కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ మీద రంధ్రాన్వేషుల ప్రభావం ఉందా?

మీ మీద రంధ్రాన్వేషుల ప్రభావం ఉందా?

మీ మీద రంధ్రాన్వేషుల ప్రభావం ఉందా?

“ఇతరులలోని ఒక్క మంచి లక్షణాన్ని కూడా చూడకుండా, ఎప్పుడూ ఇతరుల్లోని చెడునే చూసే వ్యక్తే సినిక్‌ (రంధ్రాన్వేషి). అతడు మానవరూపం దాల్చిన గుడ్లగూబలాంటి వాడు. అతడు చీకటిలో బాగా చూడగలడు. కాని వెలుతురులో ఎంత మాత్రమూ చూడలేడు. తప్పులనే చిన్న కీటకాల కోసం దొంగచాటుగా చూస్తాడే గానీ, మంచి లక్షణాలనే పెద్ద జీవులను కన్నెత్తైనా చూడడు.” ఇవి, 19వ శతాబ్దానికి చెందిన అమెరికా దేశస్థుడూ మతబోధకుడూ అయిన హెన్రీ వార్డ్‌ బీచర్‌ అన్న మాటలు. ఈ మాటలు ఆధునిక సినిక్‌ల మనస్తత్త్వాన్ని సరిగ్గా వర్ణిస్తున్నాయని అనేకులు అనుకోవచ్చు. సినిక్‌ అనే మాట ప్రాచీన గ్రీసులో ఉద్భవించి, అనేక శతాబ్దాల వరకు కూడా ఒక నిర్దిష్ట తాత్త్విక సిద్ధాంతాన్ని నమ్మే వ్యక్తిని సూచించేది. కానీ నేడు ఇతరులలో తప్పులు పట్టే వ్యక్తిని అంటే రంధ్రాన్వేషిని సూచిస్తుంది.

అయితే, సినిక్‌ల తత్త్వ సిద్ధాంతం ఎలా ప్రారంభమైంది? వాళ్ళు ఏమి బోధించారు? సినిక్‌ల లక్షణాలు క్రైస్తవులకు ఉండదగిన లక్షణాలేనా?

ప్రాచీన సినిక్‌లూ—వాళ్ళ ఆవిర్భావాలూ, నమ్మకాలూ

ప్రాచీన గ్రీసు, తీవ్ర చర్చలకు వేదికగా ఉండేది. అనేక శతాబ్దాలు మొదలుకొని సామాన్య శకము వరకూ, సోక్రటీస్‌, ప్లేటో, అరిస్టాటిల్‌ మొదలైన వాళ్ళు, తాము బోధించిన తత్త్వ సిద్ధాంతాలను బట్టి ప్రసిద్ధి గాంచారు. వాళ్ళ బోధలు ప్రజలపై గొప్ప ప్రభావాన్ని చూపాయి. వాళ్ళు బోధించిన ఆశయాలు పాశ్చాత్య సంస్కృతిలో ఇప్పటికీ కనిపిస్తున్నాయి.

భౌతిక విషయాల కోసం, లేదా శారీరక ఆనందాల కోసం ప్రయాసపడడంలో శాశ్వతమైన సంతోషం ఉండదని సోక్రటీస్‌ (సా.శ.పూ. 470-399) వాదించాడు. మంచిని వెదకడం కోసం జీవితాన్ని అంకితం చేయడంలోనే నిజమైన సంతోషం ఉందని ఆయన నొక్కి చెప్పాడు. మంచితనమే జీవితపు అంతిమ లక్ష్యమై ఉండాలని సోక్రటీస్‌ ఎంచాడు. ఈ లక్ష్యాన్ని చేరుకొనేందుకు ఆడంబరాలు అనవసర ప్రయాసలు ఆటంకం కల్గించకుండా ఉండేందుకు ఆయన వాటిని తిరస్కరించాడు. నిరాడంబరంగా జీవిస్తూ, మితంగా ఉండాలనీ, సొంత కోరికలను త్యజించాలనీ బోధించాడు.

సోక్రటీస్‌ మొదలుపెట్టిన బోధనా పద్ధతిని సోక్రాటిక్‌ పద్ధతి అంటారు. అనేకమంది తాత్త్వికులు తమ ఆలోచనలను, వాటిని సమర్థించే వాదనలను తెలియజేసుకునేవారు. కానీ, సోక్రటీస్‌ వారికి భిన్నంగా ఉండేవాడు. ఆయన ఇతర తాత్త్వికుల సిద్ధాంతాలను విని, వారి ఆలోచనల్లో తప్పుల్ని పట్టుకొని వాటిని వెల్లడి చేయడానికి ప్రయత్నించేవాడు. ఈ పద్ధతి, విమర్శనాత్మకమైన దృక్పథాన్ని అలవరచుకునేందుకూ, ఇతరులను చిన్నచూపు చూసేందుకూ ప్రోత్సహించింది.

సోక్రటీస్‌ అనుచరుల్లో ఆంటీస్తెనస్‌ (దాదాపు సా.శ.పూ. 445-365) అనే తాత్త్వికుడు ఒకరు. ఆయనా, మరనేకులూ సోక్రటీస్‌ యొక్క ప్రాథమిక బోధలను స్వీకరించి, మంచిని వెదకడం కన్నా మిన్నయైనది మరేదీ లేదని అంటూ ఇంకొక అడుగు ముందుకు వెళ్ళారు. శారీరక ఆనందాల కోసం ప్రయత్నించడం అనేది ఒక ఆటంకం మాత్రమే కాక, అది ఒక రకంగా చెడుతనమేనని కూడా వాళ్లు భావించారు. వాళ్ళు సాంఘిక జీవితానికి పూర్తిగా వ్యతిరేకులై తోటి మానవులంటే ఏవగింపును చూపారు. ఆ విధంగా వాళ్ళు సినిక్‌లు అని పిలువబడ్డారు. సినిక్‌ అనే పేరు (కీనీకాస్‌) అనే గ్రీకు పదం నుండి వచ్చి ఉండవచ్చు. ఆ పదం ఊరికనే కోపపడేవారి, చిరచిరలాడే వారి ప్రవృత్తిని సూచించింది. “కుక్కలాంటివారు” అని దానర్థం. *

వాళ్ళ ఆశయం వాళ్ళ జీవితవిధానంపై చూపిన ప్రభావం

భౌతిక వాదాన్నీ స్వంత ఆనందాల కోసమైన ప్రయత్నాన్నీ వ్యతిరేకించే సినిక్‌ తత్త్వ సిద్ధాంతపు తలంపులు ప్రసంశనీయమని దృష్టించబడి ఉండవచ్చు. కానీ, సినిక్‌లు మరీ అతిగా వెళ్ళారు. అది ప్రసిద్ధ సినిక్కూ తత్త్వవేత్తా అయిన డయోజెనస్‌ జీవితంలో స్పష్టమౌతుంది.

డయోజెనస్‌ సా.శ.పూ. 412 లో, నల్ల సముద్రం ఒడ్డున ఉన్న సినోపీ నగరంలో పుట్టాడు. ఆయన తన తండ్రితో పాటు ఏథెన్సుకు వెళ్ళినప్పుడు, సినిక్‌ల బోధలను ఆంటీస్తెనస్‌ దగ్గర నేర్చుకున్నాడు. అలా ఆయన మరి దేని గురించి ఆలోచించలేనంతగా సినిక్‌ తత్త్వ సిద్ధాంతం ఆయన మస్తిష్కాన్ని పట్టేసింది. సోక్రటీస్‌ నిరాడంబర జీవితాన్ని గడిపాడు, ఆంటిస్తెనస్‌ ఆనందాలను త్యజించాడు, అయితే, డయోజెనస్‌ బైరాగి జీవితాన్నే గడిపాడు. ఆయన భౌతిక ఆనందాలను తృణీకరించడాన్ని నొక్కి చెబుతూ, కొంతకాలం ఒక తొట్టిలో నివసించాడని ప్రతీతి !

మంచిని వెదకాలనే అంతిమ లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నంలో డయోజెనస్‌ ఎంత దూరం వెళ్ళాడంటే, ఏథెన్సులో పట్టపగలు వెలుతురు బాగా ఉన్నప్పుడు కూడా, ఒక లాంతరును పట్టుకొని మంచి వ్యక్తులను వెదుకుతూ వెళ్ళేవాడు! ఆయనలా చేయడం ద్వారా, ప్రజల అవధానాన్ని ఆకర్షించాడు, డయోజెనస్‌ ఇంకా ఇతర సినిక్‌లు తాము నమ్ముతున్న సిద్ధాంతాన్ని బోధించడానికి దాన్ని ఒక మాధ్యమంగా ఉపయోగించుకున్నారు. అలెగ్జాండర్‌ చక్రవర్తి, నీకేం కావాలని డయోజెనస్‌ను అడిగినప్పుడు, సూర్య ప్రకాశానికి అడ్డు రాకుండా తప్పుకుంటే చాలని అన్నాడని చెప్పుకోబడుతుంది !

డయోజెనస్సూ, ఇతర సినిక్‌లూ భిక్షగాళ్ళుగా జీవించారు. తోటి మానవులతో సాధారణంగా ఉండే సంబంధాలను కలిగివుండడానికి కూడా వాళ్ళకు సమయం లేకుండా పోయింది. వాళ్ళు పౌర కర్తవ్యాలను చేయడానికి కూడా నిరాకరించారు. వాళ్ళకు తమ తోటి మానవుల మీద ఏమాత్రం గౌరవం లేకపోవడానికి కారణం, వారు సోక్రటీస్‌ యొక్క వాదనా పద్ధతికి ప్రభావితులవ్వడమే కావచ్చు. డయోజెనస్‌, ఇతరులను నొప్పించే విధంగా ఎగతాళి చేసే వ్యక్తని పేరు సంపాదించుకున్నాడు. సినిక్‌లు “కుక్కల్లాంటి” వాళ్ళు అని పేరు సంపాదించుకున్నారు. అయితే, అంతెందుకు, ప్రజలు ఎగతాళిగా డయోజెనస్‌కు కుక్క అనే పేరును పెట్టారు. ఆయన సా.శ.పూ. 320 లో 90 ఏళ్ళ వయస్సులో చనిపోయినప్పుడు, ఆయన సమాధి మీద స్మారక చిహ్నంగా కుక్క ఆకృతిని కూడా చెక్కించారు.

సినిక్‌ సిద్ధాంతంలోని కొన్ని అంశాలు ఇతర తత్త్వ సిద్ధాంతాల్లోకి చేర్చబడ్డాయి. అయితే, డయోజెనెస్సూ, తర్వాతి అనుచరులూ చూపిన వింత ప్రవర్తనల వల్ల సినిక్‌ సిద్ధాంతానికి చెడ్డపేరు వచ్చింది. చివరికి, ఆ సిద్ధాంతం మొత్తానికే అంతరించిపోయింది.

నేటి సినిక్‌ల లక్షణాలను మీరు కనబరచాలా?

ద ఆక్స్‌ఫర్డ్‌ ఇంగ్లీష్‌ డిక్షనరీ ప్రస్తుత దిన సినిక్‌ని (రంధ్రాన్వేషిని), “ఇతరుల తప్పులను పట్టే వైఖరి గల వ్యక్తి లేదా ఇతరుల తప్పులను బహిరంగంగా చెప్పే వైఖరి గల వ్యక్తి. . . . మానవుల ఉద్దేశాల్లోని, ప్రవర్తనలోని నిష్కపటాన్ని లేదా మంచితనాన్ని నమ్మని మనస్తత్త్వాన్ని చూపిస్తూ, తన అపనమ్మకాన్ని పరిహాసపు మాటలు లేదా ఎగతాళి మాటల ద్వారా వ్యక్తం చేసే అలవాటు ఉన్న వ్యక్తి; పరిహాసంగా తప్పులను ఎత్తి చెప్పే వ్యక్తి” అని వర్ణిస్తుంది. ఈ లక్షణాలు మన చుట్టూ ఉన్న లోకంలో ప్రస్ఫుటమౌతున్నాయి. అయితే, అవి క్రైస్తవ వ్యక్తిత్వంతో పొసగవు. ఈ క్రింద ఇవ్వబడిన బైబిలులోని బోధలను సూత్రాలను పరిశీలించండి.

“యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు కృపాసమృద్ధిగలవాడు. ఆయన ఎల్లప్పుడు వ్యాజ్యెమాడువాడు కాడు [“ఎల్లప్పుడూ తప్పులు పట్టుకుంటూ ఉండేవాడు కాడు,” NW] ఆయన నిత్యము కోపించువాడు కాడు.” (కీర్తన 103:8, 9) “దేవునిపోలి నడుచుకొనుడి” అని క్రైస్తవులకు చెప్పబడింది. (ఎఫెసీయులు 5:1) అంటే, సర్వశక్తిమంతుడైన దేవుడే, “తప్పులను పట్టే వైఖరిని లేదా తప్పులను బహిరంగంగా చెప్పే వైఖరిని” కనబరిచే బదులు కరుణను ప్రేమపూర్వకమైన దయను ధారళంగా చూపిస్తున్నప్పుడు, క్రైస్తవులు కూడా నిశ్చయంగా అదే విధంగా చేయడానికి ప్రయత్నించాలి.

యేసుక్రీస్తు యెహోవాను పరిపూర్ణంగా ప్రతిబింబించాడు. ‘మనం ఆయన అడుగుజాడల్లో నడుచుకునేలా ఆయన మనకు మాదిరి ఉంచాడు.’ (1 పేతురు 2:21; హెబ్రీయులు 1:3, 4) కొన్నిసార్లు ఆయన మతసంబంధమైన అబద్ధాలను బయటపెట్టాడు. లోకంలోని దుష్ట కార్యాలను గురించి సాక్ష్యమిచ్చాడు. (యోహాను 7:7) అయినప్పటికీ నిష్కపటులైన ప్రజలను గురించి ఆయన మెచ్చుకోలుగా మాట్లాడాడు. ఉదాహరణకు, “ఇదిగో యతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతనియందు ఏ కపటమును లేదని” నతనయేలు గురించి ఆయన అన్నాడు. (యోహాను 1:47) యేసు ప్రజలలోని విశ్వాసాన్ని చూసి వాళ్ళకు సహాయపడేందుకు అద్భుతాలను చేశాడు. (మత్తయి 9:22) ఒక స్త్రీ యేసుకు తెచ్చిన బహుమతిని చూసిన ఇతరులు అది దుబారా ఖర్చు అని అనుకున్నారు. కానీ, ఆయన ఆమె ఉద్దేశాల్లో తప్పు పట్టాలని చూడక, “సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో, అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని” చెప్పాడు. (మత్తయి 26:6-13) యేసు తన అనుచరులకు నమ్మకమైన స్నేహితుడు, ఆప్యాయతగల సహచరుడు. ఆయన ‘వారిని అంతమువరకు ప్రేమించాడు.’—యోహాను 13:1.

యేసు పరిపూర్ణుడు కనుక, అపరిపూర్ణులైన మానవుల్లో సులభంగా తప్పులను కనిపెట్టి ఉండగల్గేవాడే. అయితే ఆయన అపనమ్మకాన్ని చూపించే వైఖరిని గానీ, తప్పులనుపట్టే వైఖరిని గానీ చూపక, ప్రజల మనస్సులకు సేదదీర్పునిచ్చేందుకు ప్రయత్నించాడు.—మత్తయి 11:29, 30.

[ప్రేమ] అన్నిటిని నమ్మును.” (1 కొరింథీయులు 13:7) ఈ మాటలు సినిక్‌ల వైఖరికి పూర్తిగా భిన్నమైనవి. సినిక్‌లు ఇతరుల ఉద్దేశాలను ప్రవర్తనలను సందేహిస్తుంటారు. నిజమే, లోకం తమ అసలు లక్ష్యాలను వెల్లడి చేయని ప్రజలతో నిండి ఉంది. కనుక జాగ్రత్తగా ఉండవలసిన అవసరముంది. (సామెతలు 14:15) అయినప్పటికీ, ప్రేమది నమ్మే స్వభావం. అది అనవసరంగా అనుమానించక, నమ్మడానికి సిద్ధంగా ఉంటుంది.

యెహోవా దేవుడు తన సేవకులను ప్రేమిస్తాడు, నమ్ముతాడు. వాళ్ళ పరిమితులు ఆయనకు తెలుసు, వాళ్ళ కన్నా బాగా తెలుసు. అయినప్పటికీ, తన ప్రజలతో వ్యవహరించేటప్పుడు ఆయన అనుమానంతో ప్రవర్తించడు. వాళ్ళు చేయగలిగినదాని కన్నా ఎక్కువగా వాళ్ళ నుండి ఆశించడు. (కీర్తన 103:13, 14) అంతేకాక, మానవుల్లోని మంచితనాన్ని ఆయన చూస్తాడు. అపరిపూర్ణులైనప్పటికీ తన పట్ల నమ్మకంగా ఉండే సేవకులకు ఆధిక్యతలను, అధికారాన్నీ ఆయన నమ్మకంతోనే ఇస్తాడు.—1 రాజులు 14:13; కీర్తన 82:6.

“ఒకని ప్రవర్తననుబట్టి వాని క్రియల ఫలముచొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను.” (యిర్మీయా 17:10) యెహోవా వ్యక్తుల హృదయాలను ఖచ్చితంగా చదవగలడు. కానీ మనం చదవలేం. కనుక, ఇతరులకు తప్పుడు ఉద్దేశాలను ఆపాదించకుండా జాగ్రత్తపడవలసిన అవసరముంది.

మనలో రంధ్రాన్వేషకుల స్ఫూర్తి వేరూని, అది మన ఆలోచనాసరళిని అధీనం చేసుకునేందుకు అనుమతిస్తే, అది మనకూ తోటి విశ్వాసులకూ మధ్య భేదాభిప్రాయాలను కలిగించగలదు. అది క్రైస్తవ సంఘంలోని శాంతియుత వాతావరణానికి భంగం కలిగించగలదు. కనుక, మనం యేసు మాదిరిని అనుసరిద్దాం, ఆయన తన అనుచరులను గురించి వాస్తవికమైన దృష్టి కల్గి ఉండడమే గాక, వారితో వ్యవహరించేటప్పుడు వారిపైన నమ్మకాన్ని కనబరచి, వారికి నమ్మకమైన స్నేహితుడుగా ఉన్నాడు.—యోహాను 15:11-15.

“మనుష్యులు మీకేలాగు చేయవలెనని మీరు కోరుదురో ఆలాగు మీరును వారికి చేయుడి.” (లూకా 6:31) యేసు క్రీస్తు ఇచ్చిన ఈ ఉపదేశాన్ని అనేక విధాల్లో ఆచరించవచ్చు. ఉదాహరణకు, మనతో ఇతరులు దయాపూర్వకంగా గౌరవపూర్వకంగా మాట్లాడాలనే మనమందరమూ అనుకుంటాం. కనుక, మనం కూడా ఇతరులతో వ్యవహరించేటప్పుడు దయగాను గౌరవపూర్వకంగాను ఉండాలి. యేసు, మతనాయకుల అబద్ధ బోధలను వెల్లడి చేసినప్పుడు కూడా వారితో అగౌరవంగా గానీ పరిహాసంగా గానీ మాట్లాడలేదు.—మత్తయి 23:13-36.

రంధ్రాన్వేషణ వైఖరితో పోరాడే మార్గాలు

మనం నిరాశా నిస్పృహలకు గురైనట్లయితే, మనం కూడా రంధ్రాన్వేషులముగా మారే ప్రమాదం ఉంది. అయితే, యెహోవా తన అపరిపూర్ణ ప్రజలతో నమ్మకంగా వ్యవహరిస్తాడన్న విషయాన్ని గ్రహిస్తే, రంధ్రాన్వేషణ థోరణితో పోరాడి దానిని అధిగమించవచ్చు. మనం అలా అధిగమించినప్పుడు, మన తోటి ఆరాధకులూ అపరిపూర్ణులే అయినప్పటికీ సరైనది చేయాలని ప్రయత్నించేవారని—వాళ్ళు ఎలా ఉన్నారో అలానే వాళ్ళను అంగీకరించగల్గుతాం.

తమకు కలిగిన బాధాకరమైన అనుభవాల వల్ల కొందరు ఇతరులను నమ్మకపోవచ్చు. నిజమే, మన నమ్మకమంతటినీ అపరిపూర్ణ మానవుల పైన పెట్టుకోవడం వివేకవంతం కాదు. (కీర్తన 146:3, 4) అయితే, క్రైస్తవ సంఘంలో, అనేకులు ఇతరులకు ప్రోత్సాహమిచ్చేవారై ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటారు. తమ కుటుంబాలను కోల్పోయినవారిని తల్లుల్లాగ, తండ్రుల్లాగ, అక్కచెల్లెళ్ళలాగ, అన్నదమ్ముల్లాగ, పిల్లల్లాగ ఆదుకునే వేలాది మందిని గురించి ఆలోచించండి. (మార్కు 10:30) విపత్కర సమయాల్లో తాము నిజమైన స్నేహితులమని నిరూపించుకున్న అనేకులను గురించి ఆలోచించండి. *సామెతలు 18:24.

‘మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురని’ యేసు అన్నాడు. కనుక, యేసు అనుచరులకు గుర్తు సహోదర ప్రేమే గానీ, రంధ్రాన్వేషణ చేసే మనస్తత్త్వం కాదు. (యోహాను 13:35) కనుక, ప్రేమను చూపుకుందాం. తోటి క్రైస్తవుల్లోని మంచి లక్షణాలను చూసి మెప్పుదల కలిగి ఉందాం. ఆ విధంగా చేయడం, రంధ్రాన్వేషుల లక్షణాలను విడనాడేందుకు మనకు సహాయపడుతుంది.

[అధస్సూచీలు]

^ పేరా 8 మరొక సాధ్యత ఏమిటంటే, సినిక్‌ అనే పేరు ఏథెన్సులో ఉన్న జిమ్నేషియమ్‌ పేరు నుండి వచ్చి ఉండవచ్చు. దాని పేరు కీనోసారీస్‌. ఆంటీస్తెనస్‌ ఈ జిమ్నేషియమ్‌లో బోధించేవాడు.

^ పేరా 27 మే 15, 1999 కావలికోటలోని, “క్రైస్తవ సంఘం—బలపర్చే సహాయానికి మూలం” అనే శీర్షికను చూడండి.

[21వ పేజీలోని చిత్రం]

ప్రసిద్ధిగాంచిన సినిక్‌ డయోజెనస్‌

[చిత్రసౌజన్యం]

గ్రేట్‌ మెన్‌ అండ్‌ ఫేమస్‌ విమెన్‌ అనే పుస్తకం నుండి