కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ద్వేషం అనే మహామారి

ద్వేషం అనే మహామారి

ద్వేషం అనే మహామారి

“ప్రజలు ఎవరినైతే ద్వేషిస్తారో వాళ్ళను ఎన్నడూ అర్థం చేసుకోరు.” —జేమ్స్‌ రస్సెల్‌ లోవెల్‌, వ్యాస రచయితా, దౌత్యవేత్తా.

ద్వేషం మన చుట్టూ ప్రబలి ఉన్నట్లు కనిపిస్తుంది. ఈస్ట్‌ టైమర్‌, కొసోవో, లైబీరియా, లిటిల్‌టన్‌, సారాయెవో వంటి స్థలాల పేర్లూ, అలాగే, నీయోనాజీ, స్కిన్‌హెడ్‌, వైట్‌ సుప్రీమసిస్ట్‌ వంటి కొన్ని గుంపుల పేర్లూ వినప్పుడు, దహనమైన గృహాలూ, సామూహిక సమాధులూ, మృత దేహాలూ గుర్తుకు వస్తాయి.

ద్వేషం, సంఘర్షణ, హింస లేని లోకాన్ని గురించి అనేకులు కన్న కలలు కల్లలయ్యాయి. మృతి పొందిన మునుపటి ఫ్రెంచ్‌ అధ్యక్షుని భార్య డాన్యెల్‌ మిట్టరాండ్‌, తన యౌవన కాలాన్ని గురించి గుర్తు చేసుకుంది. “స్వేచ్ఛగా తాము అందరినీ నమ్మగల సమాజంలో జీవించడాన్ని గురించి; తాము మనశ్శాంతితో ఉంటూ, ఇతరులతో సమాధానంగా ఉండడాన్ని గురించి; తమపై శ్రద్ధ చూపే బలమైన ఉదారమైన లోకంలో, ఆరోగ్యంగా శాంతియుతంగా హుందాగా జీవించడాన్ని గురించి ప్రజలు కలలు కన్నారు” అని ఆమె చెబుతుంది. ఆ కలలు ఏమయ్యాయి? “అర్ధ శతాబ్దం తర్వాత, మా కలలన్నీ కల్లలయిపోయాయని మేము ఒప్పుకోవలసిందే” అని అంటూ ఆమె తన విచారాన్ని తెలియజేసింది.

నేడు ద్వేషం మళ్ళీ తలెత్తడాన్ని తోసివేయలేము. అది చాలా వ్యాప్తి చెంది, చాలా ఘోరమైన రూపాల్లో ప్రత్యక్షమౌతోంది. అనేకులు భద్రతా భావాన్ని తేలిగ్గా తీసుకుంటూ వచ్చారు. కానీ, నేడు, ద్వేషంతో కూడిన చర్యల మూలంగా రాను రాను భద్రతా భావమనేది లేకుండా పోతోంది. ద్వేషంతో కూడిన భయంకర చర్యలు రోజురోజుకీ మరింత దారుణమౌతున్నాయి. ఒక వేళ మనం మన ఇంట్లోగానీ, మన దేశంలో గానీ ద్వేషానికి గురికాకపోయినా, ఇతర ప్రాంతాల్లో ద్వేషం పొంచివుంది. ప్రతిరోజూ, టీవీలో వచ్చే వార్తల్లోను, ప్రస్తుత సంఘటనలను గురించిన ప్రత్యేక ప్రసారాల్లోను దాని రుజువులను చూస్తుంటాం. ద్వేషం ఇంటర్‌నెట్‌ వరకూ కూడా వ్యాప్తి చెందింది. కొన్ని ఉదాహరణలను చూద్దాం.

మునుపెన్నడూ లేనంతటి జాతీయతావాదం గత దశాబ్దంలో కనిపించింది. “ప్రపంచంలోని అధిక భాగంలో, జాతీయతావాదం అంతకంతకూ బలీయమౌతుందే గానీ బలహీనం కావడంలేదు. భూగోళమంతా ఒక గ్రామంగా దృష్టించబడే బదులు, అనేక గ్రామాలుగా దృష్టించి, వాటిని అంతకంతకూ వేర్వేరుగానే గుర్తిస్తున్నారు. ఆ విధంగా, సంఘర్షణలు చెలరేగే అవకాశాలు పెరిగిపోతున్నాయి” అని హార్వార్డ్‌ సెంటర్‌ ఫర్‌ ఇంటర్‌నేషనల్‌ అఫైర్స్‌ డైరెక్టరైన జోసెఫ్‌ ఎస్‌. నై జూనియర్‌ అంటున్నారు.

ఇతర రూపాల్లోని ద్వేషం అంత ఎక్కువగా బయటికి కనిపించదు, ఒక దేశపు సరిహద్దుల్లోనే లేదా పొరుగుప్రాంతాల సరిహద్దుల్లోనే అది దాగి ఉంటుంది. కెనడాలో, ఐదుగురు స్కిన్‌హెడ్‌లు కలిసి పెద్దవయస్కుడైన ఒక సిక్కు మతస్థుడిని చంపారు. ఈ సంఘటన, “పరజాతి సహనం ఎంతో ఉన్న దేశంగా తరచూ ప్రశంసలనందుకునే ఈ దేశంలో ద్వేషంతో కూడిన నేరాలు మళ్ళీ తలెత్తాయన్న విషయాన్ని నొక్కిచెబుతుంది.” వర్గ ద్వేషంతో కూడిన తీవ్రవాదుల దాడులు గత సంవత్సరాల్లో జర్మనీలో నెమ్మదిగా తగ్గినప్పటికీ, 1997 లో 27 శాతం పెరిగినట్లు కనిపించింది. “ఈ పరిణామం నిరుత్సాహజనకంగా ఉంది” అని ఆంతరంగిక వ్యవహారాల శాఖ మంత్రియైన మాన్‌ఫ్రేట్‌ కాంట అన్నారు.

ఉత్తర అల్బేనియాలో, తమ కుటుంబ శత్రువులు తమను ఎక్కడ కాల్చి చంపుతారోనన్న భయంతో, 6,000 కన్నా ఎక్కువ మంది పిల్లలు, తమ ఇండ్ల నుండి బయటికి రాకుండా జైళ్ళలో ఉన్నట్లుగా ఉన్నారని ఒక నివేదిక వెల్లడి చేసింది. తరతరాలుగా తమ కుటుంబాల మధ్య ఉన్న పగకు ఈ పిల్లలు ఎరవుతున్నారు. ఇలాంటి పగ, “వేలాది కుటుంబాల జీవితాలకు విఘాతం కలిగించింది.” ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్‌.బి.ఐ) మాటల్లో చెప్పాలంటే, అమెరికాలో, “1998 లో 7,755 ద్వేషపూరిత నేరాలు జరిగినట్లు ఎఫ్‌.బి.ఐ.కి నివేదించబడింది. ఆ నేరాల్లో సగానికి సగానికి పురికొల్పునిచ్చింది వర్గ సంబంధమైన అకారణ దురభిప్రాయమే.” మిగతా ద్వేషపూరిత నేరాలను పురికొల్పిన కారకాల్లో కొన్ని: మతాన్ని గురించిన; వర్గ లేదా జాతి ఆవిర్భావానికి సంబంధించిన; వైకల్యాలకు సంబంధించిన అకారణమైన దురభిప్రాయాలే.

అంతేకాక, విదేశీయులన్నా, అపరిచితులన్నా భయమూ ద్వేషమూ ఒక మహామారిగా వ్యాప్తి చెంది ఉన్నాయన్న విషయాన్ని వార్తాపత్రికల్లోని శీర్షికలు ప్రతిరోజూ తెలియజేస్తూనే ఉన్నాయి. ఇలాంటి ద్వేషం ప్రథమంగా శరణార్థులపైన చూపబడుతోంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల 10 లక్షల కన్నా ఎక్కువ మంది ప్రజలు శరణార్థులుగా ఉన్నారు. విదేశీయులపై ద్వేషాన్ని వ్యక్తం చేసే వారిలో అధిక సంఖ్యాకులు యౌవనస్థులేనన్నది విచారకరమైన విషయం. ఈ యౌవనస్థులను రెచ్చగొడుతున్నది బాధ్యత లేని రాజకీయవేత్తలూ, ఎవరిని బలిపశువులుగా చేయాలా అని చూసే ఇతరులూనే. ద్వేషం అంత స్పష్టంగా పైకి కనిపించని రూపాల్లో అపనమ్మకమూ, అసహనమూ, తమ నుండి భిన్నమైనవారు ఫలాని కోవకు చెందినవారని ముద్రవేయడమూ చేరి ఉన్నాయి.

ద్వేషం అనే ఈ మహామారి పుట్టడానికి గల కొన్ని కారణాలు ఏమిటి? ద్వేషాన్ని నిర్మూలించేందుకు ఏమి చేయవచ్చు? తర్వాతి శీర్షిక ఈ ప్రశ్నలను చర్చిస్తుంది.

[Picture Credit Line on page 2]

Cover, top: UN PHOTO 186705/​J. Isaac

[3వ పేజీలోని చిత్రసౌజన్యం]

Daud/Sipa Press