కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవాను ప్రేమించేవారు ఆయన దృష్టిలో ప్రశస్తమైనవారు

యెహోవాను ప్రేమించేవారు ఆయన దృష్టిలో ప్రశస్తమైనవారు

రాజ్య ప్రచారకుల నివేదిక

యెహోవాను ప్రేమించేవారు ఆయన దృష్టిలో ప్రశస్తమైనవారు

బైబిలు కాలాలనుండి లెబానోను దాని సహజవనరులకు ప్రసిద్ధిగాంచింది. (కీర్తన 72:16; యెషయా 60:13) ప్రత్యేకంగా అక్కడున్న సమోన్నతమైన దేవదారు వృక్షాలు ఎంతో విలువైనవిగా ఎంచబడేవి, ఎందుకంటే వాటికున్న అందము, సుగంధము, మన్నికను బట్టి, ప్రజలందరూ తమ భవన నిర్మాణాల్లో వాటినే ఉపయోగించాలని కోరుకునేవారు. అయితే మొదటి శతాబ్దంలో అంతకంటే ప్రశస్తమైనదొకటి లెబానోను నుండి వచ్చింది. అదేమిటంటే, ‘యేసు ఎన్ని గొప్ప కార్యములు చేస్తున్నాడో జనులు విని’ పూర్వము లెబానోనులో భాగమైవున్న తూరు సీదోనుల నుండి ‘గుంపులు గుంపులుగా ఆయన వద్దకు వచ్చారని’ మార్కు సువార్త తెలియజేస్తుంది.—మార్కు 3:8.

అలాగే నేడు కూడా లెబానోను యెహోవా దృష్టిలో ఎంతో ప్రశస్తమైన ఫలాలను ఇస్తూనేవుంది. ఈ క్రింది అనుభవాలు వాటిని ఉన్నతపరుస్తున్నాయి.

• విస్సామ్‌ అనే యౌవనసాక్షిని స్కూల్‌లోని తన క్లాసులో 30 నిమిషాల ప్రసంగం ఇమ్మని అడగడం జరిగింది. సాక్ష్యమిచ్చేందుకు ఇదే గొప్ప అవకాశమని విస్సామ్‌ నిర్ణయించుకున్నాడు. లైఫ్‌—హౌ డిడ్‌ ఇట్‌ గెట్‌ హియర్‌? బై ఎవల్యూషన్‌? ఆర్‌ బై క్రియేషన్‌? అనే పుస్తకాన్ని ఉపయోగించి, సృష్టిపై ఒక ప్రసంగాన్ని సిద్ధం చేశాడు. విస్సామ్‌ వాళ్ళ టీచరు ఆ సమాచారాన్ని చూసి అది చాలా ప్రాముఖ్యమైన సమాచారము గనుక విస్సామ్‌ 45 నిమిషాలు తీసుకోవచ్చని చెప్పారు.

విస్సామ్‌ తన ప్రసంగాన్ని ప్రారంభించినప్పుడు, టీచర్‌ అతన్ని ఆపుచేసి ప్రిన్సిపాల్‌ని పిలిపించారు. త్వరలోనే ప్రిన్సిపాల్‌ వచ్చారు, విస్సామ్‌ మళ్ళీ మొదలుపెట్టాడు. ప్రసంగ ఉపోద్ఘాతంలో విస్సామ్‌ లేవనెత్తిన ప్రశ్నలు ఆ ప్రిన్సిపాల్‌ను ఎంతో ఉత్తేజపరిచాయి. ఆ ప్రసంగం ఫోటోకాపీని ప్రతి విద్యార్థికి ఒక్కొక్కటి ఇవ్వాలని ఆమె చెప్పింది.

కాస్సేపటి తర్వాత, మరొక టీచర్‌ అటువైపుగా వెళ్తూ ఆ క్లాసులో వెల్లివిరుస్తున్న ఉత్సాహాన్ని గమనించి ఏమి జరుగుతుందని అడిగాడు. విషయం చెప్పినప్పుడు, విస్సామ్‌ సృష్టిని నిరూపించడానికి ప్రయత్నిస్తున్నాడా లేక పరిణామాన్ని నిరూపించడానికి ప్రయత్నిస్తున్నాడా అని ఆయన అడిగాడు. “సృష్టిని” అని జవాబువచ్చింది. విస్సామ్‌ యెహోవాసాక్షి అని తెలుసుకున్న ఆ టీచర్‌, “మీరు అతని ప్రసంగం ద్వారా, సైన్స్‌ సృష్టికి మద్దతునిస్తుంది గానీ పరిణామానికి కాదని తెలుసుకుంటారు” అని ఆ క్లాసులోని విద్యార్థులకు చెప్పాడు.

నిజానికి ఆ టీచర్‌ దగ్గర క్రియేషన్‌ పుస్తకప్రతి ఉంది, ఆయన దాన్ని యూనివర్శిటీలో లెక్చర్‌లు ఇవ్వడానికి ఉపయోగిస్తున్నాడు ! అక్కడ నుండి వెళ్ళేముందు, విస్సామ్‌ ప్రసంగాన్ని వినగలిగేలా రేపు తన క్లాసు పిల్లలను తీసుకురావచ్చా అని ఆయన అడిగాడు. అది యెహోవాను గూర్చి సాక్ష్యమిచ్చేందుకు మరొక గొప్ప అవకాశాన్ని ఇచ్చింది.

• ఇరవై రెండేళ్ళ నీనా సత్యజలాల కోసం దప్పికతో ఉంది. ఒకరోజు వాళ్ళత్త కొడుకు ఆమెకు ఒక బైబిలు ఇచ్చి, పెంతెకొస్తు చర్చికి రమ్మని ఆహ్వానించాడు. నీనా బైబిలు చదివి ఎంతో ఆనందించి, క్రైస్తవులు ప్రకటించాలని తెలుసుకుంది, అందుకే తనకు పరిచయమున్న వ్యక్తులతో మాట్లాడటం మొదలుపెట్టింది. తను ఎవరెవరితో మాట్లాడిందో వాళ్ళందరు “నువ్వొక యెహోవాసాక్షివా” అని అడిగేవారు. అది విని ఆమె దిగ్భ్రాంతి చెందింది.

ఆరు సంవత్సరాల తర్వాత యెహోవాసాక్షులు నీనా వాళ్ళ ఇంటికి వచ్చి ఆమెతో దేవుని రాజ్యాన్ని గురించి మాట్లాడారు. మొదట్లో ఆమె వాళ్ళ బోధల్లో తప్పుపట్టాలని ప్రయత్నించింది. అయితే వారి సమాధానాలన్నీ సహేతుకమైనవనీ బైబిలు ఆధారమైనవనీ ఆమె కనుగొన్నది.

దేవుని పేరు యెహోవా, ఆయన రాజ్యం ద్వారా వచ్చే ఆశీర్వాదాలు వంటి అనేక విషయాలను నీనా తెలుసుకుంది, తాను సత్యాన్ని కనుగొన్నానని ఆ విషయాలు ఆమెను ఒప్పించాయి. దానితో ఆమె తన జీవితాన్ని దేవునికి సమర్పించుకుని బాప్తిస్మం తీసుకుంది. గత ఏడు సంవత్సరాలు నీనా పూర్తికాల పరిచారకురాలిగా సేవ చేసింది. తనను నిజంగా ప్రేమించే వాళ్ళను యెహోవా తప్పక ఆశీర్వదిస్తాడు.—1 కొరింథీయులు 2:9.