కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అహంకారము అవమానానికి నడిపిస్తుంది

అహంకారము అవమానానికి నడిపిస్తుంది

అహంకారము అవమానానికి నడిపిస్తుంది

“అహంకారము వెంబడి అవమానము వచ్చును; వినయముగలవారియొద్ద జ్ఞానమున్నది.”సామెతలు 11:2.

1, 2. అహంకారం అంటే ఏమిటి, అది ఏయే విధాలుగా నాశనానికి నడిపింది?

అసూయతో రగిలిపోతున్న ఒక లేవీయుడు, యెహోవా నియమించిన అధికారులకు విరుద్ధంగా ఒక విద్రోహుల మూకను రేపాడు. అధికార దాహంగల ఒక రాకుమారుడు, తన తండ్రి సింహాసనాన్నే చేజిక్కించుకోవాలని పన్నాగం పన్నాడు. సహనం లేని ఒక రాజు, దేవుని ప్రవక్త ఇచ్చిన స్పష్టమైన నిర్దేశాల్ని గాలికొదిలేశాడు. ఈ ముగ్గురు ఇశ్రాయేలీయుల్లో ఒక లక్షణం మనకు కనబడుతుంది: అదే అహంకారం.

2 హృదయంలో ఉండే అహంకారమనే లక్షణం మనందరికీ ముప్పువాటిల్లజేయగలదు. (కీర్తన 19:13) అహంకారి తనకు అధికారం లేకపోయినా అధికారం గలవాళ్ళు మాత్రమే తీసుకొనవలసిన చర్యల్ని తాను తీసుకుంటాడు. ఇలా చేయడం మూలంగా తరచు విపత్తులు సంభవిస్తుంటాయి. అసలు చెప్పాలంటే, అహంకారం రాజుల్నే నశింపజేసింది, సామ్రాజ్యాల్నే పతనం చేసింది. (యిర్మీయా 50:29, 31, 32; దానియేలు 5:20) ఆ దుర్లక్షణం చివరికి యెహోవా సేవకుల్లోని కొందరిని వశపర్చుకుని అది వారిని తమ సొంత నాశనానికే నడిపించింది.

3. అహంకారం యొక్క ప్రమాదాల గురించి మనం ఎలా తెలుసుకోవచ్చు?

3 కారణసహితంగానే బైబిలు ఇలా చెబుతుంది: “అహంకారము వెంబడి అవమానము వచ్చును; వినయముగలవారియొద్ద జ్ఞానమున్నది.” (సామెతలు 11:2) ఈ సామెతలోని నిజాన్ని ధృవీకరించే ఉదాహరణలు బైబిల్లో ఉన్నాయి. వాటిలో కొన్నింటిని పరిశీలించడం, మనకున్న పరిమితులను దాటడం వల్ల వచ్చే ప్రమాదాన్ని గ్రహించడానికి సహాయం చేస్తుంది. కాబట్టి, అసూయ, అధికారదాహం, అసహనం పైనపేర్కొన్న ఆ ముగ్గురు వ్యక్తులూ అవమానం పాలయ్యేలా అహంకారంగా ప్రవర్తించేందుకు ఎలా నడిపించాయో పరిశీలిద్దాము.

కోరహు—అసూయాపరుడైన తిరుగుబాటుదారుడు

4. (ఎ) కోరహు ఎవరు, ఆయన ఏ చారిత్రక సంఘటనల్లో నిస్సందేహంగా భాగమై ఉన్నాడు? (బి)కోరహు తన మలి జీవితంలో ఏ చెడు కార్యాన్ని చేశాడు?

4 కోరహు కహతీయుడైన లేవీయుడు, మోషే అహరోనుల పెదనాన్న కుమారుడు. ఆయన దశాబ్దాలపాటు యెహోవాకు యథార్థంగా ఉన్నాడన్నది స్పష్టం. ఎఱ్ఱ సముద్రం గుండా అద్భుతరీతిగా విమోచింపబడిన వారిలో ఒకడైవుండే ఆధిక్యత కోరహుకు కూడా లభించింది, సీనాయి పర్వతం వద్ద దూడ ఆరాధన చేసిన వారిపై యెహోవా తీర్పును అమలు చేయడంలో అతడు కూడా తప్పకుండా భాగం వహించే ఉంటాడు. (నిర్గమకాండము 32:26) అయితే చివరికి, 250 మంది ఇశ్రాయేలు ప్రధానులతో సహా రూబేనీయులైన దాతాను, అబీరాము, ఓను అనేవారు మోషే అహరోనులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు, కోరహు ఆ మూకకు నాయకత్వం వహించాడు. * వాళ్లు మోషే అహరోనులతో, “మీతో మాకిక పనిలేదు; ఈ సర్వసమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే యెహోవా వారి మధ్యనున్నాడు; యెహోవా సంఘముమీద మిమ్మును మీరేల హెచ్చించుకొనుచున్నార[ని]” అన్నారు.—సంఖ్యాకాండము 16:1-3.

5, 6. (ఎ) కోరహు మోషే అహరోనులపై ఎందుకు తిరుగుబాటు చేశాడు? (బి) కోరహు దేవుని ఏర్పాటులో తన స్వంత స్థానాన్ని అల్పంగా ఎంచి ఉండవచ్చునని ఎందుకు చెప్పవచ్చు?

5 అనేక సంవత్సరాలపాటు నమ్మకంగా ఉన్న తర్వాత, కోరహు ఎందుకు తిరుగుబాటు చేశాడు? ఇశ్రాయేలీయులపై మోషే నాయకత్వం అణిచివేసేదిగా లేదన్నది మాత్రం కచ్చితం, ఎందుకంటే ఆయన, “భూమిమీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు.” (సంఖ్యాకాండము 12:3) అయితే కోరహు, మోషే అహరోనులపై అసూయపడి, వారికున్న స్థానాన్నిబట్టి ఉక్రోషపడి ఉండవచ్చు. అందుకే, వాళ్లు స్వార్థంతో తమకు తాముగా సమాజంపై తమను తాము హెచ్చించుకున్నారని అతడు తప్పుగా అన్నాడు.—కీర్తన 106:16.

6 కొంతమేరకు కోరహుకున్న సమస్య ఏమిటంటే, దేవుని ఏర్పాటులో తనకున్న ఆధిక్యతలను విలువైనవిగా ఎంచకపోవడమే. నిజమే, కహతీయులైన లేవీయులు యాజకులు కాదు గానీ వాళ్లు దేవుని ధర్మశాస్త్ర బోధకులు. గుడారాన్ని ఒక స్థలం నుండి మరో స్థలానికి తీసుకువెళ్లేటప్పుడు వీళ్లే దానిలోని సామాగ్రినీ సేవోపకరణాలనూ మోసుకువెళ్లేవారు. అది చిన్న పనేమీ కాదు, ఎందుకంటే పరిశుద్ధ సేవోపకరణములను మతపరంగా, నైతికపరంగా పరిశుభ్రంగా ఉన్న వ్యక్తులు మాత్రమే మోయాలి. (యెషయా 52:11) కాబట్టి మోషే కోరహుకు ముఖాముఖి ఎదురైనప్పుడు, మీరు మీకివ్వబడిన నియామకాన్ని మరీ అంత అల్పమైనదిగా ఎంచుతున్నారా? లేకుంటే మరెందుకు యాజకత్వం కూడా కావాలని కోరుకుంటున్నారు? అని అడిగాడు. (సంఖ్యాకాండము 16:9, 10) ఏదో ప్రత్యేకమైన స్థానాన్నో లేదా హోదానో పొందడం కాదు గానీ యెహోవా ఏర్పాటు ప్రకారం నమ్మకంగా ఆయన సేవ చేయడమే అత్యంత గొప్ప ఘనత అన్న విషయాన్ని కోరహు గుర్తించలేకపోయాడు.—కీర్తన 84:10.

7. (ఎ) మోషే కోరహుతోను అతని మనుష్యులతోను ఏమి చెప్పాడు? (బి) కోరహు చేసిన తిరుగుబాటు నాశనకరమైన ముగింపుకు ఎలా చేరుకుంది?

7 మరునాడు ఉదయం ధూపార్తులు, ధూపద్రవ్యము తీసుకుని గుడారం వద్ద సమకూడమని మోషే కోరహును, అతని మనుష్యులను ఆహ్వానించాడు. కోరహు అతని మనుష్యులు యాజకులు కాదు గనుక వాళ్లకు ధూపద్రవ్యం వేసే అధికారం లేదు. వాళ్లు ధూపార్తులు, ధూపద్రవ్యము తీసుకుని వస్తే, యాజకులుగా సేవచేసే హక్కు తమకుందని వాళ్లు భావిస్తున్నారన్న విషయం స్పష్టంగా సూచించబడుతుంది—విషయాన్ని పునఃపరిశీలించటానికి వాళ్లకు మొత్తం ఒక రాత్రంతా గడువు ఉన్నా వాళ్ల అభిప్రాయంలో మార్పురాలేదు. కనుక మరునాడు ఉదయం వాళ్లు సమకూడినప్పుడు, యెహోవా సరిగ్గానే తన ఆగ్రహాన్ని వ్యక్తపరిచాడు. “భూమి నోరు తెరచి” రూబేనీయులను ‘మ్రింగి వేసింది.’ కోరహుతో సహా మిగతావారు అగ్నికి ఆహుతైపోయారు. (ద్వితీయోపదేశకాండము 11:6; సంఖ్యాకాండము 16:16-35; 26:10) కోరహు అహంకారం చివరికి అతి ఘోరమైన అవమానానికి, అంటే దేవుని అనంగీకారానికి దారితీసింది!

‘అసూయపడే దృక్పథాన్ని’ విడనాడండి

8. క్రైస్తవుల మధ్య ‘అసూయపడే’ దృక్పథం ఎలా కనిపించగలదు?

8 కోరహు వృత్తాంతం మనకొక హెచ్చరిక. అపరిపూర్ణ మానవుల్లో ‘మత్సరపడే [అసూయపడే] దృక్పథం’ ఉంది గనుక, అది క్రైస్తవ సంఘంలో కూడా బహిర్గతం కాగలదు. (యాకోబు 4:5) ఉదాహరణకు, మనం ఏదైనా హోదా మీద మక్కువపడుతుండవచ్చు. కోరహులా మనం, మనకు ఇష్టమైన ఆధిక్యతలు ఉన్నవారిని చూసి అసూయపడుతుండవచ్చు. లేదా మనం మొదటి శతాబ్దపు క్రైస్తవుడైన దియొత్రెఫేలా తయారు కావచ్చు. అపొస్తలులకున్న అధికారాన్ని అతడు తీవ్రంగా విమర్శించాడు, దానికి కారణం తనకూ అధికారం కావాలన్నదేనని స్పష్టమౌతుంది. వాస్తవానికి, దియొత్రెఫే ‘ప్రధానత్వమును కోరుతున్నాడని’ యోహాను వ్రాశాడు.—3 యోహాను 9.

9. (ఎ) సంఘ బాధ్యతలకు సంబంధించి మనం ఏ దృక్పథాన్ని నివారించాలి? (బి) దేవుని ఏర్పాటులో మన స్థానాన్ని గురించి ఏ దృక్కోణం సరైనది?

9 అయితే ఒక క్రైస్తవ పురుషుడు సంఘ బాధ్యతలు చేపట్టాలని కోరుకోవడం తప్పేమీ కాదు. అలాంటి దృక్పథాన్ని పౌలు ప్రోత్సహించాడు కూడా. (1 తిమోతి 3:1) అయితే మనం ఎన్నడూ మన సేవాధిక్యతలను మన యోగ్యతకు పట్టాలుగా భావించకూడదు, అంతేగాక వాటిని పొందడం ద్వారా మనం పురోభివృద్ధి పథంలో మరో మెట్టు పైకెళ్లినట్లుగా అనుకోకూడదు. “మీలో ఎవడు గొప్పవాడై యుండగోరునో వాడు మీ పరిచారకుడై యుండవలెను; మీలో ఎవడు ముఖ్యుడై యుండగోరునో వాడు మీ దాసుడై యుండవలెను” అని యేసు చెప్పాడని గుర్తుంచుకోండి. (మత్తయి 20:26, 27) దేవుని సంస్థలో మనకున్న “హోదాను” బట్టే దేవుని దృష్టిలో మన విలువ పెరుగుతుందన్నట్లుగా, గొప్ప బాధ్యతలున్న వారిని చూసి అసూయపడడం తప్పు. యేసు ఇలా అన్నాడు: “మీరందరు సహోదరులు.” (మత్తయి 23:8) అవును, ప్రచారకులయినా, పయినీర్లయినా, క్రొత్తగా బాప్తిస్మం తీసుకున్నవారైనా లేక ఎంతోకాలం నుండి యథార్థంగా ఉన్నవారైనా యెహోవా సేవను పూర్ణాత్మతో చేసేవారందరికీ ఆయన ఏర్పాటులో విలువైన స్థానం ఉంది. (లూకా 10:27; 12:6, 7; గలతీయులు 3:28; హెబ్రీయులు 6:10) “మీరందరు ఎదుటివానియెడల దీనమనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి” అని చెప్తున్న బైబిలు ఉపదేశాన్ని అన్వయించుకోవడానికి కృషి చేస్తున్న లక్షలాదిమందితో భుజం భుజం కలిపి పనిచేయడం నిజంగా ఒక ఆశీర్వాదమే.—1 పేతురు 5:5.

అబ్షాలోము—అధికారదాహంగల అవకాశవాది

10. అబ్షాలోము ఎవరు, తీర్పుకోసం రాజు దగ్గరికి వచ్చేవారి అభిమానాన్ని సంపాదించుకోవడానికి అతడెలా ప్రయత్నించాడు?

10 దావీదు రాజు మూడవ కుమారుడైన అబ్షాలోము జీవిత విధానం అధికారదాహం విషయంలో మనకు ఒక గుణపాఠాన్ని నేర్పిస్తుంది. కుయుక్తిపరుడైన ఈ అవకాశవాది తీర్పుకోసం రాజు దగ్గరికి వచ్చే వారి అభిమానాన్ని చూరగొనడానికి ప్రయత్నించాడు. మొదట్లో అతడు, దావీదుకు వాళ్ల అవసరాల గురించి శ్రద్ధలేదని డొంకతిరుగుడుగా సూచించాడు. తర్వాత అతడు ఆ డొంకతిరుగుడు పద్ధతి మానేసి మెల్లగా తన మనస్సులోని మాటను బయటపెట్టాడు. “నేను ఈ దేశమునకు న్యాయాధిపతినైయుండుట యెంత మేలు; అప్పుడు వ్యాజ్యెమాడు వారు నాయొద్దకు వత్తురు, నేను వారికి న్యాయము తీర్చుదు”నంటూ మాటలు వల్లించడం మొదలుపెట్టాడు! అబ్షాలోము వక్ర పథకాలకు అవధులు లేకుండాపోయాయి. “తనకు నమస్కారము చేయుటకై యెవడైనను తన దాపునకు వచ్చినప్పుడు అతడు తన చేయిచాపి అతని పట్టుకొని ముద్దుపెట్టుకొనుచు వచ్చెను. తీర్పునొందుటకై రాజునొద్దకు వచ్చిన ఇశ్రాయేలీయుల కందరికి అబ్షాలోము ఈ ప్రకారము” చేస్తూ వచ్చాడని బైబిలు చెప్తుంది. మరి దాని ఫలితమేమిటి? అబ్షాలోము “ఇశ్రాయేలీయుల నందరిని తనతట్టు త్రిప్పుకొనెను.”—2 సమూయేలు 15:1-6.

11. దావీదు సింహాసనాన్ని చేజిక్కించుకోవడానికి అబ్షాలోము ఎలా ప్రయత్నించాడు?

11 అబ్షాలోము తన తండ్రి రాజరికాన్ని హస్తగతం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఐదేళ్ల క్రితం, తన చెల్లెలైన తామారును మానభంగం చేసినందుకు ప్రతీకారంతో దావీదు పెద్ద కుమారుడైన అమ్నోనును హత్య చేయించాడు. (2 సమూయేలు 13:28, 29) అయితే, అప్పుడు కూడా అబ్షాలోము కన్ను సింహాసనం మీదే ఉండి ఉంటుంది, అందుకే అమ్నోను హత్య తన ప్రత్యర్థిని నిర్మూలించటానికి అనుకూలమైన మార్గమని భావించి ఉంటాడు. * ఏదేమైనప్పటికీ సమయం వచ్చినప్పుడు అబ్షాలోము తన పావులను కదిపాడు. ఆయన దేశమంతటా రాజుగా తన అధికారాన్ని ప్రకటించాడు.—2 సమూయేలు 15:10.

12. అబ్షాలోము అహంకారం అవమానానికి ఎలా దారి తీసిందో వివరించండి.

12 కొంతకాలంపాటు అబ్షాలోముకు విజయం లభించింది, ఎందుకంటే “అబ్షాలోము దగ్గరకు వచ్చిన జనము మరి మరి యెక్కువగుటచేత కుట్ర బహు బలమాయెను.” కొంతకాలానికి, రాజైన దావీదు తన ప్రాణ రక్షణ కోసం పారిపోవలసి వచ్చింది. (2 సమూయేలు 15:12-17) అయితే త్వరలోనే యోవాబు అబ్షాలోమును చంపి ఒక గోతిలో పడేసి రాళ్లకుప్పను దానిమీద పేర్చాడు. అలా అబ్షాలోము తన అహంకారానికి మూల్యం చెల్లించాడు. రాజైపోవాలని ఆశించిన అధికారదాహంగల ఈ వ్యక్తికి గౌరవప్రదమైన రీతిలో సమాధి కూడా జరగకపోవడాన్ని ఊహించండి! * అబ్షాలోము అహంకారం నిజంగా అతనిని అవమానం పాలు చేసింది.—2 సమూయేలు 18:9-17.

స్వార్థపూరితమైన అధికారదాహాన్ని త్యజించండి

13 అబ్షాలోము అధికారంలోకి రావడమూ, తర్వాత అతని పతనమూ మనకు ఒక మంచి గుణపాఠాన్ని నేర్పిస్తాయి. నీతినియమాలు లేని నేటి లోకంలో, ప్రజలు తమ పైనున్న వారిని కాకాపట్టడం, వాళ్ల అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నించడం సర్వసాధారణమైన విషయమే. వాళ్లకు మంచి అభిప్రాయాన్ని కల్గించటానికో లేదా ఏదైనా ఆధిక్యతనుగానీ ఉన్నత స్థానాన్నిగానీ సంపాదించుకోవటానికో అలా చేస్తుంటారు. అదే సమయంలో, వాళ్లు తమ క్రిందివారి అభిమానాన్ని చూరగొనడానికీ మద్దతును పొందటానికీ వారి ఎదుట తమను గురించి కోతలు కోస్తూ ఉంటారు. మనం జాగ్రత్తగా లేకపోతే, మన హృదయంలో కూడా అలాంటి అధికారదాహంతో కూడిన దృక్పథమే తలెత్తవచ్చు. మొదటి శతాబ్దానికి చెందిన కొందరి విషయంలో అది నిజమైంది, వారి విషయమై జాగ్రత్తగా ఉండమని అపొస్తలులు బలమైన హెచ్చరికలు ఇచ్చే పరిస్థితి తలెత్తిందని స్పష్టమౌతుంది.—గలతీయులు 4:17; 3 యోహాను 9, 10.

14. అధికారదాహంతో కూడిన స్వయం-ప్రశంసా స్ఫూర్తిని మనం ఎందుకు నివారించాలి?

14 ‘తమ స్వంత మహిమ కోసం’ ప్రాకులాడుతూ ప్రగల్భాలు పలికేవారికి యెహోవా సంస్థలో స్థానం లేదు. (సామెతలు 25:27) వాస్తవానికి బైబిలు మనల్నిలా హెచ్చరిస్తుంది: “యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటిని బింకములాడు నాలుకలన్నిటిని కోసివేయును.” (కీర్తన 12:3) అబ్షాలోముకు ఇచ్చకములాడే పెదవులుండేవి. అతడు తనకు ఎవరి అభిమానమైతే కావాలో వారితో ముఖస్తుతి మాటలు పలికేవాడు, అతడదంతా చేసింది అధికార స్థానాన్ని పొందడానికే. దానికి వ్యతిరేకంగా, “కక్షచేతనైనను వృథాతిశయముచేతనైనను ఏమియు చేయక, వినయమైన మనస్సుగలవారై యొకనినొకడు తనకంటె యోగ్యుడని యెంచు”కొనమని పౌలు ఇచ్చిన ఉపదేశాన్ని అనుసరించే సహోదరసహోదరీల మధ్య సహవసించడం ఎంత గొప్ప ఆశీర్వాదం!—ఫిలిప్పీయులు 2:3.

సౌలు—అసహనంగల రాజు

15. సౌలు ఒకప్పుడు తాను వినయం గలవాడినని ఎలా చూపించుకున్నాడు?

15 ఒకప్పుడు సౌలు చాలా సాత్వికుడు, ఆ తర్వాత అతడు ఇశ్రాయేలీయుల రాజయ్యాడు. ఉదాహరణకు, అతడు యౌవనస్థునిగా ఉన్నప్పుడు ఏమి జరిగిందో చూడండి. దేవుని ప్రవక్తయైన సమూయేలు అతని గురించి మంచిగా మాట్లాడినప్పుడు, సౌలు వినయంగా ఇలా అన్నాడు: “నేను బెన్యామీయుడను కానా? నా గోత్రము ఇశ్రాయేలీయుల గోత్రములలో స్వల్పమైనదికాదా? నా యంటి వారు బెన్యామీను గోత్రపు ఇంటివారందరిలో అల్పులు కారా? నాతో ఈలాగున ఎందుకు పలుకుచున్నావు?”—1 సమూయేలు 9:21.

16. సౌలు ఏ విధంగా అసహనంతో కూడిన దృక్పథాన్ని చూపించాడు?

16 అయితే ఆ తర్వాత సౌలు వినయం మటుమాయమైపోయింది. ఫిలిష్తీయులతో యుద్ధం చేస్తున్నప్పుడు, అతడు గిల్గాలుకు పారిపోయాడు, అక్కడ అతడు సమూయేలు వచ్చి బలులు అర్పించి దేవునికి విన్నపం చేసే వరకూ వేచి ఉండవలసి ఉంది. అయితే నియమిత సమయానికి సమూయేలు రానప్పుడు, సౌలు అహంభావంతో దహనబలిని తానే అర్పించేశాడు. అతడు ముగించే సరికి సమూయేలు వచ్చాడు. “నీవు చేసిన పని యేమని” సమూయేలు అడిగినప్పుడు సౌలు, “జనులు నాయొద్దనుండి చెదరిపోవుటయు, నిర్ణయకాలమున నీవు రాకపోవుటయు . . . చూచి . . . నా అంతట నేను సాహసించి దహనబలి అర్పించితి”నన్నాడు.—1 సమూయేలు 13:8-12.

17. (ఎ) సౌలు చర్యలు మొదటిసారి చూసినప్పుడు ఎందుకు సముచితమైనవిగానే కనిపించవచ్చు? (బి)సౌలు అసహనంతో చేసిన పనికి యెహోవా అతడిని ఎందుకు మందలించాడు?

17 మొదటిసారి చూసినప్పుడు, సౌలు చేసిన పని సరైనదిగానే అనిపిస్తుంది. ఎంతైనా దేవుని ప్రజలు “దిగులుపడు”తున్నారు, వారు “ఇరుకులో” ఉన్నారు, తామున్న దుర్భరమైన స్థితిని బట్టి వారు భయపడిపోతున్నారు. (1 సమూయేలు 13:6, 7) అలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు చొరవ తీసుకోవడం కచ్చితంగా తప్పేమీ కాదు. * అయితే యెహోవా హృదయాలను చదువగలడనీ మన అంతరంగంలోని దృక్పథాలను సహితం గ్రహించగలడనీ గుర్తుంచుకోండి. (1 సమూయేలు 16:7) కాబట్టి, బైబిలు వృత్తాంతంలో సూటిగా చెప్పబడని సౌలులోని కొన్ని అంశాలను ఆయన చూసివుంటాడు. ఉదాహరణకు, సౌలు అసహనం, గర్వం నుండి తలెత్తిందని యెహోవా చూసి ఉంటాడు. ఇశ్రాయేలీయులందరికీ రాజైన తాను, వృద్ధుడూ ఆలస్యం చేస్తున్న ప్రవక్తా అని తాను భావిస్తున్న వ్యక్తి కోసం వేచి ఉండవలసి రావడాన్ని బట్టి సౌలు ఎంతో చికాకుపడి ఉండవచ్చు! ఏదేమైనా, సమూయేలు ఆలస్యం చేయడంతో, విషయాల్ని తన చేతుల్లోకి తీసుకోవడానికీ, తనకివ్వబడిన స్పష్టమైన నిర్దేశాల్ని గాలికొదిలేయడానికీ తనకు అధికారం లభించిందనీ సౌలు భావించాడు. ఫలితం? సౌలు తీసుకున్న చొరవను సమూయేలు మెచ్చుకోలేదు. బదులుగా అతడు, ‘యెహోవా నీకు ఆజ్ఞాపించినదాని నీవు గైకొనకపోతివి గనుక నీ రాజ్యము నిలువదు’ అంటూ సౌలును తీవ్రంగా మందలించాడు. (1 సమూయేలు 13:13, 14) మరొకసారి, అహంకారం అవమానానికి నడిపింది.

అసహనం విషయమై జాగ్రత్త

18, 19. (ఎ) ఆధునిక దిన దేవుని సేవకుడు అహంకారంగా ప్రవర్తించేలా అసహనం ఎలా చేయగలదో వివరించండి. (బి)క్రైస్తవ సంఘ కార్యనిర్వహణ గురించి మనం ఏమి గుర్తుంచుకోవాలి?

18 సౌలు అహంకారపూరిత చర్యను గూర్చిన వృత్తాంతం మన ప్రయోజనార్థమే దేవుని వాక్యంలో పొందుపర్చబడింది. (1 కొరింథీయులు 10:11) మన సహోదరుల అపరిపూర్ణతలను బట్టి ఆగ్రహించడం సులభమే. అన్నీ సవ్యంగా జరగాలంటే పరిస్థితుల్ని నా చేతుల్లోకి తీసుకోవాల్సిందేనని భావిస్తూ, సౌలు వలె అసహనులమయ్యే అవకాశం ఉంది. ఉదాహరణకు, ఒక సహోదరుడు కొన్ని సంస్థీకరణ సంబంధిత నైపుణ్యాల్లో బాగా ఆరితేరి ఉన్నాడనుకుందాము. అతడు సమయాన్ని చక్కగా పాటిస్తాడు, సంఘ నియమనిబంధనల గురించి అతనికి బాగా తెలుసు, ప్రసంగించడంలోనూ బోధించడంలోనూ ఎంతో ప్రతిభావంతుడు. అదే సమయంలో, అతడు ఇతరులు తన కచ్చితమైన ప్రమాణాలకు సరితూగలేకపోతున్నారనీ, వాళ్లు తనంత నైపుణ్యంగలవారు కాదనీ భావిస్తుంటాడు. అయితే ఇది, అతడు తన అసహనాన్ని వ్యక్తపర్చటానికి అతనికి అధికారాన్ని ఇస్తుందా? తన కృషి మూలంగానే అన్ని పనులు జరుగుతున్నాయనీ, లేదంటే సంఘం కుప్పకూలిపోతుందనీ సూచిస్తూ అతడు తన సహోదరులను విమర్శించాలా? అది అహంకారమే అవుతుంది!

19 నిజానికి ఒక సంఘంలోని క్రైస్తవులను సమకూర్చి ఉంచేదేమిటి? కార్యనిర్వహణా నైపుణ్యాలా? సామర్థ్యమా? జ్ఞానబాహుళ్యమా? నిజమే, సంఘ కార్యకలాపాలు సాఫీగా సాగడానికి ఇవి ప్రయెజనకరమైనవే. (1 కొరింథీయులు 14:39, 40; ఫిలిప్పీయులు 3:16; 2 పేతురు 3:18) అయితే, తన అనుచరులు ప్రాముఖ్యంగా ప్రేమ వల్ల గుర్తించబడతారని యేసు చెప్పాడు. (యోహాను 13:35) అందుకే శ్రద్ధగల పెద్దలు అంతా క్రమంగా జరిగేలా చూస్తూనే, సంఘం అన్నది కఠినమైన కార్యనిర్వహణ అవసరమైన వ్యాపార సంస్థ కాదుగానీ ప్రేమపూర్వకమైన శ్రద్ధ అవసరమైన మందతో రూపొందించబడిందని గుర్తిస్తారు. (యెషయా 32:1, 2; 40:11) అయితే, అలాంటి సూత్రాలపట్ల అహంకారంతో కూడిన నిర్లక్ష్యభావాన్ని కల్గి ఉండడం సాధారణంగా వివాదానికి దారితీస్తుంది. దానికి భిన్నంగా, దైవిక క్రమాన్ని పాటిస్తే అది మందకు శాంతిని తెస్తుంది.—1 కొరింథీయులు 14:33; గలతీయులు 6:16.

20. తర్వాతి శీర్షికలో ఏమి పరిశీలించబడుతుంది?

20 కోరహు, అబ్షాలోము, సౌలులను గూర్చిన బైబిలు వృత్తాంతాలు, సామెతలు 11:2 చెప్తున్నట్లుగా అహంకారం అవమానానికి దారితీస్తుందని చూపిస్తున్నాయి. అయితే, అదే బైబిలు వచనం ఇంకా ఇలా చెప్తుంది: “వినయముగలవారియొద్ద జ్ఞానమున్నది.” వినయమంటే ఏమిటి? ఈ లక్షణంపై వెలుగును ప్రసరించడానికి బైబిలులోని ఏ ఉదాహరణలు మనకు సహాయం చేయగలవు, నేడు మనం వినయాన్ని ఎలా చూపించగలము? ఈ ప్రశ్నలు తర్వాతి శీర్షికలో పరిశీలించబడతాయి.

[అధస్సూచీలు]

^ పేరా 4 రూబేను యాకోబు మొదటి కుమారుడు గనుక, లేవీ వంశీయుడైన మోషేకు తమను నడిపించే అధికారం ఇవ్వబడినందుకు రూబేను వంశీయులు ఉక్రోషపడివుంటారు, అయితే వారు తిరుగుబాటు చేసేందుకు వారిని పురికొల్పింది కోరహు.

^ పేరా 11 దావీదు రెండవ కుమారుడైన కిల్యాబు గురించి అతని జననం తర్వాత మళ్లీ ఎప్పుడూ ప్రస్తావించబడలేదు. బహుశా అతడు అబ్షాలోము తిరుగుబాటుకు కొంతకాలం ముందే మరణించి ఉంటాడు.

^ పేరా 12 బైబిలు కాలాల్లో, మరణించిన వ్యక్తికి సరైన విధంగా అంత్యక్రియలు చేయడమన్నది చెప్పుకోదగినంత ప్రాముఖ్యమైన చర్యనే. కాబట్టి, సరైన విధంగా భూస్థాపన జరుగకపోవడం విపత్కరమైనదై ఉండేది, అది దేవుని అనంగీకారానికి గుర్తుగా పరిగణించబడేది.—యిర్మీయా 25:32, 33.

^ పేరా 17 ఉదాహరణకు, వేలాదిమంది ఇశ్రాయేలీయుల ప్రాణాలను బలిగొన్న తెగులును ఆపేందుకు ఫీనెహాసు సత్వర చర్య తీసుకున్నాడు. దావీదు “దేవుని మందిరములో”ని సముఖపు రొట్టెలను తనతోపాటు తినమని ఆకలితో ఉన్న తన మనుష్యులను ప్రోత్సహించాడు. ఈ రెండు చర్యలను దేవుడు అహంకారపూరిత చర్యలుగా ఖండించలేదు.—మత్తయి 12:2-4; సంఖ్యాకాండము 25:7-9; 1 సమూయేలు 21:1-6.

మీకు జ్ఞాపకమున్నాయా?

• అహంకారమంటే ఏమిటి?

• కోరహు అహంకారంగా ప్రవర్తించటానికి అసూయ ఎలా నడిపించింది?

• అధికారదాహంగల అబ్షాలోము వృత్తాంతం నుండి మనం ఏమి నేర్చుకుంటాము?

• సౌలు ప్రదర్శించిన అసహన స్ఫూర్తిని మనమెలా నివారించవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

[అధ్యయన ప్రశ్నలు]

13. అధికారదాహంతో కూడిన దృక్పథం ఒక క్రైస్తవుడి హృదయంలో ఎలా వేళ్లూనగలదు?

[10వ పేజీలోని చిత్రం]

సౌలు అసహనంతో అహంకారంగా ప్రవర్తించాడు