కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా యథార్థవంతులకు ఎప్పుడూ ప్రతిఫలమిస్తాడు

యెహోవా యథార్థవంతులకు ఎప్పుడూ ప్రతిఫలమిస్తాడు

జీవిత కథ

యెహోవా యథార్థవంతులకు ఎప్పుడూ ప్రతిఫలమిస్తాడు

వెర్నన్‌ డన్‌కమ్‌ చెప్పినది

ఆ రాత్రి అల్పాహారం ముగించుకుని అలవాటుగా సిగరెట్‌ వెలిగించుకొని, నా భార్య ఐలీన్‌ను “మీటింగులో ఏం జరిగింది?” అని అడిగాను.

ఆమె కాస్సేపాగి “క్రొత్త అపాయింట్‌మెంట్‌లున్న ఉత్తరం చదివారు, సౌండ్‌ సిస్టమ్‌ బాధ్యత వహించడానికి మిమ్మల్ని నియమించినట్లు ప్రకటించారు. ఆ ఉత్తరం చివర్లో ‘క్రొత్తగా నియమింపబడిన వారిలో ఎవరైనా పొగాకు ఉపయోగించేవారుంటే, మేము ఈ నియామకాన్ని స్వీకరించలేము అని సొసైటీకి వ్రాయాలి’ అని చదివారు” అని చెప్పింది. * నేను నిట్టూర్పు విడుస్తూ, “ఊఁ, అలా చెప్పారన్నమాట” అని అన్నాను.

నా పళ్ళను బిగపట్టి పక్కనే ఉన్న ఆష్‌ట్రేలో సిగరెట్‌ నలిపేశాను. “నన్ను ఈ నియామకానికి ఎందుకు ఎన్నుకున్నారో నాకు తెలియదు. కానీ ఇప్పటివరకు నాకివ్వబడిన ఏ నియామకాన్నీ కాదనలేదు. ఇప్పుడు కాదనే ఉద్దేశం కూడా లేదు.” కాబట్టి ఇకపైన సిగరెట్‌ కాల్చకూడదని తీర్మానించుకున్నాను. ఒక క్రైస్తవుడిగా, సంగీతకారుడిగా ఆ నిర్ణయం నా జీవితంలో చాలా గాఢమైన ప్రభావాన్ని చూపింది. ఆ తీర్మానానికి దారి తీసిన కొన్ని సంఘటనలు మీతో చెప్పనీయండి.

కుటుంబ జీవితానికి ప్రారంభంలో

నలుగురు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలున్న కుటుంబాన్ని పోషిస్తున్న వెర్నన్‌, లైలాలు ప్రేమగల, కష్టపడి పనిచేసే తల్లిదండ్రులు. వారికి నేను మొదటి సంతానం. 1914, సెప్టెంబరు 21న, కెనడాలోని టొరాంటోలో జన్మించాను. వరుసగా యోర్క్‌, ఒర్లాండో, డగ్లస్‌, ఐలీన్‌, కోరల్‌లు నా తరువాతి వారు. నాకు తొమ్మిదేళ్ళప్పుడే మా అమ్మ నా చేతుల్లో వయొలిన్‌ పెట్టి హారిస్‌ స్కూల్‌ ఆఫ్‌ మ్యూజిక్‌లో సంగీతం నేర్చుకోవడానికి ఏర్పాట్లు చేసింది. మా ఆర్థిక పరిస్థితి అంత బాగాలేకపోయినా, అమ్మా నాన్నా నా ట్యూషన్‌ ఫీజులు, ప్రయాణ ఖర్చులు ఏదో విధంగా కట్టేవారు. తరువాత టొరాంటోలోని రాయల్‌ కన్సర్వేటరీ ఆఫ్‌ మ్యూజిక్‌ ఇన్‌స్టిట్యూట్‌లో మ్యూజిక్‌ థియరీ మరియు కంపోజింగ్‌ అధ్యయనం చేశాను. నా పన్నెండవ ఏట, ఆ పట్టణంలో ప్రఖ్యాతిగాంచిన మ్యూజిక్‌ ఆడిటోరియమ్‌ మస్సే హాల్‌లో సిటీ లెవెల్లో జరిగిన పోటీల్లో పాల్గొన్నాను, అందులో విజయం సాధించిన నేను మొసలి చర్మంతో చేసిన పెట్టెలో ఓ చక్కని వయొలిన్‌ను బహుమతిగా పొందాను.

కాలక్రమేణా, నేను పియానో, బాస్‌ వయొలిన్‌ కూడా నేర్చుకున్నాను. శుక్రవారం, శనివారం సాయంత్రాల్లో జరిగే చిన్న చిన్న పార్టీల్లో, కళాశాల విద్యార్థి సంఘాల్లో జరిగే డాన్సుల్లో తరచుగా మా గ్రూపు వాయించేది. ఇలాంటి ఒక డాన్స్‌లోనే మొదటిసారిగా నేను ఐలీన్‌ను కలిశాను. హైస్కూల్లోని నా చివరి సంవత్సరంలో సిటీ అంతటా పలు ఆర్కెస్ట్రా గ్రూపులతో కలిసి పనిచేశాను. గ్రాడ్యుయేషన్‌ పూర్తయిన తర్వాత ఫర్డీ మౌరి ఆర్కెస్ట్రా అనే పేరుగల చిన్న బ్యాండ్‌లో జాయినవ్వమని ఆహ్వానం అందుకున్నాను. అది 1943 వరకు మంచి జీతముతో స్థిరమైన ఉద్యోగంగా నిలిచింది.

యెహోవా గురించి తెలుసుకోవడం

మొదటి ప్రపంచయుద్ధం ప్రారంభమవ్వడానికి కొంచెం ముందుగా మొదట మా తల్లిదండ్రులకు బైబిలు సత్యం తెలిసింది. అప్పుడు మా నాన్నగారు టొరాంటో పట్టణంలోని ఒక డిపార్ట్‌మెంటల్‌ స్టోర్‌లో విండోడ్రెస్సర్‌గా పని చేస్తున్నారు. అక్కడ ఆయనతోపాటు పని చేసే ఇద్దరు బైబిలు విద్యార్థులు (అప్పట్లో యెహోవాసాక్షులు అలా పిలువబడేవారు) భోజనపు గదిలో మాట్లాడుకునేటప్పుడు ఆయన వింటుండేవారు. అలా విన్న విషయాలను సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మతో పంచుకునేవారు. కొన్ని సంవత్సరాల తర్వాత 1927 లో టొరాంటోలోని కొలిసూమ్‌ దగ్గర ఉన్న కెనడియన్‌ ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో బైబిలు విద్యార్థుల పెద్ద సమావేశం జరిగింది. ఆ గ్రౌండ్స్‌కు పడమటి గేటు వైపుకు రెండు వీధుల అవతల ఉన్న మా ఇల్లు, అమెరికాలోని ఓహాయో నుండి సమావేశం కోసం వచ్చిన 25మందికి వసతిగా మారింది.

అప్పటి నుండి ఏడా బ్లెత్సో అనే ఒక బైబిలు విద్యార్థిని మా అమ్మను తరచూ కలుస్తూ క్రొత్త సాహిత్యాలను ఇచ్చి వెళ్ళడం మొదలుపెట్టింది. ఒకరోజు ఆమె “మిసెస్‌ డన్‌కమ్‌, కొంతకాలం నుండి నేను మీకు మా సాహిత్యాలను ఇస్తున్నాను కదా, వాటిలో దేన్నైనా మీరు చదివారా?” అని అడిగింది. ఆరుగురు పిల్లల పెంపకంలో తలమునకలయ్యే పని ఉన్నప్పటికీ మా అమ్మ అప్పటినుండి ఆ సాహిత్యాలను చదవడం మొదలుపెట్టింది, వాటిని చదవడం ఇక ఆపలేదు. నేనయితే ఆ సాహిత్యం మీద అంతగా శ్రద్ధ చూపించలేదు. ఎందుకంటే నేను గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసే ప్రయత్నంలో ఉన్నాను, అదీకాక సంగీతంలో పూర్తిగా లీనమై ఉన్నాను.

నేనూ ఐలీన్‌, 1935, జూన్‌లో ఒక ఆంగ్లికన్‌ చర్చిలో పెళ్ళి చేసుకున్నాం. నా 13వ ఏట యునైటెడ్‌ చర్చ్‌ ఆఫ్‌ కెనడాను వదిలేసిన తర్వాత, నాకు వేరే ఏ ఇతర మతశాఖలతోనూ సంబంధాల్లేవు. అందుకే పెళ్ళి రిజిస్టర్‌లో నేను యెహోవాసాక్షిని కానప్పటికీ యెహోవాసాక్షినని సంతకం చేశాను.

భవిష్యత్తులో చక్కని తల్లిదండ్రులుగా ఒక కుటుంబాన్ని తయారుచేయాలని మేము కోరుకున్నాము. అందుకే అప్పటినుండి మేమిద్దరం కలిసి బైబిలులోని క్రొత్త నిబంధన చదవడం ప్రారంభించాము. మాకు మంచి ఉద్దేశాలే ఉన్నప్పటికీ కొన్ని అవాంతరాలు వచ్చి పడ్డాయి. మేము మళ్ళీ చదవడానికి ప్రయత్నించాము కానీ కొద్ది రోజుల్లోనే మళ్ళీ అవే ఫలితాలు. అదే సమయంలో, 1935 లో క్రిస్మస్‌కు “ద హార్ప్‌ ఆఫ్‌ గాడ్‌” అనే పుస్తకాన్ని బహుమతిగా అందుకున్నాము. అది చూసి నా భార్య, “ఏమిటీ . . . ! క్రిస్మస్‌ బహుమతి, అదీ మీ అమ్మ, మనకు పంపించడమా!” అని ఆశ్చర్యంగా నాతో అంది. ఏమైతేనేం నేను డ్యూటీకి వెళ్ళిన తరువాత ఆమె ఆ పుస్తకాన్ని చదవడం మొదలుపెట్టింది, చదివిన దాన్ని ఆమె ఇష్టపడింది. కొంతకాలం వరకు నాకా విషయం గురించి ఏమీ తెలీదు. మేము ఆశించిన విధంగా మా కుటుంబం రూపు దిద్దుకోలేదు. 1937, ఫిబ్రవరి 1న పుట్టిన మా పాప బ్రతకలేదు. అప్పుడు మేము ఎంత దుఃఖించామో!

అది మా కుటుంబ సభ్యులమంతా ప్రకటనా పనిలో చాలా చురుగ్గా పాల్గొంటున్న సమయం. కన్సోలేషన్‌ (ఇప్పుడు తేజరిల్లు!) పత్రికకు చందాదార్లను చేయడం లక్ష్యంగా ఉన్న ఆ నెలలో, రాజ్య ప్రచారకుడిగా మా నాన్నగారు మాత్రమే ఆ లక్ష్యాన్ని చేరుకోలేకపోయారని నాకు తెలిసింది. అది తెలిసి నాకు బాధ అనిపించింది. అప్పటివరకూ సొసైటీ ప్రచురణలు నేను చదవనప్పటికీ “మీరు నన్ను చందాదారునిగా చేసుకోండి నాన్నగారూ, అప్పుడు మీరు కూడా మిగతా ప్రచారకులతో సమానమౌతారు” అని అన్నాను. వేసవికాలం రాగానే ఊరవతల ఉన్న ఒక రిసోర్ట్‌లో పనిచేయడానికి మా ఆర్కెస్ట్రా వెళ్ళింది. అక్కడికి కన్సోలేషన్‌ పత్రిక పోస్ట్‌లో వచ్చేది. చలికాలం ప్రారంభమవగానే, మా ఆర్కెస్ట్రా తిరిగి టొరాంటోకు వచ్చింది. మా క్రొత్త అడ్రస్‌కు పత్రిక వస్తూనే ఉంది. నేను వాటిలో నుండి కనీసం ఒక్క పత్రిక కవరు కూడా విప్పలేదు.

క్రిస్మస్‌ సెలవుల్లో కుప్పగా పేరుకుపోయిన ఆ పత్రికలను చూసి, నేను వీటి కోసం డబ్బులు కట్టాను కాబట్టి కనీసం వాటిలో ఏముందో చూడడానికయినా కొన్ని చదవాలి అనుకున్నాను. నేను తెరిచిన మొదటి పత్రిక నన్ను ఆశ్చర్యచకితుణ్ణి చేసింది. అది రాజకీయ కుతంత్రాలను, అవినీతిని బట్ట బయలుచేస్తోంది. నేను చదివే వాటి గురించి నా తోటి సంగీతకారులతో మాట్లాడ్డం ప్రారంభించాను. నేను చెప్పేది ఎంతవరకు నిజమని వాళ్ళు నాతో వాదించేవారు. నేను చెప్పేది నిజమని నిరూపించడానికైనా వాటిని క్రమంగా చదవాల్సి వచ్చింది. అలా నాకు తెలియకుండానే యెహోవా గురించి నేను సాక్ష్యమివ్వడం ప్రారంభించాను. ఇక అప్పటినుండి ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు’ అందించే ఆ అద్భుతమైన బైబిలు ఆధారిత ప్రచురణలు చదవడం ఆపలేదు.​—⁠మత్తయి 24:⁠45.

వారమంతా నా పనితో తీరిక లేకుండా ఉన్నప్పటికినీ, త్వరలోనే ఐలీన్‌తోపాటు నేను ఆదివారం కూటాలకు హాజరవడం ప్రారంభించాను. 1938 లో ఒక ఆదివారం, మేము కూటాల హాలుకు చేరుకోగానే ఇద్దరు వయసు మళ్ళిన సహోదరీలు మమ్మల్ని కలిసి పలకరించారు. వారిలో ఒక సహోదరి, “తమ్ముడూ, నీకు తెలుసా అర్మగిద్దోను సమీపంలో ఉంది. మరి యెహోవా వైపు ఉంటానని నీవు నిశ్చయించుకున్నావా?” అని నన్ను అడిగింది. అప్పటికల్లా యెహోవాయే నిజమైన దేవుడని తెలుసుకున్న నేను, ఇది ఆయన సంస్థ అని కూడా గట్టిగా నమ్ముతున్నాను. నేనూ ఆ సంస్థలో ఒకడినవ్వడానికి 1938, అక్టోబరు 15న బాప్తిస్మం తీసుకున్నాను. దాదాపు ఆరు నెలల తర్వాత ఐలీన్‌ కూడా బాప్తిస్మం తీసుకుంది. మా కుటుంబంలోని వారందరూ యెహోవాకు సమర్పించుకున్న సేవకులే అని చెప్పడానికి నాకెంతో సంతోషంగా ఉంది.

దేవుని ప్రజల సహవాసంలో నేనెంత ఆనందాన్ని అనుభవించానో! వారి మధ్యలో ఉన్నప్పుడు మా ఇంట్లోవారితో ఉన్నట్టే అనిపించేది. ఎప్పుడైనా మీటింగుకు వెళ్ళలేకపోతే, ఆ రోజు మీటింగులో ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఆత్రపడేవాణ్ణి. మొదట్లో చెప్పిన ఆ రాత్రి సంఘటన యెహోవాను సేవించడానికి నాకొక మలుపు లాంటిది.

గొప్ప మార్పు జరిగిన సమయం

1943, మే 1న మరొక గమనించదగిన మార్పు జరిగింది. మేము హాజరైన మొదటి పెద్ద సమావేశము, 1942 సెప్టెంబరులో ఓహాయోలోని క్లీవ్‌లాండ్‌లో జరిగిన న్యూ వరల్డ్‌ థియోక్రటిక్‌ అసెంబ్లీ. అది రెండవ ప్రపంచయుద్ధం జోరుగా జరుగుతున్న సమయం, యుద్ధం ముగిసే సూచనలు దరిదాపుల్లో కనిపించని పరిస్థితుల్లో, అప్పటి వాచ్‌ టవర్‌ సొసైటీ అధ్యక్షుడైన సహోదరుడు నార్‌ ధైర్యంగా ఇచ్చిన “శాంతి​—⁠అది నిలుస్తుందా” అనే బహిరంగ ప్రసంగాన్ని మేము విన్నాము. ఆ ప్రసంగంలో, యుద్ధం తర్వాత శాంతి కాలం వస్తుందని, అప్పుడు గొప్ప ప్రకటనా పని నెరవేర్చబడుతుందని ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం నుండి ఆయన ఎలా చూపించాడో మాకు బాగా గుర్తుంది.

సహోదరుడైన నార్‌ దాని కంటే ముందిచ్చిన “యొఫ్తా మరియు ఆయన వాగ్దానము” అన్న ప్రసంగం మమ్మల్ని ఎంతో ప్రభావితం చేసింది. దాని తరువాత ఎక్కువ మంది పయినీర్లు కావాలని ప్రకటించారు! ఐలీన్‌ నేను ఒకర్నొకరం చూసుకొని అక్కడ ముందుకు వచ్చిన చాలామందితో కలిసి అంతా ఒకేసారి “అందుకు మేము సిద్ధం!” అని అన్నాము. ఆ ముఖ్యమైన పనిలో ముందుకు సాగడానికి కావలసిన ఏర్పాట్లను వెంటనే ప్రారంభించాము.

కెనడాలో 1940, జూలై 4 నుండి యెహోవాసాక్షుల ప్రకటనా పని నిషేధించబడింది. మేము 1943, మే 1న, పయినీర్లుగా నియమించబడినప్పుడు ప్రకటించడం కానీ సాహిత్యాలు పంచడం కానీ ఇంకా నిషేధంలోనే ఉంది. కాబట్టి, క్రైస్తవ సేవకులుగా మేము మా స్వంత కింగ్‌ జేమ్స్‌ వర్షన్‌ బైబిలు కాపీలను మాత్రమే పట్టుకు వెళ్ళేవాళ్ళం. మా మొదటి పయినీర్‌ నియామకంతో ఓంటారియాలోని పారీ సౌండ్‌ పట్టణానికి చేరుకున్న కొద్ది రోజులకు, మాతోపాటు పనిచేయడానికి బ్రాంచ్‌ ఆఫీసు నుండి స్టీవర్ట్‌ మాన్‌ అనే ఒక అనుభవజ్ఞుడైన పయినీరు పంపించబడ్డారు. అది ఎంత చక్కని ఏర్పాటు! సహోదరుడు మాన్‌ మంచి సంస్కారం గల ఎప్పుడూ నవ్వు ముఖంతో ఉండే వ్యక్తి. మేము ఎన్నో విషయాలు ఆయన నుండి నేర్చుకుంటూ సంతోషంగా సమయం గడిపాం. సొసైటీ మమ్మల్ని తిరిగి హామిల్టన్‌ సిటీకి నియమించేటప్పటికి మేము కొన్ని బైబిలు పఠనాలు చేస్తున్నాము. దాని తర్వాత కేవలం కొద్ది కాలానికే నేను మిలటరీకి తగిన వయసు దాటినప్పటికినీ మిలటరీలో చేరమని నాకు పిలుపు వచ్చింది. నేను మిలటరీలో చేరను అన్న తిరస్కారం 1943, డిసెంబరు 31న నా అరెస్ట్‌కు కారణమయ్యింది. ఆయుధాలు వాడని ఒక ఆర్మీ పబ్లిక్‌ సర్వీస్‌ కాంప్‌లో పనిచేయాలని కోర్టు నాకు తీర్పునిచ్చింది. నేను 1945 ఆగస్టు వరకు అక్కడే ఉన్నాను.

నేను విడుదల అయిన వెంటనే ఐలీన్‌తో కలిసి మేము అందుకున్న పయినీర్‌ నియామకంతో ఓంటారియోలోని కార్న్‌వాల్‌కు వెళ్ళాం. దాని తర్వాత కొద్ది కాలానికి సొసైటీ లీగల్‌ డిపార్ట్‌మెంట్‌ స్పెషల్‌ పోలీస్‌ కోర్ట్‌ అసైన్‌మెంటును మా చేతిలో పెట్టి క్యూబెక్‌కు పంపించింది. నిరంకుశాధికారిగా పేరు గాంచిన డ్యూప్‌లెస్సీ ప్రధానమంత్రిగానూ, అటార్ని జనరల్‌గానూ ఉన్న సమయమది, అప్పుడు అక్కడ యెహోవాసాక్షులు చాలా తీవ్రంగా హింసింపబడుతున్నారు. చాలా రోజుల వరకు, మన సహోదరుల సహాయార్థం నేను వారానికి నాలుగు విడి విడి కోర్టులకు వెళ్ళాల్సి వచ్చేది. ఎంతో ఉత్తేజపరిచేవిగా విశ్వాసాన్ని ఎంతో బలపరిచేవిగా ఉన్న రోజులవి.

1946 లోని క్లీవ్‌లాండ్‌ సమావేశము తర్వాత వచ్చిన ప్రాంతీయ, జిల్లా పైవిచారణకర్త నియామకాల కారణంగా నేను, నా భార్య కెనడాలోని ఇవతలి సముద్రతీరం నుండి అవతలి సముద్రతీరం వరకూ వెళ్ళాం. అన్ని విషయాలు చాలా వేగంగా జరుగుతున్నాయి. 1948 లో వాచ్‌టవర్‌ బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌ నుండి 11వ తరగతి కోసం మాకు పిలుపువచ్చింది. ఆల్బర్ట్‌ ష్రోడర్‌, మాక్స్‌వెల్‌ ఫ్రెండ్‌ అనే ఇద్దరు ఇన్‌స్ట్రక్టర్‌లు, 40 మంది అభిషిక్తులతో కలిపితే 108 మంది విద్యార్థులు ఉన్న బ్యాచ్‌ మాది, చాలా కాలం నుండి యెహోవా సేవ చేస్తున్న వారితో సహవాసం ఎంతో జ్ఞానదాయకమైన, సంతృప్తికరమైన అనుభవం!

ఒకరోజు బ్రూక్లిన్‌ నుండి సహోదరుడు నార్‌ మమ్మల్ని సందర్శించారు. ఆయన ప్రసంగంలో జపాను భాష నేర్చుకోవడానికి 25 మంది స్వచ్ఛంద సేవకులు కావాలన్నారు. మొత్తం 108 మంది ముందుకు వచ్చారు! ఎవరిని ఎంచుకోవాలనే పని ఇక అధ్యక్షునికే మిగిలింది. అప్పుడు జరిగిన ఎంపికకు నిజంగా యెహోవాయే నడిపింపు ఇచ్చాడని అనుకుంటాను, అందుకే అన్నీ చక్కని ఫలితాలు వచ్చాయి. ఎన్నుకోబడిన ఆ 25 మందిలో చాలామంది, తరువాత జపానులో ప్రకటనా పని ప్రారంభించే ఆధిక్యతను పొందారు. వారింకా అక్కడే ఉన్నారు. అవును, వృద్ధులుగా ఇంకా అక్కడే ఉన్నారు. అయితే లాయిడ్‌ బ్యారీ, మెల్బా బ్యారీల వలె వేరే నియామకాల కారణంగా కొందరు జపాన్‌ నుండి వెళ్ళిపోయారు. లాయిడ్‌, గత సంవత్సరం చనిపోయేంత వరకు పరిపాలక సభ సభ్యుడిగా ఉన్నారు. యెహోవా గొప్ప బహుమతిగా ఇచ్చిన వారందరి సహవాసంతో మేమెంతో ఆనందించాము.

గ్రాడ్యుయేషన్‌ రోజు రానే వచ్చింది, మమ్మల్ని జమైకాకు నియమించారు. అయినప్పటికీ క్యూబాలోని తీర్పు చెప్పని కొన్ని కేసుల మూలంగా మమ్మల్ని తిరిగి కెనడా వెళ్ళమన్నారు.

మరింత ఎక్కువ సంగీతం!

పయినీరు సేవ కోసం నేను సంగీతాన్ని వదలిపెట్టినా అది నన్ను వదలిపెట్టనట్టుంది. 1949 లో సొసైటీ అధ్యక్షుడు నేథన్‌ నార్‌, ఆయన సెక్రటరీ మిల్టన్‌ హెన్షెల్‌ టొరాంటోలోని మేపుల్‌ లీఫ్‌ గార్డెన్స్‌ అనే పేరుగల ప్రదర్శనశాలకు వచ్చారు. అక్కడ ఆయన బహిరంగ ప్రసంగం, “మీరనుకున్న దాని కన్నా ఆలస్యంగా” ప్రతి ఒక్కరినీ ఉత్తేజితుల్ని చేసింది. అప్పుడే మొదటిసారిగా సమావేశపు ఆర్కెస్ట్రా నడిపించడానికి నన్ను ఆహ్వానించారు. కింగ్‌డమ్‌ సర్వీస్‌ సాంగ్‌ బుక్‌ (1944)లో చాలా మందికి ఇష్టమైన కొన్ని పాటలకు మేము వాల్ట్స్‌ సంగీతాన్ని కూర్చాము. అది సహోదరులు ఇష్టపడ్డారని నాకనిపించింది. శనివారం మధ్యాహ్న కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆదివారం కోసం మేము అభ్యాసం చేసుకుంటున్నాము. సహోదరుడు హెన్షెల్‌ మా వైపు రావడం గమనించాను. ఆయనను కలవడానికి ఆర్కెస్ట్రా ఆపాన్నేను. ఇక్కడ “మీ ఆర్కెస్ట్రాలో ఎంతమందున్నారు” అని ఆయన అడిగారు. “అందరూ హాజరవుతే 35 మంది ఉంటాం” అని జవాబిచ్చాను. “అయితే ఇంతకు రెట్టింపు మంది, రానున్న వేసవికాలంలో న్యూయార్క్‌లో మీతో ఉంటారు” అని ఆయన జవాబిచ్చారు.

ఆ వేసవికాలం రాకముందే నన్ను బ్రూక్లిన్‌కు రమ్మని సంస్థ ఆహ్వానించింది. కొన్ని పరిస్థితుల కారణంగా మొదట ఐలీన్‌ నాతో రాలేకపోయింది. అప్పటికింకా 124 కొలంబియా హైట్స్‌ బిల్డింగ్‌ పూర్తి కాలేదు. అందుకే నాకు బేతేలులోని ఒక చిన్న గదిలో ఒక పడక ఇచ్చారు. ఆ గదిలో అప్పటికే, వృద్ధ సహోదరుడైన పేన్‌, అలాగే నేను మొదటిసారిగా కలుసుకుంటున్న సహోదరుడు కార్ల్‌ క్లైన్‌ అనే ఇద్దరు అభిషిక్త క్రైస్తవులుంటున్నారు. అది చాలా ఇరుకైన గది. అయినప్పటికీ మేము చక్కగా కలిసిపోయాము. ఆ వృద్ధ సహోదరులు దీర్ఘశాంతము, ఓర్పు కలిగినవారు. వారు నడిచేటప్పుడు దారి నుండి నేను ప్రక్కకు తప్పుకోవడానికి ప్రయత్నించేవాడిని! దేవుని ఆత్మ ఏమి సాధించగలదనే దానికి సంబంధించి నాకు విలువైన పాఠమది, సహోదరుడు క్లైన్‌ను కలుసుకోవడం ఆయనతో కలిసి పని చేయడం ద్వారా అలాంటి ఆశీర్వాదాలు పొందాను! ఆయన ఎప్పుడూ దయతో సహాయం చేస్తుండేవారు. మేము ఎంతో చక్కగా కలిసి పనిచేశాం. 50 సంవత్సరాలకు పైగా మంచి స్నేహితుల్లా ఉన్నాం.

1950, 1953, 1955, 1958లలో యాంకీ స్టేడియంలో జరిగిన సమావేశాల్లో నేను సంగీతంలో సహాయం చేసే ఆధిక్యతను పొందగలిగాను. వాటితోపాటు 1963 లో కాలిఫోర్నియాలోని పాసడీన రోస్‌ బౌల్‌ స్టేడియంలో జరిగిన సమావేశంలో అల్‌కాల్విన్‌తో ఆర్కెస్ట్రా బాధ్యతలు పంచుకున్నాను. యాంకీ స్టేడియంలో 1953 లో జరిగిన సమావేశంలో ఆదివారం బహిరంగ ప్రసంగానికి ముందు ఒక సంగీత కార్యక్రమం ప్రదర్శించబడింది. ఎరిక్‌ ఫ్రాస్ట్‌, “ఫార్వర్డ్‌ యూ విట్‌నెసెస్‌” అనే పాటను కంపోజ్‌ చేసిన ఎడిత్‌ షెమియోనిక్‌ను, ఆ పాటను మా ఆర్కెస్ట్రాతోపాటు పాడిన సోప్రానోను పరిచయం చేశారు. అప్పుడు మన ఆఫ్రికన్‌ సహోదర సహోదరీల చక్కని గొంతులను మొదటిసారిగా విని పులకించిపోయాము. ఉత్తర రోడేషియా (ఇప్పుడు జాంబియా) నుండి మిషనరీ అయిన హారి ఆర్నాట్‌ మంచి క్యాసెట్టు తెచ్చారు. స్టేడియం మొత్తం దాని సౌండ్‌తో నిండిపోయింది.

1966 పాటల పుస్తకం రికార్డింగ్‌

సింగింగ్‌ అండ్‌ అకంపెనీయింగ్‌ యువర్‌సెల్ఫ్‌ విత్‌ మ్యూజిక్‌ ఇన్‌ యువర్‌ హార్ట్స్‌” అనే గులాబీ రంగు కవరుండే పాటల పుస్తకం మీకు గుర్తుందా? ఆ పుస్తకాన్ని తయారుచేయడం  ర్తయ్యే సమయంలో సహోదరుడు నార్‌ నాతో ఇలా చెప్పారు: “మేము కొన్ని పాటలు రికార్డ్‌ చేయబోతున్నాము. మీరు దానికి కొన్ని వయొలిన్‌లు, ఒక జత పిల్లనగ్రోవులు ఉన్న ఒక చిన్న ఆర్కెస్ట్రాతో ఏర్పాట్లు చేయాలి. బూరలు ఊదేవారు మాత్రం వద్దు!” ఇంగ్లీషులో బూరలు ఊదడం అంటే ప్రగల్భాలు పలకడం అని అర్థం. బేతేలులోని రాజ్యమందిరం మా స్టూడియో, కాని దాన్ని ఉపయోగించేటప్పుడు ఒక సమస్య ఎదురవుతుందేమోనని భయం, సౌండ్‌ప్రూఫ్‌ లేని గోడలు, టైల్స్‌ ఉన్న ఫ్లోర్‌, మడత కుర్చీలు శబ్దం ప్రతిధ్వనించేలా చేస్తాయి. ఆ అపశృతి దొర్లకుండా పరిష్కారం ఎవరు చూపిస్తారు? అని ఆయన అడిగారు. ఎవరో “టామీ మిచెల్‌!” అని సూచించారు, ఆ సహోదరుడు అమెరికన్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కంపెనీ నెట్‌వర్క్‌ స్టూడియోస్‌లో పని చేస్తున్నాడు. సహోదరుడు మిచెల్‌ను కలిసి మా సమస్య గురించి చెప్పగానే, మాకు సహాయం చేయడానికి ఆయన సంతోషంగా ఒప్పుకున్నాడు.

రికార్డింగ్‌ చేద్దామనుకున్న మొదటి శనివారం రానే వచ్చింది, సంగీతకారులు ఒకర్నొకరు పరిచయం చేసుకుంటున్నారు, అందులో ఒక సహోదరుని దగ్గర ట్రోంబోన్‌ పెట్టె ఒకటి కనపడింది. నాకు సహోదరుడు నార్‌, “బూరలు ఊదేవారు మాత్రం వద్దు!” అన్న మాటలు గుర్తొచ్చాయి. ఇప్పుడు నేనేం చేయగలను? ఆ సహోదరుడు పెట్టెలో నుండి దాన్ని బయటికి తీసి సిద్ధపడుతున్నాడు. ఆ సహోదరుడు మరెవరో కాదు టామ్‌ మిచెల్‌, ఆయన మొదటి కొన్ని స్వరాలు అద్భుతం. ఆయన ట్రోంబోన్‌ను వయొలిన్‌ లాగా పలికించాడు. ‘ఆ సహోదరుడు ఉండాల్సిందే!’ అనుకున్నాను. సహోదరుడు నార్‌ అభ్యంతరమేమీ చెప్పలేదు.

ఆ ఆర్కెస్ట్రాలో ప్రేమగల సహోదర సహోదరీలు అయిన మంచి సంగీతకారులు ఉన్నారు. అందులో సున్నిత మనస్కులు ఎవరూ లేరు! రికార్డింగ్‌ కోసం ఎంతో శ్రమపడాల్సివచ్చినా ఎటువంటి అవకతవకలు లేకుండానే జరిగింది. రికార్డింగ్‌ అయిపోయిన తర్వాత మేము విడిపోయే ముందు అందరి కళ్ళలో కన్నీళ్ళతో పాటు మంచి మిత్రులను కలిశామనే తృప్తి కనిపించింది. ప్రతి ఒక్కరూ ఆ ఆధిక్యతను ఆనందించాము. చివరికి మేము పని పూర్తి చేయగలిగాము అందుకు యెహోవాకు కృతజ్ఞతలు.

అదనంగా ఆధిక్యతల ప్రతిఫలాలు

చాలా సంవత్సరాల తర్వాత ఇప్పటికీ కూడా నేను పూర్తికాల సేవను ఆనందంగా కొనసాగించగల్గుతున్నాను. 28 సంవత్సరాలు ప్రాంతీయ, జిల్లా పనుల్లో నియామకాలు చేశాను. అందులో ప్రతి ఒక్కటీ ఆనందదాయకమైనదే. దాని తర్వాత 5 సంవత్సరాలు ఓంటారియోలోని నార్వల్‌ అసెంబ్లీ హాలు బాధ్యతలను నిర్వహించడంలో గడిపాను. ప్రతి వారాంతం ఒక ప్రాంతీయ సమావేశము మరియు ఇతర భాషల జిల్లా సమావేశాలతో నేను, ఐలీన్‌ చాలా బిజీగా ఉండేవాళ్ళం. ఆర్కిటెక్ట్‌లు, ఇంజనీర్లు 1979/80 లో హాల్టన్‌ హిల్స్‌లో సొసైటీ క్రొత్త బ్రాంచ్‌ కోసం ప్లాన్‌లు వేస్తున్న కాలంలో ఆ హాల్‌ను ఉపయోగించుకున్నారు. అసెంబ్లీ హాలు పని తర్వాత, మా నియమకాన్ని బ్రూక్లిన్‌కు మార్చారు, అక్కడ 1982 నుండి 1984 వరకూ సంగీతరంగంలో భాగం వహించాను.

మా 59వ పెళ్ళిరోజు తర్వాత సరిగ్గా ఏడురోజులకు, 1994, జూన్‌ 17న నా ప్రియమైన భార్య చనిపోయింది. మేమిద్దరం కలిసి 51 సంవత్సరాలు విశ్వాసంగా పయినీరింగ్‌ చేశాము.

నా జీవితంలోని అన్ని అనుభవాలను తరచి చూస్తే, బైబిలు ఎలా నాకు చాలా విలువైన మార్గదర్శకమైందో గుర్తుకువస్తుంది. కొన్నిసార్లు నేను ఐలీన్‌ బైబిల్ని ఉపయోగించేవాడిని. అందులో ఆమె మార్కు చేసిన పదాలు, అండర్‌లైన్‌ చేసిన లేఖనాలు చూసి అవి ఆమెను ఎలా స్పందింపజేశాయో అని ఊహించి ఎంతో సంతోషించేవాడిని. ఐలీన్‌ను స్పందింపజేసినట్లే నాకూ ప్రత్యేక అర్థాన్నిచ్చిన లేఖనాలున్నాయి, అందులో ఒకటి 137వ కీర్తన. అది యెహోవాకు చేసే చక్కని ప్రార్థనను వ్యక్తపరుస్తుంది: “యెరూషలేమా, నేను నిన్ను మరచినయెడల నా కుడిచేయి వీణ వాయించడం మరచును గాక! నేను నిన్ను జ్ఞాపకము చేసికొననియెడల, నా ముఖ్య సంతోషముకంటె హెచ్చుగా ఎంచనియెడల నేనెన్నడూ మరల పాడకుందును గాక!” (కీర్తన 137:​5, 6, టుడేస్‌ ఇంగ్లీష్‌ వెర్షన్‌) నేను సంగీతాన్ని ప్రేమించినప్పటికీ, నా జీవితం సంతృప్తితో ఉండేలా నాకు ప్రతిఫలమిచ్చిన యెహోవాను యథార్థంగా సేవించడంలోనే నాకు గొప్ప సంతోషము కలుగుతుంది.

[అధస్సూచి]

^ పేరా 1 అప్పటినుండి ఎవరైనా బాప్తిస్మం తీసుకుని యెహోవాసాక్షి అవ్వాలంటే ముందు సిగరెట్లు ఎందుకు మానెయ్యాలి అనే విషయం 1973, జూన్‌ 1, కావలికోటలో వివరించబడింది.

[28వ పేజీలోని చిత్రం]

ఐలీన్‌తో 1947 లో

[30వ పేజీలోని చిత్రం]

ప్రారంభంలోని ఒక రికార్డింగ్‌ కార్యక్రమంలో