కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు దేవునికి దగ్గరగా ఎలా కాగలరు

మీరు దేవునికి దగ్గరగా ఎలా కాగలరు

మీరు దేవునికి దగ్గరగా ఎలా కాగలరు

“దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును,” అని యాకోబు 4:8 చెబుతుంది. యెహోవా దేవుడు, మానవులు తనతో మంచి అనుబంధం కలిగి ఉండాలని తాను ఎంతగా కోరుకుంటున్నాడన్నది, తన కుమారుడిని మన శ్రేయస్సు కోసం ఇవ్వడం ద్వారా చూపించాడు.

తానే చొరవతో తీసుకున్న ఆ ప్రేమపూర్వకమైన చర్యకు ప్రతిస్పందనగా అపొస్తలుడైన యోహాను ఇలా వ్రాశాడు: “ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము [దేవుణ్ణి] ప్రేమించుచున్నాము.” (1 యోహాను 4:​19) కానీ మనం వ్యక్తిగతంగా దేవునికి దగ్గర కావాలనుకుంటే, అందుకు తగిన చర్యలు తప్పకుండా తీసుకోవాల్సివుంది. ఆ చర్యలు, మన తోటి మానవులకు దగ్గర కావడానికి ముందటి భాగంలో పేర్కొన్న నాలుగు మార్గాల్లాంటివే. వీటిని మనమిప్పుడు పరిశీలిద్దాం.

దేవుని అద్భుతమైన లక్షణాలను గమనించండి

దేవునికి ఎన్నో అద్భుతమైన లక్షణాలున్నాయి, వాటిలో కొన్ని అత్యంత విశిష్టమైనవి. అవి ఆయన ప్రేమ, బుద్ధి, న్యాయం, శక్తి. అటు ఎంతో దూరాలకు వ్యాపించివున్న విశ్వమూ ఇటు మన దగ్గర్లోనే చుట్టూ ఉన్న ప్రపంచమూ, అటు గొప్ప పరిమాణంలోని నక్షత్రవీధులూ ఇటు అతిసూక్షమైన పరమాణువులూ దేవుని బుద్ధినీ శక్తినీ ఎంతగానో ప్రస్ఫుటం చేస్తున్నాయి. అందుకే కీర్తనల రచయిత ఇలా వ్రాశాడు: “ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది.”​—⁠కీర్తన 19:1; రోమీయులు 1:​20.

సృష్టి దేవుని ప్రేమను కూడా ప్రతిబింబిస్తుంది. ఉదాహరణకు, మనల్ని తయారుచేసిన తీరును పరిశీలిస్తే, మనం జీవితాన్ని ఆనందంగా అనుభవించాలని దేవుడు కోరుకుంటున్నాడన్నది విశదమవుతుంది. ఆయన మనకు రంగు, రుచి, వాసనలను చూడడానికి, సంగీతంలోని మాధుర్యాన్ని అనుభవించడానికి, ఆహ్లాదంగా నవ్వడానికి, అందాన్ని ఆస్వాదించడానికి, సామర్థ్యాలనిచ్చాడు. మన జీవితానికి అత్యావశ్యం కాని మరెన్నో శక్తి సామర్థ్యాలను, ప్రత్యేకమైన లక్షణాలను కూడా అనుగ్రహించాడు. అవును, దేవుడు నిజంగా ఉదారత, దయ, ప్రేమగలవాడు​—⁠ఆయన “సంతోషం గల దేవుడు” అనడానికి ఈ లక్షణాలు నిస్సందేహంగా మద్దతునిస్తున్నాయి.​—⁠1 తిమోతి 1:⁠11 NW; అపొస్తలుల కార్యములు 20:​35.

యెహోవా విశ్వాధిపత్యం, దానికి తన తెలివైన ప్రాణులిచ్చే మద్దతు, ప్రధానంగా ప్రేమపైనే ఆధారపడివున్నాయన్న వాస్తవానికి ఆయన గర్వంతో ఎంతో ఉప్పొంగిపోతాడు. (1 యోహాను 4:⁠8) యెహోవా విశ్వాధిపతి అన్నది నిజమే అయినప్పటికీ, ఆయన మనుష్యులతో, ప్రత్యేకించి తన యథార్థ సేవకులతో, ఒక ప్రేమగల తండ్రి తన పిల్లలతో వ్యవహరించినట్టుగా వ్యవహరిస్తాడు. (మత్తయి 5:⁠45) వారికి మంచిని చేకూర్చే దేనినైనా ఇవ్వడానికి ఆయన ఎన్నడూ వెనకాడడు. (రోమీయులు 8:​38, 39) మొదట పేర్కొన్నట్టుగా, ఆయన మన పక్షాన చివరికి తన ఏకైక కుమారుని జీవాన్ని కూడా ఇచ్చాడు. అవును, మనం ఉనికిలో ఉండడానికి, మనకు భవిష్యత్తులో నిత్యజీవం లభిస్తుందనే అపేక్ష ఉండడానికి కారణం, ఆయనకున్న ప్రేమే.​—⁠యోహాను 3:⁠16.

యేసు తన తండ్రిని ఖచ్చితంగా అనుకరించడం వల్ల, ఆయన మనకు దేవుని వ్యక్తిత్వం గురించిన లోతైన అంతర్దృష్టిని ఇచ్చాడు. (యోహాను 14:​9-11) ఆయన పూర్తిగా నిస్వార్థపరుడు, ఇతరుల కష్టసుఖాలపట్ల శ్రద్ధగలవాడు, ఆలోచనాపరుడు. ఒక సందర్భంలో, చెవుడు, నత్తిగల ఒక వ్యక్తిని యేసు ముందుకు తీసుకువచ్చారు. ఆ వ్యక్తికి జన సమూహంలో ఎంత అసౌకర్యమనిపిస్తుందో మీరు ఊహించవచ్చు. ఆసక్తికరంగా, యేసు ఆయనను ఏకాంతానికి తీసుకువెళ్ళి అక్కడ నయం చేశాడు. (మార్కు 7:​32-35) మీ భావాలను అర్థం చేసుకుని మీతో సున్నితంగా వ్యవహరించే వారిని, మిమ్మల్ని గౌరవించే వారిని మీరు మెచ్చుకుంటారా? అయితే మీరు యెహోవా, యేసుల గురించి మరింత ఎక్కువ నేర్చుకుంటుండగానే, వారికి నిశ్చితంగా దగ్గరవుతారు.

దేవుని లక్షణాలను గురించి ఆలోచించండి

ఒక వ్యక్తి అభినందించదగిన లక్షణాలను కలిగివుండవచ్చు, కానీ ఆయనకు దగ్గర కావడానికి మనం ఆయనను గురించి ఆలోచించాల్సిన అవసరముంటుంది. యెహోవా విషయంలోనూ అదే వర్తిస్తుంది. ఆయన లక్షణాలను గురించి ధ్యానించడం, ఆయనకు దగ్గర కావడానికి చేసే ప్రధానమైన చర్యల్లో రెండవది. యెహోవాను నిజంగా ప్రేమించిన ఒక వ్యక్తి రాజైన దావీదు. “అతడు [యెహోవాకు] యిష్టానుసారుడైన మనుష్యుడు.” దావీదు ఇలా అన్నాడు: “పూర్వదినములు జ్ఞాపకము చేసికొనుచున్నాను నీ క్రియలన్నియు ధ్యానించుచున్నాను, నేను నీ చేతుల పని యోచించుచున్నాను.”​—⁠అపొస్తలుల కార్యములు 13:22; కీర్తన 143:⁠5.

మీరు సృష్టిలోని అద్భుతాలను గమనించినప్పుడు లేక దేవుని వాక్యమైన బైబిలు చదువుతున్నప్పుడు, దావీదు లాగే మీరూ చూసిన మరియు చదివిన వాటి గురించి ధ్యానిస్తున్నారా? ఊహించండి, ఒక కుమారుడు తను చాలా గాఢంగా ప్రేమించే తన తండ్రి నుండి ఇప్పుడే ఒక ఉత్తరాన్ని అందుకున్నాడు. ఆ ఉత్తరాన్ని ఆయనెలా దృష్టిస్తాడు? ఆయన కేవలం దానిలోని విషయాలను గబగబా చదివేసి ఒక సొరుగులోకి విసిరివేయడన్నదానిలో ఎలాంటి సందేహమూ లేదు. బహుశా, దానిలోని ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి శ్రద్ధగా చదవాలనుకుంటాడు. “నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను” అని పాడిన కీర్తనల రచయితకు ఉన్నట్టే దేవుని వాక్యం మనకూ ఎంతో అమూల్యమైనదిగా ఉండాలి.​—⁠కీర్తన 119:​97.

మంచి సంభాషణను కొనసాగించండి

మంచి సంభాషణ అనేది ఎటువంటి అనుబంధానికైనా ప్రాణం లాంటిది. దీంట్లో మాట్లాడడం, అలాగే వినడమూ ఇమిడి ఉన్నాయి​—⁠కేవలం తెలివితేటలతో కాదుకానీ హృదయంతో. మనం సృష్టికర్తతో ప్రార్థన ద్వారా మాట్లాడతాం, అది భక్తి, గౌరవాలతో మనం దేవుడితో చేసే సంభాషణ. యెహోవాను ప్రేమిస్తూ ఆయన సేవ చేస్తూ, యేసుక్రీస్తును ఆయన ప్రధాన ప్రతినిధిగా అంగీకరించే వారి ప్రార్థనలు ఆయనకు ఆనందాన్నిస్తాయి.​—⁠కీర్తన 65:2; యోహాను 14:6, 14.

గతంలో, దేవుడు మనుష్యులతో దర్శనాల ద్వారా, దేవదూతల ద్వారా, కలల ద్వారా విభిన్నమైన మార్గాల్లో మాట్లాడాడు. ఈ రోజుల్లో, వ్రాయబడిన తన వాక్యమైన, పరిశుద్ధ బైబిలు ద్వారా మాట్లాడుతున్నాడు. (2 తిమోతి 3:​16,17) వ్రాయబడిన వాక్యం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఏ సమయంలోనైనా దీన్ని సంప్రదించవచ్చు. ఒక ఉత్తరం లాగా, దీన్ని పదే పదే చదివి ఆనందించవచ్చు. నోటి ద్వారా ఒక తరం నుండి మరో తరానికి చేరవేయబడే సందేశాల్లో తరచు వక్రీకరణలు ఏర్పడతాయి. కానీ బైబిలు విషయంలో అలాంటి వాటికి తావులేదు. బైబిలును మీ ప్రియమైన పరలోకపు తండ్రి నుండి వచ్చిన ఉత్తరాల ఒక పెద్ద సంచయంగా భావించండి, ఈ ఉత్తరాల ద్వారా ఆయన మీతో ప్రతిరోజూ మాట్లాడడానికి అనుమతించండి.​—⁠మత్తయి 4:⁠4.

ఉదాహరణకు, తప్పొప్పుల పట్ల యెహోవా ఉద్దేశాన్ని బైబిలు తెలుపుతుంది. అది మానవుల విషయంలో, భూమి విషయంలో ఆయనకు గల సంకల్పాన్ని వివరిస్తుంది. విస్తృత పరిధిలోని ప్రజలతో, దేశాలతో​—⁠యథార్థవంతులైన ఆరాధకులనుండి కటువైన శత్రువుల వరకు అందరితో​—⁠ఆయన ప్రవర్తించిన తీరును బయల్పరుస్తుంది. తాను మానవులతో వ్యవరించిన రీతిని నమోదు చేయించడం ద్వారా, యెహోవా తన వ్యక్తిత్వాన్ని గురించి అసాధారణమైన రీతిలో చిత్రీకరించబడేలా చేశాడు. ఆయన తన ప్రేమను, సంతోషాన్ని, దుఃఖాన్ని, ఆశాభంగాన్ని, కోపాన్ని, సానుభూతిని, ఆతురతను​—⁠అవును, విస్తృతమైన తన ఆలోచనలను, అనుభూతులను వాటి వెనుక ఉన్న కారణాలను​—⁠మానవులు వెంటనే అర్థం చేసుకునేలా వెల్లడి చేస్తాడు.​—⁠కీర్తన 78:​3-7.

బైబిలులోని కొంత భాగం చదివిన తరువాత, ఆ చదివిన దాన్నుండి మీరెలా ప్రయోజనాన్ని పొందగలరు? మరి ముఖ్యంగా, మీరు దేవునికి ఎలా దగ్గరవ్వగలరు? మొదట, దేవుని గురించి మీరు ఏమి చదివారో, ఏమి నేర్చుకున్నారో దాని గురించి ఆలోచించండి, ముఖ్యాంశాలను మీ హృదయానికి చేరనీయండి. తర్వాత, మీరు చదివిన దాంట్లో ఏ విషయం మిమ్నల్ని ఆలోచింపజేసిందో, దాన్నుండి ప్రయోజనం పొందడానికి మీరు ఎలా ప్రయత్నిస్తారో మీ ఆలోచనలను, మీ అంతరంగ భావాలను యెహోవాకు ప్రార్థనలో తెలియజేయండి. అదీ, సంభాషణంటే. ఒకవేళ వేరే విషయాలు గనుక మీ మనసులో ఉంటే, వాటిని కూడా ప్రార్థనలో తప్పకుండా చేర్చవచ్చు.

దేవునితో కలిసి పని చేయండి

సత్యదేవుని యెదుట లేక సత్యదేవునితో నడిచిన విశ్వాసపాత్రులైన కొందరు ప్రాచీనుల గురించి బైబిలు చెబుతుంది. (ఆదికాండము 6:9; 1 రాజులు 8:25) దానర్థమేమిటి? ప్రాముఖ్యంగా చెప్పాలంటే, దేవుడు సరిగ్గా తమతో పాటు ఉన్నట్టే వాళ్లు ప్రతిరోజు గడిపారని దానర్థం. నిజమే, వారు పాపభరితులే, అయినప్పటికినీ, దేవుని నియమాలను, సూత్రాలను ప్రేమించారు, దేవుని సంకల్పానికి అనుగుణంగా వారు జీవించారు. యెహోవా అటువంటి వారికి దగ్గర అవుతాడు, అటువంటి వారిపట్ల ఆయన శ్రద్ధ కలిగి ఉంటాడని చెప్పే కీర్తన 32:8 లో మనమిలా చదువుతాం: “నీకు ఉపదేశము చేసెదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను నీమీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను.”

మీరు కూడా యెహోవాను​—⁠మీతో కలిసి నడిచే, మీపై శ్రద్ధ చూపించే, ప్రేమగల తండ్రిగా సలహాలిచ్చే ఒక సన్నిహిత స్నేహితుడిగా చేసుకోవచ్చు. ఈ విషయమై యెహోవా ఏమంటున్నాడో, ప్రవక్తయైన యెషయా ఇలా వర్ణించాడు: “నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును.” (యెషయా 48:17) మనమీ ప్రయోజనాలను పొందుతుండగా, దావీదులాగే యెహోవా మన “కుడి పార్శ్వమందు ఉన్నాడు” అని మనమూ గ్రహిస్తాం.​—⁠కీర్తన 16:⁠8.

దేవుని లక్షణాలకు కేంద్రం​—⁠ఆయన పేరు

అనేక మతాలు, అంతకంతకు అధికమౌతున్న అనేక బైబిలు అనువాదాలు దేవుని వ్యక్తిగత పేరును ఉపయోగించడంలోనూ, తెలియజేయడంలోనూ విఫలమయ్యాయి. (కీర్తన 83:​18) అయినా, హెబ్రీ భాషలోని మూలపాఠంలో, ఆ పేరు​—⁠యెహోవా​—⁠దాదాపు 7,000 సార్లు కనిపిస్తుంది! (అనేకమంది అనువాదకులు మూలపాఠంలో ఉన్న ఆ దివ్యనామాన్ని తమ అనువాదాల్లో నుండి తీసివేస్తారు గానీ, బయలు, బేలు, మెరోదకు, చివరికి సాతాను అనే అబద్ధ దేవుళ్ళ పేర్లను మాత్రం తీయరు!)

కొంతమంది దేవుని పేరును వదిలిపెట్టడాన్ని చాలా అల్పమైన విషయంగా భావిస్తారు. కాని ఆలోచించండి: పేరు తెలియని ఒక వ్యక్తితో మంచి అనుబంధాన్ని పెంచుకోవడం సులభమా లేక కష్టమా? దేవుడు, ప్రభువు అనే బిరుదులు (ఇవి అబద్ధ దేవుళ్ళకు కూడా ఉపయోగించబడ్డాయి) యెహోవా శక్తికి, అధికారానికి, లేక స్థానానికి మన అవధానాన్ని ఆకర్షించవచ్చు, కానీ ఆయన వ్యక్తిగత పేరు మాత్రమే ఎటువంటి సందిగ్ధం లేకుండా ఆయనను గుర్తించేలా చేస్తుంది. (నిర్గమకాండము 3:15; 1 కొరింథీయులు 8:⁠5, 6) సత్య దేవుని వ్యక్తిగత పేరులోనే ఆయన లక్షణాలు, విశేష గుణాలు ఇమిడి ఉన్నాయి. అందుకే, వాల్టర్‌ లోరీ అనే ఒక బిషప్పు సరిగానే ఇలా వ్యక్తంచేశాడు: “దేవుణ్ణి పేరుతో ఎరుగని ఒక వ్యక్తికి దేవుడు ఒక వ్యక్తిగా నిజంగా తెలియదు.”

ఆస్ట్రేలియాలో, క్యాథలిక్‌గా చిత్తశుద్ధితో జీవిస్తున్న మారియా ఉదాహరణను గమనించండి. యెహోవాసాక్షులు మొదటిసారి ఆమెను కలుసుకున్నప్పుడు, బైబిలులో దేవుని పేరును ఆమెకు చూపించారు. ఆమె ఎలా ప్రతిస్పందించింది? “బైబిలులో దేవుని పేరును మొదటిసారి చూసినప్పుడు, నేను ఏడ్చాను. నిజానికి దేవుని వ్యక్తిగత పేరును తెలుసుకోగల్గాను, దాన్ని ఇప్పుడే ఉపయోగించగల్గాను అని గ్రహించి నేను ఎంతో కదిలిపోయాను.” మారియా బైబిలు పఠనాన్ని కొనసాగించింది. ఆమె జీవితంలో మొదటిసారిగా, యెహోవా ఒక వ్యక్తి అని తెలుసుకోగల్గింది, ఆయనతో శాశ్వతమైన అనుబంధాన్ని పెంచుకోగలిగింది.

అవును, ఆయనను మన భౌతికమైన కళ్ళతో చూడలేకపోయినా, మనం “దేవుని యొద్దకు” వెళ్ళగలం. మనం ఆయన అందమైన వ్యక్తిత్వాన్ని సునిశితంగా మన మనస్సులతో, హృదయాలతో “చూడగలం”, అలా ఆయన పట్ల మన ప్రేమ పెరుగుతుంది. అటువంటి ప్రేమే “పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమ.”​—⁠కొలొస్సయులు 3:​14.

[6వ పేజీలోని బాక్సు/చిత్రం]

యెహోవాపై మీకున్న ప్రేమకు ఆయన ప్రతిస్పందిస్తాడు

అనుబంధాలనేవి వాహనాలు రెండువైపులనుండి వస్తూ పోతూ ఉండే మార్గాల లాంటివి. మనం దేవునికి దగ్గరవుతుండగా, దానికి ప్రతిస్పందనగా ఆయన మనకు దగ్గరవుతాడు. బైబిలులో ప్రత్యేకంగా ప్రస్తావించబడిన ఇద్దరు వృద్ధులైన సుమెయోను, అన్నల గురించి యెహోవా ఎలా భావించాడో గమనించండి. లూకా సువార్త రచయిత మనకు, సుమెయోను “నీతిమంతుడును భక్తిపరుడునైయుండి” మెస్సీయ కోసం ఎదురు చూస్తున్నాడని చెబుతున్నాడు. యెహోవా సుమెయోనులో ఈ మంచి లక్షణాలను గమనించి, ప్రియమైన ఈ వృద్ధుడు, “క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని” బయలుపరచి సుమెయోనుపై తనకున్న ప్రేమను వ్యక్తపరిచాడు. శిశువైన యేసును ఆయన తలిదండ్రులు యెరూషలేములోని దేవాలయానికి తీసికొని వచ్చినప్పుడు, సుమెయోను యేసును కలిసేలా చేయడం ద్వారా యెహోవా తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు. పరవశించిపోయిన సుమెయోను, ప్రగాఢమైన ప్రశంసతో ఆ శిశువును చేతులలోకి తీసుకొని ఇలా ప్రార్థించాడు: “నాథా, యిప్పుడు నీ మాటచొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు; అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజలయెదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులార చూచితిని.”​—⁠లూకా 2:​25-​35.

“ఆ గడియలోనే,” 84 ఏండ్ల వృద్ధురాలైన అన్న కూడా యేసును కలిసేలా చేయడం ద్వారా యెహోవా ఆమెపై తనకున్న ప్రేమను ప్రదర్శించాడు. అసామాన్యమైన ఈ విధవరాలు, ఎప్పుడూ దేవాలయం విడువక యెహోవాకు “సేవచేయుచుండెను” అని మనకు బైబిలు చెబుతుంది. ఆమె, సుమెయోనులాగే ప్రసంశతో ఉప్పొంగిపోతూ, యెహోవా అసాధారణమైన దయకు స్తుతులు చెల్లిస్తూ, “యెరూషలేములో విమోచనకొరకు కనిపెట్టుచున్న వారందరితో” శిశువైన యేసును గూర్చి మాట్లాడింది.​—⁠లూకా 2:​36-​38.

అవును, సుమెయోను, అన్నల హృదయాల్లో తనపై ఉన్న ప్రేమను, భయాన్ని తన సంకల్పం నెరవేర్పులో వారు కలిగివున్న గొప్ప ఆసక్తిని కూడా యెహోవా ఎంత చక్కగా గమనించాడు! ఇటువంటి బైబిలు వృత్తాంతాలు మిమ్మల్ని యెహోవాకు దగ్గర చేయవా?

యేసు కూడా, ఆయన తండ్రిలాగే నిజమైన అంతరంగ వ్యక్తిని గ్రహించాడు. ఒకరోజు ఆయన దేవాలయంలో బోధిస్తూ, ఒక “బీద విధవరాలు” కానుకగా “రెండు కాసులు” కానుక పెట్టెలో వేస్తుండడాన్ని ఆయన గమనించాడు. దానిని గమనించే ఇతరులకు ఆమె కానుక ఏ మాత్రం విలువ లేనిదైనప్పటికీ, యేసుకు మాత్రం విలువైనదే. ఎందుకంటే, ఆమె తన దగ్గర ఉన్నదంతా వేసింది, అందుకే ఆయన ఆ స్త్రీని మెచ్చుకున్నాడు. (లూకా 21:​1-4) మనం కూడా ఒకవేళ పెద్ద కానుకైనా, చిన్న కానుకైనా మనకున్న దాంట్లో మంచిదాన్ని యెహోవా, యేసుక్రీస్తులకిస్తే, వారు మనలను మెచ్చుకుంటారని నమ్మకం కలిగి ఉండవచ్చు.

తనను ప్రేమించే వారినిబట్టి దేవుడు ఆనందిస్తాడు, అలాగే మానవులు తనను వదిలిపెట్టి చెడుమార్గాల్లోకి వెళ్ళినప్పుడు ఆయన బాధపడతాడు. నోవహు రోజుల్లోని జలప్రళయానికి ముందు, మానవుల చెడుతనం వల్ల యెహోవా “తన హృదయములో నొచ్చుకొనెను” అని ఆదికాండము 6:6 చెబుతుంది. తరువాత, అవిధేయులైన ఇశ్రాయేలీయులు మాటిమాటికి “దేవుని శోధించిరి, మాటిమాటికి ఇశ్రాయేలు పరిశుద్ధదేవునికి సంతాపము కలిగించిరి” అని కీర్తన 78:⁠41 చెబుతుంది. అవును, “ఆదియు, సర్వసృష్టికి కారకుడు” అయిన దేవుడు మనకు దూరంగా ఉంటూ అనుభూతులు లేకుండా ఉండేవాడు కాదు. ఆయన ఒక నిజమైన వ్యక్తి, మనలా అస్థిరమైన భావాలు, అపరిపూర్ణత వల్ల ఉన్న మందకొడితనం ఆయనలో లేవు.

[7వ పేజీలోని చిత్రాలు]

యెహోవా సృష్టి గురించి అంతఃకరణతో ఆలోచించడం ఆయనకు దగ్గరవడానికి ఒక మార్గం