కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సుదీర్ఘమైన అన్వేషణకు ప్రతిఫలం

సుదీర్ఘమైన అన్వేషణకు ప్రతిఫలం

సుదీర్ఘమైన అన్వేషణకు ప్రతిఫలం

“యెహోవా? యెహోవా ఎవరు?” అన్నవి సిల్వియా అడుగుతున్న ప్రశ్నలు. ఒక చిన్న అమ్మాయి తన కుటుంబ సంపదయైన ఆర్మీనియన్‌ బైబిలులో నుండి ఎనిమిదేండ్ల సిల్వియాకు ఆ పేరును చూపించింది. ఆర్మీనియా దేశంలోని యరెవెన్‌ పట్టణంలో ఆమె నివసిస్తున్న సిల్వియా తన తల్లిదండ్రులను టీచర్లను చివరికి స్థానిక చర్చి పాస్టర్‌లను యెహోవా ఎవరు అని అడిగింది, కానీ వాళ్ళెవ్వరూ సమాధానం చెప్పలేకపోయారు.

సిల్వియా పెద్దదై పాఠశాల చదువు ముగించి ఉద్యోగం సంపాదించింది, కానీ యెహోవా ఎవరో ఆమెకు ఇంకా తెలియలేదు. యౌవనస్థురాలైనప్పుడు, ఆమె ఆర్మీనియా నుండి పారిపోవలసివచ్చింది, కొంతకాలమైన తర్వాత ఇతర శరణార్థులతో కలిసి పోలాండ్‌ చేరుకుని చిన్న గదిలో నివసించనారంభించింది. ఆమెతో ఉన్నవారిలో ఒకామెను కొంతమంది క్రమంగా దర్శించేవారు. “మీ ఇంటికి వచ్చేది ఎవరు?” అని సిల్వియా అడిగింది. దానికి సమాధానం, “వారు యెహోవాసాక్షులు, నాకు బైబిలు గురించి బోధించడానికి వస్తారు.”

యెహోవా పేరు విన్నప్పుడు సిల్వియా హృదయం ఆనందంతో గంతులు వేసింది. చివరికి ఆమె యెహోవా ఎవరో ఎంత ప్రేమగల దేవుడో నేర్చుకోవడం మొదలుపెట్టింది. త్వరలోనే ఆమె పోలండ్‌ను విడిచిపెట్టాల్సివచ్చింది. బాల్టిక్‌ సముద్రం ఆవలనున్న డెన్మార్క్‌లో ఆమె ఆశ్రయం పొందింది. ఆమె తీసుకువెళ్ళిన వస్తువులు చాలా తక్కువే కానీ వాటిలో యెహోవాసాక్షులు ప్రచురించిన బైబిలు సాహిత్యాలు కూడా ఉన్నాయి. ఆ ప్రచురణలలోని ఒక దాని వెనుక పేజీలో వాచ్‌ టవర్‌ సొసైటీ బ్రాంచ్‌ కార్యాలయాల చిరునామాలను చూసింది. తన దగ్గరున్న వాటన్నింటిలోకెల్లా అదే అత్యంత అమూల్యమైన ఆస్తి​—⁠యెహోవాను కనుగొనేందుకు గల ఒకే ఒక్క మార్గం!

డెన్మార్క్‌లో సిల్వియాను ఒక శరణార్థ శిబిరానికి తీసుకువెళ్ళారు, అక్కడామె వెంటనే యెహోవాసాక్షుల కోసం వెదకడం ప్రారంభించింది. ఆమె దగ్గరవున్న చిరునామాల ప్రకారం డెన్మార్క్‌లోని వాచ్‌ టవర్‌ సొసైటీ బ్రాంచ్‌ కార్యాలయం హాల్‌బేక్‌ పట్టణంలో ఉందని తెలిసింది. కానీ అది ఎక్కడ ఉంది? సిల్వియాను మరొక శిబిరానికి బదిలీచేస్తుండగా ఆమె ప్రయాణిస్తున్న రైలు హాల్‌బేక్‌ గుండా వెళ్ళింది! మళ్ళీ ఆమె హృదయం ఆనందంతో ఉప్పొంగింది.

ఆ తర్వాత, ఒకరోజు సిల్వియా హాల్‌బేక్‌కు రైలులో ప్రయాణించి వచ్చి, స్టేషన్‌నుండి బ్రాంచ్‌ ఆఫీసుకు నడిచివచ్చింది. “నేను తోటలోకి ప్రవేశించి, ఒక బెంచ్‌పై కూర్చొని అక్కడి వాతావరణాన్ని చూసిన నేను, ‘ఇదే పరదైసు!’ అని నాలో చెప్పుకున్నాను” అని ఆమె గుర్తు చేసుకుంటుంది. ఆ బ్రాంచ్‌లో అందరూ హృదయపూర్వకంగా ఆమెను ఆహ్వానించి తనకు ఒక బైబిలు పఠనం ఏర్పాటు చేశారు.

కానీ ఆమెను అనేకసార్లు బదిలీ చేశారు. ఆమె ఎక్కడున్నా ఆ శిబిరం నుండి యెహోవాసాక్షులను వెతుక్కుంటూ వెళ్ళి వారితో బైబిలు పఠనం చేయించుకొనేది. రెండు సంవత్సరాల తర్వాత యెహోవాకు తన జీవితాన్ని సమర్పించుకునేంతగా నేర్చుకుంది. ఆ తర్వాత ఆమె బాప్తిస్మం తీసుకుని, పూర్తికాల పరిచర్యను ప్రారంభించింది. డానిష్‌ అధికారులు 1998 లో ఆమెకు తమ దేశంలో ఆశ్రయాన్నివ్వడానికి అనుమతించారు.

ఇప్పుడు సిల్వియాకు 26 సంవత్సరాలు, ఆమె తనకు పరదైసును గుర్తుచేసిన డెన్మార్క్‌లోని యెహోవాసాక్షుల బ్రాంచ్‌ కార్యాలయంలో ఆమె ఇప్పుడు సేవ చేస్తుంది. ఆమె ఇలా అంటోంది: “నేను ఏమని చెప్పేది?” “చిన్న పిల్లగా ఉన్నప్పటినుండి నేను యెహోవాను వెదుకుతున్నాను. ఇప్పటికి ఆయనను కనుగొన్నాను. నా జీవితాన్ని ఆయన సేవ కోసం గడపాలని కలలు కన్నాను, ఇదిగో ఇప్పుడు నేను బేతేలులో ఉన్నాను. రాబోయే సంవత్సరాల్లో ఇదే నా గృహంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను!”