కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

స్వయంత్యాగం ఎందుకు?

స్వయంత్యాగం ఎందుకు?

స్వయంత్యాగం ఎందుకు?

బిల్డింగ్‌ టెక్నాలజీ టీచరైన బిల్‌, యాభయ్యో పడిలో ఉన్న ఒక కుటుంబీకుడు. ఆయన తన స్వంత ఖర్చుతో, సంవత్సరంలో అనేక వారాలు యెహోవాసాక్షుల రాజ్యమందిరాలకు ప్లాన్లు వేయడానికి, వాటిని కట్టడానికి సహాయం చేస్తుంటాడు. ఎమ్మా 22 ఏళ్ళ అవివాహిత, మంచి విద్యాభ్యాసం, మంచి యోగ్యతలు గల యువతి. ఆమె తన స్వంత లక్ష్యాల కోసం, స్వంత సుఖం కోసమే సమయాన్ని పూర్తిగా వెచ్చించకుండా, బైబిలును అర్థం చేసుకోవడానికి ఇతరులకు సహాయంచేస్తూ, ఒక పూర్తికాల సేవకురాలిగా నెలకు 70 గంటలకు పైగా గడుపుతోంది. మౌరిస్‌, బెట్టీ రిటైరయిన దంపతులు. ప్రశాంతంగా గడపాల్సిన సమయం కదా అని భావించకుండా, మరొక దేశం వెళ్ళి, అక్కడి ప్రజలు భూమిపట్ల దేవునికి గల సంకల్పాన్ని తెలుసుకోవడానికి సహాయం చేస్తున్నారు.

ప్రత్యేకమైన లేక అసాధారణ వ్యక్తులని వీళ్ళు భావించడం లేదు. కానీ, చేయడానికి ఏది సరైనది అని అనుకొన్నారో ఆ పనిని చేస్తున్న సాధారణ మనుష్యులమని మాత్రమే వాళ్లు భావిస్తున్నారు. వాళ్ళెందుకు వారి సమయాన్ని, శక్తిని, సామర్థ్యాల్ని, సంపదల్ని ఇతరుల కోసం ఉపయోగిస్తున్నారు? దేవునిపట్ల, పొరుగు వారిపట్ల వారికున్న అమితమైన ప్రేమే వారిని ప్రేరేపించింది. ఆ ప్రేమే వారిలోని ప్రతి ఒక్కరిలోనూ స్వచ్ఛమైన, స్వయంత్యాగపూరిత స్ఫూర్తిని జనింపజేసింది.

స్వయంత్యాగపూరిత స్ఫూర్తి అంటే ఏమిటి? స్వయంత్యాగపూరితులై ఉండడమంటే కఠినమైన నియమాలతో జీవితాన్ని గడపడమనో లేదా సంతృప్తి, సంతోషం లేకుండా ఒక సన్యాసిలా జీవించడమనో కాదు. ద షార్టర్‌ ఆక్స్‌ఫర్డ్‌ ఇంగ్లీష్‌ డిక్షనరీలో, స్వయంత్యాగమంటే “విధి కోసం లేక ఇతరుల క్షేమం కోసం తమ స్వంత ఆసక్తులను, సంతోషాన్ని, కోరికలను వదులుకోవడం” అనే అర్థం ఇవ్వబడింది.

యేసుక్రీస్తు​—⁠ఉత్కృష్టమైన మాదిరి

దేవుని ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు, స్వయంత్యాగపూరిత స్ఫూర్తికి ఉత్కృష్టమైన మాదిరి. ఆయన మానవ పూర్వపు జీవితాన్ని చైతన్యవంతంగానూ, అత్యధిక సంతృప్తితోనూ గడిపి ఉంటాడు. ఆయన యెహోవాతోనూ, అనేక ఆత్మ ప్రాణులతోనూ మంచి సాన్నిహిత్యం కలిగివున్నాడు. అంతే కాకుండా, దేవుని కుమారుడు ఒక “ప్రధాన శిల్పి”గా సవాలుదాయకమైన, ఉత్తేజకరమైన పనులు చేయడానికి తన సామర్థ్యాలను ఉపయోగించాడు. (సామెతలు 8:​30, 31) ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతుడైన ఒక వ్యక్తి అనుభవించగలిగే పరిస్థితుల కంటే ఎన్నో రెట్లు ఉన్నతమైన పరిస్థితుల మధ్య ఆయన జీవించివుంటాడనడంలో ఎటువంటి సందేహం లేదు. యెహోవా దేవుని తరువాత పరలోకంలో ఎంతో ఉన్నతమైన, ఆధిక్యతగల స్థానాన్ని యేసు కలిగివున్నాడు.

అయినప్పటికినీ, దేవుని కుమారుడు “మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను.” (ఫిలిప్పీయులు 2:⁠7) ఆయన ఇష్టపూర్వకంగా, తన స్వప్రయోజనాలన్నింటినీ వదులుకుని, సాతాను వల్ల కలిగిన దుఃఖకరమైన పరిస్థితి నుండి మానవజాతిని విమోచించడానికి తన జీవితాన్నే అర్పించడానికి సామాన్య మానవుడయ్యాడు. (ఆదికాండము 3:​1-7; మార్కు 10:45) అంటే, సాతాను వశంలోవున్న లోకంలో, పాపభరితమైన మానవుల మధ్య జీవించడానికి రావడమని అర్థం. (1 యోహాను 5:​19) వ్యక్తిగతంగా ఇబ్బందులను, అసౌకర్యాలను సహించడమని కూడా దానర్థం. ఏమైనా సరే, యేసుక్రీస్తు తన తండ్రి చిత్తాన్ని చేయడానికే నిశ్చయించుకున్నాడు. (మత్తయి 26:​39; యోహాను 5:30; 6:38) ఇది యేసు ప్రేమను, యథార్థతను చివరికంటా పరీక్షించింది. ఆయన ఎంతమేరకు త్యాగం చేయడానికి ఇష్టపడుతున్నాడు? “మరణము పొందునంతగా, అనగా సిలువమరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్ను తాను తగ్గించుకొనెను” అని అపొస్తలుడైన పౌలు చెప్పాడు.​—⁠ఫిలిప్పీయులు 2:⁠8.

“యీ మనస్సు మీరును కలిగియుండుడి”

యేసు మాదిరిని అనుసరించాలని మనము ప్రోత్సహించబడుతున్నాము. “క్రీస్తుయేసునకు కలిగిన యీ మనస్సు మీరును కలిగియుండుడి” అని అపొస్తలుడైన పౌలు నొక్కి చెప్పాడు. (ఫిలిప్పీయులు 2:5) దీన్ని మనమెలా కలిగివుండగలం? అందుకు ఒక మార్గమేమిటంటే, “ప్రతివాడును తన సొంతకార్యములను మాత్రమేగాక యితరుల కార్యములను కూడ చూడవలెను.” (ఫిలిప్పీయులు 2:4) ఎందుకంటే స్వచ్ఛమైన ప్రేమ “స్వప్రయోజనమును విచారించుకొనదు.”​—⁠1 కొరింథీయులు 13:⁠5.

ప్రజాసేవకు అంకితమైన వారు, తరచుగా ఆ సేవ చేయడంలో నిస్వార్థాన్ని చూపించారు. అయినా, ఈ రోజుల్లో చాలామంది స్వార్థపూరితమైన వారే. ఈ లోకం నేనే-ముందు అనే ధోరణితో నిండివుంది. మనము ఈ లోకాత్మ విషయంలో జాగ్రత్తగావుండాలి, ఎందుకంటే ఒకవేళ లోకాత్మ మన దృక్పథాన్ని, మన స్వభావాన్ని మార్చడంలో విజయం సాధిస్తే, మనం మన స్వంత కోరికలను అగ్రస్థానంలో పెడతాము. అప్పుడు మనమేం చేసినా, మన సమయం, మన శక్తి, మన సంపదల్ని ఎలా వెచ్చించినా స్వార్థపూరితమై ఉంటాయి. కాబట్టి మనమీ లోకాత్మ ప్రభావానికి గురి కాకుండా గట్టిగా పోరాడాలి.

కొన్నిసార్లు మంచి ఉద్దేశంతో ఇచ్చిన సలహా కూడా మన స్వయంత్యాగ స్ఫూర్తిని నిరుత్సాహపర్చవచ్చు. ఉదాహరణకు, స్వయంత్యాగం వల్ల యేసుక్రీస్తు ఏమి ఎదుర్కోబోతున్నాడో తెలుసుకున్న అపొస్తలుడైన పేతురు “ప్రభువా, అది నీకు దూరమగుగాక” అని అన్నాడు. (మత్తయి 16:22) యెహోవా సర్వోన్నతాధిపత్యం పక్షాన, మానవజాతి రక్షణ పక్షాన, యేసు చివరికి మరణానికైనా సిద్ధపడడాన్ని చూసిన పేతురుకు ఆ విషయాన్ని ఒప్పుకోవడం కష్టమనిపించింది. అందుకే ఆయన యేసును ఆపడానికి ప్రయత్నించాడు.

‘నిన్ను నీవు ఉపేక్షించుకో’

అప్పుడు యేసు ఎలా ప్రతిస్పందించాడు? ఆ వృత్తాంతం ఇలా కొనసాగుతుంది: “అందుకాయన తన శిష్యులవైపు తిరిగి, వారిని చూచి​—⁠సాతానా, నా వెనుకకు పొమ్ము; నీవు మనుష్యుల సంగతులను మనస్కరించుచున్నావు గాని దేవుని సంగతులను మనస్కరింపకున్నావని పేతురును గద్దించెను. అంతట ఆయన తన శిష్యులను జనసమూహమును తనయొద్దకు పిలిచి​—⁠నన్ను వెంబడింప గోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువయెత్తికొని నన్ను వెంబడింపవలెను.”​—⁠మార్కు 8:33, 34.

యేసుకు అలాంటి సలహా ఇచ్చిన 30 సంవత్సరాల తర్వాత, పేతురుకు స్వయంత్యాగమంటే ఏమిటో అర్థమైందని ఆయన తన ప్రవర్తన ద్వారా చూపించాడు. ఆయన తన తోటి విశ్వాసులను, వారి క్రైస్తవ జీవితాన్ని తేలిగ్గా తీసుకొమ్మని ప్రోత్సహించలేదు. బదులుగా, పూర్వపు అజ్ఞానదశలో వారికున్న ఆశల ననుసరించి ప్రవర్తింపక, క్రైస్తవ పరిచర్యలో మనస్సు అను నడుము కట్టుకొని ముందుకు సాగమని వారిని కోరాడు. వారికి ఎన్ని కష్టాలు వచ్చినా, దేవుని చిత్తాన్ని చేయడాన్ని తమ జీవితంలో మొదటి స్థానంలో ఉంచాలని ఆయన ప్రోత్సహించాడు.​—⁠1 పేతురు 1: 6, 13, 14; 4:1, 2.

యేసుక్రీస్తును స్థిరంగా అనుసరిస్తూ, మనపై యెహోవాకు పూర్తి అధికారాన్నిచ్చి, మనం చేసే అన్ని చర్యల్లో యెహోవా నడిపింపును అనుమతించడమే మనలో ఎవరైనా ఎంచుకోదగిన ప్రతిఫలదాయకమైన జీవన విధానం. ఈ విషయంలో, పౌలు ఒక చక్కని మాదిరినుంచాడు. దేవుని చిత్తాన్ని చేయకుండా మనసు మళ్ళించే లోకాపేక్షలను లేక ఆశయాలను విడిచిపెట్టడానికి పరిచర్య పట్ల ఆయనకున్న అత్యవసర భావం, యెహోవాపట్ల ఆయనకున్న కృతజ్ఞతా ఆయనను కదిలించాయి. ఆయన “నాకు కలిగినది యావత్తు మీ ఆత్మలకొరకు బహు సంతోషముగా వ్యయపరచెదను; నన్నును నేను వ్యయపరచుకొందును” అని అన్నాడు. (2 కొరింథీయులు 12:​15) పౌలు తన శక్తి, సామర్థ్యాలను స్వంత కార్యాల కోసం కాకుండా, దైవిక కార్యాల పురోభివృద్ధి కోసం ఉపయోగించాడు.​—⁠అపొస్తలుల కార్యములు 20:​24; ఫిలిప్పీయులు 3:⁠8.

అపొస్తలుడైన పౌలుకున్న దృక్పథమే మనకూ ఉందో లేదో తెలుసుకోవడానికి మనల్ని మనం పరీక్షించుకోవడం ఎలా? బహుశ మనల్ని మనమిలా ప్రశ్నించుకోవచ్చు: నేను నా సమయాన్ని, శక్తిని, సామర్థ్యాన్ని, సంపదల్ని ఎలా ఉపయోగిస్తున్నాను? నేను వీటితోపాటు, నేను కలిగివున్న ఇతర విలువైనవాటిని నా స్వప్రయోజనం కోసం మాత్రమే ఉపయోగిస్తున్నానా లేక ఇతరులకు సహాయం చేయడానికి ఉపయోగిస్తున్నానా? జీవితాల్ని రక్షించే సువార్తను ప్రకటించే పనిలో మరింత ఎక్కువగా పాల్గొనడం గురించి, బహుశా రాజ్య ప్రచారకుడిగా పూర్తికాల సేవను చేయడం గురించి ఆలోచిస్తున్నానా? రాజ్యమందిర నిర్మాణపు పనుల్లో లేక మరమ్మత్తు చేసే పనుల్లో నేను పాల్గొనగలనా? అవసరమున్న వారికి సహాయం చేసే అవకాశాల కోసం వెదుకుతున్నానా? యెహోవాకు నా ప్రథమఫలములను ఇస్తున్నానా?​—⁠సామెతలు 3:⁠9.

“ఇచ్చుట ధన్యము”

అయితే, స్వయంత్యాగపూరిత స్ఫూర్తి కల్గివుండడం నిజంగా జ్ఞానయుక్తమైన పనేనా? నిస్సందేహంగా! అటువంటి స్ఫూర్తి గొప్ప ప్రతిఫలాలను తెస్తుందని పౌలుకు అనుభవపూర్వకంగా తెలుసు. అది ఆయనకు గొప్ప సంతోషాన్ని, సంతృప్తిని తెచ్చింది. మిలేతు దగ్గర కలుసుకున్న ఎఫెసు సంఘపు పెద్దలకు ఈ విషయాన్ని వివరిస్తూ పౌలు, “మీరును ఈలాగు [స్వయంత్యాగంతో] ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెననియు​—⁠పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసికొనవలెననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పెను.” (అపొస్తలుల కార్యములు 20:​35) అలాంటి స్ఫూర్తిని ప్రదర్శించడం గొప్ప సంతోషాన్ని తెస్తుందని లక్షలాదిమంది ప్రజలు నేడు కూడా కనుగొంటున్నారు. అంతేగాక భవిష్యత్తులోనూ, తమ స్వంత ఆసక్తులకంటే దైవిక కార్యాలను, ఇతరుల అవసరాలను ముందుంచినవారికి యెహోవా ప్రతిఫలం ఇచ్చినప్పుడు మరింత గొప్ప సంతోషం వెల్లివిరుస్తుంది.​—⁠1 తిమోతి 4:8-10.

యెహోవాసాక్షులకు రాజ్యమందిరాలు కట్టడంలో, సహాయం చేయడానికి ఎందుకంత కష్టపడుతున్నావని బిల్‌ను అడిగినప్పుడు, “అలా తరచుగా చిన్న సంఘాలకు సహాయం చేయడం నాకు గొప్ప సంతృప్తినిస్తుంది. నాకున్న నైపుణ్యాలను, జ్ఞానాన్ని ఇతరుల ప్రయోజనం కోసం ఉపయోగించడంలో నేనెంతో ఆనందిస్తాను” అని చెప్పాడు. ఇతరులకు బైబిలులోని సత్యాన్ని తెలియజేసేందుకు తన శక్తి, సామర్థ్యాలను అంకితం చేయడాన్ని ఎమ్మా ఎందుకు ఎన్నుకుంది? “పూర్తికాల సేవ తప్పించి నేనిక దేని గురించీ ఊహించలేను. యౌవనస్థురాలిగా నాలో శక్తి ఉన్నప్పుడే యెహోవాను సంతోషపర్చడానికి, ఇతరులకు సహాయం చేయడానికి సాధ్యమైనంత చేయాలన్నది నా కోరిక. దానికి వస్తుపరమైన కొన్ని ప్రయోజనాలను త్యాగం చేయడం గొప్ప విషయమేమీ కాదు. అయినా యెహోవా నాకోసం చేసినదాన్నిబట్టి చూస్తే, పరిచర్యకు సంబంధించి నేను నా కర్తవ్యం కంటే ఎక్కువేమీ చేయడంలేదు” అని ఆమె చెప్పింది.

తమ పిల్లల్ని పెంచి పోషించడానికి ఎన్నో సంవత్సరాలు కష్టపడి పనిచేసిన మౌరిస్‌ బెట్టీలు తమ శేషజీవితాన్ని తీరికగా గడపలేకపోతున్నామని ఎంతమాత్రం బాధపడడం లేదు. వాళ్లిప్పుడు రిటైరయ్యారు గనుక, తమ జీవితంలో మరింత ప్రయోజనకరమైంది, అర్థవంతమైంది చేయాలని అనుకుంటున్నారు. “మాకు ఊరకే కూర్చుని తీరిగ్గా గడపాలని లేదు, వేరే దేశంలో, యెహోవా గురించి తెలుసుకోవడానికి ఇతరులకు సహాయం చేయడం వల్ల మా జీవితంలో ఒక అర్థవంతమైన పనిని చేసే అవకాశాన్ని పొందుతున్నాం” అని అన్నారు.

మీరు స్వయంత్యాగపూరితులై ఉండాలని నిశ్చయించుకున్నారా? ఇది అంత సుళువైనదేమీ కాదు. మన అపరిపూర్ణ మానవ కోరికలకూ, దేవుణ్ణి సంతోషపర్చాలనే ప్రగాఢమైన కోరికకూ మధ్య ఎడతెరిపి లేకుండా పోరాటం జరుగుతూనే ఉంటుంది. (రోమీయులు 7:​21-23) ఒకవేళ మన జీవితంలో యెహోవా నడిపింపును అనుమతిస్తే ఆ పోరాటంలో మనం గెలుస్తాం. (గలతీయులు 5:​16, 17) మనమాయన సేవలో చేసే స్వయంత్యాగపూరిత సేవను ఆయన తప్పకుండా జ్ఞాపకం ఉంచుకుంటాడు, అధికంగా ఆశీర్వదిస్తాడు కూడా. నిజానికి యెహోవా దేవుడు ‘ఆకాశపువాకిండ్లను విప్పి, పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరిస్తాడు.’​—⁠మలాకీ 3:​10; హెబ్రీయులు 6:⁠10.

[23వ పేజీలోని చిత్రం]

యేసు స్వయంత్యాగపూరితమైన స్ఫూర్తి కలిగియున్నాడు. మరి మీరు?

[24వ పేజీలోని చిత్రాలు]

పౌలు రాజ్య ప్రకటనా పనిమీదనే దృష్టి కేంద్రీకరించి తదనుగుణంగా కృషిచేశాడు