కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

క్రైస్తవులు సేవచేయడంలో ఆనందాన్ని పొందుతారు

క్రైస్తవులు సేవచేయడంలో ఆనందాన్ని పొందుతారు

క్రైస్తవులు సేవచేయడంలో ఆనందాన్ని పొందుతారు

“పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము”​—⁠అపొస్తలుల కార్యములు 20:⁠35.

1. నేడు ఏ తప్పుడు దృక్పథం ప్రబలంగా ఉంది, అది ఎందుకు హానికరమైనది?

పంతొమ్మిదవ శతాబ్దపు చివరి దశాబ్దాల్లో, “నేనే-ముందు” అనే ధోరణి ఎక్కువగా కనిపించేది. అలాంటి ధోరణి, ఇతరులపట్ల ఏమాత్రం శ్రద్ధలేని స్వార్థపూరితమైన అత్యాశతోకూడిన దృక్పథాన్ని సూచిస్తుంది. ఇరవయ్యవ శతాబ్దంలో కూడా ఆ ధోరణి ఏమాత్రం అంతరించిపోలేదని మనం కచ్చితంగా చెప్పవచ్చు. “నాకేం ఒరుగుతుంది?” లేదా, “దాని వల్ల నాకేమిటి లాభం” వంటి ప్రశ్నలను మనం ఎన్నిసార్లు వినలేదు? అలాంటి స్వార్థపూరిత దృక్పథం మన సంతోషానికి దోహదకారి కాదు. “పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము” అని యేసు చెప్పిన సూత్రానికి అది పూర్తి విరుద్ధం.​—⁠అపొస్తలుల కార్యములు 20:⁠35.

2. ఇవ్వడం ఆనందాన్ని తెస్తుందని ఎలా చూశాము?

2 తీసుకోవడం కన్నా ఇవ్వడం ఎక్కువ ఆనందాన్ని తెస్తుందన్నది నిజమేనా? నిజమే. యెహోవా దేవుడి గురించి ఆలోచించండి. ఆయన “యొద్ద జీవపు ఊట కలదు.” (కీర్తన 36:⁠9) మనం సంతోషంగా ఫలవంతంగా ఉండడానికి కావలసినవన్నీ ఆయన అనుగ్రహిస్తాడు. నిజానికి ఆయన, “శ్రేష్ఠమైన ప్రతి యీవియు సంపూర్ణమైన ప్రతి వరమును” అనుగ్రహిస్తాడు. (యాకోబు 1:​17) “శ్రీమంతుడగు దేవుడు” అయిన యెహోవా ఎడతెగక ఇస్తూనే ఉన్నాడు. (1 తిమోతి 1:⁠8-11) ఆయన తన మానవ సృష్టిని ఎంతో ప్రేమిస్తున్నాడు, ఆయన వారికోసం ఎన్నో అనుగ్రహిస్తున్నాడు. (యోహాను 3:​16) ఉదాహరణకు, ఒక మానవ కుటుంబం గురించి ఆలోచించండి. మీరు గనుక తల్లి లేదా తండ్రి అయితే, ఒక్క పిల్లవాడిని పెంచి పెద్దచేయడానికే ఎన్ని త్యాగాలు చేయవలసి ఉంటుందో, ఎంత ఇవ్వవలసి ఉంటుందో మీకు తెలిసే ఉండవచ్చు. చాలా సంవత్సరాల పాటు ఆ పిల్లవాడు మీరు చేసే త్యాగాలను గ్రహించను కూడా గ్రహించలేడు. వాటిని అసలు ఆ పిల్లవాడు పట్టించుకోడు. మీరు నిస్వార్థంగా ఇవ్వడం మూలంగా ఆ పిల్లవాడు వర్ధిల్లడం చూసి మీరెంతో ఆనందిస్తారు. ఎందుకు? ఎందుకంటే మీరు వాడిని ప్రేమిస్తున్నారు గనుక.

3. యెహోవాకు, మన తోటి విశ్వాసులకు సేవ చేయడం ఎందుకు ఆనందదాయకమైనది?

3 అదేవిధంగా, ప్రేమపూర్వకంగా ఇవ్వడం సత్యారాధనకు ఒక చిహ్నం. మనం యెహోవాను, మన తోటి విశ్వాసులను ప్రేమిస్తాము గనుక, వారికి సేవచేయడమే గాక మనల్ని మనం వారికి అంకితం చేసుకోవడం మనకు సంతోషాన్నిస్తుంది. (మత్తయి 22:​37-39) స్వార్థపూరిత దృక్పథాలతో ఆరాధించేవారు ఎక్కువ ఆనందాన్ని పొందలేరు. అయితే తాము ఏమి పొందగలము అనేదాని కన్నా తాము ఏమివ్వగలము అనేదానిపట్ల ఎక్కువ శ్రద్ధకల్గివుండి నిస్వార్థంగా సేవచేసేవారు నిజానికి ఆనందాన్ని పొందుతారు. మన ఆరాధనతో సంబంధమున్న కొన్ని బైబిలు పదాలు లేఖనాల్లో ఎలా ఉపయోగించబడ్డాయన్నది పరిశీలించడం ద్వారా ఆ సత్యాన్ని కనుగొనవచ్చు. ఈ శీర్షికలోనూ, తర్వాతి శీర్షికలోనూ ఈ పదాల్లో మూడింటిని మనం చర్చిద్దాము.

యేసు చేసిన ప్రజాసేవ

4. క్రైస్తవమత సామ్రాజ్యంలోని “ప్రజాసేవ” నైజం ఏమిటి?

4 ఆదిమ గ్రీకులో, ఆరాధనకు సంబంధించిన ఒక ప్రాముఖ్యమైన పదం లైటోర్‌జీయ, అది న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌లో “ప్రజాసేవ” అని అనువదించబడింది. లైటోర్‌జీయ అనే ఈ పదం క్రైస్తవమత సామ్రాజ్యంలో “లీటర్జీ” అనే ఆంగ్లపదాన్ని ఉద్భవింపజేసింది, దీనికి తెలుగులో “ఆచారకర్మలు” అని భావం. * అయితే, క్రైస్తవమత సామ్రాజ్యంలోని లాంఛనప్రాయంగా జరిగే ఆచారకర్మలు నిజంగా ప్రయోజనకరమైన ప్రజాసేవ కాదు.

5, 6. (ఎ) ఇశ్రాయేలులో ఏవిధమైన ప్రజాసేవ జరిగేది, దానివల్ల చేకూరిన ప్రయోజనాలేమిటి? (బి) ఇశ్రాయేలులో జరిగిన ప్రజాసేవ స్థానాన్ని మరింత ఘనమైన ఏ ప్రజాసేవ తీసుకుంది, ఎందుకు?

5 ఇశ్రాయేలు యాజకులను ఉద్దేశిస్తూ అపొస్తలుడైన పౌలు లైటోర్‌జీయకు సంబంధించిన ఒక గ్రీకుపదాన్ని ఉపయోగించాడు. ఆయనిలా అన్నాడు: “ప్రతి యాజకుడు దినదినము సేవ [“ప్రజాసేవ,” NW] [లైటోర్‌జీయ యొక్క ఒక రూపం] చేయుచు, పాపములను ఎన్నటికిని తీసివేయలేని ఆ బలులనే మాటిమాటికి అర్పించుచు ఉండును.” (హెబ్రీయులు 10:​11) లేవీయులైన యాజకులు ఇశ్రాయేలులో ఎంతో విలువైన ప్రజాసేవను అందజేసేవారు. వారు దేవుని ధర్మశాస్త్రాన్ని బోధించి, ప్రజలందరి పాపాలను కప్పే బలులను అర్పించేవారు. (2 దినవృత్తాంతములు 15:3; మలాకీ 2:⁠7) యాజకులు, ప్రజలు యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించినప్పుడు, ఆ జనాంగం ఎంతో ఆనందంగా ఉండేది.​—⁠ద్వితీయోపదేశకాండము 16:⁠15.

6 ధర్మశాస్త్రం క్రింద ప్రజాసేవ చేయగల్గడం ఇశ్రాయేలు యాజకులకు లభించిన నిజమైన ఆధిక్యత, కానీ ఇశ్రాయేలీయులు తమ అవిశ్వాసాన్ని బట్టి నిరాకరించబడినప్పుడు వారి సేవలకు ఏ విలువా లేకుండాపోయింది. (మత్తయి 21:​43) యెహోవా మరింత ఘనమైనదాన్ని అంటే మహాగొప్ప ప్రధాన యాజకుడైన యేసు అందజేసే ప్రజాసేవను ఏర్పాటు చేశాడు. ఆయన గురించి మనమిలా చదువుతాము: “ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయెను. ఈయన తనద్వారా దేవునియొద్దకు వచ్చువారి పక్షమున, విజ్ఞాపనముచేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడైయున్నాడు.”​—⁠హెబ్రీయులు 7:24, 25.

7. యేసు చేసిన ప్రజాసేవ ఎందుకు సాటిలేని ప్రయోజనాలను చేకూరుస్తుంది?

7 యేసు తన తర్వాత మరెవరూ ఆ పనిని చేపట్టవలసిన అవసరం లేకుండా నిరంతరం తానే యాజకునిగా కొనసాగుతాడు. కాబట్టి, ఆయన మాత్రమే ప్రజలను పూర్తిగా రక్షించగలడు. మానవ నిర్మిత ఆలయంలో కాదుగానీ, సా.శ. 29 లో కార్యనిర్వహణ ప్రారంభించిన యెహోవా గొప్ప ఆరాధనా ఏర్పాటైన సూచనార్థక దేవాలయంలో యేసు సాటిలేని ప్రజాసేవను అందజేస్తాడు. యేసు ఇప్పుడు ఆ ఆలయంలోని అతిపరిశుద్ధ స్థలంలో అంటే పరలోకంలో సేవచేస్తున్నాడు. ఆయన “పరిశుద్ధాలయమునకు, అనగా మనుష్యుడుకాక [యెహోవాయే] స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై [లైటర్‌గోస్‌] [“ప్రజాసేవకుడై,” NW]” ఉన్నాడు. (హెబ్రీయులు 8:1; 9:​11, 12) యేసు స్థానం ఎంత ఉన్నతమైనదైనప్పటికీ, ఆయన ‘ప్రజాసేవకుడే.’ ఆయన తన ఉన్నతమైన అధికారాన్ని, ఇవ్వడానికే ఉపయోగిస్తాడు గానీ తీసుకోవడానికి కాదు. అలా ఇవ్వడం ఆయనకు ఆనందాన్నిస్తుంది. అది ఆయన “యెదుట ఉంచబడిన ఆనందము”లో ఒక భాగం. భూమిపై తన జీవితమంతటిలోనూ సహనం కల్గివుండడానికి అది ఆయనను బలపర్చింది.​—⁠హెబ్రీయులు 12:⁠1.

8. ధర్మశాస్త్ర నిబంధనను తీసివేసే ప్రజాసేవను యేసు ఎలా నిర్వహించాడు?

8 యేసు చేసిన ప్రజాసేవలో మరో అంశం ఉంది. పౌలు ఇలా వ్రాశాడు: “ఈయనయైతే ఇప్పుడు మరియెక్కువైన వాగ్దానములనుబట్టి నియమింపబడిన మరి యెక్కువైన నిబంధనకు మధ్యవర్తియైయున్నాడు గనుక మరి శ్రేష్ఠమైన సేవకత్వము పొందియున్నాడు.” (హెబ్రీయులు 8:⁠6) యెహోవాతో ఇశ్రాయేలుకున్న సంబంధానికి ఆధారమైవున్న నిబంధనకు మోషే మధ్యవర్తిగా ఉన్నాడు. (నిర్గమకాండము 19:​4, 5) అనేక జనాంగాల నుండి వచ్చిన ఆత్మాభిషిక్త క్రైస్తవులతో రూపొందించబడిన “దేవుని ఇశ్రాయేలు” అయిన క్రొత్త జనాంగం ఉద్భవించడాన్ని సాధ్యం చేసిన ఒక క్రొత్త నిబంధనకు యేసు మధ్యవర్తిగా ఉన్నాడు. (గలతీయులు 6:16; హెబ్రీయులు 8:8, 13; ప్రకటన 5:​9, 10) అది ఎంత చక్కని ప్రజాసేవ! యెహోవాకు అంగీకృతమైన ఆరాధనను మనం ఎవరి ద్వారానైతే చెల్లించగలమో ఆ ప్రజాసేవకుడైన యేసుతో సన్నిహిత సంబంధం కల్గివుండడానికి మనం ఎంత ఆనందిస్తామో కదా!​—⁠యోహాను 14:⁠6.

క్రైస్తవులు కూడా ప్రజాసేవ చేస్తారు

9, 10. క్రైస్తవులు చేసే కొన్ని రకాల ప్రజాసేవలు ఏవి?

9 ఏ మానవుడూ యేసు చేసినంతగా ప్రజాసేవ చేయలేడు. అయితే అభిషిక్త క్రైస్తవులు తమ పరలోక ప్రతిఫలాన్ని పొందినప్పుడు, యేసు ప్రక్కన తమ స్థానాలను వహించి, పరలోక రాజులుగా యాజకులుగా ఆయన ప్రజాసేవలో వారు భాగం వహిస్తారు. (ప్రకటన 20:6; 22:​1-5) అయితే, భూమిపైనున్న క్రైస్తవులు కూడా ప్రజాసేవ చేస్తారు, అలా చేయడంలో వారు గొప్ప ఆనందాన్ని పొందుతారు. ఉదాహరణకు, పాలస్తీనాలో ఆహార కొరత ఉన్నప్పుడు, యూదయలోవున్న యూదులైన క్రైస్తవులను వారి బాధల్లో ఆదుకోవడానికి అపొస్తలుడైన పౌలు ఐరోపాలోని సహోదరుల నుండి చందాలు సేకరించి వారి దగ్గరికి తీసుకువెళ్లాడు. అది ఒక విధమైన ప్రజాసేవ. (రోమీయులు 15:27; 2 కొరింథీయులు 9:​12) నేడు క్రైస్తవులు అలాంటి సేవనే చేయడానికి, అంటే తమ సహోదరులు ఆపదలకు, ప్రకృతి వైపరీత్యాలకు, లేక ఇతర విపత్తులకు గురైనప్పుడు వారికి వెంటనే సహాయాన్ని అందించడానికి ఎంతో సంతోషిస్తారు.​—⁠సామెతలు 14:⁠21.

10 “మీ విశ్వాసయాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను, నేనానందించి మీ యందరితోకూడ సంతోషింతును” అని వ్రాసినప్పుడు పౌలు మరో ప్రజాసేవను ఉద్దేశించాడు. (ఫిలిప్పీయులు 2:​17) ఫిలిప్పీయుల కోసం పౌలు పడిన ప్రయాసే, ప్రేమాభిమానాలతో అర్పించబడిన ప్రజాసేవ. నేడు కూడా అలాంటి ప్రజాసేవే అందించబడుతుంది, ప్రాముఖ్యంగా తగినవేళ ఆధ్యాత్మిక ఆహారాన్ని అందజేస్తూ ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసునిగా’ సేవచేస్తున్న అభిషిక్త క్రైస్తవుల ద్వారా అలాంటి ప్రజాసేవ అందించబడుతుంది. (మత్తయి 24:​45-47) అంతేగాక, ఒక గుంపుగా వీరు “యేసుక్రీస్తుద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులనర్పించుటకు” మరియు “చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి [తమ్మును] పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు[టకు]” నియుక్తులైన “యాజకసమూహమును, పరిశుద్ధజనమును” అయ్యున్నారు. (1 పేతురు 2:​5, 9) తమ బాధ్యతలను నిర్వర్తించడంలో వారు ‘తమను తాము ధారపోసుకున్నప్పటికీ’ అలాంటి ఆధిక్యతలను బట్టి పౌలులా వారు కూడా ఎంతో ఆనందిస్తారు. మానవజాతికి యెహోవా గురించి, ఆయన సంకల్పాల గురించి చెప్పే పనిలో వారి సహవాసులైన “వేరే గొర్రెలు” వారితో కలిసి వారికి మద్దతునిస్తారు. * (యోహాను 10:16; మత్తయి 24:​14) అదెంతటి గొప్ప ఆనందభరితమైన ప్రజాసేవ!​—⁠కీర్తన 107:21, 22.

పరిశుద్ధ సేవను అర్పించడం

11. ప్రవక్త్రిని అయిన అన్న క్రైస్తవులందరికీ ఏ విధంగా చక్కని మాదిరి?

11 మన ఆరాధనతో సంబంధం ఉన్న మరో గ్రీకు పదం లాట్రీయా, అది న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌లో “పరిశుద్ధసేవ” అని అనువదించబడింది. పరిశుద్ధ సేవకు ఆరాధనా క్రియలతో సంబంధం ఉంది. ఉదాహరణకు, 84 ఏళ్ల విధవరాలు, ప్రవక్త్రిని అయిన అన్న, “దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్లు సేవ [లాట్రీయాతో సంబంధగల ఒక గ్రీకు పదం] చేయు”చున్నట్లు వర్ణించబడింది. (లూకా 2:​36, 37) అన్న యెహోవా ఆరాధనను విడువక చేసేది. ఆమె మనకందరికీ అంటే యౌవనులకు, వృద్ధులకు, పురుషులకు, స్త్రీలకు అందరికీ చక్కని మాదిరి. అన్న విడువక యెహోవాను ప్రార్థిస్తూ, ఆలయంలో క్రమంగా ఆయనను ఆరాధించినట్లుగానే, మన పరిశుద్ధ సేవలో ప్రార్థన చేయడం, కూటాలకు క్రమంగా వెళ్లడం ఇమిడివున్నాయి.​—⁠రోమీయులు 12:12; హెబ్రీయులు 10:24, 25.

12. మన పరిశుద్ధ సేవలోని ప్రముఖ అంశం ఏమిటి, అది ఎలా ఒక ప్రజాసేవ అవుతుంది?

12 “నా ప్రార్థనలయందు ఎల్లప్పుడు ఆయనను బతిమాలుకొనుచు, మిమ్మునుగూర్చి యెడతెగక జ్ఞాపకము చేసికొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి” అని వ్రాసినప్పుడు అపొస్తలుడైన పౌలు మన పరిశుద్ధ సేవలోని ఒక ప్రముఖ అంశాన్ని తెలియజేశాడు. (రోమీయులు 1:⁠9,10) అవును, సువార్త ప్రకటించడం వినేవారందరికీ ప్రజాసేవనే కాదు, యెహోవా దేవునికి ఆరాధనా క్రియ చేసినట్లు కూడా అవుతుంది. మనం చెప్పేది వినేవారిని మనం కనుగొన్నా కనుగొనకపోయినా, ప్రకటనా పని అన్నది యెహోవాకు అర్పించే పరిశుద్ధ సేవే. ప్రేమగల మన పరలోక తండ్రికున్న చక్కని గుణాల గురించి, ప్రయోజనకరమైన సంకల్పాల గురించి ఇతరులకు చెప్పడానికి మనం చేసే కృషి మనకు గొప్ప ఆనందాన్ని తెస్తుంది.​—⁠కీర్తన 71:⁠23.

మనం పరిశుద్ధ సేవను ఎక్కడ అర్పిస్తాము?

13. యెహోవా ఆధ్యాత్మిక ఆలయంలోని లోపలి ఆవరణం నుండి పరిశుద్ధ సేవను అర్పించే వారికున్న నిరీక్షణ ఏమిటి, వారితో పాటు ఎవరు ఆనందిస్తారు?

13 అభిషిక్త క్రైస్తవులకు పౌలు ఇలా వ్రాశాడు: “మనము నిశ్చలమైన రాజ్యమును పొంది, దైవ కృప కలిగియుందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవచేయుదము.” (హెబ్రీయులు 12:​28, 29) రాజ్యాన్ని స్వతంత్రించుకుంటామనే దృఢమైన ఆశతో, అభిషిక్తులు సర్వోన్నతుని ఆరాధన పట్ల అచంచలమైన విశ్వాసాన్ని కల్గివుంటారు. వారు మాత్రమే యెహోవా ఆధ్యాత్మిక ఆలయంలో పరిశుద్ధ స్థలం నుండి, లోపలి ఆవరణము నుండి పరిశుద్ధ సేవను అందజేయగల్గుతారు. అంతేగాక వారు యేసుతోపాటు అతి పరిశుద్ధ స్థలంలో అంటే పరలోకంలోనే సేవచేసేందుకు గొప్ప అపేక్షతో ఎదురుచూస్తారు. వారి సహవాసులైన వేరే గొర్రెల తరగతివారు తమకున్న అత్యద్భుతమైన నిరీక్షణను బట్టి వారితో కలిసి ఎంతో ఆనందిస్తారు.​—⁠హెబ్రీయులు 6:19, 20; 10:19-22.

14. యేసు చేసిన ప్రజాసేవ నుండి గొప్ప సమూహం ఎలా ప్రయోజనం పొందుతుంది?

14 అయితే ఈ వేరే గొర్రెల మాటేమిటి? అపొస్తలుడైన యోహాను ముందే చూసినట్లుగా, వారిలో ఒక గొప్ప సమూహం ఈ చివరి దినాల్లో కనిపించింది, వారు “గొఱ్ఱెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపుచేసికొనిరి.” (ప్రకటన 7:​14) దీని భావమేమిటంటే, తమ తోటి అభిషిక్త ఆరాధకుల వలెనే వారు కూడా యేసు చేసిన ప్రజాసేవయందు, అలాగే మానవజాతి కోసం ఆయన తన పరిపూర్ణ మానవ జీవితాన్ని అర్పించడం యందు విశ్వాసం ఉంచుతారు. వేరే గొర్రెలు “[యెహోవా] నిబంధనను ఆధారము చేసికొను”చున్నారు గనుక వారు కూడా యేసు చేసిన ప్రజాసేవనుండి ప్రయోజనం పొందుతారు. (యెషయా 56:⁠6) వారు క్రొత్త నిబంధనలో భాగస్థులు కాదు గానీ, దానికి సంబంధించిన కట్టడలకు విధేయత చూపిస్తారు గనుక, దాని ద్వారా చేయబడే ఏర్పాట్లతో సహకరిస్తారు గనుక వారు దాన్ని ఆధారం చేసుకుంటారు. ఒకే ఆధ్యాత్మిక బల్లపై భుజిస్తూ దాని సభ్యులతోపాటు కలిసి పని చేస్తూ, దేవుడ్ని బహిరంగంగా స్తుతిస్తూ, ఆయనకు ప్రీతికరమైన ఆధ్యాత్మిక బలులను అర్పిస్తూ వారు దేవుని ఇశ్రాయేలుతో సహవసిస్తారు.​—⁠హెబ్రీయులు 13:⁠15.

15. గొప్ప సమూహం ఎక్కడి నుండి పరిశుద్ధ సేవను అర్పిస్తుంది, ఈ ఆశీర్వాదం వారిపై ఎలా ప్రభావం చూపిస్తుంది?

15 అందుకే, గొప్ప సమూహం “తెల్లని వస్త్రములు ధరించుకొన్నవారై, . . . సింహాసనము ఎదుటను గొఱ్ఱెపిల్లయెదుటను నిలువబడి” ఉన్నట్లు కనిపించింది. అంతేగాక, వారు “దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్లు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైనవాడు తానే తన గుడారము వారిమీద కప్పును.” (ప్రకటన 7:​9, 15) ఇశ్రాయేలులో, యూదా మత ప్రవిష్టులు సొలొమోను ఆలయంలోని వెలుపలి ఆవరణంలో ఆరాధించేవారు. అదేవిధంగా, గొప్ప సమూహం యెహోవా ఆధ్యాత్మిక ఆలయంలోని వెలుపలి ఆవరణము నుండి ఆయనను ఆరాధిస్తుంది. అక్కడ సేవ చేయడం వారికి ఆనందాన్నిస్తుంది. (కీర్తన 122:⁠1) తమ అభిషిక్త సహవాసులలోని చివరి వ్యక్తి తన పరలోక వారసత్వాన్ని పొందిన తర్వాత కూడా, వారు యెహోవా ప్రజలుగా ఆయనకు పరిశుద్ధ సేవ చెల్లిస్తూనే ఉంటారు.​—⁠ప్రకటన 21:⁠3.

అనంగీకారమైన పరిశుద్ధ సేవ

16. పరిశుద్ధ సేవ గురించి ఏ హెచ్చరికలు ఇవ్వబడ్డాయి?

16 ప్రాచీన ఇశ్రాయేలీయుల కాలంలో, యెహోవా కట్టడలకు అనుగుణ్యంగానే పరిశుద్ధ సేవ అర్పించబడవలసి ఉండేది. (నిర్గమకాండము 30:9; లేవీయకాండము 10:​1, 2) అలాగే నేడు మన పరిశుద్ధ సేవ యెహోవాకు అంగీకారమైనదై ఉండాలంటే మనం అనుసరించవలసినవి కూడా కొన్ని ఉన్నాయి. అందుకే పౌలు కొలొస్సయులకు ఇలా వ్రాశాడు: “మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణజ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమునుగలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించినవారునై, ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు, ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెనని . . . దేవుని బతిమాలుచున్నాము.” (కొలొస్సయులు 1:​9-12) దేవుడ్ని ఆరాధించడానికి ఏది సరైన మార్గమన్నది నిశ్చయించడం మన పని కాదు. కచ్చితమైన సంపూర్ణమైన లేఖనాధార జ్ఞానము, ఆధ్యాత్మిక వివేకము, దైవిక జ్ఞానము మాత్రం ఎంతో ఆవశ్యకం. లేకపోతే పర్యవసానాలు ఎంతో నాశనకరమైనవిగా ఉండగలవు.

17. (ఎ) పరిశుద్ధ సేవ మోషే కాలంలో ఎలా తప్పుదోవ పట్టింది? (బి) నేడు పరిశుద్ధ సేవ ఎలా తప్పుదోవ పట్టగలదు?

17 మోషే కాలం నాటి ఇశ్రాయేలీయులను గుర్తుతెచ్చుకోండి. మనమిలా చదువుతాము: “దేవుడు వారికి విముఖుడై ఆకాశసైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టెను.” (అపొస్తలుల కార్యములు 7:​42) ఆ ఇశ్రాయేలీయులు యెహోవా తమ కోసం చేసిన శక్తివంతమైన కార్యాలను చూశారు. అయినప్పటికీ, తమకు లాభదాయకమని అనుకున్నప్పుడు వారు ఇతర దేవుళ్ల వైపు తిరిగారు. వారు యథార్థవంతులు కాదు, మన పరిశుద్ధ సేవ దేవునికి ప్రీతికరమైనదై ఉండాలంటే యథార్థత తప్పనిసరి. (కీర్తన 18:​25) నిజమే, నేడు యెహోవా ఆరాధనను మానేసి నక్షత్రాల ఆరాధనను లేక బంగారు దూడల ఆరాధనను ఎవరూ చేపట్టకపోవచ్చు, కానీ ఇతర రకాలైన విగ్రహారాధనలు ఉన్నాయి. యేసు “సిరికి” సేవ చేయడం గురించి హెచ్చరించాడు, పౌలు ధనాపేక్షను విగ్రహారాధన అని పిలిచాడు. (మత్తయి 6:24; కొలొస్సయులు 3:⁠5) అందుకే సాతాను తనను తాను దేవునిగా చాటుకుంటాడు. (2 కొరింథీయులు 4:⁠4) ఆ విధమైన విగ్రహారాధన ప్రబలంగా ఉంది, అదొక ఉచ్చు కాగలదు. ఉదాహరణకు, యేసును అనుసరిస్తున్నానని చెప్పుకునే ఒక వ్యక్తి జీవితంలోని నిజమైన లక్ష్యం తాను సంపన్నుడనవ్వాలన్నదే అనుకుందాం, లేక అతని పూర్తి నమ్మకం తనలోనూ తన స్వంత తలంపులలోనూ ఉందనుకుందాం. అతడు నిజంగా ఎవరి సేవ చేస్తున్నట్లు? యెహోవా నామమున ప్రమాణము చేసి, ఆయన చేసిన గొప్ప కార్యాలన్నీ అపవిత్రమైన విగ్రహాలు చేశాయని చెప్పే యెషయా కాలం నాటి యూదుల నుండి అతడు ఎంత మేరకు భిన్నంగా ఉన్నట్లు?​—⁠యెషయా 48:1, 5.

18. పరిశుద్ధ సేవ గతంలోనూ, నేడూ తప్పుగా ఎలా అర్పించబడుతుంది?

18 యేసు ఇంకా ఇలా హెచ్చరించాడు: “మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవచేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది.” (యోహాను 16:⁠2) అపొస్తలుడైన పౌలుగా మారిన సౌలు, ‘స్తెఫెను చావుకు సమ్మతించడం’ ద్వారా, అలాగే “ప్రభువుయొక్క శిష్యులను బెదరించుటయును హత్యచేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు” చేయడం ద్వారా తాను దేవుని సేవ చేస్తున్నానని భావించాడనడంలో సందేహం లేదు. (అపొస్తలుల కార్యములు 7:​60; 8:1; 9:⁠1) నేడు, జాతి ప్రక్షాళన, జాతి నిర్మూలన వంటివాటిలో పాల్గొనే కొంతమంది తాము దేవుడ్ని ఆరాధిస్తున్నామని చెప్పుకోవచ్చు. అలా చెప్పుకునే వారు చాలామంది ఉన్నారు, కాని వారి ఆరాధన నిజానికి జాతీయత, తెగవాదం, ధనం, స్వీయ లేక మరితర దేవతలకు చెందుతుంది.

19. (ఎ) మనం మన పరిశుద్ధ సేవను ఎలా దృష్టిస్తాము? (బి) ఏ విధమైన పరిశుద్ధ సేవ మనకు ఆనందాన్ని తెస్తుంది?

19 యేసు సాతానుతో మాట్లాడుతూ ఇలా అన్నాడు: “ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను.” (మత్తయి 4:​10) మనమందరం ఆయన మాటలను వినడం ఎంత ప్రాముఖ్యం! సర్వోన్నతుడైన ప్రభువుకు పరిశుద్ధ సేవను అర్పించడం ఉన్నతమైన, భీతికల్గించే ఆధిక్యత. మన ఆరాధనతో సంబంధం ఉన్న ప్రజాసేవను చేసే విషయం గురించి ఏమి చెప్పవచ్చు? మనం మన తోటి వ్యక్తి కోసం ప్రజాసేవ చేయడం గొప్ప సంతోషాన్ని తీసుకువచ్చే ఆనందభరితమైన ఒక పని. (కీర్తన 41:1, 2; 59:​16) అయినప్పటికీ, అలాంటి సేవ పూర్ణ హృదయంతో సరైన విధంగా అర్పించబడినప్పుడే నిజమైన ఆనందాన్ని తెస్తుంది. నిజానికి ఎవరు దేవుడ్ని సరైన విధంగా ఆరాధిస్తున్నారు? యెహోవా ఎవరి పరిశుద్ధ సేవను అంగీకరిస్తాడు? మన ఆరాధనతో సంబంధం గల, బైబిల్లోని మూడవ పదాన్ని పరిశీలిస్తే మనం అలాంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలం. దీన్ని మనం తర్వాతి శీర్షికలో చూద్దాము.

[అధస్సూచీలు]

^ పేరా 4 క్రైస్తవమత సామ్రాజ్యంలోని ఆచారకర్మలు సాధారణంగా ఆరాధనా సంబంధమైన సంస్కారాలు లేక రోమన్‌ కాథలిక్‌ చర్చిలోని ప్రభురాత్రి భోజనం వంటి నిర్దిష్టమైన ఆచారాలైవున్నాయి.

^ పేరా 10 అంతియొకయలోని ప్రవక్తలు, బోధకులు యెహోవాను “సేవించు”చుండిరని (లైటోర్‌జీయకు సంబంధించిన ఒక గ్రీకు పదాన్ని అనువదిస్తే “సేవించు” అన్న పదం వస్తుంది) అపొస్తలుల కార్యములు 13:2 లో నివేదించబడింది. బహుశా, ఈ ప్రజాసేవలో ప్రజలకు ప్రకటించడం కూడా ఇమిడి ఉండవచ్చు.

మీరెలా సమాధానమిస్తారు?

• యేసు ఏ ఘనమైన ప్రజాసేవను అందజేశాడు?

• క్రైస్తవులు ఏ ప్రజాసేవను చేస్తారు?

• క్రైస్తవ పరిశుద్ధ సేవ అంటే ఏమిటి, అది ఎక్కడ చేయబడుతుంది?

• మన పరిశుద్ధ సేవ దేవునికి ప్రీతికరమైనదై ఉండాలంటే మనం ఏమి సంపాదించుకోవాలి?

[అధ్యయన ప్రశ్నలు]

[10వ పేజీలోని చిత్రం]

తల్లిదండ్రులు ఇవ్వడంలో గొప్ప ఆనందాన్ని పొందుతారు

[12, 13వ పేజీలోని చిత్రాలు]

ఇతరులకు సహాయం చేయడం ద్వారా, సువార్త ప్రకటించడం ద్వారా క్రైస్తవులు ప్రజాసేవ చేస్తారు

[14వ పేజీలోని చిత్రం]

మన పరిశుద్ధ సేవ దేవునికి అంగీకారమైనదై ఉండాలంటే మనకు సంపూర్ణమైన జ్ఞానము, వివేకము అవసరం