కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

తైవాన్‌లోని వరి పొలాల్లో సువార్తను ప్రకటించడం

తైవాన్‌లోని వరి పొలాల్లో సువార్తను ప్రకటించడం

మనము విశ్వాసము గలవారము

తైవాన్‌లోని వరి పొలాల్లో సువార్తను ప్రకటించడం

తై వాన్‌లో బాగా వర్షాలు కురుస్తాయి, దాని వల్ల ప్రతీ సంవత్సరం రెండుసార్లు మంచి వరి పంట చేతికొస్తుంది. అప్పుడప్పుడూ, వర్షాలు పడవలసిన సమయంలో పడకపోతే మొలకలు చచ్చిపోతాయి. ఇలా జరిగితే వ్యవసాయదారుడు నిరుత్సాహపడతాడా? లేదు, పట్టుదల అవసరమని అతనికి తెలుసు. అతడు మళ్లీ విత్తనాలు జల్లి క్రొత్తగా నాట్లు వేస్తాడు. అప్పుడు పరిస్థితులు మెరుగుపడితే ఆ వ్యవసాయదారుడు మంచి పంట కోస్తాడు. కొన్నిసార్లు ఆధ్యాత్మికంగా నాటడం, కోయడం కూడా అలాగే ఉంటుంది.

ఆధ్యాత్మిక కోతలో పట్టుదల కలిగివుండడం

సంవత్సరాలుగా తైవాన్‌లోని యెహోవాసాక్షులు అంత ఫలవంతమైనవిగా అనిపించని కొన్ని ప్రాంతాల్లో లేఖన సత్య విత్తనాలను నాటి, పంట కోయడానికి చాలా కృషి చేశారు. అందుకు ఒక ఉదాహరణ మియోలీ కౌంటీ. ఆ ప్రాంతంలో సాక్ష్యమిచ్చేందుకు చేసిన కృషిలో అప్పుడప్పుడూ కొంత ప్రతిస్పందన కన్పించేది. కాబట్టి 1973 లో అక్కడ పూర్తికాల రాజ్య ప్రచారకులుగా పనిచేసేందుకు ఒక ప్రత్యేక పయినీర్ల జంటను నియమించారు. ప్రారంభంలో, కొంతమంది సువార్త పట్ల ఆసక్తి చూపించారు. అయితే ఆ ఆసక్తి కొంతకాలానికే సన్నగిల్లిపోయింది. అప్పుడు, ఆ ప్రత్యేక పయినీర్లు మరో ప్రాంతానికి పంపించబడ్డారు.

మరో ఇద్దరు ప్రత్యేక పయినీర్లను 1991 లో అక్కడికి పంపించారు. కానీ ఆధ్యాత్మిక పెరుగుదలకు వాతావరణం ఇది కాదని అక్కడున్న పరిస్థితులు సూచించాయి. కొన్ని సంవత్సరాల తర్వాత, మరింత అభివృద్ధి కలుగుతుందని అపేక్షించిన ప్రదేశాలకు వాళ్లను తిరిగి నియమించడం జరిగింది. అలా ఆ పొలం కొంతకాలం సాగుచేయని పొలంగా విడిచిపెట్టబడింది.

పునఃకృషి వల్ల విజయం

తైవాన్‌లోని ఏ సంఘానికీ నియమించబడని సువిశాలమైన ప్రాంతంలో ఎక్కువ ఫలవంతమైన ప్రాంతాలను వెదికేందుకు కృషిచేయాలని 1998 సెప్టెంబరులో నిర్ణయించడమైంది. దీన్ని సాధించడమెలా? అధిక జనాభావున్న అనియమిత ప్రాంతాల్లో పనిచేసేందుకు దాదాపు 40 మంది తాత్కాలిక ప్రత్యేక పయినీర్లను నియమించడం ద్వారా.

మియోలీ కౌంటీలోని ప్రక్క ప్రక్కనున్న రెండు నగరాలు ప్రచారపని కోసం ఎంపిక చేయబడ్డాయి. అవివాహితులైన నలుగురు సహోదరీలు మూడు నెలలపాటు ఆ ప్రాంతాన్ని పరిశీలించేందుకు నియమించారు. వారు అక్కడికి చేరుకుని, తాము కనుగొన్న ఆసక్తిగల ప్రజలను గూర్చిన తేజోవంతమైన నివేదికలను వ్రాశారు. వాళ్ళు ఆ ప్రాంతంలో తమ మూడు నెలల పయినీరింగ్‌ను ముగించేసరికి వాళ్ళు చాలా గృహ బైబిలు పఠనాలను నిర్వహిస్తున్నారు. అక్కడికి దగ్గరలో ఉన్న ఒక సంఘ పెద్ద సహాయంతో వాళ్లు ఒక పుస్తక పఠన గుంపును కూడా స్థాపించారు.

చక్కగా పెరుగుతున్న “మొలకల” గురించి శ్రద్ధ తీసుకోవడానికి తాము ఇక్కడే ఉండడానికి ఇష్టపడుతున్నామని ఆ సహోదరీల్లో ముగ్గురు తెలియజేశారు. అందువల్ల, వారిలో ఇద్దరిని శాశ్వత ప్రత్యేక పయినీర్లుగా నియమించారు, ఒకరు క్రమ పయినీరుగా కొనసాగారు. సమీపంలో ఉన్న సంఘంలోని ఒక పెద్ద వాళ్లకు సహాయం చేసేందుకు ఆ ప్రాంతానికి తరలివెళ్లారు. ఆ ప్రాంతంలో ఇవ్వబడిన బహిరంగ ప్రసంగానికి 60 కన్నా ఎక్కువమంది హాజరయ్యారు. అనేక పుస్తక పఠనాలతోపాటు ఆదివారం కూడా క్రమంగా కూటాలు జరిగేందుకు దగ్గరలో ఉన్న సంఘం ఇప్పుడు సహాయం చేస్తుంది. ఆ ప్రాంతంలో త్వరలోనే ఒక క్రొత్త సంఘం ఏర్పడవచ్చు.

తైవాన్‌లోని ఇతర ప్రాంతాల్లో పట్టుదల కలిగివుండడం వల్ల వచ్చిన ఆశీర్వాదాలు

ఇతర ప్రాంతాలు కూడా అదేవిధంగా ప్రతిస్పందించాయి. ఆ ద్వీపానికి ఈశాన్య భాగాన ఉన్న ఇలాన్‌ కౌంటీలో తాత్కాలిక ప్రత్యేక పయినీర్లు పని చేసిన ప్రాంతంలో ఒక క్రొత్త సంఘ పుస్తక పఠన గుంపు స్థాపించబడింది.

ఒక సాయంత్రం ఇంటింటి పని చేస్తుండగా, తాత్కాలిక ప్రత్యేక పయినీరుగా సేవ చేస్తున్న ఒక సహోదరి ఒక యౌవనుడ్ని కలిసి, సంఘకూటాల గురించి తెలియజేసే హ్యాండ్‌బిల్లును ఆయనకు చూపించింది. వెంటనే అతనిలా అడిగాడు: “రేపు సాయంకాలం జరిగే మీ కూటానికి నేను హాజరవ్వవచ్చా? అలాగైతే నేను ఏ బట్టలు వేసుకోవాలి?” ఈ పయినీరు సహోదరి వారానికి ఎనిమిది మంది ఆసక్తిగల వారితో పఠనం చేయడం మొదలుపెట్టింది. ఆ బైబిలు విద్యార్థుల్లో చాలామంది బాప్తిస్మం తీసుకోవాలనే గమ్యంతో సువార్త ప్రచారకులుగా అవ్వబోతున్నారు.

అదే పట్టణంలో మరొక వ్యక్తి చాలా సంవత్సరాలుగా చర్చికి వెళ్తూ ఉంది, కానీ ఆమెకు బైబిలు గురించి బోధించేవాళ్ళు దొరకలేదు. బైబిలు పఠన ఏర్పాటును గురించి విన్నప్పుడు ఆమె ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంది. తన పాఠాన్ని ముందుగానే సిద్ధపడాలని ఆమెను ప్రోత్సహించడం జరిగింది. తాత్కాలిక ప్రత్యేక పయినీరు పఠనం చేయడానికి వచ్చేటప్పటికి, ఆ పఠనం చేసే పాఠంలోని ప్రశ్నలన్నింటినీ తను కొనుక్కున్న నోట్‌బుక్‌లో వ్రాసుకొనివుండడం అంటే ఆమె కొంత “హోమ్‌వర్క్‌” చేసుకొని ఉండడాన్ని ఆ సహోదరి గమనించింది. ఆ తర్వాత ప్రశ్నలన్నింటికీ వాటి క్రింద సమాధానాలు వ్రాసిపెట్టింది. ఆ పాఠంలో ఉదాహరించబడిన లేఖనాలను కూడా ఆమె ఆ నోట్‌బుక్‌లో వ్రాసిపెట్టింది. ఆ సహోదరి పఠనం చేయడానికి మొదటిసారి వెళ్ళేసరికి ఆ స్త్రీ మూడు పాఠాలను అప్పటికే సిద్ధపడిపోయివుంది !

మధ్య తైవాన్‌లో డాంగ్‌షీ పట్టణంలో అలాంటి ఫలితాలే కనపడ్డాయి. అక్కడ మూడు నెలలు పనిచేసిన తాత్కాలిక పయినీర్లు 2,000 కన్నా ఎక్కువ బ్రోషూర్‌లను అందించారు. మూడవ నెలకల్లా వాళ్ళు 16 గృహ బైబిలు పఠనాలను నిర్వహిస్తున్నారు. మధ్య తైవాన్‌లో 1999 సెప్టెంబరు 21న భూకంపం వచ్చి ఆ పట్టణం అధికశాతం పాడైపోయినప్పటికీ కొంతమంది ఆసక్తిగలవారు ఆధ్యాత్మికంగా అభివృద్ధి సాధిస్తున్నారు. వాళ్ళు ఒక గంట ప్రయాణం చేయవల్సినప్పటికీ అక్కడికి దగ్గరలో ఉన్న రాజ్యమందిరంలోని కూటాలకు హాజరవుతున్నారు. అవును, మంచి పంటను కోయడానికి పట్టుదల చాలా అవసరం, అది భౌతిక సంబంధమైన పంటైనా ఆధ్యాత్మిక సంబంధమైన పంటైనా.

[8వ పేజీలోని మ్యాపు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

చైనా

తైవాన్‌ జలసంధి

తైవాన్‌

[చిత్రసౌజన్యం]

Mountain High Maps® Copyright © 1997 Digital Wisdom, Inc.