కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“ఆయన గడియ యింకను రాలేదు”

“ఆయన గడియ యింకను రాలేదు”

“ఆయన గడియ యింకను రాలేదు”

“ఆయన గడియ యింకను రాలేదు గనుక ఎవడును ఆయనను పట్టుకొనలేదు.”​—యోహాను 7:⁠30.

1. యేసు జీవిత గమనాన్ని ఏ రెండు అంశాలు నిర్దేశించాయి?

“మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెనని” యేసుక్రీస్తు తన అపొస్తలులకు చెప్పాడు. (మత్తయి 20:​28) రోమా అధిపతియైన పొంతి పిలాతుతో ఆయనిలా అన్నాడు: “సత్యమునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని; ఇందు నిమిత్తమే యీ లోకమునకు వచ్చితిని.” (యోహాను 18:​37) తాను ఎందుకు మరణించనైయున్నాడో, తన మరణానికి ముందు తాను ఏ పని చేయవలసి ఉందో యేసుకు కచ్చితంగా తెలుసు. తాను ఎంత కాలంపాటు తన పనిని నెరవేర్చవలసి ఉందో కూడా ఆయనకు తెలుసు. మెస్సీయాగా ఆయన ఈ భూమి మీద చేయవలసిన పరిచర్య కాలం కేవలం మూడున్నర సంవత్సరాలు మాత్రమే. ప్రవచించబడిన 70వ వారారంభంలో ఆయన యోర్దాను నదిలో బాప్తిస్మం (సా.శ. 29 లో) తీసుకోవడంతో అది ప్రారంభమై, ఆ వారపు మధ్యభాగంలో (సా.శ. 33 లో) హింసాకొయ్యపై ఆయన మరణించడంతో ముగిసింది. (దానియేలు 9:24-27; మత్తయి 3:16, 17; 20:​17-19) కాబట్టి, ఈ భూమిపైని యేసు జీవిత గమనాన్నంతటినీ కేవలం రెండు అంశాలు నిర్దేశించాయి: ఆయన రావడానికి గల సంకల్పం, సమయాన్ని గూర్చి ఆయనకున్న కచ్చితమైన అవగాహన.

2. సువార్తల్లో యేసుక్రీస్తు ఎలా చిత్రీకరించబడ్డాడు, ఆయన తనకు అప్పగించబడిన పని గురించి తనకు అవగాహన ఉందని ఎలా చూపించాడు?

2 దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఎన్నో అద్భుత క్రియలను చేస్తూ పాలస్తీనా అంతటా ఈ కొననుండి ఆ కొనవరకు విస్తృతంగా ప్రయాణించిన కార్యశూరునిగా సువార్త వృత్తాంతాలు యేసుక్రీస్తును చిత్రీకరిస్తున్నాయి. యేసు శక్తివంతమైన పరిచర్య తొలిభాగంలో, ఆయన గురించి ఇలా చెప్పబడింది: “ఆయన గడియ యింకను రాలేదు.” యేసే స్వయంగా ఇలా చెప్పాడు: “నా సమయమింకను పరిపూర్ణము కాలేదు.” ఆయన తన పరిచర్య ముగింపుకు వస్తుండగా ఇలా అన్నాడు: “గడియ వచ్చియున్నది.” (యోహాను 7:8, 30; 12:​23) గడియను గురించి, అంటే తన బలి మరణంతో సహా తనకు అప్పగించబడిన పనిని నెరవేర్చవలసిన సమయం గురించి యేసుకున్న అవగాహన, ఆయన మాటలనూ చర్యలనూ తప్పక ప్రభావితం చేసివుంటుంది. ఆయనకున్న ఈ అవగాహనను అర్థం చేసుకోవడం ఆయన వ్యక్తిత్వం గురించి, ఆయన ఆలోచనా విధానం గురించి మనకు అంతర్దృష్టిని కలుగజేయడమే గాక, మరింత సన్నిహితంగా ఆయన “అడుగుజాడలయందు నడుచుకొనునట్లు” మనకు సహాయం చేస్తుంది.​—⁠1 పేతురు 2:⁠21.

దేవుని చిత్తాన్ని చేయటానికి కృతనిశ్చయం

3, 4. (ఎ) కానాలో ఒక పెళ్లి విందులో ఏమి జరుగుతుంది? (బి) ద్రాక్షారసం కొరతను తీర్చటానికి ఏదైనా చేయమని మరియ ఇచ్చిన సూచనను దేవుని కుమారుడు ఎందుకు నిరాకరిస్తాడు, దీని నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

3 అది సా.శ. 29వ సంవత్సరం. యేసు తన తొలి శిష్యులను వ్యక్తిగతంగా ఎంపిక చేసుకుని కేవలం కొద్ది రోజులే గడిచాయి. వాళ్లంతా ఇప్పుడు ఒక పెళ్లి విందుకు హాజరు కావడానికి గలిలయలోని కానా అనే గ్రామానికి వచ్చారు. యేసు తల్లి మరియ కూడా అక్కడే ఉంది. అక్కడ పెళ్లి విందు ముగియక ముందే ద్రాక్షారసం అయిపోతుంది. ఆయనేదో ఒకటి చేయాలని సూచిస్తూ, మరియ తన కుమారునితో, “వారికి ద్రాక్షారసము లేదని” అంటుంది. దానికి యేసు, “అమ్మా, నాతో నీకేమి (పని)? నా సమయమింకను రాలేద”ని సమాధానమిస్తాడు.​—⁠యోహాను 1:35-51; 2:1-4.

4 “అమ్మా, నాతో నీకేమి (పని)?” అని యేసు వేసిన ప్రశ్న, ప్రాచీన కాలంలో ఎవరైనా ఏదైనా సూచించినప్పుడు లేక ప్రతిపాదించినప్పుడు దానిపట్ల ఉన్న తమ అభ్యంతరాన్ని తెలియజేయడానికి వేసేటువంటి ప్రశ్న. మరియ మాటలకు యేసు ఎందుకు అభ్యంతరం చెప్పాడు? ఇప్పుడాయనకు 30 సంవత్సరాల వయస్సు. కేవలం కొన్ని వారాల క్రితం, ఆయన బాప్తిస్మం తీసుకుని, పరిశుద్ధాత్మతో అభిషేకించబడి, బాప్తిస్మమిచ్చే యోహానుచే “లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్ల”గా పరిచయం చేయబడ్డాడు. (యోహాను 1:29-34; లూకా 3:​21-23) ఇప్పుడాయనకు నిర్దేశం రావలసింది ఆయనను పంపిన సర్వోన్నతాధికారి నుండి. (1 కొరింథీయులు 11:⁠3) యేసు ఈ భూమి మీదికి ఏ పని మీద అయితే వచ్చాడో ఆ పనిలో జోక్యం చేసుకునే అధికారం ఎవ్వరికీ, చివరికి సన్నిహిత కుటుంబ సభ్యులకు కూడా లేదు! యేసు మరియకిచ్చిన సమాధానంలో తన తండ్రి చిత్తం చేయాలన్న ఎంతటి కృతనిశ్చయం వ్యక్తమవుతుంది కదా! అలాగే మనం దేవునిపట్ల మనకున్న “విధి”ని నెరవేర్చేందుకు కృతనిశ్చయం కల్గివుందాము.​—⁠ప్రసంగి 12:⁠13.

5. యేసుక్రీస్తు కానాలో ఏ అద్భుతం చేస్తాడు, అది ఇతరులపై ఏ ప్రభావాన్ని చూపుతుంది?

5 తన కుమారుడు చెప్పినదాన్ని అర్థం చేసుకున్న మరియ వెంటనే ప్రక్కకు వెళ్లి పరిచారకులను ఉద్దేశించి, “ఆయన మీతో చెప్పునది చేయుడనెను.” యేసు సమస్యను పరిష్కరిస్తాడు. బానలను నీళ్లతో నింపమని పరిచారకులకు చెప్పి, ఆయన ఆ నీళ్లను మంచి ద్రాక్షారసంగా మారుస్తాడు. అద్భుతాలు చేసేందుకు యేసుకున్న శక్తి దీనితో మొదటిసారిగా వెల్లడవుతుంది, దేవుని ఆత్మ ఆయన మీద ఉందని అది చూపిస్తుంది. ఈ అద్భుతాన్ని చూసిన క్రొత్త శిష్యుల విశ్వాసం బలపర్చబడుతుంది.​—⁠యోహాను 2:5-11.

యెహోవా ఇంటిని గూర్చిన ఆసక్తి

6. యెరూషలేములోని ఆలయంలో తాను చూసిన దాన్ని బట్టి యేసు ఎందుకు ఉగ్రుడయ్యాడు, ఆయన ఏ చర్య తీసుకుంటాడు?

6 అది సా.శ. 30 వసంతకాలం, యేసు ఆయన సహచరులు పస్కా పండుగ ఆచరించటానికి యెరూషలేముకు వెళ్తున్నారు. అక్కడున్నప్పుడు, ఆయన శిష్యులు తమ నాయకుడు బహుశ మునుపెన్నడూ ప్రవర్తించని విధంగా ప్రవర్తించడాన్ని చూస్తారు. అత్యాశాపరులైన యూదా వర్తకులు బలుల కోసం అవసరమైన జంతువులను, పక్షులను ఆలయం లోపలే అమ్ముతున్నారు. వాళ్లు నమ్మకమైన యూదా ఆరాధకుల నుండి ఎక్కువ డబ్బును వసూలు చేస్తున్నారు. యేసు ఉగ్రుడైపోయి కార్యశూరుడౌతాడు. ఆయన త్రాళ్లతో కొరడా తయారు చేసి ఆ అమ్మే వాళ్లనందరినీ వెళ్లగొడతాడు. రూకలు మార్చేవారి డబ్బును క్రింద చల్లేసి, వాళ్ల బల్లలను పడద్రోస్తాడు. పావురాలను అమ్మేవారిని చూసి, “వీటిని ఇక్కడ నుండి తీసికొనిపొండి” అని శాసిస్తాడు. యేసు అంత ఉద్రేకంతో చర్య తీసుకోవటం ఆయన శిష్యులు చూసినప్పుడు, “నీ యింటినిగూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని” దేవుని కుమారుని గురించి చెప్పబడిన ప్రవచనాన్ని వాళ్లు జ్ఞాపకం చేసుకుంటారు. (యోహాను 2:13-17; కీర్తన 69:⁠9) లోకసంబంధమైన ప్రవృత్తుల మూలంగా మన ఆరాధన కలుషితమై పోకుండా మనం కూడా అత్యంతాసక్తిని ప్రదర్శిస్తూ జాగ్రత్త వహించాలి.

7. (ఎ) మెస్సీయాను దర్శించటానికి నికోదేమును ఏమి ప్రేరేపిస్తుంది? (బి) యేసు సమరయ స్త్రీకి సాక్ష్యమివ్వడం నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

7 యెరూషలేములో ఉన్నప్పుడు యేసు విశేషమైన సూచకక్రియలు చేస్తాడు, చాలామంది ఆయనను విశ్వసిస్తారు. చివరికి యూదుల అత్యున్నత న్యాయసభయైన సన్హెడ్రిన్‌లో సభ్యుడైన నికోదేము యేసును బట్టి ఎంతో ప్రభావితుడై, మరింత సమాచారం తెలుసుకోవటానికి రాత్రి వేళ ఆయన దగ్గరికి వస్తాడు. అటుతర్వాత యేసూ ఆయన శిష్యులూ ప్రకటిస్తూ, శిష్యులను చేస్తూ ఎనిమిది నెలలపాటు “యూదయ దేశము”లో ఉంటారు. అయితే, బాప్తిస్మమిచ్చే యోహాను చెరసాలలో వేయబడిన తర్వాత, వాళ్లు యూదయ వదిలి గలిలయకు వెళ్తారు. వాళ్లు సమరయ దేశంగుండా ప్రయాణిస్తుండగా, సమరయ స్త్రీకి సంపూర్ణంగా సాక్ష్యమిచ్చే అవకాశాన్ని యేసు సద్వినియోగం చేసుకుంటాడు. చాలామంది సమరయులు విశ్వాసులయ్యేందుకు ఇది మార్గాన్ని ఏర్పరుస్తుంది. దేవుని రాజ్యం గురించి మాట్లాడేందుకు అవకాశాల కోసం మనం కూడా అప్రమత్తంగా ఉందాము.​—⁠యోహాను 2:23; 3:1-22; 4:1-42; మార్కు 1:⁠14.

గలిలయలో విస్తృతంగా బోధించడం

8. యేసు గలిలయలో ఏ పని ప్రారంభిస్తాడు?

8 యేసు మరణ “గడియ”కు ముందు, ఆయన తన పరలోక తండ్రి సేవలో చేయవలసింది ఇంకా ఎంతో ఉంది. యేసు యూదయ, యెరూషలేములలో కంటే గలిలయలో ఇంకా ఎక్కువగా పరిచర్య చేస్తాడు. ఆయన “వారి సమాజమందిరములలో బోధించుచు, (దేవుని) రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు, ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయయందంతట” సంచరిస్తాడు. (మత్తయి 4:​23) “పరలోకరాజ్యము సమీపించియున్నది గనుక మారుమనస్సు పొందుడని” ఆయన చెప్పిన సవాలుతోకూడిన మాటలు గలిలయ అంతటా మారుమ్రోగుతాయి. (మత్తయి 4:​17) కొన్ని నెలల్లో, యేసును గురించిన నివేదికను స్వయంగా సేకరించాలని బాప్తిస్మమిచ్చు యోహాను శిష్యులిద్దరు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, “మీరు వెళ్లి, కన్నవాటిని విన్నవాటిని యోహానుకు తెలుపుడి. గ్రుడ్డివారు చూపుపొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయినవారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది; నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడని” ఆయన వారితో అంటాడు.​—⁠లూకా 7:22, 23.

9. జనసమూహాలు యేసుక్రీస్తు వద్దకు ఎందుకు వచ్చేవారు, దీని నుండి మనమే పాఠం నేర్చుకోవచ్చు?

9 ‘యేసును గూర్చిన సమాచారము ఆ ప్రదేశమందంతట వ్యాపిస్తుంది,’ గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయల నుండి, యోర్దాను నదికి అవతలి వైపు నుండి ప్రజలు గొప్ప జనసమూహాలుగా ఆయన దగ్గరకు వస్తారు. (లూకా 4:14, 15; మత్తయి 4:​24, 25) వాళ్లు ఆయన దగ్గరకు వచ్చేది ఆయన చేసే అద్భుతమైన స్వస్థతలను బట్టే కాకుండా ఆయన చేసే ఆశ్చర్యకరమైన బోధలను బట్టి కూడా. ఆయనిచ్చే సందేశం ఆకర్షణీయమైనది, ప్రోత్సాహకరమైనది. (మత్తయి 5:1–7:​27) యేసు మాటలు దయగలవి, ఆహ్లాదాన్నిచ్చేవి. (లూకా 4:​22) ఆయన లేఖనాల నుండి అధికారంతో మాట్లాడేవాడు గనుక జనసమూహాలు “ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి.” (మత్తయి 7:28, 29; లూకా 4:​32) అలాంటి వ్యక్తి వైపుకు ఎవరు మాత్రం ఆకర్షితులవ్వరు? యథార్థహృదయులైన వారు సత్యం వైపుకు ఆకర్షించబడేలా మనం కూడా మన బోధించే కళను వృద్ధి చేసుకుందాము.

10. నజరేతు పట్టణవాసులు యేసును చంపాలని ఎందుకు ప్రయత్నిస్తారు, కానీ వాళ్లెందుకు విఫలమౌతారు?

10 అయితే, విన్నదాన్ని అనుసరించే వారే కాదు, మరో రకం ప్రజలు కూడా యేసు శ్రోతల్లో ఉన్నారు. అందుకే, ఆయన పరిచర్య తొలికాలంలో ఆయన తన స్వంత పట్టణమైన నజరేతులోని సమాజమందిరంలో బోధిస్తున్నప్పుడు కూడా ఆయనను చంపటానికి ప్రయత్నించడం జరుగుతుంది. ఆయన “దయగల మాటలను” బట్టి పట్టణ ప్రజలు ఆశ్చర్యపోయినప్పటికీ, ఇంకా అద్భుతాలు చూడాలని వారు కోరుకుంటారు. అయితే అక్కడ అనేకమైన అద్భుతమైన కార్యాలు చేయడానికి బదులు, యేసు వారి స్వార్థాన్ని, అవిశ్వాసాన్ని బహిర్గతం చేస్తాడు. సమాజమందిరంలో ఉన్నవాళ్లు కోపోద్రేకంతో లేచి యేసును పట్టుకుని, ఆయనను తలక్రిందులుగా క్రిందికి పడద్రోయాలని ఒక కొండ చరియ దగ్గరికి తీసుకు వెళ్తారు. కానీ ఆయన వాళ్ల పట్టు నుండి తప్పించుకుని క్షేమంగా వెళ్లిపోతాడు. ఆయన మరణ “గడియ” ఇంకా రాలేదు.​—⁠లూకా 4:16-30.

11. (ఎ) కొంతమంది మతనాయకులు యేసు చెప్పేది వినటానికి ఎందుకు వస్తారు? (బి) యేసు విశ్రాంతిదినాన్ని ఉల్లంఘిస్తున్నాడని ఎందుకు నిందించబడ్డాడు?

11 మత నాయకులు అంటే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, మరితరులు కూడా తరచూ యేసు ప్రకటించేటప్పుడు అక్కడ ఉండేవారు. అయితే వారిలో చాలామంది అక్కడ ఉన్నది విని నేర్చుకోవటానికి కాదు గానీ ఆయనను తప్పుపట్టి, ఆయనను ఇరుకున పెట్టాలనే. (మత్తయి 12:38; 16:1; లూకా 5:17; 6:​1, 2) ఉదాహరణకు, యేసు సా.శ. 31వ సంవత్సరం పస్కా పండుగ కోసం యెరూషలేమును సందర్శించినప్పుడు, 38 సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని స్వస్థపరుస్తాడు. విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించాడని యూదా మతనాయకులు యేసును నిందిస్తారు. “నా తండ్రి యిదివరకు పనిచేయుచున్నాడు, నేనును చేయుచున్నానని” ఆయన వారికి సమాధానమిస్తాడు. దేవుడ్ని తండ్రి అని పిలుస్తూ తాను దేవుని కుమారుడనని చెప్పుకున్నందుకు యూదులు ఇప్పుడాయనపై దేవదూషణ అనే నిందవేస్తారు. వాళ్లు యేసును చంపటానికి ప్రయత్నిస్తారు, కానీ ఆయనా ఆయన శిష్యులూ యెరూషలేము నుండి గలిలయకు వెళ్లిపోతారు. అలాగే, మనం కూడా వ్యతిరేకులతో అనవసరంగా తలపడడం జ్ఞానయుక్తం కాదు, ఎందుకంటే మనం మన శక్తిసామర్థ్యాలను రాజ్య ప్రకటనా పని కోసం, శిష్యులను చేసే పని కోసం వెచ్చించాలి.​—⁠యోహాను 5:1-18; 6:⁠1.

12. యేసు గలిలయలో ఎంత విస్తృతంగా ప్రకటించాడు?

12 దాదాపు ఒకటిన్నర సంవత్సరాలపాటు, యేసు తన పరిచర్యను గలిలయకు మాత్రమే పరిమితం చేసి, యూదుల మూడు వార్షిక పండుగలకు హాజరు కావటానికి మాత్రం యెరూషలేముకు వెళ్తాడు. మొత్తమ్మీద, ఆయన గలిలయలో మూడు ప్రకటనా పర్యటనలు చేస్తాడు: మొదటిది తన నలుగురు క్రొత్త శిష్యులతో, రెండవది తన 12మంది అపొస్తలులతో, మూడవది తర్ఫీదు పొందిన తన అపొస్తలులను పంపిస్తూ చేసిన విస్తృతమైన పర్యటన. గలిలయలో సత్యానికి ఎంత విస్తృతమైన సాక్ష్యం ఇవ్వబడిందో కదా!​—⁠మత్తయి 4:18-25; లూకా 8:1-3; 9:1-6.

యూదయ, పెరయలలో ధైర్యంగా ప్రకటించడం

13, 14. (ఎ) యేసును పట్టుకోవాలని యూదులు ఏ సందర్భంలో ప్రయత్నిస్తారు? (బి) అధికారులు యేసును ఎందుకు నిర్బంధించలేకపోతారు?

13 అది సా.శ. 32 శరదృతువు, ఇంకా యేసు “గడియ” రాలేదు. పర్ణశాలల పండుగ దగ్గరలో ఉంది. యేసు సహోదరులు ఇప్పుడు, “ఈ స్థలము విడిచి యూదయకు వెళ్లుము” అని ఆయనకు చెప్తారు. యేసు తనకున్న అద్భుతమైన శక్తులను యెరూషలేములో పండుగ కోసం సమావేశమైవున్న వాళ్లందరికీ చూపించాలన్నది వాళ్ల కోరిక. అయితే రాగల ప్రమాదం గురించి యేసుకు తెలుసు. కాబట్టి ఆయన తన సహోదరులతో, “నా సమయమింకను పరిపూర్ణము కాలేదు గనుక నేను ఈ పండుగకు ఇప్పుడే వెళ్లనని” చెప్తాడు.​—⁠యోహాను 7:1-8.

14 గలిలయలో కొంత సమయం గడిపిన తర్వాత, యేసు యెరూషలేముకు “బహిరంగముగా వెళ్లక రహస్యముగా” వెళ్తాడు. “ఆయన ఎక్కడ” అని అడుగుతూ యూదులు పండుగలో ఆయన కోసం నిజంగానే వెదుకుతున్నారు. పండుగ సగం అయిపోయినప్పుడు, యేసు ఆలయంలోకి వెళ్లి ధైర్యంగా బోధించడం మొదలు పెడతాడు. వాళ్లు ఆయనను పట్టుకోవటానికి ప్రయత్నిస్తారు, బహుశ ఆయనను చెరసాలలో వేయడానికో లేక ఆయనను చంపడానికో అయ్యుండవచ్చు. అయినా ‘ఆయన గడియ ఇంకా రాలేదు’ గనుక వాళ్లు సఫలం కాలేకపోతారు. ఇప్పుడు అనేకులు యేసునందు విశ్వాసం ఉంచుతారు. ఆయనను పట్టుకోవటానికి పరిసయ్యులు పంపిన అధికారులు కూడా ఉట్టి చేతులతో తిరిగి వచ్చి, “ఆ మనుష్యుడు మాటలాడినట్లు ఎవడును ఎన్నడును మాటలాడలేదనిరి.”​—⁠యోహాను 7:9-14, 30-46.

15. యేసుపై రువ్వటానికి యూదులు రాళ్లు ఎందుకు ఎత్తుతారు, అటు తర్వాత ఆయన ఏ ప్రకటనా పనిని ప్రారంభిస్తాడు?

15 పండుగ సమయంలో యేసు తన తండ్రి గురించి బోధిస్తుండగా, ఆయనకూ యూదా వ్యతిరేకులకూ మధ్య విభేదాలు తలెత్తుతూనే ఉంటాయి. పండుగ చివరి దినాన, యేసు తన మానవపూర్వ ఉనికిని గురించి చేసిన వ్యాఖ్యానాలను బట్టి ఉగ్రులై యూదులు ఆయనపైకి రువ్వటానికి రాళ్లు ఎత్తుతారు. కానీ ఆయన దాక్కుని ఏ హానీ జరక్కుండా తప్పించుకుని వెళ్లిపోతాడు. (యోహాను 8:​12-59) యెరూషలేము వెలుపల ఉండి యేసు యూదయలో సాక్ష్యమిచ్చే పనిని ప్రారంభిస్తాడు. ఆయన 70 మంది శిష్యులను ఎంపిక చేసుకుని, వాళ్లకు ఉపదేశించిన తర్వాత, ఆ ప్రాంతంలో పని చేయటానికి ఆయన ఇద్దరిద్దరినిగా పంపిస్తాడు. యేసు ఆయన అపొస్తలులు ఏయే స్థలాల్లోకి, ఏయే నగరాల్లోకి వెళ్లాలనుకుంటారో ఆయా స్థలాల్లోకి, నగరాల్లోకి ఆ 70 మంది ముందుగా వెళ్తారు.​—⁠లూకా 10:1-24.

16. ఆలయ ప్రతిష్ఠిత పండుగ సమయంలో యేసు ఏ ప్రమాదం నుండి తప్పించుకుంటాడు, మళ్లీ ఆయన ఏ పనిలో నిమగ్నమైపోతాడు?

16 సా.శ. 32 శీతకాలంలో, యేసు “గడియ” సమీపిస్తోంది. ఆలయ ప్రతిష్ఠిత పండుగకు ఆయన యెరూషలేముకు వస్తాడు. యూదులు ఇప్పటికీ ఆయనను చంపటానికి ప్రయత్నిస్తున్నారు. యేసు దేవాలయంలో మంటపము వద్ద నడుస్తుండగా, వాళ్లు ఆయన్ను చుట్టుముడతారు. దేవదూషణ చేశాడని ఆయనను మళ్లీ నిందిస్తూ, వాళ్లు ఆయనను చంపటానికి రాళ్లు ఎత్తుతారు. కానీ యేసు మునుపటి సందర్భాల్లోలాగానే తప్పించుకుంటాడు. త్వరలోనే ఆయన మళ్లీ బోధించే పనిలో పడతాడు, ఈ సారి ఆయన పెరియలోనూ, యూదయ నుండి యోర్దాను నది అవతలి ప్రాంతం వరకు నగరం నుండి నగరానికి, గ్రామం నుండి గ్రామానికి ప్రయాణిస్తాడు. అనేకులు ఆయనయందు విశ్వాసం ఉంచుతారు. కానీ ఆయన ప్రియ స్నేహితుడైన లాజరును గురించిన కబురు ఆయనను మళ్లీ యూదయకు తీసుకువస్తుంది.​—⁠లూకా 13:33; యోహాను 10:20-42.

17. (ఎ) పెరియలో ప్రకటిస్తున్నప్పుడు యేసు ఏ అత్యవసర సందేశాన్ని అందుకుంటాడు? (బి) తాను తీసుకోవలసిన చర్యల వెనుకనున్న సంకల్పం గురించి, అవి జరుగవలసిన సమయం గురించి యేసుకు తెలుసని ఏది సూచిస్తుంది?

17 యూదయలోని బేతనియలో నివసిస్తున్న లాజరు సహోదరీలైన మార్త మరియల నుండి ఆ అత్యవసరమైన కబురు వచ్చింది. “ప్రభువా, యిదిగో నీవు ప్రేమించువాడు రోగియై యున్నాడని” సందేశం అందుతుంది. “యీ వ్యాధి మరణముకొరకు వచ్చినదికాదు గాని దేవుని కుమారుడు దానివలన మహిమ పరచబడునట్లు దేవుని మహిమకొరకు వచ్చిన”దని యేసు సమాధానమిస్తాడు. ఈ సంకల్పాన్ని నెరవేర్చటానికి, యేసు ఉద్దేశపూర్వకంగానే, తాను ఉన్నచోటనే రెండు రోజులు ఉండిపోతాడు. తర్వాత ఆయన “మనము యూదయకు తిరిగి వెళ్లుదమని” తన శిష్యులతో అంటాడు. అప్రతిభులై వాళ్లిలా అంటారు: “బోధకుడా, యిప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరే; అక్కడికి తిరిగి వెళ్లుదువా?” కానీ “పగటివేళ,” అంటే దేవుడు తన భూపరిచర్య కోసం కేటాయించిన సమయం ఇంకా కొంచెమే మిగిలి ఉందని యేసుకు తెలుసు. తాను ఏమి చేయవలసి ఉందో, ఎందుకు చేయవలసి ఉందో ఆయనకు కచ్చితంగా తెలుసు.​—⁠యోహాను 11:1-10.

ఎవరూ అలక్ష్యం చేయలేని ఒక అద్భుతం

18. యేసు బేతనియకు వచ్చేసరికి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఆయన అక్కడికి వచ్చిన తర్వాత ఏమి జరుగుతుంది?

18 బేతనియలో ముందుగా మార్త యేసును కలిసి, “ప్రభువా, నీవిక్కడ ఉండినయెడల నా సహోదరుడు చావకుండును” అంటుంది. మరియ, అలాగే వాళ్ల ఇంటికి వచ్చిన ఇతరులు కూడా ఆమెతోపాటు యేసు దగ్గరికి వస్తారు. వాళ్లంతా ఏడుస్తున్నారు. “అతని నెక్కడ నుంచితిరని” యేసు అడుగుతాడు. “ప్రభువా, వచ్చి చూడుమని” వాళ్లు సమాధానమిస్తారు. వాళ్లు సమాధి దగ్గరికి, అంటే ఒక రాయి పొర్లించబడివున్న ఒక గుహ దగ్గరికి వచ్చే సరికి, “రాయి తీసివేయుడని” యేసు అంటాడు. యేసు ఏమి చేయాలనుకుంటున్నాడో అర్థం కాక మార్త అభ్యంతరం చెప్తూ, “ప్రభువా, అతడు చనిపోయి నాలుగు దినములైనది గనుక ఇప్పటికి వాసనకొట్టునని” అంటుంది. కానీ, “నీవు నమ్మినయెడల దేవుని మహిమచూతువని నేను నీతో చెప్పలేదా?” అని యేసు ఆమెనడుగుతాడు.​—⁠యోహాను 11:17-40.

19. లాజరును పునరుత్థానం చేసే ముందు యేసు ఎందుకు బహిరంగంగా ప్రార్థిస్తాడు?

19 లాజరు సమాధిపై నుండి రాయిని తొలగించిన తర్వాత, తాను చేయబోయేది దేవుని శక్తితోనే అని అందరూ తెలుసుకునేలా యేసు బిగ్గరగా ప్రార్థిస్తాడు. తర్వాత ఆయన “లాజరూ, బయటికి రమ్మని” బిగ్గరగా పిలుస్తాడు. కాళ్లు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడి, ముఖానికి రుమాలు చుట్టబడి ఉన్న లాజరు బయటికి వస్తాడు. “అతని కట్లు విప్పిపోనియ్యుడని” యేసు చెప్తాడు.​—⁠యోహాను 11:41-44.

20. యేసు లాజరును పునరుత్థానం చేయడాన్ని చూసినవారు ఎలా ప్రతిస్పందిస్తారు?

20 మార్త మరియలను ఓదార్చడానికి వచ్చిన అనేకమంది యూదులు ఈ అద్భుతాన్ని చూసి యేసునందు విశ్వాసం ఉంచుతారు. మరితరులు జరిగినది పరిసయ్యులకు చెప్పటానికి వెళ్తారు. వారి ప్రతిస్పందన? వెంటనే, వాళ్లూ ప్రధాన యాజకులూ యూదుల న్యాయ సభను అత్యవసరంగా సమావేశ పరుస్తారు. ఆందోళనతో వాళ్లు, “మనమేమి చేయుచున్నాము? ఈ మనుష్యుడు అనేకమైన సూచకక్రియలు చేయుచున్నాడే. మనమాయనను ఈలాగు చూచుచు ఊరకుండినయెడల అందరు ఆయనయందు విశ్వాస ముంచెదరు; అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకొందురని” విలపిస్తారు. కానీ ప్రధాన యాజకుడైన కయప, “మీకేమియు తెలియదు. మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజలకొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు” అని వారితో అంటాడు. అప్పటి నుండి వాళ్లు యేసును చంపటానికి ఆలోచన చేస్తుంటారు.​—⁠యోహాను 11:45-53.

21. లాజరు పునరుత్థాన అద్భుతం దేనికి సూచనగా ఉంది?

21 అదీ, బేతనియకు తాను రావటానికి ఆలస్యం చేసి యేసు, ఎవరూ అలక్ష్యం చేయలేని అద్భుతాన్ని చేసిన రీతి. దేవుని నుండి శక్తి పొందిన వాడై యేసు, నాలుగు రోజులుగా మరణించివున్న వ్యక్తిని పునరుత్థానం చేస్తాడు. ప్రతిష్ఠాత్మకమైన యూదుల న్యాయసభ సహితం ఆ విషయాన్ని గమనించి తీరాల్సివచ్చింది; అద్భుతక్రియల కర్తకు అది మరణ శిక్ష విధిస్తుంది! ఈ అద్భుతం యేసు పరిచర్యలో ఒక ముఖ్యమైన మలుపుకు, అంటే “గడియ యింకను రాలేదు” అనే కాలము నుండి “గడియ వచ్చియున్నది” అనే కాలానికి మారే మలుపుకు సూచనగా పని చేస్తుంది.

మీరెలా సమాధానమిస్తారు?

• దేవుడు తనకు అప్పగించిన పని గురించి తనకు తెలుసని యేసు ఎలా చూపించాడు?

• ద్రాక్షారసం గురించి తన తల్లి ఇచ్చిన సూచనకు యేసు ఎందుకు అభ్యంతరం తెలిపాడు?

• యేసు తరచూ వ్యతిరేకులతో వ్యవహరించిన విధానం నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

• లాజరు అనారోగ్యం గురించి విని కూడా యేసు వెళ్లేందుకు ఆలస్యం చేయటానికి గల కారణం ఏమిటి?

[అధ్యయన ప్రశ్నలు]

[12వ పేజీలోని చిత్రాలు]

యేసు తన శక్తిసామర్థ్యాలను దేవుడు తనకు అప్పగించిన బాధ్యతను నెరవేర్చటానికి వెచ్చించాడు