ఫిజీ ద్వీపాల్లో దేవుని రాజ్యం ప్రకటించబడుతోంది
మనము విశ్వాసము గలవారము
ఫిజీ ద్వీపాల్లో దేవుని రాజ్యం ప్రకటించబడుతోంది
యేసుక్రీస్తు ఒకసారి రెండు మార్గాల గురించి మాట్లాడాడు. అందులో ఒకటి విశాలముగా ఉండి మరణానికి నడిపించేది, మరొకటి ఇరుకుగా ఉండి జీవానికి నడిపించేది. (మత్తయి 7:13, 14) ఈ రెండింటిలో సరైన మార్గాన్ని ప్రజలు ఎంపిక చేసుకోగలిగేలా, రాజ్య సువార్త ప్రపంచమంతటా ప్రకటించబడాలని యెహోవా దేవుడు సంకల్పించాడు. (మత్తయి 24:14) గనుకనే, ప్రతిచోట రాజ్య సందేశాన్ని ప్రజలు వింటున్నారు. అందులో కొందరు తమ ‘ఆత్మలను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగినవారిలా’ జీవ మార్గాన్ని ఎంపిక చేసుకుంటున్నారు. (హెబ్రీయులు 10:39) ఫిజీ ద్వీపాల్లోని, దాని సమీపాన గల దక్షిణ పసిఫిక్ ద్వీపాల్లోని కొందరు జీవ మార్గాన్ని ఎలా ఎంపిక చేసుకున్నారో తెలుసుకోవడానికి ఈ శీర్షికను చదవమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.
వారు యెహోవాపై నమ్మకముంచారు
మెరె 1964 లో మొదటి సారిగా రాజ్య సందేశాన్ని తను స్కూలుకు వెళ్ళే కాలంలోనే విన్నది. ఆమె నివసించేది మారుమూలనున్న ద్వీపం అవడం వలన యెహోవాసాక్షులను కలుసుకొనే అవకాశాలు చాలా తక్కువగా ఉండేవి. ఎలాగైతేనేమి, చివరకు ఆమె బైబిలులోని సత్య జ్ఞానాన్ని పొందగలిగింది. అప్పటికి ఆ గ్రామంలోని ఒక తెగ నాయకుడితో ఆమెకు పెళ్ళి అయింది. ఆమె మాత్రం బైబిలు సూత్రాలకనుగుణంగా జీవించాలని నిర్ణయించుకుంది. దానివల్ల ఆమె భర్త, ఆయన బంధువులు ఆమెను చాలా కష్టాలకు గురి చేశారు. గ్రామస్థులు కూడా ఆమెపట్ల తిరస్కార భావాన్ని చూపించారు. అయినా ఆమె 1991 లో బాప్తిస్మం తీసుకుంది.
అటు తరువాత కొంత కాలానికి, మెరె భర్త చోషూవా ప్రవర్తనలో సాత్వికత కన్పించింది. అంతేగాక ఆయన, పిల్లలతో మెరె చేసే బైబిలు చర్చల్లో కూడా కూర్చోవడం ప్రారంభించాడు. అప్పటినుండి ఆయన చర్చికి వెళ్ళడం మానుకున్నాడు కూడా. ఒక తెగనాయకుడిగా, ఆ గ్రామంలో ప్రతివారం జరిగే గ్రామ సమావేశాలను మాత్రం తన ఆధ్వర్యంలో నిర్వహిస్తూనే ఉన్నాడు. అయితే మెథొడిస్ట్ చర్చి సిద్ధాంతాలే తమ జీవితాల్లో ప్రధానమనుకునే ఫిజీ గ్రామ ప్రజలు, తమ తెగనాయకుడు చర్చికి రావడం మానుకుని, బైబిలు చర్చల్లో భాగం వహిస్తున్నందున ఆయనను ఒక అవిధేయుడిగా దృష్టించారు. అందుకే స్థానిక పాస్టరు తమ మతంలోకి తిరిగి రమ్మని ఆయనకు గట్టిగా చెప్పాడు.
యెహోవా దేవుణ్ణి “ఆత్మతోను సత్యముతోను” ఆరాధించడానికి తనూ తన కుటుంబమూ ఎంపిక చేసుకున్నామన్న నిర్ణయాన్ని చోషూవా ధైర్యంగానూ స్థిరంగానూ నొక్కి చెప్పాడు. (యోహాను 4:24) ఆ తరువాతి వారం జరిగిన గ్రామ సమావేశంలో అక్కడి అగ్ర నాయకుడు, చోషూవాను ఆయన కుటుంబాన్ని వెలి వేస్తున్నట్లుగా ప్రకటించాడు. వాళ్ళు ఆయనకు వారం రోజుల గడువిచ్చి ఇల్లు, స్థలము, పాడి-పంటలతో పాటు వాళ్ళకున్నదంతా వదిలి కట్టు బట్టలతో ఆ ద్వీపాన్ని వదిలి పోవాలన్నారు.
మరొక ద్వీపంపై ఉన్న ఆధ్యాత్మిక సహోదరులు చోషూవాకూ ఆయన కుటుంబానికీ సాయం చేయడానికి ముందుకు వచ్చారు. వాళ్లకు ఉండడానికి స్థలంతోపాటు పంటలు పండించుకోడానికి కూడా సదుపాయాల్ని కల్పించారు. ఇప్పుడు చోషూవా ఆయన పెద్ద కొడుకు బాప్తిస్మం తీసుకున్నారు, మరొక కొడుకు బాప్తిస్మం పొందని సువార్తికుడిగా సేవ చేస్తున్నాడు. మెరె కొంతకాలం క్రితం క్రమ పయనీరుగా (పూర్తికాల రాజ్య ప్రచారకురాలి) సేవ ప్రారంభించింది. యెహోవాను సేవించాలనే వారి ఎంపిక వారు తమ ఆస్తి-అంతస్థుల్ని కోల్పోవడానికి కారణమైంది. అయినప్పటికీ అపొస్తలుడైన పౌలు చెప్పినట్లుగా వారు పొందిన అతి శ్రేష్ఠమైన జ్ఞానం ముందు వారు కోల్పోయింది ఏ మాత్రం విలువ లేనిదే.—ఫిలిప్పీయులు 3:8.
మనస్సాక్షిపూర్వకమైన ఒక ఎంపిక
మన జీవితాన్ని బైబిలు శిక్షిత మనస్సాక్షితో సాగించాలంటే విశ్వాసంతోపాటు ధైర్యం కూడా అవసరం. కిరిబాటి ద్వీపాల్లో ఒకటైన తరావా ద్వీపంపైన నివసిస్తున్న క్రొత్తగా బాప్తిస్మం పొందిన సురాంగ్ అనే ఒక యువతి విషయంలో ఇది రుజువయింది. ఒక ఆసుపత్రిలో నర్సుగా ఉద్యోగం చేస్తున్న సురాంగ్, తను నర్సుగా ఫలాని పని మనస్సాక్షిపూర్వకంగా చేయలేనని, తనను మన్నించమని కోరింది. ఆమె అభ్యర్థనను తిరస్కరించడమే కాకుండా, ఆమె తోటి విశ్వాసులెవరూ లేని ఒక మారుమూల ద్వీపంలోని ఒక చిన్న మెడికల్ సెంటరును చూసుకోవడానికి ఆమెను బదిలీ చేశారు.
క్రొత్తగా ఆ ద్వీపం పైకి వచ్చిన వాళ్ళందరు అక్కడున్న ఒక “దయ్యానికి” అర్పణలు అర్పించాలనే ఆచారం ఒకటుంది, అలా చేయని వారు చనిపోతారని వాళ్ళు నమ్ముతారు. అలాంటి విగ్రహారాధనలో పాల్గొనడానికి సురాంగ్ నిరాకరించింది. అది చూసిన గ్రామస్థులు, కోపగించిన దయ్యం ఆమెను గొంతు పిసికి చంపుతుందని అనుకున్నారు. కాని ఆమెకుగానీ లేక ఆమెను వదిలి వెళ్ళడానికి వచ్చినవారికి గానీ ఎలాంటి హాని కలుగకపోయేసరికి అక్కడ మంచి సాక్ష్యమివ్వడానికి ఆమెకు ఎన్నో అవకాశాలు లభించాయి.
కాని సురాంగ్‌కు శోధనలు అంతటితో ఆగిపోలేదు. ఆ ద్వీపానికి వచ్చిన యువతులను లొంగదీసుకోవడం ఒక సవాలుగా భావించే కొందరు యువకులున్నారక్కడ, అయినా సురాంగ్ వారి అసభ్యకరమైన ప్రతిపాదనలన్నింటినీ తిరస్కరించి దేవునిపట్ల తన యథార్థతను నిలబెట్టుకుంది. వాస్తవానికి తను 24 గంటలు డ్యూటీలో ఉండే నర్సుగా తన కర్తవ్యాన్ని నెరవేరుస్తూ, ఆమె ఒక పూర్తికాల రాజ్య ప్రచారకురాలిగా కూడ సేవ చేయగలిగింది.
సురాంగ్ ఆ ద్వీపాన్ని వదిలి వెళ్ళే ముందు గ్రామస్థులు ఆమెకు గౌరవార్థకంగా ఏర్పాటు చేసిన ఒక విందులో ఆ ద్వీపానికి వచ్చిన మొట్టమొదటి అసలైన మిషనరీ ఆమెనే, అని గ్రామ పెద్దలు ఆమెను ప్రశంసించారు. ఆమె తన జీవితాన్ని బైబిలు శిక్షిత మనస్సాక్షితో ధైర్యంగా సాగించినందువల్ల ఆ ద్వీపంలోని ఇతరులు రాజ్య సందేశంపట్ల సుముఖత చూపించారు.
భౌతికపరమైన సవాళ్ళను ఎదుర్కోవడం
మారుమూల గ్రామాల్లో జీవిస్తున్న యెహోవా ప్రజలు రాజ్య పరిచర్యలో పాల్గొనాలన్నా, కూటాలకు హాజరు కావాలన్నా ఎంతో శ్రమపడాల్సి వస్తుంది. బాప్తిస్మం పొందిన ఒక సహోదరుడు, ముగ్గురు సహోదరీల ఉదాహరణను గమనిద్దాం. వాళ్ళు కూటాలకు వెళ్ళి రావడానికి గంటల కొలది ప్రయాణించవలసి వస్తుంది. కాలి నడకన ఎంతో దూరం ప్రయాణిస్తూ మూడు నదులను దాటాల్సి వస్తుంది. నీటి మట్టం పెరిగినప్పుడు ఒక పెద్ద వంట పాత్రలో వారి బ్యాగులు, పుస్తకాలు, మీటింగు కోసం తెచ్చుకున్న బట్టలు పెట్టి, దాన్ని నీటిపైన లాక్కుంటూ ముందుగా ఆ సహోదరుడు ఈదుతూ దాటతాడు. తర్వాత తిరిగి వెనక్కి వచ్చి మిగిలిన ముగ్గురు దాటడానికి సహాయం చేస్తాడు.
కిరిబాటి సమూహ ద్వీపాల్లో మారుమూలనున్న నొనౌటి అనే ఒక ద్వీపంలో కూటాలను జరుపుకునే ఒక చిన్న గుంపు మరో రకమైన సవాళ్ళను ఎదుర్కొంటోంది. వాళ్ళు కూటాలు జరుపుకునే ఇంట్లో ఏడుగురు లేక ఎనిమిది మందికి మాత్రమే సరిపడే స్థలం ఉంది. హాజరయిన మిగతా వాళ్ళంతా జాలీలాగ ఉండే గోడల రంధ్రాల్లో నుండి తొంగి చూస్తూ వెలుపల కూర్చునేవారు. ఆ దారిన చర్చీలకు వెళ్ళే గ్రామస్థులకు వీరి సమావేశ స్థలము బహిర్గతంగా ఉండేది. దేవుని దృష్టిలో ఇష్టకరమైనవి పెద్ద పెద్ద కట్టడాలు కాదుగానీ ప్రజలని, యెహోవా సేవకులకు తెలుసు. (హగ్గయి 2:7) బాప్తిస్మం తీసుకున్న ఒక వృద్ధ సహోదరి ఎక్కువ దూరం నడవలేదు, కాబట్టి ఆమెను రాజ్య పరిచర్యకు తీసుకు వెళ్ళడానికి బాప్తిస్మం పొందని ఒక యువ సహోదరి, తోపుడు బండిలో ఆమెను తీసుకువెళ్ళి సహాయపడేది. సత్యం పట్ల వారు చూపించే ప్రశంస ఎంత గొప్పదో కదా!
ఫిజీ ద్వీపాల్లో సేవ చేస్తున్న 2,100 కంటే ఎక్కువగా ఉన్న పరిచారకులు దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ ముందుకు కొనసాగాలని దృఢంగా నిర్ణయించుకున్నారు. ఇంకా, అనేక మంది తమ ‘ఆత్మలను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగినవారివలె’ అవుతారని వారు నమ్మకం కలిగియున్నారు కూడా.
[8వ పేజీలోని మ్యాపు]
(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్ కోసం ప్రచురణ చూడండి)
ఆస్ట్రేలియా
ఫిజీ