కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బైబిలు చదవడం—ప్రయోజనకరం, ఆహ్లాదకరం

బైబిలు చదవడం—ప్రయోజనకరం, ఆహ్లాదకరం

బైబిలు చదవడం​—⁠ప్రయోజనకరం, ఆహ్లాదకరం

‘దివారాత్రము దానిని ధ్యానించవలెను.’​—⁠యెహోషువ 1:⁠8.

1. చదవడం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలేమిటి, ప్రత్యేకంగా బైబిలును చదవడం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఏమిటి?

మంచి పుస్తకాల్ని చదవడం ప్రయోజనాన్ని చేకూర్చే ఒక పని. “అధ్యయనం చేయడం, నాకు ఎప్పుడూ బడలికను తీర్చే దివ్య ఔషధంలా పనిచేస్తుంది. ఒక గంటసేపు చదువుతూ గడిపానంటే చాలు నా చింతలన్నీ మటుమాయమైపోతాయి” అని ఫ్రెంచి రాజకీయ తత్వవేత్త అయిన మాంటెస్క్యూ (చార్లెస్‌ లూయీ డె సెకండాట్‌) వ్రాశాడు. బైబిలును చదివే విషయానికొస్తే అది కచ్చితంగా నిజం. దైవప్రేరేపితుడైన కీర్తనల గ్రంథకర్త ఇలా అన్నాడు: “యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును.”​—⁠కీర్తన 19:​7, 8.

2. యెహోవా బైబిలును ఇన్ని శతాబ్దాలపాటు ఎందుకు కాపాడాడు, దాన్ని తన ప్రజలు ఏమి చేయాలని ఆయన ఆశిస్తున్నాడు?

2 అటు మతపరమైన ఇటు లౌకికపరమైన శత్రువులు బైబిలును సర్వనాశనం చేయటానికి శతాబ్దాలుగా ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ దాని రచయితగా యెహోవా దేవుడు వాటన్నిటి నుండి దాన్ని కాపాడాడు. “మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెనని” దేవుడు ఇష్టపడుతున్నాడు గనుక ఆయన తన వాక్యం మానవజాతికంతటికీ అందుబాటులో ఉండేలా చూశాడు. (1 తిమోతి 2:⁠4) కేవలం 100 భాషలతో భూమ్మీది 80 శాతం మంది ప్రజల్ని చేరుకోవచ్చని అంచనా వేయబడింది. ప్రస్తుతం పూర్తి బైబిలు 370 భాషల్లో అందుబాటులో ఉంది. బైబిలులోని కొన్ని భాగాలు 1,860 భాషల్లోనూ మాండలికాల్లోనూ అందుబాటులో ఉన్నాయి. యెహోవా తన ప్రజలు తన వాక్యాన్ని చదవాలని కోరుకుంటున్నాడు. తన వాక్యంపై మనస్సు నిలిపి దాన్ని ప్రతిదినం చదివే తన సేవకుల్ని యెహోవా ఆశీర్వదిస్తాడు.​—⁠కీర్తన 1:1, 2.

పైవిచారణకర్తలు బైబిలును చదవడం ఆవశ్యకము

3, 4. ఇశ్రాయేలు రాజులకు ఏమి ఆవశ్యకమని యెహోవా చెప్పాడు, ఇది ఏ కారణాలను బట్టి నేటి క్రైస్తవ పెద్దలకు కూడా వర్తిస్తుంది?

3 ఇశ్రాయేలు జనాంగంపై ఒక మానవుడు రాజుగా పరిపాలించబోయే కాలం గురించి ముందుగానే మాట్లాడుతూ, యెహోవా ఇలా చెప్పాడు: “అతడు రాజ్యసింహాసనమందు ఆసీనుడైన తరువాత లేవీయులైన యాజకుల స్వాధీనములోనున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తనకొరకు వ్రాసికొనవలెను; అది అతనియొద్ద ఉండవలెను. తన రాజ్య మందు తానును తన కుమారులును ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతులగుటకై తాను తన సహోదరులమీద గర్వించి, యీ ధర్మమును విడిచిపెట్టి కుడికిగాని యెడమకు గాని తాను తొలగక యుండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి యీ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని యీ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రదుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను.”​—⁠ద్వితీయోపదేశకాండము 17:18-20.

4 ఇశ్రాయేలు మీద రాజ్యం చేయబోయే రాజులందరూ దైవిక నియమాల గ్రంథాన్ని ప్రతిదినం చదవడం ఆవశ్యకమని యెహోవా చెప్పడానికి కారణాలున్నాయని గమనించండి. అవి: (1) “యెహోవాకు భయపడి యీ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని, యీ కట్టడలను అనుసరించి నడువ నేర్చు[కోవడం]”; (2) “తాను తన సహోదరులమీద గర్విం[చక ఉండడం]”; (3) “యీ ధర్మమును విడిచిపెట్టి కుడికిగాని యెడమకు గాని తాను తొలగక [ఉండడం].” అయితే నేడు క్రైస్తవ పైవిచారణకర్తలు యెహోవాకు భయపడి, ఆయన నియమాలకు విధేయత చూపిస్తూ, తమ సహోదరుల మీద గర్వించక, యెహోవా ఆజ్ఞల నుండి ప్రక్కకు మళ్ళక స్థిరంగా ఉండాల్సిన అవసరం లేదా? ప్రతిదినం బైబిలును చదవడం ఇశ్రాయేలు రాజులకు ఎంత ప్రాముఖ్యమో వీరికీ అంతే ప్రాముఖ్యం.

5. ఇటీవల పరిపాలక సభ బైబిలు చదవడానికి సంబంధించి బ్రాంచి కమిటీ సభ్యులకు ఏమని వ్రాసింది, ఆ సలహాను పాటించడం క్రైస్తవ పెద్దలందరికీ ఎందుకు మేలుకరం?

5 నేడు క్రైస్తవ పెద్దలు చాలా బిజీగా ఉంటారు, కాబట్టి ప్రతిదినం బైబిలును చదవడం వారికి ఒక సవాలుగా మారిపోతుంది. ఉదాహరణకు, యెహోవాసాక్షుల పరిపాలక సభ సభ్యులూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్రాంచి కమిటీల సభ్యులూ ఎంతో బిజీగా ఉంటారు. అయినప్పటికీ, పరిపాలక సభ, అన్ని బ్రాంచి కమిటీలకూ ఇటీవల వ్రాసిన ఉత్తరంలో, బైబిలును ప్రతిదినం చదవాల్సిన అవసరాన్ని గురించీ మంచి అధ్యయన అలవాట్ల అవసరాన్ని గురించీ నొక్కిచెప్పడం జరిగింది. అలా చేయడం వల్ల యెహోవా పట్లా, సత్యం పట్లా మనకున్న ప్రేమ అధికమౌతుందనీ, అది “మన విశ్వాసాన్నీ, ఆనందాన్నీ, ఓర్పునూ మహిమాన్వితమైన అంతం వరకూ కాపాడుకోవడానికి సహాయంచేస్తుందనీ” ఆ ఉత్తరం పేర్కొంది. యెహోవాసాక్షుల సంఘాల్లోని పెద్దలందరూ ఆ అవసరాన్ని గ్రహిస్తారు. ప్రతిదినం లేఖనాలను చదవడం, వారు ‘నడిచే ప్రతి మార్గంలో చక్కగా ప్రవర్తించేందుకు’ వారికి సహాయం చేస్తుంది. (యెహోషువ 1:​7, 8) ప్రాముఖ్యంగా వారి విషయంలో, బైబిలు చదవడం “బోధించడానికీ, గద్దించడానికీ, సరిదిద్దడానికీ, నీతియందు శిక్షణనివ్వడానికీ ప్రయోజనకరమై ఉంది.”​—⁠2 తిమోతి 3:​16, రివైజ్డ్‌ స్టాండర్డ్‌ వర్షన్‌.

యౌవనస్థులకూ వృద్ధులకూ ఆవశ్యకము

6. సమావేశమైవున్న ఇశ్రాయేలు గోత్రములన్నిటి ఎదుట, పరదేశుల ఎదుట యెహోవా ధర్మశాస్త్రంలోని మాటలన్నిటినీ యెహోషువ ఎందుకు బిగ్గరగా చదివి వినిపించాడు?

6 ప్రాచీన కాలాల్లో, పరిశుద్ధ గ్రంథాల ప్రతులు ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా చదువుకోవడానికి అందుబాటులో ఉండేవి కావు, అందుకని ఒక సమాజంగా సమకూడిన సమూహం ఎదుట బిగ్గరగా బైబిలు చదవడం జరిగేది. యెహోవా ఇశ్రాయేలు వారికి హాయి నగరంపై విజయాన్ని ఇచ్చిన తర్వాత యెహోషువ ఆ జనాంగపు గోత్రాలన్నింటినీ గెరిజీము, ఏబాలు కొండల ఎదుట సమావేశపర్చాడు. అప్పుడు ఏం జరిగిందో వృత్తాంతం ఇలా చెబుతుంది: “ఆ ధర్మశాస్త్రగ్రంథములో వ్రాయబడిన వాటన్నిటినిబట్టి ఆ ధర్మశాస్త్ర వాక్యములనన్నిటిని, అనగా దాని దీవెన వచనమును దాని శాప వచనమును చదివి వినిపించెను. స్త్రీలును పిల్లలును వారి మధ్యనుండు పరదేశులును వినుచుండగా యెహోషువ సర్వసమాజము నెదుట మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటిలో చదువక విడిచిన మాటయొక్కటియు లేదు.” (యెహోషువ 8:​34, 35) ఎలాంటి ప్రవర్తన యెహోవా ఆశీర్వాదాన్ని తెస్తుంది, ఏది ఆయన అనంగీకారానికి కారణమౌతుంది అన్న విషయాలను యౌవనస్థులు, వృద్ధులు, స్వదేశీయులు, పరదేశులు, తమ హృదయాలపైన, మనస్సులపైన ముద్రించుకోవాలి. బైబిలును క్రమంగా చదవడం ఈ విషయంలో మనకు తప్పక సహాయం చేస్తుంది.

7, 8. నేడు ఎవరు “పరదేశుల”లా ఉన్నారు, వాళ్లు ప్రతిదినం బైబిలు ఎందుకు చదవాలి? (బి) యెహోవా ప్రజల మధ్యనున్న “పిల్లలు” యేసు మాదిరిని ఏ యే విధాలుగా అనుకరించవచ్చు?

7 నేడు, కోట్లాదిమంది యెహోవా సేవకులు ఆధ్యాత్మిక భావంలో ఆ “పరదేశుల” వలెనే ఉన్నారు. ఒకప్పుడు వాళ్లు లోక ప్రమాణాలకు అనుగుణ్యంగా జీవించారు, కానీ వాళ్లు తమ జీవితాలను మార్చుకున్నారు. (ఎఫెసీయులు 4:22-24; కొలొస్సయులు 3:​7, 8) వాళ్లు మేలు కీడుల విషయంలో యెహోవా ప్రమాణాల గురించి తమకు తాము గుర్తుచేసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంది. (ఆమోసు 5:​14, 15) దేవుని వాక్యాన్ని ప్రతిదినం చదవడం ఆ విషయంలో వాళ్ళకు సహాయం చేస్తుంది.​—⁠హెబ్రీయులు 4:12; యాకోబు 1:⁠25.

8 అయితే యెహోవా ప్రమాణాల గురించి తమ తల్లిదండ్రులు బోధించినప్పటికీ, ఆయన చిత్తం సరైనదేనని తమను తాము ఒప్పింపజేసుకోవలసిన చాలామంది “పిల్లలు” కూడా యెహోవా ప్రజల మధ్య ఉన్నారు. (రోమీయులు 12:​1, 2) వారలా తమను తాము ఎలా ఒప్పించుకోగలరు? ఇశ్రాయేలీయులలోని యాజకులకు, పెద్దలకు ఇలా ఉపదేశించబడింది: “ఇశ్రాయేలీయులందరి యెదుట ఈ ధర్మశాస్త్రమును ప్రకటించి వారికి వినిపింపవలెను. మీ దేవుడైన యెహోవాకు భయపడి యీ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకొనునట్లు పురుషులేమి స్త్రీలేమి పిల్లలేమి నీ పురములలోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకొనుటకై అందరిని పోగుచేయవలెను. ఆలాగు నేర్చుకొనినయెడల దాని నెరుగనివారి సంతతివారు దానిని విని, . . . మీరు బ్రదుకు దినములన్నియు మీ దేవుడైన యెహోవాకు భయపడుట నేర్చుకొందురు.” (ద్వితీయోపదేశకాండము 31:​11-13) యేసు ధర్మశాస్త్రం క్రింద జీవిస్తూ 12 ఏళ్ల లేతప్రాయంలోనే తన తండ్రి ఆజ్ఞలను అర్థం చేసుకోవడంలో అత్యంత ఆసక్తిని కనపర్చాడు. (లూకా 2:​41-49) ఆ తర్వాత, సమాజమందిరంలో లేఖనాలు చదవడమూ, వాటిని వినడమూ ఆయనకు వాడుకగా ఉండేది. (లూకా 4:16; అపొస్తలుల కార్యములు 15:​21) దేవుని వాక్యాన్ని ప్రతిదినం చదవడం ద్వారా, కూటాలకు క్రమంగా హాజరవ్వడం ద్వారా పిల్లలు యేసు మాదిరిని అనుకరించడం వారికి మేలుకరం, ఎందుకంటే కూటాల్లో కూడా బైబిలు చదవబడుతుంది, అధ్యయనం చేయబడుతుంది.

బైబిలు చదవడం​—⁠ఒక ప్రాధాన్యత

9. (ఎ) మనం చదవవలసిన వాటిని మనమెందుకు జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి? (బి) బైబిలు అధ్యయన సహాయకాల గురించి ఈ పత్రిక తొలి సంపాదకుడు ఏమని చెప్పాడు?

9 జ్ఞానియైన సొలొమోను రాజు ఇలా వ్రాశాడు: “హితోపదేశములు వినుము; పుస్తకములు అధికముగా రచింపబడును, దానికి అంతము లేదు; విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఆయాసకరము.” (ప్రసంగి 12:​12) నేడు ప్రచురించబడుతున్న అనేక పుస్తకాలను చదవడం దేహానికి ఆయాసకరమే కాదు, సూటిగా చెప్పాలంటే, మెదడుకు ప్రమాదకరం కూడా అని చెప్పవచ్చు. కాబట్టి పుస్తకాలను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. మన బైబిలు అధ్యయన ప్రచురణలతో పాటు మనం బైబిలును కూడా చదవాలి. ఈ పత్రిక తొలి సంపాదకుడు దాని పాఠకులకు ఇలా వ్రాశాడు: “బైబిలు మన ప్రామాణికమని, మన సహాయకాలు ఎంత దేవుడిచ్చినవైనప్పటికీ, అవి ‘సహాయకాలు’ మాత్రమే కాని బైబిలుకు ప్రత్యామ్నాయాలు కావని ఎన్నడూ మరచిపోకండి.” * కాబట్టి బైబిలు ఆధారిత ప్రచురణలను అలక్ష్యం చేయకుండానే, మనం బైబిలును కూడా చదవాలి.

10. ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు’ బైబిలు పఠన ప్రాముఖ్యాన్ని ఎలా నొక్కిచెప్పాడు?

10 ఈ అవసరాన్ని గుర్తెరిగి, ఇప్పటికి అనేక సంవత్సరాలుగా ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు’ ప్రతి సంఘంలోని దైవపరిపాలనా పరిచర్య పాఠశాల కార్యక్రమంలోనూ బైబిలు పఠన పట్టికను ఒక భాగంగా చేర్చాడు. (మత్తయి 24:​45) ప్రస్తుతమున్న బైబిలు పఠన కార్యక్రమాన్ని అనుసరిస్తే మొత్తం బైబిలును దాదాపు ఏడు సంవత్సరాల్లో ముగించవచ్చు. ఈ పట్టిక అందరికీ ప్రయోజనకరమైనది, ప్రాముఖ్యంగా క్రితమెన్నడూ బైబిలును పూర్తిగా చదవని వారికి మరీ ప్రయోజనకరం. మిషనరీల కోసమైన వాచ్‌టవర్‌ బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌కు హాజరయ్యేవారు, అలాగే మినిస్టీరియల్‌ ట్రైనింగ్‌ స్కూల్‌కు హాజరయ్యేవారు, ఇంకా బేతేలు కుటుంబానికి సభ్యులుగా వచ్చేవారు ఒక సంవత్సరంలో మొత్తం బైబిలును చదవవలసి ఉంటుంది. వ్యక్తిగతంగా లేదా కుటుంబంగా మీరు ఏ పట్టికను అనుసరించాలనుకున్నా సరే, మీరు అనుకున్నదాన్ని సాధించాలంటే బైబిలు పఠనానికే ప్రాధాన్యతను ఇవ్వడం అవసరం.

మీకున్న చదివే అలవాట్లు ఏమి తెలియజేస్తున్నాయి?

11. మనం ప్రతిదినం యెహోవా మాటలను ఎందుకు ఆహారంగా తీసుకోవాలి?

11 మీరు క్రమంగా బైబిలు చదవలేకపోతుంటే, మిమ్మల్ని మీరిలా ప్రశ్నించుకోవడం మంచిది: ‘లౌకిక ప్రచురణలను చదివే అలవాటు, టీవీ చూసే అలవాటు, నేను యెహోవా వాక్యాన్ని చదవడంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుండవచ్చు?’ మోషే వ్రాసిన ఈ విషయాన్ని గుర్తుంచుకోండి: “మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును.” ఇదే విషయాన్ని యేసు కూడా పునరుక్తి చేశాడు. (మత్తయి 4:4; ద్వితీయోపదేశకాండము 8:⁠3) మనం మన భౌతిక శరీరాలను బలపర్చుకునేందుకు ప్రతిదినం రొట్టెను గానీ అలాంటి మరేదైనా ఆహారాన్ని గానీ తినడం ఎలా అవసరమో అలాగే, మనం మన ఆధ్యాత్మికతను కాపాడుకోవడానికి ప్రతిదినం యెహోవా తలంపులను మనలోకి తీసుకోవడం కూడా అవసరమే. లేఖనాలను చదవడం ద్వారా మనం ప్రతిదినం దేవుని తలంపులను తెలుసుకోవచ్చు.

12, 13. (ఎ) దేవుని వాక్యంపట్ల మనకుండవలసిన అపేక్షను అపొస్తలుడైన పేతురు సోదాహరణంగా ఎలా చెప్పాడు? (బి) పాలకు సంబంధించి పేతురు సోదాహరణంగా చెప్పిన దానికి భిన్నమైన విధంగా పౌలు ఏమి చెప్పాడు?

12 బైబిలు “మనుష్యుల వాక్యమని యెంచక, అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని” మనం గుర్తిస్తే, ఒక పసిబిడ్డ తన తల్లిపాల కోసం ఆతురపడినట్లు మనం దాని కోసం ఆతురపడతాము. (1 థెస్సలొనీకయులు 2:​13) అపొస్తలుడైన పేతురు అలాంటి పోలికనే ఉపయోగిస్తూ ఇలా వ్రాశాడు: “ప్రభువు దయాళుడని మీరు రుచిచూచియున్న యెడల . . . క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై, నిర్మలమైన వాక్యమను పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము, ఆ పాలను అపేక్షించుడి.” (1 పేతురు 2:⁠1-3) “ప్రభువు దయాళుడని” మన స్వంత అనుభవం ద్వారా మనం నిజంగా రుచి చూసినట్లైతే, బైబిలు చదవడం పట్ల అపేక్షను పెంచుకుంటాము.

13 ఇక్కడ పేతురు, అపొస్తలుడైన పౌలు పాల విషయంలో ఉపయోగించిన సాదృశ్యానికి భిన్నమైన సాదృశ్యాన్ని ఉపయోగించడాన్ని గమనించాలి. నవజాత శిశువుకు పాలు, కావలసిన పోషకాలన్నింటినీ ఇస్తాయి. మనం “రక్షణ విషయములో ఎదుగు”టకు కావలసినవన్నీ దేవుని వాక్యంలో ఉన్నాయని పేతురు ఉపమానం చూపిస్తుంది. అయితే మరోవైపున పౌలు, ఆధ్యాత్మికంగా ఎదిగిన వారమని చెప్పుకునే కొందరికి ఆహారం విషయంలో ఉండే దురలవాట్లను గురించి సోదాహరణంగా చెప్పటానికి పాలను ఉపయోగిస్తున్నాడు. హెబ్రీ క్రైస్తవులకు తాను వ్రాసిన పత్రికలో పౌలు ఇలా వ్రాశాడు: “కాలమునుబట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసినవారై యుండగా, దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరల బోధింపవలసి వచ్చెను. మీరు పాలుత్రాగవలసినవారే గాని బలమైన ఆహారము తినగలవారుకారు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్యవిషయములో అనుభవములేనివాడై యున్నాడు. వయస్సు వచ్చిన వారు అభ్యాసముచేత మేలు కీడులను వివేచించుటకు సాధకముచేయబడిన జ్ఞానేంద్రియములు కలిగియున్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును.” (హెబ్రీయులు 5:​12-14) శ్రద్ధాసక్తులతో బైబిలును చదవడం, మన జ్ఞానేంద్రియాలకు పదును పెట్టుకోవడానికీ, ఆధ్యాత్మిక విషయాలపట్ల మన ఆకలిని పెంచుకోవడానికీ ఎంతో సహాయపడగలదు.

బైబిలును ఎలా చదవాలి

14, 15. (ఎ) బైబిలు రచయిత ఏ ఆధిక్యతను మన ముందుంచుతున్నాడు? (బి) దైవిక బుద్ధి నుండి మనమెలా ప్రయోజనం పొందగలము? (ఉదాహరణలు ఇవ్వండి.)

14 ప్రయోజనకరమైన విధంగా బైబిలును చదవడమన్నది, నిజానికి చదవడంతో కాదు గానీ ప్రార్థనతో ప్రారంభమౌతుంది. ప్రార్థన నిజంగా మనకివ్వబడిన అతి విశేషమైన ఆధిక్యత. అలా చేయడం, మీరు ఏదైనా గంభీరమైన విషయంపై ఒక పుస్తకాన్ని చదవబోతూ దాన్ని అర్థం చేసుకునేందుకు, దాని రచయిత సహాయాన్నే తీసుకుంటున్నట్లుగా ఉంటుంది. అది ఎంత గొప్ప ప్రయోజనాన్ని చేకూర్చగలదో కదా! బైబిలు రచయితయైన యెహోవా మీకు ఆ ఆధిక్యతను ఇస్తున్నాడు. మొదటి శతాబ్దపు పరిపాలక సభకు చెందిన ఒక సభ్యుడు తన సహోదరులకు ఇలా వ్రాశాడు: “మీలో ఎవనికైనను జ్ఞానము [“బుద్ధి,” NW] కొదువగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగ దయచేయువాడు. అయతే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను.” (యాకోబు 1:​5, 6) ప్రార్థనాపూర్వకంగా బైబిలు చదవడంలో కొనసాగమని ఆధునిక-దిన పరిపాలక సభ మనల్ని నిర్విరామంగా ప్రోత్సహిస్తుంది.

15 జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడమే బుద్ధి. కాబట్టి, మీ వ్యక్తిగత జీవితంలో అన్వయించుకోవలసిన విషయాలను, మీరు చదివేటప్పుడు గ్రహించేలా చేయమని మీరు మీ బైబిలును తెరిచే ముందే ప్రార్థనలో యెహోవాను కోరండి. మీరు క్రొత్తగా నేర్చుకుంటున్న వాటిని మీకు ఇదివరకే తెలిసిన విషయాలకు జతచేర్చండి. వాటిని, మీవద్ద ఇప్పటికే ఉన్న “ఆరోగ్యకరమైన పదాల నమూనా”కి జత చేసుకోండి. (2 తిమోతి 1:​13, NW) గత కాలానికి చెందిన యెహోవా సేవకుల జీవితాల్లోని సంఘటనల గురించి ఆలోచించి, అలాంటి పరిస్థితుల్లో మీరైతే ఎలా ప్రవర్తించి ఉండేవారో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.​—⁠ఆదికాండము 39:7-9; దానియేలు 3:3-6, 16-18; అపొస్తలుల కార్యములు 4:18-20.

16. మనం బైబిలు చదవడం మరింత ప్రయోజనకరమైనదిగా, ఉపయోగకరమైనదిగా ఉండేలా చేసుకునేందుకు ఏ ఆచరణాత్మకమైన సలహాలు ఇవ్వబడ్డాయి?

16 ఏదో మొక్కుబడిగా పేజీలు తిప్పేయకండి. చక్కగా సమయం తీసుకుని చదవండి. మీరు చదువుతున్న దాని గురించి బాగా ఆలోచించండి. ఏదైనా తికమకగా ఉన్నప్పుడు స్పష్టంగా అనిపించనప్పుడు, మీ బైబిలులో గనుక క్రాస్‌ రిఫరెన్సులు ఉంటే వాటిని చూడండి. ఇంకా విషయం స్పష్టం కాకపోతే, తర్వాత మరింత పరిశోధన చేయాలని వ్రాసి ఉంచుకోండి. మీరు చదువుతూ ఉన్నప్పుడు మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం ఉంచుకోవాలనుకునే లేఖనాల క్రింద గీత గీసి ఉంచుకోండి, లేదా వాటిని వ్రాసి పెట్టుకోండి. మీరు మార్జిన్‌లలో ఏదైనా వ్యక్తిగత నోట్సుగానీ, క్రాస్‌ రిఫరెన్సులుగానీ వ్రాసుకోవచ్చు. మీరు మీ ప్రకటనా పనిలోగానీ బోధనా పనిలోగానీ ఎప్పుడైనా మీకు అవసరమౌతాయని మీరు భావించే లేఖనాల్లోని కీలకమైన పదాలను గమనించి, మీ బైబిలులో గనుక పదాల పట్టిక ఉంటే దానిలో చూడండి. *

బైబిలు చదవడం ఆహ్లాదకరంగా ఉండేలా చూసుకోండి

17. బైబిలు చదవడం నుండి మనం ఆహ్లాదాన్ని ఎందుకు పొందాలి?

17 ‘యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానిస్తూ’ ఉండే ధన్యుని గురించి కీర్తన గ్రంథకర్త మాట్లాడాడు. (కీర్తన 1:⁠2) మనం ప్రతిదినం బైబిలు చదవడమన్నది ఏదో దినచర్యలా ఉండకూడదు గానీ అది నిజమైన ఆహ్లాదాన్నిచ్చేదై ఉండాలి. దానికి ఒక మార్గం ఏమిటంటే, మనం నేర్చుకుంటున్న వాటి విలువను ఎప్పుడూ మనస్సులో ఉంచుకోవడమే. జ్ఞానియైన సొలొమోను రాజు ఇలా వ్రాశాడు: “జ్ఞానము సంపాదించినవాడు ధన్యుడు. . . . దాని మార్గములు రమ్యమార్గములు దాని త్రోవలన్నియు క్షేమకరములు. దాని నవలంబించువారికి అది జీవవృక్షము దాని పట్టుకొనువారందరు ధన్యులు.” (సామెతలు 3:​13, 17, 18) జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి చేయవలసిన కృషి నిజంగా ప్రతిఫలదాయకమైనదే, ఎందుకంటే దాని త్రోవలు రమ్యములు, క్షేమకరములు, ధన్యములు, చివరికి జీవదాయకములు.

18. బైబిలు చదవడంతోపాటు ఇంకా ఏమి అవసరం, తర్వాతి శీర్షికలో మనం ఏమి పరిశీలిస్తాం?

18 అవును, బైబిలు చదవడం ప్రయోజనకరమైనదీ, ఆనందదాయకమైనదీ. మరి అంతే చాలా? క్రైస్తవమత సామ్రాజ్యానికి చెందిన చర్చి సభ్యులు శతాబ్దాలుగా బైబిలు చదువుతూ, ‘యెల్లప్పుడును నేర్చుకొంటూ ఉన్నా, సత్యవిషయమైన అనుభవజ్ఞానాన్ని ఎప్పటికీ పొందలేకపోతున్నారు.’ (2 తిమోతి 3:⁠6) బైబిలు చదవడం ఫలవంతమైనదిగా ఉండాలంటే, చదవడం ద్వారా తెలుసుకునే విషయాలను మన వ్యక్తిగత జీవితాల్లో అన్వయించుకోవాలనే ఉద్దేశంతోనూ, మన ప్రకటనా బోధనా పనుల్లో దాన్ని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతోనూ చదవాలి. (మత్తయి 24:14; 28:​19, 20) దీనికి, ఎంతో కృషి, చక్కని అధ్యయన పద్ధతులు అవసరం, అవి కూడా ఆనందదాయకమైనవీ ప్రతిఫలదాయకమైనవీ అయ్యుండగలవు. ఈ విషయాన్ని మనం తర్వాతి శీర్షికలో చూద్దాం.

[అధస్సూచీలు]

^ పేరా 9 వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ప్రచురించిన యెహోవా సాక్షులు​—⁠దేవుని రాజ్య ప్రచారకులు (ఆంగ్లం) అనే పుస్తకాన్ని చూడండి.

^ పేరా 16 కావలికోట మే 1, 1995, పేజీలు 16-17, “మీ బైబిలు అధ్యయనాన్ని వృద్ధి చేసుకోవడానికి సలహాలు” చూడండి.

పునఃసమీక్షా ప్రశ్నలు

• ఇశ్రాయేలు రాజులకివ్వబడిన ఏ ఉపదేశం నేడు పైవిచారణకర్తలకు వర్తిస్తుంది, ఎందుకు?

• నేడు ఎవరు ‘పరదేశుల్లా,’ ‘పిల్లల్లా’ ఉన్నారు, వాళ్లు ప్రతిదినం బైబిలు ఎందుకు చదవాలి?

• ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు’ బైబిలును క్రమంగా చదివే విషయంలో ఏ ఆచరణాత్మకమైన మార్గాల్లో మనకు సహాయం చేశాడు?

• మనం బైబిలు చదవడం నుండి నిజమైన ప్రయోజనాన్ని, ఆనందాన్ని ఎలా పొందవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

[9వ పేజీలోని చిత్రం]

ప్రాముఖ్యంగా, పెద్దలు ప్రతిదినం బైబిలు చదవాలి

[10వ పేజీలోని చిత్రం]

సమాజమందిరంలో లేఖనాలు చదవడం యేసుకు వాడుకగా ఉండేది