కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సహాయం కోసం ఆక్రందన

సహాయం కోసం ఆక్రందన

సహాయం కోసం ఆక్రందన

“దేవుడు నన్ను మర్చిపోయాడు!” అని ఒక బ్రెజిలియా స్త్రీ విలపించింది. ఆమె భర్త హఠాత్తుగా మరణించడంతో తన జీవితానికి ఇక ఎలాంటి అర్థమూ లేదని ఆమె భావించింది. అంతలా కృంగిపోయిన వారినీ లేక సహాయం కోసం అర్థిస్తున్నవారినీ ఓదార్చేందుకు మీరెప్పుడైనా ప్రయత్నించారా?

కొందరైతే ఎంత నిస్పృహకు గురౌతారంటే వారు తమ ప్రాణాల్నే తీసేసుకుంటారు​—⁠విచారకరంగా ఇలాంటివారిలో అత్యధికులు యౌవనస్థులే. ఫోల్హా డే యస్‌. పౌలో, అనే వార్తాపత్రిక ప్రకారం, “ఆత్మహత్యలు చేసుకునే యౌవనస్థుల సంఖ్య 26 శాతం పెరిగినట్లు” బ్రెజిల్‌లోని ఒక అధ్యయనం చూపిస్తుంది. ఉదాహరణకు, సావో పౌలోలోని వాల్టర్‌ * విషయాన్నే పరిశీలించండి. అతనికి తల్లిదండ్రులు లేరు, ఇల్లు లేదు, ఏకాంతం లేదు, నమ్మదగ్గ స్నేహితులు లేరు. తన దైన్యస్థితిని భరించలేక వాల్టర్‌ ఒక బ్రిడ్జ్‌ మీద నుండి దూకాలని నిర్ణయించుకున్నాడు.

ఒంటరి తల్లి అయిన ఎడ్నా తను మరొక పురుషుడ్ని కలిసేటప్పటికే ఆమెకు ఇద్దరు పిల్లలు. నెల తిరిగే లోపల వారిద్దరు కలిసి అతని తల్లి ఇంట్లో జీవించడం ప్రారంభించారు. ఆమె క్షుద్రవిద్యల్ని అభ్యసిస్తూ మద్యపానం విపరీతంగా సేవించేది. ఎడ్నాకు మరో బిడ్డ పుట్టాడు. తర్వాత ఆమె తాగుడుకు అలవాటై చివరికి ఎంత క్రుంగుదలకు లోనైందంటే ఆత్మహత్యకు పాల్పడడానికి ప్రయత్నించింది. చివరికి, ఆమె తన పిల్లలకు సంరక్షణ అందించే బాధ్యత కూడా కోల్పోవాల్సి వచ్చింది.

వృద్ధుల విషయమేమిటి? మారియా హాస్యప్రియత్వం గలది, మంచి మాటకారి. అయితే, నర్సుగా ఉద్యోగం చేస్తున్న ఆమె, వయస్సు పెరుగుతున్న కొలది తన ఉద్యోగంలో తను ఏమైనా తప్పులు చేస్తానేమోనని ఆమె భయపడుతుండేది. ఇది ఆమెకు కృంగుదలను కలుగజేసింది. తను స్వంతగా చికిత్స చేసుకోవడానికి ప్రయత్నించి చివరికి వైద్య సహాయాన్ని పొందింది. తాను పొందిన వైద్య చికిత్స బాగానే ఉన్నట్లు అన్పించింది. కానీ ఆమె 57వ ఏట ఉద్యోగం పోయినప్పుడు ఆమెకు కృంగుదల ఎంత తీవ్రమైందంటే దానికి పరిష్కారమంటూ లేకపోయింది. చివరికి మారియా ఆత్మహత్యే శరణ్యం అనుకోవడం ప్రారంభించింది.

“కృంగుదలకు గురైన వారిలో పది శాతం మంది ప్రజలు ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉంటారు” అని సావో పౌలో విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్‌ అయిన జోస్‌ ఆల్బెర్టో డెల్‌ పోర్టో అన్నాడు. “హత్య చేయబడ్డవారికన్నా ఆత్మహత్యల మూలంగానే ఎక్కువమంది మరణిస్తున్నారన్న విషయం నమ్మశక్యంగా లేదు, కానీ అది ఒక విషాదకరమైన వాస్తవం” అని అమెరికాలోని ఒక చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ అయిన డాక్టర్‌ డేవిడ్‌ సేచర్‌ నివేదించాడు.

కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యకు పాల్పడడమనే చర్య సహాయం కోసం చేసే ఆక్రందన వంటిది. నిరాశా నిస్పృహలకు గురైనవారికి కుటుంబ సభ్యులూ స్నేహితులూ ఏదో ఒకటి చేయాలని తప్పకుండా తలస్తూవుంటారు. అయితే, “ఎందుకు అనవసరంగా బాధపడతావు?” అనడమో, “ఇంకా ఎంతోమంది నీకంటే ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నారు, తెల్సా?” అనడమో, లేదా “అందరమూ ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుంది” అనడమో ఏమాత్రం సేదదీర్చవు. బదులుగా, మీరు ఒక నిజమైన స్నేహితునిగా చక్కని వినువారిగా ఎందుకు ఉండకూడదు? అవును, నిరాశకు గురైన వ్యక్తి, తన జీవితము విలువైనదని గ్రహించేలా సహాయం చేయటానికి ప్రయత్నించండి.

ఫ్రెంచి రచయితైన వోల్టైర్‌ ఇలా వ్రాశాడు: “నిరాశతో కృంగిపోయిన వ్యక్తి ఆవేశంలో వెనకా ముందు ఆలోచించకుండా ఆత్మహత్య చేసుకుంటాడు, అదే వ్యక్తి మరో వారంపాటు వేచివుండుంటే బ్రతికివుండాలని కోరుకుని ఉండేవాడు.” మరి అలాంటప్పుడు, నిరాశా నిస్పృహలతో ఉన్న ప్రజలు, తమ జీవితము విలువైనదని ఎలా గుర్తించగలరు?

[అధస్సూచి]

^ పేరా 3 కొన్ని పేర్లు మార్చబడ్డాయి.

[3వ పేజీలోని చిత్రం]

ఆత్మహత్య చేసుకోవాలనుకునే యౌవనుల, పెద్దల సంఖ్య పెరుగుతోంది

[4వ పేజీలోని చిత్రం]

నిరీక్షణ కోల్పోయిన ఒక వ్యక్తికి మీరెలా సహాయపడగలరు?