“కుదురుబాటు కాలములు” త్వరలో రానైవున్నాయి!
“కుదురుబాటు కాలములు” త్వరలో రానైవున్నాయి!
యేసు పరలోకానికి ఆరోహణమై వెళ్లే ముందు, ఆయన నమ్మకమైన శిష్యుల్లో కొందరు, “ప్రభువా, యీ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరల అనుగ్రహించెదవా?” అని అడిగారు. అయితే, ఆ రాజ్యం రావడానికి కొంత సమయం పడుతుందని యేసు ఇచ్చిన సమాధానం సూచించింది. ఆ సమయంలో, ఆయన అనుచరులకు చేయటానికి ఎంతో పనివుంటుంది. వాళ్లు “యెరూషలేములోను, యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకు” సాక్ష్యమివ్వాలి.—అపొస్తలుల కార్యములు 1:6-8.
ఆనియమకాన్ని నెరవేర్చటానికి కొన్ని రోజులు, వారాలు, లేక నెలలు సరిపోవు. అయితే శిష్యులు ఏమాత్రం సంకోచించకుండా ప్రకటించడం మొదలుపెట్టారు. కానీ వాళ్లు రాజ్యం మరల అనుగ్రహించబడే కాలము పట్ల ఆసక్తిని కోల్పోలేదు. యెరూషలేములో సమకూడిన పెద్ద సమూహానికి ఆ విషయాన్ని గురించి చెబుతూ, అపొస్తలుడైన పేతురు ఇలా అన్నాడు: “[యెహోవా] సముఖమునుండి విశ్రాంతికాలములు వచ్చునట్లును మీకొరకు నియమించిన క్రీస్తుయేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారుమనస్సునొంది తిరుగుడి. అన్నిటికి కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆదినుండి తన పరిశుద్ధ ప్రవక్తలనోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసియైయుండుట ఆవశ్యకము.” (ఇటాలిక్కులు మావి.)—అపొస్తలుల కార్యములు 3:19-21.
ఈ “కుదురుబాటు కాలములు” యెహోవా సముఖము నుండి “విశ్రాంతికాలముల”ను తీసుకువస్తాయి. ప్రవచింపబడిన కుదురుబాటు రెండు దశల్లో వస్తుంది. మొదటిది, ఉపశమనాన్నిచ్చే ఆధ్యాత్మిక కుదురుబాటు, అదిప్పుడు జరుగుతోంది. రెండవది, ఈ భూమిపై అక్షరార్థ పరదైసును స్థాపించినప్పుడు ఏర్పడుతుంది.
కుదురుబాటు కాలము ప్రారంభం
యెరూషలేములోని ఆ సమూహాన్ని ఉద్దేశించి అపొస్తలుడైన పేతురు మాట్లాడినప్పుడు వారికాయన చెప్పినట్లుగానే, “యేసు పరలోక నివాసియై” ఉన్నాడు. యేసు రాజ్యాధికారాన్ని పొంది దేవుని నియుక్త రాజుగా పరిపాలన ప్రారంభించేంత వరకు, అంటే 1914వ సంవత్సరం వరకు పరలోకంలో నివసించవలసివుంది. దేవుడు తన సంకల్పాల నెరవేర్పులో కీలకమైన పాత్రను నిర్వర్తించేందుకు యేసును అనుమతించాడన్న భావంలో ఆయన్ను ఆ సంవత్సరంలో ‘పంపించాడు.’ ఈ సంఘటనను బైబిలు సూచనార్థక భాషలో వర్ణిస్తుంది: ‘సమస్త జనములను ఇనుపదండముతో ఏలనైయున్న యొక మగశిశువును [అంటే, యేసుక్రీస్తు చేతుల్లోవున్న దేవుని రాజ్యమును] ఆమె [అంటే, దేవుని పరలోక సంస్థ] కన్నది.’—ప్రకటన 12:5.
కానీ క్రీస్తు పరిపాలనాధికారానికి తలొగ్గాలన్న ఉద్దేశం ఈ లోకంలోని దేశాలకు ఏమాత్రం లేదు. నిజానికి, ఆ రాజ్యం క్రింద ప్రజలుగా ఉన్న యెహోవాసాక్షులపై ఆ జనాంగాలు విరుచుకుపడ్డాయి. అపొస్తలుల వలెనే ఈ సాక్షులు ఏమాత్రం సంకోచించకుండా “యేసును గూర్చి సాక్ష్యమిచ్చు” పనిని చేపట్టారు. (ప్రకటన 12:17) ఈ యథార్థవంతులైన క్రైస్తవులు చేసే పనికి వ్యతిరేకత ఒక దేశం తర్వాత మరొక దేశంలో తలెత్తింది. 1918 లో న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో ఉన్న వాచ్ టవర్ సొసైటీ ముఖ్యకార్యాలయంలోని బాధ్యతగల సభ్యులపై అబద్ధపు అభియోగాల్ని మోపి వారిని కోర్టుకీడ్చి సుదీర్ఘమైన జైలు శిక్షలను విధించారు. ఆధునిక దినాల్లో “భూదిగంతముల వరకు” సాక్ష్యమిచ్చే పని విఫలం కానున్నదేమోనని కొంతకాలంపాటు అన్పించింది.—ప్రకటన 11:7-10.
అయితే, ఖైదు చేయబడిన ముఖ్యకార్యాలయపు సిబ్బంది 1919 లో విడుదల చేయబడ్డారు. అటుతర్వాత వారిపైన ఉన్న అబద్ధ ఆరోపణలన్నింటినీ తీసివేయడం జరిగింది. ఆధ్యాత్మిక భావంలో తిరిగి కుదురుబాటును చేసే పనిని సహోదరులు ఏమాత్రం ఆలస్యం చేయలేదు. అప్పటినుండి, యెహోవా ప్రజలు అపూర్వమైన ఆధ్యాత్మిక పురోభివృద్ధిని అనుభవిస్తున్నారు.
క్రీస్తు బోధించినవి అన్ని జనాంగాల వారికీ నేర్పించటానికి విస్తృతమైన ప్రకటనా కార్యకలాపాల్ని చేపట్టారు. (మత్తయి 28:20) ఒకప్పుడు జంతువుల్లాంటి లక్షణాల్ని ప్రదర్శించిన కొందరు తమ దృక్పథాల్ని మార్చుకోవడం చూస్తుంటే ఎంత ఉపశమనంగా ఉందో కదా! వారు “కోపము” “దూషణ” “బూతులు” వంటి లక్షణాల్ని ఉత్పత్తిచేసే తమ పాత వ్యక్తిత్వాన్ని పూర్తిగా తీసివేసుకుని, నూతన స్వభావాన్ని—అంటే, “జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించినవాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న” నూతన వ్యక్తిత్వాన్ని ధరించుకొన్నారు.—కొలొస్సయులు 3:8-10; యెషయా 11:6, 9.
మరిన్ని కుదురుబాటు కాలములు దగ్గర్లోనే!
ఒక ఆధ్యాత్మిక పరదైసును ఉత్పత్తి చేసిన కుదురుబాటుకు తోడు, మన భూగ్రహం నిజంగానే అక్షరార్థంగా పరదైసుగా మారిపోయే సమయం చాలా త్వరగా సమీపిస్తుంది. యెహోవా మన పూర్వికులైన ఆదాము హవ్వల్ని ఏదెను తోటలో ఉంచినప్పుడు అది భూమ్మీది ఒక చిన్న భాగంగా మాత్రమే ఉండేది. (ఆదికాండము 1:29-31) అందుకనే మనం పరదైసు పునఃస్థాపించబడుతోందని మాట్లాడగలము. కానీ అది జరగడానికి ముందు ఈ భూమి మీది నుండి దేవుణ్ణి అగౌరవపర్చే అబద్ధమతం నిర్మూలించబడాలి. దాని పని ఈ లోకంలోని రాజకీయ శక్తులు చూసుకుంటాయి. (ప్రకటన 17:15-18) అప్పుడు, రాజకీయ, వాణిజ్య రంగాలూ వాటి మద్దతుదారులూ నాశనం చేయబడతారు. చివరికి, దేవుని శత్రువుల్లో చివరివారైన సాతాను వాని దయ్యాలూ ఒక వెయ్యి సంవత్సరాలపాటు పరదైసు పునఃస్థాపనా పని జరిగేంతవరకు బంధించబడతారు. ఆ సమయంలో “అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును అడవి ఉల్లసించి కస్తూరిపుష్పమువలె పూయును.” (యెషయా 35:1) భూమంతా ఎటువంటి కల్లోలాలు లేకుండా ఉంటుంది. (యెషయా 14:7) మృతులైన కోట్లాదిమంది భూమ్మీదికి జీవానికి తిరిగివస్తారు. అందరూ విమోచన క్రయధనంలోని పునఃస్థాపనా ప్రయోజనాలను అనుభవిస్తారు. (ప్రకటన 20:12-15; 22:1, 2) అప్పుడు భూమ్మీద గ్రుడ్డివారుండరు, చెవిటివారుండరు, లేదా కుంటివారుండరు. “నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అనడు.” (యెషయా 33:24) క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలన ముగిసిన తర్వాత కొద్దికాలానికి సాతాను వాని దయ్యాలు కొంతకాలంపాటు విడుదల చేయబడి, భూమి విషయంలో దేవుని సంకల్పం ఎలా నెరవేరిందో చూస్తారు. చివరికి, వారు ఇక ఎన్నడూ ఉండకుండా నాశనం చేయబడతారు.—ప్రకటన 20:1-3.
భూమి వెయ్యేండ్ల సంవత్సరాలపాటు కుదురుబాటును అనుభవించిన తర్వాత “సకల ప్రాణులు” యెహోవాను స్తుతిస్తారు, నిరంతరమూ స్తుతిస్తూనే ఉంటారు. (కీర్తన 150:6) మీరు కూడా ఆ ప్రాణుల్లో ఒకరిగా ఉంటారా? మీరు తప్పక ఉండగలరు.