కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“వినయముగలవారియొద్ద జ్ఞానమున్నది”

“వినయముగలవారియొద్ద జ్ఞానమున్నది”

“వినయముగలవారియొద్ద జ్ఞానమున్నది”

“దీనమనస్సుకలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుట. . . ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు.”మీకా 6:8.

1, 2. వినయమంటే ఏమిటి, దానికీ అహంకారానికీ ఉన్న తేడా ఏమిటి?

ఒక ప్రముఖ అపొస్తలుడు ఇతరుల అవధానాన్ని తనవైపుకు ఆకర్షించుకునేందుకు నిరాకరించాడు. ధైర్యవంతుడైన ఇశ్రాయేలు న్యాయాధిపతి తాను తన తండ్రి కుటుంబంలో అల్పుడనని చెప్పుకున్నాడు. జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి తనకు సంపూర్ణాధికారం లేదని అంగీకరించాడు. ఈ ముగ్గురిలో ఒక లక్షణం మనకు కనబడుతుంది: అదే వినయం.

2 వినయం అహంకారానికి పూర్తిగా విరుద్ధమైనది. వినయంగల వ్యక్తి తనకున్న సామర్థ్యాల గురించి తనకున్న విలువ గురించి మరీ అధికంగా భావించుకోకుండా, స్వాతిశయం లేకుండా ఉంటాడు. గర్విష్టిగా, ప్రగల్భాలు పలికేవాడిగా లేక అధికారదాహం గలవాడిగా ఉండే బదులు, వినయం గల వ్యక్తి తన పరిమితులను ఎరిగివుంటాడు. కాబట్టి, ఆయన ఇతరుల భావాలను, దృక్పథాలను గౌరవిస్తూ వాటికి తగినంత అవధానాన్నిస్తాడు.

3. “వినయముగలవారి యొద్ద జ్ఞానము” ఏవిధంగా ఉంటుంది?

3 “వినయముగలవారియొద్ద జ్ఞానమున్నది” అని బైబిలు మంచి కారణంతోనే పేర్కొంటోంది. (సామెతలు 11:2) వినయంగల వ్యక్తి జ్ఞానవంతుడై ఉంటాడు ఎందుకంటే ఆయన దేవుడు అంగీకరించే విధానాన్ని అనుసరిస్తాడు, అవమానానికి దారితీసే అహంకారపూరిత స్ఫూర్తికి దూరంగా ఉంటాడు. (సామెతలు 8:13; 1 పేతురు 5:5) వినయంగా నడుచుకోవడం ఎంతో జ్ఞానయుక్తమైనదన్న విషయం అనేకమంది దేవుని సేవకుల జీవన విధానం ద్వారా దృఢపడింది. మొదటి పేరాలో పేర్కొనబడిన మూడు ఉదాహరణలను మనం పరిశీలిద్దాము.

పౌలు— ఒక ‘సేవకుడు’ మరియు ‘గృహనిర్వాహకుడు’

4. పౌలు ఏ విశేషమైన ఆధిక్యతలను అనుభవించాడు?

4 తొలి శతాబ్దపు క్రైస్తవులలో పౌలు ప్రముఖ వ్యక్తి, అందులో ఆశ్చర్యపోవల్సిందేమీ లేదు. ఆయన తన పరిచర్య కాలంలో సముద్రమార్గంలోనూ భూమార్గంలోనూ వేలాది మైళ్లు ప్రయాణించి, అనేక సంఘాలను స్థాపించాడు. యెహోవా పౌలుకు దర్శనాలను, అన్య భాషల్లో మాట్లాడే వరాన్ని ఇచ్చి ఆశీర్వదించాడు. (1 కొరింథీయులు 14:18; 2 కొరింథీయులు 12:1-5) ఇప్పుడు క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో భాగమైయున్న 14 లేఖలను వ్రాయడానికి కూడా ఆయన పౌలును ప్రేరేపించాడు. స్పష్టంగా, పౌలు పడిన ప్రయాసలు ఇతర అపొస్తలులందరూ పడిన ప్రయాసలకన్నా ఎక్కువని చెప్పవచ్చు.—1 కొరింథీయులు 15:10.

5. తనను గురించి తనకు వినయంతోకూడిన దృక్కోణం ఉందని పౌలు ఎలా చూపించాడు?

5 పౌలు క్రైస్తవ కార్యకలాపాల్లో ముందున్నాడు గనుక, అతడు తనకు లభిస్తున్న పేరుప్రఖ్యాతలను ఆనందిస్తూ, చివరికి అధికార దర్పాన్ని కూడా ప్రదర్శిస్తుండవచ్చని కొందరు అనుకుని ఉండవచ్చు. అయితే, పౌలు అలా చేయలేదు ఎందుకంటే ఆయన వినయంగల వాడు. “నేను అపొస్తలులందరిలో తక్కువవాడను” అన్నాడాయన. “దేవుని సంఘమును హింసించినందున అపొస్తలుడనబడుటకు యోగ్యుడనుకాను” అని కూడా అన్నాడు. (1 కొరింథీయులు 15:9) తాను దేవుని సేవలో ప్రత్యేక ఆధిక్యతల్ని అనుభవించే విషయం ప్రక్కన పెడితే, తానొకప్పుడు క్రైస్తవులను హింసించాడు గనుక, అసలు దేవునితో సంబంధాన్ని ఏర్పర్చుకోగల్గడమే, దేవుని కృపాబాహుళ్యం మూలంగా సాధ్యమైందన్న విషయాన్ని ఆయన ఎన్నడూ మర్చిపోలేదు. (యోహాను 6:44; ఎఫెసీయులు 2:8) కాబట్టి, పౌలు తాను పరిచర్యలో సాధించిన విశేషమైన సాఫల్యాలను బట్టి తాను ఇతరులకన్నా ఉన్నతుడనని ఎన్నడూ భావించలేదు.—1 కొరింథీయులు 9:16.

6. కొరింథీయులతో వ్యవహరించేటప్పుడు పౌలు వినయాన్ని ఎలా చూపించాడు?

6 పౌలు కొరింథీయులతో వ్యవహరించిన విధానంలో ప్రాముఖ్యంగా వినయం కనిపిస్తుంది. అపొల్లో, కేఫా, పౌలులతో సహా ఇంకా ఎవరిని గురించి ప్రముఖ పైవిచారణకర్తలని తాము భావించారో వారిపట్ల కొంతమంది కొరింథీయులు అతిగా ఆకర్షితులయ్యారని స్పష్టమౌతుంది. (1 కొరింథీయులు 1:11-15) అయితే పౌలు కొరింథీయుల పొగడ్తలను పొందాలని గానీ లేదా వారికున్న అభిమానాన్ని తన స్వలాభానికి ఉపయోగించుకోవాలని గానీ ఎన్నడూ కోరుకోలేదు. వారిని దర్శించేటప్పుడు ఆయన ‘వాక్చాతుర్యాన్నిగాని జ్ఞానాతిశయాన్నిగాని’ ప్రదర్శించలేదు. బదులుగా, పౌలు తన గురించీ తన సహవాసుల గురించీ ఇలా అన్నాడు: “క్రీస్తు సేవకులమనియు, దేవుని మర్మముల విషయములో గృహనిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మును భావింపవలెను.” *1 కొరింథీయులు 2:1-5; 4:1.

7. ఉపదేశం ఇచ్చేటప్పుడు కూడా పౌలు వినయాన్ని ఎలా చూపించాడు?

7 పౌలు మందలింపుతో కూడిన గట్టి ఉపదేశాన్నీ నిర్దేశాన్నీ ఇవ్వవలసిన సమయాల్లో కూడా వినయాన్ని ప్రదర్శించాడు. అపొస్తలునిగా తనకున్న అధికారంతో కాక “దేవుని వాత్సల్యమునుబట్టి” మరియు “ప్రేమనుబట్టి” ఆయన తన తోటి క్రైస్తవులను వేడుకున్నాడు. (రోమీయులు 12:1, 2; ఫిలేమోను 8-10) పౌలు ఎందుకిలా వేడుకున్నాడు? ఎందుకంటే ఆయన తనను తాను తన సహోదరుల ‘సహకారిగా’ దృష్టించుకున్నాడే గానీ ‘వారి విశ్వాసము మీద ప్రభువుగా’ తనను దృష్టించుకోలేదు. (2 కొరింథీయులు 1:24) పౌలును మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘాలకు ఎంతో ప్రియమైనవానిగా చేసిన వాటిలో ఒకటి ఆయనకున్న వినయం అన్నదానిలో సందేహం లేదు.—అపొస్తలుల కార్యములు 20:36-38.

మన ఆధిక్యతల విషయంలో వినయసహిత దృక్పథం

8, 9. (ఎ) మన గురించి మనం ఎందుకు వినయంతో కూడిన దృక్పథం కల్గివుండాలి? (బి) అధికారం ఉన్నవాళ్లు వినయాన్ని ఎలా చూపించవచ్చు?

8 పౌలు నేటి క్రైస్తవులకు చక్కని మాదిరినుంచాడు. మనకు ఏ బాధ్యతలు అప్పగించబడినప్పటికీ, మనం ఇతరులకన్నా గొప్ప వారమని మనలో ఎవ్వరమూ అనుకోకూడదు. “ఎవడైనను వట్టివాడైయుండి తాను ఎన్నికైన వాడనని యెంచుకొనినయెడల తన్ను తానే మోసపరచుకొనును.” (గలతీయులు 6:3) ఎందుకు? ఎందుకంటే, “అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.” (ఇటాలిక్కులు మావి.) (రోమీయులు 3:23; 5:12) అవును, మనందరికీ ఆదాము నుండి పాపమరణాలు వారసత్వంగా వచ్చాయని ఎన్నడూ మరిచిపోకూడదు. మనకున్న ప్రత్యేక ఆధిక్యతలు మనల్ని మన పాపభరిత స్థితి నుండి పైకి లేవనెత్తలేవు. (ప్రసంగి 9:2) పౌలు విషయంలోలానే, దేవుని సేవలో ప్రత్యేక ఆధిక్యతల్ని అనుభవించే విషయం ప్రక్కన పెడితే, అసలు దేవునితో సంబంధాన్ని ఏర్పర్చుకోగల్గడమే, దేవుని కృపాబాహుళ్యం మూలంగా సాధ్యమౌతుంది.—రోమీయులు 3:12, 24.

9 దీన్ని గుర్తించి, వినయంగల వ్యక్తి తన ఆధిక్యతల మూలంగా అతిశయించడు లేక తాను సాధించినవాటి గురించి గొప్పలు చెప్పుకోడు. (1 కొరింథీయులు 4:7) ఉపదేశం గానీ నిర్దేశంగానీ ఇచ్చేటప్పుడు ఆయన ఒక యజమానిలా కాక తోటిపనివాడిలా ఇస్తాడు. ఏవైనా కొన్ని పనుల్లో నిపుణులైన వాళ్లు ఆయా నైపుణ్యాలను బట్టి తోటి విశ్వాసుల నుండి పొగడ్తలను రాబట్టుకోవాలనుకోవడంగానీ, వారి మెచ్చుకోలును దుర్వినియోగం చేయడంగానీ పూర్తిగా తప్పు. (సామెతలు 25:27, పరిశుద్ధ బైబల్‌; మత్తయి 6:2-4) కేవలం ఇతరుల నుండి అపేక్షించకుండా స్వచ్ఛందంగా వచ్చేదే అసలైన ప్రశంస, అది మనం కోరి వారి నుండి బలవంతంగా పొందేది కాదు. అలా ప్రశంసించబడినప్పుడు, మన గురించి మనం అవసరమైనదాని కన్నా ఎక్కువగా ఊహించుకోనవసరం లేదు.—సామెతలు 27:2; రోమీయులు 12:3.

10. అల్పులుగా కనిపించే కొంతమంది నిజానికి ఎలా “విశ్వాసమందు భాగ్యవంతులు” అయివుండగలరో వివరించండి.

10 మనకు కొంత బాధ్యత అప్పగించబడినప్పుడు, సంఘం పూర్తిగా మన ప్రయాసలూ సామర్థ్యాలపైనే ఆధారపడి వర్థిల్లుతోందనిపించేలా చేసి, మనకు మనం అనవసరమైన ప్రాముఖ్యతను ఇచ్చుకోకుండా ఉండేందుకు వినయం మనకు సహాయం చేస్తుంది. ఉదాహరణకు, మనకు బోధనాపనిలో చాలా నైపుణ్యం ఉండవచ్చు. (ఎఫెసీయులు 4:11-13) అయినప్పటికీ, సంఘ కూటాల నుండి మనం నేర్చుకునే అతిగొప్ప పాఠాలు వేదికపై నుండి వచ్చేవి మాత్రమే కావని మనం వినయంగా గుర్తించాలి. ఉదాహరణకు, తండ్రిలేని కుటుంబంలో తన పిల్లల్ని వెంటబెట్టుకుని క్రమంగా రాజ్యమందిరానికి వచ్చే తల్లిని చూసినప్పుడు మీకు ప్రోత్సాహం లభించదా? లేక క్రుంగుదలను అనుభవిస్తున్న ఒక వ్యక్తి తనకసలు విలువలేదన్న భావాలు తనలో పదే పదే కల్గుతున్నప్పటికీ నమ్మకంగా కూటాలకు వస్తుండడం చూసి మీరు ప్రోత్సహించబడరా? పాఠశాలలోనూ మరితర స్థలాల్లోనూ చెడు ప్రభావాలు ఉన్నప్పటికీ ఆధ్యాత్మికంగా పురోభివృద్ధి సాధించే యువతను చూసి ప్రోత్సహించబడరా? (కీర్తన 84:10) వీరు బహుశా సంఘంలో ప్రముఖస్థానాలు గలవారు కాకపోవచ్చు. వీరికి ఎదురయ్యే యథార్థతా పరీక్షలు సాధారణంగా ఇతరులకు తెలియరావు. అయినప్పటికీ, సంఘంలోని ప్రముఖస్థానాలుగల వారిలాగే వీరు కూడా “విశ్వాసమందు భాగ్యవంతులు” అయ్యుండవచ్చు. (యాకోబు 2:5) ఎంతైనా చివరికి యెహోవా అనుగ్రహాన్ని పొందటానికి కారణమయ్యేది యథార్థతనే.—మత్తయి 10:22; 1 కొరింథీయులు 4:2.

గిద్యోను—తన తండ్రి కుటుంబంలో ‘కనిష్ఠుడు’

11. దేవుని దూతతో మాట్లాడేటప్పుడు గిద్యోను ఏవిధంగా వినయాన్ని చూపించాడు?

11 మనష్షే గోత్రానికి చెందిన బలిష్టుడూ యౌవనుడూ అయిన గిద్యోను ఇశ్రాయేలు చరిత్రలోని అల్లకల్లోలమైన కాలంలో జీవించాడు. ఆ కాలంలో దేవుని ప్రజలు మిద్యానీయుల అణిచివేత క్రింద ఏడేళ్లపాటు బాధననుభవించారు. అయితే, ఇప్పుడు యెహోవా తన ప్రజలను విమోచించే సమయం వచ్చింది. కాబట్టి, ఒక దేవదూత గిద్యోనుకు కనిపించి, “పరాక్రమముగల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడైయున్నాడని” అన్నాడు. గిద్యోను వినయం గలవాడు, కాబట్టి అతడు ఎదురుచూడని ఈ మెప్పుకోలుకు వెంటనే మైమరచిపోలేదు. బదులుగా, ఆయన దేవదూతతో గౌరవపూర్వకంగా, “చిత్తము నా యేలినవాడా, యెహోవా మాకు తోడైయుండినయెడల ఇదంతయు మాకేల సంభవించెను?” అన్నాడు. దేవదూత విషయాన్ని స్పష్టం చేసి, “మిద్యానీయుల చేతిలోనుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము” అని గిద్యోనుతో అన్నాడు. దానికి గిద్యోను ఎలా ప్రతిస్పందించాడు? తనను తాను గొప్ప చేసుకునేందుకు ఇది మంచి అవకాశమని ఈ నియామకాన్ని ఆత్రంగా చేజిక్కించుకునే బదులు గిద్యోను, “చిత్తము నా యేలిన వాడా, దేని సహాయముచేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నికలేనిదే. నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై యున్నానని” సమాధానమిచ్చాడు. ఎంతటి వినయం!—న్యాయాధిపతులు 6:11-15.

12. గిద్యోను తనకు అప్పగించబడిన పనిని నెరవేర్చడంలో ఎలా వివేచనను చూపించాడు?

12 గిద్యోనును యుద్ధానికి పంపే ముందు యెహోవా ఆయనను పరీక్షించాడు. ఎలా? తన తండ్రి బయలు కోసం కట్టించిన బలిపీఠాన్ని కూలద్రోయమనీ, దాని ప్రక్కన నిలబెట్టిన దేవతాస్తంభాన్ని పడద్రోయమనీ ఆయన గిద్యోనుకు చెప్పాడు. ఈ పనిని నెరవేర్చడానికి ఎంతో ధైర్యం అవసరం, కానీ గిద్యోను వినయాన్నీ తెలివినీ కూడా ప్రదర్శించి ఆ పనిని నెరవేర్చాడు. తనను తాను నలుగురికీ తెలిసేలా చేసుకునే బదులు, ఎక్కువమంది తనను గమనించలేని రాత్రి వేళలో ఆయనా పనిని చేశాడు. అంతేగాక, గిద్యోను తన పనిని తగినంత జాగ్రత్తతో నిర్వర్తించాడు. అతడు తనతోపాటు పదిమంది సేవకులను తీసుకువెళ్లాడు, బహుశా వారిలో కొందరు కాపలాగా ఉండగా మిగతావాళ్లు బలిపీఠాన్ని, దేవతాస్తంభాన్ని నాశనం చేయడానికే ఆయనలా తీసుకుని వెళ్లివుండవచ్చు. * ఏదేమైనప్పటికీ, యెహోవా ఆశీర్వాదంతో, గిద్యోను తన నియామకాన్ని నెరవేర్చాడు. తగిన సమయంలో ఇశ్రాయేలీయులను మిద్యానీయుల చేతుల్లో నుండి విమోచించటానికి దేవుడు ఆయనను ఉపయోగించుకున్నాడు.—న్యాయాధిపతులు 6:25-27.

వినయాన్ని, వివేచనను ప్రదర్శించడం

13, 14. (ఎ) మనకు ఒక సేవాధిక్యత ఇవ్వబడినప్పుడు మనం వినయాన్ని ఎలా చూపించగలము? (బి) సహోదరుడు ఎ. హెచ్‌. మాక్‌మిలన్‌ వినయాన్ని చూపించడంలో ఎలా చక్కని మాదిరిని ఉంచాడు?

13 గిద్యోను వినయం నుండి మనం నేర్చుకోవలసింది ఎంతో ఉంది. ఉదాహరణకు, ఏదైనా సేవాధిక్యత మనకు ఇవ్వబడినప్పుడు మనమెలా ప్రతిస్పందిస్తాము? దాని ద్వారా వచ్చే ఖ్యాతిని లేక ప్రతిష్ఠను గురించే మొదట ఆలోచిస్తామా? లేక ఆ నియామకంలో ఉండే సవాళ్లను మనం నెరవేర్చగలమా, లేదా అని వినయంగా ప్రార్థనాపూర్వకంగా ఆలోచిస్తామా? 1966 లో తన భూజీవితాన్ని ముగించిన సహోదరుడు ఎ. హెచ్‌. మాక్‌మిలన్‌ ఈ విషయంలో చక్కని మాదిరి నుంచాడు. వాచ్‌ టవర్‌ సొసైటీ మొదటి అధ్యక్షుడైన సి. టి. రస్సెల్‌ తాను లేనప్పుడు ఎవరు పనిని చేపట్టగలరనేదాని గురించి తన అభిప్రాయాన్ని చెప్పమని మాక్‌మిలన్‌ను అడిగాడు. అప్పుడు జరిగిన చర్చలో సహోదరుడు మాక్‌మిలన్‌ ఒక్కసారి కూడా ఆయన నిర్వర్తించే పనులన్నింటినీ తను చేయగలనని సిఫారసు చేసుకోలేదు, అలా తనను తాను సిఫారసు చేసుకోవడం అయనకు ఎంతో సులభమే అయినప్పటికీ ఆయనలా చేయలేదు. చివరికి, సహోదరుడు రస్సెల్‌ ఆ పనిని చేపట్టేందుకు రమ్మని సహోదరుడు మాక్‌మిలన్‌నే ఆహ్వానించాడు. అనేక సంవత్సరాల తర్వాత సహోదరుడు మాక్‌మిలన్‌ ఇలా వ్రాశాడు: “నేను నిశ్చేష్టుడనైపోయాను. నేను దాని గురించి చాలా గంభీరంగా ఆలోచించి, దాని గురించి కొంతసేపు ప్రార్థించిన తర్వాత, ఆయనకు సహాయం చేయడానికి నేను చేయగల్గినదంతా చేస్తానని చెప్పాను.”

14 అది జరిగిన కొంతకాలానికే సహోదరుడు రస్సెల్‌ మరణించడంతో, వాచ్‌ టవర్‌ సొసైటీ ఆధ్యక్ష స్థానానికి ఖాళీ ఏర్పడింది. సహోదరుడు రస్సెల్‌ చివరి ప్రకటన పర్యటనా సమయంలో సహోదరుడు మాక్‌మిలనే అన్ని వ్యవహారాలు చూసుకుంటున్నాడు గనుక, ఒక సహోదరుడు ఇలా అన్నాడు: “మాక్‌, అధ్యక్షపదవి మీకే దొరికే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. సహోదరుడు రస్సెల్‌ ప్రకటనా పర్యటనకు వెళ్లే సమయానికి మీరు ఆయన ప్రత్యేక ప్రతినిధిగా ఉన్నారు, మీరు చెప్పినట్లుగా చేయమని ఆయన మాకు చెప్పారు. ఆయన వెళ్లిపోయాడు ఇక ఎన్నడూ రాడు. పనిని కొనసాగించవలసిన వ్యక్తి మీరేనని నాకనిపిస్తుంది.” అందుకు సహోదరుడు మాక్‌మిలన్‌ ఇలా సమాధానమిచ్చాడు: “సహోదరుడా, ఈ విషయాన్ని దృష్టించవలసిన పద్ధతి ఇది కాదు. ఇది ప్రభువు పని; ప్రభువు సంస్థలో మనకు లభించే స్థానం, మనకివ్వడానికి తగినదని ప్రభువు భావించేదై ఉంటుంది; ఆ పనికి తగినవాడిని నేను కాదని నాకు కచ్చితంగా తెలుసు.” అప్పుడు సహోదరుడు మాక్‌మిలన్‌ ఆ స్థానానికి మరొకరిని సిఫారసు చేశాడు. గిద్యోను వలె, ఆయనకు తనను గురించి తనకు చాలా వినయపూర్వకమైన దృక్పథం ఉంది, అదే దృక్పథాన్ని మనం కూడా అలవర్చుకోవడం మంచిది.

15. మనం ఇతరులకు ప్రకటించేటప్పుడు వివేచనను ఉపయోగించడానికి గల కొన్ని ఆచరణాత్మకమైన మార్గాలు ఏవి?

15 మనం కూడా మన నియామకాలను నెరవేర్చడంలో వినయంగా ఉండాలి. గిద్యోను వివేచనగలవాడు, అతడు తన వ్యతిరేకులకు అనవసరంగా ఆగ్రహం తెప్పించకుండా ఉండటానికి ప్రయత్నించాడు. అలాగే, మన ప్రకటనా పనిలో మనం కూడా ఇతరులతో మాట్లాడేటప్పుడు వినయాన్ని, వివేచనను ఉపయోగించాలి. నిజమే, మనం “దుర్గములను” పడద్రోసే, “వితర్కములను” త్రిప్పికొట్టే ఆధ్యాత్మిక యుద్ధంలో పాల్గొంటున్నాము. (2 కొరింథీయులు 10:4, 5) కానీ మనం ఇతరులను చిన్నబుచ్చేలా మాట్లాడకూడదు. అలాగే, మన సందేశాన్ని విని వాళ్లు అభ్యంతర పడేందుకు అవకాశమివ్వకూడదు. బదులుగా, మనం వాళ్ల దృక్కోణాలను గౌరవిస్తూ మనకు వాళ్లకు ఏ విషయాలైతే సర్వసాధారణమై ఉన్నాయో వాటిని నొక్కి చెప్పాలి, మన సందేశంలోని అనుకూల అంశాలపై ఎక్కువగా అవధానముంచాలి.—అపొస్తలుల కార్యములు 22:1-3; 1 కొరింథీయులు 9:22; ప్రకటన 21:4.

యేసు—వినయం విషయంలో అత్యుత్తమమైన మాదిరి

16. యేసు తన గురించి తాను వినయ దృక్పథం కల్గివున్నానని ఎలా చూపించాడు?

16 వినయం విషయంలో అతి చక్కని మాదిరి యేసుక్రీస్తే. * యేసుకు తన తండ్రితో ఎంతో సన్నిహితమైన సంబంధం ఉన్నప్పటికీ, కొన్ని విషయాలు తన అధికార పరిధికి వెలుపల ఉన్నాయని అంగీకరించేందుకు ఆయన వెనుకాడలేదు. (యోహాను 1:14) ఉదాహరణకు, యేసు రాజ్యంలో ఆయనకు కుడివైపున, ఎడమవైపున కూర్చునేందుకు తన ఇద్దరు కుమారులకు అనుమతినివ్వమని యాకోబు యోహానుల తల్లి కోరినప్పుడు, “నా కుడివైపునను నా యెడమవైపునను కూర్చుండనిచ్చుట నా వశమునలేదు” అని ఆయన అన్నాడు. (మత్తయి 20:20-23) మరో సందర్భంలో, యేసు ఇష్టపూర్వకంగా ఇలా అంగీకరించాడు: “నా అంతట నేనే ఏమియు చేయలేను; . . . నన్ను పంపిన వాని చిత్తప్రకారమే చేయ గోరుదును గాని నా యిష్టప్రకారము చేయగోరను.”—యోహాను 5:30; 14:28; ఫిలిప్పీయులు 2:5, 6.

17. ఇతరులతో వ్యవహరించేటప్పుడు యేసు వినయాన్ని ఎలా చూపించాడు?

17 యేసు అపరిపూర్ణ మానవులకంటే అన్ని విధాలుగానూ ఉన్నతమైనవాడు, ఆయనకు తన తండ్రియైన యెహోవా నుండి సాటిలేని అధికారం లభించింది. అయినప్పటికీ, యేసు తన అనుచరులతో వ్యవహరించే విషయంలో ఎంతో వినమ్రుడై ఉన్నాడు. ఆయన తనకున్న జ్ఞానాన్ని ప్రదర్శించేసి వారిని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తలేదు. ఆయన సానుభూతిని, కనికరాన్ని చూపించాడు, మానవులుగా వారికున్న అవసరాలను పరిగణలోకి తీసుకున్నాడు. (మత్తయి 15:32; 26:40, 41; మార్కు 6:31) కాబట్టి, యేసు పరిపూర్ణుడే అయినప్పటికీ పరిపూర్ణతావాది మాత్రం కాదు. తన శిష్యులు ఇవ్వగలదాని కన్నా ఎక్కువగా వారి నుండి ఆయన ఎన్నడూ కోరలేదు, వాళ్ళు భరించగలదాని కన్నా ఎక్కువ భారాన్ని ఆయన వారిపై మోపలేదు. (యోహాను 16:12) గనుక ఆయన వద్దకు రావడానికి చాలామంది ఇష్టపడ్డారంటే అందులో ఆశ్చర్యపోవలసినదేమీ లేదు!—మత్తయి 11:29.

యేసు వినయసహిత దృక్పథాన్ని అనుకరించండి

18, 19. (ఎ) మనల్ని మనం దృష్టించుకునే విషయంలో, (బి) ఇతరులతో వ్యవహరించే విషయంలో యేసు కల్గివున్న వినయసహిత దృక్పథాన్ని మనం ఎలా అనుకరించగలము?

18 జీవించినవారిలోకెల్లా మహాగొప్ప మనిషే వినయాన్ని చూపించాడంటే, మనం మరింకెంతగా చూపించాలి! తమకు సంపూర్ణ అధికారం లేదని అంగీకరించడానికి అపరిపూర్ణ మానవులు తరచూ వెనుకాడుతుంటారు. అయితే యేసును అనుకరిస్తూ క్రైస్తవులు వినమ్రంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. అర్హతవున్న వారికి బాధ్యతను అప్పగించేందుకు వెనుకాడేంత అహంకారులు కాదు వాళ్లు; అంతేగాక, నిర్దేశాన్నిచ్చే అధికారమున్నవారు నిర్దేశాన్ని ఇచ్చినప్పుడు దాన్ని తీసుకోవడానికి నిరాకరించేంత గర్విష్టులూ కాదు. వాళ్లు అటువంటి నిర్దేశాల్ని తీసుకోవడానికి సుముఖంగా ఉంటారు. సహకార స్ఫూర్తిని చూపిస్తూ, సంఘంలో అన్ని విషయాలూ “మర్యాదగాను క్రమముగాను” జరిగేందుకు అనుమతిస్తారు.—1 కొరింథీయులు 14:39, 40.

19 ఇతరుల నుండి మనం అపేక్షించే వాటి విషయంలో సహేతుకంగా ఉండడానికీ, వారి అవసరతల గురించి శ్రద్ధ కల్గివుండడానికీ కూడా వినయం మనల్ని పురికొల్పుతుంది. (ఫిలిప్పీయులు 4:5) ఇతరులకు లేని కొన్ని నైపుణ్యాలు, సామర్థ్యాలు మనకు ఉండవచ్చు. అయినప్పటికీ మనం వినయం గలవారమైతే, ఇతరులు ఎప్పుడూ మనకు ఇష్టమైన రీతిలోనే ప్రవర్తించాలని మనం కోరుకోము. ప్రతివ్యక్తికీ తమ స్వంత పరిమితులు ఉంటాయని తెలుసుకోవటం ద్వారా మనం వినయంగా ఇతరుల బలహీనతలను భరిస్తాము. పేతురు ఇలా వ్రాశాడు: “ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటె ముఖ్యముగా ఒకనియెడల ఒకడు మిక్కటమైన ప్రేమగలవారై యుండుడి.”—1 పేతురు 4:8.

20. గర్వంగా ప్రవర్తించాలనే ఏ వైఖరినైనా అధిగమించటానికి మనం ఏమి చేయవచ్చు?

20 మనం తెలుసుకున్నట్లుగా, నిజంగానే వినయంగలవారి యొద్ద జ్ఞానమున్నది. మీలో గర్వం లేదా అహంకారం ఉన్నట్లు మీకు అనిపిస్తుంటే అప్పుడేమిటి? నిరుత్సాహపడకండి. బదులుగా, “దురభిమాన పాపములలో పడకుండ నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనియ్యకుము” అని ప్రార్థించిన దావీదు ఉదాహరణను అనుసరించండి. (కీర్తన 19:13) పౌలు, గిద్యోను వంటివారి విశ్వాసాన్ని, అందరికన్నా ముఖ్యంగా యేసుక్రీస్తు విశ్వాసాన్ని అనుకరించడం ద్వారా మనం, “వినయముగలవారియొద్ద జ్ఞానమున్నది” అన్న మాటల్లోని సత్యాన్ని వ్యక్తిగతంగా రుచిచూడగల్గుతాము.—సామెతలు 11:2.

[అధస్సూచీలు]

^ పేరా 6 ‘సేవకులు’ అని అనువదించబడిన గ్రీకు పదం, ఒక పెద్ద ఓడలోని క్రింది అంతస్థులో ఉండి తెడ్లు వేసే బానిసలను సూచిస్తుంది. దానికి భిన్నంగా, “గృహనిర్వాహకుల”కు ఎక్కువ బాధ్యతలు అప్పగించబడతాయి, బహుశా స్థిరాస్తుల వ్యవహారాలు చూసుకోవడం వంటివి. ఏదేమైనప్పటికీ, చాలామంది యజమానులు మాత్రం గృహనిర్వాహకులను ఓడల్లోని బానిసల్లానే, వేరొకరి ఆధీనంలో ఉన్న పనివారిగానే దృష్టిస్తారు.

^ పేరా 12 గిద్యోను చూపించిన వివేచనను, జాగరూకతను మనం పిరికితనానికి గుర్తుగా భావించకూడదు. అందుకు భిన్నంగా, ఆయన చూపించిన ధైర్యాన్ని హెబ్రీయులు 11:32-38 ధృవీకరిస్తుంది, అక్కడ గిద్యోను ‘బలపరచబడినవారిలోనూ, యుద్ధములో పరాక్రమశాలులైనవారిలోనూ’ ఒకడిగా లెక్కించబడ్డాడు.

^ పేరా 16 వినయం కల్గివుండడమంటే ఒకరు తమకున్న పరిమితులను గుర్తెరగడమని భావం గనుక, యెహోవా వినయంగల వాడని చెప్పడం సబబుకాదు. అయితే ఆయన సాత్వికుడు.—కీర్తన 18:35.

మీకు జ్ఞాపకమున్నాయా?

• వినయం అంటే ఏమిటి?

• మనం పౌలు వినయాన్ని ఎలా అనుకరించగలము?

• గిద్యోను ఉదాహరణ నుండి మనం వినయం గురించి ఏమి నేర్చుకోవచ్చు?

• వినయం విషయంలో యేసు ఎలా అత్యున్నతమైన మాదిరిని ఉంచాడు?

[అధ్యయన ప్రశ్నలు]

[అధ్యయన ప్రశ్నలు]

[15వ పేజీలోని చిత్రం]

పౌలుకున్న వినయం ఆయనను తన తోటి క్రైస్తవులకు ప్రియమైనవానిగా చేసింది

[17వ పేజీలోని చిత్రం]

దేవుని చిత్తాన్ని చేయడంలో గిద్యోను వివేచనను ఉపయోగించాడు

[18వ పేజీలోని చిత్రం]

దేవుని కుమారుడైన యేసు తాను చేసేవాటన్నిటిలో వినయాన్ని కనబరుస్తాడు