కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మౌనమే అంగీకారమైనప్పుడు

మౌనమే అంగీకారమైనప్పుడు

మౌనమే అంగీకారమైనప్పుడు

నాజీవాదంలో మతానికున్న పాత్రను గూర్చి బిట్రేయల్‌​—⁠జర్మన్‌ చర్చెస్‌ అండ్‌ ద హోలోకాస్ట్‌ అనే పుస్తకం నిజాయితీగా చర్చించింది. “క్రైస్తవులు నాజీ పరిపాలనకు పూర్తి మద్దతునిచ్చారు, యూదులను హింసిస్తున్నప్పుడు ప్రజల్లో అత్యధికులు ఏమీ అడ్డుచెప్పలేదు. ఈ విషయంలో వారి మౌనం చాలా గట్టిగానే వినబడింది.”

నామకార్థ క్రైస్తవులమని చెప్పుకొనేవారిని నాజీవాదంలోకి ఆకర్షించినదేమిటి? హిట్లర్‌ “జర్మన్‌ దేశంలోని శాంతి భద్రతలను గురించి మాట్లాడటం చూసి” చాలామంది ప్రలోభపెట్టబడ్డారని ఆ పుస్తకం వివరించింది. అదింకా ఇలా చెప్తుంది: “అశ్లీల చిత్రాలు, వ్యభిచారం, గర్భస్రావం, సలింగసంయోగం, మోడర్న్‌ ఆర్ట్‌లోని ‘అశ్లీలత’లను ఆయన వ్యతిరేకించాడు, ఇంకా నాలుగు, ఆరు, ఎనిమిది మంది పిల్లలను కన్న స్త్రీలకు కంచు, వెండి, బంగారు పతకాలను అందించాడు, అలా స్త్రీలు ఇంట్లో సాంప్రదాయక పాత్రలను పోషించడంలోనే మిగిలిపోవాలని ప్రోత్సహించాడు. సాంప్రదాయిక విలువల వైపుకి ప్రజల్ని ఇలా ఆకర్షించడం మూలంగా, అలాగే వెర్సైల్స్‌ ఒప్పందం తమ దేశాన్నే అవమానపర్చడంతో దానికి ప్రతిగా సైనికవాదము జాతీయవాదము వంటివి వారి మనస్సుల్లో నాటడం మూలంగా ప్రజలు నాజీవాదంలో పడిపోయేలా చేశాయి.”

ఒక గుంపు మాత్రమే దీనికి పూర్తి భిన్నంగా నిలబడింది. “హింసలో గానీ, సైనికశక్తిలో గానీ భాగంవహించేందుకు నిరాకరించింది కేవలం యెహోవాసాక్షులే” అని బిట్రేయల్‌ తెలియజేసింది. అనివార్యమైన రీతిలో దీనిమూలంగా ఆ చిన్న గుంపుపై క్రూరమైన దాడి జరిగి, దానిలో అనేకమంది సభ్యులు కాన్సంట్రేషన్‌ క్యాంపుల్లోకి పడవేయబడ్డారు. అయితే, క్రీస్తు అనుచరులమని చెప్పుకునే వారు ఏమీ మాట్లాడలేదు. ఆ పుస్తకం ఇంకా ఇలా చెప్తుంది: “సాధారణంగా క్యాథలిక్కులు ప్రొటెస్టెంటులు యెహోవాసాక్షులంటే శత్రుభావాన్నే వ్యక్తం చేశారు గానీ సానుభూతిని వ్యక్తం చేయలేదు. వారు హిట్లర్‌ పెట్టిన కఠోరమైన ప్రమాణాలకు ఒప్పుకున్నారే గాని సాక్షుల శాంతి ప్రమాణాలకు ఒప్పుకోలేదు.” నాజీ పరిపాలన క్రింద క్రూరంగా హింసించబడిన సాక్షుల పరిస్థితి, వారి మౌనం మూలంగా నిస్సందేహంగా మరింత ఘోరంగా తయారైంది.

చర్చీలు నాజీ రాజకీయాల్లో భాగం వహించడమనేది తీవ్రమైన వివాదాంశంగా ఉన్నప్పటికీ బిట్రేయల్‌, యెహోవాసాక్షులను “ఆ పరిపాలనకు ఆమోదం తెల్పడానికీ, దానికి సహకరించడానికీ నిరాకరించిన ఒక మత గుంపు” అని పిలుస్తుంది.