కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ జీవితం మరింత అర్థవంతంగా ఉండగలదా?

మీ జీవితం మరింత అర్థవంతంగా ఉండగలదా?

మీ జీవితం మరింత అర్థవంతంగా ఉండగలదా?

అమెరికా ప్రభుత్వం జారీ చేసిన అతి పెద్ద నోటు విలువ 10,000 డాలర్లైతే, దాన్ని ప్రింటు చేసిన కాగితం వెల మాత్రం కొన్ని సెంట్లకు మించదు. అనేక సందర్భాల్లో, మనకు కన్పించేది మాత్రమే అసలు విలువ కాదు.

ఏమాత్రం నికర విలువ లేని కాగితం ముక్కలు, మీ జీవితానికి నిజమైన అర్థాన్ని ఎలా ఇవ్వగలవని మీరెప్పుడైనా అనుకున్నారా? చాలామంది అలా ఇవ్వగలవని భావిస్తారు. లక్షలాదిమంది ప్రజలు సాధ్యమైనంత ఎక్కువ డబ్బు సంపాదించేయాలని రాత్రీ పగలూ విరామమెరగక పనిచేస్తారు. డబ్బు సంపాదనలో కొందరు తమ ఆరోగ్యాన్నీ, స్నేహితుల్నీ, చివరికి తమ సొంత కుటుంబాన్నే పణంగా పెట్టేస్తారు. దాని మూలంగా వారికేం లభిస్తుంది? డబ్బు లేదా ఆ డబ్బుతో మనం కొనే వస్తువులు మనకు నిరంతరం నిలిచే నిజమైన సంతృప్తిని తేగలవా?

పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, వస్తుసంపదల్ని కూడగట్టుకోవడం మూలంగా లభించే సంతృప్తి కోసం మనం ఎంతగా తహతహలాడతామో, అది దొరికే సాధ్యత అంత తక్కువగా ఉంటుంది. అల్ఫీ కోన్‌ అనే జర్నలిస్టు ఇలా అంటున్నాడు, “సంతృప్తి అంగడిలో అమ్మకానికి ఉన్న వస్తువు కాదు. . . . జీవితంలో సిరిసంపదల సంపాదనే ప్రాధాన్యంగా ఉన్న ప్రజలు, విపరీతమైన చింతల్నీ, డిప్రెషన్నీ అనుభవిస్తున్నట్లు కన్పిస్తుంది.”—ఇంటర్నేషనల్‌ హెరాల్డ్‌ ట్రిబ్యూన్‌.

అర్థవంతమైన జీవితాన్ని గడపటానికి డబ్బు కాక మరేదో అవసరమని చాలామంది పరిశోధకులు గుర్తించినప్పటికీ, చాలామంది ప్రజలు మరోవిధంగా కూడా భావిస్తున్నారు. ఇది అంత ఆశ్చర్యకరమైన విషయం కాదు ఎందుకంటే, పాశ్చాత్య దేశాల్లో నివసిస్తున్నవారు ఒకరోజుకు దాదాపు 3,000 వ్యాపార ప్రకటనలను వింటుంటారు. ఆ వ్యాపార ప్రకటనలు కార్ల గురించైనా కానివ్వండి, కాండీల గురించైనా కానివ్వండి, వాటి వెనుక ఉన్న తలంపు మాత్రం ఒక్కటే: ‘ఈ ప్రొడక్టును కొనండి, మీరు సంతోషంగా ఉంటారు.’

వస్తు సంబంధ విలువలను నిర్విరామంగా పెంచడం యొక్క ఫలితమేమిటి? దీనివల్ల తరచూ ఆధ్యాత్మిక విలువలు ఉపేక్షింపబడుతున్నాయి ! జర్మనీలోని కోలోన్‌ ఆర్చ్‌బిషప్‌, “మన సమాజంలో దేవుడు అనే విషయం ఇక ఒక చర్చనీయాంశంగా లేదు” అని ఇటీవల అన్నాడని న్యూస్‌వీక్‌ పత్రికలోని ఒక నివేదిక తెలియజేసింది.

బహుశా మీరు జీవనోపాధి కోసమే దాదాపు మీ శక్తి సామర్థ్యాలన్నిటినీ వెచ్చించి ఉండవచ్చు. మరింకేది చేయటానికీ మీకు సమయం లేదని మీరు అనుకుంటుండవచ్చు. మీ ఆరోగ్యమైనా లేక మీ వయసైనా ఇక ఆపమని చెప్పేంతవరకూ, విసుగెత్తించే దైనందిన కార్యక్రమాలతో పరుగులు తీయడం కంటే జీవితానికి ఇంకా ఏదో ఉండివుంటుందని అప్పుడప్పుడూ మీరు అనుకోవచ్చు.

ఆధ్యాత్మిక విషయాలకు ఎక్కువ అవధానాన్ని ఇవ్వడం మరింత తృప్తిని మీకు తీసుకువస్తుందా? మీ జీవితానికి ఏది గొప్ప అర్థాన్నివ్వగలదు?