కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

క్రీస్తు మనోవైఖరిని ప్రతిబింబించండి

క్రీస్తు మనోవైఖరిని ప్రతిబింబించండి

క్రీస్తు మనోవైఖరిని ప్రతిబింబించండి

“క్రీస్తుయేసు చిత్తప్రకారము ఒకనితోనొకడు మనస్సు కలిసినవారై యుండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించును గాక.”​—⁠రోమీయులు 15:⁠5,6.

1. ఒకరి జీవితం వారి మనోవైఖరిని బట్టి ఎలా ప్రభావితం కాగలదు?

చాలా వరకు మన వైఖరిపైనే మన జీవితం ఆధారపడి ఉంటుంది. ఉదాసీనమైన వైఖరి లేదా శ్రద్ధతోకూడిన వైఖరి, ప్రతికూల వైఖరి లేదా అనుకూల వైఖరి, తగవులు పెట్టుకునే వైఖరి లేదా సహకరించే వైఖరి, ఫిర్యాదుచేసే వైఖరి లేదా కృతజ్ఞతాపూర్వకమైన వైఖరి​—⁠ఇవి, ఒక వ్యక్తి వివిధ రకాల పరిస్థితులతో ఎలా వ్యవహరిస్తాడు, ఆయనకు ఇతరులు ఎలా ప్రతిస్పందిస్తారు అనే వాటిని బలంగా ప్రభావితం చేయగలవు. మంచి వైఖరి ఉంటే, ఒకరు చాలా కష్టతరమైన పరిస్థితుల్లో కూడా సంతోషంగా ఉండగల్గుతారు. చెడ్డ వైఖరి ఉన్న వ్యక్తికి, జీవితం కాస్త మంచిగా ఉన్నా కూడా ఏదీ సరిగ్గా అనిపించదు.

2. ఒక వ్యక్తి వైఖరులను ఎలా నేర్చుకుంటాడు?

2 వైఖరిని నేర్చుకోవచ్చు, అది మంచి వైఖరి అయినా లేక చెడ్డ వైఖరి అయినా కావచ్చు. నిజానికి వాటిని నేర్చుకోవలసిందే. క్రొత్తగా జన్మించిన శిశువు గురించి మాట్లాడుతూ, కొల్లియర్స్‌ ఎన్‌సైక్లోపీడియా ఇలా చెప్తుంది: “అతడు చివరికి ఏ వైఖరులను కల్గివుంటాడనేది అతడు సంపాదించుకోవలసిందే లేదా నేర్చుకోవలసిందే, అతడు భాషను గానీ మరే ఇతర నైపుణ్యాన్ని గానీ ఎలా నేర్చుకుంటాడో లేదా సంపాదించుకుంటాడో అలాగే దీన్నీ నేర్చుకోవలసిందే లేదా సంపాదించుకోవలసిందే.” మనం వైఖరులను ఎలా నేర్చుకుంటాము? ఎన్నో విషయాలు దానికి దోహదపడతాయి, అయితే పరిసరాలు, సహవాసం ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. మునుపు చెప్పిన ఎన్‌సైక్లోపీడియా ఇలా పేర్కొంటుంది: “చెట్లు నీటిని భూమిలోనుండి పైకి పీల్చుకునే ప్రక్రియ ద్వారా అన్నట్లుగా, మనం ఎవరితోనైతే సన్నిహితంగా సహవసిస్తామో వారి వైఖరులను నేర్చుకుంటాము లేదా మనలోకి తీసుకుంటాము.” వేలాది సంవత్సరాల క్రితం, బైబిలు అటువంటి విషయమే చెప్పింది: “జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవాడగును మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును.”​—⁠సామెతలు 13:​20; 1 కొరింథీయులు 15:⁠33.

సరైన వైఖరికి మాదిరి

3. వైఖరి విషయంలో ఎవరు మాదిరికరంగా ఉన్నారు? ఆయనను మనమెలా అనుకరించగలం?

3 మిగతా అన్నింటిలోలాగే, వైఖరి విషయంలో కూడా యేసుక్రీస్తు అతి చక్కని మాదిరినుంచాడు. ఆయనిలా అన్నాడు: “నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఈలాగు చేసితిని.” (యోహాను 13:​15) యేసులా ఉండేందుకు, మనం మొదట ఆయన గురించి తెలుసుకోవాలి. * అపొస్తలుడైన పేతురు చేసిన సిఫారసును అనుసరించాలనే ఉద్దేశంతో మనం యేసు జీవితాన్ని అధ్యయనం చేయాలి, ఆయనిలా అన్నాడు: “క్రీస్తుకూడ మీకొరకు బాధపడి, మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచిపోయెను.” (1 పేతురు 2:​21) సాధ్యమైనంత మేరకు యేసులా ఉండాలన్నదే మన ధ్యేయం. దానిలో ఆయన మనోవైఖరిని పెంపొందింపజేసుకోవడం కూడా ఇమిడి ఉంది.

4, 5. రోమీయులు 15:1-3 వచనాల్లో యేసు మనోవైఖరిలోని ఏ అంశం ఉన్నతపర్చబడింది, క్రైస్తవులు ఆయనను ఎలా అనుకరించగలరు?

4 క్రీస్తుయేసు మనోవైఖరి కల్గివుండడంలో ఏమి ఇమిడి ఉంది? పౌలు రోమీయులకు వ్రాసిన పత్రిక 15వ అధ్యాయం ఆ ప్రశ్నకు సమాధానమిచ్చేందుకు మనకు సహాయం చేస్తుంది. ఈ అధ్యాయంలోని మొదటి కొన్ని వచనాల్లో, “బలవంతులమైన మనము, మనలను మనమే సంతోషపరచుకొనక, బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై యున్నాము. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దానియందు అతనిని సంతోషపరచవలెను. క్రీస్తుకూడ తన్ను తాను సంతోషపరచుకొనలేదు గాని—నిన్ను నిందించువారి నిందలు నామీద పడెను అని వ్రాయబడియున్నట్లు ఆయనకు సంభవించెను” అని చెప్తున్నప్పుడు పౌలు యేసుకున్న ఒక విశేషమైన లక్షణాన్ని గురించి చెప్తున్నాడు.​—⁠రోమీయులు 15:1-3.

5 క్రైస్తవులు యేసు వైఖరిని అనుకరిస్తూ, తమను తాము సంతోషపర్చుకునే వారిగా ఉండే బదులు, నమ్రతతో ఇతరుల అవసరాలను తీర్చేందుకు సిద్ధంగా ఉండాలని ప్రోత్సహించబడుతున్నారు. వాస్తవానికి, ఇతరులకు సేవచేయాలనే అలాంటి నమ్రతాపూర్వకమైన సుముఖత, “బలవంతుల”కుండే విలక్షణమైన గుణం. జీవించిన వారిలోకెల్లా ఆధ్యాత్మికంగా అత్యంత బలవంతుడైన యేసు తన గురించి తాను, “మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెనని” చెప్పాడు. (మత్తయి 20:​28) క్రైస్తవులముగా మనం కూడా “బలహీనుల”తో సహా ఇతరులకు సేవ చేసేందుకు ముందుకు వెళ్లాలి.

6. వ్యతిరేకత అపనిందలకు యేసు ప్రతిస్పందనను మనం ఏవిధంగా అనుకరించగలము?

6 యేసు కల్గివుండిన మరో చక్కని వైఖరి ఏమిటంటే, ఆయన ఎల్లప్పుడూ అనుకూలమైన ఆలోచనా విధానాన్ని కల్గివుండి, తదనుగుణంగానే చర్యలు తీసుకున్నాడు. దేవుని సేవ చేయడం పట్ల తనకున్న మంచి వైఖరిని ఇతరుల చెడు వైఖరి ప్రభావితం చేసేందుకు ఆయన ఎన్నడూ అనుమతించలేదు; మనమూ అనుమతించకూడదు. దేవుడ్ని విశ్వసనీయంగా ఆరాధించినందుకు నిందించబడినప్పుడు, హింసించబడినప్పుడు, యేసు ఏమాత్రం ఫిర్యాదు చేయకుండా ఓర్పుతో సహించాడు. తమ పొరుగువారికి ‘క్షేమాభివృద్ధి కలిగేలా’ వారిని సంతోషపర్చాలని ప్రయత్నించేవారి పైకి, అవిశ్వాసులతో కూడిన, అవగాహనలేని ఈ లోకం వ్యతిరేకతను తీసుకువస్తుందని ఆయనకు తెలుసు.

7. యేసు సహనాన్ని ఎలా ప్రదర్శించాడు, మనం కూడా అలాగే ఎందుకు చేయాలి?

7 యేసు మరితర మార్గాల్లో సరైన వైఖరిని ప్రదర్శించాడు. ఆయన ఎప్పుడూ యెహోవా చేయబోయేవాటి పట్ల అసహనాన్ని వ్యక్తం చేయలేదు గానీ ఆయన సంకల్పాల నెరవేర్పుకోసం సహనంతో వేచివున్నాడు. (కీర్తన 110:⁠1; మత్తయి 24:36; అపొస్తలుల కార్యములు 2:​32-36; హెబ్రీయులు 10:​12, 13) అంతేగాక యేసు తన అనుచరులను బట్టి కూడా అసహనం చెందలేదు. ఆయన వారికిలా చెప్పాడు: “నాయొద్ద నేర్చుకొనుడి”; ఆయన ‘సాత్వికుడు’ గనుక, ఆయన ఇచ్చే ఉపదేశం ప్రోత్సాహకరమైనదిగా, సేదదీర్పునిచ్చేదిగా ఉండేది. ఆయన ‘దీనమనస్సు గలవాడు’ గనుక, ఆయన ఎన్నడూ ప్రగల్భాలు పలుకలేదు లేక దురహంకారంతో ప్రవర్తించలేదు. (మత్తయి 11:​29) “క్రీస్తుయేసునకు కలిగిన యీ మనస్సు మీరును కలిగియుండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదుగాని మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను” అని చెప్పినప్పుడు, యేసు వైఖరిలోని ఆ అంశాలను అనుకరించమని పౌలు మనల్ని ప్రోత్సహిస్తున్నాడు.​—⁠ఫిలిప్పీయులు 2:5-7.

8, 9. (ఎ) నిస్వార్థ వైఖరిని వృద్ధిచేసుకోవడానికి మనం ఎందుకు కృషి చేయాలి? (బి) యేసు ఉంచిన మాదిరిని సంపూర్ణంగా అనుకరించలేకపోతే మనం ఎందుకు నిరుత్సాహపడకూడదు, ఈ విషయంలో పౌలు ఎలా ఒక మంచి ఉదాహరణగా ఉన్నాడు?

8 ఇతరులకు సేవచేయాలనీ, మన అవసరాల కంటే వారి అవసరాలకు ప్రాధాన్యతనివ్వాలనీ మనం కోరుకుంటున్నామని నోటితో చెప్పడం సులభమే. కాని మన మనోవైఖరిని యథార్థంగా పరిశీలించుకున్నప్పుడు, మన హృదయాలు పూర్తిగా అదే కోరికను కల్గిలేవని వెల్లడికావచ్చు. ఎందుచేత? మొదటిగా, మనం ఆదాము హవ్వల నుండి స్వార్థపూరిత లక్షణాలను వారసత్వంగా పొందాము; రెండవదిగా, మనం స్వార్థానికి ప్రాధాన్యతనిచ్చే లోకంలో జీవిస్తున్నాము. (ఎఫెసీయులు 4:​17, 18) నిస్వార్థమైన వైఖరిని పెంపొందింపజేసుకోవడమంటే, స్వతఃసిద్ధమైన మన అపరిపూర్ణ నైజానికి వ్యతిరేకమైన ఆలోచనా విధానాన్ని వృద్ధిచేసుకోవడమే. దానికి పట్టుదల, కృషి అవసరం.

9 యేసు మనకోసం ఉంచిన పరిపూర్ణ మాదిరికి పూర్తి వ్యతిరేకమైన మన అపరిపూర్ణత మనల్ని కొన్నిసార్లు నిరుత్సాహపర్చగలదు. యేసుకుండిన అదే మనోవైఖరిని కల్గివుండడం అసలు సాధ్యమేనా అని మనం సందేహించవచ్చు. అయితే పౌలు చెప్తున్న ఈ ప్రోత్సాహకరమైన మాటలను గమనించండి: “నాయందు, అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును. మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని, దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలుచేయక చేయగోరని కీడు చేయుచున్నాను. అంతరంగపురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాపనియమమునకు నన్ను చెరపట్టి లోబరచుకొనుచున్నది.” (రోమీయులు 7:18, 19, 22, 23) నిజమే, పౌలు తాను కోరుకున్నట్లుగా దేవుని చిత్తాన్ని నెరవేర్చేటప్పుడు, ఆయనకున్న అపరిపూర్ణత తరచూ ఆయనకు అడ్డంకులను పెట్టినప్పటికీ, ఆయన వైఖరి అంటే యెహోవా గురించీ ఆయన ధర్మశాస్త్రం గురించీ ఆయన కల్గివున్న అభిప్రాయమూ, భావనా ఎంతో మాదిరికరమైనవి. మన వైఖరి కూడా మాదిరికరమైనదై ఉండగలదు.

తప్పు వైఖరులను సరిచేసుకోవడం

10. ఏ మనోవైఖరిని వృద్ధి చేసుకోమని పౌలు ఫిలిప్పీయులను ప్రోత్సహించాడు?

10 కొందరు తప్పు వైఖరిని సరిచేసుకోవలసిన అవసరం ఉండే అవకాశం ఉందా? ఉంది. మొదటి శతాబ్దపు క్రైస్తవులు కొందరి విషయంలో ఇది జరిగిందని స్పష్టమౌతుంది. ఫిలిప్పీయులకు వ్రాసిన తన పత్రికలో పౌలు సరైన వైఖరి కల్గివుండడం గురించి మాట్లాడాడు. ఆయనిలా వ్రాశాడు: “ఇదివరకే నేను [తొలి పునరుత్థానం ద్వారా పరలోక జీవితం] గెలచితిననియైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితిననియైనను నేను అనుకొనుటలేదు గాని, నేను దేనినిమిత్తము క్రీస్తుయేసుచేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరుగెత్తుచున్నాను. సహోదరులారా, నేనిదివరకే పట్టుకొనియున్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను; వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికొరకై వేగిరపడుచు క్రీస్తుయేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే [“ఈ వైఖరియే,” NW] కలిగియుందము.” (ఇటాలిక్కులు మావి.)​ఫిలిప్పీయులు 3:12-15.

11, 12. యెహోవా మనకు ఏ యే విధాలుగా సరైన మనోవైఖరిని చూపించాడు?

11 క్రైస్తవునిగా మారిన ఎవరైనా తామిక అభివృద్ధి చెందవలసిన అవసరం లేదని భావిస్తే అది తప్పు వైఖరేనని పౌలు మాటలు చూపిస్తున్నాయి. అతడు క్రీస్తు మనోవైఖరిని అలవర్చుకోవడంలో విఫలమౌతాడు. (హెబ్రీయులు 4:​11; 2 పేతురు 1:10; 3:​14) అలాంటి వ్యక్తి ఇక చేయగల్గినదేమీ లేనట్లేనా? ఎంతమాత్రం కాదు. మనం నిజంగా కోరుకుంటే, మన వైఖరిని మార్చుకోవడానికి దేవుడు సహాయం చేయగలడు. పౌలు ఇలా కొనసాగిస్తున్నాడు: “దేనిగూర్చియైనను మీకు వేరు తాత్పర్యము [“వైఖరి,” NW] కలిగియున్నయెడల, అదియు దేవుడు మీకు బయలుపరచును.”​—⁠ఫిలిప్పీయులు 3:⁠15.

12 అయితే, యెహోవా మనకు సరైన వైఖరిని బయల్పర్చాలని మనం కోరుకుంటే, మన వంతు మనం చేయాలి. ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు’ అందజేసే క్రైస్తవ ప్రచురణల సహాయంతో దేవుని వాక్యాన్ని ప్రార్థనాపూర్వకంగా పఠించడం, “వేరు వైఖరి కలిగియున్న”వారు సరైన వైఖరిని పెంపొందింపజేసుకోవడానికి సహాయం చేస్తుంది. (మత్తయి 24:​45) దేవుని “సంఘమును కాయుటకు” పరిశుద్ధాత్మచే నియమింపబడిన క్రైస్తవ పెద్దలు సహాయాన్నివ్వడానికి సంతోషిస్తారు. (అపొస్తలుల కార్యములు 20:28) యెహోవా మన అపరిపూర్ణతలను పరిగణలోకి తీసుకుని, మనకు ప్రేమపూర్వకంగా సహాయం చేస్తున్నందుకు మనం ఎంత కృతజ్ఞులమై ఉండాలి! ఆ సహాయాన్ని మనం తీసుకుందాము.

ఇతరుల నుండి నేర్చుకోవడం

13. బైబిలులో ఉన్న యోబు వృత్తాంతం నుండి సరైన వైఖరి గురించి మనం ఏమి నేర్చుకుంటాము?

13 చారిత్రాత్మకమైన ఉదాహరణలను ధ్యానించడం మన వైఖరిని సరిచేసుకోవడానికి సహాయం చేస్తుందని పౌలు తాను రోమీయులకు వ్రాసిన పత్రికలోని 15వ అధ్యాయంలో చూపిస్తున్నాడు. ఆయనిలా వ్రాస్తున్నాడు: “ఏలయనగా ఓర్పువలనను, లేఖనములవలని ఆదరణవలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నియు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి యున్నవి.” (రోమీయులు 15:⁠4) యెహోవా నమ్మకమైన సేవకుల్లో కొందరు గత కాలాల్లో తమ వైఖరిలోని కొన్ని అంశాలను సరిచేసుకోవలసిన అవసరం ఏర్పడింది. ఉదాహరణకు, యోబుకు స్వతహాగా మంచి వైఖరే ఉంది. ఆయన యెహోవాకు ఎన్నడూ చెడును ఆపాదించలేదు, అంతేగాక దేవునియందు తనకున్న నమ్మకాన్ని తను అనుభవిస్తున్న బాధలు బలహీనపర్చేందుకు ఆయన ఎంతమాత్రం అనుమతించలేదు. (యోబు 1:​8, 21, 22) అయితే తర్వాత ఆయన తనను తాను సమర్థించుకోవటానికి మాత్రం ప్రయత్నించాడు. దీన్ని సరిచేసుకోవడంలో యోబుకు సహాయం చేయమని యెహోవా ఎలీహును నిర్దేశించాడు. అవమానింపబడినట్లుగా భావించే బదులు, యోబు తన వైఖరిలో మార్పు చేసుకోవలసిన అవసరాన్ని నమ్రతతో అంగీకరించి, మార్పు చేసుకునేందుకు వెంటనే ఆయత్తమయ్యాడు.​—⁠యోబు 42:1-6.

14. మన వైఖరి గురించి మనకు ఉపదేశం ఇవ్వబడితే మనమెలా యోబును అనుసరించగలము?

14 మనకు చెడ్డ వైఖరి ఉన్నట్లు కనిపిస్తుందని తోటి క్రైస్తవులు దయాపూర్వకంగా చెబితే మనం యోబులా ప్రతిస్పందిస్తామా? “దేవుడు అన్యాయము చేసెనని” యోబు ఎన్నడూ చెప్పలేదు, మనం కూడా యోబువలె ఉందాము. (యోబు 1:​22) మనం ఏదైనా అన్యాయానికి గురైతే, మన కష్టాలను బట్టి ఎన్నడూ ఫిర్యాదు చేయకుండా ఉందాము లేదా వాటికి యెహోవాయే బాధ్యుడని అనకుండా ఉందాము. యెహోవా సేవలో మన ఆధిక్యతలు ఏమైవున్నప్పటికీ, మనం ఇప్పటికీ “నిష్‌ప్రయోజకులమైన దాసులము” మాత్రమేనని జ్ఞాపకం ఉంచుకుని, మనల్ని మనం సమర్థించుకునేందుకు ప్రయత్నించకుండా ఉందాము.​—⁠లూకా 17:⁠10.

15. (ఎ) యేసు అనుచరులు కొందరు ఏ తప్పు వైఖరిని చూపించారు? (బి) పేతురు చక్కని వైఖరిని ఎలా చూపించాడు?

15 మొదటి శతాబ్దంలో, యేసు చెప్పినది విన్న కొంతమంది మనుష్యులు అనుచితమైన వైఖరిని కనబర్చారు. ఒక సందర్భంలో, యేసు అర్థం చేసుకోవడం కష్టమైనదొకటి చెప్పాడు. దానికి ప్రతిస్పందనగా, “ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని​—⁠యిది కఠినమైన మాట, యిది ఎవడు వినగలడని చెప్పుకొనిరి.” ఇలా మాట్లాడినవారికి తప్పు వైఖరి ఉందని స్పష్టమౌతుంది. వాళ్లకున్న తప్పు వైఖరి యేసు చెప్పేది వినకుండా వారిని ఆటంకపర్చింది. వృత్తాంతం ఇలా చెప్తుంది: “అప్పటినుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి, మరి ఎన్నడును ఆయనను వెంబడింపలేదు.” అందరికీ తప్పు వైఖరి ఉందా? లేదు. ఆ వృత్తాంతం ఇలా కొనసాగుతుంది: “కాబట్టి యేసు​—⁠మీరు కూడ వెళ్లిపోవలెనని యున్నారా? అని పండ్రెండుమందిని” అడిగాడు. దానికి సీమోను పేతురు ఇలా సమాధానమిచ్చాడు: “ప్రభువా, యెవనియొద్దకు వెళ్లుదుము?” తర్వాత పేతురు తన ప్రశ్నకు తానే ఇలా సమాధానమిచ్చాడు: “నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు.” (యోహాను 6:​60, 66-68) ఎంత చక్కని వైఖరి! లేఖనాలను అర్థం చేసుకొనే విషయంలో మనకు మొదట్లో అంగీకరించడం కష్టమనిపించే వివరణలు లేక సవరణలు ఎదురైనప్పుడు, పేతురు చూపించినటువంటి వైఖరిని చూపించడం మంచిది కాదా? కొన్ని విషయాలను అర్థం చేసుకోవడం మొదట్లో కాస్త కష్టంగా ఉన్నంత మాత్రాన యెహోవా సేవ చేయడాన్ని మానుకోవడం లేదా “హితవాక్యప్రమాణము”నకు వ్యతిరేకంగా మాట్లాడడం ఎంత మూర్ఖత్వం!​—⁠2 తిమోతి 1:⁠13.

16. యేసు కాలం నాటి యూదా మత నాయకులు విభ్రాంతి కల్గించే ఏ వైఖరిని ప్రదర్శించారు?

16 మొదటి శతాబ్దానికి చెందిన యూదా మత నాయకులు యేసుకుండిన మనోవైఖరిని కల్గివుండడంలో విఫలమయ్యారు. యేసు చెప్పేది వినకూడదని వారు చేసుకున్న దృఢ తీర్మానం, మరణించిన లాజరును ఆయన తిరిగి లేపినప్పుడు వెల్లడయ్యింది. సరైన వైఖరిగల వారెవరికైనా, యేసును దేవుడు పంపించాడన్నదానికి ఆ అద్భుతం కచ్చితంగా ఒక నిదర్శనంగా ఉండేది. అయితే మనమిలా చదువుతాము: “కాబట్టి ప్రధానయాజకులును పరిసయ్యులును మహాసభను సమకూర్చి​—⁠మనమేమి చేయుచున్నాము? ఈ మనుష్యుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడే. మనమాయనను ఈలాగు చూచుచు ఊరకుండినయెడల అందరు ఆయనయందు విశ్వాస ముంచెదరు; అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకొందురని చెప్పిరి.” మరి దానికి వారి పరిష్కారం? “కాగా ఆ దినమునుండి వారు ఆయనను చంప నాలోచించుచుండిరి.” యేసును చంపడానికి పథకాలు వేయడమే గాక, ఆయన అద్భుతాలు చేసేవాడన్న దానికున్న సజీవ సాక్ష్యాన్ని నిర్మూలించటానికి వాళ్లు ప్రయత్నించారు. “ప్రధానయాజకులు లాజరునుకూడ చంప నాలోచనచేసిరి.” (యోహాను 11:47, 48, 53; 12:​9-11) మనం కూడా అలాంటి వైఖరినే పెంపొందింపజేసుకుని, నిజానికి మనం ఆనందించవలసిన విషయాల గురించి చికాకుపడితే లేక ఆందోళన చెందితే ఎంత అసహ్యంగా ఉంటుంది! అవును, అది ఎంతో ప్రమాదకరం కూడా!

క్రీస్తు అనుకూల వైఖరిని అనుకరించడం

17. (ఎ) దానియేలు ఏ పరిస్థితుల్లో నిర్భయమైన వైఖరిని చూపించాడు? (బి) యేసు తాను ధైర్యవంతుడనని ఎలా చూపించాడు?

17 యెహోవా సేవకులు అనుకూల దృక్పథాన్ని కల్గివుంటారు. ముప్ఫై రోజులపాటు రాజుకు తప్ప మరే దేవునినే గానీ మానవునినే గానీ ప్రార్థించడాన్ని నిషేధిస్తూ ఒక చట్టాన్ని ప్రవేశపెట్టాలని దానియేలు శత్రువులు కుట్ర పన్నినప్పుడు, అది యెహోవా దేవునితో తనకుగల సంబంధానికి అడ్డంకిని ఏర్పరుస్తుందని దానియేలు గ్రహించాడు. ఆయన ముప్ఫై రోజులపాటు దేవునికి ప్రార్థించకుండా ఉన్నాడా? లేదు, ఆయన తన అలవాటు చొప్పున రోజుకు మూడుసార్లు నిర్భయంగా యెహోవాకు ప్రార్థించడం కొనసాగించాడు. (దానియేలు 6:​6-17) అలాగే యేసు కూడా తన శత్రువులను చూసి బెదిరిపోలేదు. ఒక విశ్రాంతి దినాన ఆయన ఊచ చెయ్యిగల వ్యక్తిని చూశాడు. తాను ఎవరినైనా విశ్రాంతి దినాన స్వస్థపరిస్తే చాలామంది యూదులు ఆగ్రహిస్తారని యేసుకు తెలుసు. ఆ విషయంపై తమ అభిప్రాయం ఏమిటో వ్యక్తపర్చమని ఆయన వారిని సూటిగా అడిగాడు. వాళ్లు జవాబివ్వటానికి నిరాకరించినప్పుడు, యేసు ముందుకు వెళ్లి ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. (మార్కు 3:​1-6) తాను సరైనదని భావించిన తన పనిని తుదముట్టించటానికి యేసు ఎన్నడూ వెనుదీయలేదు.

18. కొందరెందుకు మనల్ని వ్యతిరేకిస్తారు, కానీ వారి ప్రతికూల వైఖరికి మనం ఎలా ప్రతిస్పందించాలి?

18 వ్యతిరేకుల ప్రతికూల ప్రతిస్పందనను బట్టి తాము కూడా ఎన్నడూ బెదిరిపోకూడదని యెహోవాసాక్షులు నేడు గుర్తిస్తారు. లేకపోతే, వాళ్లు యేసు మనోవైఖరిని ప్రదర్శిస్తున్నవారు కారు. చాలామంది యెహోవాసాక్షులను వ్యతిరేకిస్తారు, దానికి ఒక కారణం కొంతమందికి వాస్తవాలు తెలియకపోవడం, మరొక కారణం మరికొంతమందికి సాక్షులంటే లేక వారి సందేశమంటే ద్వేషం. కానీ వైరంతో కూడిన వారి వైఖరి మన అనుకూల వైఖరిని ప్రభావితం చేసేందుకు మనం ఎన్నడూ అనుమతించకూడదు. అంతేగాక మనం ఆరాధించే విధానాన్ని ఇతరులు నిర్దేశించటానికి మనం ఎన్నడూ అనుమతించకూడదు.

19. మనం యేసుక్రీస్తులాంటి మనోవైఖరిని ఎలా చూపించగలము?

19 యేసు ఎల్లప్పుడూ తన అనుచరులపట్లా, దేవుని ఏర్పాట్లపట్లా అనుకూల మనోవైఖరిని కల్గివున్నాడు, అది ఎంత కష్టంగా ఉన్నప్పటికీ ఆయన తన వైఖరిని మార్చుకోలేదు. (మత్తయి 23:​2, 3) మనం ఆయన మాదిరిని అనుకరించాలి. నిజమే మన సహోదరులు అపరిపూర్ణులే, అయితే మనం కూడా అపరిపూర్ణులమే కదా! మనం ఇంతకన్నా మంచి సహవాసులను, నిజంగా యథార్థపరులైన స్నేహితులను మన ప్రపంచవ్యాప్త సహోదరత్వంలో గాక మరెక్కడ కనుగొనగలం? యెహోవా ఇంకా మనకు తన లిఖితపూర్వక వాక్యాన్ని గురించిన పూర్తి అవగాహనను ఇవ్వలేదు, కానీ మరింకే మతగుంపు ఇంతకన్నా ఎక్కువ అర్థం చేసుకోగలదు? మనం ఎల్లప్పుడూ సరైన మనోవైఖరిని అంటే యేసుక్రీస్తు కల్గివుండిన మనోవైఖరినే కల్గివుందాము. ఇతర విషయాలతోపాటు, దీనిలో యెహోవా కోసం ఎలా వేచివుండాలి అన్నది కూడా ఇమిడి ఉంది, దీన్ని మనం తర్వాతి శీర్షికలో చర్చిద్దాం.

[అధస్సూచి]

^ పేరా 3 వాచ్‌ టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ప్రచురించిన జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి అనే ప్రచురణ యేసు జీవితాన్ని, పరిచర్యను చర్చిస్తుంది.

[అధ్యయన ప్రశ్నలు]

[7వ పేజీలోని చిత్రాలు]

సరైన వైఖరిగల క్రైస్తవులు ఇతరులకు సహాయం చేసేందుకు చొరవ తీసుకుంటారు

[9వ పేజీలోని చిత్రం]

దేవుని వాక్యాన్ని ప్రార్థనాపూర్వకంగా పఠించడం క్రీస్తు మనోవైఖరిని అలవర్చుకోవడానికి మనకు సహాయం చేస్తుంది