కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

భూమి కేవలం మానవులను పరీక్షించే స్థలమా?

భూమి కేవలం మానవులను పరీక్షించే స్థలమా?

భూమి కేవలం మానవులను పరీక్షించే స్థలమా?

ఎంతటి ఉపశమనం! ఆమె ఉత్తీర్ణురాలయింది. రెండు వారాలపాటు జరిగిన పరీక్షల కోసం అహర్నిశలు పాట్లుపడ్డ ఆ విద్యార్థిని చివరికి ఒక ఆహ్లాదకరమైన రిపోర్టును అందుకుంది. ఎప్పటినుండో కావాలనుకుంటున్న ఉద్యోగం కోసం ఆమె ఇప్పుడు ఇక ప్రయత్నాలు మొదలుపెట్టవచ్చు.

అనేకమంది భూమిపై జీవితాన్ని కూడా అలాగే దృష్టిస్తారు. అది అందరూ తప్పకుండా ఎదుర్కోవాల్సిన ఒక ప్రవేశ పరీక్ష లాంటిదని, అందులో “పాస్‌” అయినవారు దాని తరువాత ఇక్కడికంటే మంచి స్థితికి వెళతారని వాళ్ళనుకుంటారు. అయితే ఒకటి మాత్రం వాస్తవం, అనేకమంది జీవచ్ఛవాల్లా జీవిస్తున్న ఈ ప్రస్తుత జీవితమే, ఒకవేళ శ్రేష్ఠమైనదనుకుంటే అది నిజంగా విషాదకరమైన విషయం. బైబిలులోని యోబు అనే ఒక వ్యక్తి, తన జీవితంలో అత్యధిక భాగం మంచి ఆరోగ్యం కలిగివుండి, భోగభాగ్యాలతో విలసిల్లినప్పటికినీ ఆయనిలా అంగీకరించాడు: “స్త్రీ కనిన నరుడు కొద్ది దినములవాడై మిక్కిలి బాధనొందును.”​—⁠యోబు 14:⁠1.

అనేకమంది ఆలోచనలకు అద్దం పట్టినట్టుగా, న్యూ క్యాథలిక్‌ ఎన్‌సైక్లోపీడియా ఇలా వ్యక్తం చేస్తోంది: “మానవుడు భవిష్యత్తులో స్వర్గవైభవాలు పొందాలని దేవుని ఉద్దేశం.  . . స్వర్గవైభవాలు అనుభవించడంలోనే మానవుని సంతృప్తి ఉన్నట్లు కనిపిస్తుంది.” ఇటీవల చర్చ్‌ ఆఫ్‌ క్రైస్ట్‌, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో జరిపిన ఒక సర్వేలో, 87శాతం మంది తాము మరణించిన తరువాత స్వర్గానికి వెళతామనే నమ్మకాన్ని వెలిబుచ్చారని ప్రకటించింది.

అనేకమంది క్రైస్తవేతరులు కూడా మరణం తరువాత ఈ భూమిని వదిలి ఒక మంచి చోటుకు వెళ్తామనే నమ్ముతారు. ఉదాహరణకు, ముస్లిములు స్వర్గంలోని పరదైసుకు వెళ్తామని నమ్ముతారు. చైనా, జపానుల్లో ఉన్న బౌద్ధమతానికి చెందిన “స్వచ్ఛమైన స్థలం” అనే తెగలోనివారు, “అమితాభ”​—⁠అనంతమైన కాంతి యొక్క బుద్ధుడు​—⁠పేరును నిరంతరాయంగా జపిస్తే, తాము స్వచ్ఛమైన స్థలంలో, లేక పశ్చిమ పరదైసులో తిరిగి జన్మిస్తామని, అక్కడ అత్యంతానందంగా జీవిస్తామని వారు నమ్ముతారు.

ఆసక్తికరంగా, ప్రపంచంలో అత్యధికంగా అనువదించబడి, పంచిపెట్టబడిన పరిశుద్ధ గ్రంథమైన బైబిలు, భూమి విడిచిపెట్టదగిన స్థలమని చెప్పడం లేదు, లేదా మానవుడు ఉన్నత స్థితికి వెళ్ళే మార్గంలో అదొక మెట్టులాంటిదన్నట్లుగా దాన్ని చిత్రీకరించడంలేదు. బదులుగా, అదిలా చెబుతోంది: “నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు.” (కీర్తన 37:​29) బైబిలులో, ప్రసిద్ధి చెందిన యేసు చెప్పిన ఈ మాటలు కూడా మనకు కనిపిస్తాయి: “సాత్వికులు ధన్యులు; వారు భూలోకమును స్వతంత్రించుకొందురు.”​—⁠మత్తయి 5:⁠5.

మనం భూమిపై నివసించేది తాత్కాలికమన్న తలంపు, స్వర్గంలో వైభవాన్ని అనుభవించడానికి మరణమొక ద్వారంలాంటిదన్న భావాన్ని కలుగజేస్తుంది. అదే నిజమైతే మరణం తప్పకుండా ఒక వరమే. కాని, ప్రజలు మరణాన్ని అలాగే దృష్టిస్తున్నారా లేక ఎక్కువకాలం బ్రతకడానికి వారు ప్రయత్నిస్తున్నారా? ఒక మోస్తరు ఆరోగ్యాన్ని, భద్రతను అనుభవిస్తున్న ప్రజలు చనిపోవాలని అసలేమాత్రమూ కోరుకోరు అని అనుభవం చూపిస్తోంది.

అయినప్పటికీ, భూమిపై జీవితం దుష్టత్వంతో, బాధలతో నిండిన కారణంగా నిజమైన శాంతి, సంతోషం పొందే స్థలం కేవలం స్వర్గమేనని అనేకమంది ఇంకా భావిస్తున్నారు. అయితే స్వర్గం, దుష్టత్వం అసలేమాత్రమూ లేని సంపూర్ణమైన శాంతి సామరస్యాలు ఉన్న స్థలమా? భవిష్యత్తులో అనుభవించగల్గే జీవితం స్వర్గంలో మాత్రమే ఉందా? వీటికి బైబిలు ఇచ్చే జవాబులకు మీరు ఆశ్చర్యపోతుండవచ్చు. దయచేసి ముందుకు చదవండి.