కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దిగజారిపోతున్న నైతిక విలువలు

దిగజారిపోతున్న నైతిక విలువలు

దిగజారిపోతున్న నైతిక విలువలు

“ఇంతకు ముందు ఎప్పుడూ అలా జరిగేది కాదు. దురాశ వల్ల నైతిక ప్రమాణాలు పూర్తిగా దిగజారిపోతున్నాయి” అని జర్మనీ మాజీ చాన్స్‌లర్‌ హల్‌ముట్‌ ష్మిట్‌ వ్యాఖ్యానించాడు. ప్రజాధికారులు అవినీతికి పాల్పడుతున్నారన్న విషయం ఇటీవల వార్తాశీర్షికల్లోకి ఎక్కినప్పుడు దాని గురించి విలపిస్తూ ఆయన ఆ వ్యాఖ్యానం చేశాడు.

చాలామంది ఆయనతో ఏకీభవిస్తారు. దేవుని వాక్యమైన బైబిలులో వేరుపారివున్న నైతిక విలువలు, ఏది తప్పో ఏది ఒప్పో నిర్ణయించుకోవటానికి ఒక నిర్దేశకంగా అనేకులు ఎంతోకాలం నుండి అంగీకరిస్తున్న నైతిక విలువలు ప్రక్కకు నెట్టివేయబడుతున్నాయి. క్రైస్తవత్వంతో నామకార్థ సంబంధం ఉన్న దేశాల్లో కూడా పరిస్థితి అలాగే ఉంది.

బైబిలు తెలియజేసే నైతికత నేటి జీవితానికి సంగతమైనదేనా?

బైబిలు బోధలపై ఆధారపడిన నైతికతలో నిజాయితీ, యథార్థత ఇమిడివున్నాయి. అయితే మోసం, దగా, అవి

నీతి సర్వవ్యాప్తంగా ఉన్నాయి. కొంతమంది అపరాధ పరిశోధకులు, “ఒక్కసారి మాదకద్రవ్యాలను పోలీసుల స్వాధీనం నుండి నేరస్థులకు తిరిగి చేరవేసి లేదా నేరప్రపంచ అధినేతలను గురించిన సాక్ష్యాలను మాయం చేసి 70 లక్షల రూపాయలు సంపాదించుకుంటున్నట్లు చెప్పబడుతుందని” లండన్‌కు చెందిన ద టైమ్స్‌ నివేదిస్తుంది. ఆస్ట్రియాలో భీమాకు సంబంధించిన మోసాలు సర్వసాధారణంగా జరుగుతుంటాయి. “జర్మన్‌ జన్యుశాస్త్రవేత్తలలో ప్రముఖుడైన” ఒక ప్రొఫెసర్‌ పెద్దమొత్తంలో సమాచారాన్ని వక్రీకరించి చెప్పడం లేక తప్పుడు సమాచారాన్ని అందజేయడం చేశాడు. ఈ విషయాన్ని అంటే, “జర్మన్‌ విజ్ఞానశాస్త్రంలోనే అత్యంత మోసకరమైన కుంభకోణాన్ని” పరిశోధకులు ఇటీవల కనుగొన్నప్పుడు జర్మనీలోని వైజ్ఞానిక వర్గం నిర్ఘాంతపోయింది.

శాశ్వత అనుబంధంగా ఉండవలసిన వివాహ బంధంలో తమ జతపట్ల యథార్థంగా ఉండడం కూడా బైబిలు ఆధారిత నైతికతలో ఒక భాగమే. కానీ చాలామంది దంపతులు చివరికి విడాకుల కోర్టులకే చేరుకుంటున్నారు. క్రైస్ట్‌ ఇన్‌ డెర్‌ గెగెన్‌వార్ట్‌ (సమకాలీన క్రైస్తవుడు) అనే క్యాథలిక్‌ వార్తాపత్రిక, “‘మతనిష్టగల’ స్విట్జర్లాండ్‌లో సహితం చాలా వివాహాలు విచ్ఛిన్నమైపోతున్నాయి” అని నివేదిస్తుంది. నెదర్లాండ్స్‌లో జరిగే వివాహాల్లో 33 శాతం విడాకులకు దారితీస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాల్లో జర్మనీలో ఏర్పడిన సామాజిక మార్పులను గమనించిన ఒక స్త్రీ, తన వ్యాకులతను ఇలా వ్యక్తపర్చింది: “వివాహం ఇప్పుడు పాత ఫ్యాషన్‌గా, పాతకాలం మనుషులకు మాత్రమే చెందినదిగా పరిగణించబడుతుంది. ప్రజలు ఇప్పుడు వివాహం చేసుకుంటున్నది జీవితాంతం కలిసివుండాలనే ఉద్దేశంతో ఎంతమాత్రం కాదు.”

మరోవైపున, బైబిలులో బోధించబడిన నైతిక ప్రమాణాలు నమ్మదగినవనీ, మన ఆధునిక ప్రపంచానికి ఎంతో సంగతమైనవనీ లక్షలాదిమంది భావిస్తున్నారు. స్విస్‌-జర్మన్‌ సరిహద్దుల్లో నివసిస్తున్న ఒక జంట, బైబిలు నైతికతలకు అనుగుణ్యంగా జీవించడాన్ని నేర్చుకోవడం తమను మరింత ఆనందభరితులను చేసినట్లు గ్రహించారు. వారి ఉద్దేశం ప్రకారం, “జీవితంలోని అన్ని అంశాలకూ ఒకే నిర్దేశకం ఉంది, అదే బైబిల్‌.”

మీరేమనుకుంటున్నారు? బైబిలు విలువైన నిర్దేశకంగా పనిచేయగలదా? బైబిలు ఆధారిత నైతికత నేడు ఆచరణాత్మకమైనదేనా?