కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు ఇతర మతాలను పరిశోధించాలా?

మీరు ఇతర మతాలను పరిశోధించాలా?

మీరు ఇతర మతాలను పరిశోధించాలా?

“దాదాపు ఒక సంవత్సరం నుండి నేను క్రైస్తవ కూటాలకు హాజరవుతున్నాను, ఇతరులకు దేవుని రాజ్యాన్ని గూర్చి తెలియజేయడంలో ఆనందిస్తున్నాను” అని ఇప్పుడు యెహోవాసాక్షియైన దక్షిణ అమెరికాలో ఉన్న మిగూయేల్‌ చెప్తూ, ఇంకా ఇలా అంటోంది: “ఆ తర్వాత నేను మత కార్యక్రమాలను రేడియోలో వింటూ టీవీలో మత ప్రచారకులను చూడడం మొదలుపెట్టాను. అలాంటి కార్యక్రమాలు ఇతర మతాల్లోని ప్రజలను బాగా అర్థం చేసుకోవడానికి సహాయపడతాయని నేను అనుకున్నాను. వారి బోధలు బైబిలుకు అనుగుణ్యంగా లేవని నేను గ్రహించాను, కానీ నేను చాలా జిజ్ఞాసతో ఉన్నాను.”

అదే దేశంలో సత్యారాధన గూర్చి ఇతరులకు బోధించడంలో హోర్హే చాలా ఉత్సాహంగా ఉన్నాడు. అయినప్పటికీ ఒకానొక సమయంలో ఆయన కూడా రేడియో, టీవీలలోని మతపరమైన కార్యక్రమాలను వినడం ప్రారంభించాడు. “ఇతరులు ఏమి ఆలోచిస్తున్నారో అన్నది తెలుసుకోవలసిన అవసరం ఉందని” ఆయన చెప్పేవాడు. అలాంటి అబద్ధ బోధలను వింటూ ఉంటే రాగల ప్రమాదాల గురించి అడిగితే “బైబిలు సత్యాలను పూర్తిగా నేర్చుకున్న ఒకరి విశ్వాసాన్ని ఏదీ హరించలేదని” ఆయన చెప్పేవాడు. ఈ అనుభవాలు, ఇతరులు ఏమి నమ్ముతున్నారు అన్నది వినడం జ్ఞానయుక్తమైన పనేనా? అనే ఒక ప్రాముఖ్యమైన ప్రశ్నను లేవదీస్తున్నాయి.

నిజ క్రైస్తవత్వాన్ని గుర్తించడం

అపొస్తలులు చనిపోయిన తర్వాత అనేక రకాల నామకార్థ క్రైస్తవత్వం అధికమవ్వడం వల్ల సత్యారాధన కలుషితమైపోయింది. దీని గురించి ముందుగానే తెలిసి, నామకార్థ క్రైస్తవులలోనుండి నిజక్రైస్తవులను గుర్తించేందుకు యేసు ఒక మార్గాన్ని వెల్లడించాడు. మొదటిగా, “అబద్ధ ప్రవక్తలనుగూర్చి జాగ్రత్తపడుడి. వారు గొఱ్ఱెల చర్మములు వేసికొని మీయొద్దకు వత్తురు కాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు” అని చెప్తూ ఇంకా ఇలా జత చేశాడు: “వారి ఫలములవలన మీరు వారిని తెలిసికొందురు.” (మత్తయి 7:​15-23) యేసు ఏమి బోధించాడో దాన్ని ఆయన నిజమైన అనుచరులు ఆచరిస్తారు, వారి మంచి ఫలాల వలన వారిని చాలా సులభంగా గుర్తుపట్టవచ్చు. యేసు చేసినట్లుగానే లేఖనాల నుండి దేవుని రాజ్యాన్ని గురించి బోధించేందుకు వాళ్ళు ప్రజలను సందర్శిస్తారు. యేసు మాదిరిని అనుసరిస్తూ ప్రపంచ రాజకీయాల నుండి సామాజిక వివాదాల నుండి వారు దూరంగా ఉంటారు. వాళ్ళు దేవుని వాక్యాన్ని సత్యమని అంగీకరించి దాన్ని గౌరవిస్తారు. వారు దేవుని నామాన్ని ఇతరులకు తెలియపరుస్తారు. దేవుడు బోధించే ప్రేమను వాళ్ళు ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నిస్తుంటారు గనుక వాళ్ళు యుద్ధాల్లో పాల్గొనరు. బదులుగా వారు ఒకరినొకరు సహోదరుల్లా భావిస్తారు.​—⁠లూకా 4:43; 10:1-9; యోహాను 13:34, 35; 17:16, 17, 26.

లేఖనాల ప్రకారం చూస్తే, “నీతిగలవారెవరో దుర్మార్గులెవరో దేవుని సేవించువారెవరో ఆయనను సేవించనివారెవరో మీరు . . . కనుగొ”నడం సాధ్యమే. (మలాకీ 3:​18) మొదటి శతాబ్దపు క్రైస్తవుల్లానే నేడు కూడా నిజ క్రైస్తవులు ఆలోచనల్లోనూ క్రియల్లోనూ ఐక్యంగా ఉన్నారు. (ఎఫెసీయులు 4:​4-6) అలాంటి యథార్థవంతులైన క్రైస్తవుల్ని మీరు ఒకసారి కనుగొన్న తర్వాత ఇతరుల నమ్మకాలను తెలుసుకోవాలనే కోరిక లేదా జిజ్ఞాస మీకు ఎందుకు?

అబద్ధ బోధకుల విషయమై జాగ్రత్త

బైబిలు సత్యాలను నేర్చుకున్న తర్వాత కూడా అబద్ధ బోధల ఆధ్యాత్మిక కాలుష్యం అనే అపాయం ఉండగలదని బైబిలు గుర్తిస్తుంది. “[క్రీస్తును] అనుసరింపక మనష్యుల పారంపర్యాచారమును, అనగా ఈ లోకసంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వ జ్ఞానముచేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైన ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి” అని అపొస్తలుడైన పౌలు హెచ్చరించాడు. (కొలొస్సయులు 2:⁠8) ఈ మాటలు ఎంత సుస్పష్టమైన దృశ్యాన్ని మన కళ్ళ ముందుంచుతున్నాయి! క్రూర మృగాలు చెరపట్టుకొని పోవాలనుకునేట్లుగా, అబద్ధ బోధకులు మీకు నిజమైన ప్రమాదాన్ని తీసుకురాగలరు.

నిజమే, పౌలు ఇతరులు ఏమి నమ్ముతున్నారన్నదాన్ని గమనించాడు. ఒకసారి ఆయన తన ప్రసంగాన్ని ఇలా ప్రారంభించాడు: “ఏథెన్సువారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతాభక్తిగలవారై యున్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద​—⁠తెలియబడని దేవునికి అని వ్రాయబడియున్నది.” (అపొస్తలుల కార్యములు 17:​22, 23) అయినప్పటికీ పౌలు గ్రీకు ఉపన్యాసకుల తత్వజ్ఞానాన్ని క్రమంగా తన మనసులోకి తీసుకోలేదు.

అబద్ధ బోధల మూలాలు నమ్మకాలు మీకు తెలియడం ఒక విషయమైతే వాటిని మీ మనస్సులోకి తీసుకోవడం వేరే విషయం. * తన వాక్యం ఆధారంగా మనకు బోధించేందుకు యెహోవా “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసు[ని]” ఏర్పాటు చేశాడు. (మత్తయి 4:4; 24:​45) “మీరు ప్రభువు [“యెహోవా,” NW] పాత్ర లోనిది దయ్యముల పాత్రలోనిది కూడ త్రాగనేరరు; . . . ప్రభువునకు రోషము పుట్టించెదమా?”​—⁠1 కొరింథీయులు 10:20-22.

అబద్ధ బోధకుల్లోని కొంతమంది ఒకప్పుడు నిజ క్రైస్తవులే కావచ్చు, కానీ ఏదో ఒక సమయంలో సత్యాన్నుండి అసత్యానికి మళ్ళారు. (యూదా 4, 11) ఇది మనలను ఆశ్చర్యపర్చకూడదు. అభిషిక్త క్రైస్తవ సంఘానికి ప్రాతినిధ్యం వహించే “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసు[ని]” గూర్చి మాట్లాడిన తర్వాత, ఫిర్యాదులు చేసే తరగతికి ప్రాతినిధ్యం వహించే “దుష్టుడైన యొక దాసు[ని]” గురించి యేసు మాట్లాడాడు. ఆ దాసుడు, “యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని” తన తోడి దాసులను కొట్టడం మొదలుపెట్టాడు. (మత్తయి 24:​48, 49) సాధారణంగా ఈ వ్యక్తులకు గానీ వారి అనుచరులకు గానీ తమకంటూ స్పష్టమైన బోధలు ఉండవు; ఇతరుల విశ్వాసాన్ని నాశనం చేయడంపైనే వీరి ఆసక్తి. వారిని గురించి అపొస్తలుడైన యోహాను ఇలా వ్రాశాడు: “ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చినయెడల వానిని మీ యింట చేర్చుకొనవద్దు; శుభమని వానితో చెప్పను వద్దు.”​—⁠2 యోహాను 10; 2 కొరింథీయులు 11:3, 4, 13-15.

సత్యం కోసం వెతికే యథార్థవంతులైన ప్రజలు ఇతర మతాల నుంచి తాము ఏమి వింటున్నామనే విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించడం మంచిది. చివరికి సత్యాన్ని ఎవరైతే వెదుకుతున్నారో అలాంటి వినయంగల ప్రజలను దేవుడు ఆశీర్వదిస్తాడు. దైవిక జ్ఞానాన్ని గూర్చి బైబిలు ఇలా చెప్తుంది: “వెండిని వెదకినట్లు దాని వెదకిన యెడల దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకినయెడల . . . దేవునిగూర్చిన విజ్ఞానము నీకు లభించును.” (సామెతలు 2:​4, 5) బైబిలు ద్వారా, క్రైస్తవ సంఘం ద్వారా దేవుని ఈ విజ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత, దాన్ని అనుసరించి నడుచుకునే వారిని ఆయన ఎలా ఆశీర్వదిస్తున్నాడో తెలుసుకున్న తర్వాత నిజ క్రైస్తవులు అబద్ధ మత బోధలను గూర్చి వినడాన్ని ఇక కొనసాగించరు​—⁠2 తిమోతి 3:⁠14, 15.

[అధస్సూచి]

^ పేరా 10 మ్యాన్‌కైండ్స్‌ సెర్చ్‌ ఫర్‌ గాడ్‌ అనే పుస్తకం ప్రపంచంలోని అనేక మతాల బోధలను గూర్చిన నేపథ్యాలను గూర్చిన ప్రాథమిక సమాచారాన్ని అందిస్తుంది. ఇది వాచ్‌ టవర్‌ బైబిలు అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ వారిచే ప్రచురించబడినది.