కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు విజయాన్ని ఎలా కొలుస్తారు?

మీరు విజయాన్ని ఎలా కొలుస్తారు?

మీరు విజయాన్ని ఎలా కొలుస్తారు?

విజయమంటే, ‘ధనం, ఆదరాభిమానాలు లేదా ఉన్నత స్థానం సంపాదించుకోవడం’ అని ఒక నిఘంటువు నిర్వచిస్తుంది. అది సంపూర్ణ నిర్వచనమేనా? విజయాన్ని కొలవడానికి ధనం, ఆదరాభిమానాలు లేదా ఉన్నత స్థానం ఇవే కొలమానాలా? జవాబిచ్చే ముందు, దీన్ని పరిశీలించండి: యేసుక్రీస్తు తన జీవితకాలంలో ఏమాత్రం ధనం సంపాదించుకోలేదు. చాలామంది ఆమోదాన్ని ఆయన పొందలేదు; అంతేగాక ఆయన కాలంనాటి ప్రముఖులు ఆయనను ఉన్నతంగా ఏమీ ఎంచలేదు. అయినప్పటికీ యేసు విజయవంతమైన వ్యక్తే. ఎందుకు?

యేసు భూమి మీద ఉన్నప్పుడు “దేవునియెడల ధనవంతుడు”గా ఉన్నాడు. (లూకా 12:​21) ఆయన పునరుత్థానం చేయబడిన తర్వాత దేవుడు ఆయనకు “మహిమా ప్రభావముల” కిరీటాన్ని ధరింపజేసి ఆయనకు ప్రతిఫలమిచ్చాడు. యెహోవా తన కుమారుడ్ని “అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను.” (హెబ్రీయులు 2:9; ఫిలిప్పీయులు 2:​11) యేసు అనుసరించిన జీవన విధానం యెహోవా హృదయాన్ని సంతోషపర్చింది. (సామెతలు 27:​11) ఆయన భూజీవితం విజయవంతమైంది, ఎందుకంటే అది దాని సంకల్పాన్ని నెరవేర్చింది. యేసు, దేవుని చిత్తాన్ని నెరవేర్చి, ఆయన నామానికి ఘనతను తెచ్చాడు. తత్ఫలితంగా, దేవుడు యేసుకు ఏ విద్యావిషయక, రాజకీయ, లేక క్రీడాసంబంధిత వీరులు కూడా పొందలేనంతటి ధనాన్ని, కీర్తిని, పదవిని ఇచ్చి ఘనపరిచాడు. నిజంగా యేసు భూమి మీద జీవించిన వారిలోకెల్లా అత్యంత విజయవంతమైన వ్యక్తి.

తమ పిల్లలు యేసులా దేవుని యందు ధనవంతులై క్రీస్తు అడుగుజాడలను అనుసరిస్తే, వారు ఇప్పుడు గొప్ప ఆశీర్వాదాలను పొంది, రాబోయే విధానంలో ఊహించనలవికానన్ని ప్రతిఫలాలను అందుకుంటారని క్రైస్తవ తల్లిదండ్రులు గుర్తిస్తారు. క్రీస్తు అడుగుజాడలను అనుసరిస్తూ సాధ్యమైతే పూర్తికాల పరిచర్య చేస్తూ, యేసు చేసినట్లుగా చేయడం కన్నా ఒక యౌవనస్థునికి మరింత శ్రేష్ఠమైన మార్గం మరొకటి లేదు.

అయితే, కొన్ని సంస్కృతుల్లో, వాడుకలో ఉన్న ఆచారం ఏమిటంటే యౌవనస్థులు పూర్తికాల పరిచర్యను చేపట్టకపోవడం. ఒక యౌవనస్థుడు తన విద్యను ముగించిన తర్వాత, ఉద్యోగం సంపాదించుకుని వివాహం చేసుకుని స్థిరపడాలని ఆ సంస్కృతుల్లోని వారు అపేక్షిస్తారు. అలాంటి నేపథ్యాలుగల యౌవనస్థులు అదే సరైనదని పొరబడుతూ, పూర్తికాల పరిచర్యలోకి ప్రవేశించరు. (సామెతలు 3:​27) ఎందుకు? ఒత్తిడి మూలంగా వాళ్లు ప్రబలంగా ఉన్న సాంస్కృతిక ప్రమాణాలకు కట్టుబడిపోతారు. రాబర్ట్‌కు జరిగినదదే. *

సంస్కృతికి, మనస్సాక్షికి ఘర్షణ వచ్చినప్పుడు

రాబర్ట్‌ యెహోవాసాక్షిగా పెరిగాడు. యౌవనంలో అతని ప్రవర్తన, సహవాసుల ఎంపిక ఏమంత అభిలషణీయమైనవిగా లేవు. అతని తల్లి అతని గురించి చింతించడం మొదలుపెట్టింది. కాబట్టి, తన కుమారుడ్ని ప్రోత్సహించమని యెహోవాసాక్షుల పూర్తికాల పరిచారకుడైన ఒక పయినీరును ఆమె కోరింది. తర్వాత ఏమి జరిగిందో రాబర్ట్‌ ఇలా వివరిస్తున్నాడు.

“ఆ పయినీరు సహోదరుడు చూపించిన ఆసక్తిని బట్టి నేను నిజంగా ఆనందించాను. నేను నా విద్య ముగించిన వెంటనే పయినీరింగ్‌ ప్రారంభించాలనుకునేలా ఆయన మంచి మాదిరి నన్ను ప్రోత్సహించింది. సరిగ్గా అప్పుడే అమ్మ మళ్లీ చింతించడం మొదలుపెట్టింది, అయితే ఈసారి మరో కారణంచేత. మా సంస్కృతి ప్రకారం, చదువు ముగిసిన వెంటనే పయినీరింగ్‌ చేయడం అమ్మాయి విషయంలో అయితే ఫరవాలేదు గానీ, అబ్బాయి మాత్రం మొదట ఆర్థికంగా స్థిరపడి ఆ తర్వాతే పయినీరింగ్‌ గురించి ఆలోచించాలి.

“నేను ఒక వృత్తివిద్య నేర్చుకుని నా స్వంత వ్యాపారం మొదలుపెట్టాను. త్వరలోనే నేను వ్యాపారంలో పూర్తిగా మునిగిపోయి, కేవలం యాంత్రికంగా కూటాలకు హాజరవుతూ, ప్రకటనాపని చేస్తున్నాను. నా మనస్సాక్షి నన్ను వేధించేది​—⁠నేను మరింతగా యెహోవా సేవ చేయగలనని నాకు తెలుసు. అంతేగాక, ఇతరులు నా నుండి అపేక్షిస్తున్న దాని నుండి విడివడడానికి నిజమైన పోరాటం అవసరం, అయితే అది నేను చేయగల్గినందుకు ఎంతో సంతోషిస్తున్నాను. నాకిప్పుడు వివాహమైంది, గత రెండేళ్లుగా నేను నా భార్య పయినీరు సేవ చేస్తున్నాము. ఇటీవల నేను సంఘంలో పరిచర్య సేవకునిగా నియమించబడ్డాను. నేను నా పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో యెహోవా సేవ చేయగల్గుతున్నందుకు నిజమైన సంతృప్తి లభిస్తుందని ఇప్పుడు నేను యథార్థంగా చెప్పగలను.”

సాధ్యమైతే యౌవనస్థులు పాఠశాలలో ఉండగానే, ఏదైనా వృత్తివిద్య నేర్చుకోవాలనీ లేక ప్రయోజనకరమైన అర్హతలేవైనా సంపాదించుకోవాలనీ ఈ పత్రిక పదే పదే ప్రోత్సహించింది. అలా చేయడం దేని కోసం? ధనవంతులయ్యేందుకా? లేదు. వాళ్లు పెద్దవారైన తర్వాత తమ కాళ్ల మీద తాము నిలబడి, ప్రాముఖ్యంగా పూర్తికాల పరిచర్యలో తమకు సాధ్యమైనంత సంపూర్ణంగా యెహోవా సేవ చేయగల్గుతారన్నదే ప్రధాన కారణం. అయితే తరచూ జరిగినదేమిటంటే, యౌవనస్థులు తమ లౌకిక ఉద్యోగంలో ఎంతగా నిమగ్నమైపోతారంటే, వాళ్లు పరిచర్యకిచ్చే ప్రాధాన్యత తగ్గిపోతుంది. కొందరైతే అసలు పూర్తికాల సేవను చేపట్టడం గురించే తలంచరు. ఎందుకని?

రాబర్ట్‌ చేసిన వ్యాఖ్యానాలు ఈ అంశంపై కొంత వెలుగును ప్రసరింపజేశాయి. రాబర్ట్‌ వృత్తివిద్యను నేర్చుకున్న తర్వాత ఇక వ్యాపారం మొదలుపెట్టాడు. త్వరలోనే, అతడు సూచనార్థకంగా చెప్పాలంటే, వ్యాయామం కోసం తిరిగే బెల్టుమీద ఒకేచోట నిలబడి ఉంటూనే పరుగెడుతున్నట్లు, లేదా ఒక గానుగ చుట్టూ తిరుగుతున్నట్లు అయిపోయాడు. ఆర్థికంగా భద్రంగా ఉండాలన్నది ఆయన లక్ష్యం. అయితే క్రైస్తవ సంఘం లోపలవున్నవారు లేదా దాని వెలుపలవున్నవారు ఎవరైనా ఎన్నడైనా ఆ లక్ష్యాన్ని చేరుకోగలిగారా? క్రైస్తవులు ఆర్థికపరంగా నమ్మదగినవారిగా ఉంటూ, తమ ఆర్థికసంబంధమైన బాధ్యతలను శ్రద్ధతో నిర్వర్తించాలి; అయితే అనిశ్చయమైన ఈ కాలాల్లో, తాము ఆర్థికంగా భద్రత కల్గివున్నామని నిజంగా పరిగణించగల స్థానానికి ఏ కొద్దిమందో గానీ చేరుకోలేరు అన్న విషయాన్ని కూడా గ్రహించాలి. అందుకే మత్తయి 6:33 లో వ్రాయబడివున్న యేసు చేసిన వాగ్దానం క్రైస్తవులకు ఎంతో ఓదార్పునిస్తుంది.

తాను తన సంస్కృతి నిర్దేశించేదాన్ని గాక తన హృదయ కోరికలను అనుసరించడానికి నిర్ణయించుకున్నందుకు రాబర్ట్‌ సంతోషిస్తున్నాడు. నేడు, ఆయన పూర్తికాల పరిచర్యలో ఉన్నాడు. అవును, పూర్తికాల పరిచర్య గౌరవప్రదమైన పని. రాబర్ట్‌ మాటల్లోనే చెప్పాలంటే, తాను ‘తన పూర్ణ శక్తితో’ యెహోవా సేవ చేయగల్గుతున్నందుకు ఆయన ఎంతో ప్రశాంతతను అనుభవిస్తున్నాడు.

మీ ప్రజ్ఞాపాటవాలను చక్కగా ఉపయోగించుకోండి

యెహోవాసాక్షులలో ఎంతోమంది చక్కని నైపుణ్యాలు గలవారు ఉన్నారు. కొంతమంది విశేషమైన బుద్ధికుశలత ఉన్నవారు; మరి కొందరు శారీరక శ్రమ విషయంలో ఎంతో ప్రజ్ఞ గలవారు. ఈ బహుమానాలన్నీ యెహోవా ఇచ్చినవే, ఎందుకంటే ఆయన “అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు.” (అపొస్తలుల కార్యములు 17:​25) జీవమే లేకపోతే ఈ బహుమానాలన్నీ వ్యర్థమే.

కాబట్టి మనం మన సమర్పిత జీవితాలను యెహోవా సేవలో ఉపయోగించడం సరైనది. ప్రజ్ఞావంతుడైన ఒక వ్యక్తి ఆ నిర్ణయమే తీసుకున్నాడు. ఆయన సా.శ. మొదటి శతాబ్దంలో జీవించాడు. పేరున్న కుటుంబానికి చెందిన ఆయన తన యౌవనదశను కిలికియలోని పేరుగాంచిన తార్సు నగరంలో గడిపాడు. అతడు జన్మతః యూదుడే అయినప్పటికీ తన తండ్రి నుండి రోమా పౌరసత్వాన్ని వారసత్వంగా పొందాడు. దానితో ఆయనకు ఎన్నో హక్కులు, ఆధిక్యతలు లభించాయి. ఆయన పెద్దవాడైనప్పుడు, ఆ కాలం నాటి ప్రముఖులైన “ప్రొఫెసర్‌”లలో ఒకరైన గమలీయేలు దగ్గర న్యాయశాస్త్రాన్ని అభ్యసించాడు. త్వరలోనే ‘ధనం, ఆదరాభిమానాలు, ఉన్నతస్థానం’ ఆయన కైవసం అవుతాయన్నట్లు కనిపించింది.​—⁠అపొస్తలుల కార్యములు 21:39; 22:3, 27, 28.

ఎవరీ యౌవనస్థుడు? ఆయన పేరు సౌలు. అయితే ఈ సౌలు క్రైస్తవుడై చివరికి అపొస్తలుడైన పౌలు అయ్యాడు. ఆయన తనకు మునుపు ఉండిన ఆశయాలను ప్రక్కనబెట్టి, క్రైస్తవునిగా తన జీవితమంతటినీ యెహోవా సేవకే అంకితం చేశాడు. పౌలు ప్రముఖుడైన న్యాయవాదిగా పేరుతెచ్చుకోలేదు గానీ అత్యంతాసక్తిగల సువార్త ప్రచారకునిగా పేరుగాంచాడు. దాదాపు 30 సంవత్సరాలు మిషనరీగా గడిపిన తర్వాత, పౌలు ఫిలిప్పీలోని తన స్నేహితులకు ఒక లేఖ వ్రాశాడు. దానిలో, తాను క్రైస్తవుడిగా మారక ముందు సాధించిన కొన్ని సాఫల్యాల గురించి సమీక్షించి, తర్వాత ఇలా అన్నాడు: “నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తునుగూర్చిన అతి శ్రేష్ఠమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను.” (ఫిలిప్పీయులు 3:⁠8) పౌలు తాను తన జీవితాన్ని గడిపిన విధానాన్ని బట్టి ఎంతమాత్రం విచారించలేదు!

పౌలు గమలీయేలు నుండి పొందిన శిక్షణ విషయమేమిటి? అది ఆయనకేమాత్రమైనా ఉపయోగపడిందా? తప్పకుండా ఉపయోగపడింది! ఎన్నో సందర్భాల్లో ఆయన ‘సువార్తపక్షాన వాదించటానికి, దానిని స్థిరపరచటానికి’ తన మద్దతునిచ్చాడు. అయితే పౌలు ప్రధానమైన పని సువార్త ప్రచారకునిగా సేవ చేయడమే; ఆయన మునుపు పాఠశాలలో నేర్చుకున్న విషయాలు దీన్ని ఆయనకు బోధించి ఉండకపోవచ్చు.​—⁠ఫిలిప్పీయులు 1:7; అపొస్తలుల కార్యములు 26:24, 25.

అలాగే నేడు, కొందరు తమ నైపుణ్యాలను, ప్రజ్ఞాపాటవాలను, చివరికి తమ విద్యను రాజ్యాసక్తులను పెంపొందింపజేసేందుకు ఉపయోగించగల్గుతున్నారు. ఉదాహరణకు, ఏమీకి ఆర్థికశాస్త్రంలోనూ, న్యాయశాస్త్రంలోనూ యూనివర్సిటీ డిగ్రీ ఉంది. ఒకప్పుడు ఆమె న్యాయవాదిగా ఎంతో ఆర్జించేది, కాని ఇప్పుడామె వాచ్‌టవర్‌ సొసైటీ బ్రాంచి కార్యాలయాల్లోని ఒకదానిలో స్వచ్ఛంద సేవకురాలిగా సేవచేస్తుంది. ఏమీ ఇప్పటి తన జీవితాన్ని ఇలా వర్ణిస్తుంది: “నేను, నా జీవితంలో సర్వశ్రేష్ఠమైన ఎంపిక చేసుకున్నానని నేను భావిస్తున్నాను. . . . నేను యూనివర్సిటీలో నా తోటి విద్యార్థులుగా ఉన్నవారు చేస్తున్న ఉద్యోగాల్ని ఎప్పుడూ ఆశగా చూడలేదు. నేను చేసుకున్న ఎంపికను బట్టి నేనెంతో గర్విస్తున్నాను. నాకు కావలసినవన్నీ నా దగ్గరున్నాయి​—⁠సంతృప్తికరమైన సంతోషకరమైన జీవితం, సంతుష్టిసహితమైన పని.”

ఏమీ తనకు మనశ్శాంతిని, సంతృప్తిని, యెహోవా ఆశీర్వాదాన్ని తెచ్చిన జీవన విధానాన్ని ఎంపిక చేసుకుంది. క్రైస్తవ తల్లిదండ్రులు తమ పిల్లలకు అంతకంటే ఎక్కువ కావాలనేమీ ఆశించరు!

క్రైస్తవ పరిచర్యలో విజయం

అయితే, క్రైస్తవ పరిచర్యలో విజయం సాధించడం గురించి సరైన దృక్పథం కల్గివుండడం ప్రాముఖ్యమే. మనం బైబిలు సాహిత్యాన్ని అందిస్తూ లేదా ఇంటివారితో ఆసక్తి రేకెత్తించే విధంగా బైబిలు చర్చలు జరుపుతూ పరిచర్యలో ఆనందంగా సమయాన్ని గడిపినప్పుడు మనం విజయం సాధించినట్లు తప్పక భావిస్తాము. కానీ మనం చెప్పేది వినేవారెవరూ లేనప్పుడు, మనం మన సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నామని భావించే అవకాశం ఉంది. అయితే, విజయం యొక్క నిర్వచనాల్లో ‘ఆదరాభిమానాలను పొందడం’ అన్నది కూడా చేరి ఉందని గుర్తుంచుకోండి. మనం ఎవరి ఆదరాభిమానాలను పొందాలని కోరుకుంటాము? అందులో ఎటువంటి సందేహమూ లేదు, యెహోవా ఆదరాభిమానాలనే. ప్రజలు మన సందేశాన్ని విన్నా వినకపోయినా మనం దీన్ని పొందుతాము. యేసు ఈ విషయంలో తన శిష్యులకు ఒక శక్తివంతమైన పాఠాన్ని బోధించాడు.

యేసు 70 మంది ప్రచారకులను “తాను వెళ్లబోవు ప్రతి ఊరికిని ప్రతిచోటికిని” ముందుగా పంపించాడని గుర్తుంచుకోండి. (లూకా 10:⁠1) వాళ్లు యేసు తమ వెంట లేకుండానే పట్టణాల్లోనూ, గ్రామాల్లోనూ ప్రకటించాలి. ఇది వారికి క్రొత్త అనుభవం. కాబట్టి వారిని పంపే ముందు యేసు వారికి సవివరమైన ఉపదేశాలను ఇచ్చాడు. వాళ్లు ‘సమాధాన పాత్రుడిని’ కలిస్తే, అతనికి రాజ్యం గురించి కూలంకషంగా సాక్ష్యం ఇవ్వాలి. అయితే, వాళ్లు నిరాకరించబడినప్పుడు ఏమాత్రం చింతించకుండా తమ దారిన తాము వెళ్లిపోవాలి. వీళ్లు చెప్పేది వినడానికి నిరాకరించే వాళ్లు నిజానికి యెహోవానే నిరాకరిస్తున్నట్లని యేసు వివరించాడు.​—⁠లూకా 10:4-7, 16.

ఆ 70 మంది తమ ప్రకటనా పనిని ముగించినప్పుడు, వాళ్లు “సంతోషముతో తిరిగివచ్చి​—⁠ప్రభువా, దయ్యములు కూడ నీ నామమువలన మాకు లోబడుచున్నవని” యేసుకు చెప్పారు. (లూకా 10:​17) శక్తివంతమైన ఆత్మ ప్రాణులను వెళ్లగొట్టడం అపరిపూర్ణులైన ఆ వ్యక్తులకు ఎంతో ఉత్తేజకరమైనదిగానే అనిపించి ఉండవచ్చు! అయితే, “దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడియున్నవని సంతోషించుడని” యేసు ఔత్సాహికులైన తన శిష్యులను హెచ్చరించాడు. (ఇటాలిక్కులు మావి.) (లూకా 10:​20) ఆ 70 మందికి దయ్యాలను వెళ్లగొట్టే శక్తి ఎప్పటికీ ఉంటుండకపోవచ్చు, వాళ్లు పరిచర్యలో ఎప్పుడూ అనుకూల ఫలితాలనే పొందలేకపోతుండవచ్చు. కానీ వాళ్లు నమ్మకంగా ఉంటే, వాళ్లకు యెహోవా అంగీకారం ఎప్పటికీ ఉంటుంది.

మీకు పూర్తికాల సేవకులపట్ల మెప్పుదల ఉందా?

ఒక యౌవనస్థుడు ఒకసారి ఒక క్రైస్తవ పెద్దతో ఇలా అన్నాడు: “నేను పాఠశాల చదువు ముగించిన తర్వాత, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తాను. నాకు ఉద్యోగం గనుక దొరకకపోతే, పూర్తికాల పరిచర్య ప్రారంభించడం గురించి ఆలోచిస్తాను.” అయితే పయినీర్‌ సేవను ప్రారంభించిన అనేకుల అభిప్రాయం అది కాదులెండి. పయినీరు సేవ చేయడానికి, కొంతమంది లాభదాయకమైన ఉద్యోగావకాశాలను వదులుకున్నారు. మరికొంతమంది ఎంతో మంచి విద్యావకాశాలను వదులుకున్నారు. అపొస్తలుడైన పౌలులా వాళ్లు త్యాగాలు చేశారు, కానీ పౌలులాగానే, రాబర్ట్‌, ఏమీలు కూడా తాము చేసుకున్న ఎంపికను బట్టి ఎంతమాత్రం విచారించరు. తాము ఇవ్వగల్గిన శ్రేష్ఠమైన దాన్ని పొందడానికి అర్హుడైన యెహోవాను స్తుతించేందుకు తమకున్న సామర్థ్యాలను ఉపయోగించటానికి గల ఆధిక్యతను వాళ్లు ఎంతో అపురూపంగా ఎంచుతారు.

చాలా కారణాలను బట్టి, యెహోవా నమ్మకమైన సాక్షులలో చాలామంది పయినీరు సేవచేసే స్థితిలో లేరు. బహుశా వాళ్లకు నిర్వర్తించవలసిన లేఖనాధార బాధ్యతలు ఉండవచ్చు. అయినప్పటికీ, వాళ్లు పూర్ణ ‘హృదయంతో, ఆత్మతో, మనస్సుతో’ దేవుని సేవ చేయగల్గితే, యెహోవా వారిని బట్టి ఆనందిస్తాడు. (మత్తయి 22:​37) తాము పయినీరు సేవ చేయలేకపోయినప్పటికీ, పయినీరు సేవ చేయడాన్ని ఎంపిక చేసుకున్న వారు సరైన ఎంపిక చేసుకున్నారని వాళ్లు గుర్తిస్తారు.

“ఈ లోక మర్యాదను అనుసరింప” వద్దని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. (రోమీయులు 12:⁠2) పౌలు ఇచ్చిన ఉపదేశానికి అనుగుణ్యంగా, ఈ విధానపు సాంస్కృతిక లేక లౌకిక ప్రమాణాలు మన ఆలోచనా విధానాన్ని మలిచేందుకు మనం అనుమతించకూడదు. మీరు పయినీరు సేవ చేయగల్గినా లేకపోయినా, యెహోవా సేవకు మీ జీవితంలో ప్రధమస్థానం ఇవ్వండి. యెహోవా అంగీకారం ఉన్నంత వరకు మీరు విజయం సాధిస్తారు.

[అధస్సూచి]

^ పేరా 5 పేర్లు మార్చబడ్డాయి.

[19వ పేజీలోని చిత్రం]

ఎక్కడికీ చేరుకోలేని సూచనార్థకమైన ట్రెడ్‌మిల్‌లో ఇరుక్కుపోకండి