కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధికారానికి గౌరవం—ఎందుకు చూపించడం లేదు?

అధికారానికి గౌరవం—ఎందుకు చూపించడం లేదు?

అధికారానికి గౌరవం—ఎందుకు చూపించడం లేదు?

“ప్రపంచవ్యాప్తంగా, స్థిరపరచబడిన మత సంబంధ అధికారాన్నీ, లౌకిక అధికారాన్నీ, సామాజిక రాజకీయ అధికారాలనూ అతిక్రమించేటువంటి ప్రస్తుత ధోరణి గత దశాబ్దపు విలక్షణమైన ధోరణిగా ఒకనాడు తలంచవచ్చు.”

చరిత్రకారిణీ, తత్త్వవేత్తా అయిన హానా ఆరెంట్‌ 1960లలో అన్న మాటలివి. ఆమె పేర్కొన్న ఆ దశాబ్దం గడిచి అనేక సంవత్సరాలైంది. అధికారమంటే అగౌరవం చూపే ధోరణి మునుపెన్నటికన్నా కూడా నేడు ప్రబలమౌతోంది.

ఉదాహరణకు, “కొందరు తల్లిదండ్రులు, తమ పిల్లల మీద ఉపాధ్యాయులకు ఉన్న అధికారాన్ని నిరాకరిస్తారు, తమ బిడ్డకు క్రమశిక్షణనిచ్చేందుకు ప్రయత్నిస్తే ఫిర్యాదు చేస్తారు” అని లండన్‌లోని ద టైమ్స్‌ అనే పత్రికలోని ఇటీవలి ఒక నివేదిక పేర్కొంది. పిల్లలకు స్కూల్లో క్రమశిక్షణనిస్తే, తల్లిదండ్రులు స్కూల్‌కి వెళ్ళి ఉపాధ్యాయులను బెదిరించడమే కాక, వారిపై దాడి కూడా చేస్తున్నారు.

“‘నాకు బాధ్యతలున్నాయి’ అనే బదులు ‘నాకు హక్కులున్నాయి’ అని మాత్రమే ప్రజలు అంటున్నారు” అని బ్రిటన్‌లోని నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ హెడ్‌ టీచర్స్‌ స్పోక్స్‌మ్యాన్‌ అన్నట్లు ఉటంకించబడింది. కొందరు తల్లిదండ్రులు, పిల్లల మనస్సుల్లో అధికారుల మీద ఆరోగ్యకరమైన గౌరవాన్ని కలిగించడంలో విఫలమవ్వడమే కాక, తమ పిల్లలను తాముగా సరిదిద్దరు, ఇతరులను కూడా సరిదిద్దనివ్వరు. తమ “హక్కులను” గురించి వాదించే పిల్లలు తమ తల్లిదండ్రుల అధికారాన్నీ ఉపాధ్యాయుల అధికారాన్నీ తిరస్కరిస్తుంటే వాళ్ళనిక అలాగే వదిలిపెట్టడం జరుగుతుంది. దాని ఫలితంగా “అధికారం గల వారిపై ఏ మాత్రం గౌరవంలేని, తప్పేదో ఒప్పేదో సరిగా తెలియని క్రొత్త తరం” తయారవ్వడాన్ని ఊహించవచ్చని మార్గరెట్‌ డ్రిస్కోల్‌ అనే కాలమిస్ట్‌ వ్రాస్తున్నారు.

టైమ్‌ అనే పత్రికలోని “లాస్ట్‌ జెనరేషన్‌” (పాడైన తరం) అనే శీర్షిక, రష్యాలోని అనేక మంది యౌవనస్థుల నిరాశా నిస్పృహలను గురించి చెబుతూ, “నీతి న్యాయాలు లేని, ఏదీ శాశ్వతం కాని నేటి లోకంలో పుట్టిన ఒకరికి సమాజం మీద ఎలా నమ్మకం ఉండగలదు?” అని ప్రసిద్ధిగాంచిన ఒక రాప్‌ సంగీతకారుడు అన్న మాటలను ఉటంకించింది. సామాజికవేత్తయైన మిఖాయేల్‌ టోపాలోవ్‌, ఆ మాటలకు మద్దతునిస్తూ, “ఈ పిల్లలు తెలివిలేనివారేమీ కాదు. ప్రభుత్వం తమ తల్లిదండ్రులను మోసం చేసిందీ, తమ తల్లిదండ్రులు జమ చేసుకున్న డబ్బును దోచుకున్నదీ, తమ తల్లిదండ్రులను ఉద్యోగాల నుండి తీసివేసిందీ వాళ్ళు తమ కళ్ళతో చూశారు. ఈ పిల్లలు ఇలాంటి వాతావరణంలో అధికారులకు గౌరవం చూపిస్తారని మనం ఎదురుచూడవచ్చా?” అని అన్నారు.

యువ తరానికి మాత్రమే అధికారుల మీద నమ్మకం లేదనుకోవడం పొరపాటు. నేడు, అన్ని వయస్సుల్లోని ప్రజలూ, ఎలాంటి అధికారం గలవారినైనా సరే అపనమ్మకంతో చూస్తారు, ఏవగింపుతో కూడా చూస్తారు. అయితే, ఏ అధికారాన్నీ నమ్మలేమని దీని భావమా? అధికారం అనే మాట, “ఇతరుల చర్యలను నియంత్రించేందుకు, తీర్పును విధించేందుకు, లేదా నిషేధించేందుకు గల శక్తి లేదా హక్కు” అని నిర్వచించబడుతుంది. అలాంటి అధికారాన్ని సరైన విధంగా ఉపయోగిస్తే అది మంచికి తోడ్పడుతుంది. అది వ్యక్తులకూ, సమాజానికీ ప్రయోజనకరం కాగలదు. అదెలాగో తర్వాతి శీర్షిక చర్చిస్తుంది.