కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పునరుత్థాన నిరీక్షణ ఒక వాస్తవం!

పునరుత్థాన నిరీక్షణ ఒక వాస్తవం!

పునరుత్థాన నిరీక్షణ ఒక వాస్తవం!

‘పునరుత్థానము కలుగబోతుందని నాకు దేవునియందు నిరీక్షణ ఉంది.’అపొస్తలుల కార్యములు 24:14, 15.

1. మనం పునరుత్థానం కోసం ఎందుకు నిరీక్షించవచ్చు?

పునరుత్థానం జరుగుతుందని నమ్మకముంచడానికి యెహోవా మనకు తగిన కారణాలను ఇచ్చాడు. మృతులు తిరిగి లేస్తారనీ, మళ్లీ సజీవులౌతారనీ ఆయన వాగ్దానం చేశాడు. కాబట్టి, మరణమందు నిద్రించిన వారిపట్ల ఆయనకున్న సంకల్పం తప్పకుండా నెరవేరుతుంది. (యెషయా 55:11; లూకా 18:27) నిజానికి, మృతులను తిరిగి లేపేందుకు తనకున్న శక్తిని దేవుడు ఇప్పటికే చూపించాడు.

2. పునరుత్థాన నిరీక్షణ మనకెలా ప్రయోజనం చేకూర్చగలదు?

2 దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మృతులను తిరిగి లేపేందుకు ఒక ఏర్పాటు చేశాడు, ఆ ఏర్పాటుపై మనకున్న విశ్వాసం ఒత్తిడి సమయాల్లో మనల్ని బలపర్చగలదు. చివరికి మరణం వరకూ మన పరలోక తండ్రి పట్ల మన యథార్థతను కాపాడుకోవడానికి కూడా పునరుత్థాన నిరీక్షణ ఒక వాస్తవమన్న నమ్మిక మనకు సహాయం చేయగలదు. సజీవులైన వారి గురించి బైబిల్లో వ్రాయబడివున్న వృత్తాంతాలను మనం పరిశీలిస్తే మన పునరుత్థాన నిరీక్షణ మరింత బలపడే అవకాశముంది. ఈ అద్భుతాలన్నీ సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇచ్చిన శక్తి ద్వారానే సాధించబడ్డాయి.

మరణించిన తమ వారిని పునరుత్థానం ద్వారా వాళ్లు తిరిగి పొందారు

3. సారెపతులోని విధవరాలి కుమారుడు మరణించినప్పుడు ఏమి చేయడానికి ఏలీయాకు శక్తి ఇవ్వబడింది?

3 అపొస్తలుడైన పౌలు క్రైస్తవపూర్వ యెహోవాసాక్షులు ప్రదర్శించిన విశ్వాసాన్ని గురించి హృదయాల్ని పులకరింపజేసే విధంగా సమీక్షిస్తూ, “స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానమువలన మరల పొందిరి” అని వ్రాశాడు. (హెబ్రీయులు 11:35; 12:1) ఆ స్త్రీలలో ఒకరు, సీదోనులో ఉన్న సారెపతు పట్టణానికి చెందిన ఒక బీద విధవరాలు. ఆమె దేవుని ప్రవక్తయైన ఏలీయాకు ఆతిధ్యమిచ్చినందుకు ఆయన అద్భుతరీతిగా ఆమె దగ్గరున్న పిండి, నూనె అయిపోకుండా చూశాడు, లేకపోతే అప్పుడున్న కరవు ఆమెనూ, ఆమె కుమారుడ్నీ బలి తీసుకుని ఉండేదే. ఆ తర్వాత ఆ పిల్లవాడు మరణించినప్పుడు, ఏలీయా అతడిని మంచం మీద పడుకోబెట్టి, ప్రార్థన చేసి, ఆ పిల్లవాడి మీద మూడుసార్లు పారచాచుకొని పడుకుని, “యెహోవా నా దేవా, నా మొఱ్ఱ ఆలకించి యూ చిన్నవానికి ప్రాణము మరల రానిమ్మని” వేడుకున్నాడు. దేవుడు నిజంగానే ఆ పిల్లవాడికి మళ్లీ ప్రాణం వచ్చేలా చేశాడు. (1 రాజులు 17:8-24) తన కుమారుని పునరుత్థానం ద్వారా తన విశ్వాసానికి తగిన ప్రతిఫలం లభించినప్పుడు ఆ విధవరాలికి ఎంత ఆనందం కల్గివుంటుందో ఊహించండి ! అదే బైబిల్లో వ్రాయబడివున్న మొట్టమొదటి పునరుత్థానం.

4. ఏలీషా షూనేములో ఏ అద్భుతాన్ని చేశాడు?

4 మరణించిన తన వారిని పునరుత్థానం ద్వారా తిరిగి పొందిన మరో స్త్రీ షూనేము పట్టణస్థురాలు. ఆమె ఒక వృద్ధుని భార్య, ఆమె ప్రవక్తయైన ఎలీషాపట్ల, ఆయన సేవకుని పట్ల కనికరం చూపించింది. ప్రతిఫలంగా ఆమెకు ఒక కుమారుడు జన్మించాడు. అయితే, కొన్ని సంవత్సరాల తర్వాత, తన కుమారుడు మరణించినప్పుడు ఆమె ఆ ప్రవక్తను పిలిపించింది. ఎలీషా ప్రార్థన చేసి కొన్ని చర్యలు తీసుకున్న తర్వాత, “బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను.” “బిడ్డ యేడుమారులు తుమ్మి కండ్లు తెరచెను.” ఈ పునరుత్థానం తల్లికీ, బిడ్డకూ నిస్సందేహంగా గొప్ప ఆనందాన్ని కల్గించి ఉంటుంది. (2 రాజులు 4:8-37; 8:1-6) అయితే “మరి శ్రేష్ఠమైన పునరుత్థానము” ద్వారా ఈ భూమిపై తిరిగి జీవాన్ని పొందినప్పుడు వాళ్లకు ఇంకెంత ఆనందం కల్గుతుందో కదా ! ఆ పునరుత్థానాన్ని పొందిన వాళ్లు మళ్లీ ఇక ఎన్నడూ మరణించవలసిన అవసరం ఉండదు ! పునరుత్థానం చేసే ప్రేమగల దేవుడైన యెహోవా పట్ల కృతజ్ఞత కల్గివుండడానికి ఇది ఎంత గొప్ప కారణం !—హెబ్రీయులు 11:35.

5. ఏలీషా తన మరణం తర్వాత కూడా ఒక అద్భుతం చేయడంలో ఎలా భాగం వహించాడు?

5 ఎలీషా మృతిపొంది సమాధి చేయబడిన తర్వాత కూడా, దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఎముకలను శక్తివంతం చేశాడు. దాని గురించి మనమిలా చదువుతాము: “మోయాబీయుల సైన్యము దేశముమీదికి వచ్చినప్పుడు కొందరు [ఇశ్రాయేలీయులు] ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషాయొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్లు మోపి నిలిచెను.” (2 రాజులు 13:20, 21) ఆ వ్యక్తి ఎంతగా ఆనందాశ్చర్యాలతో నిండిపోయి ఉంటాడో కదా ! యెహోవా దేవుని విఫలం కాని సంకల్పానికి అనుగుణ్యంగా మన ప్రియమైన వారు తిరిగి లేపబడినప్పుడు మనమూ ఎంతగా ఆనందిస్తామో ఒక్కసారి ఊహించండి !

దేవుని కుమారుడు మృతులను తిరిగి లేపాడు

6. నాయీను అనే నగరం వద్ద యేసు ఏ అద్భుతం చేశాడు, ఆ సంఘటన మనల్ని ఎలా ప్రభావితం చేయవచ్చు?

6 నిత్యజీవాన్ని పొందే ఉత్తరాపేక్షతో, మృతులు పునరుత్థానం చేయబడగలరని నమ్మడానికి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మనకు తగిన కారణాలను ఇచ్చాడు. నాయీను అనే నగరం వద్ద జరిగిన ఒక సంఘటన, అలాంటి అద్భుతం కేవలం దేవుడిచ్చే శక్తి ద్వారానే సాధ్యమౌతుందని మనం గుర్తించడానికి మనకు సహాయం చేస్తుంది. ఒక సందర్భంలో, ఒక యౌవనస్థుని శవాన్ని నగరం వెలుపల సమాధి చేయడానికి మోసుకుపోతున్న కొంతమంది దుఃఖితులను యేసు కలిశాడు. ఆ యౌవనస్థుడు ఒక విధవరాలి ఏకైక కుమారుడు. యేసు “ఏడువవద్దని” ఆమెతో అన్నాడు. తర్వాత ఆయన పాడెను ముట్టి, “చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నా”నన్నాడు. వెంటనే ఆ యౌవనస్థుడు లేచి కూర్చుని మాట్లాడసాగాడు. (లూకా 7:11-15) ఈ అద్భుతం, పునరుత్థాన నిరీక్షణ ఒక వాస్తవమన్న మన నమ్మకాన్ని తప్పకుండా బలపరుస్తుంది.

7. యాయీరు కుమార్తెకు ఏమి సంభవించింది?

7 కపెర్నహోములోని సమాజమందిరపు అధికారియైన యాయీరు విషయంలో జరిగిన ఒక సంఘటనను కూడా పరిశీలించండి. చావు బ్రతుకుల మధ్య ఉన్న పన్నెండేళ్ల తన ప్రియమైన కుమార్తె ప్రాణాన్ని కాపాడేందుకు రమ్మని ఆయన యేసును కోరాడు. కాని కొద్ది సేపట్లోనే ఆ అమ్మాయి మరణించిందన్న వార్త అందింది. దుఃఖిస్తున్న యాయీరును విశ్వాసం ఉంచమని చెప్పి, యేసు ఆయనతోపాటు ఆయనింటికి వెళ్లేసరికి, అక్కడున్న వాళ్లంతా ఏడుస్తున్నారు. “ఈ చిన్నది నిద్రించుచున్నదేగాని చనిపోలేదని” యేసు వారితో అన్నాడు, దానికి వాళ్లంతా నవ్వారు. నిజానికి ఆమె చనిపోయింది, కానీ గాఢ నిద్రలో ఉన్నవారిని లేపినట్లుగా మృతులను తిరిగి సజీవులను చేయడం సాధ్యమని యేసు చూపించబోతున్నాడు. ఆ అమ్మాయి చెయ్యి పట్టుకొని ఆయన, “చిన్నదానా, లెమ్మని” అన్నాడు. ఆమె వెంటనే లేచింది, ఆనందంతో “ఆమె తలిదండ్రులు విస్మయము నొందిరి.” (మార్కు 5:35-43; లూకా 8:49-56) మరణించిన తమ ప్రియమైనవారు పరదైసు భూమిపై తిరిగి జీవాన్ని పొందినప్పుడు వారి కుటుంబ సభ్యులు నిస్సందేహంగా “విస్మయము” నొందుతారు.

8. లాజరు సమాధి వద్ద యేసు ఏమి చేశాడు?

8 లాజరు మరణించి నాలుగు రోజులైంది. అప్పుడు యేసు ఆయన సమాధి దగ్గరకు వచ్చి దాని ద్వారానికున్న రాయిని తొలగింపజేశాడు. తాను దేవుడిచ్చే శక్తిపై ఆధారపడుతున్నానని చూపరులకు తెలిసేలా బహిరంగంగా ప్రార్థించిన తర్వాత, “లాజరూ, బయటికి రమ్మని” యేసు బిగ్గరగా అన్నాడు. వెంటనే ఆయన బయటికి రానే వచ్చాడు. ఆయన చేతులు కాళ్లు ఇంకా ప్రేత వస్త్రములతో చుట్టబడి ఉన్నాయి, ఆయన ముఖానికి కూడా రుమాలు కట్టబడి ఉంది. “అతని కట్లు విప్పిపోనియ్యుడని” యేసు అన్నాడు. లాజరు సహోదరీలైన మార్తా మరియలను ఓదార్చటానికి వచ్చిన అనేకులు ఈ అద్భుతాన్ని చూసి, యేసునందు విశ్వాసముంచారు. (యోహాను 11:1-45) ఈ వృత్తాంతం, దేవుని నూతన లోకంలో మీ ప్రియమైన వారు తిరిగి జీవాన్ని పొందుతారన్న నిరీక్షణను మీకు కల్గించడం లేదా?

9. యేసు ఇప్పుడు మృతులను పునరుత్థానం చేయగలడని మనమెందుకు నిశ్చయత కల్గివుండవచ్చు?

9 బాప్తిస్మమిచ్చే యోహాను చెరసాలలో ఉన్నప్పుడు, “గ్రుడ్డివారు చూపుపొందుచున్నారు . . . చనిపోయనవారు లేపబడుచున్నారు” అనే ఉత్తేజకరమైన వర్తమానాన్ని యేసు ఆయనకు పంపించాడు. (మత్తయి 11:4-6) యేసు ఈ భూమి మీద ఉన్నప్పుడే మృతులను పునరుత్థానం చేయగలిగాడు గనుక, దేవుని నుండి శక్తిని పొందిన శక్తివంతమైన ఆత్మ ప్రాణిగా ఆయన తప్పక పునరుత్థానం చేయగల్గుతాడు. యేసే “పునరుత్థానమును జీవమును” అయ్యున్నాడు గనుక, సమీప భవిష్యత్తులో “సమాధులలో నున్నవారందరు ఆయన శబ్దము విని . . . బయటికి వచ్చెదర”ని తెలుసుకోవడం ఎంత ఓదార్పుకరంగా ఉంటుందో కదా !—యోహాను 5:28, 29; 11:25.

ఇతర పునరుత్థానాలు మన నిరీక్షణను బలపరుస్తాయి

10. ఒక అపొస్తలుడు చేసినట్లుగా నివేదించబడుతున్న మొదటి పునరుత్థానాన్ని మీరెలా వివరిస్తారు?

10 యేసు తన అపొస్తలులను రాజ్య ప్రచారకులుగా పంపుతూ, “చనిపోయనవారిని లేపుడి,” అని చెప్పాడు. (మత్తయి 10:5-8) అయితే ఇది సాధించేందుకు వారు దేవుని శక్తిపై ఆధారపడాలి. ఒక ఉదాహరణ చూద్దాం. సా.శ. 36 లో, యొప్పేలోవున్న దొర్కా (తబితా) అనే దైవభక్తిగల స్త్రీ మరణించింది. ఆమె చేసిన ఎన్నో మంచి కార్యాల్లో, అవసరంలో ఉన్న విధవరాండ్ర కోసం బట్టలు కుట్టడం కూడా ఒక భాగమే, వాళ్లంతా ఆమె మరణాన్ని బట్టి దుఃఖిస్తున్నారు. శిష్యులు ఆమె సమాధి కోసం సిద్ధపాట్లు చేసి, బహుశా అపొస్తలుడైన పేతురు నుండి ఓదార్పు పొందడానికి ఆయన కోసం కబురు పంపించారు. (అపొస్తలుల కార్యములు 9:32-38) ఆయన మేడ గదిలో నుండి అందరినీ పంపించివేసి, ప్రార్థన చేసి, “తబితా, లెమ్మ”ని అన్నాడు. ఆమె తన కళ్లు తెరిచి, లేచి కూర్చోవడంతో పేతురు ఆమెకు చెయ్యిచ్చి పైకి లేపాడు. ఒక అపొస్తలుడు చేసిన మొదటి పునరుత్థానంగా నివేదించబడిన ఈ పునరుత్థానం అనేకులు విశ్వాసులయ్యేలా చేసింది. (అపొస్తలుల కార్యములు 9:39-42) భవిష్యత్తులో పునరుత్థానం జరుగుతుందని నిరీక్షించటానికి ఇది కూడా అదనపు కారణాన్నిస్తుంది.

11. బైబిలు వృత్తాంతంలోని చివరి పునరుత్థానం ఏది?

11 బైబిలులో నివేదించబడిన చివరి పునరుత్థానం త్రోయలో జరిగింది. పౌలు తన మూడవ మిషనరీ యాత్రలో అక్కడ ఆగినప్పుడు, ఆయన మధ్యరాత్రి వరకూ తన ప్రసంగాన్ని కొనసాగించాడు. అలసట వల్లా, బహుశా దీపాలు ఎక్కువగా ఉండడం మూలంగా పుట్టిన వేడి వల్లా, స్థలం జనంతో క్రిక్కిరిసి పోయి ఉండడం వల్లా ఐతుకు అనే యౌవనస్థుడు నిద్రాభారము వలన జోగి మూడవ అంతస్తులోని కిటికీ నుండి క్రింద పడిపోయాడు. ఆయన కేవలం స్పృహ తప్పిపోవడం మాత్రమే కాదుగానీ, “చనిపోయినవాడై యెత్తబడెను.” పౌలు ఐతుకు మీదపడి అతనిని కౌగిలించుకొని, “మీరు తొందరపడకుడి, అతని ప్రాణమతనిలోనున్నదని” అక్కడున్నవారితో అన్నాడు. అంటే ఆ యౌవనస్థుడు తిరిగి జీవించాడని పౌలు చెబుతున్నాడు. దీని వల్ల అక్కడున్న వారికి “విశేషమైన ఆదరణ కలిగెను.” (అపొస్తలుల కార్యములు 20:7-12) దేవుని సేవలో ఉండిన తమ మునుపటి సహవాసులు పునరుత్థానం చేయబడతారన్న విషయం తెలుసుకుని దేవుని సేవకులు నేడు ఎంతో ఓదార్పును పొందుతారు.

పునరుత్థానం—ఎంతోకాలంగా ఉన్న ఒక నిరీక్షణ

12. రోమా పరిపాలకుడైన ఫెలిక్సు ఎదుట ఉన్నప్పుడు పౌలు ఏ నిశ్చయతను వ్యక్తపరిచాడు?

12 రోమా పరిపాలకుడైన ఫెలిక్సు సమక్షంలో విచారణ జరుగుతున్నప్పుడు, “ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథములయందును వ్రాయబడియున్నవన్నియు నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోవుచున్నదని . . . నేనుకూడ దేవునియందు నిరీక్షణయుంచి”యున్నానని పౌలు సాక్ష్యమిచ్చాడు. (అపొస్తలుల కార్యములు 24:14, 15) అయితే, దేవుని వాక్యంలో ఒక భాగమైన “ధర్మశాస్త్రమందు,” మరణించిన వారు తిరిగి లేస్తారని ఎక్కడ ఉంది?

13. దేవుడు తన మొదటి ప్రవచనాన్ని పలికినప్పుడు పునరుత్థానాన్ని సూచించాడని ఎందుకు చెప్పవచ్చు?

13 ఏదెనులో మొదటి ప్రవచనాన్ని ప్రవచించినప్పుడు దేవుడే స్వయంగా ఒక పునరుత్థానాన్ని సూచించాడు. దేవుడు “ఆది సర్పమైన” అపవాదియగు సాతానుకు శిక్ష విధించేటప్పుడు, “నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమె మీద కొట్టుదువని” అన్నాడు. (ప్రకటన 12:9; ఆదికాండము 3:14, 15) ఈ ప్రవచనంలో, స్త్రీ సంతానాన్ని మడిమె మీద కొట్టడమంటే యేసుక్రీస్తును చంపడం. తర్వాత ప్రవచనం ప్రకారం ఆ సంతానం సర్పం తలమీద కొట్టాలంటే, క్రీస్తు మృతులలో నుండి లేపబడాలి.

14. యెహోవా ‘సజీవులకే గానీ మృతులకు దేవుడు కాదన్నది’ ఎలా వివరించవచ్చు?

14 “పొదనుగురించిన భాగములో—ప్రభువు అబ్రాహాము దేవుడనియు ఇస్సాకు దేవుడనియు యాకోబు దేవుడనియు చెప్పుచు, మృతులు లేతురని మోషే సూచించెను; ఆయన సజీవులకే దేవుడు కాని మృతులకు దేవుడు కాడు; ఆయన దృష్టికి అందరును జీవించుచున్నారని” యేసు వెల్లడించాడు. (లూకా 20:27, 37, 38; నిర్గమకాండము 3:6) నిజానికి అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు మరణించారు, కానీ వారిని పునరుత్థానం చేయాలన్న దేవుని సంకల్పం నెరవేరడం ఎంత కచ్చితమంటే, ఆయనకు వాళ్లు సజీవులుగా ఉన్నట్లే లెక్క.

15. పునరుత్థానమందు నమ్మకం ఉంచడానికి అబ్రాహాముకు ఏ కారణముంది?

15 అబ్రాహాము పునరుత్థానమందు నిరీక్షణ ఉంచటానికి ఆయనకు కారణముంది. ఎందుకంటే ఆయనా ఆయన భార్య శారా ఎంతో వృద్ధులై పిల్లలను కనే సామర్థ్యం విషయంలో దాదాపు మరణించినట్లున్నప్పుడు దేవుడు అద్భుతరీతిగా వారి సంతానోత్పత్తి శక్తులను పునరుజ్జీవింపజేశాడు. అది ఒక విధంగా పునరుత్థానం వంటిదే. (ఆదికాండము 18:9-11; 21:1-3; హెబ్రీయులు 11:11, 12) అటు తర్వాత వాళ్ల కుమారుడైన ఇస్సాకు 25 ఏండ్ల వాడిగా ఉన్నప్పుడు, అతడ్ని తనకు బలి ఇవ్వమని దేవుడు అబ్రాహాముకు చెప్పాడు. అయితే అబ్రాహాము ఇస్సాకును చంపబోతున్న సమయంలో, యెహోవా దూత అతని చెయ్యి పట్టుకుని ఆపాడు. “[ఇస్సాకును] లేపుటకు దేవుడు శక్తిమంతుడని యెంచినవాడై,” అబ్రాహాము, “ఉపమానరూపముగా అతనిని మృతులలోనుండి మరల పొందెను.”—హెబ్రీయులు 11:17-19; ఆదికాండము 22:1-18.

16. అబ్రాహాము దేనికోసం నిరీక్షిస్తూ ఇప్పుడు మరణమందు నిద్రిస్తున్నాడు?

16 వాగ్దత్త సంతానమైన మెస్సీయ పరిపాలన క్రింద పునరుత్థానం జరుగుతుందని అబ్రాహాము నిరీక్షించాడు. దేవుని కుమారుడు తన మానవపూర్వ ఉనికి నుండే, అంటే పరలోకం నుండే, అబ్రాహాముకున్న విశ్వాసాన్ని గమనించాడు. అందుకే మానవునిగా యేసుక్రీస్తు యూదులతో ఇలా అన్నాడు: “మీ తండ్రియైన అబ్రాహాము నా దినము చూతునని మిగుల అనందించెను.” (యోహాను 8:56-58; సామెతలు 8:30, 31) అవును, దేవుని మెస్సీయ రాజ్యం క్రింద భూమిపై జీవించేందుకు పునరుత్థానం కోసం ఎదురుచూస్తూ అబ్రాహాము ఇప్పుడు మరణమందు నిద్రిస్తున్నాడు.—హెబ్రీయులు 11:8-10, 13.

ధర్మశాస్త్రం నుండి, కీర్తనల నుండి సాక్ష్యం

17. ‘ధర్మశాస్త్రమందు వ్రాయబడి ఉన్న విషయాలు’ యేసుక్రీస్తు పునరుత్థానాన్ని ఎలా సూచిస్తున్నాయి?

17 పౌలుకున్న పునరుత్థాన నిరీక్షణ, ‘ధర్మశాస్త్రమందు వ్రాయబడివున్న వాటితో’ పొందిక కల్గివుంది. దేవుడు ఇశ్రాయేలీయులకు ఇలా చెప్పాడు: “మీ మొదటి పంటలో [అంటే, ప్రథమ ఫలములో] ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను. యెహోవా మిమ్ము నంగీకరించునట్లు అతడు [నీసాను 16వ తేదీన] యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను.” (లేవీయకాండము 23:9-14) బహుశా ఈ ధర్మశాస్త్ర నియమాన్ని మనస్సులో ఉంచుకునే పౌలు ఇలా వ్రాశాడు: “నిద్రించినవారిలో ప్రథమఫలముగా క్రీస్తు మృతులలోనుండి లేపబడియున్నాడు.” యేసు “ప్రధమఫలముగా” సా.శ. 33, నీసాను 16వ తేదీన పునరుత్థానం చేయబడ్డాడు. ఆ తర్వాత, భవిష్యత్తులో ఆయన ప్రత్యక్షత సమయంలో, ‘తర్వాతి ఫలములైన’ ఆయన ఆత్మాభిషిక్త అనుచరుల పునరుత్థానం జరుగనైయుంది.—1 కొరింథీయులు 15:20-23; 2 కొరింథీయులు 1:21; 1 యోహాను 2:20, 27.

18. యేసు పునరుత్థానం గురించి కీర్తనలు ముందే తెలియజేసినట్లు పేతురు ఎలా చూపించాడు?

18 కీర్తనలు కూడా పునరుత్థానానికి మద్దతునిస్తున్నాయి. “[క్రీస్తును] గూర్చి దావీదు ఇట్లనెను—నేనెల్లప్పుడు నా యెదుట ప్రభువును చూచుచుంటిని ఆయన నా కుడిపార్శ్వమున నున్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా హృదయము ఉల్లసించెను; నా నాలుక ఆనందించెను మరియు నా శరీరము కూడ నిరీక్షణ గలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవు” అంటూ సా.శ. 33వ సంవత్సరం పెంతెకొస్తు దినాన అపొస్తలుడైన పేతురు కీర్తన 16:8-11 నుండి ఎత్తి చెప్పాడు. పేతురు ఇంకా ఇలా అన్నాడు: “క్రీస్తు పాతాళములో విడువ బడలేదనియు, ఆయన శరీరము కుళ్లిపోలేదనియు దావీదు ముందుగా తెలిసికొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను.”—అపొస్తలుల కార్యములు 2:25-32.

19, 20. పేతురు కీర్తన 118:22 నుండి ఎప్పుడు ఎత్తి చెప్పాడు, అది యేసు మరణ పునరుత్థానాలతో ఎలా సంబంధం కల్గివుంది?

19 కొన్ని రోజుల తర్వాత, పేతురు యూదుల మహాసభవారి ఎదుట నిలువబడి, మళ్లీ కీర్తనల నుండి ఎత్తి చెప్పాడు. కుంటి బిక్షగాడిని ఎలా స్వస్థపరిచావని అడిగినప్పుడు, అపొస్తలుడు ఇలా అన్నాడు: “మీరందరును ఇశ్రాయేలు ప్రజలందరును తెలిసికొనవలసిన దేమనగా, మీరు సిలువవేసినట్టియు, మృతులలోనుండి దేవుడు లేపినట్టియు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థతపొంది మీ యెదుట నిలుచుచున్నాడు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయ ఆయనే; ఆ రాయ మూలకు తలరాయ ఆయెను. మరి ఎవని వలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము.”—అపొస్తలుల కార్యములు 4:10-12.

20 పేతురు ఇక్కడ కీర్తన 118:22ను ఎత్తి చెప్తూ, అది చెప్తున్న దాన్ని యేసు మరణానికీ, పునరుత్థానానికీ అన్వయించాడు. తమ మత నాయకులచే పురికొల్పబడి యూదులు యేసును నిరాకరించారు. (యోహాను 19:14-18; అపొస్తలుల కార్యములు 3:14, 15) అంటే ‘ఇల్లు కట్టువారు రాయిని నిరాకరించడం’ క్రీస్తు మరణానికి దారితీసింది, కానీ ‘ఆ రాయి మూలకు తలరాయి కావడం’ ఆయన పరలోక మహిమకు అత్మ వ్యక్తిగా ఎత్తబడటాన్ని సూచిస్తుంది. కీర్తన గ్రంథకర్త ముందే తెలియజేసినట్లుగా, “అది యెహోవావలన కలిగినది.” (కీర్తన 118:23) “రాయి”ని మూలకు తలరాయిగా చేయడంలో, నియమిత భావిరాజుగా ఆయనను ఉన్నతపర్చడం ఇమిడివుంది.—ఎఫెసీయులు 1:20, 21.

పునరుత్థాన నిరీక్షణతో బలపర్చబడడం

21, 22. యోబు 14:13-15 నందు వ్రాయబడి ఉన్నట్లుగా యోబు ఏ నిరీక్షణను వ్యక్తపరిచాడు, ఇది నేడు దుఃఖితులను ఎలా ఓదార్చగలదు?

21 మృతులలో నుండి ఎవరైనా లేపబడడం మనం వ్యక్తిగతంగా ఎన్నడూ చూడకపోయినప్పటికీ, పునరుత్థానం గురించి మనకు హామీ ఇచ్చే కొన్ని లేఖనాధార వృత్తాంతాలను చూశాము. కాబట్టి మనం నీతిమంతుడైన యోబు వ్యక్తపర్చిన నిరీక్షణను కల్గివుండవచ్చు. ఆయన తాను బాధపడుతున్నప్పుడు ఇలా వేడుకున్నాడు: “[యెహోవా] నీవు పాతాళములో నన్ను దాచినయెడల ఎంతోమేలు . . . నాకు ఇంతకాలమని నీవు నియమించి తరువాత నన్ను జ్ఞాపకము చేసికొనవలెనని నేనెంతో కోరుచున్నాను. మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా? . . . నీవు పిలిచెదవు నేను నీకు ప్రత్యుత్తరమిచ్చెదను నీ హస్తకృత్యము ఎడల నీకు ఇష్టము కలుగును.” (యోబు 14:13-15) భవిష్యత్తులో యోబును పునరుత్థానం చేయాలని కోరుకుంటూ దేవుడు ‘తన హస్తకృత్యము ఎడల ఇష్టము కల్గివుంటాడు.’ అది మనకెంతటి నిరీక్షణ నిస్తుందో కదా !

22 దైవభక్తిగల మన కుటుంబ సభ్యులు ఒకరు యోబులా తీవ్ర అస్వస్థతకు గురికావచ్చు, చివరికి శత్రువైన మరణానికి బలి కావచ్చు. లాజరు మరణించినప్పుడు యేసు దుఃఖించినట్లు, తమ ప్రియమైనవారిని కోల్పోయిన వారు దుఃఖంతో కన్నీళ్లు కార్చవచ్చు. (యోహాను 11:35) అయితే దేవుడు పిలుస్తాడనీ, ఆయన జ్ఞాపకంలో ఉన్నవారు సజీవులై సమాధానమిస్తారనీ తెలుసుకోవడం ఎంతటి ఓదార్పునిస్తుందోకదా ! ఏ అనారోగ్యానికీ గురికాకుండా, సంపూర్ణ ఆరోగ్యంతో, వాళ్లు కేవలం ప్రయాణం చేసి తిరిగి వచ్చినట్లుగా ఉంటుందంతే.

23. పునరుత్థాన నిరీక్షణ యందు కొందరు తమ నమ్మకాన్ని ఎలా వ్యక్తపరిచారు?

23 ఒక నమ్మకమైన వృద్ధ క్రైస్తవురాలు మరణించినప్పుడు, తోటి విశ్వాసులకు గల పునరుత్థాన నిరీక్షణ, ఆమె పిల్లలకు ఇలా వ్రాసేలా వారిని కదిలించింది: “మీ అమ్మను కోల్పోయిన ఈ దుఃఖ సమయంలో మీతోపాటు మేమూ బాధపడుతున్నాము. ఆమెను మళ్లీ సంపూర్ణ ఆయురారోగ్యాలతో తిరిగి కలుసుకోవడానికి ఎంతో కాలం లేదు !” తమ కుమారుడ్ని కోల్పోయిన తల్లిదండ్రులు ఇలా అన్నారు: “జేసన్‌ తిరిగి లేచే సమయం కోసం మేమెంతగా ఎదురుచూస్తున్నామో ! వాడు కళ్లు తెరిచి చుట్టూ చూసే సరికి తాను ఎంతగానో ఎదురు చూసిన పరదైసు వాడి చుట్టూ ఉంటుంది. . . . వాడు పరదైసులో ఉండాలని ఎంతగానో కోరుకున్న మాకు అదెంతటి ఆనందాన్ని కల్గిస్తుందో.” అవును, పునరుత్థాన నిరీక్షణ తప్పకుండా నెరవేరుతుంది గనుక మనం ఎంత కృతజ్ఞత కల్గివుండవచ్చు !

మీ సమాధానమేమిటి?

• మృతులను తిరిగి లేపేందుకు దేవుడు చేసిన ఏర్పాట్లలో విశ్వాసం ఉంచడం మనకెలా ప్రయోజనం చేకూర్చగలదు?

• పునరుత్థానమందు నిరీక్షణ ఉంచడానికి, లేఖనాల్లో వ్రాయబడివున్న ఏ సంఘటనలు మనకు కారణాన్నిస్తున్నాయి?

• పునరుత్థానమన్నది ఎంతోకాలంగా ఉన్న నిరీక్షణ అని ఎందుకు చెప్పవచ్చు?

• మృతుల విషయమై మనల్ని బలపర్చే ఏ నిరీక్షణను మనం కల్గివుండవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

[అధ్యయన ప్రశ్నలు]

[10వ పేజీలోని చిత్రం]

యెహోవా నుండి పొందిన శక్తితో, ఏలీయా ఒక విధవరాలి కుమారునికి జీవాన్ని తిరిగి తెచ్చాడు

[12వ పేజీలోని చిత్రం]

యేసు యాయీరు కుమార్తెను తిరిగి జీవింపజేసినప్పుడు, ఆమె తల్లిదండ్రులు ఎంతగానో ఆనందించారు

[15వ పేజీలోని చిత్రం]

యేసు మృతులలో నుండి లేపబడ్డాడని అపొస్తలుడైన పేతురు, సా.శ. 33 పెంతెకొస్తు దినాన ధైర్యంగా సాక్ష్యమిచ్చాడు