మనం ఆశించే వాటి విషయమై మనమెందుకు సహేతుకంగా ఉండాలి?
మనం ఆశించే వాటి విషయమై మనమెందుకు సహేతుకంగా ఉండాలి?
ఆశలూ ఆకాంక్షలూ నెరవేరినప్పుడు మనకెంతో సంతృప్తి కల్గుతుంది. అయితే, మన కలలూ అభిలాషలూ చాలా వరకు మనం కోరుకున్నట్లుగా నిజం కావన్నది అంగీకరించవలసిందే. జీవితంలో ఎప్పుడూ నిరాశలే ఎదురైతే మనకు మనమంటేనే, చివరికి ఇతరులంటే కూడా చికాకు కల్గుతుంది. “కోరిక సఫలము కాకుండుటచేత హృదయము నొచ్చును” అని జ్ఞానవంతుడైన ఒక వ్యక్తి సరిగ్గానే పేర్కొన్నాడు.—సామెతలు 13:12.
నిరాశా భావాలు ఉత్పన్నమవ్వడానికి గల కొన్ని కారణాలేమిటి? మనం ఆశించే వాటి విషయమై మనమెలా సహేతుకంగా ఉండగలం? అలా సహేతుకంగా ఉండడం మనకెలా ప్రయోజనాన్ని చేకూర్చగలదు?
ఆశలూ నిరాశలూ
నేటి ఉరుకులు పరుగుల జీవితంతోపాటు పరుగెత్తాలని మనం ఎంత ఎక్కువగా ప్రయత్నిస్తే, అంతగా వెనుకబడిపోతున్నట్లు అనిపిస్తుంది. దాని కోసం మనం ఎంతో సమయాన్ని, శక్తిని వెచ్చించవలసి రావచ్చు, అయితే చేయాలనుకున్న దాన్ని చేయలేకపోయినప్పుడు మనల్ని మనం నిందించుకునే దృక్పథం ఏర్పడవచ్చు. మనం ఇతరుల్ని నిరాశపరుస్తున్నామన్న భావాలు కూడా కల్గవచ్చు. పిల్లల్ని పెంచడంలోగల ఒత్తిళ్ల గురించి తెలిసిన సింథియా అనే ఒక గృహిణి ఇలా చెప్తుంది: “నా పిల్లల్ని సరిదిద్దడంలో సంగతంగా ఉండలేకపోతున్నానే, నేను వాళ్లకు తగినంతగా శిక్షణనివ్వలేకపోతున్నానే అన్న భావాలు నాకెంతో నిస్పృహను కలిగిస్తాయి.” స్టెఫానీ అనే యౌవనస్థురాలు తన విద్యాభ్యాసాన్ని గురించి ఇలా చెప్తుంది: “నేను చేయాలనుకునే పనులన్నీ చేయడానికి నాకు తగినంత సమయం దొరకదు, దాంతో నాలో అసహనం పెరిగిపోతుంది.”
మనం ఆశించే వాటి విషయంలో సహేతుకంగా ఉండకపోవడం పరిపూర్ణతావాదానికి సులభంగా దారితీయగలదు, అది మనల్ని చాలా నిస్పృహకు గురిచేయగలదు. “నేను నా చర్యలను, తలంపులను లేక భావాలను పరిశీలించుకున్నప్పుడు, వాటి విషయంలో అంతకన్నా మెరుగ్గా ఎలా ఉండగలనా అని ఆలోచిస్తుంటాను. నేను ఎప్పుడూ పరిపూర్ణత కోసం చూస్తుంటాను, దానితో అసహనం, నిరాశా నిస్పృహలు తలెత్తుతాయి” అని వివాహిత యౌవనస్థుడైన బెన్ అంటున్నాడు. గేల్ అనే క్రైస్తవ గృహిణి ఇలా అంటుంది: “పరిపూర్ణతావాదుల ఆలోచనా విధానం వైఫల్యాలను అంగీకరించదు. సూపర్ అమ్మలుగా, సూపర్ భార్యలుగా ఉండాలని కోరుకుంటాము. సంతోషంగా ఉండాలంటే, చేసేవాటిలో సాఫల్యం సాధించడం అవసరం, కానీ మన ప్రయాసలు నిష్ఫలమైపోతే మనకు చికాకు కల్గుతుంది.”
అయితే క్షీణించిపోతున్న ఆరోగ్యం, వృద్ధాప్యం కూడా వ్యక్తిగత నిరాశకు దారితీయగల ఇతర కారకాలు. తగ్గిపోతున్న శక్తిసామర్థ్యాలు, ఎక్కువగా ఇటూ అటూ తిరగలేకపోవడం మనకున్న పరిమితులను మరింత పెద్దవిగా చేసిచూపి, మనలో నిరాశా భావాలు అధికమయ్యేలా చేస్తాయి. “నేను అనారోగ్యానికి గురికాకముందు నాకెంతో సుళువైనవిగా, సర్వసాధారణమైనవిగా అనిపించిన ఆ పనుల్నే ఇప్పుడు చేయలేక పోవడం నాకు అసహనాన్ని కలిగిస్తుంది” అని ఎలిజబెత్ అంగీకరిస్తుంది.
పైన పేర్కొన్న విషయం నిరాశా భావాలను రేకెత్తించగల దానికి ఒక ఉదాహరణగా ఉంది. అలాంటి భావాల్ని అధిగమించకపోతే, అవి మనం ఇతరుల మెప్పును పొందటానికి అనర్హులమని భావించేలా చేస్తాయి. కాబట్టి, నిరాశను ఎదుర్కోవడానికీ, మనం ఆశించేవాటి విషయంలో సహేతుకంగా ఉండేందుకూ ఏ అనుకూల చర్యల్ని తీసుకోవచ్చు?
మనం ఆశించేవాటి విషయంలో సహేతుకంగా ఉండేందుకు మార్గాలు
మొట్టమొదటిగా, యెహోవా సహేతుకమైనవాడనీ, మనల్ని అర్థంచేసుకుంటాడనీ జ్ఞాపకముంచుకోండి. “మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసి కొనుచున్నాడు” అని కీర్తన 103:14 మనకు జ్ఞాపకం చేస్తుంది. మన సామర్థ్యాలు, పరిమితులు యెహోవాకు తెలుసు గనుక, మనం చేయగలదాన్నే ఆయన మన నుండి కోరుతాడు. అయితే ‘తన యెదుట దీనమనస్సుకలిగి ప్రవర్తించమని’ మాత్రం ఆయన మనల్ని కోరుతున్నాడు.—మీకా 6:8.
రోమీయులు 12:12; 1 థెస్సలొనీకయులు 5:16-18) అలా ప్రార్థించడం మనకెలా సహాయం చేస్తుంది? ప్రార్థన మన ఆలోచనా విధానాన్ని సమతూకపర్చి, మనల్ని బలపరుస్తుంది. ఎడతెగక చేసే ప్రార్థన మనకు సహాయం అవసరమని మనం అంగీకరిస్తున్నట్లు చూపిస్తుంది, అది వినయానికీ, నమ్రతకూ నిదర్శనం. యెహోవా తన పరిశుద్ధాత్మను మనకివ్వడం ద్వారా మన ప్రార్థనలకు సమాధానం ఇవ్వాలన్న ఆత్రుతతో ఉన్నాడు, పరిశుద్ధాత్మ యొక్క ఫలాల్లో ప్రేమ, దయాళుత్వము, మంచితనము, ఆశానిగ్రహము ఉన్నాయి. (లూకా 11:13; గలతీయులు 5:22-24) ప్రార్థన చింతను, నిరాశను కూడా తొలగిస్తుంది. ప్రార్థన ద్వారా “మీరు మరే మూలం నుండీ పొందలేని ఓదార్పును పొందుతారు” అని ఎలిజబెత్ అంటుంది. కెవిన్ ఇలా అంగీకరిస్తున్నాడు: “నేను నా సమస్యలతో వ్యవహరించగలిగేలా ప్రశాంతమైన హృదయాన్నీ, నిర్మలమైన మనస్సునూ ఇవ్వమని ప్రార్థిస్తాను. యెహోవా నన్ను ఎన్నడూ నిరాశపర్చడు.” ప్రార్థనకున్న అమూల్యమైన విలువ గురించి అపొస్తలుడైన పౌలుకు తెలుసు. అందుకే ఆయనిలా సిఫారసు చేశాడు: “ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీహృదయములకును మీ తలంపులకును కావలియుండును.” (ఫిలిప్పీయులు 4:6, 7) అవును, మన నుండి మనం ఆశించే వాటి విషయంలోనూ, అలాగే ఇతరుల నుండి మనం ఆశించే వాటి విషయంలోనూ సహేతుకంగా ఉండటానికి, యెహోవాతో సంభాషించడం నిజంగా ఎంతో సహాయం చేస్తుంది.
తనకు ప్రార్థించమని కూడా యెహోవా మనల్ని కోరుతున్నాడు. (అయితే కొన్నిసార్లు మనం ఇతరుల నుండి వెంటనే నిశ్చయత పొందాలనుకుంటాము. సరైన సమయంలో చెప్పబడే మాట ఎంతో బాగుంటుంది. నమ్మకమైన, పరిణతి చెందిన స్నేహితునితో ఆంతరంగిక విషయాలు మాట్లాడడం, మనకు నిరాశను లేదా చింతను కల్గిస్తున్నదేమిటో విశ్లేషించుకోవడానికి సహాయం చేయగలదు. (సామెతలు 15:23; 17:17; 27:9) నిరాశా నిస్పృహలను ఎదుర్కొంటున్న యౌవనస్థులు తమ తల్లిదండ్రుల సలహాను తీసుకోవడం తాము సమతూకం కల్గివుండటానికి సహాయం చేస్తుంది. కాండీ ప్రశంసాపూర్వకంగా ఇలా అంగీకరిస్తుంది: “నా తల్లిదండ్రులిచ్చిన ప్రేమపూర్వకమైన నిర్దేశనం నేను సహేతుకమైనదానిగా, సమతూకంగలదానిగా, మంచి సహవాసిగా మారేలా చేశాయి.” అవును, సామెతలు 1:8, 9 లోని ఈ ఉపదేశం ఎంతో సమయోచితమైనది, “నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములునై యుండును.”
పరిపూర్ణతావాది ఆలోచనా విధానం వల్ల వచ్చే పర్యవసానాలు, “మన జీవితం మనం కోరుకునేవాటికి తగినట్లు మలచబడి ఉండాలని ఆశిస్తే దాని పర్యవసానం నిరాశే” అన్న లోకోక్తిలో చక్కగా వ్యక్తం చేయబడ్డాయి. ఈ నిరాశను నివారించాలంటే, మన ఆలోచనా విధానంలో మార్పు చేసుకోవలసిన అవసరం ఉంది. మనం ఆశించే వాటి విషయంలో సమతూకంగా, సహేతుకంగా ఉండేందుకు వినయమూ నమ్రతా తప్పక సహాయం చేస్తాయి, నమ్రత అంటే మనకున్న పరిమితుల గురించి వాస్తవికమైన దృక్పథం కల్గివుండడమని భావం. “తన్ను తాను ఎంచుకొనతగిన దానికంటె ఎక్కువగా ఎంచుకొన”వద్దని రోమీయులు 12:3 మనల్ని సముచితంగానే హెచ్చరిస్తుంది. అంతేగాక, దీనమనస్సు కల్గివుండమనీ, ఇతరులను మనకంటే ఉన్నతమైనవారిగా ఎంచమనీ ఫిలిప్పీయులు 2:3 మనల్ని ప్రోత్సహిస్తుంది.
మునుపు ప్రస్తావించిన ఎలిజబెత్, తన అనారోగ్యం వల్ల ఎంతో అసహనంగా ఉండేది. ఆయా విషయాలపై యెహోవా దృక్కోణం ఏమిటన్నదీ, అలాగే ఆయన మన సేవను మరచిపోడన్నదీ తెలుసుకుని ఓదార్పు పొందటానికి ఆమెకు కొంత సమయం అవసరమైంది. కాలిన్‌కు తన అనారోగ్యం మూలంగా మంచం దిగలేని పరిస్థితి ఏర్పడింది. ఆరోగ్యంగా ఉన్నప్పుడు తాను చేసినదానితో పోల్చిచూస్తే అనారోగ్యానికి గురైన మొదట్లో, తాను చేస్తున్న పరిచర్య పూర్తిగా విలువ రహితమైనదనే తలంపులు ఆయనకుండేవి. 2 కొరింథీయులు 8:12 వంటి లేఖనాల గురించి ధ్యానించడం ద్వారా ఆయన ఈ భావాలను వదిలించుకోగలిగాడు. ఆ వచనం ఇలా చెప్తుంది: “మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి యుంటే శక్తికి మించి కాదు గాని కలిమి కొలదియే [అంటే, ఉన్నంతలోనే] యిచ్చినది ప్రీతికరమవును.” కాలిన్ ఇలా అంటున్నాడు: “ఇవ్వటానికి నా దగ్గర అంతగా ఏమీ లేకపోయినా, నేను ఇప్పటికీ ఇవ్వగల్గుతున్నాను, అది యెహోవాకు అంగీకృతమైనది.” హెబ్రీయులు 6:10 నందు మనకిలా గుర్తు చేయబడుతుంది, “మీరు చేసిన కార్యమును, . . . తన నామమునుబట్టి చూపిన ప్రేమను మరచుటకు, దేవుడు అన్యాయస్థుడు కాడు.”
అయితే మనం ఆశించే వాటి విషయంలో సహేతుకంగా ఉంటున్నామో లేదో ఎలా పరిశీలించుకోవచ్చు? ‘నేను ఆశించే విషయాలు దేవుడు కోరేవాటితో పొందిక కల్గివున్నాయా?’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. “ప్రతివాడును తాను చేయుపనిని పరీక్షించి చూచుకొనవలెను; అప్పుడు ఇతరునిబట్టి కాక తననుబట్టియే అతనికి అతిశయము కలుగును” అని గలతీయులు 6:4 పేర్కొంటుంది. “నా కాడి సుళువుగాను నా భారము తేలికగాను ఉన్నవి” అని యేసు చెప్పాడని గుర్తుంచుకోండి. అవును, క్రైస్తవులముగా మనం మోయవలసిన కాడి ఒకటి ఉంది, కాని అది “సుళువుగాను,” “తేలికగాను” ఉంటుంది, అంతేగాక దాన్ని సరిగ్గా మోయడం నేర్చుకుంటే అది మనకు ఉపశమనాన్ని ఇస్తుందని యేసు వాగ్దానం చేశాడు.—మత్తయి 11:28-30.
మనం ఆశించే వాటి విషయంలో సహేతుకంగా ఉండడం ప్రతిఫలాలను తెస్తుంది
మనం ఆశించే వాటి విషయంలో సహేతుకంగా ఉండి, దేవుని వాక్యం ఇచ్చే ఉపదేశాన్ని విని దాన్ని అన్వయించుకుంటే ప్రతిఫలాలు వెంటనే లభిస్తాయి, ఆ ప్రతిఫలాలు నిరంతరం నిలిచి ఉంటాయి. అయితే ఒక విషయం ఏమిటంటే, ఇది మనపై శారీరకంగా కూడా అనుకూలమైన ప్రభావాన్ని చూపిస్తుంది. యెహోవా ఇచ్చే ఉపదేశాల నుండి ప్రయోజనం పొందిన జెన్నిఫర్ ఇలా అంగీకరిస్తోంది: “జీవితంలో నేను మరింత శక్తిని, ఉత్సాహాన్ని కల్గివుండగల్గుతున్నాను.” యెహోవా చెప్పే మాటలు, “దొరికినవారికి అవి జీవమును వారి సర్వశరీరమునకు ఆరోగ్యమును” ఇస్తాయి గనుక వాటికి అవధానం ఇవ్వమని సామెతలు 4:21, 22 సముచితంగానే మనల్ని కోరుతుంది.
మరో ప్రతిఫలం ఏమిటంటే, మానసిక భావోద్రేక ఆరోగ్యం. “నేను నా మనస్సును, హృదయాన్ని దేవుని వాక్యంతో నింపుకున్నప్పుడు, నేనెంతో సంతోషంగా ఉంటాను,” అని థెరీసా చెప్తుంది. అయితే కొన్నిసార్లు జీవితంలో మనకు నిరాశలు ఎదురుకావచ్చు. అయినప్పటికీ మనం అలాంటి నిరాశల్ని మరింత సంసిద్ధతతో ఎదుర్కోగల్గుతాము. “దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును” అని యాకోబు 4:8 చెప్తుంది. జీవిత సవాళ్ళను ఎదుర్కునేలా మనల్ని బలపరుస్తాననీ, శాంతిని అనుగ్రహిస్తాననీ కూడా యెహోవా వాగ్దానం చేస్తున్నాడు.—కీర్తన 29:11.
మనం ఆశించేవాటి విషయంలో సహేతుకంగా ఉండడం మన ఆధ్యాత్మిక స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి సహాయం చేస్తుంది. అది కూడా ఒక ఆశీర్వాదమే. అప్పుడు జీవితంలో మరింత ప్రాముఖ్యమైన విషయాలపై మనం స్పష్టంగా మనస్సును కేంద్రీకరించగల్గుతాము. (ఫిలిప్పీయులు 1:9-11) దానితో మన గమ్యాలు వాస్తవికమైనవిగా, చేరుకోదగినవిగా ఉంటాయి, అవి ఎంతో ఆనందాన్ని సంతృప్తిని తెస్తాయి. యెహోవా ఏది చేసినా చివరికి అది మన మంచికేనని తెలుసుకున్నప్పుడు, మనల్ని మనం ఆయన చేతుల్లో పెట్టుకోవడానికి మరింత సుముఖంగా ఉంటాము. “దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్ఠమైన చేతిక్రింద దీనమనస్కులై యుండుడి” అని పేతురు చెప్తున్నాడు. (1 పేతురు 5:6) యెహోవాచే హెచ్చించబడటం కంటే ప్రతిఫలదాయకమైనది ఇంకేదైనా ఉందా?
[31వ పేజీలోని చిత్రం]
మనం ఆశించే వాటి విషయంలో సహేతుకంగా ఉండడం నిరాశా నిస్పృహలను తట్టుకోవడానికి మనకు సహాయం చేస్తుంది