“ఓహ్, ఏమి తరగని విశ్వాసం!”
జీవిత కథ
“ఓహ్, ఏమి తరగని విశ్వాసం!”
హార్బర్ట్ ముల్లర్ చెప్పినది
హిట్లర్ సైన్యం నెదర్లాండ్స్‌ను ఆక్రమించుకున్న కొన్ని నెలల తరువాత, అక్కడి యెహోవాసాక్షులు నిషేధించబడ్డారు. కొద్దికాలానికే నాజీలు పట్టుకోవాల్సిన ముఖ్యమైన వారి లిస్టులో నా పేరు కనిపించింది, ఇక నన్ను ఒక జంతువులా వేటాడడం మొదలుపెట్టారు.
ఒకసారి, దాక్కోవడం పరుగెత్తడం వల్ల చాలా అలిసిపోయిన నేను, సైన్యానికి పట్టుబడితేనే ఉపశమనం దొరకవచ్చునేమోనని నా భార్యతో అన్నాను. అప్పుడు ఒక పాటలోని పదాలు గుర్తుకువచ్చాయి: “ఓహ్, ఏమి తరగని విశ్వాసం, శత్రువు ఎన్ని ఒత్తిళ్ళు తెచ్చినా.” * ఆ పాటను ధ్యానిస్తుండగా నేను శక్తిని పుంజుకున్నాను, దాంతోపాటు నా తల్లిదండ్రులు జర్మనీలో ఉన్నప్పటి జ్ఞాపకాలు, నాకు వీడ్కోలు పార్టీ ఇచ్చిన రోజు నా స్నేహితులు ఈ పాట పాడిన జ్ఞాపకాలు నా స్మృతిపథంలోకి వచ్చాయి. వాటిలోని కొన్ని జ్ఞాపకాలను నేను మీతో పంచుకోనా?
నా తల్లిదండ్రుల మాదిరి
నేను 1913 లో, జర్మనీలోని కోపిట్స్ పట్టణంలో జన్మించేటప్పటికి, నా తల్లిదండ్రులు ఇవాంజిలికల్ చర్చిలో సభ్యులుగా ఉన్నారు. * ఏడు సంవత్సరాల తరువాత, 1920 లో, నాన్నగారు చర్చిని వదిలిపెట్టేశారు. ఆయన ఏప్రిల్ 6న, కిర్‌చెనాస్ట్రిట్స్‌బిస్కేయ్‌నిగుంగ్ (చర్చిని వదిలి పెట్టినట్లు తెలియజేసే పత్రం, చర్చి నుంచి) కావాలని అడిగారు. ఆ పట్టణపు సివిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసరు ఒక పత్రాన్ని తయారు చేసి ఇచ్చాడు. అయినా వారం తర్వాత, మా నాన్నగారు తన కూతురు పేరు ఆ పత్రంలో లేదని ఆ ఆఫీసుకు మళ్ళీ వెళ్ళారు. ఆ ఆఫీసరు మరొక కాగితం మీద, చర్చిని వదిలి పెట్టినట్లుగా ఈ పత్రం మార్తా మార్గరేత ముల్లర్‌కు కూడా వర్తిస్తుంది అని వ్రాసిచ్చాడు. ఆ సమయానికి, మా చెల్లి, మార్గరేతకు సంవత్సరంన్నర వయస్సు. యెహోవా సేవను నాన్నగారు ఏదో అరకొరగా చేయతగ్గదిగా ఎంచలేదు!
నా తల్లిదండ్రులు, అప్పట్లో బైబిలు విద్యార్థులుగా తెలిసిన యెహోవాసాక్షుల ద్వారా ఆ సంవత్సరంలోనే
బాప్తిస్మం పొందారు. మా నాన్నగారు మమ్మల్ని చాలా స్ట్రిక్టుగా పెంచారు, కానీ యెహోవాపట్ల ఆయనకున్న యథార్థత మేమాయన నడిపింపును సమ్మతించడానికి సులభతరం చేసింది. ఆ యథార్థత, మా తల్లిదండ్రులు కూడా సర్దుబాట్లు చేసుకోవడాన్ని నేర్చుకునేలా చేసింది. ఉదాహరణకు, ఒకప్పుడు ఆదివారాలు మమ్మల్ని బయట ఆడుకోవడానికి అనుమతించేవారు కాదు. అయినా, 1925 లో ఒక ఆదివారంరోజు, మనం బయటకు విహారానికి వెళ్దాం అని మాకు మా తల్లిదండ్రులు చెప్పారు. మేం కొన్ని ఫలహారాలు వెంట తీసుకుని వెళ్లి చాలా చక్కగా సమయం గడిపాం—దినమంతా నాలుగ్గోడల మధ్య గడిపే మాకు అది ఎంత చక్కని మార్పు! ఒకరోజు ఇటీవల జరిగిన ఒక సమావేశంలో కొన్ని అంశాలు నేర్చుకున్నానని మా నాన్నగారు చెప్పారు, ఆ అంశాలే, ఆదివారపు కార్యకలాపాల గురించి ఆయన దృక్పథం మారడానికి దోహదపడ్డాయి. ఇతర సమయాల్లో కూడా, అదేరకమైన సర్దుబాట్లకు ఆయన సుముఖత చూపించారు.మా తల్లిదండ్రుల ఆరోగ్యం అంతంత మాత్రమే అయినా, వాళ్లు ప్రకటనా పనిలో వెనకాడే వారు కాదు. ఉదాహరణకు, ఎక్లీసియాస్టిక్స్ ఇండిక్టెడ్ అనే కరపత్రాన్ని పంచడానికి, మేము మా సంఘంలోని మిగతా వారితో పాటు డ్రెస్‌డెన్ నుండి దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న రిజెన్స్‌బర్గ్‌కు ఒక సాయంత్రం రైల్లో ప్రయాణించి వెళ్ళాం. మరుసటి రోజు, నగరమంతటా ఆ కరపత్రాన్ని పంచిపెట్టి, అవి అయిపోగానే, రైల్లో తిరిగి వచ్చాం. మేం ఇంటికి తిరిగి వచ్చేసరికి, దాదాపు 24 గంటలు గడిచాయి.
ఇల్లు వదిలి వెళ్ళడం
నేను ఆధ్యాత్మికంగా ఎదగడానికి మా సంఘంలోని జుగెండ్‌గ్రుప్పె (యూత్ గ్రూప్)తో సహవసించడం కూడా నాకు తోడ్పడింది. 14 ఏళ్ళకు పై వయసున్న యౌవనస్థులు ప్రతి వారం సంఘంలోని పెద్ద వయస్కులైన సహోదరులను కలుసుకునే వాళ్ళు. మేము ఆడుకునేవాళ్ళం, సంగీతవాద్యాలు వాయించేవాళ్ళం, బైబిలు అధ్యయనం చేసేవాళ్లం, సృష్టి మరియు సైన్సు గురించి మాట్లాడుకునేవాళ్ళం. అయితే, నాకు 19 ఏండ్ల వయసప్పుడు, 1932 లో, ఆ గ్రూపుతో నా సహవాసం ఆగిపోయింది.
ఆ సంవత్సరపు ఏప్రిల్ నెలలో, మాగ్డేబర్గ్‌లోని వాచ్‌టవర్ సొసైటీ నుండి నాన్నగారికి ఒక ఉత్తరం వచ్చింది. డ్రైవింగ్ తెలిసి, పయినీరు సేవ చేయాలనుకుంటున్న వారి కోసం సంస్థ చూస్తోంది. నేను పయినీరు సేవ చేయాలని నా తల్లిదండ్రుల కోరిక అని నాకు తెలుసు, కాని నాకేమో నేను చేయలేనని అనిపించింది. నా తల్లిదండ్రులు పేదవాళ్ళవడం వల్ల, నా 14వ ఏటనే సైకిళ్ళు, కుట్టుమిషన్లు, అంతేకాక టైపురైటర్లూ ఇతర ఆఫీసు సామగ్రినీ రిపేరు చేయడం మొదలుపెట్టాను. నా కుటుంబాన్ని నేనెలా వదిలిపెట్టగలను? వారికి నా సహాయం అవసరముంది. అంతేకాక, నేనింకా బాప్తిస్మం కూడా తీసుకోలేదు. నాన్నగారు నాతో కూర్చుని, బాప్తిస్మంలో ఇమిడివున్న అంశాలు నాకు అర్థమయ్యాయో లేదో తెలుసుకోవడానికి ఆయన నన్ను కొన్ని ప్రశ్నలు వేశారు. బాప్తిస్మం పొందడానికి సరిపడేంత ఆధ్యాత్మిక అభివృద్ధి నాకుందని నా జవాబులు ఆయనను ఎప్పుడైతే సంతృప్తి పరిచాయో, ఆయనిలా అన్నారు: “ఈ నియామకానికి నిన్ను నీవు సమర్పించుకోవాలి.” నేను ఆయన చెప్పినట్టే చేశాను.
ఒక వారం తర్వాత నన్ను మాగ్డేబర్గ్‌కు రమ్మంటున్న ఒక ఆహ్వానాన్ని అందుకున్నాను. మా యూత్ గ్రూపుతో నేనీ విషయం చెప్పినప్పుడు, ఒక సంతోషకరమైన పాటతో నాకు వీడ్కోలివ్వాలని వారు అనుకున్నారు. నేను ఎన్నుకున్న పాట వారిని ఆశ్చర్యపరిచింది, ఎందుకంటే వాళ్ళు దాన్ని చాలా గంభీరమైన పాటగా భావించారు. అయినప్పటికీ, కొందరు తమ వయొలిన్లను, మాండొలిన్లను, గిటార్లను అందిపుచ్చుకొని
పాడడం మొదలుపెట్టారు: “ఓహ్, ఏమి తరగని విశ్వాసం, నా శత్రువు ఎన్ని ఒత్తిళ్ళు తెచ్చినా; ఎటువంటి ఐహిక ఆపదల అంచునవున్నా.” రాబోయే సంవత్సరాల్లో, ఆ పదాలు నన్ను ఎంత తరచుగా బలపరుస్తాయో ఆ రోజున నేను గ్రహించలేదు.అల్లకల్లోలమైన ప్రారంభం
మాగ్డేబర్గ్‌లో సహోదరులు నా డ్రైవింగును పరీక్షించిన తరువాత, నలుగురు పయినీర్లతో ఒక కారును నాకు అప్పజెప్పారు, అప్పుడు మేము బెల్జియంకు దగ్గర్లో ఉన్న ష్నైఫెల్‌కు బయల్దేరాం. మాకు కారు ఎంత అవసరమో మేము త్వరలోనే తెలుసుకున్నాం. మేము అక్కడికి వెళ్ళడం ఆ ప్రాంతపు క్యాథలిక్ చర్చివారికి ఆగ్రహం తెప్పించింది. మతగురువులతో రెచ్చగొట్టబడ్డ గ్రామస్థులు తరచుగా మమ్మల్ని తరిమివేయడానికి సిద్ధంగా ఉండేవారు. మమ్మల్ని తరమడానికి వాళ్ళు పారలతో, పంగలకర్రలతో చేసే దాడుల నుండి తప్పించుకోవడానికి కారు మాకు చాలాసార్లు ఉపయోగపడింది.
రీజనల్ ఓవర్‌సీర్ అయిన పాల్ గ్రోస్‌మాన్, 1933 లో జ్ఞాపకార్థ దినం తరువాత, జర్మనీలో సంస్థ పని నిషేధించబడిందని మాతో చెప్పారు. దాని తర్వాత కొద్దికాలానికి, మాగ్డేబర్గ్‌నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాక్సోని రాష్ట్రానికి, సాహిత్యాలను తీసుకు వెళ్ళడానికి నన్ను కారుతో సహా రమ్మని బ్రాంచ్ కార్యాలయం నుండి పిలుపు వచ్చింది. ఎట్టకేలకు, నేను మాగ్డేబర్గ్ చేరుకున్నాను అప్పటికే, గెస్టపో (నాజీ రహస్య పోలీసుల బృందం) సంస్థ కార్యాలయాన్ని మూసేసింది. నేను కారును లైప్‌జిగ్‌లోని ఒక సహోదరుని దగ్గర వదిలిపెట్టి ఇంటికి తిరిగి వచ్చాను—కానీ ఎక్కువ రోజుల కోసం కాదు.
నెదర్లాండ్స్‌లో పయినీరు సేవను ప్రారంభించమని స్విట్జర్లాండ్‌లోని సంస్థ కార్యాలయం నుండి నాకు ఆహ్వానం వచ్చింది. ఒకటి రెండు వారాల్లో వెళ్ళాలని నేను అనుకున్నాను. అయితే నాన్నగారు మాత్రం, వెంటనే బయల్దేరమని సలహా ఇచ్చారు. ఆయన సలహాను శిరసావహించి, కొన్ని గంటల్లోనే ఇంటి నుండి బయల్దేరాను. మరుసటి రోజు, నేను సైనిక సేవను తప్పించుకుని వెళ్తున్నాననే నేరారోపణతో నన్ను అరెస్ట్ చేయడానికి పోలీసులు మా నాన్న గారింటికి వచ్చారట. వాళ్ళు చాలా ఆలస్యం చేశారు.
నెదర్లాండ్స్‌లో ప్రారంభం
అమ్‌స్టర్‌డామ్‌కు 25 కిలోమీటర్ల దూరాన ఉన్న, హేమ్‌స్టేడ్‌లోని పయినీరు హోమ్‌కు 1933 ఆగస్టు 15న చేరుకున్నాను. మరుసటి రోజు, డచ్ భాషలోని ఒక్క పదం కూడా తెలీని నేను ప్రకటనా పనికి వెళ్ళాను. చదవడానికి అనుకూలంగా ఉండే, లేఖన సందేశాన్ని ముద్రించిన ఒక సాక్ష్యపు కార్డుతో నేను ప్రారంభించాను. ఒక క్యాథలిక్ స్త్రీ రీకన్సిలియేషన్ స్తకాన్ని స్వీకరించినప్పుడు ఎంత ఉత్తేజం పొందానో! అదేరోజు, 27 చిన్న పుస్తకాలను కూడా నేను పంచాను. ఆ మొదటి రోజు గడిచే సరికి, నేను మళ్ళీ స్వతంత్రంగా ప్రకటించగలనని నాకెంతో ఆనందం కలిగింది.
ఆ రోజుల్లో, సాహిత్యాలు పంచేటప్పుడు పొందే విరాళాలు తప్ప పయినీర్లకు వేరే ఎటువంటి ఆదాయం ఉండేది కాదు. ఆ డబ్బు ఆహారం, ఇతర అవసరమైనవి కొనుక్కోవడానికి ఉపయోగించుకునేవాళ్ళం. ఒకవేళ నెలాఖరున ఏమైనా కొంత డబ్బు మిగిలితే, స్వంత ఖర్చుల కోసం ఆ డబ్బును పయినీర్లందరం పంచుకునేవాళ్ళం. ఇహలోకానికి సంబంధించినవి మా దగ్గరున్నవి తక్కువే అయినా, యెహోవా మాకు కావల్సినవి చాలా బాగా ఏర్పాటు చేశాడు, 1934 లో నేను స్విట్జర్లాండ్‌లో జరిగిన సమావేశానికి హాజరవ్వగలగడం అందులో ఒకటి.
నమ్మకమైన ఒక భాగస్వామి
సమావేశంలో 18 ఏళ్ళ ఎరీకా ఫింకేను చూశాను. నేను ఇంటి దగ్గర ఉన్నప్పటినుండే ఆమె నాకు తెలుసు. మా చెల్లి మార్గరేత స్నేహితురాలు. ఆమెకు సత్యంపట్ల ఉన్న స్థిరత్వానికి నేనెప్పుడూ ముగ్ధుడ్నయ్యేవాడిని. ఆమె 1932 లో, బాప్తిస్మం తీసుకుని ఎంతో కాలం కాకముందే ఎవరో, ఎరీకా “హేల్ హిట్లర్” అనడానికి నిరాకరించిందని గెస్టపోకు తెలిపారు. గెస్టపో ఆమె దగ్గరకు వెళ్ళి ఆమె నిరాకరించడానికి కారణమేమిటని దబాయించి అడిగారు. ఆమె పోలీసు స్టేషన్‌లోని పోలీసు ఆఫీసరుకు అపొస్తలుల కార్యములు 17:2, 3 చదివి వినిపించి, దేవుడు మన రక్షకుడిగా ఒకే ఒక మనుష్యుణ్ణి నియమించాడు, ఆయన యేసుక్రీస్తు అని ఆయనకు వివరించింది. “నీలాంటి నమ్మకం ఉన్న వారు ఇంకా ఎవరైనా ఉన్నారా?” అని ఆఫీసరు గదమాయించాడు. ఎరీకా పేర్లు చెప్పడానికి నిరాకరించింది. జైల్లో వేస్తానని పోలీసు బెదిరించినప్పుడు, నేను చచ్చినా ఎవరి పేర్లు చెప్పను అని ఆమె అన్నది. అతను ఆమెపై అరవడం ప్రారంభించాడు: “వెళ్ళిపో ఇక్కడి నుండి. వెళ్ళింటికి. హేల్ హిట్లర్!”
సమావేశం తర్వాత, ఎరీకా స్విట్జర్లాండ్‌లో ఉండగానే నేను నెదర్లాండ్స్‌కు తిరిగి వచ్చాను. అయితే, మా స్నేహం పెరిగిందని మాకిద్దరికీ అనిపించింది. ఎరీకా ఇంకా స్విట్జర్లాండ్‌లో ఉండగానే, వాళ్ళ ఊళ్ళో గెస్టపో ఆమె కోసం మళ్ళీ వెదుకుతున్నారని ఆమె విన్నది. ఆమె స్విట్జర్లాండ్‌లోనే ఉండి పయినీరు సేవ చేయాలని నిర్ణయించుకుంది. కొన్ని నెలల తర్వాత, ఆమెను స్పెయిన్ వెళ్ళమని సంస్థ కోరింది. ఆమె మాడ్రిడ్‌లోనూ బిల్బావ్‌లోనూ అటుతర్వాత శాన్ సెబాస్టియన్‌లోనూ పయినీరుగా సేవ చేసింది, అక్కడ పాదిరీలచే రెచ్చగొట్టబడ్డ పోలీసుల గాలింపులో ఆమె, ఆమెతో పాటు పనిచేస్తున్న మరొక సహోదరి జైలు పాలయ్యారు. 1935 లో స్పెయిన్ వదిలి పొమ్మని వారికి ఆజ్ఞాపించారు. ఎరీకా నెదర్లాండ్స్‌కు వచ్చింది, అదే సంవత్సరంలో మేము పెళ్ళి చేసుకున్నాం.
యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ
మా పెళ్ళి తర్వాత, మేము హేమ్‌స్టేడ్‌లో పయినీరు సేవ చేశాం, అటు తరువాత మేము రోట్టర్‌డామ్ నగరానికి వెళ్ళాం. అక్కడ 1937 లో, మా బాబు వోల్ఫ్‌గాంగ్ జన్మించాడు. ఒక సంవత్సరం తర్వాత, మేము నెదర్లాండ్స్‌కు ఉత్తరాన ఉన్న గ్రోనింగెన్ పట్టణానికి వెళ్ళాం. అక్కడ పయినీరు సేవ చేస్తున్న జర్మనీ దంపతులు ఫెర్డీనాంత్, హెల్గా హొల్తోర్ఫ్, వాళ్ళ కూతురుతో పాటు ఉంటున్న ఇంట్లో మేమూ ఒక భాగం పంచుకున్నాం. డచ్ ప్రభుత్వం జర్మన్ దేశస్థులైన సాక్షులను ఇకపై ప్రకటనా పని చేయడానికి అనుమతించబోదని ఆజ్ఞ జారీ చేసినట్లు, 1938 జూలైలో సంస్థ మాకు తెలియజేసింది. దాదాపు అదే సమయంలో, నేను జోన్ ఓవర్‌సీర్ (ప్రయాణ పైవిచారణకర్త)గా నియమించబడ్డాను. మా కుటుంబం లిక్ట్‌డ్రేకర్ (లైట్‌బేరర్) అనే పడవలోకి మారింది. నెదర్లాండ్స్‌కు ఉత్తర భాగాన ప్రకటించడానికి పయినీర్లకు, సంస్థ ఏర్పాటు చేసిన ఆ పడవే ముఖ్య ఆధారమైంది. సైకిలుపై ఒక సంఘం నుండి మరొక సంఘానికి వెళ్తూ, ప్రకటనా పనిచేస్తూనే ఉండమని సహోదరులను ప్రోత్సహిస్తూ అధిక సమయం నేను కుటుంబానికి దూరంగానే గడిపేవాడిని. సహోదరులు ప్రకటనా పనిని చురుకుగా చేపట్టారు. కొందరు తమ పరిచర్యను అభివృద్ధి పరుచుకున్నారు. వారిలో విమ్ కెట్‌లారె అనే యువకుడు ఒక చక్కని ఉదాహరణ.
నేను విమ్‌ను కలిసినప్పుడు, ఆయన అప్పటికే సత్యాన్ని గుర్తించినా, వ్యవసాయం వల్ల బిజీగా ఉండేవాడు. నేను ఆయనకు, “నీవు యెహోవా సేవ చేయడానికి సమయం కావాలనుకుంటే, నీవు మరొక ఉద్యోగం వెదుక్కోవాలి” అని సలహా ఇచ్చాను. ఆయనలాగే చేశాడు. తర్వాత, మేము మరోసారి కలుసుకున్నప్పుడు, పయినీరు సేవచేయమని నేనాయనను ప్రోత్సహించాను. “కాని నన్ను నేను పోషించుకోవడానికి పనిచేయాలి కదా” అని అన్నాడు. “దాని గురించి నీవు ఏమీ భయపడకు, యెహోవా నిన్ను చూసుకుంటాడు” అని నేనాయనను ధైర్యపరిచాను. విమ్ పయినీరు సేవ ప్రారంభించాడు. దాని తర్వాత, రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో కూడా, ప్రయాణ పైవిచారణకర్తగా సేవ చేశాడు. ఈరోజు, తన ఎనభయ్యో పడిలో, విమ్ ఇప్పటికీ ఉత్సాహం గల సాక్షియే. యెహోవా నిజంగానే ఆయనను చూసుకున్నాడు.
నిషేధం, పోలీసుల వేట
మా రెండవ అమ్మాయి రైనా పుట్టిన తర్వాత దాదాపు ఒక సంవత్సరానికి 1940 మే నెలలో, డచ్ సైన్యం లొంగిపోయింది, నాజీలు నెదర్లాండ్స్‌ను ఆక్రమించుకున్నారు. జూలై నెలలో గెస్టపో, సంస్థ కార్యాలయాన్నీ ముద్రణాలయాన్నీ స్వాధీనం చేసుకుంది. దాని తరువాతి సంవత్సరం, సాక్షుల అరెస్ట్‌లు ఎగిసిపడే సముద్రతరంగాల్లా జరిగాయి, అందులో నేనూ పట్టుబడ్డాను. ఒక సాక్షినీ, సైన్యంలో భర్తీకాదగ్గ వయస్సులో ఉన్న జర్మన్ దేశస్థుడినీ అయిన నన్ను గెస్టపో ఏం చేస్తుందో ఊహించడం జర్మన్ ప్రభుత్వం తీరుతెన్నులు తెలిసిన నాకు పెద్ద కష్టమేమీ కాలేదు. నేను తిరిగి నా కుటుంబాన్ని చూస్తాననే ఆశను వదులుకోవడానికి ప్రయత్నించాను.
1941, మే నెలలో, గెస్టపో నన్ను జైల్లోనుండి బయటకు
రప్పించి మిలిటరీ సేవ చేయమని ఆజ్ఞాపించింది. నేనది నమ్మలేకపోయాను. అదేరోజున నేను రహస్యంగా తప్పించుకున్నాను, అదే నెలలో తిరిగి నేను ప్రయాణ పైవిచారణకర్తగా పనిని ప్రారంభించాను. గెస్టపో, పట్టుకోవాల్సిన ముఖ్యమైన వారి లిస్టులో నా పేరును చేర్చింది.నా కుటుంబం సమస్యల్ని ఎదుర్కొన్న తీరు
నా భార్యాపిల్లలు ఆ దేశానికి తూర్పు భాగానవున్న ఫోర్దెన్ అనే ఒక గ్రామానికి తరలి వెళ్ళారు. వారిని ప్రమాదంలో పడవేయకూడదని, వారి దగ్గరకు నా రాకపోకలు చాలా తగ్గించుకున్నాను. (మత్తయి 10:16) రక్షణ కోసం, సహోదరులు నా స్వంత పేరుతో కాకుండా, దైత్సి యాన్ (జర్మన్ జాన్) అనే మారుపేరుతో పిలిచేవారు. చివరికి నా నాలుగేళ్ళ కొడుకు వోల్ఫ్‌గాంగ్ కూడా “నాన్న” అన్న మాట ఉపయోగించడానికి అనుమతించలేదు, నా గురించి మాట్లాడుకోవాలంటే, “ఓమి యాన్” (జాన్ మామయ్య) అని మాత్రం ఉపయోగించేవారు. అలా పిలవడం వాడికి మానసికంగా చాలా బాధగా ఉండేది.
నేను గెస్టపో నుండి తప్పించుకు తిరుగుతున్నప్పుడు, ఎరీకా పిల్లలను చూసుకుంటూ ప్రకటిస్తుండేది. ఎరీకా సైకిలుకుండే సామాన్లు పెట్టుకునే సీటుపై రెండేళ్ళ రైనాను కూర్చోబెట్టుకుని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రకటించడానికి తన వెంట తీసుకువెళ్ళేది. ఆహారం దొరకడం కష్టమైనప్పటికీ, కుటుంబం కోసం తీవ్రమైన ఆహార కొరతను ఎరీకా ఎప్పుడూ అనుభవించలేదు. (మత్తయి 6:33) ఒకసారి నేను కుట్టుమిషన్ రిపేరు చేసిచ్చిన ఒక క్యాథలిక్ రైతు, ఎరీకాకు బంగాళదుంపలు ఇచ్చాడు. నా దగ్గర నుండి ఎరీకాకు సందేశాలను కూడా చేరవేసేవాడు. ఒకసారి, ఎరీకా ఒక దుకాణంలో తనక్కావల్సిన ఒక వస్తువు కోసం తన దగ్గరున్న ఒక్క గుల్డెన్‌ను ఇచ్చేసింది. దుకాణదారుకు, ఎరీకా రహస్యంగా జీవిస్తోందని, ఆహారపు రేషన్ కార్డులు పొందడం వీలుకాదని తెలిసి, ఆయన ఆమెక్కావల్సిన ఆ వస్తువుతో పాటు రెండు గుల్డెన్‌లు కూడా ఇచ్చాడు. అలాంటి సానుభూతితో కూడిన అనుభవాలు ఆమె తన జీవితాన్ని కొనసాగించడానికి సహాయపడ్డాయి.—హెబ్రీయులు 13:5.
ధైర్యంగల సహోదరులతో భుజం-భుజం కలిపి పనిచేయడం
అదేసమయంలో, కేవలం సంఘంలోని బాధ్యతగల సహోదరులనే కలవగలిగినప్పటికీ, నేను సంఘాలను సందర్శించడం కొనసాగించాను. గెస్టపో నన్ను నీడలా వెంటాడుతున్న కారణంగా నేను ఒకేచోట, కొన్ని గంటల కంటె ఎక్కువ ఉండలేకపోయేవాడిని. చాలామంది సహోదర, సహోదరీలు నన్ను కలుసుకోవడానికి అనుమతించబడేవారు కాదు. వారికి కేవలం తమ చిన్న బైబిలు పఠనపు గ్రూపుకు చెందిన సాక్షులు మాత్రమే తెలుసు. దాని ఫలితంగా, ఒకే నగరంలో వేరు వేరు స్థలాల్లో ఉంటున్న ఇద్దరు స్వంత అక్కాచెల్లెళ్ళు యుద్ధసమయంలో తాము సాక్షులమయ్యామనే
విషయం, రెండవ ప్రపంచ యుద్ధం ముగిసేంత వరకు ఇద్దరూ తెలుసుకోలేకపోయారు.సంస్థ సాహిత్యాలను దాచిపెట్టడానికి రహస్య స్థావరాలను వెదకడం నేను చేయాల్సిన పనుల్లో ఒకటి. వాటితో పాటు, కావలికోట కాపీలు చేయడానికి అవసరమవ్వవచ్చని మేము కాగితం, స్టెన్సిల్ మిషన్లు, టైపురైటర్లు దాచిపెట్టేవాళ్ళం. కొన్నిసార్లు, సంస్థ ప్రచురించిన పుస్తకాలను ఒక రహస్య స్థావరంనుండి మరొక స్థావరానికి తీసుకెళ్ళాల్సి వచ్చేది. ఒకసారి ఎవరికీ అనుమానం కలుగకుండా 30 అట్టపెట్టెల నిండుగా సాహిత్యాలను తీసుకువెళ్ళడం నాకింకా గుర్తుంది—గుండె ధైర్యాన్ని చెదరగొట్టే పని అది!
అంతేగాక, నిషేధమైనప్పటికీ నెదర్లాండ్ తూర్పు భాగంలోని పొలాల్లోనుండి పడమటి పట్టణ భాగాల్లోకి ఆహారపదార్థాలను తీసుకువెళ్ళడానికి ఏర్పాట్లు చేశాం. ఆహారపదార్థాలను గుఱ్ఱపు బండ్లలో ఎక్కించి తీసుకువెళ్ళేవాళ్ళం. మార్గంలో మేము ఏదైనా నది దగ్గరకు చేరుకున్నప్పుడు, సైనికులు కావలిగా ఉండడం మూలంగా మేము వంతెనల్ని ఉపయోగించేవాళ్ళం కాదు. బదులుగా, వాటన్నింటిని చిన్న పడవల్లోకి ఎక్కించి నదిని దాటించి అవతలి పక్కన మరొక బండిలోకి ఎక్కించి తీసుకువెళ్ళేవాళ్ళం. మేము చేరుకోవాల్సిన పట్టణానికి చేరిన తర్వాత, చీకటి పడేంతవరకు ఆగి, గుఱ్ఱపు డెక్కలకు మేజోళ్ళు తొడిగించి, అక్కడి సంఘం వాళ్ళు రహస్యంగా ఆహారం దాచుకునే స్థలానికి నెమ్మదిగా తీసుకువెళ్ళేవాళ్ళం. అక్కడినుండి అవసరమైనవారికి ఆహారాన్ని పంపించేవారు.
ఒకవేళ జర్మన్ సైనికులు గనుక అటువంటి ఆహారం దాచుకునే స్థలాన్ని కనుగొంటే ఎవరో ఒకరి ప్రాణానికి ముప్పు వాటిల్లేది. అయినప్పటికీ, ఎందరో సహోదరులు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఉదాహరణకు, అమర్స్‌ఫూర్ట్ పట్టణంలో ఉంటున్న బ్లూమింక్ కుటుంబం, తమ ఇల్లు జర్మన్ సైనికదళం ఉంటున్న క్యాంపుకు రాయి విసిరేంత దూరంలోనే ఉన్నప్పటికినీ ఆహారం దాచుకోవడానికి ఒక గదిని ఇచ్చారు! ఇలాంటి ధైర్యంగల సాక్షులు తమ సహోదరుల కోసం తమ ప్రాణాలనే పణంగా పెట్టారు.
నిషేధమున్న సంవత్సరాల్లో నేను, నా భార్య విశ్వాసాన్ని కాపాడుకోవడానికి యెహోవా మాకెంతో సహాయం చేశాడు. 1945 మే నెలలో జర్మన్ సైన్యం ఓడిపోయింది, దాంతో దాక్కుంటూ పరుగెత్తే నా జీవితానికిక తెర పడింది. ఇతర సహోదరులు అందుబాటులోకి వచ్చేంత వరకు, ప్రయాణ పైవిచారణకర్తగా సేవను కొనసాగించమని సంస్థ నన్ను కోరింది. 1947 లో, బెర్తుస్ ఫాన్ డర్ బేల్ నా స్థానంలోకి వచ్చారు. * అప్పటికి మా మూడవ అబ్బాయి పుట్టాడు. మేము దేశానికి తూర్పు భాగాన స్థిరపడ్డాం.
సుఖదుఃఖాలు
నేను నెదర్లాండ్స్‌లో ఇల్లు వదిలి వచ్చిన ఒక సంవత్సరం తర్వాత నాన్నగారు జైలు పాలయ్యారని, యుద్ధం ముగిసిన తర్వాతనే నాకు తెలిసింది. అనారోగ్య కారణంగా ఆయనను రెండుసార్లు విడుదల చేశారు, కానీ మళ్ళీ తీసుకువెళ్ళి జైల్లో వేశారు. 1938 ఫిబ్రవరిలో, ఆయనను బుచన్‌వాల్డ్ కాన్సంట్రేషన్ క్యాంపుకు, అటు తరువాత డకావుకు పంపించారు. అక్కడ 1942, మే 14న, మా నాన్నగారు మరణించారు. చివరి వరకు ఆయన స్థిరంగానూ యథార్థంగానూ ఉన్నారు.
అమ్మను కూడా డకావు క్యాంపుకు పంపారు. 1945 లో ఆమెను విడిచిపెట్టేంత వరకు ఆమె అక్కడే ఉంది. నా తల్లిదండ్రుల స్థిరమైన మాదిరి, నేను ఆనందించిన ఆధ్యాత్మిక ఆశీర్వాదాలకు ఎంతో తోడ్పడింది. 1954 లో మా అమ్మ మాతోపాటు ఉండడానికి రావడం మా ఆధిక్యత. 1945 నుంచి మా చెల్లె—తూర్పు జర్మనీలో పయినీరు సేవచేస్తున్న—మార్గరేత కూడా వచ్చింది. అమ్మ అనారోగ్యంగా ఉన్నా, డచ్ భాష రాకపోయినా 1957 అక్టోబరులో తన భూలోక జీవితాన్ని ముగించేంత వరకు యథార్థంగా క్షేత్ర సేవను కొనసాగించింది.
జర్మనీ, న్యూరెమ్‌బర్గ్‌లో 1955 లో జరిగిన సమావేశం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. మేము అక్కడికి చేరుకున్న తర్వాత, డ్రెస్‌డన్ నుంచి వచ్చిన సహోదరులు ఎరీకా వాళ్ళ అమ్మ కూడా ఆ సమావేశానికి వచ్చిందని ఎరీకాతో చెప్పారు. డ్రెస్‌డన్ అప్పుడు తూర్పు జర్మన్ పరిపాలన క్రింద ఉన్న కారణంగా, గత 21 సంవత్సరాలనుండి ఎరీకా వాళ్ళ అమ్మను చూడలేదు. వాళ్ళు కలుసుకోవడానికి ఏర్పాటు చేశారు, తల్లీకూతుళ్ళు ఒకర్నొకరు గాఢంగా హత్తుకున్నారు. తిరిగి కలుసుకున్న ఆ సందర్భం ఎంతటి ఆనందకరమైనది!
కాలక్రమంగా మా కుటుంబం ఎనిమిది మంది పిల్లల వరకు పెరిగింది. విషాదకరంగా, మా అబ్బాయిల్లో ఒకడ్ని కారు ప్రమాదంలో పోగొట్టుకున్నాం. అయినా, మిగిలిన మా పిల్లలందరూ యెహోవాను సేవించడాన్ని చూడడం మా ఆనందానికొక మూలాధారం. మా అబ్బాయి వోల్ఫ్‌గాంగ్, ఆయన భార్య, వాళ్ళ అబ్బాయి కూడా ప్రాంతీయ పైవిచారణ సేవలో ఉండడం మాకు సంతోషకరమైన విషయం.
నెదర్లాండ్స్‌లో అభివృద్ధి చెందిన యెహోవా పనిని ప్రత్యక్షంగా చూడడం నాకెంతో ఆనందకరమైన విషయం. నేను 1933 లో పయినీరు సేవ ప్రారంభించినప్పుడు, అక్కడ సుమారు వంద మంది సాక్షులుండేవారు. ఈ రోజు అక్కడ 30,000కు పైగా ఉన్నారు. మా శారీరక శక్తి క్షీణిస్తున్నప్పటికీ, ఎరీకా నేనూ ఆ పాటలోని “ఓహ్, ఏమి తరగని విశ్వాసం” అనే పదాలకు అనుగుణంగా జీవించడానికి ఇప్పటికీ దృఢమైన నిశ్చయతతో ఉన్నాం.
[అధస్సూచీలు]
^ పేరా 1 పాట సంఖ్య 194.—సాంగ్స్ ఆఫ్ ప్రెయిజ్ టు జెహోవా (1928).
^ పేరా 7 కోపిట్స్ పట్టణం ఇప్పుడు పిర్నా అని పిలువబడుతోంది. ఇది డ్రెస్‌డెన్ పట్టణానికి 18 కిలోమీటర్ల దూరాన, ఎల్బే నదీ తీరాన ఉంది.
^ పేరా 38 సహోదరుడు ఫాన్ డర్ బేల్ జీవిత కథ “సత్యానికన్నా మిన్నయైనదేదీ లేదు” కోసం కావలికోట, జనవరి 1, 1998 లో చూడండి.
[23వ పేజీలోని చిత్రం]
క్షేత్రసేవ తర్వాత విరామ సమయంలో “జుగెండ్‌గ్రుప్పె”
[24వ పేజీలోని చిత్రం]
తోటి పయినీర్లు, నేను కలిసి ష్నైఫెల్ ప్రాంతాన్ని పూర్తి చేశాం.
నాకప్పుడు 20 ఏళ్ళు
[25వ పేజీలోని చిత్రం]
ఎరీకా, వోల్ఫ్‌గాంగ్‌లతో 1940 లో
[26వ పేజీలోని చిత్రం]
ఎడమ నుంచి కుడికి: మా మనవడు యోనతన్, ఆయన భార్య మిర్యమ్; ఎరీకా, నేను, మా అబ్బాయి వోల్ఫ్‌గాంగ్, ఆయన భార్య యూలియ
[26వ పేజీలోని చిత్రం]
మా నాన్నగారు జైల్లో ఉన్నప్పుడు ఆయనతో పాటు ఉన్న ఒక సహోదరుడు 1941 లో గీసిన ఆయన చిత్రమిది