అనైతిక లోకంలో మీరు పవిత్రంగా ఉండగలరు
అనైతిక లోకంలో మీరు పవిత్రంగా ఉండగలరు
అతడు అందగాడు. ఆమె ప్రతిభగలది, అందగత్తె కూడా. వాళ్ళిద్దరూ ఒకే కంపెనీలో పని చేస్తున్నారు. ఆమె అతని మీద వ్యక్తిగతంగా ఎంతో శ్రద్ధ చూపించింది. అతడు ఆమెను ఎంతగానో ప్రశంసించాడు. వాళ్ళు ఇద్దరూ ఒకరికొకరు బహుమానాలు ఇచ్చుకున్నారు. త్వరలోనే వాళ్ళు ప్రేమికులైపోయారు. ఆమె కోసం అతడు తన భార్యను వదలిపెట్టేశాడు. ఆమె చివరికి తన భర్తతోనే ఉండిపోయి ఈ ప్రేమ వ్యవహారానికి స్వస్తి చెప్పాలని నిర్ణయించుకుంది. అయిష్టంగానే అతడు తన భార్య దగ్గరికి తిరిగి వెళ్ళడానికి ప్రయత్నించాడు. నిజమైన పశ్చాత్తాపం లేకపోవడం వల్ల అతడు సఫలీకృతం కాలేకపోయాడు. ఇక ఆ తర్వాత, ఆ నలుగురూ జీవితాలను యథావిధిగా కొనసాగించారు, మచ్చలు మాత్రం మిగిలిపోయాయి.
లైంగిక నైతికత అనేది ఈ లోకంలో ఒక సద్గుణంగా ఎంతమాత్రమూ పరిగణింపబడడంలేదు. ఏ ఆంక్షలూ లేకుండా సంతోష సంతృప్తులను జుర్రుకోవాలనుకోవడం సర్వసాధారణమైన విషయంగా మారిపోయింది. “వ్యభిచారం సర్వవ్యాప్తమైపోయింది, కొన్ని సందర్భాల్లోన్నైతే అది వివాహమంత సర్వసాధారణ విషయంగా తయారైంది” అని ద న్యూ ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా పేర్కొంటుంది.
అయినప్పటికీ, వివాహము “అన్ని విషయములలో ఘనమైనది”గానూ పానుపు “నిష్కల్మషమైనది”గానూ ఉండాలని యెహోవా దేవుడు కోరుతున్నాడు. (హెబ్రీయులు 13:4) “మోసపోకుడి; జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనముగలవారైనను పురుషసంయోగులైనను . . . దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు” అని లేఖనాలు తెలియజేస్తున్నాయి. (1 కొరింథీయులు 6:9, 10) కాబట్టి దైవిక అనుగ్రహం పొందాలంటే ఈ అనైతిక లోకంలో మనం నైతికంగా పరిశుభ్రంగా ఉండవలసిన అవసరం ఉంది.
మన చుట్టూ ఉన్న ఈ చెడు ప్రభావాల నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవచ్చు? ప్రాచీన ఇశ్రాయేలు రాజైన సొలొమోను బైబిలు పుస్తకమైన సామెతల గ్రంథంలోని 5వ అధ్యాయంలో దానికి సమాధానమిస్తున్నాడు. ఆయన ఏమి చెప్తున్నాడో మనం పరిశీలిద్దాం.
మిమ్మల్ని మీరు కాపాడుకొనేందుకు ఆలోచనా సామర్థ్యము
ఇశ్రాయేలు రాజు, “నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకింపుము” అంటూ ప్రారంభిస్తున్నాడు. ఆయనింకా ఇలా అంటున్నాడు: “వివేకముగల నా బోధకు చెవి యొగ్గుము, అప్పుడు నీవు బుద్ధికలిగి నడచుకొందువు తెలివినిబట్టి నీ పెదవులు మాటలాడును.”—సామెతలు 5:1, 2.
అనైతికతకు పాల్పడేందుకు వచ్చే శోధనలను ఎదుర్కొనేందుకు మనకు తెలివి అవసరం అంటే లేఖన జ్ఞానాన్ని ఆచరణలో పెట్టే సామర్థ్యం అవసరం. అలాగే వివేచన, లేదా తప్పేదో ఒప్పేదో తెలుసుకొని సరియైనది ఎంపిక చేసుకొనే శక్తి కూడా అవసరం. మనం మన ఆలోచనా సామర్థ్యాన్ని కాపాడుకోగలిగేలా మనం జ్ఞానానికీ, వివేచనకూ అవధానాన్నివ్వాలని మనకు ఉద్బోధించబడుతోంది. మనమలా ఎలా చేయగలం? మనం దేవుని వాక్యమైన బైబిలును అధ్యయనం చేసేటప్పుడు, యెహోవా పనులు చేసేవిధానాల్ని గమనించి, ఆయన చిత్తానికీ సంకల్పానికీ మనం చెవి యొగ్గవలసిన అవసరం ఉంది. అలా చేయడం ద్వారా మనం మన ఆలోచనా విధానాన్ని సరైన మార్గంలోకి నడిపించుకోగల్గుతాము. అలా సంపాదించుకున్న ఆలోచనా సామర్థ్యం దైవిక తెలివికీ జ్ఞానానికీ అనుగుణంగా ఉంటుంది. ఈ సామర్థ్యాన్ని సరిగ్గా ఉపయోగించినప్పుడు, అనైతిక ఆకర్షణల బారిన పడకుండా అది మనల్ని కాపాడుతుంది.
నునుపైన మాటల విషయంలో జాగ్రత్త
అపరిశుభ్రమైన లోకంలో నైతిక స్వచ్ఛతను కాపాడుకునేందుకు ఆలోచనా సామర్థ్యము అవసరమనడానికి గల ఒక కారణమేమిటంటే అనైతిక వ్యక్తి మార్గములు మోసకరమైనవిగా ఉండడమే. సొలొమోను ఇలా హెచ్చరిస్తున్నాడు: “జార స్త్రీ పెదవులనుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనెకంటెను నునుపైనవి. దానివలన కలుగు ఫలము ముసిణిపండంత చేదు; అది రెండంచులుగల కత్తియంత పదునుగలది.”—సామెతలు 5:3, 4.
ఈ సామెతలో విచ్ఛలవిడిగా తిరిగే వ్యక్తిని “జార స్త్రీ” అని వర్ణించడం జరిగింది. ఆమె తన వద్దకు వచ్చేవారిని మోసగించటానికి ఉపయోగించే మాటలు తేనెపట్టంత తీయనివీ, ఓలీవ నూనె కంటే నునుపైనవీ. చాలా వరకూ అనైతికమైన లైంగిక వ్యవహారాలు ప్రారంభమయ్యేది ఇలాగే కాదా? ఉదాహరణకు, సెక్రటరీగా పనిచేస్తున్న, 27 ఏళ్ళ అమీ అనే అందమైన స్త్రీ అనుభవాన్ని పరిశీలించండి. ఆమె ఇలా చెప్తుంది: “నా ఉద్యోగ స్థలంలో ఉండే ఒక వ్యక్తి నా గురించి ఎంతో శ్రద్ధ తీసుకుంటూ, నన్ను ప్రతి క్షణం ప్రశంసిస్తూ ఉంటాడు. ఇతరుల అవధానాన్ని పొందడం బాగానే ఉంటుంది. కానీ నాపై అతను చూపించే ఆ శ్రద్ధ అంతా కేవలం లైంగికపరమైన ఆసక్తితోనేనని నాకు స్పష్టంగా అర్థమయ్యింది. నేను అతని ఆ ప్రయత్నాలకు మోసపోయి లొంగిపోను.” అనైతిక ప్రవర్తనగల వారి ముఖస్తుతి మాటలు మనం వాటి నిజస్వరూపాన్ని గమనించనంత వరకూ సాధారణంగా చాలా ఆకర్షణీయంగానే ఉంటాయి. అయితే, వాటి నిజస్వరూపాన్ని గమనించటానికి మనం మన ఆలోచనా సామర్థ్యాన్ని ఉపయోగించవలసిన అవసరం ఉంది.
అనైతికతకు పాల్పడడం వల్ల వచ్చే పర్యవసానాలు ముసిణి పండంత చేదుగా, రెండంచులు గల ఖడ్గమంత పదునుగా అంటే బాధాకరంగా, మరణకరమైనవిగా ఉంటాయి. కలవరపెట్టే మనస్సాక్షి, అవాంఛిత గర్భధారణ, లేదా లైంగిక సంబంధాల మూలంగా సంక్రమించే వ్యాధి, ఇవే సాధారణంగా అలాంటి ప్రవర్తన వల్ల వచ్చే పర్యవసానాలు. నమ్మకద్రోహానికి పాల్పడిన వ్యక్తి యొక్క వివాహ భాగస్వామి అనుభవించే తీవ్రమైన మానసిక వేదన గురించి కూడా ఆలోచించండి. నమ్మకద్రోహానికి పాల్పడుతూ చేసే ఒక్క చర్య జీవితాంతం మిగిలిపోయే గాయాలను ఏర్పరచగలదు. అవును, లైంగిక దుర్నీతి హానిని కలుగజేస్తుంది.
విచ్ఛలవిడిగా తిరిగే స్త్రీ జీవన విధానం గురించి వ్యాఖ్యానిస్తూ, జ్ఞానియైన ఆ రాజు ఇంకా ఇలా అంటున్నాడు: “దాని నడతలు మరణమునకు దిగుటకు దారితీయును. దాని అడుగులు పాతాళమునకు [హెబ్రీలో షియోల్] చక్కగా చేరును. అది జీవమార్గమును ఏమాత్రమును విచారింపదు. దానికి తెలియకుండనే దాని పాదములు ఇటు అటు తిరుగును.” (సామెతలు 5:5, 6) అనైతిక ప్రవర్తన గల ఆ స్త్రీ మార్గాలు ఆమెను మరణానికి నడిపిస్తాయి—ఆమె అడుగులు మానవజాతి సాధారణ సమాధియైన షియోల్‌కు నడిపిస్తాయి. లైంగిక సంబంధాల వల్ల సంక్రమించిన వ్యాధులు, ప్రాముఖ్యంగా ఎయిడ్స్ ఇప్పుడు సర్వవ్యాప్తంగా విస్తరించాయి గనుక ఈ మాటలు ఎంత నిజమో కదా ! ఆమె వంకర మార్గాలను అనుసరించే వారికి పట్టే గతే ఆమెకూ పడుతుంది.
హృదయపూర్వకమైన శ్రద్ధతో, రాజు ఇలా ఉద్బోధిస్తున్నాడు: “కుమారులారా, నా మాట ఆలకింపుడి నేను చెప్పు ఉపదేశమునుండి తొలగకుడి. జార స్త్రీ యుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసికొనుము దాని యింటివాకిటి దగ్గరకు వెళ్లకుము.”—సామెతలు 5:7, 8.
అనైతక ప్రవర్తనగల ప్రజల ప్రభావం నుండి మనం వీలైనంత దూరంగా ఉండాలి. అసహ్యకరమైన పాటలతో కూడిన సంగీతాన్ని వినడం ద్వారా, కలుషితపరిచే వినోద కార్యక్రమాల్ని చూడడం ద్వారా, లేదా అసభ్యకరమైన చిత్రాలను చూడ్డం లేక అసభ్యకరమైన సమాచారాన్ని చదవడం వంటి వాటి ద్వారా మనల్ని మనం వారికి ఎరగా ఎందుకు చేసుకోవడం? (సామెతలు 6:27; 1 కొరింథీయులు 15:33; ఎఫెసీయులు 5:3-5) అసభ్యకరమైన ప్రవర్తన ద్వారా, అసభ్యకరమైన వస్త్రధారణ కేశాలంకరణల ద్వారా అనైతిక ప్రవర్తనగల ప్రజల అవధానాన్ని పొందటానికి ప్రయత్నించటం ఎంత అవివేకం !—1 తిమోతి 4:8; 1 పేతురు 3:3, 4.
చెల్లించవలసిన అధిక మూల్యం
సరైన ప్రవర్తన లేని వ్యక్తి మార్గాల నుండి ఇంకా ఏ కారణాన్ని బట్టి మనం దూరంగా ఉండాలి? సొలొమోను ఇలా సమాధానమిస్తున్నాడు: “పరులకు నీ యౌవనబలమును క్రూరులకు నీ జీవితకాలమును ఇచ్చివేతువు; నీ ఆస్తివలన పరులు తృప్తి పొందుదురు, నీ కష్టార్జితము అన్యుల యిల్లు చేరును. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు . . . మూలుగుచు నుందువు.”—సామెతలు 5:9-14.
అలా సొలొమోను, అనైతికతకు పాల్పడటం వల్ల చెల్లించవలసి వచ్చే అధిక మూల్యాన్ని నొక్కి చెప్తున్నాడు. ఒకరు జారత్వానికి పాల్పడినప్పుడు, తనకున్న గౌరవాన్ని లేదా ఆత్మాభిమానాన్ని తప్పకుండా పోగొట్టుకుంటాము. మన స్వంత అనైతిక కోరికలను తీర్చుకోవడానికి లేక ఇతరుల కోరికలను తీర్చడానికి ఒక మాధ్యమంగా ఉండడం అవమానకరంకాదా? మన వివాహ జత కాని వ్యక్తితో లైంగిక సంబంధం పెట్టుకోవడం ఆత్మాభిమానలోపాన్ని చూపించదా?
అయితే ‘మన జీవితకాలాన్ని, ఆస్తిని, కష్టార్జితాన్ని పరులకు లేక అన్యులకు ఇచ్చివేయడంలో’ ఏమి ఇమిడి ఉంది? ఒక పుస్తకం ఇలా తెలియజేస్తుంది: “ఈ వచనాలు చెప్తున్న విషయం స్పష్టంగా ఉంది: వివాహంలో నమ్మకద్రోహానికి పాల్పడితే
చెల్లించవలసిన మూల్యం చాలా ఎక్కువ; ఒకరు వేటి కోసమైతే శ్రమపడతారో అవి అంటే హోదా, అధికారం, ధనం వంటివి ఆ స్త్రీ యొక్క విపరీతమైన కోరికలను తీర్చటానికో లేదా సమాజానికి పరిహారం చెల్లించటానికో వ్యయమైపోతాయి.” అవును అనైతిక సంబంధాలకు చాలా మూల్యం చెల్లించవలసి ఉంటుంది !తన గౌరవాన్నీ, ఆస్తినీ కోల్పోయిన ఒక మూర్ఖుడు ఇలా విలపించవచ్చు, “అయ్యో, ఉపదేశము నేనెట్లు త్రోసివేసితిని? నా హృదయము గద్దింపు నెట్లు తృణీకరించెను? నా బోధకుల మాట నేను వినకపోతిని నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. నేను సమాజ సంఘముల మధ్యనుండినను ప్రతివిధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే యెడమాయెను.”—సామెతలు 5:12-14.
కొంతకాలం తర్వాత పాపి వ్యక్తపర్చే భావాల గురించి ఒక పండితుడు ఇలా అంటున్నాడు, “‘అలా చేయకపోతే బావుండు’ అనే విచారాల పెద్ద పట్టిక: మా నాన్నగారు చెప్పింది వినుంటే బావుండు; నా ఇష్టం వచ్చినట్లు నేను చేసిఉండకపోతే బావుండు; ఇతురులిచ్చిన సలహా తీసుకునుంటే బావుండు.” అయితే, ఈ గ్రహింపు చాలా ఆలస్యంగా వస్తుంది. అనైతికతకు పాల్పడిన వ్యక్తి జీవితం ఇప్పటికే నాశనమైపోయి, ఆయన పేరుమీద మచ్చ పడిపోతుంది. మనం లైంగిక దుర్నీతిలో చిక్కుకుపోక ముందే దానికి చెల్లించవలసి వచ్చే అత్యధిక మూల్యాన్ని గురించి ఆలోచించడం ఎంత ప్రాముఖ్యం !
“నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయుము”
లైంగిక సంబంధాల గురించి బైబిలు మౌనంగా ఉందా? ఎంతమాత్రం లేదు. స్త్రీ పురుషుల మధ్యనుండే అనురాగం, పారవశ్యం వంటి భావావేశాలు దేవుడిచ్చిన వరాలు. అయితే, ఈ సాన్నిహిత్యం కేవలం వివాహ దంపతుల మధ్యే ఉండాలి. కాబట్టి ఒక వివాహిత వ్యక్తికి సొలొమోను ఈ ఉపదేశాన్నిస్తున్నాడు: “నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయుము, నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము. నీ ఊటలు బయటికి చెదరిపోదగునా? వీధులలో అవి నీటి కాలువగా పారదగునా? అన్యులు నీతోకూడ వాటి ననుభవింపకుండ అవి నీకే యుండవలెను గదా.”—సామెతలు 5:15-17.
“నీ సొంత కుండ,” “నీ సొంత బావి” అన్న పదాలు ప్రియమైన భార్యను ఉద్దేశించి ఉపయోగించబడిన పదాలు. ఆమెతో లైంగిక ఆనందాన్ని పొందడం సేదదీర్పునిచ్చే నీళ్లు తాగడంతో పోల్చబడింది. కుండ లేక బావి అనేవి బహిరంగ స్థలాల్లో లభ్యమయ్యే నీటి సరఫరాలా కాకుండా, కేవలం ఒక్క ఇంటికే చెందే స్వంత ఆస్తిగా పరిగణింపబడతాయి. ఒక పురుషుడు ఇంటి వద్ద తన భార్య ద్వారా పిల్లలకు తండ్రి కావాలేగానీ పరాయి స్త్రీలతో అక్రమ సంబంధం పెట్టుకోవడం ద్వారా కాదు. కాబట్టి స్పష్టంగా, పురుషునికి ఇవ్వబడుతున్న ఉపదేశం ఏమిటంటే, అతడు తన భార్య పట్ల నమ్మకంగా ఉండాలన్నదే.
జ్ఞాని ఇంకా ఇలా కొనసాగిస్తున్నాడు: “నీ ఊట దీవెన నొందును. నీ యౌవనకాలపు భార్యయందు సంతోషింపుము. ఆమె అతిప్రియమైన లేడి, అందమైన దుప్పి. ఆమె రొమ్ములవలన నీవు ఎల్లప్పుడు తృప్తినొందుచుండుము. ఆమె ప్రేమచేత నిత్యము బద్ధుడవై యుండుము.”—సామెతలు 5:18, 19.
“ఊట” అన్నది లైంగిక సంతృప్తి ఉద్భవించేదాన్ని సూచిస్తుంది. తమ వివాహ జతతో లైంగిక ఆనందాన్ని పొందడం ఒక “దీవెన” అంటే అది దేవుడిచ్చినది. కాబట్టి తన యౌవనకాలపు భార్యతో సుఖించమని పురుషునికి ఉద్బోధించబడుతుంది. ఆయనకు ఆమె ఎంతో ప్రియమైన, అందమైన లేడిలాంటిది, ముగ్ధమనోహరమైన దుప్పిలాంటిది.
తర్వాత సొలొమోను జవాబులు స్పష్టంగా ఉన్న రెండు ప్రశ్నలు వేస్తున్నాడు: “నా కుమారుడా, జార స్త్రీయందు నీవేల బద్ధుడవై యుందువు? పర స్త్రీరొమ్ము నీవేల కౌగలించుకొందువు?” (సామెతలు 5:20) అవును, వివాహితుడైన ఒక వ్యక్తి ఉద్యోగ స్థలంలో, బడిలో లేక మరెక్కడైనా పరాయి వాళ్లతో లైంగిక సంబంధాన్ని పెట్టుకునే ప్రలోభానికి ఎందుకు లొంగిపోవాలి?
1 కొరింథీయులు 7:29-31) దీనిలో ఏమి ఇమిడి ఉంది? యేసుక్రీస్తు అనుచరులు ‘రాజ్యమును మొదట వెదకాలి.’ (మత్తయి 6:33) కాబట్టి, వివాహిత దంపతులు తమ జీవితాల్లో రాజ్యాసక్తులకు రెండవ స్థానం ఇచ్చేంతగా ఎప్పుడూ ఒకరి పట్ల ఒకరు శ్రద్ధ చూపించుకోవడంలో మునిగిపోకూడదు.
అపొస్తలుడైన పౌలు వివాహిత క్రైస్తవులకు ఇలా ఉపదేశిస్తున్నాడు: “సహోదరులారా, నేను చెప్పునదేమనగా, కాలము సంకుచితమై యున్నది గనుక ఇకమీదట భార్యలు కలిగినవారు భార్యలు లేనట్టు . . . ఉండవలెను.” (స్వయం నియంత్రణ యొక్క అవసరత
లైంగిక కోరికలను అదుపు చేసుకోవచ్చు. యెహోవా అనుగ్రహాన్ని కోరుకునే వాళ్లు తమను తాము తప్పక అదుపు చేసుకోవాలి. “మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును, దేవుని ఎరుగని అన్యజనులవలె కామాభిలాషయందు కాక, పరిశుద్ధతయందును ఘనతయందును తన తన ఘటమును [తన స్వంత శరీరమును] ఎట్లు కాపాడుకొనవలెనో అది యెరిగియుండుటయే దేవుని చిత్తము” అని అపొస్తలుడైన పౌలు ఉపదేశిస్తున్నాడు.—1 థెస్సలొనీకయులు 4:3-5.
మరి యౌవనస్థులు ప్రప్రధమంగా లైంగిక కోరికలు కల్గినప్పుడే వివాహం చేసేసుకోవాలని ఆతురపడిపోకూడదు. వివాహమంటే దానిలో నిబద్ధత ఉంది, అలాంటి బాధ్యతకు తగిన విధంగా జీవించాలంటే పరిణతి అవసరం. (ఆదికాండము 2:24) ‘ఈడు మించిపోయే’ వరకు, అంటే లైంగిక కోరికలు బలంగా కల్గి తప్పొప్పులను గ్రహించే సామర్థ్యాన్ని మరుగుచేయగల కాలం గడిచిపోయే వరకు ఆగడం మంచిది. (1 కొరింథీయులు 7:36) వివాహం చేసుకోవాలనుకుంటున్న వ్యక్తి, తనకు తగిన వివాహజత అందుబాటులో లేనందుకు ఇతరులతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ఎంత అవివేకం, ఎంత పాపభరితం !
“దుష్టుని దోషములు వానిని చిక్కులబెట్టును”
లైంగిక దుర్నీతి తప్పు అనటానికి ప్రాథమిక కారణం ఏమిటంటే, మానవులకు జీవాన్నీ లైంగికపరమైన సామర్థ్యాన్నీ ఇచ్చిన దాతయైన యెహోవా దాన్ని ఆమోదించడం లేదు. కాబట్టి నైతికంగా నిష్కల్మషంగా ఉండటానికి బలమైన ప్రేరణను ఇస్తూ సొలొమోను రాజు ఇలా పేర్కొంటున్నాడు: “నరుని మార్గములను యెహోవా యెరుగును, వాని నడతలన్నిటిని ఆయన గుర్తించును.” (సామెతలు 5:21) అవును, దేవుని కళ్లకు ఏదీ మరుగై లేదు, ‘మనమాయనకు లెక్క యొప్పచెప్పవలసియున్నది.’ (హెబ్రీయులు 4:13) కాబట్టి లైంగిక దుర్నీతికి ఎంత రహస్యంగా పాల్పడినా, దాని వల్ల తలెత్తే భౌతిక సామాజిక పర్యవసానాలు ఏవైనప్పటికీ, ఆ దుర్నీతి యెహోవాతో మనకు గల సంబంధాన్ని తప్పక పాడుచేస్తుంది. అక్రమమైన క్షణికానందం కోసం దేవునితో మనకుగల సమాధానాన్ని పోగొట్టుకోవడం ఎంత మూర్ఖత్వం !
నిస్సిగ్గుగా అవినీతికి పాల్పడే వారికి ఏ శిక్షా రానట్లు కనిపించవచ్చు, కానీ అలా ఎంతోకాలం సాగదు. సొలొమోను ఇలా ప్రకటిస్తున్నాడు: “దుష్టుని దోషములు వానిని చిక్కులబెట్టును, వాడు తన పాపపాశములవలన బంధింపబడును. శిక్షలేకయే అట్టివాడు నాశనమగును, అతిమూర్ఖుడై వాడు త్రోవతప్పి పోవును.”—సామెతలు 5:22, 23.
మనమెవరమైనా అసలెందుకు దారి తప్పిపోవాలి? ఎంతైనా, సామెతల గ్రంథం ఈ లోకపు మోసకరమైన మార్గాల గురించి మనల్ని ముందే హెచ్చరిస్తోంది కదా ! లైంగిక దుర్నీతి మూలంగా సాధారణంగా చెల్లించవలసి వచ్చే మూల్యం, మన ఆరోగ్యం, మన వస్తుసంపదలు, మన బలం, మన గౌరవం అని అది మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. అలాంటి స్పష్టమైన ముందుచూపుతో, మనం “అలా చేయకుంటే బావుండు” అని విచారించే స్థితిలో ఉండవలసిన అవసరం ఎన్నడూ ఉండదు. అవును, యెహోవా తన ప్రేరేపిత వాక్యంలో ఇచ్చిన ఉపదేశాన్ని అన్వయించుకోవడం ద్వారా, ఈ నైతిక లోకంలో మనం పవిత్రంగా ఉండగలం.
[30వ పేజీలోని చిత్రం]
లైంగిక దుర్నీతికి పాల్పడడం వల్ల వచ్చే పర్యవసానాలు ముసిణి పండంత చేదు
[31వ పేజీలోని చిత్రం]
‘మీ యౌవనకాలపు భార్యతో సుఖించండి’