కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ద్వేషాన్ని నిర్మూలించే ఏకైక మార్గం

ద్వేషాన్ని నిర్మూలించే ఏకైక మార్గం

ద్వేషాన్ని నిర్మూలించే ఏకైక మార్గం

“భయం లేకపోతే ద్వేషం లేదు. . . . మనం దేని గురించి భయపడతామో దాన్ని ద్వేషిస్తాము, కనుక, ఎక్కడైతే ద్వేషముందో, అక్కడ భయం దాగివుంది.” —సాహిత్య విమర్శకుడూ సంపాదకుడూ అయిన సిరల్‌ కానలీ.

మానవ మనస్సులోని అచేతన భాగంలో ద్వేషం బాగా లోతుగా వేరుపారి ఉందని అనేకమంది సామాజికశాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. “ద్వేషంలో చాలా మట్టుకు మానవునిలో ప్రోగ్రామ్‌ అయి ఉండవచ్చనీ” అలా అది మానవుని స్వభావంలో భాగంగా మారి ఉంటుందనీ ఒక రాజకీయ శాస్త్రవేత్త అంటున్నాడు.

మానవ స్వభావాన్ని అధ్యయనం చేసే సామాజికశాస్త్రవేత్తలు అలాంటి నిర్ధారణలకు ఎందుకు వస్తున్నారన్నది అర్థం చేసుకోగల విషయమే. బైబిలు మాటల్లో చెబితే, “పాపములో పుట్టిన” స్త్రీపురుషులే వాళ్ళ అధ్యయన అంశాలు. (కీర్తన 51:5.) సహస్రాబ్దాల పూర్వం, అపరిపూర్ణ మానవులను మదింపు చేసేందుకు సృష్టికర్త వారిని పరిశీలించినప్పుడు, “నరుల చెడుతనము భూమిమీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు” చూశాడు.—ఆదికాండము 6:5.

నిర్హేతుకమైన దురభిప్రాయం, జాతి విచక్షణ, వాటి ఫలితమైన ద్వేషం అనేవి మానవునిలో అంతర్లీనమై ఉన్న అపరిపూర్ణత వల్లా, స్వార్థం వల్లా కలిగాయి. (ద్వితీయోపదేశకాండము 32:5) విచారకరంగా, ఏ మానవ సంస్థ గానీ, ప్రభుత్వం గానీ, ఎటువంటి కార్యాచరణ విధానం అనుసరించినప్పటికీ, ఇలాంటి విషయాలపై మానవుని హృదయంలో ఎటువంటి మార్పునూ తీసుకురాలేకపోయింది. “ఏ అధికారమైనా, అది ఎంత శక్తివంతంగా ఉన్నా బోస్నియాను, సొమాలియాను, లైబీరియాను, కాశ్మీరును, కాకాసస్‌ ప్రాంతాన్ని రక్తపంకిలం చేసిన ద్వేషాన్ని నిర్మూలం చేయలేదు” అని విదేశీ కరెస్పాండెంట్‌ జోహన్న మెక్‌గిరీ అన్నారు.

అయినప్పటికీ, మనం పరిష్కారాల కోసం చూసే ముందు, ప్రజలు ఇలా ద్వేషం కనబరచడానికి కారణం ఏమిటన్నది అవగాహన చేసుకోవలసిన అవసరం ఉంది.

భయం మూలంగా కలిగిన ద్వేషం

ద్వేషం అనేక రూపాల్లో అనేక ఛాయల్లో కనిపిస్తుంది. రచయితయైన ఆండ్రూ సులివన్‌ ఈ విషయాన్ని చాలా క్లుప్తంగా చక్కగా చెప్పాడు. “భయపడే ద్వేషముంది, తిరస్కరించబడినట్లు భావించే ద్వేషముంది; అధికారాన్ని చూపించే ద్వేషముంది, అధికారం లేకపోవడం వల్ల కలిగే ద్వేషముంది; అసూయ నుండి వచ్చే కక్షా, ద్వేషమూ కూడా ఉన్నాయి. . . . అణచివేసేవాని ద్వేషమూ, అణచివేతకు గురయ్యేవాడి ద్వేషమూ ఉన్నాయి. నెమ్మదిగా రగులుకునే ద్వేషముంది, నెమ్మదిగా ఆరిపోయే ద్వేషముంది. క్రియల ద్వారా ప్రదర్శించబడే ద్వేషముంది, అలా ప్రదర్శించబడని ద్వేషముంది” అని ఆయన అన్నారు.

మన కాలాల్లో, ద్వేషపూరిత సంఘర్షణలను కలిగించే ముఖ్య కారకాల్లో కొన్ని సామాజికమైనవి, కొన్ని ఆర్థికమైనవి. ఎక్కడైతే అల్పసంఖ్యాక వర్గానికి చెందిన సముదాయం ఆర్థికంగా మంచి హోదాలో ఉందో అక్కడ, నిర్హేతుకమైన బలీయమైన దురభిప్రాయాలూ, ద్వేష వ్యక్తీకరణలూ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎక్కడైతే, సమాజంలోని ఒక భాగానికి చెందిన ప్రజల జీవనస్థాయికి విదేశీయుల రాక మూలంగా ముప్పువాటిల్లుతుందని తలంచబడుతుందో అక్కడ కూడా ద్వేషం కనిపిస్తుంది.

ఇలా క్రొత్తగా వచ్చేవాళ్ళు, తక్కువ జీతానికి పనిచేస్తూ ఉద్యోగాల కోసం పోటీపడతారని లేదా, క్రొత్తవాళ్ళ రాకవల్ల తమ ఆస్తుల విలువ తగ్గిపోతుందని కొందరు అనుకుంటారు. అలాంటి భయాలు న్యాయసమ్మతమైనవేనా కాదా అన్నది వేరే విషయం. ఏది ఏమైనప్పటికీ, ఆర్థిక నష్టం జరుగుతుందేమోనన్న భయమూ, సమాజ ప్రమాణం లేదా జీవన శైలి దెబ్బతింటుందన్న భయమూ నిర్హేతుకమైన దురభిప్రాయాలనూ ద్వేషాన్నీ పుట్టించే శక్తివంతమైన కారకాలుగా ఉన్నాయి.

ద్వేషాన్ని నిర్మూలించడంలో మొదటగా తీసుకోవలసిన చర్య ఏమిటి? దృక్పథాలను మార్చుకోవడం.

దృక్పథాలు మారుతున్నాయి

“సంబంధిత వ్యక్తుల దృక్పథం మారినప్పుడు మాత్రమే నిజమైన మార్పు అనేది జరుగుతుంది” అని మెక్‌గరీ అంటున్నారు. ప్రజల దృక్పథం ఎలా మారుతుంది? ద్వేషం పెంపొందడాన్ని నివారించే అత్యంత శక్తివంతమైన, అత్యంత ప్రేరణాత్మకమైన, శాశ్వత కాల ప్రభావం దేవుని వాక్యమైన బైబిలుకుంది. ఎందుకంటే, “దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది.”—హెబ్రీయులు 4:12.

నిర్హేతుకమైన దురభిప్రాయాన్నీ, ద్వేషాన్నీ కూకటి వేళ్ళతో పెకిలించడం అనేది దానంతటదే జరిగేదీ కాదు, ఒక రాత్రికి రాత్రే సంభవించేదీ కాదు. కానీ దాన్ని పెకిలించవచ్చు. హృదయాలకు అత్యధికంగా పురికొల్పునిచ్చేవాడూ, మనస్సాక్షిని ప్రతిస్పందింపజేసేవాడూ అయిన యేసుక్రీస్తు, ప్రజలను మార్చగల్గాడు. “మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థనచేయుడి” అని ఆయన ఇచ్చిన వివేకవంతమైన ఉపదేశాన్ని అనుసరించడంలో లక్షలాది మంది సఫలీకృతులయ్యారు.—మత్తయి 5:44.

మునుపు సుంకరిగా ఉండిన మత్తయి విషయమే తీసుకుందాం. మత్తయిని యూదా సమాజం ద్వేషించి, తనతో సహవసించనివ్వ లేదు. అయితే, యేసు తన బోధలకు అనుగుణ్యంగా, అత్యంత నమ్మకస్థులైన తన స్నేహితుల గుంపులో మత్తయిని చేర్చుకున్నాడు. (మత్తయి 9:9; 11:19) అంతేకాక, యూదులు ద్వేషించి తమతో కలుపుకోని అన్యులకు చెందిన వేలాదిమందిని తనతో చేర్చుకునే ఒక స్వచ్ఛారాధనా విధానాన్ని ఏర్పరచాడు. (గలతీయులు 3:28) అప్పట్లో తెలిసిన ప్రపంచంలోని పలు ప్రాంతాల్లోని ప్రజలు యేసుక్రీస్తు అనుచరులయ్యారు. (అపొస్తలుల కార్యములు 10:34, 35) ఈ వ్యక్తులు తమ మెండైన ప్రేమకు పేరుగాంచారు. (యోహాను 13:35) మనస్సు నిండా ద్వేషాన్ని నింపుకున్న పురుషులు, యేసు శిష్యుడైన స్తెఫనును రాళ్ళతో కొట్టి చంపుతున్నప్పుడు, ఆ శిష్యుడు చెప్పిన చివరి మాటలు: “ప్రభువా, వారిమీద ఈ పాపము మోపకు.” అవును, ఆ శిష్యుడు తనను ద్వేషించినవారి శ్రేయస్సునే కోరుకున్నాడు.—అపొస్తలుల కార్యములు 6:8-14; 7:54-60.

తమ క్రైస్తవ సహోదరులకు మాత్రమే కాక, తమను ద్వేషించేవారికి కూడా మంచిని చేయమని యేసు ఇచ్చిన ఉపదేశానికి ఆధునిక కాలాల్లోని నిజ క్రైస్తవులు కూడా ప్రతిస్పందించారు. (గలతీయులు 6:10) తమ జీవితాల్లో విధ్వంసకరమైన ద్వేషానికి తావుండకుండా ఉండేందుకు వాళ్ళు శ్రమిస్తారు. తమ హృదయాంతరంలో ద్వేషాన్ని పుట్టించగల శక్తివంతమైన కారకాలను గుర్తించి వాటిని తప్పించుకునేందుకు తగిన చర్య తీసుకుంటూ ఇతరులను ద్వేషించే బదులు ప్రేమిస్తారు. అవును ప్రాచీనకాలానికి చెందిన ఒక జ్ఞాని, “పగ కలహమును రేపును ప్రేమ దోషములన్నిటిని కప్పును” అని అన్నాడు.—సామెతలు 10:12.

“తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు; ఏ నరహంతకునియందును నిత్యజీవముండదని మీరెరుగుదురు” అని అపొస్తలుడైన యోహాను అన్నాడు. (1 యోహాను 3:15) యెహోవాసాక్షులు ఈ మాటలను నమ్ముతారు. కనుకనే, వాళ్ళు అన్ని వర్గాల, సంస్కృతుల, మతాల, రాజకీయాల నేపథ్యాలనుండి వచ్చి, ద్వేషం లేని సమాజంగా ఏకమైన, భూగోళవ్యాప్త సహోదర సమూహంగా రూపొందారు.—వీటితోపాటు ఉన్న బాక్సులను చూడండి.

ద్వేషం నిర్మూలించబడుతుంది!

‘వ్యక్తులు తమ దృక్పథాన్ని మార్చుకుంటే అది వారికి మంచిది. కానీ, ఇది మన భూమిమీద ఉన్న ద్వేషాన్ని పూర్తిగా రూపమాపలేదు’ అని మీరనవచ్చు. నిజమే, మీ హృదయంలో ద్వేషం లేకపోయినప్పటికీ, మీరు ద్వేషానికి ఎర కావచ్చు. కనుక, భూగోళవ్యాప్తమైన ఈ సమస్య పరిష్కారం కోసం మనం దేవుని వైపు చూడవలసిందే.

ద్వేషం జాడలు ఏ మాత్రం కన్పించకుండా ఉండేలా త్వరలోనే దాన్ని భూమిమీది నుండి తీసివేయాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడు. “పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక; నీ రాజ్యము వచ్చుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక” అని ఏ రాజ్యాన్ని గురించి ప్రార్థించమని యేసు మనకు బోధించాడో ఆ పరలోక రాజ్య పరిపాలన క్రింద అది జరుగుతుంది.—మత్తయి 6:9, 10.

ఈ ప్రార్థనకు పూర్తిగా జవాబివ్వబడినప్పుడు, ద్వేషానికి దోహదపడే పరిస్థితులేవీ ఇక ఉండవు. ప్రజలు తమ స్వప్రయోజనం కోసం ద్వేషాన్ని ఉపయోగించుకునే పరిస్థితులు కూడా ఇక ఉండవు. దుష్ప్రచారం, అజ్ఞానం, నిర్హేతుకమైన దురభిప్రాయం మొదలైనవాటి స్థానంలో, అవగాహన, సత్యం, నీతి అనేవి చోటు చేసుకుంటాయి. నిజానికి, అప్పుడు, దేవుడు, ప్రజల “కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు.”—ప్రకటన 21:1-4.

ఇప్పుడు ఇంకా గొప్ప వార్త ఉంది! మనం “అంత్య దినములలో” జీవిస్తున్నామనే దానికి ఖండించలేని రుజువులు ఉన్నాయి. కనుక, దైవభక్తికి విరుద్ధమైన ద్వేషం ఈ భూమి మీద లేకుండా పోవడాన్ని మనం త్వరలో చూస్తామన్న నమ్మకంతో ఉండగలం. (2 తిమోతి 3:1-5; మత్తయి 24:3-14) దేవుడు వాగ్దానం చేసిన క్రొత్త లోకంలో, మానవజాతి పరిపూర్ణతను తిరిగి పొందుతుంది కనుక, అక్కడ, యథార్థ సహోదరత్వ స్ఫూర్తి ఉంటుంది.—లూకా 23:43; 2 పేతురు 3:13.

నిజమైన సహోదరత్వాన్ని అనుభవించేందుకు, మీరు అప్పటి వరకు వేచివుండవలసిన అవసరం లేదు. వాస్తవానికి, దీనితోపాటు ఇవ్వబడిన వృత్తాంతాల్లో తెలియజేయబడినట్లు, లక్షలాది మంది హృదయాలు ద్వేషంతో నిండి వుండే బదులు, ఇప్పటికే ప్రేమతో నిండివున్నట్లు కనిపిస్తుంది. ఆ ప్రేమపూర్వక సహోదరత్వంలో మీరు కూడా భాగం కావాలని ఆహ్వానిస్తున్నాం!

[5వ పేజీలోని బాక్సు]

“యేసైతే ఏమి చేసి ఉంటాడు?”

1998 జూన్‌ నెలలో, అమెరికాలోని, టెక్సాస్‌లోని ఒక గ్రామంలో, జేమ్స్‌ బర్డ్‌ జూనియర్‌ అనే నీగ్రో వ్యక్తిపై ముగ్గురు శ్వేతజాతివారు దాడి చేశారు. వాళ్ళు ఆయనను, నిర్జనంగా ఉన్న మారుమూల ప్రాంతానికి తీసుకువెళ్ళి బాగా కొట్టి, సంకెళ్ళతో అతని కాళ్ళను కలిపి బంధించి, ఆయనను ఒక ట్రక్కు వెనకాల తగిలించారు. ఆ ట్రక్కు ఆయనను ఈడ్చుకుంటూ వెళ్ళింది. అలా ఐదు కిలోమీటర్ల దూరం వెళ్ళాక, ఆయన శరీరం డ్రైనేజ్‌ పైపుకు బలంగా గుద్దుకుంది. ఆ కృత్యం, ఆ దశకంలో (1990లలో) జరిగిన అత్యంత భయంకరమైన ద్వేషపూరిత నేరం అని చెప్పుకోబడుతోంది.

జేమ్స్‌ బర్డ్‌ యొక్క ముగ్గురు సహోదరీలు యెహోవాసాక్షులు. ఈ భయంకరమైన నేరాన్ని చేసినవారిని గురించి ఈ సహోదరీలు ఎలా భావిస్తున్నారు? “ఎంతో ప్రియమైనవాడు పీడించబడి, చట్టవిరుద్ధంగా చంపబడినప్పుడు కలిగిన వేదనా, ఆయనను కోల్పోయిన భావనా అంతా ఇంతా కాదు. సాధారణంగా అలాంటి క్రూరకృత్యానికి ఒకవ్యక్తి ఎలా ప్రతిస్పందిస్తాడు? ప్రతీకారం తీర్చుకోవాలని గానీ, ద్వేషాన్ని వెళ్ళగ్రక్కుతూ మాట్లాడాలని గానీ, దుష్ప్రచారం చేయాలన్న తలంపు గానీ మా మనస్సుల్లోకి ఎన్నడూ రాలేదు. ‘యేసైతే ఏమి చేసి ఉంటాడు? ఆయన ఎలా స్పందించి ఉంటాడు?’ అని ఆలోచించుకున్నాం. దాని జవాబు హృదయ ఫలకంపై తేటతెల్లంగా కనిపించింది. శాంతీ, నిరీక్షణ అన్నవే ఆయన సందేశాలు అయ్యుండవచ్చు” అని వాళ్ళు ఒక సంయుక్త ప్రకటనలో అన్నారు.

వాళ్ళ మనస్సుల్లో, ద్వేషం రగులుకోకుండా ఉండేందుకు వాళ్ళకు సహాయపడిన లేఖనాలు రోమీయులు 12:17-19. “కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు; . . . శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగతీర్చుకొనక, దేవుని ఉగ్రతకు చోటియ్యుడి—పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి యున్నది” అని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు.

“ఎవరైనా మనకు వ్యతిరేకంగా ఎంతో క్రూరంగా ప్రవర్తించి మనకు అన్యాయం చేసినప్పుడు లేదా నేరాలు చేసినప్పుడు, ‘నిన్ను క్షమిస్తున్నాను,’ అని చెప్పి వాళ్ళు చేసిందంతా మరిచిపోవడం ఎంతో కష్టమని మా పత్రికల్లో వచ్చిన వాస్తవికమైన వ్యాఖ్యానాల్ని మేము గుర్తుచేసుకున్నాం. అలాంటి సందర్భాల్లో, క్షమించడమంటే, మనం మనస్సులో కోపాన్నుంచుకోకుండా, మునుపటిలా ముందుకు సాగడమే. మనస్సులో కోపాన్నుంచుకోవడం వల్ల కలిగే శారీరక, మానసిక అనారోగ్యాలను కొనితెచ్చుకోకపోవడమే” అని కూడా ఆ సహోదరీలు అన్నారు. హృదయంలో ద్వేషం వేళ్ళూనుకోవడాన్ని నివారించేంతటి శక్తి బైబిలుకుందని చూపించే ఎంత చక్కని సాక్ష్యమిది!

[6వ పేజీలోని బాక్సు]

వైరము స్నేహముగా మారింది

ఇటీవలి సంవత్సరాల్లో వేలాదిమంది, పని కోసం వెదుక్కుంటూ గ్రీసుకు వలసవెళ్ళారు. గ్రీసులో కూడా ఆర్థిక పరిస్థితులు దిగజారుతూ ఉన్నందున, అక్కడ కూడా ఉద్యోగ అవకాశాలు తగ్గాయి, దాంతో ఉద్యోగం కొరకైన పోరాటం మరింత తీవ్రతరమైంది. పర్యవసానంగా, వివిధ వర్గాలవారి మధ్య గొప్ప వైరం ఏర్పడింది. అల్బేనియా నుండి వలసవచ్చిన వాళ్ళకీ, బల్గేరియా నుండి వలసవచ్చినవాళ్ళకీ మధ్యగల పోటీతత్వం దానికొక ఉదాహరణ. గ్రీసులోని అనేక ప్రాంతాల్లో, ఈ రెండు సముదాయాల ప్రజల మధ్యన పోటీ తీవ్రంగా ఉంది.

ఈశాన్య పెలోపొనిసస్‌లోని కియాటో పట్టణంలో, బల్గేరియాకు చెందిన ఒక కుటుంబమూ, అల్బేనియాకు చెందిన ఒక వ్యక్తీ యెహోవాసాక్షులతో బైబిలు పఠించనారంభించాక, ఒకరినొకరు తెలుసుకున్నారు. బైబిలు సూత్రాలను ఆచరణలో పెట్టినప్పుడు, ఈ రెండు సముదాయాలకు చెందిన అనేకుల మనస్సుల్లో సాధారణంగా ఉండేబద్ధ శత్రుత్వం అనే మంచుకొండ వీరి విషయంలో పూర్తిగా కరిగి పోయింది. ఈ వ్యక్తుల మధ్య నిజమైన సహోదర భావంతో కూడిన స్నేహం కూడా ఏర్పడింది. బల్గేరియాకు చెందిన ఈవాన్‌, అల్బేనియా వాడైన లూలిస్‌ కోసం తన పక్కింటిని చూసి పెట్టాడు కూడా. ఇప్పుడు ఈ రెండు కుటుంబాలూ ఆహారపదార్థాలనూ, తమకున్న మరితర భౌతిక విషయాలను కొన్నింటినీ పంచుకుంటుంటారు. వీళ్ళిద్దరూ ఇప్పుడు బాప్తిస్మం పొందిన యెహోవాసాక్షులు. వీళ్ళు సువార్తను ప్రకటించడంలో ఒకరికొకరు చక్కగా సహకరించుకుంటారు. ఈ క్రైస్తవ స్నేహాన్ని పొరుగువారు గమనించారన్నది ఇక చెప్పనవసరం లేదు.

[7వ పేజీలోని చిత్రం]

దేవుని రాజ్యం క్రింద ద్వేషం ఇక ఎంతమాత్రం ఉండదు