కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవునికి ప్రీతిపాత్రమైన బలులు

దేవునికి ప్రీతిపాత్రమైన బలులు

దేవునికి ప్రీతిపాత్రమైన బలులు

“ప్రతి ప్రధాన యాజకుడు అర్పణలను బలులను అర్పించుటకు నియమింపబడును.”హెబ్రీయులు 8:3.

1. దేవుని వైపు తిరుగవలసిన అవసరం ఉందని ప్రజలు ఎందుకు భావిస్తారు?

“బలి అర్పించడం మానవులకు ప్రార్థించడమంత ‘సహజమైనది’; బలి, మానవులు తమ గురించి తాము ఏమనుకుంటున్నారో సూచిస్తే, ప్రార్థన, వాళ్లు దేవుని గురించి ఏమనుకుంటున్నారనేది సూచిస్తుంది,” అని బైబిలు సంబంధిత చరిత్రకారుడైన ఆల్ఫ్రెడ్‌ ఎడర్‌షైమ్‌ వ్రాస్తున్నాడు. పాపము లోకంలోనికి ప్రవేశించినప్పటి నుండి, అది అపరాధభావాన్ని, దేవుని నుండి దూరమైపోవడాన్ని, నిస్సహాయతను తీసుకువచ్చింది. ఈ భావాల నుండి విముక్తి అవసరం. ప్రజలు తాము అంతటి దుర్భర స్థితిలో ఉన్నప్పుడు, సహాయం కోసం తాము దేవుని వైపుకు తిరుగవలసిన అవసరముందని గుర్తిస్తారు, అది అర్థం చేసుకోదగినదే.—రోమీయులు 5:12.

2. దేవునికి అర్పించబడిన ఏ తొలి అర్పణల గురించి బైబిల్లో వ్రాయబడి ఉంది?

2 దేవునికి అర్పణలను అర్పించడాన్ని గురించిన మొదటి బైబిలు వృత్తాంతం కయీను హేబెలులకు సంబంధించినది. దాని గురించి మనమిలా చదువుతాము: “కొంతకాలమైన తరువాత కయీను పొలముపంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబెలు కూడ తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను.” (ఆదికాండము 4:3, 4) ఇక ఆ తర్వాత, తన కాలంనాటి దుష్ట తరాన్ని నాశనం చేసిన గొప్ప జలప్రళయం నుండి దేవునిచే కాపాడబడిన నోవహు ‘బలిపీఠముమీద యెహోవాకు దహనబలిని అర్పించాడని’ మనం తెలుసుకుంటాము. (ఆదికాండము 8:20) దేవుని నమ్మకమైన సేవకుడూ స్నేహితుడూ అయిన అబ్రాహాము దేవుని వాగ్దానాల్నీ ఆశీర్వాదాల్నీ బట్టి ఎంతగానో కదిలింపబడి ఎన్నోసార్లు, “యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను.” (ఆదికాండము 12:8; 13:3, 4, 18) తన కుమారుడైన ఇస్సాకును దహన బలిగా అర్పించమని యెహోవా అబ్రాహామును కోరినప్పుడు ఆయన తన విశ్వాసానికి సంబంధించి అతిగొప్ప పరీక్షను ఎదుర్కొన్నాడు. (ఆదికాండము 22:1-14) ఈ వృత్తాంతాలు క్లుప్తమైనవే అయినప్పటికీ అవి బలి అనే అంశంపై వెలుగును ప్రసరింపజేస్తున్నాయి, అదెలాగో మనం పరిశీలిద్దాము.

3. ఆరాధనలో బలులు ఏ పాత్ర నిర్వహిస్తాయి?

3 బలికి సంబంధించి యెహోవా నిర్దిష్టమైన కట్టడలను ఇవ్వడానికి ఎంతోకాలం ముందే, ఏదో ఒక విధమైన బలిని అర్పించడం ఆరాధనలో ఒక భాగంగా ఉండేదన్న విషయం, వీటి నుండీ ఇతర బైబిలు వృత్తాంతాల నుండీ స్పష్టమౌతుంది. దానికి అనుగుణ్యంగానే, “బలి” అంటే, “మానవుడు తాను పవిత్రం అని భావిస్తున్న వ్యక్తితో మంచి సంబంధాన్ని ఏర్పరచుకోవడానికీ, ఆ సంబంధాన్ని కాపాడుకోవడానికీ, లేక దాన్ని పునఃస్థాపించుకోవడానికీ ఆ దైవత్వానికి ఏమైనా అర్పించే మతసంబంధమైన ఆచారం” అని ఒక పుస్తకం నిర్వచిస్తుంది. ఇది మనం జాగ్రత్తగా పరిశీలించదగిన కొన్ని ప్రాముఖ్యమైన ప్రశ్నల్ని లేవనెత్తుతుంది, అవేమిటంటే, ఆరాధనలో బలి ఎందుకవసరము? దేవునికి ఏ విధమైన బలులు అంగీకారమైనవి? ప్రాచీనకాలంలో ఇవ్వబడిన బలులు మన కాలానికి ఏ భావాన్ని కల్గివున్నాయి?

బలి ఎందుకవసరమైంది?

4. ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు వారికి లభించిన జీతమేమిటి?

4 ఆదాము ఉద్దేశపూర్వకంగానే పాపం చేశాడు. మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షంనుండి ఫలాన్ని తీసుకుని తినడమన్నది ఆయన ఉద్దేశపూర్వకంగా చేపట్టిన అవిధేయతా చర్యనే. ఆ అవిధేయతా చర్యకు జరిమానా మరణమే, ఎందుకంటే “నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని” దేవుడు ముందే స్పష్టంగా తెలియజేశాడు. (ఆదికాండము 2:17) ఆదాము హవ్వలు చివరికి తమ పాపానికి తగిన జీతాన్ని పుచ్చుకున్నారు, వాళ్లు నాశనమయ్యారు.—ఆదికాండము 3:19; 5:3-5.

5. ఆదాము సంతానం విషయంలో యెహోవా ఎందుకు చొరవ తీసుకున్నాడు, వారికోసం ఆయనేమి చేశాడు?

5 అయితే మరి ఆదాము సంతానం మాటేమిటి? ఆదాము నుండి పాపాన్ని, అపరిపూర్ణతను వారసత్వంగా స్వీకరించినందున వాళ్లు కూడా మొదటి మానవ దంపతుల్లాగే దేవుని నుండి దూరమైపోయి, నిరీక్షణ అన్నది లేకుండా మరణానికి లోనయ్యారు. (రోమీయులు 5:14) అయితే, యెహోవా న్యాయానికీ శక్తికే కాదు, నిజానికి ప్రాథమికంగా ఆయన ప్రేమకు కూడా దేవుడే. (1 యోహాను 4:8, 16) కాబట్టి ఏర్పడిన ఈ అగాధాన్ని పూడ్చడానికి ఆయన తనకు తానుగా చొరవతీసుకున్నాడు. అందుకే, “పాపమువలన వచ్చు జీతము మరణము,” అని చెప్పిన తర్వాత బైబిలు ఇంకా ఇలా చెప్తుంది, “అయతే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్యజీవము.”—రోమీయులు 6:23.

6. ఆదాము చేసిన పాపం మూలంగా ఏర్పడిన నష్టానికి సంబంధించి యెహోవా చిత్తం ఏమైయుంది?

6 ఆ కృపావరం విషయంలో హామీ ఇచ్చేందుకు యెహోవా దేవుడు, ఆదాము చేసిన పాపం మూలంగా ఏర్పడిన నష్టాన్ని పూరించేందుకు ఒక ఏర్పాటు చేశాడు. హెబ్రీ భాషలో కాఫార్‌ అనే పదానికి మొదట్లో “కప్పు” లేక బహుశా “తుడిచివేయు” అనే భావాలు ఉండివుండవచ్చు, దాన్ని “పరిహారం” అని కూడా అనువదించడం జరిగింది. * వేరేమాటల్లో చెప్పాలంటే, ఆదాము నుండి వారసత్వంగా వచ్చిన పాపాన్ని కప్పివేసి, ఆ పాపం వల్ల ఏర్పడిన నష్టాన్ని భర్తీ చేసేందుకు యెహోవా తగిన ఏర్పాటును చేశాడు. తద్వారా, ఆ కృపావరాన్ని పొందటానికి అర్హులయ్యేవారు పాప మరణాల శాపం నుండి విముక్తులు కావడం సాధ్యమయ్యింది.—రోమీయులు 8:20, 21.

7. (ఎ) దేవుడు సాతానుకు విధించిన శిక్ష ద్వారా ఏ నిరీక్షణ ఇవ్వబడింది? (బి) మానవజాతిని పాప మరణాల నుండి విమోచించటానికి ఏ మూల్యం చెల్లించబడాలి?

7 పాప మరణాల దాస్యం నుండి విమోచింపబడే నిరీక్షణ మొదటి మానవ జంట పాపం చేసినప్పుడే పరోక్షంగా సూచించబడింది. సర్పాన్ని ఉపయోగించుకుని మాట్లాడిన సాతానుకు శిక్షను విధిస్తూ యెహోవా, “నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమె మీద కొట్టుదువని” అన్నాడు. (ఆదికాండము 3:15) ఆ ప్రవచనార్థక వ్యాఖ్యానంలో నుండి ఆ వాగ్దానమందు విశ్వాసం ఉంచే వాళ్లందరికీ ఒక ఆశారేఖ ప్రభవించింది. అయితే, ఆ విమోచన కోసం మూల్యాన్ని చెల్లించవలసి ఉంది. వాగ్దానం చేయబడిన సంతానం సాతానును నాశనం చేయడమనేది యాంత్రికమైనది కాదు; ముందుగా ఆ సంతానం మడిమె మీద కొట్టబడాలి, అంటే మరణించాలి, అయితే శాశ్వతంగా మాత్రం కాదు.

8. (ఎ) కయీను హవ్వ నిరాశకు ఎలా కారణమయ్యాడు? (బి) హేబెలు అర్పించిన బలి దేవుని దృష్టికి ఎందుకు అంగీకారమయ్యింది?

8 ఆదాము హవ్వలు వాగ్దానం చేయబడిన సంతానాన్ని గుర్తించడాన్ని గురించి ఎంతగానో ఆలోచించి ఉంటారనడంలో సందేహం లేదు. హవ్వ తన మొదటి కుమారుడైన కయీనుకు జన్మనిచ్చినప్పుడు, “యెహోవా దయవలన నేనొక మనుష్యుని సంపాదించుకొన్నా”నని అన్నది. (ఆదికాండము 4:1) బహుశా తన కుమారుడే ఆ సంతానమౌతాడేమోనని ఆమె అనుకుందా? ఆమె అలా అనుకుందో లేదో గానీ కయీనూ అతని సంతానమూ మాత్రం ఎంతో నిరాశనే కల్గించారు. మరోవైపున, అతని సహోదరుడైన హేబెలు దేవుని వాగ్దానమందు విశ్వాసముంచి తన మందలో నుండి ప్రధమ సంతానాన్ని యెహోవాకు బలిగా అర్పించడానికి పురికొల్పబడ్డాడు. మనమిలా చదువుతాము: “విశ్వాసమునుబట్టి హేబెలు కయూనుకంటె శ్రేష్ఠమైన బలి దేవునికి అర్పించెను. దేవుడతని అర్పణలనుగూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమునుబట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను.”—హెబ్రీయులు 11:4.

9. (ఎ) హేబెలు దేనియందు విశ్వాసముంచాడు, ఆయన దాన్నెలా వ్యక్తపరిచాడు? (బి) హేబెలు అర్పించిన బలి దేన్ని సాధించింది?

9 హేబెలుకున్న విశ్వాసం కేవలం దేవుడున్నాడన్న విశ్వాసం మాత్రమే కాదు, అలాంటి విశ్వాసం కయీనుకు కూడా ఉండే ఉండవచ్చు. అయితే విశ్వాసులైన మానవులకు రక్షణ తీసుకువచ్చే సంతానం గురించి దేవుడు చేసిన వాగ్దానమందు కూడా హేబెలుకు విశ్వాసం ఉంది. అదెలా నెరవేరుతుందో ఆయనకు బయల్పర్చబడలేదు, కానీ ఎవరో ఒకరు మడిమె మీద కొట్టబడాల్సివుంటుందని దేవుని వాగ్దానం ద్వారా హేబెలుకు తెలిసింది. అవును, రక్తం చిందించబడాలని ఆయన గ్రహించాడన్నది స్పష్టమౌతుంది, బలి ముఖ్య ఉద్దేశం అదే. హేబెలు జీవమూ రక్తమూ ఇమిడివున్న బలిని జీవదాతకు అర్పించాడు, యెహోవా వాగ్దాన నెరవేర్పు పట్ల తనకున్న ప్రగాఢమైన కోరికకు, నిరీక్షణకు అది సూచన కావచ్చు. హేబెలు తన విశ్వాసాన్ని ఈ విధంగా వ్యక్తపర్చడమే ఆయన అర్పించిన బలి యెహోవాకు ప్రీతిపాత్రమయ్యేలా చేసింది, సూచనార్థకంగా అది బలి ముఖ్యోద్దేశాన్ని వ్యక్తపర్చింది, దేవుని అనుగ్రహాన్ని పొందడానికి పాపులైన మానవులు దేవుని సమీపించగల మార్గం అదే.—ఆదికాండము 4:4; హెబ్రీయులు 11:1, 6.

10. ఇస్సాకును అర్పించమని యెహోవా అబ్రాహామును అడగడం బలుల ప్రాముఖ్యతను ఎలా స్పష్టం చేసింది?

10 తన కుమారుడైన ఇస్సాకును దహనబలిగా అర్పించమని యోహోవా అబ్రాహాముకు ఆజ్ఞాపించినప్పుడు బలికున్న అపారమైన ప్రాముఖ్యత స్పష్టమైంది. ఆ బలి అక్షరార్థంగా అర్పించబడకపోయినప్పటికీ, చివరికి యెహోవా ఏమి చేస్తాడనేదానికి, అంటే మానవజాతి పట్ల తనకున్న చిత్తాన్ని నెరవేర్చడానికి తన ఏకైక కుమారుడ్ని అతిగొప్ప బలిగా ఎలా అర్పిస్తాడనేదానికి అది ఒక సూచనగా పని చేసింది. (యోహాను 3:16) యెహోవా తాను ఏర్పరచుకున్న ప్రజలు తమ పాపాలకు క్షమాపణను పొందేందుకూ, రక్షణకోసమైన తమ నిరీక్షణను బలపర్చుకునేందుకూ, ఏమి చేయాలనేది వారికి బోధించడానికి మోషే ధర్మశాస్త్రంలో చెప్పబడిన బలులూ అర్పణల రూపంలో ప్రవచనార్థక మాదిరులను ఆయన నెలకొల్పాడు. వీటి నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

యెహోవాకు అంగీకారమైన బలులు

11. ఇశ్రాయేలు ప్రధాన యాజకుడు ఏ రెండు వర్గాలకు చెందిన బలులను అర్పించేవాడు, ఏ సంకల్పంతో?

11 “ప్రతి ప్రధాన యాజకుడు అర్పణలను బలులను అర్పించుటకు నియమింపబడును” అని అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు. (హెబ్రీయులు 8:3) ప్రాచీన ఇశ్రాయేలులోని ప్రధాన యాజకుడు అర్పించే బలులను పౌలు మొదటిగా ‘అర్పణలు’ లేదా ‘బలులు’ రెండవదిగా ‘పాపముల కొరకు బలులు’ అని రెండు వర్గాలుగా విభాగించడాన్ని గమనించండి. (హెబ్రీయులు 5:1) ప్రేమను ప్రశంసను వ్యక్తపర్చడానికీ, అలాగే స్నేహాన్ని అభిమానాన్ని లేదా అంగీకారాన్ని పొందడానికీ సాధారణంగా ప్రజలు కానుకలు ఇస్తారు. (ఆదికాండము 32:21; సామెతలు 18:16) అదే విధంగా, ధర్మశాస్త్రం పేర్కొనే అనేక అర్పణలను దేవుని అంగీకారాన్నీ అభిమానాన్నీ పొందడానికి ఆయనకిచ్చే ‘అర్పణలుగా’ దృష్టించవచ్చు. * ధర్మశాస్త్రం ప్రకారం అపరాధములకు పరిహారం చెల్లించవలసి ఉంటుంది, పాపముల ప్రాయశ్చిత్తానికై ‘బలులు’ అర్పించబడేవి. బైబిలులోని మొదటి ఐదు పుస్తకాలు, మరి ముఖ్యంగా నిర్గమకాండము, లేవీయకాండము, సంఖ్యాకాండము పుస్తకాలు వివిధ రకాలైన బలులకు, అర్పణలకు సంబంధించి ఎంతో విస్తృతమైన సమాచారాన్ని అందజేస్తాయి. వివరాలన్నింటినీ అకళింపు చేసుకుని వాటిని గుర్తుంచుకోవడం నిజంగా ఒక సవాలే అయినప్పటికీ, వివిధ రకాలైన బలుల గురించి కొన్ని కీలకాంశాలను మనం పరిశీలించడం మంచిది.

12. ధర్మశాస్త్రంలో చెప్పబడిన బలులను లేక అర్పణలను గూర్చిన సంపూర్ణ సమీక్షను బైబిల్లో మనం ఎక్కడ కనుగొనవచ్చు?

12లేవీయకాండము 1 నుండి 7 అధ్యాయాల్లో మనం ఐదు ప్రాథమిక రకాలైన అర్పణలను గమనించగల్గుతాము, అవేమిటంటే దహన బలి, నైవేద్యము, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి. వీటిలో కొన్ని మిగతా వాటితో కలిపి అర్పించబడినప్పటికీ, ఇవన్నీ విడివిడిగా వర్ణించబడ్డాయి. ఈ అధ్యాయాల్లో ఈ అర్పణలు రెండుసార్లు రెండు వేర్వేరు ఉద్దేశాలతో వర్ణించబడ్డాయని కూడా మనం గమనిస్తాము: మొదటిసారి, లేవీయకాండము 1:2 నుండి 6:7 వరకున్న వచనాలు బలిపీఠం మీద ఏమి అర్పించబడాలనే వివరాలను తెలియజేస్తాయి. రెండవసారి, లేవీయకాండము 6:8 నుండి 7:36 వరకున్న వచనాలు, యాజకులూ అర్పించేవారూ తమ కోసం ఉంచుకోవలసిన భాగాలను చూపిస్తాయి. ఇక, సంఖ్యాకాండము 28, 29 అధ్యాయాల్లో ప్రతి రోజు, ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం వచ్చే పండుగల్లో ఏమి అర్పించాలనే దాని గురించిన విపులమైన కాల పట్టికను కనుగొనవచ్చు.

13. దేవునికి కానుకగా ఇవ్వబడే స్వేచ్ఛార్పణలను వివరించండి.

13 స్వేచ్ఛార్పణలుగా అర్పించే వాటిలో లేదా దేవుని అనుగ్రహాన్ని పొందాలని చేసే వాటిలో దహనబలులు, నైవేద్యము, సమాధాన బలులు ఇమిడి ఉన్నాయి. “దహనబలి” కోసం ఉపయోగించబడిన హెబ్రీ పదానికి “ఆరోహణ బలి” లేదా “పైకి వెళ్ళే బలి” అనే భావం ఉందని కొంతమంది పండితులు భావిస్తున్నారు. ఇది సముచితమైనదే ఎందుకంటే దహనబలిలో వధించబడిన జంతువును బలిపీఠంపై దహించేవారు, పరిమళ వాసన లేక ఇంపైన సువాసనగల హోమము పరలోకం వైపుగా దేవుని దగ్గరికి చేరేది. దహనబలికున్న విశేషమైన అంశం ఏమిటంటే, దాని రక్తాన్ని బలిపీఠం చుట్టూ చిలకరించిన తర్వాత, ఆ జంతువు మొత్తంగా దేవునికి అర్పించబడేది. “యెహోవాకు ఇంపైన సువాసనగల దహనబలియగునట్లు” యాజకులు ‘దానినంతటినీ బలిపీఠముమీద దహించేవారు.’—లేవీయకాండము 1:3, 4, 9; ఆదికాండము 8:21.

14. నైవేద్యము ఎలా అర్పించబడేది?

14 నైవేద్యము గురించి లేవీయకాండము రెండవ అధ్యాయంలో వివరించబడింది. అది సాధారణంగా నూనె జతచేసిన మెత్తని పిండి, సాంబ్రాణి కలిపి అర్పించే స్వేచ్ఛార్పణ. “యాజకుడు తన చేరతో చేరెడు నూనెయు చేరెడు గోధుమపిండియు దాని సాంబ్రాణి అంతయు తీసికొని యెహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా బలిపీఠముమీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థముగా దహింపవలెను.” (లేవీయకాండము 2:2) గుడారంలోనూ, ఆలయంలోనూ ఉన్న ధూపపీఠం మీద దహించబడే పవిత్రమైన పరిమళ ద్రవ్యాల్లో సాంబ్రాణి ఒకటి. (నిర్గమకాండము 30:34-36) “నా ప్రార్థన ధూపమువలెను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యమువలెను నీ దృష్టికి అంగీకారములగును గాక” అన్నప్పుడు రాజైన దావీదు మనస్సులో బహుశా ఇదే ఉండి ఉండవచ్చునని స్పష్టమౌతుంది.—కీర్తన 141:2.

15. సమాధాన బలి ఉద్దేశమేమిటి?

15 మరో స్వేచ్ఛార్పణ లేవీయకాండము మూడవ అధ్యాయంలో వర్ణించబడిన సమాధానబలి. దాన్ని, “శాంతి అర్పణల బలి” అని కూడా అనువదించవచ్చు. హెబ్రీ భాషలో “సమాధానం” అనే పదం, యుద్ధం లేదా అల్లకల్లోలం లేకుండా ఉండే పరిస్థితి కంటే ఎక్కువనే సూచిస్తుంది. “బైబిల్లో ఈ పదం కేవలం దీన్ని మాత్రమే గాక దేవునితో సమాధానం కలిగి ఉండే స్థితిని లేక సంబంధాన్ని, సమృద్ధిని, ఆనందాన్ని, సంతోషాన్ని కూడా సూచిస్తుంది” అని స్టడీస్‌ ఇన్‌ ది మొజాయిక్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ అనే పుస్తకం చెప్తుంది. కాబట్టి సమాధాన బలులు దేవుణ్ణి ఏదో మెత్తబర్చాలన్నట్లుగా ఆయనతో సమాధానం ఏర్పరచుకునేందుకు అర్పించబడేవి కాదుగానీ, ఆయన అనుగ్రహాన్ని పొందినవారు అనుభవించే ఆశీర్వాదకరమైన స్థితిరీత్యా సంతోషంగా పండుగ చేసుకునేందుకూ లేక కృతజ్ఞతను వ్యక్తపర్చడానికీ అర్పించబడేవి. రక్తాన్ని, క్రొవ్వును యెహోవాకు అర్పించిన తర్వాత యాజకులూ, అర్పించిన వ్యక్తీ బలి అర్పించబడిన దానిలో కొంత భాగాన్ని తీసుకునేవారు. (లేవీయకాండము 3:16; 7:16-21; 19:5-8) మనోహరమైన విధంగా సూచనార్థకమైన విధంగా చెప్పాలంటే, బలి అర్పించే వ్యక్తీ యాజకులూ యెహోవా దేవుడూ ఒకే భోజనంలో భాగం వహించేవారు, అది వారి మధ్యనున్న శాంతికరమైన సంబంధాన్ని సూచించేది.

16. (ఎ) పాపపరిహారార్థ, అపరాధ పరిహారార్థ బలుల సంకల్పమేమిటి? (బి) వాటికీ దహన బలికీ ఉన్న తేడా ఏమిటి?

16 పాప పరిహారార్థ బలులు, అపరాధ పరిహారార్థ బలుల్లో పాప క్షమాపణ కోసం అర్పించబడే బలులు లేదా ధర్మశాస్త్రానికి విరుద్ధంగా చేసిన పాపాల ప్రాయశ్చిత్తం కోసం అర్పించబడే బలులు ఇమిడి ఉన్నాయి. ఈ బలులను కూడా బలిపీఠం మీదనే దహించినప్పటికీ, వాటికీ దహన బలులకూ తేడా ఉంది, ఎందుకంటే వీటి విషయంలో మొత్తం జంతువు అంతా దేవునికి అర్పించబడేది కాదు, కేవలం క్రొవ్వు మరికొన్ని ఇతర భాగాలు మాత్రమే అర్పించబడేవి. మిగతా జంతువంతటినీ గుడారం వెలుపల పడవేయడమో లేక కొన్నిసార్లు యాజకులు తీసుకోవడమో జరిగేది. ఈ తేడా చాలా విశేషమైనది. దహన బలి దేవుడ్ని సమీపించడానికి ఒక కానుకగా అర్పించబడేది, కాబట్టి దాన్ని కేవలం దేవునికే మొత్తంగా అర్పించడం జరిగేది. ఆసక్తికరంగా, దహనబలికి ముందు పాపపరిహారార్థబలి లేదా అపరాధ పరిహారార్థబలి అర్పించబడేది, అది ఒక పాపి అర్పించే కానుకను దేవుడు స్వీకరించాలంటే పాప క్షమాపణ అవసరమని సూచించేది.—లేవీయకాండము 8:14, 18; 9:2, 3; 16:3, 5.

17, 18. పాపపరిహారార్థబలి దేని కోసం అర్పించబడేది, అపరాధ పరిహారార్థ బలుల ఉద్దేశమేమిటి?

17 పాప పరిహారార్థబలి ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా అసంకల్పితంగా చేసిన పాపాల కోసం అంటే శారీరక బలహీనత మూలంగా చేసిన పాపాల కోసం మాత్రమే అంగీకరించబడేది. “యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేని విషయమైనను ఎవరైన పొరబాటున చేయరాని కార్యములు చేసి పాపియైన యెడల,” ఆ పాపి సమాజంలో తన అంతస్థుకు, లేదా హోదాకు తగిన విధంగా పాప పరిహారార్థబలి అర్పించాలి. (లేవీయకాండము 4:2, 3, 22, 27) మరో వైపున, పశ్చాత్తాపపడని పాపులు కొట్టివేయబడేవారు; వారికి ఏ బలులూ అందుబాటులో లేవు.—నిర్గమకాండము 21:12-15; లేవీయకాండము 17:10; 20:2, 6, 10; సంఖ్యాకాండము 15:30,31; హెబ్రీయులు 2:2.

18లేవీయకాండము 5, 6 అధ్యాయాల్లో అపరాధ పరిహారార్థబలి భావమూ, ఉద్దేశమూ స్పష్టం చేయబడ్డాయి. ఒక వ్యక్తి అసంకల్పితంగా పాపం చేసి ఉండవచ్చు. అయినప్పటికీ, ఆయన చేసిన తప్పిదం తన తోటి మానవుడి లేక యెహోవా దేవుని హక్కులకు వ్యతిరేకంగా జరిగిన అపరాధమై ఉండవచ్చు, కాబట్టి ఆ తప్పును సవరించడం లేక సరిచేయడం అవసరం. వివిధ రకాలైన పాపాల గురించి ప్రస్తావించబడింది. కొన్ని వ్యక్తిగతమైన పాపాలు (5:2-6), కొన్ని “యెహోవాకు పరిశుద్ధమైన వాటి”కి వ్యతిరేకంగా చేసిన పాపాలు (5:14-16), మరికొన్ని పూర్తిగా అసంకల్పితమైనవే కాకపోయినప్పటికీ తప్పుడు కోరికలు లేదా శారీరక బలహీనతల ఫలితంగా చేసిన పాపాలై ఉండేవి (6:1-3). అలాంటి పాపాలను ఒప్పుకోవడమే గాక, అవసరమైనప్పుడు ఆ తప్పిదస్థుడు తగిన నష్టపరిహారం చెల్లించి చేసి యెహోవాకు అపరాధ పరిహారార్థ బలిని అర్పించాలి.—లేవీయకాండము 6:4-7.

మరింత శ్రేష్ఠమైనది రానైయుంది

19. ధర్మశాస్త్రమూ, బలులూ ఉన్నప్పటికీ, ఇశ్రాయేలు ఎందుకు దేవుని అనుగ్రహాన్ని పొందలేకపోయింది?

19 ధర్మశాస్త్రం ప్రకారం అనేక బలులు అర్పణలు అర్పించవలసి ఉంది, ఇశ్రాయేలీయులు దేవుడ్ని సమీపించి ఆయన అనుగ్రహాన్నీ ఆశీర్వాదాల్నీ పొంది వాటిని కాపాడుకునేందుకు వారికి ఈ ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఇలా వాగ్దత్త సంతానం వచ్చేంత వరకూ జరగాల్సివుంది. జన్మతః యూదుడైన అపొస్తలుడైన పౌలు దాన్నిలా వ్యక్తపరిచాడు: “మనము విశ్వాసమూలమున నీతిమంతులమని తీర్చబడునట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకు డాయెను.” (గలతీయులు 3:24) విచారకరంగా, ఇశ్రాయేలీయులు ఒక జనాంగంగా శిక్షణకు ప్రతిస్పందించలేదు కానీ ఆ ఆధిక్యతను దుర్వినియోగం చేశారు. తత్ఫలితంగా, వారు అర్పించిన లెక్కలేనన్ని బలులు యెహోవాకు అసహ్యమైపోయాయి, అందుకే ఆయనిలా అన్నాడు: “దహనబలులగు పొట్టేళ్లును బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయెను; కోడెల రక్తమందైనను గొఱ్ఱెపిల్లల రక్తమందైనను మేక పోతుల రక్తమందైనను నాకిష్టములేదు.”—యెషయా 1:11.

20. ధర్మశాస్త్రానికీ దాని బలులకూ సంబంధించి సా.శ. 70 లో ఏమి జరిగింది?

20 యూదా విధానమూ, దాని ఆలయమూ యాజకత్వమూ సా.శ. 70 లో ముగింపుకు వచ్చాయి. దాని తర్వాత, ధర్మశాస్త్రం కోరే విధంగా బలులను అర్పించడం ఇక సాధ్యం కాకుండా పోయింది. అయితే, ధర్మశాస్త్రంలో అంతర్గత భాగమై ఉన్న బలులు నేడు దేవుని ఆరాధకులకు పూర్తిగా అర్థరహితంగా మారిపోయాయని దానర్థమా? మనమీ విషయాన్ని తర్వాతి శీర్షికలో పరిశీలిద్దాము.

[అధస్సూచీలు]

^ పేరా 6 వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ప్రచురించిన లేఖనాలపై అంతర్దృష్టి (ఆంగ్లం) అనే పుస్తకం ఇలా వివరిస్తుంది: “బైబిలులో ఉపయోగించబడినట్లుగా, ‘పరిహారం’ అనే పదానికి ప్రాథమికంగా ‘కప్పివేయు’ లేక ‘మార్పిడి’ అనే తలంపు ఉంది. అంతేగాక ఆ పదానికి, దేనికైనా మారుగా ఇచ్చే వస్తువు, లేక దేన్నైనా ‘కప్పివేయడానికి’ ఉపయోగించే వస్తువు అనే తలంపు కూడా ఉంది. ఈ కప్పివేయు, మార్పిడి అనేవి, పరిహారానికి నకలు అయ్యుండాలి. . . . ఆదాము కోల్పోయినదానికి తగిన పరిహారాన్ని ఇచ్చేందుకు సరైన విలువగల పరిపూర్ణ మానవ జీవితాన్ని పాపపరిహారార్థ బలిగా అర్పించవలసిన అవసరం ఏర్పడింది.”

^ పేరా 11 ‘అర్పణలు’ అని తరచూ అనువదించబడే హెబ్రీ పదం కొర్బాన్‌. శాస్త్రులు పరిసయ్యులకున్న అతినిష్టాచారాన్ని ఖండిస్తూ యేసు అన్న మాటలను వ్రాసేటప్పుడు మార్కు “కొర్బాను” అంటే “దేవార్పితమని” వివరించాడు.—మార్కు 7:11, 12.

మీరు వివరించగలరా?

• యెహోవాకు బలులను అర్పించేందుకు ప్రాచీన కాలంనాటి నమ్మకమైన వ్యక్తులను ఏది పురికొల్పింది?

• బలులు ఎందుకు అవసరమయ్యాయి?

• ధర్మశాస్త్రం క్రింద ఏ ప్రాథమిక రకాలైన బలులు అర్పించబడేవి, వాటి సంకల్పాలేమిటి?

• పౌలు చెప్తున్నదాని ప్రకారం, ధర్మశాస్త్రమూ దాని బలులూ ఏ కీలకమైన సంకల్పాన్ని సాధించాయి?

[అధ్యయన ప్రశ్నలు]

[అధ్యయన ప్రశ్నలు]

[14వ పేజీలోని చిత్రం]

హేబెలు అర్పించిన బలి యెహోవాకు ప్రీతిపాత్రమైనది, యెహోవా చేసిన వాగ్దానమందు ఆయన విశ్వాసం అందులో వ్యక్తం కావడమే దానికి కారణం

[15వ పేజీలోని చిత్రం]

ఈ దృశ్యానికున్న ప్రాముఖ్యతను మీరు గుణగ్రహిస్తారా?