కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘నా ఆజ్ఞల్ని నీవు మనస్సులో ఉంచుకొంటే నీవు బ్రదుకుతావు’

‘నా ఆజ్ఞల్ని నీవు మనస్సులో ఉంచుకొంటే నీవు బ్రదుకుతావు’

‘నా ఆజ్ఞల్ని నీవు మనస్సులో ఉంచుకొంటే నీవు బ్రదుకుతావు’

అతగాడు యౌవనస్థుడు, వివేకవంతుడు. “రూపవంతుడును సుందరుడునై” ఉన్నాడు. ఆతని యజమాని భార్య కామోద్రేకంతోను నిస్సిగ్గుతో కూడిన ధైర్యంతోను ఉంది. ఆయన పట్ల ఆమె ఆపుకోలేని ఆకర్షణకు లోనై, ఆయన్ను వశపరుచుకోవడానికి ప్రతి దినమూ ప్రయత్నిస్తూ వచ్చింది. “ఒకనాడు అతడు తన పనిమీద ఇంటిలోపలికి వెళ్లినప్పుడు ఇంటి మనుష్యులలో ఎవరును అక్కడ లేరు. అప్పుడామె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపుమని” అడిగింది. కానీ, పితరుడైన యాకోబు కుమారుడైన యోసేపు అనే పేరుగల ఈ యువకుడు తన వస్త్రాన్ని అక్కడే విడిచిపెట్టి పోతీఫరు భార్యయైన ఆ స్త్రీ నుండి తప్పించుకుని పారిపోయాడు.​—⁠ఆదికాండము 39:1-12.

నిజమే, అంతటి ఆకర్షణ ఉన్నప్పుడు ప్రలోభంలో పడిపోకుండా అందరూ ఉండరు. ఉదాహరణకు దీన్ని గమనించండి. ప్రాచీన ఇశ్రాయేలులో సొలొమోను, రాత్రిపూట వీధుల్లో తచ్చాడుతున్న ఒక యువకుణ్ణి చూశాడు. పెడదారిపట్టిన ఒక పడతి ఆ యువకుణ్ణి వశపర్చుకోవడంతో అతగాడు “వెంటనే వధకు వెళ్ళే వృషభంలా ఆమె వెంటవెళ్ళాడు.”​—⁠సామెతలు 7: 21, 22, న్యూ ఇంటర్నేషనల్‌ వెర్షన్‌.

“జారత్వమునకు దూరముగా పారిపోవుడి” అని క్రైస్తవులకు హెచ్చరించబడింది. (1 కొరింథీయులు 6:​18) యౌవనస్థుడు, క్రైస్తవ శిష్యుడైన తిమోతికి అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “నీవు యౌవనేచ్ఛలనుండి పారిపొమ్ము.” (2 తిమోతి 2:​22) జారత్వం, వ్యభిచారం, లేదా ఇతర అనైతికమైన పనుల్లో పడవేసే పరిస్థితులు ఎదురైనప్పుడు, పోతీఫరు భార్య నుండి ఏమాత్రం తటపటాయించకుండా పారిపోయిన యోసేపులా మనం కూడా పారిపోవాలి. మనమలా తీర్మానించుకోవడానికి ఏది సహాయపడుతుంది? బైబిలు పుస్తకమైన సామెతలులోని 7వ అధ్యాయంలో సొలొమోను మనకు కొంత అమూల్యమైన ఉపదేశాన్ని ఇస్తున్నాడు. ఆయన అనైతికమైన ప్రజల కపటోపాయాల నుండి మనల్ని కాపాడే బోధల్ని గురించి మాట్లాడడం మాత్రమే కాక, ఒక నీతిబాహ్యమైన స్త్రీ మోహంలో ఒక యౌవనస్థుడు పడిపోయిన దృశ్యాన్ని విస్పష్టంగా చిత్రీకరించడం ద్వారా వారి కార్యాచరణ పద్ధతుల్ని కూడా బట్టబయలు చేశాడు.

‘నీ వ్రేళ్లకు నా ఆజ్ఞలను కట్టుకొనుము’

ఆ రాజు, ఒక తండ్రి పుత్రవాత్సల్యంతో తన కుమారుడికి ఇచ్చేటువంటి సలహాతో ఇలా ప్రారంభిస్తున్నాడు: “నా కుమారుడా, నా మాటలను మనస్సున నుంచు కొనుము నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. నా ఆజ్ఞలను నీవు మనస్సున నుంచుకొనినయెడల నీ కనుపాపవలె నా ఉపదేశమును కాపాడినయెడల నీవు బ్రదుకుదువు.”​—⁠సామెతలు 7:1, 2.

తల్లిదండ్రులకు, ప్రాముఖ్యంగా తండ్రులు, తమ పిల్లలకు మంచిచెడుల విషయంలోని దేవుని ప్రమాణాలను బోధించాల్సిన బాధ్యత ఉంది. మోషే తండ్రులకు ఇలా ఉద్బోధించాడు: “నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ యింట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటినిగూర్చి మాటలాడవలెను.” (ద్వితీయోపదేశకాండము 6:​6, 7) అపొస్తలుడైన పౌలు కూడా ఇలా వ్రాశాడు: “తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి.” (ఎఫెసీయులు 6:⁠4) కాబట్టి, ఎంతో విలువైనవిగా ఎంతో అమూల్యంగా ఎంచాల్సిన తల్లి/తండ్రి ఇచ్చే ఉపదేశాల్లో దేవుని వాక్యమైన బైబిలులోని జ్ఞాపికలు, ఆజ్ఞలు, చట్టాలు కూడా చేరి ఉన్నాయి.

తల్లిదండ్రుల బోధనలో మరితర నిబంధనలు​—⁠కుటుంబ నియమాలు కూడా చేరివుండవచ్చు. ఇవి ఉన్నది కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోసమే. నిజమే, అవసరం కొద్దీ ఒక కుటుంబం నుండి మరో కుటుంబానికి ఈ నియమాలు మారుతూవుండవచ్చు. అయితే తమ కుటుంబానికి ఏది అత్యుత్తమమో నిర్ణయించే కర్తవ్యం తల్లిదండ్రులకు ఉంది. వారు పెట్టే ఈ నియమాలు సాధారణంగా తమలోని నిజమైన ప్రేమకు, శ్రద్ధకు నిదర్శనాలైవున్నాయి. ఇక్కడ పిల్లలకు ఇవ్వబడే సలహా ఏమిటంటే, వారు ఈ నియమాలకూ అలాగే తమ తల్లిదండ్రుల నుండి తాము పొందే లేఖనాధార బోధలకూ బద్ధులై వాటిని పాటించాలి. అవును, వారు అటువంటి ఉపదేశాల్ని “కనుపాపవలె” దృష్టించాల్సిన​—⁠వాటిని అతి జాగ్రత్తగా కాపాడుకోవల్సిన అవసరం ఉంది. యెహోవా ప్రమాణాల్ని అలక్ష్యంచేయడం మూలంగా రాగల ప్రాణాంతకమైన ప్రభావాన్ని నివారించే మార్గం అదే​—⁠తద్వారా మనం ‘బ్రదుకుతాము.’

“నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము” అంటున్నాడు సొలొమోను, “నీ హృదయమను పలకమీద వాటిని వ్రాసికొనుము.” (సామెతలు 7:⁠3) మన చేతివ్రేళ్ళు ఎప్పుడూ మన కంటికి ఎదురుగానే ఉంటాయి, అవి మన సంకల్పాల్ని నెరవేర్చుకోవడానికి ఎంతో కీలకమైనవి, అదే రీతిలో, మనం పొందిన బైబిలు జ్ఞానము లేదా లేఖనాధార పెంపకంలో నేర్చుకున్న పాఠాలు మనం చేసే ప్రతీ దానిలో మనకు జ్ఞాపికలుగా మార్గదర్శకాలుగా ఉండాలి. మనం వాటిని హృదయమనే పలకపైన చెక్కుకోవాలి, వాటిని మన ప్రవృత్తిలో ఒక భాగంగా చేసుకోవాలి.

బుద్ధి, తెలివి వంటి లక్షణాల ప్రాముఖ్యాన్ని మర్చిపోలేదు సొలొమోను, ఆయనిలా అంటున్నాడు: “జ్ఞానముతో [“బుద్ధితో,” NW]​—⁠నీవు నాకు అక్కవనియు; తెలివితో​—⁠నీవు నాకు చెలికత్తెవనియు చెప్పుము.” (సామెతలు 7:⁠4) బుద్ధి అంటే దేవుడిచ్చిన జ్ఞానాన్ని సరైన ఉపయోగంలో పెట్టే సామర్థ్యమే. ఎంతగానో ప్రేమించబడే ఒక అక్కపట్ల ఉండే మమకారం మనకు బుద్ధిపట్ల ఉండాలి. తెలివి అంటే ఏమిటి? ఏదైనా విషయాన్ని లోతుగా పరిశీలించి, అందులోని భాగాలకూ దాని మొత్తానికి మధ్యనున్న సంబంధాలను గుర్తించటం ద్వారా దాన్ని గ్రహించే సామర్థ్యమే తెలివి. ఒక ఆప్త మిత్రుడు ఎంత సన్నిహితంగా ఉంటాడో తెలివి మనకు అంత సన్నిహితంగా ఉండాలి.

మనం లేఖనాధార శిక్షణకు అంటిపెట్టుకుని, బుద్ధి తెలివి వంటి లక్షణాలను సన్నిహితమైనవిగా ఎందుకు ఎంచాలి? ఎందుకంటే, “అవి [మనం] జార స్త్రీ యొద్దకు పోకుండను, ఇచ్చకములాడు పరస్త్రీకి లోబడకుండను [మనల్ని] కాపాడును.” (సామెతలు 7:⁠5) అవును, అలా చేయడం ద్వారా మనం ఇచ్చకాలాడే ప్రలోభపెట్టే ఒక పరస్త్రీ నుండి​—⁠అనైతికమైన స్త్రీ నుండి కాపాడబడతాము.

ఒక యౌవనస్థుడు “కపటముగల స్త్రీ”ని కలుస్తాడు

ఇశ్రాయేలు రాజు అటు తరువాత తానే స్వయంగా చూసిన ఒక దృశ్యాన్ని వర్ణిస్తున్నాడు: “నా యింటి కిటికిలోనుండి నా అల్లిక కిటికీలోనుండి నేను పారజూడగా, జ్ఞానములేనివారి మధ్యను యౌవనుల మధ్యను బుద్ధిలేని పడుచువాడొకడు నాకు కనబడెను. సందెవేళ ప్రొద్దు గ్రుంకినతరువాత చిమ్మ చీకటిగల రాత్రివేళ వాడు జార స్త్రీ సందుదగ్గరనున్న వీధిలో తిరుగుచుండెను దాని యింటిమార్గమున నడుచుచుండెను.”​—⁠సామెతలు 7:6-9.

సొలొమోను చూస్తున్న కిటికీకి అల్లిక ఉంది​—⁠బహుశ సన్నని చెక్క ముక్కలతో తడికలా చేసినదై ఉండవచ్చు, లేదా కిటికీపై చక్కని చెక్కడపు పని జరిగివుండవచ్చు. మునిమాపు వేళ వీధుల్లో చీకట్లు ముసురుకుంటున్నాయి. అప్పుడు, మనస్సు బలహీనంగా ఉన్న ఒక యువకుడు సొలొమోను కంట్లో పడ్డాడు. బుద్ధిహీనుడైన ఆ యౌవనస్థునికి వివేచన లేదా మంచి విచక్షణాశక్తి కొరవడింది. బహుశ అది ఎటువంటి ప్రాంతమో అక్కడ తనకు ఏమి సంభవించగలదో ఆయనకు తెలిసే ఉంటుంది. ఆ యువకుడు ఆమె ఇంటి “సందుదగ్గర”కు వస్తాడు. ఆమె ఎవరు? ఆమె ఏమి చేయబోతోంది?

దీన్నంతటినీ పరిశీలిస్తున్న రాజు ఇలా చెబుతున్నాడు: “అంతట వేశ్యావేషము వేసికొనిన కపటముగల స్త్రీ ఒకతె వానిని ఎదుర్కొన వచ్చెను. అది బొబ్బలు పెట్టునది, స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములు దాని యింట నిలువవు. ఒకప్పుడు ఇంటియెదుటను ఒకప్పుడు సంతవీధులలోను అది యుండును. ప్రతి సందుదగ్గరను అది పొంచియుండును.”​—⁠సామెతలు 7:10-12.

ఆ స్త్రీవేషము అంటే వస్త్రధారణ ఆమె గురించి ఎన్నో విషయాలు చెప్పకనే చెబుతుంది. (ఆదికాండము 38:​14, 15) ఆమె ఒక వేశ్యలా అశ్లీలంగా వస్త్రధారణ చేసుకుంది. అంతేగాక, ఆమె కపటత్వం గలది​—⁠ఆమె మనస్సు “నయవంచన”తోను, ఆమె ఉద్దేశాలు “కుటిలత్వం”తోను నిండివున్నాయి. (ఏన్‌ అమెరికన్‌ ట్రాన్స్‌లేషన్‌; న్యూ ఇంటర్నేషనల్‌ వెర్షన్‌) ఆమె బొబ్బలు పెట్టే స్త్రీ, మొండియైన లక్షణంగలది; మాటలు బాగా వచ్చు, తలపొగరు బాగా ఉన్నది, పెద్దగా అరుస్తుంది నిస్సిగ్గుతో కూడిన ధైర్యంతో ఉంది, ఎవర్నీ ఖాతరు చేయదు. ఇంటివద్ద ఉండడానికి బదులుగా ఆమె మాటిమాటికీ బహిరంగ స్థలాలకు వెళ్ళడానికి ఇష్టపడుతుంది, సందుమూలల్లో తచ్చాడుతూ ఎవర్ని పట్టుకుందామాని చూస్తూవుంటుంది. ఆ యౌవనస్థుడి లాంటివారికోసం ఆమె వేచివుంటుంది.

‘అధికమైన లాలనమాటలు’

అలా ఒక యువకుడు, దుష్టపథకంతో ఉన్న ఒక బజారు స్త్రీని కలుస్తాడు. ఇది తప్పకుండా సొలొమోను అవధానాన్ని ఆకర్షించిందనడంలో ఆశ్చర్యం లేదు! ఆయన ఇలా వివరిస్తున్నాడు: “అది వానిని పట్టుకొని ముద్దుపెట్టుకొనెను, సిగ్గుమాలిన ముఖము పెట్టుకొని యిట్లనెను​—⁠సమాధానబలులను నేను అర్పింపవలసియుంటిని. నేడు నా మ్రొక్కుబళ్లు చెల్లించియున్నాను. కాబట్టి నేను నిన్ను కలిసికొనవలెనని రాగా నిన్ను ఎదుర్కొనవలెనని బయలుదేరగా నీవే కనబడితివి.”​—⁠సామెతలు 7:13-15.

ఈ స్త్రీ పెదవులు తేనెపూసినట్లుగా ఉన్నాయి. సిగ్గుమాలిన ముఖం పెట్టుకుని ఆమె చాలా నింపాదిగా మాట్లాడుతుంది. ఆ యువకుణ్ణి వశపరుచుకోవడానికి ఆమె ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడుతుంది. తను అదే రోజున సమాధాన బలులు చెల్లించిందని తన మ్రొక్కుబళ్ళు చెల్లించిందని చెప్పడం ద్వారా ఆమె తన నీతిని ప్రదర్శించుకోవడానికి ప్రయత్నిస్తుంది, అలాగే తన ఆధ్యాత్మికతలో ఏ కొరతా లేదని సూచిస్తుంది. యెరూషలేము దేవాలయంలో అర్పించబడే సమాధాన బలుల్లో మాంసము, పిండి, నూనె, ద్రాక్షారసము ఉన్నాయి. (లేవీయకాండము 19:5, 6; 22:21; సంఖ్యాకాండము 15:​8-10) అర్పణలు చెల్లించే వ్యక్తి సమాధాన బలుల్లో నుండి తనకోసమూ తన కుటుంబం కోసమూ కొంత భాగాన్ని తీసుకునే అవకాశం ఉంది గనుక, ఆమె తన ఇంట్లో తినడానికీ తాగడానికీ కావల్సినంత సరుకు ఉందని సూచిస్తుంది. ఆమె మాటల్లోని అర్థం స్పష్టంగా ఉంది: ఆ యువకుడికి ఆమె ఇంట్లో ఆనందప్రదమైన అనుభవం లభిస్తుంది. ఆమె తన ఇంట్లోనుండి ప్రత్యేకంగా ఆయనను ఎదుర్కోవాలనే బయలుదేరిందిట. ఆ కథనాన్ని ఎవరైనా నమ్మగల్గితే ఎంత బాగుండు! “ఆమె ఎవరికోసమో వెదుకుతుందన్నది నిజమే” అని ఒక బైబిలు పండితుడు చెబుతున్నాడు. ఆయనింకా ఇలా అంటున్నాడు: “కానీ ఆమె నిజంగా ఈ మహానుభావుణ్ణే వెదుకుతూ వచ్చిందా? ఒక బుద్ధిహీనుడు మాత్రమే​—⁠సరిగ్గా ఈయనలాంటి వాడు మాత్రమే​—⁠ఆమె చెప్పింది నమ్ముతాడు.”

తన వస్త్రధారణతో, తన ఇచ్చకపు మాటలతో, తన ఆలింగనంతో, తన అధరాల మాధుర్యంతో ఆయన్ను తన ఆకర్షణలో పడవేసుకున్న తర్వాత ఆ జారిణి ఇప్పుడు, పంచేంద్రియాల్లోని వాసనను గ్రహించే శక్తిని కూడా తన వశం చేసేసుకుంటోంది. “నా మంచముమీద రత్నకంబళ్లను ఐగుప్తునుండి వచ్చు విచిత్రపుపనిగల నారదుప్పట్లను నేను పరచియున్నాను. నా పరుపుమీద బోళము అగరు కారపు చెక్క చల్లి యున్నాను” అని అంటుందామె. (సామెతలు 7:​16, 17) ఆమె తన మంచాన్ని ఎంతో సుందరంగా అలంకరించింది, ఐగుప్తునుండి తెచ్చిన రంగురంగుల దుప్పట్లు పరిచింది, వాటిపై బోళము, అగరు, దాల్చినిచెక్క వంటి వాటిని చల్లింది.

“ఉదయము వరకు వలపుదీర తృప్తిపొందుదము రమ్ము” అంటుందామె, “పరస్పరమోహముచేత చాలా సంతుష్టి నొందుదము రమ్ము.” ఇద్దరూ కలిసి చక్కని విందునారగించడానికే కాదు ఆ ఆహ్వానం పలికింది. అద్భుతమైన లైంగిక అనుభవం పొందవచ్చన్నదే ఆమె చేస్తోన్న వాగ్దానం. ఆ యువకుడికైతే ఆ విజ్ఞప్తిని మన్నించడం ఎంతో సాహసకృత్యంగా ఉత్తేజకరంగా కన్పిస్తున్నది! ఇది చాలదన్నట్లు ఆయన్ను వశపర్చుకోవడానికి ఆమె ఇంకా ఇలా అంటుంది: “పురుషుడు ఇంట లేడు దూరప్రయాణము వెళ్లియున్నాడు. అతడు సొమ్ముసంచి చేత పట్టుకొని పోయెను. పున్నమనాటివరకు ఇంటికి తిరిగి రాడు.” (సామెతలు 7:​18-20) తామిద్దరూ సురక్షితంగా ఉండవచ్చని హామీ ఇస్తుంది, ఎందుకంటే ఆమె భర్త వ్యాపారం నిమిత్తం దూరప్రయాణం వెళ్ళాడు, ఇప్పుడప్పుడే రాడు. ఒక యువకుణ్ణి మోసపుచ్చి వల్లో వేసుకోవడంలో ఎంతటి ప్రజ్ఞను ప్రదర్శించిందీమె! “అది తన అధికమైన లాలనమాటలచేత వానిని లోపరచు కొనెను. తాను పలికిన యిచ్చకపుమాటలచేత వాని నీడ్చుకొని పోయెను.” (సామెతలు 7:​21) ఇంతటి మోహపు మాటలకు నిలద్రొక్కుకోవాలంటే యోసేపు అంతటి సద్గుణసంపన్నుడే సరియైనవాడు. (ఆదికాండము 39:​9, 12) ఈ యువకుడిలో అంతటి బలం ఉందా?

‘వధకు వెళ్ళే పశువులా’

“వెంటనే పశువు వధకు పోవునట్లును పరులచే జిక్కినవాడు సంకెళ్లలోనికి పోవునట్లును తనకు ప్రాణహానికరమైనదని యెరుగక ఉరియొద్దకు పక్షి త్వరపడునట్లును వాని గుండెను అంబు చీల్చువరకు వాడు దానివెంట పోయెను” అని సొలొమోను నివేదిస్తున్నాడు.​—⁠సామెతలు 7:22, 23.

లభించిన ఆహ్వానాన్ని త్రిప్పికొట్టలేకపోయాడు ఆ యువకుడు. తన విచక్షణనంతటినీ గాలికొదిలేసి ఆయన ‘వధకు వెళ్లే పశువులా’ ఆమె వెంటపోయాడు. సంకెళ్ళలో ఉన్న మనిషి తన శిక్ష నుండి తప్పించుకోలేనట్లే ఆ యువకుడు పాపములో పడిపోయాడు. ఆయన అందులోని ప్రమాదాన్ని “వాని గుండెను అంబు చీల్చువరకు”​—⁠అంటే ప్రాణాంతకమైన గాయం తగిలేంతవరకు గుర్తించలేడు. మరణం శారీరకం కావచ్చు, అంటే ఆయన ప్రాణాంతకమైన లైంగికంగా సంక్రమించే వ్యాధుల బారిన పడవచ్చు. * అంతేగాక ఆ గాయం ఆధ్యాత్మిక మరణాన్ని కూడా తీసుకురాగలదు; అది ‘ప్రాణహానిని’ కలిగించగలదు. ఆయన ప్రాణమూ, ఆయన జీవితమూ సమస్తం గంభీరమైన ప్రమాదంలో ఉన్నాయి, అంతేగాక ఆయన దేవునికి విరుద్ధంగా ఘోరమైన పాపం చేశాడు. అలా, ఉరిలోకి పక్షి త్వరపడి వెళ్ళి చిక్కుకుపోయినట్లు ఆయన మృత్యువు కోరల్లోకి త్వరత్వరగా జారిపోయాడు.

“అది నడచు త్రోవలలోనికి పోకుము”

తాను చూసినదాని నుండి ఒక పాఠాన్ని గ్రహించి, జ్ఞానియైన రాజు ఇలా ఉద్బోధ చేస్తున్నాడు: “నా కుమారులారా, చెవియొగ్గుడి నా నోటి మాటల నాలకింపుడి. జార స్త్రీ మార్గములతట్టు నీ మనస్సు తొలగనియ్యకుము. దారి తప్పి అది నడచు త్రోవలలోనికి పోకుము. అది గాయపరచి పడద్రోసినవారు, అనేకులు అది చంపినవారు లెక్కలేనంతమంది. దాని యిల్లు పాతాళమునకుపోవు మార్గము. ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును.”​—⁠సామెతలు 7:24-27.

సొలొమోను ఇస్తున్న సలహా స్పష్టంగా, ప్రాణహాని కలుగజేసే మార్గాల నుండి అనైతిక వ్యక్తి మార్గాల నుండి ప్రక్కకు మరలిపొమ్మనే. (సామెతలు 7:⁠2) ఆ సలహా మన కాలాలకు ఎంత సమయానుకూలమైనదో కదా! ఎవర్నైనా ఎరగా చేద్దామని కొందరు పొంచివుండే స్థలాలకు మనం దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. అలాంటి ప్రాంతాలకు వెళ్ళి మిమ్మల్ని మీరే ఎందుకు వారి కుతంత్రాలకు లోనుచేసుకోవాలి? నిజానికి, మీరు “బుద్ధిలేని” వారుగా ఎందుకు అవ్వాలి, “పరస్త్రీ” మార్గాల్లో ఎందుకు తిరగాలి?

సొలొమోను చూసిన ఆ “పరస్త్రీ,” “పరస్పరమోహముచేత చాలా సంతుష్టి నొందుదము రమ్ము” అనే ఆహ్వానంతో ఆ యౌవనస్థుణ్ణి వలలో వేసుకుంది. అనేకమంది యౌవనస్థులు​—⁠ప్రత్యేకంగా అమ్మాయిలు​—⁠అదే పద్ధతిలో మోసపోలేదా? కానీ ఒక్కసారి ఆలోచించండి: ఎవరైనా మిమ్మల్ని లైంగిక అనైతికతలో పడవేసేందుకు ప్రయత్నించినప్పుడు, అది నిజమైన ప్రేమతోనా లేదా స్వార్థంతో కూడిన కామోద్రేకంతోనా? ఒక స్త్రీని నిజంగా ప్రేమించే పురుషుడు, ఆమె తన క్రైస్తవ శిక్షణను క్రైస్తవ మనస్సాక్షిని అతిక్రమించేలా ఎందుకు ఒత్తిడి చేస్తాడు? అలాంటి మార్గాలతట్టు “నీ మనస్సు తొలగనియ్యకుము” అని సొలొమోను హెచ్చరిస్తున్నాడు.

ప్రలోభపెట్టే వ్యక్తి స్వరం సాధారణంగా గోముగా ధ్వనిస్తుంది, మాటలు ఆచితూచి మాట్లాడినట్లు ఉంటాయి. బుద్ధినీ తెలివినీ మనతట్టు ఉంచుకోవడం, మనం ఆ మాటల గుండా అసలు రూపాన్ని చూడడానికి సహాయపడుతుంది. యెహోవా మనకు ఆజ్ఞాపించినవి ఎన్నడూ మర్చిపోకుండా ఉండడం మనకు కాపుదలగా ఉంటుంది. కాబట్టి, మనం దేవుని ‘ఆజ్ఞల్ని మనస్సులో ఉంచుకుని బ్రదుకుదాము’ గాక!​—⁠నిరంతరమూ బ్రదుకుదాము గాక!​—⁠1 యోహాను 2:⁠17.

[అధస్సూచీలు]

^ పేరా 24 కొన్ని లైంగికంగా సంక్రమించే వ్యాధులు కాలేయానికి ప్రమాదాన్ని వాటిల్లజేయగలవు. ఉదాహరణకు, సిఫిలిస్‌ బాగా ముదిరిపోయినప్పుడు కాలేయం నిండా సూక్ష్మ క్రిములు నిండిపోతాయి. గనేరియాకు కారణమైన క్రిములు కాలేయం మండుతున్నట్లుగా చేయగలవు.

[29వ పేజీలోని చిత్రాలు]

తల్లిదండ్రుల నియమాల్ని మీరెలా దృష్టిస్తారు?

[31వ పేజీలోని చిత్రం]

దేవుని ఆజ్ఞల్ని పాటించడం జీవదాయకం