కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఒక ప్రత్యేకమైన వారసత్వాన్ని ఆశీర్వాదంగా పొందాను

ఒక ప్రత్యేకమైన వారసత్వాన్ని ఆశీర్వాదంగా పొందాను

జీవిత కథ

ఒక ప్రత్యేకమైన వారసత్వాన్ని ఆశీర్వాదంగా పొందాను

కారొల్‌ అలెన్‌ చెప్పినది

నేను ఒంటరిగా ఉన్నాను, నా చేతిలో ఉన్న అందమైన క్రొత్త పుస్తకాన్ని గట్టిగా పట్టుకున్నాను. భయం ఆవహించిన నాకు, కళ్ళనుండి నీళ్ళు వస్తున్నాయి. ఒక అపరిచిత పట్టణంలో, వేలాదిమంది మధ్య తప్పిపోయిన నాకు, కేవలం ఏడు సంవత్సరాలే!

ఇటీవల, యెహోవాసాక్షుల ప్రయాణ పైవిచారణకర్తల పాఠశాల, రెండవ తరగతిలో శిక్షణ కోసం ఆహ్వానించబడ్డ నా భర్త పాల్‌తో పాటు, న్యూయార్క్‌లోని పాటర్సన్‌లో ఉన్న అందమైన వాచ్‌టవర్‌ ఎడ్యుకేషనల్‌ సెంటరుకు వచ్చినప్పుడు, నా మనసులో గాఢంగా ముద్రితమై ఉన్న నా చిన్ననాటి ఆ జ్ఞాపకాలు, దాదాపు 60 సంవత్సరాల తర్వాత వెల్లువలా ఉబికి వచ్చాయి.

సూర్యకాంతితో వెలుగుమయమై ఉన్న లాబీని మేము చూస్తుండగా, ఒకచోట “సమావేశాలు” అని పెద్ద పెద్ద అక్షరాలలో ప్రదర్శన కోసం పెట్టిన ఫోటోలను నేను గమనించాను. అందులో, నాకు ఇష్టమైన చిన్నప్పటి పుస్తకం కాపీలను పట్టుకొని ఉత్సాహంగా చేతులూపుతున్న పిల్లల బ్లాక్‌ అండ్‌ వైట్‌ పాత ఫోటో ఒకటి నాకు కన్పించింది. వెంటనే దాని క్రింద ఉన్న కాప్షన్‌ చదివాను: “1941 లో, మిస్సోరిలోని, సెయింట్‌ లూయిస్‌లో ఉన్న మెయిన్‌ అరేనాలో, జరిగిన సమావేశపు ఉదయకాల కార్యక్రమంలో సహోదరుడు రూథర్‌ఫర్డ్‌ “పిల్లలు” అనే క్రొత్త పుస్తకం విడుదల గురించి ప్రకటించగానే, 5 నుండి 18 ఏళ్ళ వయసుగల 15,000 మంది పిల్లలు వేదిక ముందుకు వెళ్ళి కూర్చున్నప్పటి చిత్రం.”

పిల్లలందరికీ ఒక్కొక్క కాపీ ఇవ్వబడింది. అటు తర్వాత, పిల్లలందరు వాళ్ళ తల్లిదండ్రులు కూర్చున్న చోటికి తిరిగి వెళ్ళారు​—⁠నేను తప్ప. నేను తప్పిపోయాను! ఒక అటెండెంట్‌, నన్ను చూసి ఆప్యాయంగా ఎత్తుకుని ఎత్తుగా ఉన్న ఒక విరాళపెట్టె పైన నిలబెట్టి నాకు తెలిసిన వారికోసం చూడమన్నాడు. వెడల్పాటి మెట్ల మీదినుండి ప్రవాహంలా వస్తున్న జనంలో ఆత్రంగా వెతకడం మొదలు పెట్టాను. ఆ గుంపులో ఒక పరిచయమున్న ముఖం కనిపించింది! ఆనందంగా పిలిచాను, “అంకుల్‌ బాబ్‌! అంకుల్‌ బాబ్‌!” హమ్మయ్యా! బాబ్‌ రెయినర్‌ నన్ను ఎత్తుకుని నా కోసం ఆదుర్దాగా వెదుకుతున్న మా అమ్మానాన్నల దగ్గరకు తీసుకువెళ్ళాడు.

నా జీవితాన్ని తీర్చిదిద్దిన తొలి సంఘటనలు

ప్రదర్శన కోసం పెట్టిన ఆ ఫోటోను చూడగానే నా జీవితాన్ని తీర్చిదిద్దిన, ఆ అందమైన పాటర్సన్‌లో ఉండడానికి కారణమైన సంఘటనల జ్ఞాపకాలు వరదలా పొంగుకువచ్చాయి. ప్రత్యేకించి, నేను మా తాతయ్య నుండి మా అమ్మానాన్నల నుండి విన్న, వందసంవత్సరాల కంటే మునుపటి సంఘటనల వైపుకు నా ఆలోచనలు మళ్ళాయి.

అప్పట్లో బైబిలు విద్యార్థులుగా పిలువబడిన యెహోవాసాక్షుల ఒక పూర్తికాల సేవకుడు 1894 డిసెంబరులో, అమెరికాలోని పెన్సిల్వేనియాలోగల, స్క్రాన్‌టోన్‌లో ఉన్న మా తాతయ్య క్లేటన్‌ జే. వుడ్‌వర్త్‌ ఇంటికి వచ్చారు. తాతయ్యకు అప్పుడే క్రొత్తగా పెళ్ళయింది. ఆయన వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ అధ్యక్షుడైన చార్లెస్‌ తేజ్‌ రస్సెల్‌కు ఒక ఉత్తరం వ్రాశారు, అది 1895, జూన్‌ 15, వాచ్‌టవర్‌లో ముద్రించబడింది. ఆయనిలా వివరించాడు:

“మేము ఒక మెథడిస్ట్‌ చర్చిలో గత 10 సంవత్సరాల నుండి సభ్యులుగా ఉంటున్న యువ దంపతులం. కానీ, ఈ అంధకారం నుండి బయటపడి, సర్వోన్నతునికి సమర్పించుకున్న ఆయన పిల్లలకోసం, ఇప్పుడు ఉదయిస్తున్న నూతన దిన ప్రకాశంలోకి ప్రవేశించామని నమ్ముతున్నాము . . . నా భార్యా నేను కలుసుకోవడానికి చాలా కాలం ముందు నుండే, ప్రభువు సేవ చేయాలన్నది మా గాఢమైన కోరిక, ఆ ప్రభువు చిత్తమైతే విదేశాల్లో మిషనరీలుగా సేవ చేయాలని ఆశిస్తున్నాం.”

మా అమ్మ తరఫు నుండి నాకు ముత్తాత అయిన సెబాస్టియన్‌, ముత్తవ్వ అయిన కాథరిన్‌ క్రెస్గేలు పెన్సిల్వేనియాలోని, అందమైన పొకోనో పర్వత ప్రాంతాల్లో, వారి పొలానికి దగ్గరగా ఉన్న ఒక పెద్ద ఇంట్లో ఉండేవారు. అక్కడికి 1903 లో వాచ్‌టవర్‌ నుండి వచ్చిన ఇద్దరు సహోదరులు తెచ్చిన బైబిలు సందేశాన్ని సంతోషంగా విన్నారు. వాళ్ళ పెద్ద కూతురు మేరీ, ఆమె భర్త ఎడ్మండ్‌ హోవెల్‌, చిన్న కూతురు కోరా, ఆమె భర్త వాషింగ్‌టన్‌ హోవెల్‌ కూడా వాళ్ళతోనే ఉంటున్నారక్కడ. వాచ్‌టవర్‌ నుండి వచ్చిన కార్ల్‌ హమ్మెర్లె, రే రాట్‌-క్లిఫ్‌లు వారందరికి ఎన్నో విషయాలను బోధిస్తూ ఒక వారమంతా వారితో అక్కడే గడిపారు. వాళ్ళు చెప్పినదాన్ని ఈ ఆరుగురు కుటుంబ సభ్యులు శ్రద్ధగా విన్నారు, పఠించారు, త్వరలోనే ఉత్సాహవంతులైన బైబిలు విద్యార్థులయ్యారు.

అదే సంవత్సరం అంటే 1903 లో, కోరా, వాషింగ్‌టన్‌ హోవెల్‌లకు ఒక కూతురు పుట్టింది, ఆమెకు కాథరిన్‌ అని పేరు పెట్టారు. ఆమె, తరువాత మానాన్నగారు క్లేటన్‌ జె. వుడ్‌వర్త్‌ జూనియర్‌ను పెళ్ళి చేసుకోవడం, ఆసక్తికరమైన, అర్థవంతమైన కథ అని నేను నమ్ముతాను. ఆ కథ మా తాతయ్య క్లేటన్‌ జె. వుడ్‌వర్త్‌ సీనియర్‌కున్న పితృవాత్సల్యాన్ని, పిల్లల పెంపకంలో ఆయన చూపిన చక్కని సునిశిత దృష్టిని వెల్లడి చేస్తుంది.

మా నాన్నగారు పొందిన ప్రేమపూర్వక సహాయం

హోవెల్‌గారి పొలానికి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్క్రాన్‌టన్‌లో, 1906 లో, మా నాన్నగారు జన్మించారు. ఆ తొలి సంవత్సరాల్లో, వుడ్‌వర్త్‌ తాతయ్య హోవెల్‌ ఉమ్మడి కుటుంబానికి బాగా దగ్గరయ్యారు. ఆతిథ్య ప్రియులైన వారి చక్కని ఆతిథ్యాన్ని తాతయ్య తరచుగా చవిచూస్తుండేవారు. ఆయన ఆ ప్రాంతంలోని బైబిలు విద్యార్థుల సంఘానికి గొప్ప సహాయకంగా ఉండేవారు. కాలక్రమంలో, హోవెల్‌, తన ముగ్గురు కొడుకుల పెళ్ళిళ్ళకు మా తాతయ్యను పిలిచారు, తాతయ్య తన కొడుకు శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఆ పెళ్ళిళ్ళకు నాన్నగారిని వెంట తీసుకువెళ్ళేవారు.

నాన్నగారు అప్పుడు బైబిలు విద్యార్థుల పరిచర్యలో సరిగా పాల్గొనేవారు కాదు. పరిచర్య సేవకు తాతయ్యను దింపడానికి తోడుగా మాత్రం వెళ్ళేవారు. తాతయ్య ఎంత ప్రోత్సహించినప్పటికీ, నాన్నగారు మాత్రం పరిచర్యపట్ల ఉత్సాహం చూపించేవారు కాదు. ఆ సమయంలో, మా నాన్నగారికి సంగీతంపై ఉన్న శ్రద్ధ, మిగతా వాటన్నింటికీ ఆయన దూరంగా ఉండేలా చేసింది. జీవితంలో మంచి సంగీతకారుడు కావాలనే ఆశయంతో ఆయన ముందుకు సాగుతున్నారప్పుడు.

కోరా, వాషింగ్‌టన్‌ హోవెల్‌ల కూతురు కాథరిన్‌ సంగీతం నేర్చుకోవడం అప్పటికి పూర్తిచేసింది. ఆమె పియానో వాయించడమే కాక, నేర్పిస్తుంది కూడా. సంగీత రంగాన్ని జీవితగమనం చేసుకొని ఇంకా ముందుకు వెళ్ళడానికి ఆమెకు ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ, ఆమె వాటన్నింటినీ ప్రక్కకు పెట్టి ఒక పూర్తికాల పరిచారకురాలిగా సేవను ప్రారంభించింది. నా అంచనా ప్రకారమైతే, మా తాతయ్య మనసులో తన కొడుకు కోసం ఇంతకంటే మంచి తోడు ఎవరూ లేరు. నాన్నగారు, బాప్తిస్మం తీసుకున్న ఆరు నెలల తరువాత 1931 జూన్‌లో, అమ్మను పెళ్ళి చేసుకున్నారు.

మా తాతయ్య, తన కుమారుని సంగీత ప్రతిభను చూసి ఎంతో గర్వపడేవారు. 1946 లో, ఒహాయోలోని క్లీవ్‌లాండ్‌లో జరిగిన అంతర్జాతీయ సమావేశంలో ఉపయోగించిన పెద్ద ఆర్కెస్ట్రాకు శిక్షణనివ్వడానికి, నాన్నగారిని పిలిచినప్పుడు తాతయ్య ఎంతో ఆనందించారు. తరువాతి సంవత్సరాల్లో, యెహోవాసాక్షుల చాలా సమావేశాల్లో నాన్నగారు ఆర్కెస్ట్రా నిర్వహించారు.

తాతయ్య కోర్టు విచారణ, జైలు జీవితం

పాల్‌, నేను ఇద్దరం పాటర్సన్‌ లాబీలో ఫోటోలు చూస్తున్నప్పుడు, ప్రక్క పేజీలో ఉన్న ఫోటోను కూడా చూశాం. 50 సంవత్సరాల క్రితం దాని కాపీ ఒకటి తాతయ్య నాకు పంపారు. కాబట్టి, ఆ ఫోటోను నేను వెంటనే గుర్తు పట్టగలిగాను. కుడివైపు ఆ చివరన నిలబడింది ఆయనే.

స్వదేశాభిమాన ఉద్వేగం తీవ్రంగా కమ్ముకొని ఉన్న మొదటి ప్రపంచయుద్ధ సమయంలో, వాచ్‌టవర్‌ ప్రెసిడెంట్‌ జోసెఫ్‌ ఎఫ్‌. రూథర్‌ఫర్డ్‌తో (మధ్యలో కూర్చున్నారు) పాటు ఈ ఎనిమిది మంది బైబిలు విద్యార్థులను అన్యాయంగా జైల్లో వేసి, బెయిల్‌ మీద విడుదల చేయడానికి కూడా నిరాకరించారు. ద ఫినిష్డ్‌ మిస్ట్రీ అనే పేరు గల స్టడీస్‌ ఇన్‌ ద స్క్రిప్చర్స్‌ ఏడవ సంపుటిలో చెప్పిన కొన్ని విషయాలు, అమెరికా, మొదటి ప్రపంచయుద్ధంలో పాల్గొనడాన్ని నిరుత్సాహపర్చేవిగా ఉన్నాయని అపార్థం చేసుకోవడమే వీరిని జైల్లో వేయడానికి కారణం.

అనేక సంవత్సరాల వ్యవధిలో చార్లెస్‌ తేజ్‌ రస్సెల్‌ డీస్‌ ఇన్‌ ద స్క్రిప్చర్స్‌ మొదటి ఆరు సంపుటాలను వ్రాశారు, కానీ ఏడవ సంపుటిని వ్రాయడానికి ముందే ఆయన చనిపోయారు. ఆయన నోట్స్‌ మా తాతయ్యకు, మరొక బైబిలు విద్యార్థికి ఇవ్వబడింది. వాళ్ళు ఏడవ సంపుటిని పూర్తిచేసి యుద్ధం ముగియడానికి ముందు, 1917 లో విడుదల చేశారు. కోర్టు విచారణలో తాతయ్యతో పాటు వారిలో చాలామందికి ఏకకాలంలో అనుభవించేలా ఒక్కొక్కటి 20 సంవత్సరాలతో కూడిన నాలుగు శిక్షలు విధించబడ్డాయి.

పాటర్సన్‌ లాబీలో ఉన్న ఈ ఫోటో క్రింది కాప్షన్‌ ఇలా వివరిస్తోంది: “యుద్ధం ముగిసి, రూథర్‌ఫర్డ్‌కు, ఆయన సహవాసులకు శిక్షపడిన 9నెలల తర్వాత అంటే 1919, మార్చి 21న, ఈ 8మంది ప్రతివాదులకు బెయిల్‌ను ఇవ్వమని అప్పీల్స్‌కోర్టు ఆదేశించింది. బ్రూక్లిన్‌లో మార్చి 26న, ఒక్కొక్కరిని 10వేల డాలర్లకు, బెయిలు మీద విడిచిపెట్టారు. 1920, మే 5న, జె. ఎఫ్‌. రూథర్‌ఫర్డ్‌, ఆయనతో పాటు మిగతావారు పూర్తిగా విడుదల పొందారు.”

శిక్షపడిన తర్వాత, జార్జియాలోని అట్లాంటాలోనున్న, సంయుక్త రాష్ట్రాలకు చెందిన చెరసాలకు పంపడానికి ముందు, ఈ ఎనిమిది మందిని న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లోవున్న రేమండ్‌ స్ట్రీట్‌ జైల్లో కొన్ని రోజులపాటు నిర్బంధించారు. వారిని నిర్బంధించిన ఆరు అడుగుల పొడవు, ఎనిమిది అడుగుల వెడల్పు గల జైలుగది స్థితిని వర్ణిస్తూ తాతయ్య ఒక ఉత్తరం వ్రాశారు, ఆ గది “చెప్పనలవికాని రోతపుట్టించే విధంగా, చిందరవందరగావుంది.” ఆయన ఇంకా ఇలా వ్రాశారు: “ఆ గదిలో ఒక మూల పాత న్యూస్‌పేపర్లు కుప్పగా పడి ఉన్నాయి. చూసిన వెంటనే అవి అంత అవసరమైనవిగా అనిపించకపోయినా, తమను తాము శుభ్రపర్చుకుని మర్యాద దక్కించుకోవటానికి అవీ, సబ్బూ, ఒక బట్టముక్క, మాత్రమే దిక్కని అర్థమౌతుంది.”

అయినా, తాతయ్య చమత్కరిస్తూ ఆ జైలు గదిని ఫ్రెంచ్‌ భాషలో ఎంతో వైభవంగా ఉన్న హోటలని అర్థమొచ్చేలా “హోటెల్‌ ది రేమొందీ” అని, “నన్ను ఇక్కడ నుండి తీసుకెళ్ళేంతవరకూ ఇక్కడే ఉంటాను” అనీ వ్రాశారు. ఆయన జైలు ప్రాంగణంలో తాను చేసే పచార్ల గురించి కూడా వర్ణించారు. ఒకసారి ఆ ప్రాంగణంలో (అక్కడ అద్దాలు ఉండవు కాబట్టి ఖైదీలు ఒకరికొకరు తల దువ్వుకునే వారు) తల దువ్వించుకోడానికి ఆగిన కొద్ది సమయంలోనే ఒక జేబు దొంగ, ఆయన జేబు గడియారం కొట్టేయడానికి ప్రయత్నించాడట, కానీ “దాని గొలుసు తెగిపోవడం వల్ల నా గడియారం నాకు దక్కింది” అని వ్రాశారు. నేను 1958 లో బ్రూక్లిన్‌ బేతేలుకు వెళ్లినప్పుడు, అప్పట్లో వాచ్‌టవర్‌ సొసైటీ సెక్రెటరి-ట్రెజరర్‌గా పనిచేస్తున్న గ్రాంట్‌ సూటర్‌ నన్ను తన ఆఫీసుకు పిలిచి, ఆ గడియారాన్ని నాకిచ్చారు. నేను ఇప్పటికీ దాన్ని ఎంతో అపురూపంగా చూసుకుంటాను.

నాన్నగారిపై ప్రభావం

తాతయ్యను 1918 లో, అన్యాయంగా జైల్లో వేసేటప్పటికి మా నాన్నగారికి కేవలం 12 ఏళ్ళు మాత్రమే. మా నానమ్మ, ఇంటికి తాళం వేసి నాన్నగారిని తీసుకుని వాళ్ళమ్మ, ముగ్గురు చెల్లెళ్ళతో కలిసి ఉండడానికి వెళ్ళిపోయింది. పెళ్ళికి ముందు నానమ్మ పేరు ఆర్తర్‌, మా దూరపు బంధువు ఒకాయన చెస్టర్‌ అలెన్‌ ఆర్తర్‌, అమెరికాకు 21వ ప్రెసిడెంటు అంటూ ఆ కుటుంబస్థులు గొప్పగా చెప్పుకొనేవారు.

అమెరికా విద్రోహి లాంటి నిందారోపణలతో తాతయ్యను జైల్లో వేసేసరికి ఆర్తర్‌లు, తాతయ్య తమ ఇంటిపేరు పాడు చేశాడని భావించారు. అది మా నాన్నగారిని మానసికంగా చాలా బాధపెట్టిన సమయం. పరిచర్యలో పాల్గొనేందుకు ఆయన మొదట్లో వెనుకాడడానికి గల కారణం బహుశా అలా వ్యవహరించడమే కావచ్చు.

తాతయ్య జైలు నుండి విడుదలైన తర్వాత తన కుటుంబాన్ని స్క్రాంటన్‌లోని, క్విన్సీ స్ట్రీట్‌లో ఉన్న, పోర్ట్‌లాండ్‌ సిమెంట్‌తో కట్టిన అందమైన ఒక పెద్ద ఇంట్లోకి మార్చారు. చిన్న పిల్లగా ఉన్న నాకు మా నానమ్మ, తాతయ్యల ఇల్లూ ప్రత్యేకించి మా నానమ్మ అందమైన చైనా పింగాణి పాత్రలూ సుపరిచితాలే. ఆ పాత్రల్ని నానమ్మ ఎవ్వర్నీ ముట్టుకోనిచ్చేదికాదు, తను మాత్రమే వాటిని శుభ్రం చేసేది. అందుకే మేము వాటిని పవిత్ర పాత్రలనేవాళ్ళం. నానమ్మ 1943 లో చనిపోయిన తర్వాత అమ్మ ఆ అందమైన పాత్రల్ని తరచుగా వాడుతుండేది.

ఎడతెరిపి లేకుండా రాజ్య సేవలో

పాటర్సన్‌ క్యాంపస్‌లో మరొకరోజు, ఒహాయోలోని సీడార్‌ పాయింట్‌ దగ్గర 1919 లో జరిగిన సమావేశంలో, సహోదరుడు రూథర్‌ఫర్డ్‌ మాట్లాడుతున్నప్పటి ఫోటో ఒకటి చూశాము. ఆ సమావేశంలో, దేవుని రాజ్యాన్ని ఉత్సాహంగా ప్రకటించమనీ, అందుకు ఆ సమావేశంలో విడుదల చేయబడిన ద గోల్డెన్‌ ఏజ్‌ పత్రికను ఉపయోగించమనీ ఆయన అందరికీ ఉద్బోధించారు. తాతయ్యను ఆ పత్రికకు ఎడిటర్‌గా నియమించారు, 1940 లో చనిపోవడానికి కొద్దిగా ముందువరకూ ఆయన ఆ పత్రికకు ఎన్నో వ్యాసాలను అందించారు. ఆ పత్రిక పేరు 1937 లో కన్సోలేషన్‌ అనీ 1946 లో అవేక్‌! అనీ మార్చబడింది.

తాతయ్య స్క్రాంటన్‌లోని తన ఇంట్లో రెండు వారాలు, అక్కడి నుండి 240 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రూక్లిన్‌లోని వాచ్‌టవర్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో రెండువారాలు వుంటూ, రెండు చోట్ల నుండి వ్యాసాలు వ్రాస్తుండేవారు. ఎన్నోసార్లు ఉదయం ఐదు గంటలకు తాతయ్య టైపు చేస్తుంటే వచ్చే టక టక శబ్దం తనకు ఇంకా గుర్తుందని నాన్నగారు చెప్తుండేవారు. అయినా, తాతయ్య ప్రకటనా పని బాధ్యతను కూడా చాలా గంభీరంగా తీసుకునేవారు. నిజానికి, ఆయన మగవారి కోసం ఒక అంగీని రూపొందించారు, బైబిలు సాహిత్యాలను పెట్టుకోవడానికి అనుకూలంగా దానికి లోపలి వైపు పెద్ద పెద్ద జేబులుంటాయి. 94 ఏళ్ళ మా అత్తమ్మ (మా అమ్మ తమ్ముడి భార్య) నవొమి హోవెల్‌ దగ్గర ఇప్పటికీ అలాంటిది ఒకటుంది. ఆయన ఆడవాళ్ళ కోసం కూడా ఒక పుస్తకాల సంచిని రూపొందించారు.

ఒకసారి, ఉత్సాహకరమైన ఒక బైబిలు చర్చ జరిగిన తరువాత తాతయ్యతో పాటు పరిచర్య చేస్తున్న సహోదరుడు, “సి. జె., నీవొక పొరబాటు చేశావు” అని అన్నారు.

“ఏం పొరబాటు” అని తాతయ్య అడిగారు. ఆయన తన అంగీ రెండు జేబులూ తడుముకుని చూసుకున్నారు. అవి రెండూ ఖాళీగా ఉన్నాయి.

“నీవు ఆయనను ద గోల్డెన్‌ ఏజ్‌కు చందాదారునిగా చేయడం మర్చిపోయావు.” ఎడిటరే తన పత్రికను అందించడం మర్చిపోయాడని వాళ్ళు బాగా నవ్వుకున్నారు.

నా తొలి జ్ఞాపకాలు

నా చిన్నప్పుడు తాతయ్య నన్ను తన ఒడిలో కూర్చోబెట్టుకొని నా చిన్నారి చేతిని తన చేతిలోకి తీసుకుని “వేళ్ళ కథ” చెప్పడం నాకు గుర్తుంది. బొటనవేలుకు “టామీ థంబ్‌” అని మొదలుపెట్టి, చూపుడువేలుకు “పీటర్‌ పాయింటర్‌” అని వరుసగా పేర్లు పెడుతూ అయిదు వేళ్ళకున్న ప్రత్యేకతను గురించి చెప్పారు. తరువాత ఆయన జాగ్రత్తగా అయిదు వేళ్ళను ఒక్క దగ్గరికి పిడికిలిగా చేసి “అవన్నీ ఒకదానికొకటి సహాయంచేసుకుంటూ కలిసి చక్కగా పనిచేసుకుంటాయి” అన్న నీతిని చెప్పారు.

నా తల్లిదండ్రులు తమ పెళ్ళి తర్వాత, ఒహాయోలోని క్లీవ్‌లాండ్‌కు మారారు. అక్కడ ఎడ్‌ హూపర్‌, మేరీలకు చాలా సన్నిహితమయ్యారు. వారి కుటుంబస్థులు ఆ శతాబ్దారంభం నుండి బైబిలు విద్యార్థులుగా ఉంటున్నారు. నేను వాళ్లను “అంకుల్‌” “ఆంటీ” అని పిలిచేదాన్ని. అమ్మా, నాన్నా, ఎడ్‌ అంకుల్‌, మేరీ ఆంటీల మధ్య విడదీయలేని బంధం ఏర్పడింది. హూపర్‌ అంకుల్‌ వాళ్ళకున్న ఒక్కగానొక్క కూతురు చనిపోయిందట కాబట్టి, 1934 లో నేను అక్కడికి అమ్మానాన్నలతో వెళ్ళేసరికి నేను వాళ్ళకు ప్రత్యేకమైన “కూతురు”ను అయ్యాను. నన్ను వాళ్లు చాలా చక్కని ఆధ్యాత్మిక పరిసరాల్లో పెంచారు. నేను దేవునికి సమర్పించుకుని, నా ఎనిమిదవ పుట్టినరోజుకు ముందే బాప్తిస్మం పొందాను.

నా తొలి సంవత్సరాల్లో బైబిలు చదవడం, నా జీవితంలో ఒక భాగమైంది. దేవుని నూతనలోకం గురించి వర్ణించిన యెషయా 11:6-9 లేఖనాలు నాకెంతో ఇష్టం. న్యూయార్క్‌లోని, బప్ఫలొలో జరిగిన సమావేశంలో అమెరికన్‌ స్టాండర్డ్‌ వర్షన్‌ ప్రత్యేక ఎడిషన్‌ బైబిలును విడుదల చేశారు. నాకొక స్వంత కాపీ దొరికిన తర్వాత 1944 లో, బైబిలును మొత్తం చదవడానికి మొదటిసారిగా కృషి చేశాను. ఆ బైబిలులో “పాతనిబంధన”లో దేవుని పేరు యెహోవా అని దాదాపు 7000 సార్లు సరైన స్థలంలో ఉండేలా ముద్రింపజేశారు, ఆ అనువాదాన్ని చదవడం నాకు ఎంత ఆనందంగా ఉండేదో!

వారాంతాలు మాకు సంతోషకరమైన సమయాలు. నా తల్లిదండ్రులు, హూపర్‌ అంకుల్‌ వాళ్ళు, పల్లెప్రాంతాల్లో సాక్ష్యమివ్వడానికి వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకువెళ్లేవారు. మేము మధ్యాహ్నం కోసం భోజనం తీసుకుని వెళ్లి ఒక సెలయేరు దగ్గర పిక్‌నిక్‌ చేసుకునేవాళ్లం. తరువాత మేము బైబిలు ప్రసంగం ఇవ్వడం కోసం ఎవరి పొలం దగ్గరికైనా వెళ్లి, అక్కడి చుట్టుప్రక్కల వాళ్ళను పిలిచేవాళ్లం. అది సాధారణమైన జీవితం. మేమంతా ఎంతో ఆనందాన్ని పొందాం. ఈ కుటుంబ స్నేహితుల్లో చాలామంది తరువాత ప్రయాణ పైవిచారణకర్తలయ్యారు. అందులో ఎడ్‌ హూపర్‌, బాబ్‌ రేయినర్‌, ఆయన ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ఆయన చిన్న కొడుకు రిచర్డ్‌ రేయినర్‌, ఆయన భార్య లిండా ఇద్దరూ ఇప్పటికీ అదే పనిచేస్తున్నారు.

వేసవికాలాలు ప్రత్యేకమైన సంతోషసమయాలు. నేను హోవెల్‌గారి పొలం దగ్గర మా పెద్దమ్మ కూతురు గ్రేస్‌, మామయ్య కూతురు మారియోన్‌లతో కలిసివున్నాను. 1949 లో గ్రేస్‌, మల్కోమ్‌ అలెన్‌ను పెళ్ళి చేసుకుంది. కొన్ని సంవత్సరాల తర్వాత నేను మల్కోమ్‌ తమ్ముడిని పెళ్ళి చేసుకుంటానని అప్పట్లో నేనెంత మాత్రం అనుకోలేదు. మారియోన్‌, ఉరుగ్వేలో మిషనరీగా సేవ చేస్తుంది. ఆమె 1966 లో హౌవర్డ్‌ హిల్బోర్న్‌ను పెళ్ళి చేసుకుంది. గ్రేస్‌, మారియోన్‌లు వారి భర్తలతో బ్రూక్లిన్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో చాలా సంవత్సరాలు సేవ చేశారు.

తాతయ్య, నా గ్రాడ్యుయేషన్‌

నేను హైస్కూల్‌కు వెళ్ళే సంవత్సరాల్లో, తాతయ్య నాకు చాలా ఉత్తరాలు వ్రాసేవారు. ఆయన వ్రాసే ఉత్తరాల్లో కుటుంబపు పాత ఫోటోలు ఎన్నో ఉండేవి. ఆ ఫోటోల వెనుక కుటుంబ చరిత్రను తెలియజేసే అన్ని వివరాలు చక్కగా టైపు చేసి పంపేవారు. ఆ విధంగానే, మా తాతయ్య, ఆయనతోపాటు అన్యాయంగా జైలుకు వెళ్ళిన మిగతావారు ఉన్న ఈ ఫోటో కూడా నాకు అందింది.

తాతయ్యకు వచ్చిన క్యాన్సర్‌ కారణంగా 1951 చివరిలో ఆయన స్వరపేటిక దెబ్బతిన్నది. అయినా ఆయన హాస్య ధోరణిలో మాత్రం మార్పులేదు. కానీ ఆయన తాను మాట్లాడాలనుకున్న మాటలను తన వెంట తీసుకువెళ్ళే ఒక ప్యాడ్‌ మీద వ్రాసి చూపించాల్సివచ్చేది. 1952 జనవరికి నా గ్రాడ్యుయేషన్‌ మిడ్‌టర్మ్‌ పూర్తవుతుంది. అప్పుడు కాలేజీలో నేనివ్వాల్సిన ప్రసంగం కోసం తయారుచేసుకున్న డ్రాఫ్ట్‌, ఎలా ఉందో చూడమని తాతయ్యకు డిసెంబరు మొదట్లో పంపించాను. దానిపై ఆయన కొన్ని ఎడిటోరియల్‌ గుర్తులు పెట్టి, చివరి పేజీలో “తాతయ్యకు నచ్చింది” అని రెండు పదాలు వ్రాశారు, అవి నా హృదయాన్ని స్పృశించాయి. ఆయన తన భూజీవితాన్ని తన 81వ ఏట 1951 డిసెంబరు 18న ముగించారు. * తాతయ్య వ్రాసిన ఆ రెండు పదాలున్న, వెలిసిపోయిన నా ప్రసంగ పత్రం, ఇప్పటికీ నా దగ్గర భద్రంగా ఉంది.

నా గ్రాడ్యుయేషన్‌ పూర్తయిన వెంటనే యెహోవాసాక్షులు పయినీరు సేవ అని పిలిచే పూర్తికాల ప్రకటనాపనిని ప్రారంభించాను. నేను 1958 లో న్యూయార్క్‌లో అతి పెద్ద సమావేశానికి హాజరయ్యాను. ఆ సమావేశానికి 123 దేశాల నుండి వచ్చిన 2,53,922 మందితో పోలోగ్రౌండ్స్‌, యాంకీ స్టేడియం కిటకిటలాడిపోయాయి. అక్కడ ఒకరోజు ఆఫ్రికా నుండి వచ్చిన ఒక సహోదరుణ్ణి కలిశాను. ఆయన బాడ్జి మీద “వుడ్‌వర్త్‌ మిల్స్‌” అని ఉంది. దాదాపు 30 సంవత్సరాల క్రితం, తాతయ్య పేరుమీదుగా ఆయనకు ఆ పేరు పెట్టారు.

నాకు లభించిన వారసత్వానికి సంతోషిస్తున్నాను

నాకు 14 ఏళ్ళు వచ్చినప్పుడు మా అమ్మ తిరిగి పయినీరు సేవ మొదలెట్టింది. 40 సంవత్సరాల తర్వాత 1988 లో ఆమె చనిపోయేటప్పటికి ఆమె ఇంకా పయినీరే! నాన్నగారు వీలైనప్పుడెల్లా పయినీరు సేవ చేసేవారు. ఆయన అమ్మ కంటే 9 నెలల ముందు చనిపోయారు. మేము ఎవరితో బైబిలు పఠనం చేశామో వాళ్లంతా మాకు మంచి స్నేహితులయ్యారు, వారిలో కొందరి కొడుకులు బ్రూక్లిన్‌లోని ప్రధాన కార్యాలయంలో సేవ చేయడానికి వెళ్ళారు. మరికొందరు పయినీరు సేవలో ప్రవేశించారు.

నా జీవితంలో 1959 ఒక ప్రత్యేకమైన సంవత్సరం. ఆ సంవత్సరంలోనే నాకు పాల్‌ అలెన్‌తో పరిచయమైంది. యెహోవాసాక్షుల మిషనరీల ట్రైనింగ్‌ కోసం ఏర్పాటు చేయబడిన గిలియడ్‌ స్కూల్‌ నుండి, 1946 లో జరిగిన ఏడవ తరగతిలో ఆయన గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. అప్పుడే ఆయన ప్రయాణ పైవిచారణకర్తగా నియమించబడ్డారు. మేము మొదటిసారి కలుసుకున్నప్పుడు, నేను పయినీరు సేవచేస్తున్న ఒహాయోలోని క్లీవ్‌లాండ్‌, ఆయన తర్వాతి నియామకం అవుతుందని మాకెవరికీ తెలియదు. నాన్నగారు ఆయనను చాలా ఇష్టపడ్డారు, అమ్మ కూడా ఇష్టపడింది. హోవెల్‌గారి పొలంలోని ఇంట్లో మా కుటుంబాల మధ్య, ఎడ్‌ హూపర్‌ మా పెళ్ళి ప్రసంగం ఇవ్వగా మేము 1963 లో పెళ్ళి చేసుకున్నాం. మేము కన్న కల నిజమైంది.

పాల్‌ తన కోసం ఎప్పుడూ కారు కొనుక్కోలేదు. ఆయన తర్వాతి నియామకానికి మేము క్లీవ్‌లాండ్‌ వదిలి వెళ్ళేటప్పుడు, మా సామానంతా నా 1961 మోడల్‌ వోక్స్‌వాగన్‌ బగ్‌లో చక్కగా పట్టాయి. కారు సైజు, ఆకారాన్ని బట్టి దాన్ని బగ్‌ అని పిలిచేవారు. సోమవారాల్లో తరచుగా వచ్చే స్నేహితులు, సామాన్లు ఎలా ఎక్కిస్తామో చూడ్డానికి మేము వేరే సంఘానికి వెళ్ళేరోజున, కూడా వచ్చారు. సర్కస్‌ ప్రదర్శన జరిగినట్టు, మా సూట్‌కేసులు, బ్రీఫ్‌కేసులు, టైప్‌రైటర్‌, ఫైలింగ్‌ పెట్టె మొదలైనవన్నీ ఆ చిన్న కారులోనే చక్కగా అమిరాయి.

నేను, పాల్‌ కలిసి లెక్కలేనన్ని కిలోమీటర్లు ప్రయాణించాం. ప్రస్తుత జీవితంలోని ఎగుడు దిగుడులను ఆనందంతోనూ సహనంతోనూ ఎదుర్కొన్నాం. అవన్నీ యెహోవా మాత్రమే ఇవ్వగల శక్తితో చేయగలిగాం. యెహోవాను ప్రేమిస్తూ, మేమిద్దరం ఒకరినొకరం ప్రేమించుకుంటూ, పాత క్రొత్త స్నేహితులను ప్రేమిస్తూ గడిపిన ఆ సంవత్సరాలన్నీ ఎంతో ఆనందంగా గడిచిపోయాయి. ఇప్పటి వరకూ గడిచిన మా జీవితంలో పాల్‌ శిక్షణ కోసం పాటర్సన్‌లో గడిపిన రెండు నెలలు ఎంతో సంతోషకరమైనవి. యెహోవా భూలోక సంస్థను దగ్గరనుండి గమనించడం, నా అమూల్యమైన ఆధ్యాత్మిక వారసత్వంలో భాగంగా నాకు సంక్రమించిన దృఢవిశ్వాసాన్ని అంటే ఇది నిజంగా దేవుని సంస్థే అన్న నా విశ్వాసాన్ని మరింత బలపర్చింది. ఆ సంస్థలోఒక చిన్న భాగమై ఉండడం కూడా ఎంత ఆనందకరమైన విషయం!

[అధస్సూచి]

^ పేరా 44 కావలికోట (ఆంగ్లం) ఫిబ్రవరి 15, 1952 లో పేజీ 128 చూడండి.

[25వ పేజీలోని చిత్రం]

ఎడ్‌ హూపర్‌తో, 1941 లో జరిగిన సెయింట్‌ లూయిస్‌ సమావేశానికి కొద్దికాలం ముందు, ఇక్కడే నేను “పిల్లలు” అనే పుస్తకం నా స్వంత కాపీ పొందింది

[26వ పేజీలోని చిత్రం]

తాతయ్య 1948 లో

[26వ పేజీలోని చిత్రం]

హోవెల్‌ గారి పొలం దగ్గర, మా తల్లిదండ్రులు (సర్కిల్‌లో) పెళ్ళి చేసుకున్నప్పటిది

[27వ పేజీలోని చిత్రం]

1918 లో అన్యాయంగా జైలు పాలైన ఎనిమిది మంది బైబిలు విద్యార్థులు (ఆ చివరన కుడివైపున నిలుచున్నది తాతయ్య)

[29వ పేజీలోని చిత్రం]

మా వస్తువులన్నీ మా వోక్స్‌వాగన్‌లో పట్టాయి

[29వ పేజీలోని చిత్రం]

నా భర్త పాల్‌తో