నేటి దేవుని పరిచారకులు ఎవరు?
నేటి దేవుని పరిచారకులు ఎవరు?
“మా సామర్థ్యము దేవునివలననే కలిగియున్నది. ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు, . . . పరిచారకులమవుటకు మాకు సామర్థ్యము కలిగించియున్నాడు.”—2 కొరింథీయులు 3:5, 6.
1, 2. మొదటి శతాబ్దపు క్రైస్తవులందరూ ఏ బాధ్యతను నిర్వర్తించడంలో భాగం వహించారు, కానీ పరిస్థితులు ఎలా మారాయి?
మన సామాన్య శకం మొదటి శతాబ్దంలో, క్రైస్తవులందరూ ప్రాముఖ్యమైన ఒక బాధ్యతను నిర్వర్తించడంలో భాగం వహించారు—అది సువార్తను ప్రకటించే బాధ్యత. వారందరూ అభిషిక్తులే, అందరూ క్రొత్త నిబంధనకు పరిచారకులే. వారిలో కొందరికి సంఘంలో బోధించడం వంటి కొన్ని అదనపు బాధ్యతలున్నాయి. (1 కొరింథీయులు 12:27-29; ఎఫెసీయులు 4:11, 12) తల్లిదండ్రులకైతే కుటుంబంలో బరువైన బాధ్యతలు ఉన్నాయి. (కొలొస్సయులు 3:18-21) కానీ అందరూ ప్రాధమికమైన కీలకమైన ప్రకటనా పనిలో భాగం వహించారు. క్రైస్తవ లేఖనాల్లోని మూల గ్రీకు భాషలో ఈ బాధ్యత డయాకోనియా—ఒక సేవ లేదా పరిచర్య అని పిలువబడింది.—కొలొస్సయులు 4:17.
2 కాలం గడిచేకొద్దీ పరిస్థితులు మారాయి. మతగురువులనే ఒక తరగతి ఏర్పడింది, వీరు ప్రకటించే ఆధిక్యతను తమకే పరిమితం చేసుకున్నారు. (అపొస్తలుల కార్యములు 20:30) క్రైస్తవులమని పిలుచుకునే ప్రజల్లో ఈ మతగురువులు అల్ప సంఖ్యలో మాత్రమే ఉండేవారు. అధిక సంఖ్యలో ఉన్న మిగతా వారు మాత్రం సామాన్య ప్రజానీకం అని పిలువబడ్డారు. ఈ సామాన్య ప్రజానీకానికి మతగురువుల పోషణార్థం చందాలు వేయడం వంటి బాధ్యతలున్నాయని నేర్పించబడింది. వారిలో అత్యధికులు ప్రకటనా పని విషయంలో ఉదాసీనతతో కేవలం వినేవారిగా మాత్రమే ఉండిపోయారు.
3, 4. (ఎ) క్రైస్తవమత సామ్రాజ్యంలోని వ్యక్తులు పరిచారకులెలా అవుతారు? (బి) క్రైస్తవమత సామ్రాజ్యంలో ఎవరు పరిచారకులుగా పరిగణించబడతారు, యెహోవాసాక్షుల్లో ఇది ఎందుకు భిన్నంగా ఉంది?
3 ఈ మతగురువులు తమను తాము మినిస్టర్‌లని (పరిచారకులని) పిలుచుకునేవారు (మినిస్టర్ అనే ఆంగ్లపదం, డయాకోనోస్ అనే గ్రీకు పదానికి లాటిన్ అనువాదమైన మినిస్టర్ నుండి వచ్చింది). * ఇలా మినిస్టర్‌లు (పరిచారకులు) కావడానికి వారు థియాలజీ కాలేజీల నుండో లేదా సెమినరీల నుండో పట్టభద్రులు అవుతారు. ది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బైబిల్ ఎన్‌సైక్లోపీడియా ఇలా అంటుంది: “‘ఆర్డినేషన్’ అనేది, అంటే మతగురువుగా నియమించబడడం అనేది సాధారణంగా, మినిస్టర్‌లకు లేదా ప్రీస్టులకు అధికారికంగా ఆచారబద్ధంగా ఇవ్వబడే ఒక ప్రత్యేక హోదాను సూచిస్తుంది. అందులో, దేవుని వాక్యాన్ని ప్రకటించే అధికారమూ లేదా పవిత్రకర్మలను నిర్వహించే అధికారమూ లేదా ఈ రెండు పనులూ చేసే అధికారమూ ఇమిడి ఉంటాయి.” ఈ మినిస్టర్‌లను లేదా పరిచారకులను ఎవరు నియమిస్తారు? ద న్యూ ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా ఇలా చెబుతుంది: “బిషప్పులనే హోదా ఉన్న చర్చీల్లో, ఒక మినిస్టర్‌ను విధిగా బిషప్పే నియమిస్తాడు. ప్రెస్బిటేరియన్ చర్చీల్లో ఈ నియామకం ప్రెస్బిటెరీ అధికారులే చేస్తారు.”
4 కాబట్టి, క్రైస్తవమత సామ్రాజ్యంలో ఒక మినిస్టర్ లేదా ఒక పరిచారకుడు అయ్యే ఆధిక్యత పూర్తిగా పరిమితం చేయబడింది. అయితే, యెహోవాసాక్షుల్లో అలా లేదు. ఎందుకని? ఎందుకంటే, మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘంలో అలా జరిగేది కాదు కాబట్టి.
నిజంగా దేవుని పరిచారకులు ఎవరు?
5. బైబిలు ప్రకారం పరిచారకులుగా సేవచేసేవారిలో ఎవరెవరు ఉన్నారు?
5 బైబిలు ప్రకారం యెహోవా ఆరాధికులందరూ—అటు పరలోకంలోని ఇటు భూమిపైని ఆరాధికులందరూ—పరిచారకులే. దేవదూతలు యేసుకు పరిచర్య చేశారు. (మత్తయి 4:11; 26:53; లూకా 22:43) దేవదూతలు “రక్షణయను స్వాస్థ్యము పొందబోవువారికి పరిచారముచేయుటకై” ఉన్నారు కూడా. (హెబ్రీయులు 1:14; మత్తయి 18:10) యేసు ఒక పరిచారకుడిగానే ఉన్నాడు. “మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకు . . . వచ్చె[ను]” అని అన్నాడాయన. (మత్తయి 20:28; రోమీయులు 15:8, 9) అందుకనే, యేసు అనుచరులు ఆయన ‘అడుగుజాడల్లో నడుచుకోవాలి.’ కాబట్టి, వారు కూడా పరిచారకులుగా ఉండాలనడంలో ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు.—1 పేతురు 2:21.
6. తన శిష్యులు పరిచారకులై ఉండాలని యేసు ఎలా సూచించాడు?
6 తాను పరలోకం వెళ్ళడానికి కొద్దిగా ముందు యేసు తన శిష్యులతో ఇలా చెప్పాడు: “మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి.” (మత్తయి 28:19, 20) కాబట్టి యేసు శిష్యులు కూడా శిష్యుల్ని తయారుచేసేవారిగా—పరిచారకులుగా ఉండాల్సిన అవసరం ఉంది. వారు తయారుచేసే క్రొత్త శిష్యులు, యేసు ఆజ్ఞాపించిన వాటినన్నింటినీ గైకొనడం నేర్చుకోవాల్సివుంది, వెళ్ళి శిష్యుల్ని చేయాలన్న ఆజ్ఞ కూడా అందులో చేరివుంది. స్త్రీ అయినా, పురుషుడైనా, పిల్లవాడైనా పెద్దవాడైనా యేసుక్రీస్తుకు నిజ శిష్యుడైనవాడు ఒక పరిచారకుడిగా ఉంటాడు.—యోవేలు 2:28, 29.
7, 8. (ఎ) నిజ క్రైస్తవులందరూ పరిచారకులని ఏ లేఖనాలు తెలియజేస్తున్నాయి? (బి) పరిచారకునిగా నియమించబడడం గురించి ఎటువంటి ప్రశ్నలు తలెత్తుతాయి?
7 దీనికి అనుగుణ్యంగానే సా.శ. 33వ సంవత్సరం పెంతెకొస్తు దినాన, అక్కడ హాజరైవున్న యేసు శిష్యులందరూ స్త్రీలు, పురుషులు, “దేవుని గొప్పకార్యములను” వివరించసాగారు. (అపొస్తలుల కార్యములు 2:1-11) అంతేగాక, అపొస్తలుడైన పౌలు కూడా ఇలా వ్రాశాడు: “నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును.” (రోమీయులు 10:10) పౌలు ఈ మాటల్ని ఏదో పరిమిత సంఖ్యలోని మతగురువులకు చెప్పలేదు గానీ, “రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికి” చెప్పాడు. (రోమీయులు 1:1, 7) అదే విధంగా, “ఎఫెసులోనున్న పరిశుద్ధులును క్రీస్తుయేసునందు విశ్వాసులునైన” వారందరూ తమ “పాదములకు సమాధాన సువార్తవలననైన సిద్ధమనస్సను జోడుతొడుగుకొని” ఉండవలసి ఉంది. (ఎఫెసీయులు 1:1; 6:15) అంతేగాక హెబ్రీయులకు వ్రాయబడిన పత్రికను చదవడం విన్న ప్రతి ఒక్కరు ‘తమ నిరీక్షణ విషయమై తాము ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకోవాల్సి’ ఉన్నారు.—హెబ్రీయులు 10:23.
8 అయితే ఒక వ్యక్తి ఎప్పుడు ఒక పరిచారకుడు అవుతాడు? మరో మాటలో చెప్పాలంటే, ఆయనెప్పుడు పరిచారకుడిగా నియుక్తుడు అవుతాడు? ఆయన్ను ఎవరు నియమిస్తారు?
పరిచారకుడిగా నియామకం—ఎప్పుడు?
9. యేసు ఎప్పుడు నియమించబడ్డాడు, ఎవరిచేత?
9 ఒక వ్యక్తి ఎప్పుడు, ఎవరిచేత పరిచారకుడిగా నియమించబడతాడన్న దానికి జవాబుగా యేసుక్రీస్తు ఉదాహరణను పరిశీలించండి. తాను ఒక పరిచారకుడనని రుజువు చేసుకోవడానికి ఆయన దగ్గర ఎటువంటి నియామక పత్రమూ లేదు, లేదా ఆయన ఏ సెమినరీ నుండీ ఎటువంటి పట్టానూ పుచ్చుకోలేదు, ఆయన నియామకం ఏ మనుష్యుని ద్వారా జరగలేదు. మరైతే ఆయన ఒక పరిచారకుడని మనం ఎందుకు చెప్పగలం? ఎందుకంటే యెషయా పలికిన ఈ దైవప్రేరేపిత మాటలు ఆయన విషయంలో నెరవేరాయి: “ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చియున్నది. . . . సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను.” (లూకా 4:17-19; యెషయా 61:1) ఆ మాటలు, సువార్తను ప్రకటించడానికి యేసు నియమించబడ్డాడన్న విషయంలో ఎటువంటి సందేహానికీ తావివ్వడం లేదు. ఆయన ఎవరిచేత నియమించబడ్డాడు? ఆ పనికి యెహోవా ఆత్మ ఆయన్ను అభిషేకించింది గనుక యేసు, యెహోవా దేవుని చేతనే నియమించబడ్డాడని స్పష్టమవుతుంది. ఇది ఎప్పుడు జరిగింది? నిజానికి యేసు బాప్తిస్మం పొందినప్పుడు ఆయనపైకి యెహోవా ఆత్మ దిగివచ్చింది. (లూకా 3:21, 22) కాబట్టి, ఆయన నియమించబడింది ఆయన బాప్తిస్మం సమయంలోనే.
10. ఒక క్రైస్తవ పరిచారకుడు ఎవరి ద్వారా “సామర్థ్యము” పొందుతాడు?
10 మొదటి శతాబ్దంలోని యేసు శిష్యుల సంగతి ఏమిటి? పరిచారకులుగా వారి హోదా కూడా యెహోవా నుండే వచ్చింది. అందుకే పౌలు ఇలా అన్నాడు: “మా సామర్థ్యము దేవునివలననే కలిగియున్నది. ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు . . . పరిచారకులమవుటకు మాకు సామర్థ్యము కలిగించియున్నాడు.” (2 కొరింథీయులు 3:5, 6) యెహోవా తన ఆరాధకులు పరిచారకులుగా ఉండడానికి వారికి సామర్థ్యాన్ని ఎలా కలిగిస్తాడు? “సువార్త విషయములో దేవుని పరిచారకుడు” అని పౌలు పిలిచిన తిమోతి ఉదాహరణను పరిశీలించండి.—1 థెస్సలొనీకయులు 3:1-4.
11, 12. ఒక పరిచారకుడిగా అయ్యే మార్గంలో తిమోతి ఎలా అభివృద్ధి సాధించాడు?
11 తిమోతి ఎలా ఒక పరిచారకుడిగా అయ్యాడో అర్థం చేసుకోవడానికి, ఆయనకు వ్రాయబడిన ఈ క్రింది మాటలు సహాయపడతాయి: “క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసముద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధలేఖనములను బాల్యమునుండి నీ వెరుగుదువు గనుక, నీవు నేర్చుకొని రూఢియని తెలిసికొన్నవి యెవరివలన నేర్చుకొంటివో ఆ సంగతి తెలిసికొని, వాటియందు నిలుకడగా ఉండుము.” (2 తిమోతి 3:14, 15) తిమోతి విశ్వాసానికి పునాది లేఖనాల జ్ఞానమే, అదే ఆయన బహిరంగ ప్రకటన చేయడానికి ఆయనను కదిలించింది. ఇందుకు కేవలం వ్యక్తిగత పఠనం మాత్రమే సరిపోతుందా? లేదు. తాను చదువుతున్న దాని గురించిన నిజమైన జ్ఞానాన్నీ ఆధ్యాత్మిక అవగాహననూ పొందడానికి తిమోతికి సహాయం అవసరమైంది. అలా తిమోతి తాను నేర్చుకుంటున్న వాటిని ‘నమ్మేలా ఒప్పించబడ్డాడు.’ ఆయనకు లేఖనాలు “బాల్యమునుండి” తెలుసు గనుక ఆయనకు తొలి ఉపదేశకులు బహుశ ఆయన తల్లి, ఆయన అవ్వ అయివుండవచ్చు, ఆయన తండ్రి విశ్వాసి కాదని అర్థమౌతుంది.—2 తిమోతి 1:3-5.
12 అయితే, తిమోతి ఒక పరిచారకుడు కావడంలో ఇంకా చాలా ఇమిడివుంది. ఒకటేమిటంటే, ఆయన విశ్వాసం దగ్గర్లోని సంఘాల్లోని క్రైస్తవుల సహవాసం ద్వారా బలపడింది. ఈ విషయం మనకెలా తెలుసు? ఎలాగంటే, పౌలు తిమోతిని మొదటిసారిగా కలిసినప్పుడు, ఆ యౌవనస్థుడు “లుస్త్రలోను ఈకొనియలోను ఉన్న సహోదరులవలన మంచిపేరు పొందినవాడు”గా ఉన్నాడు. (అపొస్తలుల కార్యములు 16:2) దానికితోడు, ఆ రోజుల్లో సంఘస్థులను బలపర్చడానికి కొందరు సహోదరులు సంఘాలకు ఉత్తరాలు వ్రాసేవారు. అంతేగాక వారికి క్షేమాభివృద్ధి కలుగజేయడానికి పైవిచారణకర్తలు వారిని సందర్శించేవారు. అటువంటి ఏర్పాట్లు తిమోతి లాంటి క్రైస్తవులు ఆధ్యాత్మికంగా పురోగతిని సాధించేందుకు సహాయపడ్డాయి.—అపొస్తలుల కార్యములు 15:22-32; 1 పేతురు 1:1.
13. తిమోతి ఎప్పుడు ఒక పరిచారకుడిగా నియమించబడ్డాడు, ఆయన ఆధ్యాత్మిక అభివృద్ధి అంతటితోనే ఆగిపోలేదని మీరెందుకు చెప్పగలరు?
13మత్తయి 28:19, 20 లో నమోదు చేయబడిన యేసు ఆజ్ఞను దృష్టిలో ఉంచుకుని, ఒకానొక సమయంలో తిమోతి విశ్వాసం, యేసును అనుకరిస్తూ బాప్తిస్మం పొందేందుకు ఆయనను పురికొల్పిందని మనం రూఢిగా చెప్పవచ్చు. (మత్తయి 3:15-17; హెబ్రీయులు 10:5-9) ఆ బాప్తిస్మం తిమోతి తాను దేవునికి చేసుకున్న పూర్ణాత్మతో కూడిన సమర్పణకు ఒక సూచనగా ఉంది. తన బాప్తిస్మం సమయంలో తిమోతి ఒక పరిచారకుడు అయ్యాడు. అప్పటి నుండి ఆయన జీవితం, ఆయన బలం, ఆయనకున్న సమస్తం యెహోవావి అయిపోయాయి. పరిచర్య ఆయన ఆరాధనలో, ఆయన చేసే “పవిత్ర సేవలో” ఒక కేంద్రభాగంగా మారింది. అయితే, తిమోతి తాను పరిచారకుడిగా ఉండే ఘనతతోనే సరిపుచ్చుకోలేదు. ఆయన ఒక పరిణతి చెందిన క్రైస్తవ పరిచారకుడిగా తయారై, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతూనే ఉన్నాడు. అందుకు కారణం, తిమోతి పౌలు వంటి పరిణతి చెందిన క్రైస్తవులతో సన్నిహితంగా సహవసించడం, వ్యక్తిగత పఠనాన్ని చేయడం, అలాగే ప్రకటనా పనిలో అత్యుత్సాహంతో పాల్గొనడమే.—1 తిమోతి 4:14; 2 తిమోతి 2:2; హెబ్రీయులు 6:1.
14. నేడు, “నిత్యజీవమునకు నిర్ణయింపబడిన” వ్యక్తి పరిచారకుడిగా అయ్యే మార్గంలో ఎలా అభివృద్ధి సాధిస్తాడు?
14 నేడు, క్రైస్తవ పరిచారకుని నియామకం కూడా అదే విధంగా జరుగుతుంది. “నిత్యజీవమునకు నిర్ణయింపబడిన” వ్యక్తికి దేవుని గురించీ ఆయన సంకల్పాల గురించీ నేర్చుకోవడానికి ఒక బైబిలు పఠనం ద్వారా సహాయం అందించబడుతుంది. (అపొస్తలుల కార్యములు 13:48) ఆ వ్యక్తి తన జీవితంలో బైబిలు ప్రమాణాలను అన్వయించుకోవడం నేర్చుకుంటాడు, అలాగే దేవునికి అర్థవంతంగా ప్రార్థించడం కూడా నేర్చుకుంటాడు. (కీర్తన 1:1-3; సామెతలు 2:1-9; 1 థెస్సలొనీకయులు 5:16-18) ఆయన ఇతర విశ్వాసులతో సహవసిస్తాడు, “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసు[డు]” చేసిన ఏర్పాట్ల నుండి ప్రయోజనం పొందుతాడు. (మత్తయి 24:45-47; సామెతలు 13:20; హెబ్రీయులు 10:23-25) ఆ విధంగా ఆయన ఒక వ్యవస్థీకృతమైన బోధనా విధానంలో అభివృద్ధిని సాధిస్తాడు.
15. ఒక వ్యక్తి బాప్తిస్మం పొందినప్పుడు ఏమి జరుగుతుంది? (అధఃస్సూచి కూడా చూడండి.)
15 యెహోవా దేవుని పట్ల ప్రేమను, విమోచన క్రయధన బలిపై బలమైన విశ్వాసాన్ని పెంచుకున్న ఆ బైబిలు విద్యార్థి చివరికి తనను తాను సంపూర్ణంగా తన పరలోకపు తండ్రికి సమర్పించుకోవాలని కోరుకుంటాడు. (యోహాను 14:1) ఆయన ఆ సమర్పణను తన వ్యక్తిగత ప్రార్థన ద్వారా చేస్తాడు, తర్వాత తాను ఏకాంతంగా తీసుకున్న ఆ చర్యకు ఒక బహిరంగ సూచనగా బాప్తిస్మం పొందుతాడు. ఆయన బాప్తిస్మమే ఆయన నియామక ఏర్పాటు, ఎందుకంటే అప్పుడే ఆయన దేవునికి పూర్తిగా సమర్పించుకున్న ఒక సేవకుడిగా, ఒక డయాకోనోస్‌గా గుర్తించబడతాడు. ఆయన ఇకపై ఈ లోక సంబంధిగా ఉండకూడదు. (యోహాను 17:16; యాకోబు 4:4) ఆయన “పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా,” ఎటువంటి షరతులు లేదా నియమాలు లేకుండా తనను తాను సంపూర్ణంగా సమర్పించుకున్నాడు. (రోమీయులు 12:1) * ఆయన ఇప్పుడు దేవుని పరిచారకుడు, క్రీస్తును అనుకరిస్తున్నాడు.
క్రైస్తవ పరిచర్య అంటే ఏమిటి?
16. ఒక పరిచారకుడిగా తిమోతికి ఉన్న బాధ్యతల్లో కొన్ని ఏమిటి?
16 తిమోతి పరిచర్యలో ఏమి ఇమిడివుంది? పౌలుతోపాటు ప్రయాణించే సహవాసిగా ఆయనకు కొన్ని ప్రత్యేక విధులు ఉన్నాయి. అంతేగాక ఆయన ఒక పెద్ద అయిన తర్వాత తిమోతి తన తోటి క్రైస్తవులకు బోధించడంలోను వారిని బలపర్చడంలోను చాలా కృషి చేశాడు. కానీ ఆయన పరిచర్యలోని కేంద్రభాగం, అటు యేసు ఇటు పౌలుల విషయంలోలానే, సువార్తను ప్రకటించడం శిష్యుల్ని చేయడమే. (మత్తయి 4:23; 1 కొరింథీయులు 3:5) పౌలు తిమోతికి ఇలా చెప్పాడు: “అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పనిచేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము.” (ఇటాలిక్కులు మావి.)—2 తిమోతి 4:5.
17, 18. (ఎ) క్రైస్తవులు ఏ పరిచర్యలో భాగం వహిస్తారు? (బి) ఒక క్రైస్తవ పరిచారకుడికి ప్రకటనా పని ఎంత ప్రాముఖ్యమైనది?
17 నేటి క్రైస్తవ పరిచారకులు కూడా అంతే. వారు బహిరంగ పరిచర్యలో అంటే సువార్త ప్రకటనా పనిలో పాల్గొంటారు, యేసు బలి ఆధారంగా లభించే రక్షణ వైపుకు ఇతరులను నడిపిస్తారు, యెహోవా నామమున ప్రార్థించేలా సాత్వికులకు బోధిస్తారు. (అపొస్తలుల కార్యములు 2:21; 4:10-12; రోమీయులు 10:13) దేవుని రాజ్యమే పీడిత ప్రజానీకానికి గల ఏకైక నిరీక్షణ అని వారు బైబిలు నుండి రుజువుచేస్తారు, అంతేగాక ప్రస్తుత కాలాల్లోనూ మనం దైవిక సూత్రాలను పాటిస్తే జీవితాల్ని ఎలా ఆనందించవచ్చో చూపిస్తారు. (కీర్తన 15:1-5; మార్కు 13:10) కానీ ఒక క్రైస్తవ పరిచారకుడు, సాంఘిక సమస్యల పరిష్కారానికి క్రైస్తవ సూత్రాల్ని అన్వయించడం గురించిన సువార్తను ప్రకటించడు. బదులుగా ఆయన, “దైవభక్తి యిప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదై” ఉందని బోధిస్తాడు.—1 తిమోతి 4:8.
18 నిజమే పరిచారకుల్లో చాలామందికి సేవచేయడంలో అదనపు విధానాలు ఉంటాయి, అవి ఒక క్రైస్తవునికి మరో క్రైస్తవునికి మారుతుండవచ్చు. చాలామందికి కుటుంబ బాధ్యతలు ఉంటాయి. (ఎఫెసీయులు 5:21–6:4) పెద్దలకు, పరిచర్య సేవకులకు సంఘాల్లో కొన్ని విధులు ఉంటాయి. (1 తిమోతి 3:1, 12, 13; తీతు 1:5; హెబ్రీయులు 13:7) అనేకమంది క్రైస్తవులు రాజ్యమందిరాల నిర్మాణంలో సహాయం చేస్తారు. కొందరికి వాచ్‌టవర్ సొసైటీ యొక్క బేతేలు గృహాల్లో స్వచ్ఛంద సేవకులుగా పనిచేసే అద్భుతమైన ఆధిక్యత ఉంటుంది. అయితే, క్రైస్తవ పరిచారకులందరూ సువార్త ప్రకటనా పనిలో భాగం వహిస్తారు. ఇందుకు ఎటువంటి మినహాయింపులూ లేవు. ఈ పరిచర్యలో భాగం వహించడమే ఒక వ్యక్తికి బహిరంగంగా నిజ క్రైస్తవ పరిచారకుడిగా గుర్తింపునిస్తుంది.
ఒక క్రైస్తవ పరిచారకుడి వైఖరి
19, 20. క్రైస్తవ పరిచారకులు ఎటువంటి వైఖరిని పెంపొందించుకోవాలి?
19 క్రైస్తవమత సామ్రాజ్యంలోని పరిచారకుల్లో, అంటే పాదిరీల్లో అత్యధికులు తమకు ప్రత్యేక గౌరవాన్ని చూపించాలని ఆశిస్తారు. వారు “రెవరెండ్,” (పూజ్యుడు) “ఫాదర్” (తండ్రి) అనే బిరుదులు స్వీకరిస్తారు. అయితే, యెహోవా మాత్రమే భక్తికీ పూజ్యభావానికీ అర్హుడని ఒక నిజ క్రైస్తవ పరిచారకుడికి తెలుసు. (1 తిమోతి 2:9, 10) ఏ క్రైస్తవ పరిచారకుడూ తనకు అంతటి మహా గౌరవాన్ని చూపించాలనీ లేదా ప్రత్యేకమైన బిరుదులు పొందాలనీ కోరుకోడు. (మత్తయి 23:8-12) డయాకోనియా అనే పదానికి ప్రాధమికంగా “సేవ” అని అర్థమని ఆయనకు తెలుసు. ఆ పదంతోపాటు ఉపయోగించబడిన క్రియాపదం, బైబిలులో కొన్నిసార్లు వ్యక్తిగత సేవలకు, అంటే ఉదాహరణకు భోజనపు బల్లవద్ద నిలబడి వడ్డించడం వంటి సేవలకు సంబంధించి ఉపయోగించబడింది. (లూకా 4:39; 17:8; యోహాను 2:5) క్రైస్తవ పరిచర్య సంబంధంగా దాని ఉపయోగం కాస్తంత ఉన్నత భావంతోనే ఉన్నప్పటికీ, డయాకోనోస్ అంటే ఏ సందర్భంలోనైనా ఒక సేవకుడే.
20 కాబట్టి ఏ క్రైస్తవ పరిచారకుడూ తాను ప్రాముఖ్యమైన వాడనని భావించడానికి ఎటువంటి కారణమూ లేదు. నిజమైన క్రైస్తవ పరిచారకులు—సంఘంలో ప్రత్యేక బాధ్యతలు ఉన్న వారితోసహా, అందరూ—నమ్రతగల దాసులే. యేసు ఇలా అన్నాడు: “మీలో ఎవడు గొప్పవాడై యుండగోరునో వాడు మీ పరిచారకుడై యుండవలెను; మీలో ఎవడు ముఖ్యుడై యుండగోరునో వాడు మీ దాసుడై యుండవలెను.” (మత్తయి 20:26, 27) పెంపొందించుకోవాల్సిన సరియైన వైఖరిని గురించి తన శిష్యులకు చూపిస్తూ యేసు వారి పాదాలను కడిగాడు, అత్యంత నిమ్న తరగతికి చెందిన దాసుడి పనిని ఆయన చేశాడు. (యోహాను 13:1-15) ఎంతటి నమ్రతతో కూడిన సేవ అది! అందుకని క్రైస్తవ పరిచారకులు నమ్రతతో యెహోవా దేవుణ్ణి, యేసుక్రీస్తును సేవిస్తారు. (2 కొరింథీయులు 6:4; 11:23) వారు ఇతరులకు సేవచేస్తూ దీనమనస్సును ప్రదర్శిస్తారు. వారు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు నిస్వార్థబుద్ధితో అవిశ్వాసులైన పొరుగువారికి సేవచేస్తారు.—రోమీయులు 1:14, 15; ఎఫెసీయులు 3:1-7.
పరిచర్యలో సహనాన్ని కనపర్చండి
21. పరిచర్యలో సహనాన్ని కనపర్చినందుకు పౌలుకు ఎలాంటి ప్రతిఫలం లభించింది?
21 ఒక పరిచారకుడిగా ఉండడానికి పౌలుకు సహనం అవసరమైంది. తాను వారికి సువార్తను ప్రకటించడానికి ఎన్నో శ్రమల్ని అనుభవించినట్లు కొలొస్సయులకు ఆయన చెప్పాడు. (కొలొస్సయులు 1:24-26) అయితే ఆయన సహనాన్ని కనపర్చినందు వల్లనే అనేకమంది సువార్తను స్వీకరించి పరిచారకులయ్యారు. వారు దేవుని కుమారులుగా తిరిగి జన్మించారు, భవిష్యత్తులో యేసుక్రీస్తుతోపాటు పరలోకంలో ఆత్మ ప్రాణులయ్యే నిరీక్షణతో ఆయన సహోదరులుగా అయ్యారు. పౌలు సహనాన్ని కనపర్చినందుకు ఆయనకు ఎంత గొప్ప ప్రతిఫలం లభించిందో కదా!
22, 23. (ఎ) నేడు క్రైస్తవ పరిచారకులు సహనం కనబర్చాల్సిన అవసరం ఎందుకు ఉంది? (బి) క్రైస్తవ సహనం నుండి ఏ అద్భుతమైన ఫలాలు వస్తాయి?
22 దేవుని పరిచారకులుగా ఉన్నవారికి నేడు సహనం నిజంగా ఆవశ్యకం. వారిలో అనేకమంది అనారోగ్యంతోను వృద్ధాప్యంలో కలిగే వేదనలతోను అనుదినము పోరాడుతుంటారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని పెంచడానికి ఎంతో కష్టపడి పనిచేస్తారు—అనేక కుటుంబాల్లో తల్లి లేదా తండ్రి మాత్రమే ఉండవచ్చు. పిల్లలైతే ఎంతో ధైర్యంగా స్కూల్లో తమ చుట్టూ ఉన్న చెడు ప్రభావాలకు విరుద్ధంగా పోరాడుతుంటారు. అనేకమంది క్రైస్తవులు ఆర్థిక సమస్యల మూలంగా ఎంతో పోరాటం సల్పవలసి ఉంటుంది. ఇంకా అనేకమంది నేటి “అపాయకరమైన కాలము”ల మూలంగా ఎన్నో హింసల్నీ లేదా కష్టాల్నీ అనుభవిస్తారు! (2 తిమోతి 3:1) అవును, నేడు దాదాపు అరవై లక్షలమంది యెహోవా పరిచారకులు ముక్తకంఠంతో అపొస్తలుడైన పౌలులానే ఇలా చెప్పగల్గుతున్నారు: ‘దేవుని పరిచారకులమైయుండి మిగుల ఓర్పుగలవారమై మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము [“సిఫారసు చేసికొనుచున్నాము,” NW].’ (2 కొరింథీయులు 6:4) క్రైస్తవ పరిచారకులు చేతులెత్తేయరు. వారు సహనాన్ని కనబరుస్తున్నందుకు వారిని మెచ్చుకోవల్సిందే.
23 అంతేగాక పౌలు విషయంలోలానే సహనం కనబర్చడం అద్భుతమైన ఫలాల్ని తీసుకువస్తుంది. మనం సహనం కనబర్చడం ద్వారా యెహోవాతో మనకు గల దగ్గరి సంబంధాన్ని కాపాడుకుంటాము, ఆయన హృదయాన్ని సంతోషపరుస్తాము. (సామెతలు 27:11) మనం మన స్వంత విశ్వాసాన్ని బలపర్చుకుంటాము, అలాగే శిష్యుల్ని చేయడం ద్వారా మన క్రైస్తవ సహోదరత్వానికి క్రొత్తవారిని చేరుస్తాము. (1 తిమోతి 4:16) ఈ అంత్యదినాల్లో యెహోవా తన పరిచారకులను ఎంతగానో సంరక్షించాడు, వారి పరిచర్యను ఎంతో ఆశీర్వదించాడు. దాని ఫలితంగా 1,44,000 మందిలోని చివరివారు సమకూర్చబడ్డారు, అలాగే ఇతర లక్షలాదిమంది ప్రజలు ఒక పరదైసు భూమిపై నిత్యజీవాన్ని అనుభవించే దృఢమైన నిరీక్షణను కలిగివున్నారు. (లూకా 23:43; ప్రకటన 14:1) నిజంగా, క్రైస్తవ పరిచర్య అనేది యెహోవా కరుణకు నిదర్శనమే. (2 కొరింథీయులు 4:1) మనందరము దాన్ని అమూల్యంగా ఎంచుదము గాక, దాని ఫలం నిరంతరం నిలిచివుంటుందని కృతజ్ఞులమై ఉందము గాక!—1 యోహాను 2:17.
[అధస్సూచీలు]
^ పేరా 3 చర్చిలో ఒక అధికారియైన “డీకన్” అనే పదానికి, డయాకోనోస్ అనే ఒక గ్రీకు పదం మూలం. స్త్రీలు కూడా డీకన్‌లు అయ్యే అవకాశం ఉన్న చర్చీల్లో వారిని డీకనెస్‌లని పిలుస్తారు.
^ పేరా 15 రోమీయులు 12:1 నిర్దిష్టంగా అభిషిక్త క్రైస్తవులకే వర్తిస్తుంది. అయితే, అందులోని సూత్రాలు “వేరే గొఱ్ఱెల”కు కూడా వర్తిస్తాయి. (యోహాను 10:16) వీరు ‘యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలెనని ఆయన పక్షమునచేరతారు.’—యెషయా 56:6.
మీరు వివరించగలరా?
• మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఏ బాధ్యతను నిర్వర్తించడంలో భాగం వహించారు?
• ఒక క్రైస్తవ పరిచారకుడు ఎప్పుడు, ఎవరిచేత నియమించబడతాడు?
• ఒక క్రైస్తవ పరిచారకుడు ఎటువంటి వైఖరిని పెంపొందించుకోవాలి?
• ఒక క్రైస్తవ పరిచారకుడు కష్టాలు ఉన్నప్పటికీ ఎందుకు సహనాన్ని కనబరచాలి?
[అధ్యయన ప్రశ్నలు]
[16, 17వ పేజీలోని చిత్రాలు]
తిమోతికి బాల్యము నుండే దేవుని వాక్యం బోధించబడింది. ఆయన బాప్తిస్మం పొందినప్పుడు నియుక్త పరిచారకుడు అయ్యాడు
[18వ పేజీలోని చిత్రం]
బాప్తిస్మం దేవునికి చేసుకున్న సమర్పణకు సూచనగా ఉంది, అది ఒక వ్యక్తి ఒక పరిచారకుడిగా నియామకం పొందడానికి గుర్తు
[20వ పేజీలోని చిత్రం]
క్రైస్తవ పరిచారకులు సేవ చేయడానికి ఇష్టతతో ఉన్నారు