కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వాళ్ళకు పిల్లలెందుకు లేరు?

వాళ్ళకు పిల్లలెందుకు లేరు?

వాళ్ళకు పిల్లలెందుకు లేరు?

డేలె, ఫోలా అనే వివాహిత జంట నైజీరియాలోని వాచ్‌ టవర్‌ సొసైటీ బ్రాంచి కార్యాలయంలో పని చేస్తూ అక్కడే నివసిస్తున్నారు. * వాళ్లక్కడ సేవ చేయడం ప్రారంభించిన కొంతకాలానికి ఫోలా వాళ్ల అమ్మ వాళ్లను చూడటానికి వచ్చింది. ఆమె చాలా ప్రాముఖ్యమైన ఒక విషయం గురించి వాళ్లతో మాట్లాడాలని ఎంతో దూరం నుండి వచ్చింది. ఆమె మాట్లాడాలనుకున్న విషయం ఆమెకెంత ప్రాముఖ్యమైనదంటే, ఆ విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఆమె ఎన్నో రాత్రులు నిద్రపోలేకపోయింది.

ఆమె వాళ్లతో ఇలా అంది: “మీరు నాకోసం ఎన్నో మంచి పనులు చేస్తారు. మీరు నాకు బహుమానాలు పంపిస్తారు, నా దగ్గరికి వచ్చి నన్ను చూసి వెళ్తుంటారు. అలా మీ ప్రేమను పొందడం నాకెంతో ఇష్టం. కానీ అవే విషయాలు నాకు బాధ కూడా కలిగిస్తాయి, ఎందుకంటే మీరలా ప్రేమ చూపించినప్పుడల్లా, మీరు పెద్ద వయస్సుకు చేరుకునే సరికి మీ మీద ఎవరు ఇలా ప్రేమ చూపిస్తారా అని నేను ఆలోచిస్తుంటాను. మీకు పెళ్ళై ఇప్పటికి రెండేళ్లవుతుంది, మీకింకా పిల్లలు కలుగలేదు. ఇప్పుడిక బేతేలు నుండి వచ్చేసి పిల్లల్ని కని వాళ్ల ఆలనా పాలనా చూడవలసిన సమయం వచ్చిందని మీకనిపించడం లేదా?”

అమ్మ వాదన ఏమిటంటే: డేలె, ఫోలా బేతేలులో ఇంత వరకూ గడిపిన సమయం చాలు. ఇప్పుడిక వాళ్లు తమ భవిష్యత్తు గురించి ఆలోచించవలసిన సమయం వచ్చింది. వాళ్లు ఇంతవరకూ చేసిన పనిని ఇకమీదట వేరే వాళ్లు చేయవచ్చు. డేలె, ఫోలా పూర్తికాల పరిచర్యను మానుకోవలసిన పనేమీ లేదు, పిల్లల్ని కని, అమ్మా నాన్నలవ్వాలన్న ముచ్చట తీర్చుకునే అవకాశాన్నిచ్చే విధమైన పూర్తికాల సేవలో కొనసాగవచ్చు కదా.

అమ్మ బాధ

అమ్మ పడుతున్న బాధ అర్థం చేసుకోదగినదే. పిల్లల్ని కనాలన్న కోరిక అన్ని సంస్కృతుల వారికీ, అన్ని కాలాల్లోనూ ప్రాథమికమైనదే, అది ఎంతో సర్వసాధారణమైన విషయం కూడా. పిల్లల్ని కనడం ఎంతో ఆనందాన్ని తెస్తుంది, అలాగే అది మరెన్నో అశల్ని కల్పిస్తుంది. “గర్భఫలము ఆయన యిచ్చు బహుమానమే” అని చెప్తుంది బైబిలు. అవును, పిల్లల్ని కనే సామర్థ్యం మన ప్రేమగల సృష్టికర్త మనకిచ్చిన అమూల్యమైన వరం.—కీర్తన 127:3.

పిల్లల్ని కనే విషయానికి వచ్చేసరికి, చాలా సమాజాల్లో వివాహిత దంపతులు సామాజికపరంగా ఎంతో ఒత్తిడిని ఎదుర్కోవలసి వస్తుంది. ఉదాహరణకు, నైజీరియాలో, ఒక సగటు స్త్రీ ఆరుగురు పిల్లల్ని కంటుంది, పెళ్లిళ్ల సమయాల్లో శ్రేయోభిలాషులు నూతన వధూవరులను సాధారణంగా ఇలా అభినందిస్తుంటారు: “ఇక తొమ్మిది మాసాల్లో మీ ఇల్లు పసిపాప కేరింతలతో నిండిపోవాలి.” కొంతమంది వధూవరులకు ఉయ్యాలతొట్లు కానుకగా అందుతాయి. అత్తగార్లు కాలెండర్‌ను శ్రద్ధగా గమనిస్తుంటారు. సంవత్సరం తిరిగే సరికల్లా పెళ్లి కూతురు గనుక తల్లికాకపోయిందా, తాము పరిష్కరించగల సమస్యేమైనా ఉందా అని వాళ్లు పరిశోధన మొదలుపెట్టేస్తారు.

తమ పిల్లలు వివాహం చేసుకునేది, పిల్లల్ని కని తమ వంశవృక్షాన్ని నిలబెట్టడానికేనన్నది చాలామంది తల్లుల అభిప్రాయం. ఫోలావాళ్ల అమ్మ ఆమెతో ఇలా అంది: “పిల్లల్ని కనే ఉద్దేశం లేకపోతే ఇంకెందుకు పెళ్లి చేసుకున్నట్లు? ఎవరో నిన్ను కన్నారు గనుకే నువ్వు ఈ రోజున ఉన్నావు; అలాగే నువ్వూ పిల్లల్ని కనాలి.”

ఇవే కాక, పరిశీలించవలసిన ఆచరణాత్మకమైన విషయాలు కూడా ఉన్నాయి. ఆఫ్రికాలోని అనేక దేశాల్లో, పెద్దవారి గురించి శ్రద్ధ తీసుకునేందుకు ప్రభుత్వం చేసే ఏర్పాట్లు అంతగా లేవు. పిల్లలు తమ తల్లిదండ్రులు తమని చిన్నవయస్సులో చూసుకున్నట్లుగానే వాళ్లు వృద్ధులైన తమ తల్లిదండ్రుల గురించి శ్రద్ధ తీసుకోవడం సాంప్రదాయం. కాబట్టి తన పిల్లలకు వారి స్వంత పిల్లలు లేకపోతే వాళ్లు తమ వార్ధక్య దశలో ఒంటరిగా, ఏ తోడూ లేకుండా, బీదవారిగా మిగిలిపోతారనీ, వాళ్లు చనిపోతే అంత్యక్రియలు చేసేవారెవరూ ఉండరనీ ఫోలావాళ్ల అమ్మ తర్కం.

ఆఫ్రికా అంతటిలోనూ, పిల్లలు లేకపోవడాన్ని ఒక శాపంగా పరిగణిస్తారు. కొన్ని ప్రాంతాల్లోనైతే, పిల్లల్ని కనే సామర్థ్యం తమకుందని స్త్రీలు పెళ్లికాక ముందే నిరూపించుకోవలసి ఉంటుంది. గర్భం దాల్చలేని చాలామంది స్త్రీలు తమ కడుపు పండాలని వెర్రిగా ఏవేవో మందులు మ్రింగుతూ ఉంటారు.

ఈ దృక్పథాల దృష్ట్యా, ఉద్దేశపూర్వకంగానే పిల్లలు కనకుండా ఉండే దంపతులు ఏదో అమూల్యమైనదాన్ని కోల్పోతున్నారని ఇతరులు అనుకుంటారు. తరచూ వాళ్లు వింతమనుష్యులన్నట్లు, ముందుచూపు లేనివారన్నట్లు, దయనీయమైన స్థితిలో ఉన్నవారన్నట్లు దృష్టించబడుతుంటారు.

ఆనందం-బాధ్యత

పిల్లల్ని పెంచడంలో ఆనందం ఉన్నప్పటికీ, అది ఒక బాధ్యతని కూడా యెహోవా ప్రజలు గుర్తిస్తారు. 1 తిమోతి 5:8 లో బైబిలు ఇలా చెప్తుంది, “ఎవడైనను స్వకీయులను, విశేషముగా తన యింటివారిని, సంరక్షింపక పోయనయెడల వాడు విశ్వాసత్యాగము చేసినవాడై అవిశ్వాసికన్న చెడ్డవాడై యుండును.”

తల్లిదండ్రులు తమ కుటుంబాల వస్తుపరమైన, ఆధ్యాత్మికమైన అవసరాల గురించి శ్రద్ధ తీసుకోవాలి, దానికి ఎంతో సమయమూ, కృషీ అవసరం. పిల్లల్ని ఇచ్చింది దేవుడే గనుక వాళ్ల గురించి ఆయనే శ్రద్ధ తీసుకుంటాడులే అనే దృక్పథాన్ని వాళ్లు అలవర్చుకోరు. బైబిలు సూత్రాల ప్రకారం పిల్లల్ని పెంచడం దేవుడు తల్లిదండ్రులకిచ్చిన పూర్తికాల బాధ్యతని వాళ్లు గుర్తిస్తారు; అది ఇతరులకు అప్పగించే బాధ్యత కాదు.—ద్వితీయోపదేశకాండము 6:6, 7.

“అపాయకరమైన కాలము”లైన ఈ “అంత్యదినములలో” పిల్లల్ని పెంచే పని ప్రాముఖ్యంగా ఎంతో కష్టతరమైనది. (2 తిమోతి 3:1-5) దిగజారిపోతున్న ఆర్థిక పరిస్థితులతోపాటు సమాజంలో ఉన్న దైవభక్తిలేనితనం పిల్లల్ని పెంచే విషయంలో ఉన్న సవాళ్లను నేడు ఇంకా అధికం చేస్తున్నాయి. అంతేగాక, ప్రపంచవ్యాప్తంగా, లెక్కలేనంతమంది క్రైస్తవ దంపతులు ఈ సవాలును చేపట్టి, తమ పిల్లల్ని యెహోవా “శిక్షలోను బోధలోను” దైవభయంగల పిల్లలుగా పెంచే విషయంలో విజయం సాధిస్తున్నారు. (ఎఫెసీయులు 6:4) ఈ తల్లిదండ్రులు చేస్తున్న కృషిని యెహోవా ఎంతో ఇష్టపడతాడు, వారిని తప్పక దీవిస్తాడు.

కొంతమంది ఎందుకు పిల్లల్ని కనరంటే . . .

అయితే మరో వైపున చాలామంది క్రైస్తవ దంపతులు పిల్లల్ని కనరు. కొంతమంది నిస్సంతులైనా, వేరే వాళ్ల పిల్లల్ని దత్తత తీసుకోరు. పిల్లల్ని కనే సామర్థ్యమున్న ఇతర దంపతులు పిల్లల్ని కనకూడదని నిర్ణయించుకుంటారు. వాళ్లు అలా పిల్లల్ని కనకుండా ఉండేది, ఆ బాధ్యత నుండి తప్పించుకోవాలని కాదు లేదా తల్లిదండ్రులవ్వడంలో ఉన్న సవాళ్లకు భయపడీ కాదు. అసలు కారణం ఏమిటంటే, పిల్లల్ని కంటే సాధ్యం కాని, పూర్తికాల పరిచర్యలోని వివిధ అంశాలకు పూర్తి అవధానాన్ని ఇవ్వాలని వాళ్లు నిశ్చయించుకోవడమే. కొంతమంది మిషనరీలుగా సేవచేస్తారు. ఇంకా ఇతరులు ప్రయాణపనిలో లేదా బేతేలులో యెహోవా సేవ చేస్తారు.

అత్యవసరంగా చేయవలసిన పని ఒకటుందని క్రైస్తవులందరిలాగే వాళ్లూ గుర్తిస్తారు. యేసు ఇలా అన్నాడు: “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును.” ఎంతో ప్రాముఖ్యమైన ఈ పని నేడు జరుగుతోంది. అటు తర్వాత వచ్చే, “అంతము” అంటే సువార్త వినని వారికి నాశనమన్నట్లే.—మత్తయి 24:14; 2 థెస్సలొనీకయులు 1:6-8.

మనం జీవిస్తున్న ఈ కాలం, గొప్ప జలప్రళయం నుండి తమను కాపాడిన పెద్ద ఓడను నిర్మించిన నోవహు ఆయన కుటుంబం జీవించిన కాలానికి సమాంతరంగా ఉంది. (ఆదికాండము 6:13-16; మత్తయి 24:37) నోవహు ముగ్గురు కుమారులు వివాహితులే అయినప్పటికీ, జలప్రళయం ముగిసే వరకూ ఎవ్వరూ పిల్లల్ని కనలేదు. దానికి ఒక కారణం ఏమై ఉండవచ్చునంటే, ఈ దంపతులు తమ పూర్తి అవధానాన్నీ, శక్తినీ అప్పుడు చేయవలసిన పనికే అంకితం చేయాలని కోరుకోవడమే కావచ్చు. మరో కారణం, ‘నరుల చెడుతనము గొప్పదిగాను, వారి హృదయ తలంపులలోని ఊహ అంతా ఎల్లప్పుడు కేవలము చెడ్డదిగాను’ ఉన్న ఈ భ్రష్ట దౌర్జన్యపూరిత లోకంలోకి పిల్లల్ని తీసుకురావడం ఇష్టంలేకపోవడం కావచ్చు.—ఆదికాండము 6:5.

అయితే ఈనాడు పిల్లల్ని కనడం తప్పని ఇది సూచించకపోయినప్పటికీ, చేయమని యెహోవా దేవుడు తన ప్రజలకిచ్చిన అత్యవసర పనిలో పూర్తిగా నిమగ్నమవ్వాలనే ఉద్దేశంతో చాలామంది క్రైస్తవ దంపతులు పిలల్ని కనరు. కొంతమంది దంపతులు కొంతకాలం వేచివుండి ఆ తర్వాత పిల్లల్ని కన్నారు; ఇంకా ఇతరులు పిల్లల్ని కనడం గురించి యెహోవా నీతియుక్తమైన నూతన లోకంలో ఆలోచించవచ్చునని ప్రస్తుతం పిల్లలు లేకుండానే ఉండటానికి నిర్ణయించుకున్నారు. ఇది ముందు చూపులేకపోవడమా? వాళ్లు జీవితంలో ఏదో కోల్పోతున్నారా? వాళ్లను చూసి జాలిపడాలా?

సురక్షితమైన, ఆనందభరితమైన జీవితాలు

మునుపు పేర్కొన్న డేలె, ఫోలా దంపతులకు పదేళ్ల క్రితమే వివాహమైంది, వాళ్లు పిల్లలు లేకుండా ఉండిపోవాలనే నిశ్చయించుకున్నారు. డేలె ఇలా చెప్తున్నాడు: “పిల్లల్ని కనమని మా బంధువులు ఇప్పటికీ మమ్మల్ని ఒత్తిడి చేస్తూనే ఉంటారు. వాళ్లు బాధపడేదల్లా మా భవిష్యద్‌ క్షేమాన్ని గురించే. వాళ్లకున్న శ్రద్ధను మేమెప్పుడూ మెచ్చుకుంటూ ఉంటాము, అదే సమయంలో మేము చేస్తున్న పనిలో మేమెంతో ఆనందంగా ఉన్నామని వాళ్లకు యుక్తిగా వివరిస్తాము. ఇక మా క్షేమం విషయానికి వస్తే, మేము యెహోవా మీద మా నమ్మకం ఉంచామనీ, తనపట్ల నమ్మకంగా యథార్థంగా ఉండే వారి క్షేమాన్ని గురించి ఆయన శ్రద్ధ తీసుకుంటాడనీ మేము తెలియజేస్తాము. పిల్లలున్నంత మాత్రాన వాళ్లు వృద్ధాప్యంలో తమ తల్లిదండ్రుల గురించి శ్రద్ధ తీసుకుంటారన్న హామీ ఏమీ లేదని కూడా మేము వివరిస్తాము. కొంతమంది తమ తల్లిదండ్రుల గురించి అంతగా పట్టించుకోరు, ఇంకా ఇతరులు సహాయం చేయలేకపోతున్నారు, మరితరులు తమ తల్లిదండ్రులకంటే ముందే చనిపోతున్నారు. మరో వైపున, యెహోవా పక్షాన ఉంటే మన భవిష్యత్తు నిశ్చింతగా ఉంటుంది.”

“నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను” అని యెహోవా తన నమ్మకమైన సేవకులకు చేసిన వాగ్దానాన్ని డేలె, ఇంకా ఆయనలాంటి ఇతరులు దృఢంగా విశ్వసిస్తారు. (హెబ్రీయులు 13:5) “రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురుచకాలేదు, విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు” అని కూడా వాళ్లు నమ్ముతారు.—యెషయా 59:1.

నమ్మకముంచటానికి మరో కారణం, యెహోవా తన నమ్మకమైన సేవకులను ఎలా బలపరుస్తాడనేది గమనించడమే. రాజైన దావీదు ఇలా వ్రాశాడు: “నేను చిన్నవాడనై యుంటిని ఇప్పుడు ముసలివాడనై యున్నాను అయినను నీతిమంతులు విడువబడుట . . . నేను చూచి యుండలేదు.” ఒక్కసారి దీని గురించి ఆలోచించండి. ‘పూర్తిగా విడువబడిన’ యెహోవా నమ్మకమైన సేవకులనెవరినైనా మీరు చూశారా?—కీర్తన 37:25.

యెహోవాకు, తమ తోటి క్రైస్తవులకు సేవ చేయడంలో తమ జీవితాన్ని గడిపిన వాళ్లు తమ గతాన్ని సింహావలోకనం చేసుకున్నప్పుడు, విచారించే బదులు ఎంతో సంతృప్తిని పొందుతారు. ఈరో ఊమా అనే సహోదరుడు 45 సంవత్సరాలుగా పూర్తికాల సేవలో ఉండి, ఇప్పుడు నైజీరియాలో ప్రయాణ పైవిచారణకర్తగా సేవచేస్తున్నాడు. ఆయనిలా చెప్తున్నాడు: “మాకు పిల్లలు లేకపోయినప్పటికీ, యెహోవా మా ఆధ్యాత్మిక విషయాల్లోనూ, వస్తుపరమైన విషయాల్లోనూ ఎల్లప్పుడూ శ్రద్ధ తీసుకుంటున్నాడని మాకిద్దరికీ తెలుసు. మాకేదీ కొదువ కాలేదు. మేము మరింత వృద్ధులమౌతుండగా కూడా ఆయన మమ్మల్ని విడిచిపెట్టడు. పూర్తికాల సేవలో గడిపిన ఈ సంవత్సరాలు మా జీవితంలోకెల్లా ఆనందభరితమైన సంవత్సరాలుగా నిరూపించబడ్డాయి. మన సహోదరులకు సేవ చేయగల్గుతున్నందుకు మేమెంతో కృతజ్ఞులం, మన సహోదరులు మేము చేస్తున్న సేవను మెచ్చుకుంటారు, వాళ్లు మాకు సహాయం చేస్తారు.

చాలామంది దంపతులు భౌతికంగా పిల్లల్ని కనలేకపోయినప్పటికీ, వాళ్లు మరో విధమైన పిల్లలకు, అంటే యెహోవాను ఆరాధించే క్రైస్తవ శిష్యులకు జన్మనిచ్చారు. “నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుటకంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు” అని వ్రాసే నాటికి అపొస్తలుడైన యోహానుకు దాదాపు 100 సంవత్సరాలు. (3 యోహాను 4) యోహాను ఎవరికైతే “సత్యమును” పరిచయం చేశాడో ఆ “పిల్లలు” చూపించిన విశ్వాస్యత ఆయనకు గొప్ప ఆనందాన్ని తెచ్చింది.

నేడు కూడా అలాంటి ఆనందం వెల్లివిరుస్తోంది. నైజీరియాకు చెందిన బెర్నీస్‌ అనే స్త్రీ పిల్లల్ని కనకుండా ఉండాలని నిర్ణయించుకుంది. ఆమె వివాహమై ఇప్పటికి 19 సంవత్సరాలు గడిచాయి. ఆమె తాను తీసుకున్న నిర్ణయాన్ని ఆచరణలో పెట్టింది. గత 14 సంవత్సరాలు ఆమె పయినీరుగా సేవ చేసింది. ఇప్పుడు పిల్లల్ని కనే వయస్సు దాటిపోయిన ఈ సమయంలో, తన జీవితాన్ని శిష్యుల్ని చేసే పనికి అంకితం చేసినందుకు ఆమె ఏమాత్రం విచారించడం లేదు. ఆమె ఇలా అంటోంది: “నా ఆధ్యాత్మిక పిల్లలు ఎదగడం చూసి నేనెంతో ఆనందిస్తుంటాను. నాకు ఒకవేళ నా స్వంత పిల్లలుండినా, నేనెవరికైతే సత్యం నేర్చుకోవడానికి సహాయం చేశానో వాళ్లకంటే నా స్వంత పిల్లలు నాకు దగ్గరై ఉండేవారని నేననుకోవడం లేదు. నేను వాళ్ల స్వంత తల్లినైనట్లు వాళ్లు నన్ను చూసుకుంటారు, వాళ్లు తమ ఆనందాల్ని నాతో పంచుకుంటారు, తమ సమస్యల్ని నాతో చర్చించి నా సలహా అడుగుతారు. వాళ్లు ఉత్తరాలు వ్రాస్తారు, మేము ఒకరి దగ్గరికి ఒకరం వెళ్తూ ఉంటాము.

“తమ స్వంత పిల్లలు లేకపోవడమన్నది ఒక శాపమని కొందరు భావిస్తారు. వృద్ధాప్యంలో బాధపడవలసి వస్తుందని వాళ్లంటారు. కానీ అలాగని నేను అనుకోవడం లేదు. నేను పూర్ణాత్మతో యెహోవా సేవ చేసినంత వరకూ ఆయన నాకు ప్రతిఫలమిస్తాడనీ, నా గురించి శ్రద్ధ తీసుకుంటాడనీ నాకు తెలుసు. నేను వృద్ధురాలినయ్యాక ఆయన నన్ను త్రోసివేయడు.”

దేవుని ప్రేమను పొందినవారు, ఆయన దృష్టిలో విలువైనవారు

పిల్లల్ని కని, వారు ‘సత్యమును అనుసరించి నడుచుకొనేలా’ వారిని పెంచి పెద్దచేసినవారు కృతజ్ఞత కల్గివుండడానికి ఎన్నో కారణాలున్నాయి. “నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును, జ్ఞానముగలవానిని కనినవాడు వానివలన ఆనందము నొందును. నీ తలిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను” అని బైబిలు చెప్పడంలో ఆశ్చర్యమేముంది!—సామెతలు 23:24, 25.

పిల్లల్ని కనే ఆనందాన్ని పొందలేకపోయిన క్రైస్తవులు వేరే విధాలుగా ఆశీర్వదించబడ్డారు. రాజ్యాసక్తులను అత్యధికంగా విస్తృతపర్చడంలో ఈ దంపతుల్లో చాలామంది ప్రముఖ పాత్ర వహించారు. సంవత్సరాలు గడుస్తుండగా వారు, రాజ్య పనికి తమ విలువైన మద్దతును అందించేందుకు తమకు సహాయపడే అనుభవాన్ని, జ్ఞానాన్ని, నైపుణ్యాలను సంపాదించుకున్నారు. చాలామంది ఈ పనిలో ముందుండి చురుగ్గా పాల్గొంటున్నారు.

రాజ్యాసక్తుల కోసం వాళ్లు పిల్లలు లేకుండా ఉండిపోయినప్పటికీ, వారు చేసిన త్యాగాలను ఎంతగానో మెచ్చుకునే ప్రేమపూర్వకమైన ఆధ్యాత్మిక కుటుంబాన్ని వారికివ్వడం ద్వారా యెహోవా వారిని ఆశీర్వదించాడు. అది, యేసు చెప్పినట్లుగా ఇలా ఉంది: “నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను ఆక్కచెల్లెండ్రనైనను తలిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతోపాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్కచెల్లెండ్రను తల్లులను పిల్లలను భూములను, రాబోవు లోకమందు నిత్యజీవమును పొందు[ను].”—మార్కు 10:29, 30.

యెహోవాయందు నమ్మకంగా ఉండేవారంతా ఆయనకు ఎంత అమూల్యమైనవారో కదా! అలాంటి నమ్మకమైన వారందరికీ, అంటే పిల్లలున్న వారికీ, పిల్లలులేని వారికీ అపొస్తలుడైన పౌలు ఇలా హామీ ఇస్తున్నాడు: “మీరు చేసిన కార్యమును, మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి యింకను ఉపచారము చేయుచుండుటచేత తన నామమునుబట్టి చూపిన ప్రేమను మరచుటకు, దేవుడు అన్యాయస్థుడు కాడు.”—హెబ్రీయులు 6:10.

[అధస్సూచి]

^ పేరా 1 పేర్లు మార్చబడ్డాయి.

[23వ పేజీలోని చిత్రం]

పిల్లలు లేని దంపతులు ప్రేమగల ఆధ్యాత్మిక కుటుంబంతో ఆశీర్వదించబడ్డారు