కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

రాజ్య సత్యాన్ని గూర్చిన విత్తనాలను విత్తండి

రాజ్య సత్యాన్ని గూర్చిన విత్తనాలను విత్తండి

రాజ్య సత్యాన్ని గూర్చిన విత్తనాలను విత్తండి

“ఉదయమందు విత్తనమును విత్తుము, అస్తమయమందును నీ చేయి వెనుక తియ్యక విత్తుము.”—ప్రసంగి 11:6.

1. క్రైస్తవులు నేడు ఏ భావంలో విత్తనాలు విత్తుతున్నారు?

ప్రాచీన కాలంలోని హెబ్రీయుల సమాజంలో వ్యవసాయం ముఖ్యపాత్ర వహించేది. తన పూర్తి మానవ జీవితాన్ని వాగ్దాన దేశంలో గడిపిన యేసు తన ఉపమానాల్లో వ్యవసాయానికి సంబంధించిన అంశాలను చేర్చాడు. ఉదాహరణకు, దేవుని రాజ్య సువార్త ప్రకటనను ఆయన విత్తనాలు విత్తడంతో పోల్చాడు. (మత్తయి 13:1-9, 18-23; లూకా 8:5-15) మనం వ్యవసాయ సంబంధిత సమాజంలో జీవిస్తున్నా లేకపోయినా, ఈ విధంగా ఆధ్యాత్మిక విత్తనాలను విత్తడం ఈనాటికీ క్రైస్తవులు చేసే అత్యంత ప్రాముఖ్యమైన పని.

2. మన ప్రకటనా పని ఎంత ప్రాముఖ్యమైనది, దాన్ని తుదముట్టించటానికి నేడు ఏమి జరుగుతున్నాయి?

2 ఈ అంత్యకాలంలో బైబిలు సత్యాన్ని విత్తడంలో భాగం వహించడం ఒక గొప్ప ఆధిక్యత. “ప్రకటించువాడు లేకుండ వారెట్లు విందురు? ప్రకటించువారు పంపబడని యెడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై—ఉత్తమమైనవాటిని గూర్చిన సువార్త ప్రకటించువారి పాదములెంతో సుందరమైనవి” అని చెప్తున్న రోమీయులు 10:14, 15 వచనాలు ఈ పనికున్న ప్రాముఖ్యతను చక్కగా వ్యక్తపరుస్తున్నాయి. దేవుడిచ్చిన ఈ పనిని నెరవేర్చడంలో అనుకూల దృక్పథంతో ముందుకు సాగడం మునుపెన్నటికన్నా కూడా ఇప్పుడు ఎంతో ప్రాముఖ్యం. ఆ కారణాన్ని బట్టే యెహోవా సాక్షులు 340 భాషల్లో బైబిళ్లను, బైబిలు ఆధారిత పఠన సహాయకాలను ఉత్పత్తి చేసి వాటిని పంచిపెట్టడంలో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. ఈ సమాచారాన్ని సిద్ధం చేయటానికి వారి ముఖ్యకార్యాలయంలోనూ, వివిధ దేశాల్లో ఉన్న బ్రాంచి కార్యాలయాల్లోనూ 18,000 కంటే ఎక్కువమంది స్వచ్ఛంద సేవకులు పనిచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ బైబిలు సాహిత్యాన్ని పంచిపెట్టడంలో దాదాపు అరవై లక్షల మంది సాక్షులు భాగం వహిస్తున్నారు.

3. రాజ్యాన్ని గూర్చిన సత్యాన్ని విత్తడం ద్వారా ఏమి సాధించబడుతుంది?

3 ఈ కృషి అంతటి ఫలితమేమిటి? క్రైస్తవత్వపు తొలి దినాల్లోలాగే నేడు కూడా అనేకులు సత్యాన్ని స్వంతం చేసుకుంటున్నారు. (అపొస్తలుల కార్యములు 2:41, 46, 47) అయితే, క్రొత్తగా బాప్తిస్మం తీసుకున్న రాజ్య ప్రచారకుల పెద్ద సంఖ్యల కంటే మరింత ప్రాముఖ్యమైన వాస్తవం ఏమిటంటే, ఈ గొప్ప సాక్ష్యపు పని యెహోవా నామం పరిశుద్ధపర్చబడటానికీ, అద్వితీయ సత్య దేవునిగా ఆయన మహిమకూ దోహదపడుతుంది. (మత్తయి 6:9, 10) అంతేగాక, దేవుని వాక్య జ్ఞానం అనేకుల జీవితాలను మెరుగుపర్చడమేగాక వారి రక్షణకు కూడా నడిపించగలదు.—అపొస్తలుల కార్యములు 13:47.

4. అపొస్తలులు తాము ఎవరికైతే ప్రకటించారో ఆ ప్రజలపట్ల ఎంత మేరకు శ్రద్ధ కల్గివుండేవారు?

4 సువార్తకున్న జీవదాయక ప్రాముఖ్యత గురించి అపొస్తలులకు బాగా తెలుసు, అందుకే వారు ఎవరికైతే ప్రకటించేవారో వారిపట్ల ఎంతో విశేషమైన ఆసక్తి కల్గివుండేవారు. ఈ విషయం, “మీరు మాకు బహు ప్రియులైయుంటిరి గనుక మీయందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములనుకూడ మీకిచ్చుటకు సిద్ధపడియుంటిమి” అని వ్రాసిన అపొస్తలుడైన పౌలు మాటల నుండి స్పష్టమౌతుంది. (1 థెస్సలొనీకయులు 2:8) ప్రజల పట్ల అలాంటి నిజమైన శ్రద్ధను చూపించడంలో పౌలూ ఇతర అపొస్తలులూ, ఈ జీవరక్షక పనిలో పూర్తిగా నిమగ్నమైవున్న యేసునూ పరలోక దూతలనూ అనుకరించారు. రాజ్యాన్ని గూర్చిన సత్యాన్ని విత్తడంలో దేవుని ఈ పరలోక సేవకులు వహించే ప్రముఖ పాత్రలను పరిశీలించి, మన పాత్రను నిర్వహించటానికి వారి మాదిరి మనల్ని ఎలా ప్రోత్సహిస్తుందో చూద్దాము.

రాజ్య సత్యాన్ని విత్తిన యేసు

5. యేసు భూమి మీద ఉన్నప్పుడు ప్రాథమికంగా ఏ పనిలో నిమగ్నమై ఉన్నాడు?

5 పరిపూర్ణ మానవుడైన యేసుకు, తన కాలంనాటి ప్రజలకు వస్తుసంబంధంగా అనేక మంచి ఈవులను ఇచ్చే శక్తి ఉంది. ఉదాహరణకు, ఆయన తన కాలంనాటి వైద్యపరమైన అనేక దురభిప్రాయాలను స్పష్టపరిచి ఉండేవాడే లేదా ఇతర వైజ్ఞానిక రంగాల్లో మానవ అవగాహనను అధికం చేసి ఉండేవాడే. అయినప్పటికీ, సువార్త ప్రకటించడమే తన పని అని ఆయన తన పరిచర్య ఆరంభంలోనే స్పష్టం చేశాడు. (లూకా 4:17-21) తన పరిచర్య ముగింపులో ఆయనిలా వివరించాడు: “సత్యమునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని; ఇందు నిమిత్తమే యీ లోకమునకు వచ్చితిని.” (యోహాను 18:37, 38) కాబట్టి ఆయన రాజ్యాన్ని గూర్చిన సత్య విత్తనాలను విత్తడంలో నిమగ్నమైపోయాడు. యేసు తన సమకాలీనులకు దేవుని గురించి ఆయన సంకల్పాల గురించి బోధించడం ఆయన వారికివ్వగలిగిన ఏ ఇతర విద్యకంటే కూడా ఎంతో ప్రాముఖ్యమైనది.—రోమీయులు 11:33-36.

6, 7. (ఎ) పరలోకానికి తాను ఆరోహణమై వెళ్లక ముందు యేసు ఏ విశేషమైన వాగ్దానం చేశాడు, ఆయన దాన్ని ఎలా నెరవేరుస్తున్నాడు? (బి) ప్రకటనా పనిపట్ల యేసు కల్గివున్న దృక్పథం మిమ్మల్ని వ్యక్తిగతంగా ఏ విధంగా ప్రభావితం చేస్తుంది?

6 తాను రాజ్యాన్ని గూర్చిన సత్య విత్తనాలు విత్తువాడినని యేసు స్వయంగా చెప్పుకున్నాడు. (యోహాను 4:35-38) ఆయన ప్రతి సందర్భంలోనూ సువార్త విత్తనాలను వెదజల్లాడు. చివరికి మ్రానుపై మరణించేటప్పుడు కూడా ఆయన భవిష్యద్‌ భూ పరదైసును గురించిన సువార్తను ప్రకటించాడు. (లూకా 23:43) అయితే, సువార్త ప్రకటించడం పట్ల ఆయనకున్న అమితాసక్తి మ్రానుపై మరణించడంతో ముగిసిపోలేదు. ఆయన పరలోకానికి ఆరోహణం కాక ముందు, రాజ్యాన్ని గూర్చిన సత్య విత్తనాలను విత్తడంలోనూ శిష్యులను చేసే పనిలోనూ కొనసాగమని తన అపొస్తలులకు ఆజ్ఞాపించాడు. తర్వాత యేసు ఒక విశేషమైన వాగ్దానం చేశాడు. “ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని” ఆయన అన్నాడు.—మత్తయి 28:19, 20.

7 ఈ మాటలతో, “యుగసమాప్తి వరకు సదాకాలము” సువార్త ప్రకటన పనికి మద్దతునిస్తాననీ, ఆ పనిలో నడిపింపును కాపుదలను ఇస్తాననీ యేసు వాగ్దానం చేశాడు. (ఇటాలిక్కులు మావి.) మన కాలంనాటి వరకు, యేసు సువార్త ప్రకటనా పనిలో వ్యక్తిగతంగా శ్రద్ధతీసుకుంటూనే ఉన్నాడు. ఆయన మన నాయకుడు, రాజ్యాన్ని గూర్చిన సత్యం విత్తబడేలా చూసే బాధ్యత ఆయనకుంది. (మత్తయి 23:10) క్రైస్తవ సంఘ శిరస్సుగా, ఆయన ఈ ప్రపంచవ్యాప్త పనికి యెహోవా ఎదుట జవాబుదారుడు.—ఎఫెసీయులు 1:22, 23; కొలొస్సయులు 1:18.

దేవదూతలు నిత్యసువార్త ప్రకటించడం

8, 9. (ఎ) దేవదూతలు మానవుల విషయాల్లో నిజమైన శ్రద్ధను ఎలా కనబర్చారు? (బి) మనం దేవదూతలకు వేడుకగా ఉన్నామని ఏ భావంలో చెప్పవచ్చు?

8 యెహోవా భూమిని సృష్టించినప్పుడు, దేవదూతలు ‘ఏకముగా కూడి పాడి, ఆనందించి జయధ్వనులు చేశారు.’ (యోబు 38:4-7) అప్పటి నుండి ఈ పరలోక దూతలు మానవుల విషయాల్లో అత్యంతాసక్తిని కనపర్చారు. దైవిక ప్రకటనలను మానవులకు అందజేయడానికి యెహోవా వారిని ఉపయోగించుకున్నాడు. (కీర్తన 103:20) మన దినాల్లో సువార్తను వ్యాప్తి చేయటం విషయంలో ఇది ప్రాముఖ్యంగా నిజమైయుంది. అపొస్తలుడైన యోహానుకు ఇవ్వబడిన ప్రత్యక్షతలో ఆయన “భూనివాసులకు, అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆ యా భాషలు మాటలాడువారికిని ప్రతి ప్రజకును ప్రకటించునట్లు నిత్యసువార్త తీసికొని ఆకాశమధ్యమున ఎగురు”తున్న దేవదూతను చూశాడు. ఆ దేవదూత, “మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి; ఆయన తీర్పుతీర్చు గడియ వచ్చెను” అని ప్రకటిస్తున్నాడు.—ప్రకటన 14:6, 7.

9 “రక్షణయను స్వాస్థ్యము పొందబోవువారికి పరిచారముచేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు” దేవదూతలని బైబిలు చెప్తుంది. (హెబ్రీయులు 1:14) దేవదూతలు తమకు అప్పగించబడిన విధులను అత్యంత ఉత్సాహంతో నిర్వర్తిస్తుండగా, మనల్నీ మన పనినీ గమనించే అవకాశం వారికుంటుంది. మనం ఒక విధంగా చెప్పాలంటే, స్పష్టంగా కన్పించే రంగస్థలం మీద ఉన్నాము, పరలోక ప్రేక్షకుల ఎదుట మనం మన పనిని నిర్వర్తిస్తాము. (1 కొరింథీయులు 4:9) రాజ్యాన్ని గూర్చిన సత్య విత్తనాలను విత్తేవారిగా మనం ఒంటరి వారము కాదని తెలుసుకోవడం ఎంత ఉపశమనంగా, ఉత్తేజభరితంగా ఉందో కదా !

మనం మన పాత్రను అత్యంత ఉత్సాహంతో నెరవేరుస్తాము

10. ప్రసంగి 11:6 నందలి ఆచరణాత్మకమైన ఉపదేశం మన ప్రకటనా పనికి ఎలా అన్వయించుకోవచ్చు?

10 యేసు, దేవదూతలు మన పనిలో ఎందుకంత ఆసక్తి కలిగివున్నారు? “మారుమనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతలయెదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నా”నన్నప్పుడు యేసు దానికి గల ఒక కారణాన్ని తెలియజేశాడు. (లూకా 15:10) మనం కూడా ప్రజల ఎడల అలాంటి నిజమైన ఆసక్తినే కల్గివుంటాము. కాబట్టి రాజ్యాన్ని గూర్చిన సత్య విత్తనాలను అంతటా వ్యాప్తి చేయడానికి మనం చేయగల్గినదంతా చేస్తాము. ప్రసంగి 11:6 లోని మాటల్ని మన పనికి అన్వయించవచ్చు. అక్కడ బైబిలు మనకిలా ఉపదేశిస్తుంది: “ఉదయమందు విత్తనమును విత్తుము, అస్తమయమందును నీ చేయి వెనుక తియ్యక విత్తుము, అది ఫలించునో యిది ఫలించునో లేక రెండును సరిసమానముగా ఎదుగునో నీవెరుగవు.” నిజమే, మన సందేశాన్ని ఒక వ్యక్తి అంగీకరించవచ్చు, కానీ వందలాదిమంది లేదా చివరికి వేలాదిమంది నిరాకరించే అవకాశం ఉంది. కానీ “ఒక పాపి” రక్షణ సందేశాన్ని అంగీకరించినా దేవదూతల్లా మనం ఆనందిస్తాము.

11. బైబిలు ఆధారిత ప్రచురణల ఉపయోగం ఎంత ప్రభావవంతంగా ఉండగలదు?

11 సువార్త ప్రకటించడంలో ఇంకా ఎంతో ఇమిడివుంది. ఈ పనిలో ఒక ప్రాముఖ్యమైన సహాయకం యెహోవా సాక్షులు ఉపయోగించే బైబిలు ఆధారిత ముద్రిత సమాచారం. కొన్ని సందర్భాల్లో, ఈ ప్రచురణలు కూడా అంతటా వెదజల్లబడిన విత్తనాల్లా ఉన్నాయి. అవి ఎక్కడ ఫలిస్తాయో మనకు తెలీదు. కొన్నిసార్లు మన ప్రచురణలు ఎన్నో చేతులు మారతాయి. కొన్నిసార్లు అవి, వాటిని తీసుకున్న వ్యక్తులు చదవకుండానే మరొకరి చేతుల్లోకి వెళ్ళవచ్చు. అలా జరిగేలా చూసేందుకు, కొన్ని సందర్భాల్లో యథార్థ హృదయుల ప్రయోజనార్థం యేసు, దేవదూతలు సంఘటనలను నిర్దేశించవచ్చు. ప్రజలకివ్వబడిన సాహిత్యాన్ని ఉపయోగించి యెహోవా అనూహ్యమైన, అద్భుతమైన ఫలితాలను ఎలా సాధించగలడో చూపించే కొన్ని అనుభవాలను పరిశీలిద్దాం.

సత్య దేవుని పని

12. ఒక కుటుంబం యెహోవాను తెలుసుకునేందుకు సహాయం చేయడంలో ఒక పాత పత్రిక ఎలా ఉపకరించింది?

12 రాబర్ట్‌ లైలా దంపతులు 1953 లో తమ పిల్లలతోపాటు, ఒక పెద్ద నగరం నుండి అమెరికాలోని పెన్సిల్వేనియా గ్రామీణ ప్రాంతంలోని పొలాల్లో ఉన్న ఒక పాత ఇంట్లోకి తమ మకాం మార్చారు. అక్కడికి మారిన కొంతకాలానికి, రాబర్ట్‌ మెట్ల క్రిందనున్న స్థలంలో స్నానాల గది ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. అక్కడి నుండి కొన్ని చెక్కల్ని తీసివేశాక, ఆ గోడ వెనుక ఎలుకలు కొన్ని చిత్తు కాగితాలను, ఆక్రోట్‌ గింజల పెంకుల్ని, చెత్తా చెదారాన్ని అక్కడ పోగు చేసినట్లు ఆయన చూశాడు. అక్కడ వాటన్నిటి మధ్యా ది గోల్డెన్‌ ఏజ్‌ కాపీ ఒకటి పడివుంది. ప్రాముఖ్యంగా, పిల్లల్ని పెంచే విషయంపై వ్రాయబడిన శీర్షిక రాబర్ట్‌కు ఎంతో నచ్చింది. ఆ పత్రికలో ఇవ్వబడిన స్పష్టమైన, బైబిలు ఆధారిత నిర్దేశనానికి ఆయనెంతగా ప్రభావితమయ్యాడంటే, ఆయన “ది గోల్డెన్‌ ఏజ్‌ మతం”నే మనమూ అవలంబిద్దామని లైలాతో అన్నాడు. కేవలం కొన్ని వారాల్లో, యెహోవాసాక్షులు వాళ్ల ఇంటికి వచ్చారు, కానీ తమ కుటుంబానికి కేవలం “ది గోల్డెన్‌ ఏజ్‌ మతం”లోనే ఆసక్తి ఉందని రాబర్ట్‌ వాళ్లకు చెప్పాడు. ఇప్పుడు ది గోల్డెన్‌ ఏజ్‌కు క్రొత్త పేరు ఉందనీ, అది అవేక్‌ ! అనీ సాక్షులు వివరించారు. రాబర్ట్‌ లైలాలు సాక్షులతో క్రమంగా బైబిలు పఠించడం మొదలుపెట్టి, చివరికి బాప్తిస్మం తీసుకున్నారు. ఆ తర్వాత వాళ్లు తమ పిల్లల్లో సత్య విత్తనాలను విత్తి, పుష్కలంగా పంటకోశారు. నేడు, రాబర్ట్‌ లైలాల ఏడుగురు పిల్లలతో సహా ఈ కుటుంబంలోని 20 కన్నా ఎక్కువమంది సభ్యులు బాప్తిస్మం తీసుకున్న యెహోవా దేవుని సేవకులు.

13. ప్యూర్టో రికోలోని ఒక జంట బైబిలు పట్ల ఆసక్తి పెంచుకోవటానికి ఏది పురికొల్పింది?

13 దాదాపు 40 సంవత్సరాల క్రితం, ప్యూర్టో రికోకు చెందిన విలియమ్‌, ఏడా అనే దంపతులకు బైబిలు పఠనంలో ఏమాత్రం ఆసక్తి ఉండేది కాదు. యెహోవా సాక్షులు ఎప్పుడు తమ తలుపు తట్టినా, ఆ జంట తాము ఇంటివద్ద లేమన్నట్లు నటించేవారు. ఒక రోజు విలియం తమ ఇంట్లో ఏదో మరమ్మతు కోసం అవసరమైన ఒక వస్తువును కొనడానికి పాత వస్తువులు అమ్మే చోటికి వెళ్లాడు. అక్కడి నుండి వస్తుండగా, ఒక పెద్ద చెత్త డబ్బాలో లేత ఆకుపచ్చ రంగు పుస్తకం పడి ఉండడం ఆయన గమనించాడు. అది 1940లలో యెహోవా సాక్షులు ప్రచురించిన మతం (ఆంగ్లం) అనే పుస్తకం. విలియం ఆ పుస్తకాన్ని ఇంటికి తీసుకువెళ్లి చదివి, అబద్ధ మతానికీ నిజమైన మతానికీ మధ్యనున్న తేడాను తెలుసుకుని ఎంతో సంతోషాన్ని పొందాడు. తర్వాతిసారి యెహోవా సాక్షులు తమ ఇంటికి వచ్చినప్పుడు, విలియం, ఏడాలు సంతోషంగా వారి సందేశాన్ని విని, వాళ్లతో బైబిలు పఠనం చేయడం మొదలు పెట్టారు. కొన్ని నెలల తర్వాత 1958 లో వాళ్లు దైవిక చిత్తం అంతర్జాతీయ సమావేశంలో బాప్తిస్మం తీసుకున్నారు. అప్పటి నుండి, మన క్రైస్తవ సహోదరత్వంలో భాగమయ్యేందుకు వారు 50 మందికి పైగా సహాయం చేశారు.

14. ఒక అనుభవం చూపిస్తున్నట్లుగా, మన బైబిలు ఆధారిత ప్రచురణలకు ఏ సామర్థ్యం ఉంది?

14 కార్ల్‌కు 11 ఏళ్లు, కాస్త తుంటరి వాడు. తాను ఎప్పుడూ ఏదో సమస్యల్లో చిక్కుకుపోతున్నట్లు ఆయనకు అనిపించింది. జర్మన్‌ మెథడిస్ట్‌ పరిచారకుడైన వాళ్ల నాన్న చెడ్డవాళ్ళు చనిపోయిన తర్వాత నరకాగ్నిలో కాల్చబడతారని ఆయనకు బోధించాడు. కాబట్టి కార్ల్‌కు నరకమంటే చాలా భయం వేసేది. 1917 లో ఒక రోజు, కార్ల్‌ ఒక ముద్రిత కాగితం ముక్క వీధిలో పడి ఉండటం గమనించి దాన్ని తీసుకున్నాడు. ఆయన దాన్ని చదువుతుండగా, “నరకం అంటే ఏమిటి?” అనే ప్రశ్న మీదికి ఆయన అవధానం మళ్లింది. అది, నరకం అనే అంశం మీద బహిరంగ ప్రసంగం వినడానికి రమ్మంటున్న ఆహ్వానం, ఇప్పుడు యెహోవాసాక్షులని పిలువబడుతున్న బైబిలు విద్యార్థులు దాన్ని నిర్వహిస్తున్నారు. దాదాపు ఒక సంవత్సరం తర్వాత, చాలాసార్లు బైబిలు పఠన చర్చలు జరిగిన తర్వాత కార్ల్‌ బాప్తిస్మం తీసుకుని బైబిలు విద్యార్థి అయ్యాడు. 1925 లో ఆయన యెహోవా సాక్షుల ప్రపంచ ముఖ్య కార్యాలయంలో పనిచేయటానికి ఆహ్వానాన్ని అందుకున్నాడు, ఇప్పటికీ అక్కడే సేవ చేస్తున్నాడు. ఎనభై దశాబ్దాల కన్నా ఎక్కువ కాలంపాటు సాగిన క్రైస్తవ జీవన గమనం, వీధిలో దొరికిన ఒక కాగితం ముక్కతో ప్రారంభమైంది.

15. తనకు సముచితమని తోచినప్పుడు యెహోవా ఏమి చేయగలడు?

15 నిజమే, ఈ అనుభవాల్లో దేవదూతలు అసలు జోక్యం చేసుకున్నారా, అయితే ఎంత మేరకు అనేది నిశ్చయించడం మానవ సామర్థ్యానికి మించినది. అయినా, ప్రకటనా పనిలో యేసు, దేవదూతలు చురుగ్గా భాగం వహిస్తారన్న విషయాన్నీ, పరిస్థితులను తనకు కావలసిన విధంగా యెహోవా నడిపించగలడన్న విషయాన్నీ మనం ఎన్నడూ సందేహించకూడదు. ఇవీ, ఇలాంటివే ఇంకా అనేక అనుభవాలు, మన ప్రచురణలు మన చేతులు దాటిన తర్వాత వాటికుండే మేలు చేయగల సామర్థ్యాన్ని చూపిస్తున్నాయి.

మనకు ఒక ఐశ్వర్యం అప్పగించబడింది

16. రెండవ కొరింథీయులు 4:7 నందలి మాటల నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

16 ‘మంటి ఘటములలో గల ఐశ్వర్యము’ గురించి అపొస్తలుడైన పౌలు మాట్లాడాడు. ప్రకటించమని దేవుడిచ్చిన ఆజ్ఞే ఆ ఐశ్వర్యము, యెహోవా ఎవరికైతే ఈ ఐశ్వర్యాన్ని అప్పగించాడో ఆ మానవులే మంటి ఘటములు. ఆ మానవులు అపరిపూర్ణులూ, పరిమితులు గలవాళ్లూ గనుక, వాళ్ళు తమకివ్వబడిన నియామకాన్ని నెరవేర్చగలిగేది దేవుని ‘బలాధిక్యం’ మూలంగానే గాని తమ స్వంత శక్తితో కాదని పౌలు చెబుతున్నాడు. (2 కొరింథీయులు 4:7) అవును, ప్రస్తుతం చేయవలసిన పనిని తుదముట్టించడానికి అవసరమైన శక్తిని యెహోవా ఇస్తాడని మనం నిశ్చయత కల్గివుండవచ్చు.

17. మనం రాజ్యాన్ని గూర్చిన సత్య విత్తనాలను విత్తుతుండగా మనం ఏమి ఎదుర్కుంటాము, అయినప్పటికీ మనం ఎందుకు అనుకూల దృక్పథాన్ని కాపాడుకోవాలి?

17 తరచూ మనం త్యాగాలు చేయవలసి ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో పని చేయడం కష్టంగా, అసౌకర్యంగా ఉండవచ్చు. చాలామంది ప్రజలు ఎంతో ఉదాసీనంగా, చివరికి ఎంతో ప్రతికూలంగా ఉండే ప్రాంతాలు కూడా ఉన్నాయి. అలాంటి ప్రాంతాల్లో ఎంతో కృషి చేసినప్పటికీ ఫలితం అంతగా ఉండకపోవచ్చు. కానీ ఎంతో విలువైనది ప్రమాదంలో ఉంది గనుక ఎంత ప్రయాసపడినా అది ఎక్కువేమీ కాదు. మీరు విత్తే విత్తనాలు ప్రజలకు ఇప్పుడు ఆనందాన్నీ, అలాగే భవిష్యత్తులో నిత్యజీవాన్నీ ఇవ్వగలవని జ్ఞాపకముంచుకోండి. “పిడికెడు విత్తనములు చేత పట్టుకొని యేడ్చుచుపోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసికొనివచ్చును” అని చెప్తున్న కీర్తన 126:6 లోని మాటలు అనేకసార్లు నిజమని నిరూపించబడ్డాయి.

18. మనం మన పరిచర్యకు విడువక అవధానాన్ని ఎలా ఇవ్వవచ్చు, మనమెందుకలా చేయాలి?

18 రాజ్యాన్ని గూర్చిన సత్య విత్తనాలను పుష్కలంగా విత్తడానికి సముచితమైన ప్రతి అవకాశాన్నీ మనం తప్పక సద్వినియోగం చేసుకుందాము. నాటేది, నీళ్లు పోసేది మనమే అయినప్పటికీ, వాటిని మొలకెత్తింపజేసేది యెహోవాయేనని మనం ఎన్నడూ మరిచిపోకుందాము. (1 కొరింథీయులు 3:6, 7) అయితే, యేసు, దేవదూతలు తమ పాత్రను నిర్వర్తించేలానే మనం కూడా మన పనిని సంపూర్ణంగా నెరవేర్చాలని యెహోవా నిరీక్షిస్తాడు. (2 తిమోతి 4:5) మనం మన బోధకు, మన దృక్పథానికి, పరిచర్యపట్ల మనకున్న అత్యంత ఉత్సాహానికి విడువక అవధానం ఇద్దాము. ఎందుకు? “నీవీలాగుచేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు” అని పౌలు సమాధానమిస్తున్నాడు.—1 తిమోతి 4:16.

మనమేమి నేర్చుకున్నాము?

• మనం చేసే విత్తే పని ఏ విధంగా మంచి ఫలితాలను తీసుకువస్తుంది?

• నేడు సువార్త ప్రకటనా పనిలో యేసు క్రీస్తు, దేవదూతలు ఎలా నిమగ్నమై ఉన్నారు?

• రాజ్యాన్ని గూర్చిన సత్య విత్తనాలను మనం ఎందుకు విస్తృతంగా విత్తే వారమై ఉండాలి?

• మనం మన పరిచర్యలో ఉదాసీనతను, వ్యతిరేకతను ఎదుర్కున్నప్పుడు, మనం కొనసాగటానికి ఏది మనల్ని పురికొల్పాలి?

[అధ్యయన ప్రశ్నలు]

[అధ్యయన ప్రశ్నలు]

[15వ పేజీలోని చిత్రం]

ప్రాచీన ఇశ్రాయేలులోని రైతుల్లా, నేడు క్రైస్తవులు రాజ్యాన్ని గూర్చిన సత్య విత్తనాలను విస్తృతంగా వ్యాపింపజేస్తారు

[16వ పేజీలోని చిత్రం]

యెహోవాసాక్షులు 340 భాషల్లో వివిధ బైబిలు ఆధారిత ప్రచురణలను ఉత్పత్తి చేసి, పంచి పెడతారు