త్వరలోనే నిరాశా నిస్పృహల్లేని ఒక లోకం
త్వరలోనే నిరాశా నిస్పృహల్లేని ఒక లోకం
జీవన వేగం విపరీతంగా పెరిగిపోతోంది, నిరాశా నిస్పృహలకు కారణాలూ ఎక్కువైపోతున్నాయి. ఇలాంటి పరిస్థితి మనకు ఎదురైనప్పుడు మన భావాలను అణచుకోవడం మనకు కష్టంగా ఉంటుండవచ్చు. పరిస్థితులు అంత ఘోరంగా ఉండకపోయినా జీవాన్ని ప్రేమించే వ్యక్తులు కూడా సంతోషరాహిత్యానికి గురికాగలరు! కొన్ని ఉదాహరణలను చూడండి.
ప్రాచీన కాలాల్లో ప్రవక్తయైన మోషే ఎంత నిరుత్సాహం చెందాడంటే, ఆయన దేవునితో ఇలా అన్నాడు: “నామీద నీ కటాక్షము వచ్చిన యెడల నేను నా బాధను చూడకుండునట్లు నన్ను చంపుము.” (సంఖ్యాకాండము 11:15) తన శత్రువులకు దూరంగా పారిపోతూ ఎలీషా ఇలా వాపోయాడు: “యెహోవా, . . . ఇంతమట్టుకు చాలును, నా ప్రాణము తీసికొనుము.” (1 రాజులు 19:4) ప్రవక్తయైన యోనా ఇలా అన్నాడు: “నేనిక బ్రదుకుటకంటె చచ్చుట మేలు; యెహోవా, నన్నిక బ్రదుకనియ్యక చంపు[ము].” (యోనా 4:3) కానీ మోషే గానీ, ఎలీషా గానీ, యోనా గానీ ఎవ్వరూ ఆత్మహత్య చేసుకోలేదు. వారందరికీ “నరహత్య చేయకూడదు” అన్న దేవుని ఆజ్ఞ తెలుసు. (నిర్గమకాండము 20:13) దేవునిలో ప్రగాఢమైన విశ్వాసం గల వీరందరికీ, ఎటువంటి పరిస్థితీ ఆత్మహత్య చేసుకునేంత నిరాశాజనమైనది కాదనీ, జీవం దేవుడు అనుగ్రహించిన బహుమానమనీ తెలుసు.
నేడు మనం ఎదుర్కొనే సమస్యల విషయమేమిటి? భావోద్రేకమైన లేక శారీరకమైన దుఃఖకర పరిస్థితులకు తోడు, మనం రోమీయులు 1:28-31) అటువంటి ప్రజలు మన చుట్టూ ఉన్నప్పుడు రోజు రోజుకూ జీవించడమే భారంగా అన్పిస్తుంది. ఓదార్పు, ఉపశమనం అవసరమైన వారికి మనం ఎలా సహాయం చేయగలము?
కొన్నిసార్లు మన కుటుంబ సభ్యుల నుండి, పొరుగువారి నుండి, లేదా తోటి పనివారి నుండి కూడా సమస్యల్ని ఎదుర్కోవచ్చు. “సమస్తమైన దుర్నీతిచేతను, దుష్టత్వముచేతను, లోభము చేతను, ఈర్ష్యచేతను నిండుకొని, మత్సరము నరహత్య కలహము కపటము వైరమనువాటితో నిండినవారై కొండెగాండ్రును అపవాదకులును, దేవద్వేషులును, హింసకులును, అహంకారులును, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తలిదండ్రుల కవిధేయులును, అవివేకులును మాట తప్పువారును అనురాగ రహితులును, నిర్దయులునై” ఉండే మనుష్యుల గురించి బైబిలు మాట్లాడుతుంది. (వినడానికి సుముఖత
కష్టతర పరిస్థితులూ బాధలూ ఒక వ్యక్తి మానసిక సమతుల్యాన్ని కోల్పోయేలా చేయగలవు. జ్ఞాని ఇలా అంటున్నాడు: “అన్యాయము చేయుటవలన జ్ఞానులు తమ బుద్ధినికోలుపోవుదురు.” (ప్రసంగి 7:7) అందుకని, ఆత్మహత్య గురించి మాట్లాడే వ్యక్తి ఊరికే తమాషాకి అలా మాట్లాడుతున్నాడని అనుకోకూడదు. ఆ వ్యక్తి ఎదుర్కొనే సమస్యలు భావోద్వేగపరమైనవైనా, శారీరకమైనవైనా, మానసికమైనవైనా, లేదా ఆధ్యాత్మికమైనవైనా వాటిని సత్వరంగా పరిష్కరించాలి. వైద్య విధానాలూ చికిత్సలూ వేర్వేరుగా ఉంటాయి, ఎటువంటి చికిత్స చేయించుకోవాలనే విషయంలో ఒక్కొక్కరు వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకోవాలి.—గలతీయులు 6:5.
ఆత్మహత్యా భావనలు ఏర్పడడానికిగల కారణాలు ఏవైనప్పటికీ, వివేచనగల, సానుభూతి చూపే, ఓర్పుగల వ్యక్తితో మనస్సు విప్పి మాట్లాడడం ఎంతో సహాయకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు, వినటానికి సుముఖత చూపే స్నేహితులు కూడా సహాయం చేయవచ్చు. సహానుభూతి, దయ అనే లక్షణాలను కనపర్చడంతోపాటు, దేవుని వాక్యంలోని క్షేమాభివృద్ధికరమైన విషయాలను తలపోయడం నిరాశాపూరితమైన వ్యక్తికి ఎంతో సహాయం చేయగలవు.
దుఃఖితులకు ఆధ్యాత్మిక సహాయం
బైబిలును చదవడం ఎంత ప్రోత్సాహాన్నివ్వగలదో తెలుసుకుని మీరు ఆశ్చర్యపోతారు. అది మానసిక ఆరోగ్య గ్రంథం కాకపోయినప్పటికీ మనం మన జీవితాలకు విలువివ్వడానికి అది సహాయం చేయగలదు. రాజైన సొలొమోను ఇలా అన్నాడు: “సంతోషముగా నుండుటకంటెను తమ బ్రదుకును సుఖముగా వెళ్లబుచ్చుటకంటెను, శ్రేష్ఠమైనదేదియు నరులకు లేదని నేను తెలిసికొంటిని. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమువలన సుఖమనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలిసికొంటిని.” (ప్రసంగి 3:12, 13) దేవుడిచ్చిన బహుమానాల్లో, జీవితానికి అర్థాన్ని చేకూర్చే సంతృప్తికరమైన పని మాత్రమే కాక, వాటిలో చిన్ని చిన్ని విషయాలూ ఉన్నాయి. తాజా గాలి, వెచ్చని సూరీడు, అందమైన పూలు, చెట్లు, పక్షులు—ఇవ్వన్నీ మనం ఆనందించడానికి దేవుడిచ్చిన బహుమానాలే.
మరింత ఉత్తేజవంతమైన విషయం ఏమిటంటే, యెహోవా దేవుడూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తూ మన విషయంలో శ్రద్ధ వహిస్తున్నారని బైబిలు మనకు హామీనిస్తుంది. (యోహాను 3:16; 1 పేతురు 5:6, 7) యుక్తమైన రీతిలోనే కీర్తనల గ్రంథకర్త ఇలా అన్నాడు: “ప్రభువు స్తుతినొందును గాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు దేవుడే మాకు రక్షణకర్తయై యున్నాడు.” (కీర్తన 68:19) మనం ఏమాత్రం విలువలేనివారమని భావించినప్పటికీ, అయోగ్యులమని భావించినప్పటికీ తనకు ప్రార్థన చేయమని దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. నమ్రతతో నిజాయితీతో తన సహాయాన్ని కోరే ఎవర్నీ ఆయన తృణీకరించడన్న పూర్తి నమ్మకంతో ఉండండి.
ఈ రోజుల్లో సమస్యా రహితమైన జీవితాన్ని అనుభవించాలని ఎవరూ ఆశించరు. (యోబు 14:1) అయినా, దేవుని వాక్యంలోని సత్యం, ఆత్మహత్యే సమస్యలకు సరైన పరిష్కారం కాదని చాలామంది ప్రజలకు చూపించింది. పౌలు ఒక చెరసాల నాయకునికి ఎలా సహాయం చేశాడో పరిశీలించండి. “చెరసాల నాయకుడు మేలుకొని, చెరసాల తలుపులన్నియు తెరచియుండుట చూచి, ఖయిదీలు పారిపోయిరనుకొని, కత్తిదూసి, తన్ను తాను చంపుకొన”బోయాడు. తాను విధి నిర్వహణలో విఫలమైనందుకు శిక్షగా అనుభవించాల్సివచ్చే అవమానకరమైన మరణం కన్నా, బహుశ అధికారులు పెట్టే చిత్రహింసల మూలంగా చనిపోవడం కన్నా ఆత్మహత్యే మేలని ఒక్క క్షణంలోనే నిర్ణయించేసుకున్నాడు. అపొస్తలుడు బిగ్గరగా ఇలా అన్నాడు: “నీవు ఏ హానియు చేసికొనవద్దు, మేమందరము ఇక్కడనే యున్నా[ము]!” పౌలు అంతటితో ఆగిపోలేదు. ఆయనా అలాగే సీల ఆ చెరసాల నాయకుడ్ని ఓదార్చి, “అయ్యలారా, రక్షణపొందుటకు నేనేని చేయవలె[ను]” అన్న ఆయన ప్రశ్నకు వారిలా జవాబిచ్చారు: “ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ యింటివారును రక్షణ పొందుదు[రు].” వారాతర్వాత యెహోవా వాక్యాన్ని ఆయనకూ ఆయన ఇంటివారికీ వివరించారు. దాని ఫలితంగా “అతడును అతని ఇంటివారందరును బాప్తిస్మము పొందిరి.” ఆ చెరసాల నాయకుడూ ఆయన ఇంటివారూ తమ జీవితాల్లో క్రొత్త అర్థాన్ని కనుగొన్నందుకు చాలా సంతోషించారు.—అపొస్తలుల కార్యములు 16:27-35.
నేడున్న దుష్టత్వానికి దేవుడు బాధ్యుడు కాడని తెల్సుకోవడం ఎంత ఉపశమనంగా ఉంటుంది! ఆయన వాక్యం “అపవాదియనియు సాతాననియు పేరుగల” ఒక దుష్ట ఆత్మ ప్రాణిని “సర్వలోకమును మోస పుచ్చు[చున్న]” వాడిగా గుర్తిస్తుంది. కానీ వాని సమయం దగ్గరపడింది. (ప్రకటన 12:9, 12) సాతానూ అతని దయ్యాలూ ఈ భూప్రజలకు తెచ్చిపెట్టిన దుర్దశలన్నీ దేవుడు జోక్యం చేసుకోవడంతో త్వరలోనే అంతమౌతాయి. అప్పుడు దేవుడు వాగ్దానం చేసిన నీతియుక్తమైన నూతన లోకం, నిరాశా నిస్పృహలకూ ఆత్మహత్యలకూ గల కారణాలన్నింటినీ ఇంకెన్నడూ ఉండకుండా శాశ్వతంగా తీసివేస్తుంది.—2 పేతురు 3:13.
సహాయం కోసం ఆక్రందనలు చేస్తున్నవారికి సాంత్వనం
ఇప్పుడు కూడా దుఃఖ హృదయులు లేఖనాల్లో నుండి ఆదరణను పొందవచ్చు. (రోమీయులు 15:4) కీర్తనల గ్రంథకర్తయైన దావీదు ఇలా పాడాడు: “దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు.” (కీర్తన 51:17) నిజమే, మనం కొన్ని శ్రమల్ని ఎదుర్కొంటాం, అపరిపూర్ణత ప్రభావాల్ని అనుభవిస్తాం, ఇది అనివార్యం. కానీ మన దయాపూర్వకమైన, ప్రేమాపూర్ణుడైన, సహేతుకమైన వాడైన పరలోకపు తండ్రిని గురించి సరియైన జ్ఞానాన్ని పొందడం ద్వారా మనం ఆయన దృష్టిలో అమూల్యమైనవారమన్న నమ్మకాన్ని పొందుతాము. దేవుడే మన అతి సన్నిహితుడైన స్నేహితుడూ ఉపదేశకుడూ కాగలడు. మనం యెహోవా దేవునితో అతి దగ్గరి సంబంధాన్ని పెంపొందించుకుంటే ఆయన మనల్నెన్నడూ నిరాశకు గురిచేయడు. మన సృష్టికర్త ఇలా చెబుతున్నాడు: “నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును.”—యెషయా 48:17.
దేవునిపై ఆధారపడడం అనేకమందికి సహాయం చేసింది. కొన్ని ఉదాహరణలు: మారా ఒక్కగానొక్క కొడుకు ఒక ట్రాఫిక్ యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు ఆమె తీవ్రమైన కృంగుదలకు గురైంది. శారీరకంగా కూడా చాలా బలహీనురాలైంది. * ఆమె ఎంతో దిగులుచెంది తన ప్రాణాల్నే తీసేసుకోవాలని ప్రయత్నించింది. అయితే ప్రస్తుతం ఆమె ప్రతిరోజు చక్కగా ఉదయాన్నే లేచి తన ఇంటి పనుల్ని చేసుకుంటుంది. ఆమె చక్కని సంగీతాన్ని ఆస్వాదిస్తుంది, ఇతరులకు సహాయపడుతుంది కూడాను. “నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోవుచున్న”దన్న నిరీక్షణ, తన ప్రియమైన కుమారుని మరణం మూలంగా ఏర్పడిన శూన్యాన్ని కొంత మట్టుకు తీసివేసింది. అలాగే ఆ నిరీక్షణ దేవునిలో ఆమె విశ్వాసాన్నీ బలపర్చింది. (అపొస్తలుల కార్యములు 24:14-15) మారాకు తాను పరలోకంలో దేవదూతలా ఉండాలన్న కోరిక ఎన్నడూ కలుగలేదు గనుక కీర్తన 37:11 లోని, “దీనులు భూమిని స్వతంత్రించుకొందురు బహు క్షేమము కలిగి సుఖించెదరు” అన్న మాటలు ఆమె హృదయాన్ని స్పృశించాయి.
బ్రెజిల్‌లోని సాండ్రా అనే మరో స్త్రీ తన ముగ్గురు పిల్లలకు సంపూర్ణ ఆదర్శవంతమైన తల్లిగా ఉండాలని ఎంతో పాటుపడింది. ఆమె ఇలా ఒప్పుకుంటుంది: “సరిగ్గా మా నాన్నగారు చనిపోయినప్పుడే నా భర్తకు వేరే స్త్రీతో సంబంధం ఉందని తెల్సుకుని నేను ఎంతో కృంగిపోయాను. నాకు సహాయం చేయమని దేవునికి
ప్రార్థన చేయాలన్న తలంపు కూడా నాకు రాలేదు.” నిస్పృహతో సాండ్రా ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. తిరిగి కోలుకోవడానికి ఆమెకేది సహాయం చేసింది? ఆధ్యాత్మిక విషయాలపట్ల ఆమెకు ఉన్న మెప్పుదల. “నేను ప్రతి రోజు రాత్రి నిద్రపోయే ముందు బైబిలును చదువుతాను. నేనందులో చదువుతున్న ప్రజలకూ నాకూ ఏమిటి పోలికలు అని చూస్తాను. బైబిలుతోపాటు నేను కావలికోట, తేజరిల్లు! పత్రికలు చదువుతాను. ముఖ్యంగా నాకు ఆ పత్రికల్లో వచ్చే జీవిత కథలు చాలా ఇష్టం, ఎందుకంటే నేను గడిపే జీవితంతో సంతృప్తి చెందడానికవి నాకు సహాయపడతాయి.” యెహోవా తన అతి గొప్ప స్నేహితుడని తెలుసుకుని ఆమె, తాను చెప్పాలనుకున్న అడగాలనుకున్న విషయాల్ని స్పష్టంగా ప్రార్థనలో పెట్టడం నేర్చుకుంది.త్వరలోనే నిరాశా నిస్పృహల్లేని భవితవ్యం
మానవుల బాధలు తాత్కాలికమేనని తెల్సుకోవడం ఎంతటి ఆదరణను కలుగజేస్తుంది! నేడు హింసాత్మక సంఘటనలకూ అన్యాయాలకూ లేదా అకారణ విద్వేషాలకూ గురౌతున్న పిల్లలూ పెద్దలూ అందరూ దేవుని రాజ్య పరిపాలన క్రింద ఆనందిస్తారు. ప్రవచనాత్మక కీర్తనలో ముందే చెప్పబడినట్లుగా “దరిద్రులు మొఱ్ఱపెట్టగా” యెహోవా నియమించిన రాజైన యేసుక్రీస్తు “వారిని విడిపించును.” “దీనులను నిరాధారులను అతడు విడిపించును.” అంతేగాక, “నిరుపేదలయందును బీదలయందును అతడు కనికరించును. బీదల ప్రాణములను అతడు రక్షించును.” నిజానికి, “కపట బలాత్కారములనుండి అతడు వారి ప్రాణమును విమోచించును. వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును.”—కీర్తన 72:12-14.
ఆ ప్రవచనాత్మక మాటల నెరవేర్పు జరిగే సమయం చాలా దగ్గర్లో ఉంది. అటువంటి పరిస్థితుల్లోని నూతన లోకంలో నిత్య జీవమనే తలంపు మీకు ఆకర్షణీయంగా కన్పించడం లేదా? మీకలాగే అన్పిస్తున్నట్లైతే, జీవం దేవుడిచ్చిన బహుమానంగా అమూల్యంగా దృష్టిస్తూ దాన్ని ఆనందంతో అనుభవించటానికి మీకు సరైన కారణాలు ఉన్నట్లే. ఈ ఆదరణకరమైన లేఖనాధార వాగ్దానాల్ని ఇతరులతో పంచుకుంటే, మీరు ఎవరికెవరూ పట్టింపు లేని ఈ లోకంలో, ప్రేమరాహిత్యమైన ఈ లోకంలో సహాయం కోసం ఆక్రందనలు చేసే వారి జీవితాల్లో ఆనందాల వెలుగుల్ని నింపగలరు.
[అధస్సూచి]
^ పేరా 15 కొన్ని పేర్లు మార్చబడ్డాయి.
[6వ పేజీలోని చిత్రం]
నేడు ఆనందంగా ఉండడానికి ఎన్నో సందర్భాలున్నాయి
[7వ పేజీలోని చిత్రం]
నిరాశా నిస్పృహల్లేని లోకం కోసం మీరెదురు చూస్తున్నారా?