కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఔదార్య బాహుళ్యం ఆనందాన్ని తెస్తుంది

ఔదార్య బాహుళ్యం ఆనందాన్ని తెస్తుంది

ఔదార్య బాహుళ్యం ఆనందాన్ని తెస్తుంది

ప్రేమగల క్రైస్తవ పైవిచారణకర్తగా అపొస్తలుడైన పౌలు తన తోటి విశ్వాసుల మేలును ఎంతగానో కోరాడు. (2 కొరింథీయులు 11:​28) అందుకనే, ఆయన సామాన్య శకం మొదటి శతాబ్దంలోని 50వ దశకం మధ్యభాగంలో, యూదయలోని అవసరంలో ఉన్న క్రైస్తవుల సహాయార్థం డబ్బును సేకరించే పనిని సంస్థీకరించినప్పుడు, ఆయన ఔదార్యం విషయంలో ఒక విలువైన పాఠాన్ని నేర్పించాలనుకున్నాడు. ఉత్సాహంగా ఇచ్చినప్పుడు యెహోవా దాన్ని ఎంతో మెచ్చుకుంటాడని పౌలు నొక్కిచెప్పాడు: “సణుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను; దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును.”​—⁠2 కొరింథీయులు 9:⁠7.

కడు బీదరికం ఉన్నా ఔదార్యం

మొదటి శతాబ్దపు క్రైస్తవుల్లో అత్యధికులు సమాజంలో అంత ప్రముఖులు కారు. వారిలో ‘అనేకులు ఘనులేమీ కాదని’ పౌలు పేర్కొన్నాడు. వారు “లోకములో బలహీనులైనవా[రు] . . . ఎన్నికలేనివా[రు].” (1 కొరింథీయులు 1:​26-29) ఉదాహరణకు, మాసిదోనియలో నివసిస్తున్న క్రైస్తవులు ‘నిరుపేదలు,’ వారు “బహు శ్రమ”లను అనుభవిస్తున్నారు. అయినప్పటికీ, మాసిదోనియలోని ఈ నమ్రతగల విశ్వాసులు, “పరిశుద్ధులకొరకైన పరిచర్య” కోసం ఆర్థిక సహాయాన్ని చేసే ఆధిక్యత తమకు కూడా ఇవ్వమని అభ్యర్థించారు; వారు ఇచ్చినది వారి “సామర్థ్యముకంటె ఎక్కువగా” ఉందని పౌలు సాక్ష్యమిచ్చాడు!​—⁠2 కొరింథీయులు 8:1-4.

అయితే, వారి ఔదార్యం వారిచ్చిన మొత్తాన్ని బట్టి కొలవబడలేదు. బదులుగా, వారిలోని ప్రేరణ, తమకు ఉన్నది ఇతరులతో పంచుకోవాలనే ఇష్టత, వారి హృదయాభిలాష అనేవి మరింత ప్రాముఖ్యమైనవి. చందాలు ఇవ్వడంలో మనస్సు, హృదయం ఇమిడివుంటాయని పౌలు కొరింథులోని క్రైస్తవులకు సూచించాడు. ఆయనిలా అన్నాడు: “మీ మనస్సు సిద్ధమైయున్నదని నేనెరుగుదును. అందువలన . . . నేను మిమ్మును గూర్చి మాసిదోనియవారియెదుట అతిశయపడుచున్నాను; మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడిరి.” వారు ఔదార్యంగా ఇవ్వాలని ‘తమ హృదయములో నిశ్చయించుకున్నారు.’​—⁠2 కొరింథీయులు 9:2, 7.

‘వారి మనస్సు వారిని ప్రేరేపించింది’

అపొస్తలుడైన పౌలు మనస్సులో, తన కాలానికి 15 శతాబ్దాల పూర్వం ప్రజలు ఔదార్యంగా ఇచ్చిన ఉదాహరణ ఉండివుంటుంది. ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలు ఐగుప్తులోని దాసత్వం నుండి విడిపించబడ్డారు. వారిప్పుడు సీనాయి పర్వతం దగ్గర ఉన్నారు, యెహోవా తన ఆరాధన నిమిత్తం ఒక గుడారాన్ని నిర్మించమని అందులో ఆరాధనా ఉపకరణాలను సమకూర్చమని వారికి ఆజ్ఞ ఇచ్చాడు. ఇందుకు అనేక వస్తువులు కావాలి, కాబట్టి చందాలివ్వమని పూర్తి జనాంగాన్ని ఆహ్వానించడం జరిగింది.

ఆ ఇశ్రాయేలీయులు ఎలా ప్రతిస్పందించారు? “తరువాత ఎవని హృదయము వాని రేపెనో, ఎవని మనస్సు వాని ప్రేరేపించెనో వారందరు వచ్చి, ప్రత్యక్షపు గుడారముయొక్క పని కొరకు . . . యెహోవాకు అర్పణను తెచ్చిరి.” (నిర్గమకాండము 35:​21) ఆ జనాంగం ఔదార్యంగా చందాలిచ్చిందా? ఇచ్చిందని నిశ్చయంగా చెప్పవచ్చు! మోషేకు, “చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమైన సేవకొరకు ప్రజలు కావలసిన దానికంటె బహు విస్తారము తీసికొని వచ్చుచున్నా[రు]” అన్న నివేదిక అందజేయబడింది.​—⁠నిర్గమకాండము 36:⁠5.

అప్పట్లో ఇశ్రాయేలీయుల ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? అప్పటికి కొద్ది కాలం క్రితమే వారు నీచమైన స్థితిలో దాసులుగా ఉన్నారు; ఐగుప్తీయులు వారిపై ‘భారాలు పెట్టి వారిని శ్రమపెట్టారు;’ వారి ‘ప్రాణాల్ని విసికించివేశారు.’ (నిర్గమకాండము 1:11, 14; 3:7; 5:​10-18) దీనిని బట్టి చూస్తే వారు వస్తుసంబంధంగా అంత సంపన్నులు అయివుండరు. నిజమే, ఇశ్రాయేలీయులు ఆ బానిస దేశం నుండి మందలతో పశువులతో బయటికి వచ్చారు. (నిర్గమకాండము 12:​32) కానీ అవి అంత గొప్ప సంఖ్యలో ఉండివుండవు, ఎందుకంటే ఐగుప్తును విడిచిన కొంతకాలానికే వారు తమకు తినడానికి మాంసము గానీ రొట్టెలుగానీ లేవని ఫిర్యాదు చేశారు.​—⁠నిర్గమకాండము 16:⁠3.

మరైతే, గుడారాన్ని నిర్మించడానికి ఇశ్రాయేలీయులు చందాలుగా ఇచ్చిన ఆ విలువైన వస్తువులు వారికి ఎక్కడ నుంచి వచ్చివుంటాయి? వారి మాజీ యజమానులైన ఐగుప్తీయుల దగ్గరి నుండే. బైబిలు ఇలా చెబుతుంది: “ఇశ్రాయేలీయులు . . . ఐగుప్తీయులయొద్ద వెండి నగలను బంగారు నగలను వస్త్రములను అడిగి తీసికొనిరి. . . . [ఐగుప్తీయులు] వారికి కావలసిన వాటిని ఇచ్చిరి.” ఐగుప్తీయులు ఇంత ఉదారంగా ప్రవర్తించడం యెహోవా ఆశీర్వాదమే, అది ఫరో నుండి వచ్చింది కాదు. దైవిక నివేదిక ఇలా చెబుతుంది: “యెహోవా, ప్రజల యెడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి.”​—⁠నిర్గమకాండము 12:35, 36.

అప్పుడు ఇశ్రాయేలీయులు ఎలా భావించివుంటారో ఒక్కసారి ఊహించండి. తరతరాలుగా వారు కఠోరమైన బానిస బ్రతుకును, తీవ్రమైన కొరతల్ని అనుభవించారు. కానీ ఇప్పుడు వారికి స్వేచ్ఛ లభించింది, వారి దగ్గర సిరిసంపదలూ ఉన్నాయి. ఆ సంపదల్లో కొంతభాగాన్ని తమతోపాటు తీసుకువెళ్ళడం గురించి వారు ఎలా భావించివుండవచ్చు? బహుశ తాము వాటిని సంపాదించుకున్నామనీ, వాటిని తీసుకువెళ్ళే హక్కు తమకు ఉందనీ వారు భావించివుండవచ్చు. అయితే, స్వచ్ఛారాధన మద్దతుకై ఆర్థికంగా తోడ్పడమని పిలువబడినప్పుడు వారు నిస్సంకోచంగా ఇచ్చారు, పిసినారితనంతో కాదు! ఆ సిరిసంపదలు తాము కలిగివుండేలా యెహోవాయే సాధ్యం చేశాడన్న విషయాన్ని వారు మర్చిపోలేదు. అందుకే, తమ దగ్గరున్న వెండినీ బంగారాన్నీ పశువుల్నీ సంపూర్ణంగా ఇచ్చారు. వారి ‘హృదయాలు వారిని ప్రేరేపించాయి.’ వారి ‘హృదయాలు వారిని రేపాయి.’ వారి ‘మనస్సులు వారిని ప్రేరేపించాయి.’ అది నిజంగా ‘యెహోవాకు మనఃపూర్వకంగా అర్పించిన అర్పణే.’​—⁠నిర్గమకాండము 25:1-9; 35:4-9, 20-29; 36:3-7.

ఇవ్వడానికి సంసిద్ధత

ఒక వ్యక్తి చందా ఎంత ఇచ్చాడన్నది ఆ ఇచ్చిన వ్యక్తి ఔదార్యాన్ని చూపిస్తుందని చెప్పలేము. దేవాలయంలోని కానుక పెట్టెలో ప్రజలు డబ్బు వేస్తుండగా యేసుక్రీస్తు ఒకసారి గమనించాడు. ధనవంతులు ఎన్నో నాణాల్ని వేస్తున్నారు, కానీ యేసు మాత్రం ఒక బీద విధవరాలు రెండు చిన్న కాసులు అందులో వేయడం చూసి ఎంతో అబ్బురపడ్డాడు. ఆయనిలా అన్నాడు: “ఈ బీద విధవరాలు అందరికంటె ఎక్కువ వేసె[ను] . . . యీమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసె[ను].”​—⁠లూకా 21:1-4; మార్కు 12:41-44.

పౌలు కొరింథీయులకు వ్రాస్తున్నప్పుడు చేసిన వ్యాఖ్యానాలు యేసు యొక్క ఈ తలంపుకు పొందికగా ఉన్నాయి. అవసరంలో ఉన్న తోటి విశ్వాసులకు సహాయం చేసే విషయాన్ని గూర్చి పౌలు ఇలా అన్నాడు: “మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి యుంటే శక్తికి మించి కాదు గాని కలిమి కొలదియే యిచ్చినది ప్రీతికరమవును.” (2 కొరింథీయులు 8:​12) అవును, చందాలు ఏదో పోటీ కోసమో లేదా పోలిక కోసమో ఇచ్చేవి కావు. ఒక వ్యక్తి తన తాహతు కొద్దీ ఇస్తాడు, యెహోవా ఆయనలో ఉన్న ఔదార్యాన్నిబట్టి ఆనందిస్తాడు.

యెహోవాను ధనవంతుడిగా చేసే వాళ్ళంటూ ఎవరూ లేరు, సమస్తానికీ ఆయనే యజమాని. చందాలు వేయడం అనేది ఒక ఆధిక్యత. యెహోవాపట్ల తమకున్న ప్రేమను ప్రదర్శించుకునేందుకు వారికి లభించే అవకాశం అది. (1 దినవృత్తాంతములు 29:​14-17) ఎవరికో చూపించుకోవడానికో లేదా స్వార్థపూరిత ఉద్దేశాలతోనో కాక, సరైన దృక్కోణంతోనూ సత్యారాధనను పెంపొందించే లక్ష్యంతోనూ ఇచ్చే చందాలు ఆనందాన్ని తెస్తాయి, అలాగే దేవుని ఆశీర్వాదాల్నీ తెస్తాయి. (మత్తయి 6:​1-4) యేసు ఇలా అన్నాడు: “పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము.” (అపొస్తలుల కార్యములు 20:​35) యెహోవా సేవలో మన శక్తిని ధారపోయడం ద్వారా, సత్యారాధన మద్దతు నిమిత్తమూ అర్హులైన వారికి సహాయం నిమిత్తమూ మన వస్తుసంపదల్లో కొంత ప్రక్కకు తీసిపెట్టడం ద్వారా ఆ ఆనందాన్ని మనమూ అనుభవించగలము.​—⁠1 కొరింథీయులు 16:1, 2.

నేడు సంసిద్ధతతో ఇవ్వడం

నేడు యెహోవాసాక్షులు “రాజ్య సువార్త”ను ప్రకటించే పని ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందడం చూసి ఎంతో ఉత్తేజితులౌతున్నారు. (మత్తయి 24:​14) 20వ శతాబ్దపు చివరి దశకంలో యెహోవా దేవునికి చేసుకున్న తమ సమర్పణకు చిహ్నంగా 30,00,000 మందికి పైగా బాప్తిస్మం తీసుకున్నారు, దాదాపు 30,000 క్రొత్త సంఘాలు ఏర్పడ్డాయి. అవును, నేడున్న యెహోవాసాక్షుల సంఘాల్లో మూడవ వంతు గత పదేళ్ళలోనే ఏర్పడ్డాయి! ఈ పెరుగుదలలో అత్యధిక శాతం క్రైస్తవ స్త్రీపురుషులు మనఃపూర్వకంగా కష్టించి పనిచేయడం ఫలితంగా వచ్చినదే. వారు తమ సమయాన్నీ తమ శక్తినీ వెచ్చించి తమ పొరుగువారిని సందర్శించి వారికి యెహోవా సంకల్పాలను గురించి చెప్పారు. ఈ పెరుగుదలలో కొంతమేర మిషనరీలు చేసిన పని ఫలితమే, వారు తమ స్వగృహాల్ని విడిచి ఎంతో దూరాల్లో ఉన్న దేశాలకు వెళ్ళి అక్కడ రాజ్య ప్రకటనా పనిలో తోడ్పడ్డారు. ఆ పెరుగుదల మూలంగా క్రొత్త సర్క్యూట్లను సంస్థీకరించడం జరిగింది, తత్ఫలితంగా క్రొత్త ప్రాంతీయ పైవిచారణకర్తలను నియమించాల్సిన అవసరం ఏర్పడింది. దానికి తోడు, ప్రకటనా పనిలోను వ్యక్తిగత పఠనంలోను మరిన్ని బైబిళ్ళ అవసరం ఏర్పడింది. మరింత సాహిత్యాన్ని ముద్రించాల్సిన అవసరం ఏర్పడింది. ఒక దేశం తర్వాత మరో దేశంలో బ్రాంచి కార్యాలయ సౌకర్యాలు విస్తృతం చేయాల్సిన లేదా పూర్తిగా క్రొత్త నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది. ఈ అవసరాలన్నీ యెహోవా ప్రజల స్వచ్చంద చందాల సహాయంతోనే తీరాయి.

రాజ్యమందిరాల అవసరం

యెహోవాసాక్షుల సంఖ్యలో పెరుగుదలతోపాటు అతి స్పష్టంగా పెరిగిన ఒక అవసరం రాజ్యమందిరాల నిర్మాణం. 2000వ సంవత్సరం తొలి భాగంలో నిర్వహించబడిన సర్వేల ప్రకారం, ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్న అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 11,000 కన్నా ఎక్కువ రాజ్యమందిరాలు అవసరమని తేలింది. అంగోలాను పరిశీలించండి. ఆ దేశంలో ఏళ్ళ తరబడి అంతర్యుద్ధం జరుగుతున్నా అక్కడ రాజ్య ప్రచారకుల సంఖ్యలో సగటున ప్రతి సంవత్సరం దాదాపు 10 శాతం అభివృద్ధి కన్పిస్తుంది. అయితే, ఆఫ్రికాలోని ఈ దేశంలోని 675 సంఘాల్లో ఎక్కువ శాతం బయలు ప్రదేశాల్లోనే కూటాలు జరుపుకుంటారు. ఈ దేశంలో కేవలం 22 రాజ్యమందిరాలే ఉన్నాయి, వీటిలో 12 మందిరాలకు మాత్రమే పైకప్పులు ఉన్నాయి.

డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగోలోని పరిస్థితి కూడా అదే రకంగా ఉంది. దీని రాజధానియైన కిన్షాసాలో దాదాపు 300 సంఘాలున్నా కేవలం పది రాజ్యమందిరాలు మాత్రమే ఉన్నాయి. ఈ దేశవ్యాప్తంగా ప్రస్తుతం 1,500 కన్నా ఎక్కువ రాజ్యమందిరాల నిర్మాణాన్ని అత్యవసరంగా చేపట్టాల్సివుంది. తూర్పు యూరప్‌ దేశాల్లో అభివృద్ధి అతి శీఘ్రంగా జరుగుతుండడంతో రాజ్యమందిరాల అవసరం ఎంతో ఉందని రష్యా ఉక్రెయిన్‌ దేశాలు కలిసి రిపోర్టు చేస్తున్నాయి. లాటిన్‌ అమెరికా దేశాల్లో అభివృద్ధి విపరీతమైన వేగంతో జరుగుతుండడం ముఖ్యంగా బ్రెజిల్‌ దేశంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ 5 లక్షలకు పైగా సాక్షులున్నారు, రాజ్యమందిరాల అవసరం ఎంతో ఉందక్కడ.

అటువంటి దేశాల్లోని అవసరాల్ని తీర్చడానికి యెహోవాసాక్షులు రాజ్యమందిరాల నిర్మాణం కోసం శీఘ్రగతిన కొనసాగే ఒక కార్యక్రమాన్ని అమలుచేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్త సహోదరత్వం ఔదార్యంతో అందించే చందాలే ఆధారం. దీనిద్వారా అనేక బీద సంఘాలు కూడా ఆరాధన కోసం ఉపయుక్తమైన స్థలాల్లో సమకూడడం సాధ్యమౌతుంది.

క్రైస్తవులు పూర్ణమనస్సుతో ‘తమ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరుస్తారు’ గనుక ప్రాచీన ఇశ్రాయేలు కాలంలోలానే ఇప్పుడూ ఎంతో సాధించడం సాధ్యమే. (సామెతలు 3:​9, 10) ఈ సందర్భంగా యెహోవాసాక్షుల పరిపాలక సభ, స్వచ్ఛంద చందాలు ఇచ్చి ఇందులో భాగం వహించేలా తమ హృదయాలచే పురికొల్పబడిన ప్రతి ఒక్కరికీ ప్రగాఢమైన కృతజ్ఞతలను తెలుపుతుంది. అంతేగాక, అంతకంతకూ విస్తృతమౌతున్న రాజ్య పనికి అవసరమయ్యే మద్దతును అందించేలా యెహోవా ప్రజల హృదయాలను ఆయన ఆత్మ పురికొల్పుతూ ఉంటుందని మనం నమ్మకం కలిగివుండవచ్చు.

ప్రపంచవ్యాప్త అభివృద్ధి కొనసాగుతూ ఉండగా మనం మన ఉత్సాహాన్ని ప్రదర్శించేందుకైన అవకాశాల కోసం ఎల్లప్పుడు ఎదురుచూస్తూ ఉందాం. అలాగే మన శక్తినీ, సమయాన్నీ, వనరుల్నీ ఇవ్వడంలో మన ఇష్టతనూ కనపరుద్దాం. అటువంటి ఇచ్చే స్ఫూర్తి తీసుకువచ్చే నిజమైన ఆనందాన్నీ మనం అనుభవిద్దాం.

[29వ పేజీలోని బాక్సు]

“దాన్ని జ్ఞానయుక్తంగా ఉపయోగించండి!”

“నాకు పదేళ్ళు. నేను ఈ డబ్బులు మీకు పంపిస్తున్నాను. దాంతో మీరు పుస్తకాలు చేయడానికి కాగితం లేక మరింకేదైనా కొనండి.”​—⁠సిండీ.

“మీరు మా కోసం ఇంకా ఎక్కువ పుస్తకాలు చేయడానికి ఈ డబ్బు పంపిస్తూ చాలా ఆనందిస్తున్నాను. నేను మా డాడీకి సహాయం చేస్తూ ఈ డబ్బు ఆదా చేశాను. అందుకని దాన్ని జ్ఞానయుక్తంగా ఉపయోగించండి!”​—⁠పామ్‌, ఏడేళ్ళు.

“తుపాను వచ్చిందని విని బాధపడ్డాను. మీరు క్షేమంగా ఉన్నారని అనుకుంటున్నాను. నా బ్యాంకులో ఉన్నది ఇంతే [రెండు డాలర్లు].”​—⁠ఆల్లిసన్‌, నాలుగేళ్ళు.

“నా పేరు రూడీ, నాకు 11 ఏళ్ళు. నా తమ్ముడు రాల్ఫ్‌కు ఆరేళ్ళు. మా చెల్లి జూడిత్‌కు రెండున్నర సంవత్సరాలు. [యుద్ధం జరుగుతున్న దేశంలో] ఉన్న సహోదరులకు సహాయం చేయడానికి మేము మూడు నెలల నుండి డాడీ ఇస్తున్న జేబు ఖర్చుల్ని ఆదా చేస్తున్నాము. అలా ఆదా అయిన 20 డాలర్లను ఇప్పుడు పంపిస్తున్నాము.”

“[తుపానులో చిక్కుకున్న] సహోదరుల గురించి విని చాలా బాధనిపించింది. మా డాడీతో కలిసి పనిచేసి నేను 17 డాలర్లు కూడబెట్టాను. ఈ డబ్బుల్ని ఎలా ఉపయోగించాలో మీరే నిర్ణయించండి.”​—⁠మెక్లీన్‌, ఎనిమిదేళ్ళు.

[31వ పేజీలోని బాక్సు]

ఇవ్వడానికి కొంతమంది ఎన్నుకునే పద్ధతులు

ప్రపంచవ్యాప్త పనికోసం విరాళాలు

“సొసైటీ ప్రపంచవ్యాప్త పని కోసం చందాలు.​—⁠మత్తయి 24:14.” అని వ్రాయబడి ఉన్న చందా పెట్టెలలో వేయడానికి అనేకమంది కొంత డబ్బును ప్రక్కకు తీసిపెడతారు లేదా తమ బడ్జెట్‌లో దాన్ని చేరుస్తారు. ప్రతినెలా సంఘాలు ఈ మొత్తాలను సొసైటీకి పంపిస్తాయి.

డబ్బు రూపంలోని స్వచ్ఛంద విరాళాలను నేరుగా The Watch Tower Bible and Tract Society of India, H-58 Old Khandala Road Lonavla 410 401, Maharashtraకి కూడా పంపించవచ్చు. ఆభరణాలను ఇతర విలువైన వాటిని సహితం విరాళంగా ఇవ్వవచ్చు. వీటితో పాటు వీటిని విరాళంగా ఇస్తున్నామని ఖచ్చితంగా తెలియజేసే క్లుప్తమైన లేఖను కూడా జతచేయాలి.

పథకం వేసి ఇవ్వడం

ప్రపంచవ్యాప్త రాజ్యసేవ ప్రయోజనార్థం విరాళాలివ్వడంలో, నేరుగా డబ్బునే కానుకగా ఇవ్వడం మరియు షరతు మీద ఇచ్చే విరాళాలే కాక, వేరే పద్ధతులు కూడా ఉన్నాయి. వాటిలో:

భీమా: జీవిత భీమా పాలసీకి లబ్దిదారుగా Watch Tower Society పేరును సూచించవచ్చు.

బ్యాంకు ఖాతాలు: స్థానిక బ్యాంకు నియమాల ప్రకారం బ్యాంకు ఖాతాలను, డిపాజిట్‌ సర్టిఫికెట్లను లేదా వ్యక్తిగత ఉద్యోగ విరమణ ఖాతాలను Watch Tower Society ట్రస్టుకు ఇవ్వవచ్చు లేదా మరణానంతరం వాటిని Societyకి చెల్లించే ఏర్పాటును చేయవచ్చు.

స్టాక్‌లు మరియు బాండ్లు: స్టాక్‌లను మరియు బాండ్లను పూర్తిగా కానుక రూపంలో Watch Tower Societyకి విరాళంగా ఇవ్వవచ్చు.

ఇళ్లస్థలాలు: అమ్మదగిన ఇళ్లస్థలాలను పూర్తిగా ఒక బహుమానంగా లేక ఆమె/అతడు జీవించినంత కాలం తానుండే ఆ స్థలంలో నివసించే ఏర్పాటుతో Watch Tower Societyకి విరాళంగా ఇవ్వవచ్చు. ఇలాంటి వాటికి సంబంధించిన పత్రాలను వ్రాయకముందు సొసైటీని సంప్రదించాలి.

వీలునామాలు, ట్రస్టులు: ఆస్తిని లేదా డబ్బును చట్టబద్ధంగా Watch Tower Society పేర వీలునామా వ్రాయవచ్చు, లేక ఒక ట్రస్టు అగ్రిమెంట్‌ లబ్దిదారుగా సొసైటీ పేరు వ్రాయవచ్చు. అలా సొసైటీని లబ్దిదారుగా పేర్కొంటూ వీలునామా వ్రాసేటప్పుడు దయచేసి ఇండియన్‌ సక్సెషన్‌ యాక్ట్‌, 1925 లోని సెక్షన్‌ 118ని గమనించండి, “సోదరుని లేదా సోదరి కుమారుడు లేదా కుమార్తె ఉన్న వ్యక్తి, తన మరణానికి పన్నెండు నెలల ముందు వీలునామా వ్రాస్తేనే గాని, మతపరమైన లేదా ధార్మిక అవసరాల కోసం ఆస్తిని ఇచ్చే ఎటువంటి అధికారం ఆయనకు ఉండదు. అంతేకాదు, సజీవంగా ఉన్న వ్యక్తుల వీలునామాల సంరక్షణ కోసం చట్టం ఏర్పాటుచేసిన స్థలంలో ఆ వీలునామాని ఉంచిన పక్షంలోనే అది చెల్లుతుంది.”