కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నమ్రతగల యోషీయా యెహోవా అనుగ్రహాన్ని పొందాడు

నమ్రతగల యోషీయా యెహోవా అనుగ్రహాన్ని పొందాడు

నమ్రతగల యోషీయా యెహోవా అనుగ్రహాన్ని పొందాడు

యూదయ రాకుమారుడైన ఐదేళ్ళ యోషీయా చాలా బెదిరిపోయివుంటాడు. ఆయన తల్లి యెదీదా రోదిస్తోంది. కారణం, యోషీయా తాతగారైన రాజైన మనష్షే మరణం.​—⁠2 రాజులు 21:⁠18.

యోషీయా తండ్రియైన ఆమోను యూదయకు రాజయ్యాడు. (2 దినవృత్తాంతములు 33:​20) కానీ రెండు సంవత్సరాల తర్వాత (సా.శ.పూ. 659) ఆమోనును ఆయన సేవకులే చంపేశారు. దాంతో ప్రజలు కుట్రదారుల్ని చంపేసి పిల్లవాడైన యోషీయాను రాజుగా చేశారు. (2 రాజులు 21:24; 2 దినవృత్తాంతములు 33:​25) ఆమోను పరిపాలనా కాలంలో, ప్రజలు తమ తమ మిద్దెల మీద ఉన్న బలిపీఠాల ముందు అబద్ధ దేవుళ్ళకు సాగిలపడి వేసే ధూపపు వాసనతో యెరూషలేము పట్టణపు గాలి నిండిపోయేది. ఆ వాసన యోషీయాకు బాగా తెలుసు. అన్యమత యాజకులు, భక్తులు వీధుల్లో ఊరేగింపులు నిర్వహిస్తూ కనబడడం సర్వసాధారణం. వీరిలో కొందరు యెహోవాను ఆరాధిస్తున్నామని చెప్పుకుంటూ మరోప్రక్క, “తమకు రాజని” అర్థం వచ్చే మిల్కోము అనే దేవతను బట్టి ప్రమాణాలు చేసేవారు.​—⁠జెఫన్యా 1:⁠1, 5.

ఆమోను అబద్ధ దేవుళ్ళను పూజిస్తూ దుష్టత్వాన్ని కొనసాగించాడని యోషీయాకు తెలుసు. బాల్యదశలో ఉన్న ఈ యూదా రాజు దేవుని ప్రవక్తయైన జెఫన్యా ప్రకటించిన వాక్కులను కూడా కాలక్రమేణా స్పష్టంగా అర్థం చేసుకున్నాడు. యోషీయా 15 ఏండ్లవాడయ్యే సరికి (సా.శ.పూ. 652) తన పరిపాలనలో ఎనిమిదవ సంవత్సరానికి చేరుకున్నాడు. అప్పటికే తాను జెఫన్యా మాటల్ని అనుసరించాలని తన మనస్సులో నిర్ధారణ చేసుకున్నాడు. యోషీయా ఇంకా చిన్నవాడిగా ఉన్నప్పుడే యెహోవా యొద్ద విచారించడం ప్రారంభించాడు.​—⁠2 దినవృత్తాంతములు 33:21, 22; 34:⁠3.

విజృంభించిన యోషీయా!

నాలుగు సంవత్సరాలు గడిచాక, యోషీయా అబద్ధ మతాన్ని నిర్మూలిస్తూ యూదయను యెరూషలేమును ప్రక్షాళన చేయడం ప్రారంభిస్తాడు (సా.శ.పూ. 648). ఆయన బయలు ఆరాధనలో ఉపయోగించే విగ్రహాల్నీ, దేవతా స్తంభాల్నీ, ధూప వేదికల్నీ నాశనం చేశాడు. అబద్ధ దేవతల విగ్రహాల్ని చూర్ణం చేసి, వాటికి బలులర్పించిన వారి సమాధుల మీద చల్లాడు. అపరిశుద్ధమైన ఆరాధన కోసం ఉపయోగించబడిన బలిపీఠాల్ని అపవిత్రపరచి వాటిని నిర్మూలించాడు.​—⁠2 రాజులు 23:​8-14.

లేవీయ గోత్రపు యాజకుడైన యిర్మీయా యెరూషలేముకు వచ్చే సరికి యోషీయా తన ప్రక్షాళనా కార్యక్రమంలో పూర్తి దూకుడుతో ఉన్నాడు (సా.శ.పూ. 647). యెహోవా దేవుడు యౌవనస్థుడైన యిర్మీయాను తన ప్రవక్తగా నియమించాడు, అబద్ధ మతానికి విరుద్ధంగా ఈయన యెహోవా సందేశాల్ని ఎంత శక్తిమంతంగా ప్రకటించాడో గదా! యోషీయా దాదాపు యిర్మీయా వయస్సువాడే. యోషీయా సాహసంతో ప్రక్షాళనను చేపట్టినప్పటికీ, యిర్మీయా నిర్భయంగా ప్రకటించినప్పటికీ ప్రజలు త్వరలోనే మళ్ళీ అబద్ధ ఆరాధనలో పడిపోయారు.​—⁠యిర్మీయా 1:​1-10.

అమూల్యమైన నిధి!

దాదాపు ఐదు సంవత్సరాలు గడిచాయి. ఇరవై ఐదేళ్ళ యోషీయా ఇప్పటికి దాదాపు 18 ఏళ్ళుగా పరిపాలిస్తున్నాడు. ఆయన శాస్త్రియైన షాఫానును, పట్టణాధిపతియైన మయశేయానును, రాజ్యపు దస్తావేజులమీద అధికారియైన యోవాహాజును పిలిపించి, షాఫానుకు ఇలా ఆజ్ఞాపించాడు: ‘మందిరపు ద్వారపాలకులు ప్రజల నుండి వసూలు చేసిన రొక్కం తీసుకుని యెహోవా మందిరమును బాగుచేసే పనికి అధికారులై పని జరిగించేవారి చేతికివ్వమని ప్రధాన యాజకుడైన హిల్కియాకు చెప్పు.’​—⁠2 రాజులు 22:3-6; 2 దినవృత్తాంతములు 34:⁠8.

మందిరమును బాగుచేసే పనివారు తెల్లవారు జామునుండే ఎంతో శ్రమించి పనిచేసేవారు. తన పూర్వికుల్లో దుష్టులైన కొందరు దేవుని మందిరానికి చేసిన చెరుపును పనివారు సరిదిద్దుతున్నందుకు యోషీయా నిజంగా యెహోవాకు ఎంతో కృతజ్ఞుడై ఉన్నాడు. పని ముందుకు సాగుతుండగా, షాఫాను ఒక సందేశం తీసుకొచ్చాడు. ఏమిటది? ఆయన చేతిలో ఒక గ్రంథపు చుట్ట ఉంది! “మోషేద్వారా యెహోవా దయచేసిన ధర్మశాస్త్రముగల గ్రంథము” ప్రధాన యాజకుడైన హిల్కీయాకు దొరికిందని ఆయన వివరిస్తాడు. (2 దినవృత్తాంతములు 34:​12-18) అదెంత గొప్ప నిధి​—⁠నిస్సందేహంగా అది ధర్మశాస్త్రం యొక్క అసలు ప్రతి అయివుంటుంది!

యోషీయా ఆ గ్రంథంలోని ప్రతి పదాన్నీ వినడానికి ఉత్సుకతతో ఉన్నాడు. షాఫాను చదువుతుండగా రాజు అందులోని ఒక్కొక్క ఆజ్ఞ తనకూ తన ప్రజలకూ ఎలా వర్తిస్తుందో గ్రహించడానికి ప్రయత్నించాడు. ఆ గ్రంథం సత్యారాధన యొక్క ప్రాముఖ్యాన్ని ఎలా నొక్కిచెబుతోందో ఒకవేళ ప్రజలు అబద్ధారాధనలో పడిపోతే తెగుళ్ళు వస్తాయనీ, తమదికాని దేశంలో బందీలుగా ఉంటారనీ అదెలా ప్రవచిస్తుందో యోషీయా గ్రహించి చాలా ప్రభావితుడయ్యాడు. అది చదవడం ముగిసే సరికి, దేవుని ఆజ్ఞలన్నింటినీ అప్పటివరకూ పాటించలేదని గ్రహించిన యోషీయా రాజు తన బట్టలు చింపుకుని హిల్కీయా, షాఫాను, మరితరులకు ఇలా ఆజ్ఞాపిస్తాడు: ‘మీరు వెళ్ళి ఈ గ్రంథంలోని మాటల గురించి యెహోవా వద్ద విచారణ చేయండి, మన పితరులు తమ విషయములో వ్రాయబడిన దానంతటి ప్రకారము చేయక యీ గ్రంథపు మాటలను విననివారైనందున యెహోవా కోపాగ్ని మనమీద ఇంత అధికముగా మండుతున్నది.’​—⁠2 రాజులు 22:11-13; 2 దినవృత్తాంతములు 34:19-21.

యెహోవా పలికిన మాట ప్రకటించబడింది

యోషీయా పంపిన సందేశవాహకులు యెరూషలేములోని హుల్దా అనే ప్రవక్త్రిని దగ్గరికి వెళ్ళి ఒక నివేదికతో తిరిగివస్తారు. హుల్దా యెహోవా పలికిన మాటను తెలియజేస్తూ, క్రొత్తగా కనుగొనబడిన గ్రంథంలో నమోదు చేయబడిన కీడంతా ఆ మతభ్రష్ట జనాంగంపైకి వస్తుందని సూచించింది. అయితే, యోషీయా తనను తాను యెహోవా దేవుని ముందు తగ్గించుకున్నాడు గనుక ఆయన మాత్రం ఆ కీడును చూడడు. ఆయన నెమ్మదినొంది సమాధిలో తన పితరుల వద్దకు చేర్చబడతాడు.​—⁠2 రాజులు 22:14-20; 2 దినవృత్తాంతములు 34:22-28.

అయితే ఆ తర్వాత యోషీయా ఒక యుద్ధంలో చనిపోయాడు కాబట్టి హుల్దా చేసిన ప్రవచనం నిజమని చెప్పగలమా? (2 రాజులు 23:​28-30) అవును చెప్పగలం, ఎందుకంటే ఆయన సమాధి చేయబడినప్పటి “నెమ్మది,” యూదయపై రానైయున్న “కీడు”తో పోలిస్తే చాలా గొప్పది. (2 రాజులు 22:20; 2 దినవృత్తాంతములు 34:​28) యోషీయా సా.శ.పూ. 609-607 కాలంలో బబులోనీయులు యెరూషలేమును ముట్టడించి నాశనం చేసినప్పుడు జరిగిన కీడుకు ముందే చనిపోయాడు. అంతేగాక, ‘పితరులయొద్దకు చేర్చబడడం’ అన్న వ్యక్తీకరణ హింసాత్మక మరణం ఉండదని సూచించడం లేదు. అలాంటి వ్యక్తీకరణ అటు హింసాత్మకమైన ఇటు సహజమైన మరణాలను వర్ణిస్తూ ఉపయోగించబడింది.​—⁠ద్వితీయోపదేశకాండము 31:16; 1 రాజులు 2:10; 22:34, 40.

సత్యారాధన కొనసాగుతుంది

యోషీయా యెరూషలేము ప్రజల్ని దేవాలయం వద్ద సమకూర్చి వారి ఎదుట యెహోవా గృహంలో దొరికిన “నిబంధన గ్రంథములోని మాటలన్నిటిని చదివించెను.” తర్వాత ఆయన “యెహోవా మార్గములయందు నడచి, ఆయన ఆజ్ఞలను కట్టడలను శాసనములను పూర్ణహృదయముతోను పూర్ణాత్మతోను గైకొని, యీ గ్రంథమందు వ్రాయబడియున్న నిబంధన సంబంధమైన మాటలన్నిటిని స్థిరపరచుదుమని” నిబంధన చేశాడు. ప్రజలందరు ఆ నిబంధనకు సమ్మతించారు.​—⁠2 రాజులు 23:1-3.

యోషీయా ఇప్పుడు విగ్రహారాధనకు వ్యతిరేకంగా మరోసారి మరింత ఉద్ధృతమైన కార్యకలాపాలు చేపడతాడు. యూదయలోని అన్య దేవతల అర్చకుల పూజల్ని నిలిపివేశాడు. అపరిశుద్ధారాధనలో ఇమిడివున్న లేవీ గోత్రపు యాజకులు యెహోవా బలిపీఠం వద్ద సేవచేసే ఆధిక్యతను కోల్పోయారు. రాజైన సొలొమోను పరిపాలనా కాలంలో ఆయన కట్టించిన ఉన్నతస్థలాల్ని యోషీయా అపవిత్రపరిచాడు. ఈ ప్రక్షాళనా కార్యక్రమం, యోషీయా కాలానికి ముందే (సా.శ.పూ. 740 లో) అష్షూరీయులు కూలద్రోసిన పూర్వపు పది గోత్రాల ఇశ్రాయేలు రాజ్యంలో కూడా కొనసాగుతుంది.

పేరు తెలియని ఒక “దైవజనుడు” 300 సంవత్సరాల క్రితమే పలికిన మాటల నెరవేర్పుగా యోషీయా, బయలు ప్రవక్తల శల్యాల్ని రాజైన మొదటి యెరోబాము కట్టించిన బలిపీఠం మీదనే కాల్చివేశాడు. అక్కడా మరితర ప్రాంతాల్లోనూ ఉన్న ఉన్నత స్థలాల్ని తీసివేయించి, విగ్రహారాధకులైన యాజకుల్ని వారుపయోగించిన బలిపీఠాలపైనే చంపించాడు.​—⁠1 రాజులు 13:1-4; 2 రాజులు 23:4-20.

వైభవోపేతంగా జరిగిన పస్కా పండుగ

సత్యారాధనను నిలబెట్టడానికి యోషీయా తీసుకున్న చర్యలకు దైవిక మద్దతు ఉంది. ఇక రాజు, ‘ప్రజలు తమ పితరుల దేవుడైన యెహోవాను అనుసరించుట మానకుండా’ ఉండాలని తాను జీవించినంత కాలమూ దేవునికి ప్రార్థిస్తూ, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటాడు. (2 దినవృత్తాంతములు 34:​33) తన 18వ సంవత్సరపు పరిపాలనలో జరిగిన ఆ అద్భుతమైన సంఘటనను యోషీయా ఎలా మర్చిపోగలడు?

రాజు ప్రజలకు ఇలా ఆజ్ఞాపించాడు: “[ఇటీవల కనుగొనబడిన] నిబంధన గ్రంథమునందు వ్రాసియున్న ప్రకారముగా మీ దేవుడైన యెహోవాకు పస్కాపండుగను ఆచరించు[డి].” (2 రాజులు 23:​21) అందుకు లభించిన చక్కని ప్రతిస్పందనను బట్టి యోషీయా ఎంతో ఆనందించాడు. ఈ పండుగను ఆచరించడానికి తానే 30,000 పస్కా పశువుల్ని 3,000 కోడెల్ని ఇచ్చాడు. ఆహా! ఏమి పస్కా పండుగ! బలియర్పణల సంబంధంగా, చక్కని సిద్ధపాటు సంబంధంగా, సమకూడిన ఆరాధకుల సంఖ్య సంబంధంగా ప్రవక్తయైన సమూయేలు కాలం నుండి అప్పటి వరకు అలాంటి పస్కా జరుగలేదు.​—⁠2 రాజులు 23:22, 23; 2 దినవృత్తాంతములు 35:1-19.

గొప్ప మరణ ప్రలాపం

తన 31 సంవత్సరాల (సా.శ.పూ. 659-629) పరిపాలనలోని మిగిలిన కాలమంతా యోషీయా మంచి రాజుగా పరిపాలించాడు. తన పరిపాలనా కాలం చివర్లో యోషీయాకు, ఐగుప్తు రాజైన ఫరో నెకో యూదయ గుండా ప్రయాణించి బబులోను సైన్యాన్ని అడ్డుకుని యూఫ్రటీసు నదీతీరంలోని కర్కమెషు వద్దనున్న అష్షూరు రాజుకు సహాయం చేయాలని పథకాలు వేస్తున్నట్లు తెలియవచ్చింది. తెలియరాని కారణం చేత యోషీయా ఐగుప్తువారిపై యుద్ధానికి వెళ్తాడు. నెకో ఆయనకు, “దేవుడు నాతోకూడ ఉండి నిన్ను నశింపజేయకుండునట్లు ఆయన జోలికి నీవు రావద్దని” చెబుతూ ఒక సందేశాన్ని పంపిస్తాడు. కానీ యోషీయా మారువేషం ధరించుకుని ఐగుప్తీయులను మెగిద్దో వద్ద నుండి వెనక్కి మళ్ళించడానికి ప్రయత్నిస్తాడు.​—⁠2 దినవృత్తాంతములు 35:20-22.

యూదయ రాజు చాలా పెద్ద తప్పటడుగు వేసేశాడు! శత్రుసైన్యంలోని విలుకాండ్రు యోషీయాను లక్ష్యంగా చేసికొని బాణాలతో దాడి చేసినప్పుడు ఆయన తన సేవకులతో, “నాకు గొప్ప గాయము తగిలెను, ఇక్కడి నుండి నన్ను కొనిపోవుడని” చెబుతాడు. వారు యోషీయాను యుద్ధ రథం మీదనుండి దించి మరో రథంలోకి ఎక్కించి యెరూషలేముకు తీసికొని వెళ్తారు. మార్గమధ్యంలోనే యోషీయా చివరి శ్వాస విడుస్తాడు. అలా “అతడు మృతిబొంది తన పితరుల సమాధులలో ఒకదాని యందు పాతిపెట్టబడెను” అని దైవప్రేరేపిత వృత్తాంతం చెబుతుంది. దానితో “యూదా యెరూషలేము వారందరును యోషీయా చనిపోయెనని ప్రలాపము చేసిరి.” యిర్మీయా కూడా యోషీయాను గూర్చి ఎంతో ప్రలాపించాడు, కొందరు గాయకులు రాజు మరణాన్ని ఒక ప్రలాప గీతంగా వ్రాసుకొని వాటిని అటు తర్వాత కూడా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో గానం చేసేవారు.​—⁠2 దినవృత్తాంతములు 35:23-25.

అవును, రాజైన యోషీయా ఐగుప్తు సైన్యం మీదికి యుద్ధానికి వెళ్ళి ఘోరమైన పొరబాటు చేశాడు. (కీర్తన 130:⁠3) అయినప్పటికీ, ఆయనకున్న నమ్రత, సత్యారాధన విషయంలో ఆయనకున్న దృఢత్వం ఆయనకు దేవుని అనుగ్రహాన్ని సంపాదించిపెట్టింది. అకుంఠిత దీక్షతో, నమ్రతగల హృదయాలతో తన సేవచేసే వారిపై యెహోవా తన అనుగ్రహాన్ని చూపుతాడనడానికి యోషీయా జీవితం ఎంత చక్కని నిదర్శనం!​—⁠సామెతలు 3:34; యాకోబు 4:⁠6.

[29వ పేజీలోని చిత్రం]

యౌవనుడైన రాజైన యోషీయా నిండు మనస్సుతో యెహోవాయొద్ద విచారించాడు

[31వ పేజీలోని చిత్రం]

యోషీయా ఉన్నత స్థలాల్ని నాశనం చేసి సత్యారాధనకు మద్దతునిచ్చాడు