కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బైబిలు తెలియజేసే నైతికత సర్వశ్రేష్ఠమైనదా?

బైబిలు తెలియజేసే నైతికత సర్వశ్రేష్ఠమైనదా?

బైబిలు తెలియజేసే నైతికత సర్వశ్రేష్ఠమైనదా?

“ప్రాథమిక విలువల చట్రం సమాజానికి ఎంతో అవసరం, అది సమాజ సభ్యులకు భద్రతను, నడిపింపును ఇస్తుంది.” అనుభవజ్ఞుడైన జర్మన్‌ రచయిత, టీవీ ప్రసారకుడు అయిన ఒక వ్యక్తి అలా వ్యాఖ్యానించాడు. నిజంగా అది జ్ఞానవంతమైనదే. మానవ సమాజం సుస్థిరంగా ఉండి వర్థిల్లాలంటే, తప్పొప్పులనూ మంచిచెడులనూ గుర్తిస్తూ, అందరూ సర్వసాధారణంగా అంగీకరించే ప్రమాణాల పటిష్ఠమైన పునాది ప్రజలకు అవసరం. ప్రశ్నేమిటంటే: సమాజానికీ, దాని సభ్యులకూ ఏ ప్రమాణాలు సర్వశ్రేష్ఠమైనవి?

ప్రజలు ఆమోదించే ప్రమాణాలు బైబిలులోని నైతిక ప్రమాణాలైనట్లైతే, వారు సుస్థిరమైన, ఆనందభరితమైన జీవితాలను గడిపేందుకు అవి సహాయం చేస్తాయి. తత్ఫలితంగా, ఆ విలువలను పాటిస్తూ ఎంతో ఆనందంగా, మరెంతో సుస్థిరంగావున్న సమాజం రూపొందించబడుతుంది. మరి పరిస్థితి అలాగే ఉందా? వివాహంలో నమ్మకంగా ఉండడం, అనుదిన జీవితంలో నిజాయితీగా ఉండడం అనే రెండు ముఖ్యమైన అంశాలకు సంబంధించి బైబిలు ఏమి చెప్తుందో మనం పరిశీలిద్దాము.

మీ జతకు కట్టుబడి ఉండండి

మన సృష్టికర్త ఆదామును సృష్టించి, ఆ తర్వాత ఆయనకు జతగా ఉండడానికి హవ్వను సృష్టించాడు. వారి కలయిక చరిత్రలోని మొట్టమొదటి వివాహం, అది నిరంతరం నిలిచే బంధంగా ఉండవలసింది. “పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును” అని దేవుడు చెప్పాడు. 4,000 సంవత్సరాల తర్వాత, యేసుక్రీస్తు తన అనుచరులందరికీ వివాహ ప్రమాణానికి సంబంధించిన ఈ కట్టడను పునరుక్తి చేశాడు. అంతేగాక, వివాహం వెలుపటి లైంగిక సంబంధాలను ఆయన ఖండించాడు.​—⁠ఆదికాండము 1:27, 28; 2:24; మత్తయి 5:27-30; 19:⁠5.

బైబిలు తెలియజేస్తున్నదాని ప్రకారం, ఆనందభరితమైన వివాహానికి రెండు ప్రధాన కీలకాలు ఇద్దరూ ఒకరి పట్ల ఒకరు ప్రేమా గౌరవాలు కల్గివుండడమే. కుటుంబ శిరస్సు అయిన భర్త, తన భార్యకు అవసరమైన వాటి గురించి శ్రద్ధ వహిస్తూ నిస్వార్థప్రేమను చూపించాలి. ఆయన ఆమెతో “జ్ఞానము చొప్పున” కాపురం చేయాలి, ఆమె మీద “ఆగ్రహం” వెళ్లగ్రక్కకూడదు. భార్య తన భర్తయందు “భయము కలిగియుండునట్లు” చూసుకోవాలి. వివాహిత దంపతులు ఈ సుత్రాలను అనుసరిస్తే, వైవాహిక సమస్యలను ఎన్నింటినో నివారించవచ్చు లేక పరిష్కరించుకోవచ్చు. భర్త తన భార్యకు కట్టుబడి ఉండాలి, భార్య తన భర్తకు కట్టుబడి ఉండాలి.​—⁠1 పేతురు 3:1-7; కొలొస్సయులు 3:​18, 19, NW; ఎఫెసీయులు 5:22-33.

తమ జతకు నమ్మకంగా కట్టుబడి ఉండమని చెప్తున్న బైబిలు ప్రమాణం ఆనందభరితమైన వివాహానికి దోహదపడుతుందా? జర్మనీలో నిర్వహించబడిన ఒక సర్వే ఫలితాలను పరిశీలించండి. మంచి వివాహానికి ఏవి ప్రాముఖ్యమైన కారకాలని ప్రజలను అడగడం జరిగింది. వారు చెప్పిన విషయాల్లో, ఒకరిపట్ల ఒకరు నమ్మకంగా ఉండడమన్నది ప్రథమస్థానం వహించింది. వివాహితులు తమ జత తమపట్ల నమ్మకంగా ఉన్నట్లు తెలుసుకున్నప్పుడు ఎంతో ఎక్కువ ఆనందిస్తారని మీరు అంగీకరించరా?

సమస్యలు తలెత్తితే అప్పుడేమిటి?

భార్యాభర్తల మధ్య గంభీరమైన అభిప్రాయభేదాలు ఉంటే అప్పుడేమిటి? వారికి ఒకరిమీద మరొకరికున్న ప్రేమ తగ్గిపోతే? అలాంటి పరిస్థితుల్లో ఇక అంతటితో ఆ వివాహబంధాన్ని తెంచేసుకోవడం సబబు కాదా? లేక తమ జతకు నమ్మకంగా కట్టుబడి ఉండడమనే బైబిలు ప్రమాణం అప్పుడు కూడా ఏమైనా ప్రయోజనాన్ని చేకూరుస్తుందా?

మానవ అపరిపూర్ణత మూలంగా వివాహితులందరికీ సమస్యలు తలెత్తుతాయని బైబిలు రచయితలు గుర్తించారు. (1 కొరింథీయులు 7:​28) అయినప్పటికీ, బైబిలు నైతిక ప్రమాణాలను పాటించే దంపతులు ఒకరినొకరు క్షమించుకుని సమస్యలను కలిసి పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తారు. జారత్వం లేక శారీరక హింస వంటివి జరుగుతున్న సందర్భాల్లోనైతే క్రైస్తవజత విడిపోవడం గురించి లేక విడాకులు తీసుకోవడం గురించి ఆలోచించవచ్చు. (మత్తయి 5:32; 19:⁠9) గంభీరమైన కారణం లేకుండానే లేదా మరో జతను సంపాదించుకోవాలన్న తొందరపాటుతోనే విడిపోవడం స్వార్థపూరితమైన నిర్లక్ష్యాన్ని చూపిస్తుంది. అది ఒకరి జీవితానికి స్థిరత్వాన్ని, ఆనందాన్ని ఎంతమాత్రం తీసుకురాదు. మనం ఒక ఉదాహరణను పరిశీలిద్దాం.

తన వైవాహిక జీవితం ఒకప్పుడు ఉన్నంత ఆనందభరితంగా ఇప్పుడు లేదని పీటర్‌ గ్రహించాడు. * కాబట్టి, అతడు తన భార్యను వదిలేసి మోనికాతో కలిసి జీవించడానికి వెళ్లిపోయాడు, మోనికా కూడా తన భర్తను వదిలేసి వచ్చింది. మరి పరిస్థితులు ఎలా పరిణమించాయి? మోనికాతో జీవించడం “తాను అనుకున్నంత సులభంగా లేదని” పీటర్‌ కొన్ని నెలల్లోనే అంగీకరించాడు. కారణమేమిటి? మానవ వైఫల్యాలు పాతసంబంధంలో ఎలా కనిపించాయో ఈ క్రొత్త సంబంధంలోనూ అలాగే కనిపిస్తున్నాయి. పరిస్థితిని మరింత విషమం చేస్తూ, అతడు తొందరపాటుతో తీసుకున్న స్వార్థపూరితమైన నిర్ణయం అతడిని గంభీరమైన ఆర్థిక సమస్యల్లో పడిపోయాలా చేసింది. అంతేగాక, తమ కుటుంబంలో వచ్చిన విపరీతమైన మార్పుకు మోనికా పిల్లలు బాగా కృంగిపోయారు.

ఈ అనుభవం చూపిస్తున్నట్లు, వివాహమనే ఓడ అల్లకల్లోల వాతావరణంలో చిక్కుకున్నప్పుడు ఓడను వదిలిపోవడం సమస్యను ఎంతమాత్రం పరిష్కరించదు. మరోవైపున, అలాంటి సమయంలో దేవుని వాక్యమైన బైబిలులోని నైతిక విలువల అనుసారంగా జీవించడం, తరచూ ఆ ఓడ మునిగిపోకుండా కాపాడుతూ, దాన్ని ప్రశాంత జలాల్లోకి తీసుకువస్తుంది. థామస్‌ డోరిస్‌ల విషయంలో అదే జరిగింది.

థామస్‌ డోరిస్‌ల వివాహమై 30 ఏళ్లు గడిచిపోయాక థామస్‌ విపరీతంగా త్రాగడం మొదలుపెట్టాడు. డోరిస్‌ అందుకు చాలా కృంగిపోయింది, ఇద్దరూ విడాకులు తీసుకోవడం గురించి చర్చించుకున్నారు. డోరిస్‌ ఒక యెహోవాసాక్షికి ఈ విషయాన్ని చెప్పుకుంది. ఆ సాక్షి, వివాహం గురించి బైబిలు ఏమి చెప్తుందో చూపించి, విడిపోడానికి తొందరపడకుండా తన భర్తతో కలిసి ఏదైనా పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నించమని ఆమెను ప్రోత్సహించింది. డోరిస్‌ చేసిందదే. కొన్ని నెలల్లో, వాళ్లిక విడాకుల గురించి ఆలోచించడమే మానేశారు. థామస్‌ డోరిస్‌లిద్దరూ తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి కలిసి కృషి చేశారు. బైబిలు ఉపదేశాన్ని అనుసరించడం వారి వివాహాన్ని పటిష్ఠం చేసి, తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి వారికి కావలసిన సమయాన్ని ఇచ్చింది.

అన్ని విషయాల్లోనూ నిజాయితీ

వివాహజతకు నమ్మకంగా కట్టుబడి ఉండటానికి నైతిక బలం, సరైన సూత్రాలను చిత్తశుద్ధితో అనుసరించడం అవసరం. నిజాయితీలేని ఈ లోకంలో నిజాయితీతో బ్రతకడానికి కూడా అవే లక్షణాలు అవసరం. నిజాయితీ గురించి బైబిలు ఎంతో చెప్తుంది. “అన్ని విషయాల్లోనూ నిజాయితీగా ఉండాలని మేము కోరుకుంటున్నాము” అని అపొస్తలుడైన పౌలు యూదయలోని మొదటి శతాబ్దపు క్రైస్తవులకు వ్రాశాడు. (హెబ్రీయులు 13:​18, NW) దాని భావమేమిటి?

నిజాయితీగల వ్యక్తి సత్యవంతుడిగా ఉంటాడు, మోసం చేయడు. అతడు ఇతరులతో వ్యవహరించేటప్పుడు యథార్థంగా, ముక్కుసూటిగా, గౌరవపూర్వకంగా ఉంటాడు గానీ మోసకరంగా, తప్పుదోవ పట్టించేవాడిగా ఉండడు. అంతేగాక, నిజాయితీగల వ్యక్తి యథార్థంగా ఉంటాడు, తన తోటి మనిషిని మోసగించాలనుకోడు. నిజాయితీగల ప్రజలు విశ్వాసనమ్మకాలుగల వాతావరణానికి దోహదపడతారు, అది ఆరోగ్యదాయకమైన దృక్పథాలకు నడిపించి, పటిష్ఠమైన సంబంధాలను పెంపొందింపజేస్తుంది.

నిజాయితీగల ప్రజలు ఆనందంగా ఉంటారా? అవును, ఆనందంగా ఉండడానికి వారికి కారణముంది. అవినీతి, మోసం అంతటా ప్రబలి ఉన్నప్పటికీ, లేదా ప్రబలి ఉన్నందునే కావచ్చు, నిజాయితీగల వ్యక్తులు సాధారణంగా అందరి మెప్పును పొందుతారు. యౌవనస్థులపై జరిపిన ఒక సర్వేలో, వారిలో 70 శాతం మంది నిజాయితీని ఒక సుగుణంగా పేర్కొన్నారు. అంతేగాక, మనం ఏ వయస్సు వారమైనప్పటికీ, మనం మన స్నేహితులుగా పరిగణించేవారు తప్పనిసరిగా నిజాయితీ గలవారై ఉండాలి.

క్రిస్టీన్‌కు 12 ఏళ్ల వయస్సులోనే దొంగతనం చేయడం నేర్పబడింది. సంవత్సరాలు గడుస్తుండగా ఆమె జేబులు కొట్టడంలో ప్రవీణురాలైంది. “నేను లక్షరూపాయల వరకూ ఇంటికి తీసుకువచ్చిన రోజులు కూడా ఉన్నాయి” అని ఆమె వివరిస్తుంది. కానీ క్రిస్టీన్‌ ఎన్నోసార్లు అరెస్ట్‌ చేయబడింది, జైలుకు వెళ్లే ప్రమాదం ఎప్పుడూ పొంచివుండేది. నిజాయితీ గురించి బైబిలు ఏమి చెప్తుందో యెహోవాసాక్షులు క్రిస్టీన్‌కు చెప్పినప్పుడు, ఆమె బైబిలులోని నైతిక ప్రమాణాల వైపుకు ఆకర్షించబడింది. “దొంగిలువాడు ఇకమీదట దొంగిల”కూడదని ఇవ్వబడుతున్న ఉపదేశానికి విధేయత చూపడం ఆమె నేర్చుకుంది.​—⁠ఎఫెసీయులు 4:​27, 28.

యెహోవాసాక్షులలో ఒకరిగా క్రిస్టీన్‌ బాప్తిస్మం తీసుకునే నాటికి, ఆమె ఇక ఎంతమాత్రం ఒక దొంగకాదు. యెహోవాసాక్షులు నిజాయితీకీ, ఇతర క్రైస్తవ లక్షణాలకూ ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు గనుక, ఆమె అన్నిట్లోనూ నిజాయితీగా ఉండటానికి కృషి చేస్తుంది. లూసిట్జర్‌ రండ్‌షావు ఇలా నివేదిస్తుంది: “నిజాయితీ, మితం, పొరుగువారిపట్ల ప్రేమ వంటి నైతిక పదజాలం యెహోవాసాక్షుల విశ్వాసంలో చాలా ఉన్నతంగా ఎంచబడుతుంది.” తన జీవితంలో వచ్చిన మార్పు గురించి క్రిస్టీన్‌ ఎలా భావిస్తుంది? “నేను ఇప్పుడు దొంగతనాలు మానేశాను గనుక నేనెంతో ఆనందంగా ఉన్నాను. ఇప్పుడు నేను సమాజంలో ఒక గౌరవప్రదమైన వ్యక్తినన్నట్లు భావిస్తున్నాను.”

సమాజమంతా ప్రయోజనం పొందుతుంది

తమ జతపట్ల నమ్మకంగా ఉండే ప్రజలు, నిజాయితీగా బ్రతికే ప్రజలు ఆనందంగా ఉండడమేగాక సమాజానికి ప్రయోజనం కూడా చేకూరుస్తారు. మోసం చేయని పనివాళ్లు కావాలని యజమానులు కోరుకుంటారు. నమ్మదగిన పొరుగువారు కావాలని మనం కోరుకుంటాము, యథార్థవంతులైన వ్యాపారస్థులు నడిపించే దుకాణాల్లో కొనుగోలు చేయడానికి మనం ఇష్టపడతాము. అవినీతికి పాల్పడని రాజకీయ నాయకులను, పోలీసులను, న్యాయాధికారులను మనం గౌరవించమా? సమాజ సభ్యులు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే గాక అన్ని వేళలా సూత్రబద్ధంగా జీవిస్తూ నిజాయితీగా ఉంటే సమాజం ఎంతో ప్రయోజనాన్ని పొందుతుంది.

అంతేగాక, ఒకరి పట్ల ఒకరు నమ్మకంగా ఉండే వివాహితులు సుస్థిరమైన కుటుంబాలకు పునాది వంటివారు. “సురక్షితమైన, అర్థవంతమైన మానవ జీవనానికి ఈనాటికీ [సాంప్రదాయబద్ధమైన] కుటుంబమే పట్టుగొమ్మగా ఉంది” అని చెప్పిన యూరప్‌కు చెందిన రాజకీయ నాయకునితో చాలామంది ఏకీభవిస్తారు. సమాధానకరమైన కుటుంబంలోనే పెద్దలూ పిన్నలూ భావోద్వేగపరంగా సురక్షితంగా ఉన్నట్లు భావించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకరిపట్ల ఒకరు నమ్మకంగా ఉండే వివాహితులు సుస్థిరమైన సమాజాన్ని కట్టడానికి దోహదపడతారు.

విడిచిపెట్టబడిన భార్యలు/భర్తలు, విడాకుల కోర్టులు, పిల్లల సంరక్షణ వేరుపడిన భార్య చేపట్టాలా లేదా భర్త చేపట్టాలా అనే కేసులు వంటివి అసలు లేకపోతే అందరికీ ఎంత ప్రయోజనం చేకూరుతుందో ఒక్కసారి ఆలోచించండి. జేబుదొంగలు, దుకాణాలు దోచుకునేవారు, ఆస్తులు ఆక్రమించేవారు, అవినీతిపరులైన అధికారులు, లేదా వంచకులైన శాస్త్రవేత్తలు లేనప్పుడు ఎలా ఉంటుంది? అది కేవలం ఒక కలలా అనిపిస్తుందా? బైబిలుపట్ల, అది మన భవిష్యత్తు గురించి చెప్తున్నదానిపట్ల శ్రద్ధ నిలిపేవారికి అదొక కల కాదు. త్వరలోనే యెహోవా యొక్క మెస్సీయా రాజ్యం భూమిపైనున్న మానవ సమాజాన్ని పరిపాలించడం ప్రారంభిస్తుందని దేవుని వాక్యం వాగ్దానం చేస్తుంది. ఆ రాజ్యం క్రింద, బైబిలు తెలియజేసే నైతికతలకు అనుగుణ్యంగా జీవించడం దాని పౌరులకు నేర్పించబడుతుంది. ఆ సమయంలో, “నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు.”​—⁠కీర్తన 37:⁠29.

బైబిలు తెలియజేసే నైతికత సర్వశ్రేష్ఠమైన నైతికత

పరిశుద్ధ లేఖనాలను నిశితంగా పరిశీలించిన అనేకులు, బైబిలులోని ఉపదేశం దైవిక జ్ఞానంపై ఆధారపడినదనీ, అది మానవ ఆలోచనా విధానం కంటే ఎంతో ఉన్నతమైనదనీ గుణగ్రహించారు. అలాంటి వారు బైబిలు నమ్మదగినదనీ, నేటి మన ఆధునిక ప్రపంచానికి సంగతమైనదనీ భావిస్తారు. దేవుని వాక్యంలోని ఉపదేశాన్ని అనుసరించడం తమకు ప్రయోజనం చేకూరుస్తుందని వాళ్లకు తెలుసు.

కాబట్టి అలాంటి వారు, “నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును” అన్న బైబిలు సలహాను హృదయంలోకి తీసుకుంటారు. (సామెతలు 3:​5, 6) అలా చేయడం ద్వారా, వాళ్లు తమ జీవితాలను ఎంతో మెరుగుపర్చుకుంటారు. తమ చుట్టూ ఉన్నవారి జీవితాలకు కూడా వారు ప్రయోజనం చేకూరుస్తారు. బైబిలు తెలియజేసే నైతికతను మానవజాతి అంతా పాటించే “రాబోవు జీవము”లో వాళ్లు దృఢ విశ్వాసాన్ని పెంపొందింపజేసుకుంటారు.​—⁠1 తిమోతి 4:⁠8.

[అధస్సూచి]

^ పేరా 11 ఈ శీర్షికలోని పేర్లు మార్చబడ్డాయి.

[5వ పేజీలోని బ్లర్బ్‌]

వైవాహిక జీవితంలో పెనుతుఫాను వచ్చినప్పుడు, బైబిలు ప్రమాణాలకు అనుగుణ్యంగా జీవించడం వివాహమనే ఓడను కాపాడి, దాన్ని ప్రశాంత జలాల్లోకి నడిపిస్తుంది

[6వ పేజీలోని బ్లర్బ్‌]

అవినీతి అంతటా ప్రబలి ఉన్నప్పటికీ, లేదా ప్రబలి ఉన్నందునే కావచ్చు, నిజాయితీగల వ్యక్తులు సాధారణంగా అందరి మెప్పును పొందుతారు