కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పునరుత్థాన నిరీక్షణ శక్తివంతమైనది

పునరుత్థాన నిరీక్షణ శక్తివంతమైనది

పునరుత్థాన నిరీక్షణ శక్తివంతమైనది

‘యేసుక్రీస్తు పునరుత్థానబలమును ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను.’ఫిలిప్పీయులు 3:8-11.

1, 2. (ఎ) కొన్ని సంవత్సరాల క్రితం, ఒక పాస్టరు పునరుత్థానాన్ని ఎలా వర్ణించాడు? (బి) పునరుత్థానం ఎలా జరుగుతుంది?

అమెరికాలోని న్యూయార్క్‌ నందున్న బ్రూక్లిన్‌లో ఒక పాస్టరు ఇచ్చిన ఒక విశేషమైన ప్రసంగాన్ని గురించి 1890ల తొలికాలంలో వార్తాపత్రికలు నివేదించాయి. మానవ శరీరంలోని ఎముకలు కండరాలు అగ్ని మూలంగా లేక దుర్ఘటన మూలంగా నశించిపోయినా, లేదా ఏదైనా జంతువు తినివేయడం మూలంగా నశించిపోయినా, లేదా ఎరువుగా మారిపోయినా సరే, వాటిని తిరిగి సమకూర్చి, వాటికి బలం చేకూర్చే ప్రక్రియ పునరుత్థానంలో ఇమిడివుంటుందని ఆయన అన్నాడు. ఒక 24-గంటల దినంలో గాలి అంతా కోట్లాదిమంది మృతుల అరచేతులు, బాహువులు, పాదాలు, వేళ్లూ, ఎముకలు, స్నాయువులు, చర్మములతో నిండిపోతుందని ఆ ప్రచారకుడు అన్నాడు. ఈ భాగాలు ఒకే శరీరానికి చెందిన ఇతర భాగాల కోసం వెదుకుతుంటాయి, పునరుత్థానం చేయబడిన ఈ శరీరాల్లోకి ప్రవేశించేందుకు ఆత్మలు పరలోకం నుండి, నరకం నుండి వస్తాయి, అని ఆయన అన్నాడు.

2 అణువుల పునర్‌వ్యవస్థీకరణ ద్వారా పునరుత్థానం జరగడమన్నది తర్కబద్ధమైనది కాదు, అంతేగాక మానవులకు అమర్త్యమైన ఆత్మ లేదు. (ప్రసంగి 9:5, 10; యెహెజ్కేలు 18:4) పునరుత్థానానికే దేవుడైన యెహోవాకు, మానవ శరీరాన్ని రూపొందించటానికి దాన్ని మునుపు రూపొందించిన అణువులనే తిరిగి కూర్చవలసిన అవసరం లేదు. పునరుత్థానం చేయబడిన వారి కోసం ఆయన క్రొత్త శరీరాలను రూపొందించగలడు. నిత్యం జీవించి ఉండగలిగేలా మృతులను తిరిగి లేపే శక్తిని యెహోవా తన కుమారుడైన యేసుక్రీస్తుకు అనుగ్రహించాడు. (యోహాను 5:26) కాబట్టి యేసు ఇలా చెప్పాడు: “పునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయనను బ్రదుకును; బ్రదికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు.” (యోహాను 11:25, 26) ఎంత హృదయరంజకమైన వాగ్దానం ! మనం శ్రమలను సహించటానికీ, చివరికి యెహోవా నమ్మకమైన సాక్షులుగా మరణాన్ని ఎదుర్కోవటానికీ అది మనల్ని బలపరుస్తుంది.

3. పౌలు పునరుత్థానాన్ని ఎందుకు సమర్థించాల్సివచ్చింది?

3 పునరుత్థానం, మానవులకు అమర్త్యమైన ఆత్మ ఉందన్న తలంపుతో ఏకీభవించదు, అది గ్రీకు తత్త్వవేత్తయైన ప్లేటో నమ్మిన తలంపు. అపొస్తలుడైన పౌలు ఏథెన్సులోని అరేయొపగుపై ప్రముఖులైన గ్రీకువారికి సాక్ష్యమిస్తూ దేవుడు యేసును పునరుత్థానం చేశాడని చెప్పినప్పుడు ఏమి జరిగింది? “మృతుల పునరుత్థానమునుగూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి” అని ఆ వృత్తాంతం తెలియజేస్తుంది. (అపొస్తలుల కార్యములు 17:29-34) పునరుత్థానం చేయబడిన యేసుక్రీస్తును చూసిన అనేకులు అప్పటికింకా సజీవంగా ఉండి, ప్రజలు అపహాస్యం చేస్తున్నప్పటికీ, ఆయన మృతులలో నుండి లేపబడ్డాడని సాక్ష్యమిచ్చారు. కానీ కొరింథులోని సంఘంతో సహవసిస్తున్న అబద్ధ బోధకులు పునరుత్థానాన్ని నిరాకరించారు. కాబట్టి పౌలు మొదటి కొరింథీయులు 15వ అధ్యాయంలో ఈ క్రైస్తవ బోధను శక్తివంతంగా సమర్థించాడు. ఆయన చేసిన వాదనలను జాగ్రత్తగా అధ్యయనం చేయడం, పునరుత్థాన నిరీక్షణ ఎంత కచ్చితంగా నెరవేరుతుందో, అది ఎంత శక్తివంతమైనదో స్పష్టంగా నిరూపించబడుతుంది.

యేసు పునరుత్థానానికున్న గట్టి నిదర్శనం

4. యేసు పునరుత్థానాన్ని గురించిన ప్రత్యక్షసాక్షుల ఏ నిదర్శనాన్ని పౌలు ఇచ్చాడు?

4 పౌలు తన వాదనను ఎలా ప్రారంభించాడో గమనించండి. (1 కొరింథీయులు 15:1-11) కొరింథీయులు ఏమీ పనిలేక వ్యర్థముగా విశ్వాసులు కాలేదు గనుక, వాళ్లు రక్షణ సువార్తను గట్టిగా హృదయానికి హత్తుకుంటారు. క్రీస్తు మన పాపముల నిమిత్తం మరణించి, పాతిపెట్టబడి, తిరిగి లేపబడ్డాడు. నిజానికి పునరుత్థానం చేయబడిన యేసు, కేఫాకు (పేతురుకు), “తరువాత పండ్రెండుగురికి” కనిపించాడు. (యోహాను 20:19-23) బహుశా ఆయన 500 మందికి కనిపించినది, “మీరు వెళ్లి, . . . శిష్యులనుగా చేయుడి” అని అజ్ఞాపించినప్పుడై ఉండవచ్చు. (మత్తయి 28:19, 20) నమ్మకమైన అపొస్తలులందరిలాగే యాకోబు కూడా ఆయనను చూశాడు. (అపొస్తలుల కార్యములు 1:6-11) దమస్కు దగ్గర, యేసు “అకాలమందు పుట్టినట్టున్న” సౌలుకు అంటే, అప్పటికే ఆత్మ జీవితానికి లేపబడినట్టున్న ఆయనకు కనిపించాడు. (అపొస్తలుల కార్యములు 9:1-9) పౌలు కొరింథీయులకు బోధించినందున వారు విశ్వాసులై, సువార్తను అంగీకరించారు.

5. మొదటి కొరింథీయులు 15:12-19 నందు వ్రాయబడివున్నట్లుగా పౌలు ఎలా తర్కించాడు?

5 పౌలు తర్క విధానాన్ని గమనించండి. (1 కొరింథీయులు 15:12-19) క్రీస్తు పునరుత్థానం చేయబడ్డాడని ప్రత్యక్ష సాక్షులు ప్రకటిస్తుండగా, పునరుత్థానం లేదని చెప్పడం ఎలా సాధ్యం? యేసు గనుక మృతులలో నుండి లేపబడకపోతే, మన ప్రకటనా పనీ మన విశ్వాసమూ వ్యర్థమే, అంతేగాక దేవుడు క్రీస్తును పునరుత్థానం చేశాడని చెప్పడం ద్వారా మనం దేవునికి వ్యతిరేకంగా సాక్ష్యమిస్తున్న అబద్ధికులమౌతాము. మృతులు తిరిగి లేపబడకపోతే, ‘మనం ఇంకనూ మన పాపములలో ఉన్నట్లే,’ క్రీస్తు నందు ఐక్యముగా మరణించినవారు నశించిపోయినట్లే. అంతేగాక, “ఈ జీవితకాలముమట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైనయెడల మనుష్యులందరి కంటె దౌర్భాగ్యులమై యుందుము.”

6. (ఎ) యేసు పునరుత్థానాన్ని ధృవీకరిస్తూ పౌలు ఏమని చెప్పాడు? (బి) “కడపటి శత్రువు” ఏది, అది ఎలా నిర్మూలించబడుతుంది?

6 పౌలు యేసు పునరుత్థానాన్ని ధృవీకరిస్తున్నాడు. (1 కొరింథీయులు 15:20-28) మరణమందు నిద్రించినవారిలో “ప్రథమ ఫలము” క్రీస్తు అయినట్లే, ఇతరులు కూడా పునరుత్థానం చేయబడతారు. ఆదాము అనే మనుష్యుని అవిధేయత మూలంగా మరణం ప్రాప్తించినట్లుగానే, యేసు అనే మానవుని ద్వారా పునరుత్థానం ప్రాప్తిస్తుంది. ఆయనకు చెందిన వారు ఆయన ప్రత్యక్షత సమయంలో లేపబడనైయున్నారు. యెహోవా తన శత్రువులనందరినీ తన పాదముల క్రింద ఉంచేవరకూ క్రీస్తు, దేవుని సర్వోన్నతాధిపత్యానికి విరుద్ధంగా ఉన్న “సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి” రాజుగా పరిపాలిస్తాడు. చివరికి ‘కడపటి శత్రువు’ అంటే ఆదాము నుండి సంక్రమించిన మరణం కూడా, యేసు బలి ప్రయోజనం మూలంగా నిర్మూలింపబడుతుంది. అప్పుడు “దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము [క్రీస్తు] తనకు సమస్తమును లోపరచిన దేవునికి” తానే లోబడుతూ, రాజ్యమును తన తండ్రియైన దేవునికి అప్పగిస్తాడు.

మృతుల కొరకు బాప్తిస్మం తీసుకున్నారా?

7. “మృతుల కొరకై బాప్తిస్మము పొందు”వారు ఎవరు, వారి విషయంలో దీని భావమేమిటి?

7 పునరుత్థానాన్ని వ్యతిరేకించేవారిని ఇలా ప్రశ్నించడం జరిగింది: “మృతుల కొరకై [“మృతులై ఉండుటకు,” NW] బాప్తిస్మము పొందు వారేమి చేతురు?” (1 కొరింథీయులు 15:29) సజీవంగా ఉన్నవారు మృతుల కోసం బాప్తిస్మం తీసుకోవాలన్నది పౌలు ఉద్దేశం కాదు, ఎందుకంటే యేసు శిష్యులు వ్యక్తిగతంగా నేర్చుకుని, నమ్మి, బాప్తిస్మం తీసుకోవాలి. (మత్తయి 28:19, 20; అపొస్తలుల కార్యములు 2:41) అభిషిక్త క్రైస్తవులు, మరణానికి ఆ తర్వాత పునరుత్థానానికి దారితీసే జీవన విధానంలో నిమగ్నమై ఉండడం ద్వారా “మృతుల కొరకై [“మృతులై ఉండుటకు,” NW] బాప్తిస్మము పొందు”తారు. ఈ విధమైన బాప్తిస్మం, దేవుని ఆత్మ వారిలో పరలోక నిరీక్షణను ఉత్పన్నం చేసినప్పుడు ప్రారంభమై, వారు మరణం నుండి పరలోకంలో అమర్త్యమైన ఆత్మ జీవితానికి లేపబడినప్పుడు అంతమౌతుంది.—రోమీయులు 6:3-5; 8:16, 17; 1 కొరింథీయులు 6:14.

8. సాతాను, అతని సేవకులు తమను చంపినా క్రైస్తవులు దేని గురించి నిశ్చయత కల్గివుండవచ్చు?

8 పౌలు మాటలు సూచిస్తున్నట్లుగా, క్రైస్తవులు రాజ్య ప్రకటన పని చేస్తున్నందుకు గడియగడియకు వారికి ప్రాణాపాయం ఎదురైనప్పటికీ తట్టుకుని నిలిచేలా పునరుత్థాన నిరీక్షణ వారిని బలపరుస్తుంది. (1 కొరింథీయులు 15:30, 31) సాతాను అతని సేవకులు తమను చంపేందుకు యెహోవా అనుమతిస్తే, ఆయనే తమను పునరుత్థానం చేయగలడని క్రైస్తవులకు తెలుసు. అంతేకాదు, దేవుడు మాత్రమే వారి ఆత్మను, లేక జీవాన్ని గెహెన్నాలో నాశనం చేయగలడు అంటే వారికి నిత్య నాశనం కూడా కలుగజేయగలడు.—లూకా 12:5.

మెలకువగా ఉండవలసిన అవసరత

9. పునరుత్థాన నిరీక్షణ మన జీవితాల్లో బలాన్నిచ్చే శక్తియై ఉండాలంటే, మనం దేన్ని నివారించాలి?

9 పునరుత్థాన నిరీక్షణ పౌలును బలపర్చింది. ఆయన ఎఫెసులో ఉన్నప్పుడు, ఆయన శత్రువులు ఆయనను క్రూర మృగాలతో పోరాడేందుకు వ్యాయామప్రదర్శనశాలల్లో పడేసి ఉండవచ్చు. (1 కొరింథీయులు 15:32) అలా జరిగివుండి ఉంటే, దానియేలు సింహాల నుండి కాపాడబడినట్లుగా ఆయనా కాపాడబడ్డాడు. (దానియేలు 6:16-22; హెబ్రీయులు 11:32, 33) పౌలుకు పునరుత్థానమందు నమ్మకముంది గనుకనే ఆయనకు యెషయా కాలంలో యూదయలో ఉన్న మత భ్రష్టులకున్నలాంటి దృక్పథం లేదు. వారిలా అన్నారు: “రేపు చచ్చిపోదుము గనుక తిందము త్రాగుదము.” (యెషయా 22:13) పౌలు జీవితంలోలాగే మన జీవితంలో కూడా పునరుత్థాన నిరీక్షణ మనల్ని బలపర్చేదై ఉండాలంటే, అలాంటి అనారోగ్యకరమైన దృక్పథం ఉన్నవారికి దూరంగా ఉండాలి. “మోసపోకుడి. దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును” అని పౌలు హెచ్చరించాడు. (1 కొరింథీయులు 15:33) నిజమే, ఈ సూత్రం జీవితంలోని అనేక అంశాలకు వర్తిస్తుంది.

10. మన పునరుత్థాన నిరీక్షణను ఎలా సజీవంగా ఉంచుకోవచ్చు?

10 పునరుత్థానాన్ని సందేహిస్తున్న వారితో పౌలు ఇలా అన్నాడు: “నీతి ప్రవర్తనగలవారై మేల్కొని, పాపము చేయకుడి; దేవునిగూర్చిన జ్ఞానము కొందరికి లేదు. మీకు సిగ్గు కలుగుటకై యిట్లు చెప్పుచున్నాను.” (1 కొరింథీయులు 15:34) ఈ “అంత్యకాలము”లో, దేవుని గురించిన, క్రీస్తును గురించిన కచ్చితమైన జ్ఞానానికి అనుగుణ్యంగా చర్యలు తీసుకోవాలి. (దానియేలు 12:4; యోహాను 17:3) ఇది మన పునరుత్థాన నిరీక్షణను ఉజ్వలంగా ఉంచుతుంది.

ఏ శరీరంతో పునరుత్థానం చేయబడతాము?

11. అభిషిక్త క్రైస్తవుల పునరుత్థానాన్ని పౌలు ఎలా ఉదాహరించాడు?

11 తర్వాత పౌలు కొన్ని ప్రశ్నలను విశ్లేషించాడు. (1 కొరింథీయులు 15:35-41) ఒక వ్యక్తి బహుశా పునరుత్థానంపై సందేహాలు రేకెత్తించాలని, “మృతులేలాగు లేతురు? వారెట్టి శరీరముతో వత్తురని” వాకబు చేయవచ్చు. పౌలు చూపించినట్లుగా, భూమిలో నాటబడిన విత్తనం మొలకెత్తాలంటే ముందు ఆ విత్తనం చనిపోవాలి. అలాగే, ఆత్మాభిషిక్త మానవుడు మరణించాలి. విత్తనంలో నుండి ఒక మొక్క క్రొత్త శరీరంతో ఎలా మొలకెత్తుతుందో, అలాగే పునరుత్థానం చేయబడిన అభిషిక్త క్రైస్తవుని శరీరం మానవ శరీరం నుండి భిన్నంగా ఉంటుంది. ఆయన మరణించక ముందు ఆయనకు ఉన్నటువంటి అదే జీవన విధానం ఉన్నప్పటికీ, ఆయన పరలోకంలో జీవించగలిగేలా ఆత్మ శరీరంతో క్రొత్త ప్రాణిగా లేపబడతాడు. అయితే సహజంగానే, భూమిపై నివసించటానికి పునరుత్థానం చేయబడేవారు మానవ శరీరాలతోనే లేపబడతారు.

12. ‘ఆకాశవస్తు రూపములు,’ ‘భూవస్తు రూపములు’ అనే పదాల భావమేమిటి?

12 పౌలు చెప్పినట్లుగా, మానవ శరీరానికీ జంతు శరీరానికీ తేడా ఉంది. జంతు శరీరాల్లో కూడా ఒకదాని నుండి మరో దానికి తేడా ఉంది. (ఆదికాండము 1:20-25) ఆత్మ ప్రాణుల “ఆకాశవస్తు రూపముల” మహిమకూ శరీరసంబంధమైన “భూవస్తు రూపముల” మహిమకూ తేడా ఉంది. సూర్య, చంద్ర, నక్షత్రముల మహిమల్లో కూడా తేడాలున్నాయి. కానీ పునరుత్థానం చేయబడిన అభిషిక్తులకు మరింత గొప్ప మహిమ ఉంటుంది.

13. మొదటి కొరింథీయులు 15:42-44 ప్రకారం, ఏది విత్తబడుతుంది, ఏది లేపబడుతుంది?

13 పౌలు ఈ తేడాల గురించి ప్రస్తావించిన తర్వాత, “మృతుల పునరుత్థానమును ఆలాగే” ఉంటుందని అన్నాడు. (1 కొరింథీయులు 15:42-44) ఇంకా ఆయనిలా అన్నాడు: “క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును.” ఇక్కడ పౌలు అభిషిక్తులను ఒక గుంపుగా సూచిస్తుండవచ్చు. మరణమప్పుడు శరీరం క్షయంగా విత్తబడి, పాపం లేకుండా అక్షయంగా లేపబడుతుంది. లోకం చులకనగా చూసినప్పటికీ, అది పరలోక జీవితానికి లేపబడి, క్రీస్తు మహిమతోపాటు బయల్పర్చబడుతుంది. (అపొస్తలుల కార్యములు 5:41; కొలొస్సయులు 3:4) మరణ సమయంలో అది “ప్రకృతి సంబంధమైన శరీరముగా” విత్తబడి “ఆత్మసంబంధ శరీరముగా” లేపబడుతుంది. ఆత్మాభిషిక్త క్రైస్తవుల విషయంలో ఇది సాధ్యం గనుక, ఇతరులు కూడా భూమిపై జీవించటానికి లేపబడతారని మనం నమ్మకం కల్గివుండవచ్చు.

14. క్రీస్తుకు, ఆదాముకు ఉన్న తేడాను పౌలు ఎలా చూపించాడు?

14 తర్వాత పౌలు, క్రీస్తుకూ ఆదాముకూ ఉన్న తేడాను చూపించాడు. (1 కొరింథీయులు 15:45-49) మొదటి మానవుడైన ఆదాము, “జీవాత్మ” అయ్యాడు. (ఆదికాండము 2:7) “కడపటి ఆదాము” అయిన యేసు “జీవింపజేయు అత్మ” అయ్యాడు. ఆయన తన జీవితాన్ని మొదట తన అభిషిక్త అనుచరులకోసం విమోచన క్రయధన బలిగా అర్పించాడు. (మార్కు 10:45) మానవులుగా ఉన్నప్పుడు వాళ్లు ‘మంటి నుండి పుట్టిన వాని రూపాన్ని కల్గివుంటారు,’ కానీ పునరుత్థానం చేయబడినప్పుడు వాళ్లు కడపటి ఆదాములా అవుతారు. అయితే, యేసు అర్పించిన బలి, భూమి మీద జీవించటానికి పునరుత్థానం చేయబడిన వారితో సహా విధేయులైన మానవజాతి అంతటికీ ప్రయోజనం చేకూరుస్తుంది.—1 యోహాను 2:1, 2.

15. అభిషిక్త క్రైస్తవులు శరీరమందు ఎందుకు పునరుత్థానం చేయబడరు, యేసు ప్రత్యక్షత సమయంలో వాళ్లు ఎలా లేపబడతారు?

15 అభిషిక్త క్రైస్తవులు మరణించినప్పుడు, వాళ్లు భౌతిక శరీరంతో లేపబడరు. (1 కొరింథీయులు 15:50-53) రక్తమాంసాలుగల క్షయమైన శరీరం అక్షయతను, పరలోక రాజ్యాన్ని పొందలేవు. కొంతమంది అభిషిక్తులు మరణంలో ఎక్కువ సేపు నిద్రించవలసిన అవసరం ఉండదు. క్రీస్తు ప్రత్యక్షత సమయంలో తమ భూ  జీవితాన్ని నమ్మకంగా ముగించి, వాళ్లు ‘నిమిషములో, ఒక రెప్ప పాటున మార్పు పొందుతారు.’ వాళ్లు అక్షయమైన, మహిమాన్వితమైన ఆత్మ జీవితానికి తక్షణమే లేపబడతారు. క్రీస్తు పరలోక “పెండ్లి కుమార్తె” సంఖ్య మొత్తం 1,44,000 అయి ఉంటుంది.—ప్రకటన 14:1; 19:6-9; 21:9; 1 థెస్సలొనీకయులు 4:15-17.

మరణంపై విజయం !

16. పౌలు, ఇతర తొలి ప్రవక్తలు చెప్పినదాని ప్రకారం, పాపియైన ఆదాము నుండి సంక్రమించిన మరణానికి ఏమి సంభవిస్తుంది?

16 మరణం ఇక ఎన్నడూ ఉండకుండా మ్రింగి వేయబడుతుందని పౌలు విజయోత్సాహంతో ప్రకటించాడు. (1 కొరింథీయులు 15:54-57) క్షయమైనదీ, మర్త్యమైనదీ, అక్షయమైనదిగా, అమర్త్యమైనదిగా మారినప్పుడు, “మరణము మ్రింగివేయబడెను,” “ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ?” అన్న మాటలు నెరవేరుతాయి. (యెషయా 25:8; హోషేయ 13:14) మరణపు ముల్లు పాపము; పాపమునకున్న బలం, పాపులను మరణానికి అప్పగించే ధర్మశాస్త్రమే. కానీ యేసు బలి పునరుత్థానాల మూలంగా, పాపియైన ఆదాము నుండి సంక్రమించిన మరణం ఇకపై విజయం సాధించలేదు.—రోమీయులు 5:12; 6:23.

17. మొదటి కొరింథీయులు 15:58 నందలి మాటలు నేడు ఎలా వర్తిస్తాయి?

17 “కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదని యెరిగి, స్థిరులును, కదలనివారును, ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునై యుండుడి” అని పౌలు అన్నాడు. (1 కొరింథీయులు 15:58) ఆ మాటలు నేడు అభిషిక్త శేషానికీ, ఈ అంత్య దినాల్లో మరణించినప్పటికీ యేసు యొక్క “వేరే గొఱ్ఱెల”కూ అన్వయిస్తాయి. (యోహాను 10:16) రాజ్యప్రచారకులుగా వారి ప్రయాసలు వ్యర్థము కావు, ఎందుకంటే వారి కోసం పునరుత్థానం వేచివుంటుంది. కాబట్టి యెహోవా సేవకులముగా మనం, “ఓ  మరణమా, నీ విజయమెక్కడ?” అని ఆనందంతో కేకలు వేసే దినం కోసం ఎదురుచూస్తూ, ప్రభువు కార్యాభివృద్ధిలో ఎప్పటికీ ఆసక్తులమై ఉందాము.

నెరవేరిన పునరుత్థాన నిరీక్షణ !

18. పునరుత్థానమందు పౌలుకు ఎంత బలమైన విశ్వాసం ఉంది?

18 మొదటి కొరింథీయులు 15వ అధ్యాయంలో వ్రాయబడివున్న పౌలు మాటలు, పునరుత్థాన నిరీక్షణ ఆయన జీవితంపై ప్రభావాన్ని చూపించిందని స్పష్టం చేస్తున్నాయి. యేసు మృతులలో నుండి లేపబడ్డాడనీ, ఇతరులు కూడా, మానవజాతి చివరికి చేరుకునే సమాధి నుండి విడుదల పొందుతారనీ ఆయనకు సంపూర్ణ నమ్మకం ఉంది. మీకు కూడా అలాంటి దృఢ విశ్వాసం ఉందా? స్వార్థపూరిత ప్రయోజనాలను పౌలు “పెంటతో సమానముగా” ఎంచుకొని తాను ‘క్రీస్తును, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు’ నిమిత్తం “సమస్తమును నష్టపరచు”కున్నాడు. “పునరుత్థానం” పొందాలనే నిరీక్షణతో క్రీస్తు పొందినలాంటి మరణాన్ని పొందటానికి అపొస్తలుడు ఇష్టపడ్డాడు. “మొదటి పునరుత్థానం” అని కూడా పిలువబడే ఆ పునరుత్థానాన్ని యేసు యొక్క 1,44,000 మంది అభిషిక్త అనుచరులు పొందుతారు. అవును, వాళ్లు పరలోకంలో ఆత్మ జీవితానికి లేపబడుతున్నారు, అయితే “కడమ మృతులు” భూమి మీదికి పునరుత్థానం చేయబడతారు.—ఫిలిప్పీయులు 3:8-11; ప్రకటన 7:4; 20:5, 6.

19, 20. (ఎ) భూమిపై జీవించటానికి బైబిలు వృత్తాంతంలోని ఏ వ్యక్తులు తిరిగి లేపబడతారు? (బి) మీరు ఎవరి పునరుత్థానం కోసం నిరీక్షిస్తున్నారు?

19 మరణం వరకు నమ్మకంగా ఉన్న అభిషిక్తులకు పునరుత్థాన నిరీక్షణ మహిమాన్వితమైన వాస్తవం అయ్యింది. (రోమీయులు 8:18; 1 థెస్సలొనీకయులు 4:15-18; ప్రకటన 2:10) “మహా శ్రమ”ను తప్పించుకొని జీవించేవారు, ‘సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగిస్తుండగా, మరణమును పాతాళలోకమును వాటి వశముననున్న మృతులనప్పగిస్తుండగా’ భూమిపై పునరుత్థాన నిరీక్షణ నిజమవ్వడాన్ని చూస్తారు. (ప్రకటన 7:9, 13, 14; 20:13) భూమిపై జీవించటానికి లేపబడేవారిలో, యేడుగురు కుమారులను, ముగ్గురు కుమార్తెలను పోగొట్టుకున్న యోబు ఉంటాడు. వాళ్లను తిరిగి ఆహ్వానించడంలో ఆయనకు లభించే ఆనందాన్ని ఊహించండి ! తమకు మరో ఏడుగురు సహోదరులు, మరో ముగ్గురు అందమైన చెల్లెళ్లు ఉండడం చూసి వాళ్లు ఎంతగా ఆనందిస్తారో కదా !—యోబు 1:1, 2, 18, 19; 42:12-15.

20 అబ్రాహాము, శారా, ఇస్సాకు, రిబ్కా, “సకల ప్రవక్తల”తో సహా ఇంకా అనేకమంది ఇతరులు భూమి మీద జీవించటానికి పునరుత్థానం చేయబడినప్పుడు ఎంతటి ఆశీర్వాదమో కదా ! (లూకా 13:28) ఆ ప్రవక్తలలో ఒకరు దానియేలు, ఆయనకు మెస్సీయ పరిపాలన క్రింద పునరుత్థానం వాగ్దానం చేయబడింది. దాదాపు 2,500 సంవత్సరాలుగా దానియేలు సమాధిలో విశ్రాంతి తీసుకుంటున్నాడు, అయితే పునరుత్థాన బలము మూలంగా ఆయన, ‘భూమియందంతటి అధికారులలో’ ఒకరిగా ‘కాలాంత మందు తన వంతులో నిలుస్తాడు.’ (దానియేలు 12:13; కీర్తన 45:16) ప్రాచీన కాలానికి చెందిన నమ్మకమైన వారినే గాక మరణించిన మన స్వంత తండ్రిని, తల్లిని, కుమారుడ్ని, కుమార్తెను, లేక మరితర ప్రియమైన వారిని తిరిగి ఆహ్వానించడం ఎంత ఉత్తేజభరితంగా ఉంటుందో కదా !

21. ఇతరులకు మంచి కార్యాలను చేయడంలో మనం ఎందుకు జాప్యం చేయకూడదు?

21 మన స్నేహితుల్లో, ప్రియమైనవారిలో కొందరు వృద్ధులైనప్పటికీ దేవుడ్ని దశాబ్దాలపాటు సేవించి ఉంటారు. వృద్ధాప్యం జీవిత సవాళ్లను ఎదుర్కోవడాన్ని కష్టతరం చేయవచ్చు. వారికి ఇప్పుడే అవసరమైన సహాయాన్ని అందజేయడం ఎంత ప్రేమపూర్వకమైనదిగా ఉంటుందో కదా! ఒకవేళ వాళ్లు మరణించినా మనం చేయవలసినంత చేయలేదే అని అప్పుడు మనం విచారించవలసిన పని ఉండదు. (ప్రసంగి 9:11; 12:1-7; 1 తిమోతి 5:3, 8) వారి వయస్సు ఎంతైనా, వారి పరిస్థితులు ఎలా ఉన్నా మనం ఇతరుల కోసం చేసే మంచిని యెహోవా ఎన్నడూ మరచిపోడని మనం నిశ్చయత కల్గివుండవచ్చు. “కాబట్టి మనకు సమయము దొరకినకొలది అందరియెడలను, విశేషముగా విశ్వాసగృహమునకు చేరినవారియెడలను మేలు చేయుదము” అని పౌలు వ్రాశాడు.—గలతీయులు 6:10; హెబ్రీయులు 6:10.

22. పునరుత్థాన నిరీక్షణ నెరవేరే వరకు, మనం ఏమి చేయడానికి నిశ్చయించుకోవాలి?

22 యెహోవా “కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు.” (2 కొరింథీయులు 1:3, 4) ఆయన వాక్యం మనకు ఓదార్పునిస్తుంది, శక్తివంతమైన పునరుత్థాన నిరీక్షణతో ఇతరులను ఓదార్చటానికి మనకు సహాయం చేస్తుంది. మృతులు భూమిపై జీవించటానికి లేపబడడం ద్వారా ఆ నిరీక్షణ నెరవేరడాన్ని మనం చూసే వరకు, పునరుత్థానమందు విశ్వాసం కల్గివుండిన పౌలు వలె ఉందాము. తనను పునరుత్థానం చేసేందుకు దేవునికున్న శక్తియందలి తన నిరీక్షణ నెరవేర్పును అనుభవించిన యేసును ప్రాముఖ్యంగా అనుకరిద్దాము. సమాధులలో ఉన్నవారు త్వరలోనే క్రీస్తు స్వరాన్ని విని బయటికి వస్తారు. ఇది మనకు ఓదార్పును, ఆనందాన్ని ఇవ్వాలి. అన్నిటికన్నా పైగా, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మరణంపై విజయం సాధించడాన్ని సాధ్యం చేసిన యెహోవా పట్ల కృతజ్ఞత కల్గివుందాము !

మీ సమాధానమేమిటి?

• యేసు పునరుత్థానాన్ని గూర్చిన ఏ ప్రత్యక్షపు నిదర్శనాన్ని పౌలు ఇచ్చాడు?

• “కడపటి శత్రువు” ఏది, అది ఎలా నిర్మూలింపబడుతుంది?

• అభిషిక్త క్రైస్తవుల విషయంలో, ఏది విత్తబడుతుంది, ఏది లేపబడుతుంది?

• భూమిపై జీవించటానికి తిరిగి లేపబడే, బైబిలు వృత్తాంతాల్లోని ఏ వ్యక్తులను మీరు కలవాలనుకుంటారు?

[అధ్యయన ప్రశ్నలు]

[అధ్యయన ప్రశ్నలు]

[16వ పేజీలోని చిత్రం]

పునరుత్థానాన్ని అపొస్తలుడైన పౌలు శక్తివంతంగా సమర్థించాడు

[20వ పేజీలోని చిత్రాలు]

యోబు, ఆయన కుటుంబం, ఇంకా అనేకమంది ఇతరుల పునరుత్థానం అవధులులేని ఆనందాన్ని తెస్తుంది !