కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“ముగ్ధమైన కొండ మేక”

“ముగ్ధమైన కొండ మేక”

“ముగ్ధమైన కొండ మేక”

ఒక మేకను చూసి ఎంత ముగ్ధమనోహరంగా ఉందో అని మనలో ఎవ్వరమూ ఆశ్చర్యపోము. ఏది పడితే అది తినేసినా మనకు పౌష్ఠికమైన పాలు ఇచ్చే, రుచికరమైన మాంసంగా పనికివచ్చే ఉపయోగకరమైన జంతువుగా దృష్టిస్తాము గానీ, దాన్ని ముగ్ధమైనదిగా మాత్రం దృష్టించము.

అయితే, బైబిలు “అతి ప్రియమైన లేడి, ముగ్ధమైన కొండ మేక” అని ఒక భార్యను వర్ణిస్తోంది. (సామెతలు 5:​18, 19, NW) సామెతల్ని రచించిన వారిలో ఒకడైన సొలొమోను ఇశ్రాయేలులోని జంతు ప్రపంచాన్ని చాలా నిశితంగా గమనించిన వ్యక్తి. కాబట్టి, ఆయనిలాంటి అలంకారాన్ని ఉపయోగించడానికి నిస్సందేహంగా మంచి కారణమే ఉండివుంటుంది. (1 రాజులు 4:​30-33) బహుశా తన తండ్రియైన దావీదులానే ఆయన కూడా మృత సముద్ర తీరప్రాంతం దగ్గరనున్న ఎన్గెదీ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో తిరుగాడే మేకల్ని గమనించివుంటాడు.

అక్కడికి దగ్గర్లోని యూదా ఎడారి ప్రాంతంలో జీవించే కొండ మేకలు చిన్న చిన్న మందలుగా ఎన్గెదీ జలాశయం వద్దకు క్రమంగా వస్తూంటాయి. ఈ బంజరు ప్రాంతంలో కేవలం ఎన్గెదీ వద్ద మాత్రమే ఎల్లప్పుడూ నీళ్ళుంటాయి గనుక, శతాబ్దాలుగా కొండ మేకలకు అది ఆశ్రయంగా ఉంది. వాస్తవానికి ఎన్గెదీ అంటే “మేక పిల్ల ఊట” అని అర్థం. ఈ ప్రాంతంలో మేక పిల్లలు క్రమంగా తిరుగాడుతుండడంతో ఆ పేరు దానికి చక్కగా సరిపోతుంది. “కొండమేకలకు వాసములగు శిలాపర్వతములమీద” శరణార్థిగా జీవించాల్సివచ్చినప్పటికీ, ఇక్కడే రాజైన దావీదు రాజైన సౌలు నుండి తప్పించుకునేందుకు ఆశ్రయం పొందాడు.​—⁠1 సమూయేలు 24:1, 2.

ఆడ ఇబెక్స్‌, అంటే కొండమేకను, మగ మేక వెంట ఠీవిగా అడుగులు వేసుకుంటూ కొండ పగుళ్ళ గుండా నడుస్తూ ఎన్గెదీ జలాశయం వైపుకు వెళ్తుండడాన్ని మీరిప్పటికీ చూడవచ్చు. ఆడ ఇబెక్స్‌ను యథార్థవంతురాలైన భార్యతో పోల్చడాన్ని ఇప్పుడు మీరు అర్థం చేసుకోగలరు. దాని సౌమ్య లక్షణం, సొగసైన ఆకృతి కూడా స్త్రీత్వాన్ని ప్రతిబింబిస్తుంటాయి. “ముగ్ధమైన” అనే పదం స్పష్టంగా దాని ఠీవిని, దాని సొగసును సూచిస్తుంది. *

ఆడ ఇబెక్స్‌ అటు రాటుదేలీ, ఇటు సొగసుతోనూ ఉంటుంది. యెహోవా యోబుకు తెలియజేసినట్లుగా కొండమేక గుట్టలలోనూ పర్వత ప్రాంతాల్లోనూ ఎవరూ ప్రవేశించని స్థలాల్లోనూ ఆహార కొరత ఉన్న ప్రదేశాల్లోనూ ఉష్ణోగ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లోనూ పిల్లలకు జన్మనిస్తుంది. (యోబు 39:⁠1) ఇలాంటి అవాంతరాలున్నప్పటికీ అది తన పిల్లలను శ్రద్ధగా పెంచుతుంది. గుట్టలను తనలానే ఒడుపుగా ఎలా ఎక్కాలో వాటిపై ఎలా గంతులు వేయాలో నేర్పిస్తుంది. ఇంకా ఈ మేక తన పిల్లలను క్రూరజంతువుల నుండి సమర్థవంతంగా కాపాడుతుంది. తల్లిమేక తన పిల్లను తన క్రింద సురక్షితంగా దాచి ఒక అరగంటపాటు ఒక గ్రద్దను తరిమేయడానికి ప్రయత్నించడాన్ని ఒక పరిశీలకుడు గమనించాడు.

క్రైస్తవ భార్యలు తల్లులు, తరచూ హానికరమైన పరిస్థితుల్లో తమ పిల్లలను విజయవంతంగా పెంచవలసివస్తుంది. ఈ కొండమేకలానే దేవుడు తమకిచ్చిన బాధ్యత పట్ల నిస్వార్థాన్ని, అంకితభావాన్ని చూపిస్తారు. తమ పిల్లలను ఆధ్యాత్మిక అపాయాల నుండి కాపాడేందుకు ధైర్యంగా పోరాడతారు. దీన్నిబట్టి చూస్తే, తాను అలా పోల్చడం ద్వారా సొలొమోను స్త్రీలను కించపర్చడంలేదు గానీ, నిజానికి ఒక స్త్రీలోని సొగసును, అందాన్ని వర్ణిస్తున్నాడనీ అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో సహితం వ్యక్తమయ్యే ఆధ్యాత్మిక లక్షణాలను గురించి చెబుతున్నాడనీ అర్థమౌతుంది.

[అధస్సూచి]

^ పేరా 5 ద న్యూ బ్రౌన్‌-డ్రైవర్‌-బ్రిగ్స్‌-జెసీనియస్‌ హీబ్రూ అండ్‌ ఇంగ్లీష్‌ లెక్సికన్‌ ప్రకారం “ముగ్ధమైన” అని అనువదించబడిన చెన్‌ అనే హెబ్రీ పదానికి ఈ సందర్భంలో ‘ఠీవియైన లేదా సొగసైన ఆకృతి లేదా రూపం’ అనే అర్థం ఉంది.

[30వ పేజీలోని చిత్రాలు]

ఒక క్రైస్తవ తల్లి లేదా క్రైస్తవ భార్య, దేవుడిచ్చిన బాధ్యతలను నెరవేర్చేటప్పుడు చక్కని ఆధ్యాత్మిక లక్షణాలను ప్రదర్శిస్తుంది