అని అమెరికా దేశస్థుడూ రచయితా అయిన హెన్రీ థోరో 1854 లో వ్రాశాడు.

ఆయన కాలంలో చాలా మంది ప్రజలకు మనశ్శాంతి లేకుండా పోయిందని రుజువులు చూపుతున్నాయి. అయితే, అది దాదాపు 150 సంవత్సరాల క్రితం నాటి సంగతి. అయితే నేటి పరిస్థితులు అప్పటికి భిన్నంగా ఉన్నాయా? లేక థోరో మాటలూ ఇప్పటికీ వర్తిస్తాయా? మీ విషయమేమిటి? మీరు సంతృప్తిగా, మనశ్శాంతిగా ఉన్నారా? లేక అభద్రతా భావంతో, భవిష్యత్తును గురించి అనిశ్చియతతో ఉన్నారా? థోరో మాటల్లో చెప్పాలంటే, మీరు ‘నెమ్మదిలేక నిరాశగా’ ఉంటున్నారా?

విచారకరమైన విషయం ఏమిటంటే, ఈ ప్రపంచంలో మనకు మనశ్శాంతి లేకుండా చేసే అనేక విషయాలు ఉన్నాయి. అయితే, వాటిలో కేవలం కొన్నింటిని పేర్కొందాం. అనేక దేశాల్లో నిరుద్యోగం వల్ల, తక్కువ ఆదాయం వల్ల పేదరికం తలెత్తుతుంది. ఆ విధంగా ఆర్థికంగా మెరుగుపడవచ్చన్న ఏ ఆశాలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇతర దేశాల్లో అనేకులు సిరి సంపదలను భౌతిక ఆస్తులను సంపాదించే ప్రయత్నంలో తమ శక్తినంతా వినియోగిస్తుంటారు. అయితే, తరచూ పోటీ మనోభావం గల జీవిత విధానం వల్ల వ్యాకులత కలుగుతుంది, మనశ్శాంతి ఉండదు. అనారోగ్యం, యుద్ధం, నేరం, అన్యాయం, అణచివేత మొదలైనవాటి మూలంగా కూడా ప్రజలకు మనశ్శాంతి లేకుండా పోతోంది.

వాళ్ళు మనశ్శాంతి కోసం ప్రయత్నించారు

ప్రస్తుత లోకంలో ఉన్న పరిస్థితులతో సర్దుకుపోవడానికి చాలామంది ఇష్టపడడంలేదు. ఆంటోన్యూ * అనే వ్యక్తి, బ్రెజిల్‌లోని సావోపౌలోలోని ఒక పెద్ద కర్మాగారపు కార్మిక నాయకుడు. తమ జీవన పరిస్థితులను మెరుగుపర్చుకోవచ్చనే ఆశతో, ఆయన అసమ్మతి ప్రకటనల్లోను, ప్రదర్శనల్లోను పాల్గొనేవాడు. కానీ వాటివల్ల ఆయనకు మనశ్శాంతి లేకుండా పోయింది.

వివాహం చేసుకుంటే తమ జీవితంలో కాస్త ప్రశాంతత లభిస్తుందని కొందరు ఆశిస్తారు. కానీ, వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళు దాన్ని పొందలేక నిరాశ చెందవచ్చు. మార్కోస్‌ అనే వ్యక్తిది వ్యాపారంలో అందెవేసిన చెయ్యి. ఆయన రాజకీయాల్లో చేరి, ఒక పారిశ్రామిక నగరానికి మేయర్‌ అయ్యాడు. అయితే, ఆయన కుటుంబ జీవితం మాత్రం చాలా ఘోరంగా ఉండేది. ఆయన పిల్లలు ఇల్లు వదిలి వెళ్ళినప్పుడు, ఆయనకూ ఆయన భార్యకూ భేదాభిప్రాయాలు వచ్చి ఇరువురిలో ఏ ఒక్కరూ రాజీపడకపోయేసరికి విడిపోయారు.

బ్రెజిల్‌లోని సాల్వడోర్‌లోని, వీధి బాలల్లో ఒకడైన గెర్సన్‌ సాహస కృత్యాలు చేయాలని కోరుకున్నాడు. అందుకోసం ఆ పిల్లవాడు వేర్వేరు ట్రక్‌ డ్రైవర్లతో వేర్వేరు నగరాలకు ప్రయాణం చేసేవాడు. అలా ప్రయాణిస్తూ ఎంతో కాలం గడవక ముందే అతడు మత్తుమందులకు బానిసయ్యాడు. అప్పటి నుండి మత్తుమందులను కొనుక్కోవడానికి కావలసిన డబ్బు కోసం ప్రజలను దోచుకోవడం మొదలుపెట్టాడు. అనేకసార్లు పోలీసులకు పట్టుబడ్డాడు. అతడిది దాడిచేసేటువంటి, హింసాత్మకమైనటువంటి వ్యక్తిత్వమే అయినప్పటికీ, అతడు మనశ్శాంతిని కోరుకున్నాడు. ఇంతకీ అతడు మనశ్శాంతిని పొందగల్గాడా?

వానీయ వాళ్ళమ్మ ఆమె చిన్నతనంలోనే చనిపోయింది. అప్పటి నుండి, అనారోగ్యంగా ఉన్న తన చెల్లెలిని చూసుకోవడంతో సహా ఇంటి పనులన్నీ తనే చూసుకోవలసి వచ్చింది. ఆమె చర్చికి వెళ్ళేది. కానీ, దేవుడు తనను ఉపేక్షించాడని భావించేది. ఆమెకు నిజంగా మనశ్శాంతి లేకుండా పోయింది.

మార్సెలూ అనే యౌవనస్థుడు హాయిగా కాలక్షేపం చేస్తూ ఉండాలని కోరుకునేవాడు. ఇతర యౌవనస్థులతోపాటు పార్టీలకు వెళ్ళడమూ, డ్యాన్స్‌ చేయడమూ, త్రాగడమూ, మాదక ద్రవ్యాలను ఉపయోగించడమూ అంటే అతడికి చాలా ఇష్టం ఉండేది. అతడు, ఒక పార్టీలో ఒకసారి ఒక అబ్బాయితో దెబ్బలాడి, అతణ్ణి గాయపరిచాడు. తను చేసిన పనికి ఆ తర్వాత, పశ్చాత్తాపపడ్డాడు, సహాయం కోసం దేవుణ్ణి ప్రార్థించాడు. అతడు కూడా మనశ్శాంతిని పొందాలని కోరుకున్నాడు.

మనశ్శాంతి లేకుండా చేసే కొన్ని పరిస్థితులను గురించి ఈ అనుభవాలు సోదాహరణంగా చెబుతున్నాయి. ఆ కార్మిక నాయకుడూ, రాజకీయవేత్తా, వీధి పిల్లవాడూ, చిన్నప్పుడే అనేక పనులతో సతమతమైపోయిన అమ్మాయీ, అస్తమానం పార్టీలకు వెళ్ళే అబ్బాయీ తాము వెదుకుతున్న మనశ్శాంతిని పొందడానికి ఏదైనా మార్గం ఉందా? వాళ్ళకు జరిగినదాని నుండి మనం నేర్చుకోవలసింది ఏమైనా ఉందా? ఉందన్నదే ఆ రెండు ప్రశ్నలకూ జవాబు. మనమది తర్వాతి శీర్షికలో చూద్దాం.

[అధస్సూచి]

^ పేరా 6 కొన్ని పేర్లు మార్చబడ్డాయి.

[3వ పేజీలోని చిత్రం]

మీరు మనశ్శాంతి కోసం పరితపిస్తున్నారా?